‘అమ్మా… అసలామె కన్నతల్లేనా? తల్లి ఎన్ని తిప్పలైనా పడ్తది. కడుపున కాసిన కాయకు పానంబెట్టి సుత్తది. అసొంటిది గా తల్లి నాలుగేండ్ల కొడుకును చంపి మూట కట్టిందట. తల్లే గిట్ల జేత్తే ఇగ ఎవరికి నమ్మాలె’ అంటూ బాధపడి పోయింది యాదమ్మ.
నాలుగేళ్ళ పసివాడిని చంపి సూట్ కేసులో పెట్టిన తల్లిని ఛానళ్ళన్నీ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ… గోవా మర్డర్ కేసు కళ్ళముందు కదలాడిరది. తల్లి బిడ్డను నిజంగా ప్రేమిస్తుందా? లేక అసహ్యించు కుంటుందా? నాలో తలెత్తుతున్న ప్రశ్నలకు అంతరాయం కలిగిస్తూ ‘అమ్మ నాయినలకు పిల్లలు అక్కెర లేదేమో కానీ పిల్లలకు అమ్మనాయిన కావాలె గదమ్మా… అన్నం తినిపించిన చేతులతోని ఎట్ల చంప గలిగిందో… ఆ తల్లికి చేతులెట్లొచ్చి నయో…’ చీపురుతో వాకిట్లోకి వెళ్తూ అంది యాదమ్మ.
ఏ తల్లీ బిడ్డను చంపుకోవాలి అను కోదేమో! ఏదో ఆమెను బాధించే బలమైన సంఘటన జరిగి ఉండొచ్చు. ఆమెను బ్లేమ్ చేస్తున్నాం కానీ ఆమెకు అవసరమైన సమయంలో మోరల్ సపోర్ట్ అందలే దేమో. అందుకే అసహాయంగా బిడ్డను చంపుకుందేమో. ఏదేమైనా పోయిన బిడ్డ ప్రాణం తెచ్చి ఇవ్వలేం.
ఆమె మానసిక ఆరోగ్యానికి ఆమె భర్త కూడా కారణం కావచ్చు. తల్లిని క్రూరు రాలిగా చూస్తున్నాం కానీ తండ్రి అమాయ కుడు అని చెప్పలేం. కోర్టులు`చట్టాలు తల్లిని మాత్రమే బాధ్యురాలిని చేయకుండా భర్తను కూడా అదుపులోకి తీసుకుని, ఆమె చదువు, సంపాదన, ఉద్యోగం కంటే ముందు ఆమె మానసిక ఆరోగ్యం, ప్రవర్తన గత చరిత్ర తెలుసుకోవాలి.
నిజానికి పెళ్ళంటే జోక్ కాదు. పెళ్ళి తర్వాత జీవితం చాలా కఠినమైనది, కష్టమైనది. ఎంతో ఓపిక, ఓరిమి
ఉండాలి. సర్దుబాటు ఉండాలి. త్యాగం, బాధ్యత ఉండాలి. జీవితమంతా అకస్మా త్తుగా వచ్చిపడే పరిస్థితులను ఎదుర్కో వడానికి సిద్ధపడి ఉండాలి. ఒకరిపట్ల ఒకరికి బోలెడంత అవగాహన ఉండాలి. పెళ్ళైన జంటకు అనివార్య పరిస్థితులు ఎన్నో ఎదురవ్వచ్చు. అందుకే పెళ్ళి చేసుకోబోయే ముందు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించుకోవాలి. పెళ్ళి చేసుకు న్నాక తమ జీవితాన్ని, పిల్లల జీవితాన్ని నాశనం చేసుకోవద్దనే ఇంగితం లేకుండా పోతున్నది.
ఈ రోజుల్లో పెళ్ళి ఒక తప్పుడు వ్యవస్థగా మారిపోయింది. అందువల్ల పిల్లలపై పడే ప్రభావం, జరుగుతున్న అనర్థం తక్కువేం కాదు. నేటి యువత బాగా చదువుకుంటున్నారు. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. కానీ, జీవితం పట్ల అవగాహన శూన్యం. చదువు, సంస్కారం ఉన్న నాగరికులు ఇలా చేయడం క్షమించరాని నేరం. మన ముత్తాతలు చదువుకోకపోవచ్చు. కానీ, ప్రజలంటే ఒక మంచి అవగాహన వ్యక్తిత్వం ఉంది. నేటి ప్రపంచానికి కావలసింది కొత్త కొత్త సాంకేతిక విధానాలే కాదు మంచితనం, మానవత్వం.
అసలు మన చదువుల్లో నైతిక విలువలకు చోటు ఉందా? లేదు. అన్ని పాఠశాలల్లో ఎంపతీ సెషన్స్ అవసరం. కనీస మానవ విలువలను మన విద్యలో భాగం చేయాల్సిన అవసరం ఉంది. మార్కులు`కెరీర్`ఫేమ్ కంటే ముందు మానసిక, శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. మెంటల్ క్రైసిస్ రాకముందే మేల్కొనాలి. అది క్యాన్సర్ కంటే ప్రమాద కరమని సమాజం అర్థం చేసుకోవాలి.
తండ్రి కన్నపిల్లలను మట్టుబెట్టిన సంఘటనలు ఎక్కువే వింటున్నప్పటికీ తల్లి కన్నబిడ్డలను అంతం చేసే సంఘటనలు తక్కువ. కానీ ఈ మధ్య కాలంలో అవి పెరుగుతున్నాయి. కారణాలు ఏమైనప్ప టికీ, వీటన్నిటికీ మూల కారణం ఏంటి? కన్న పిల్లలను సొంత ఆస్తిగా భావించ డమేనా? వారి ప్రాథమిక హక్కులను కాలరాచే హక్కు తల్లిదండ్రులకు ఉందా? ప్రపంచంలో హింస ఒక జబ్బులా వ్యాపిస్తున్నది… ఎందుకు? వేరే వాళ్ళ జీవితం అంటే లెక్కలేనితనమా? శిక్ష పడుతుందనే భయం లేకపోవడం వల్లనా? కన్నబిడ్డల కంటే పరువు, ప్రతిష్ట ముఖ్యం అనుకోవడమా? మత్తు పదార్ధాలు కారణమా? మన ఆలోచనా విధానాన్ని మార్చి గట్టి మార్పు తెచ్చే శక్తి నిజజీవిత అనుభవాలకు ఉందా?
మనుషులు అంత హింసాత్మకంగా ఎలా తయారవుతున్నారు? మనుషుల స్వభావాలు, ప్రవర్తనకు కారణం అహంకారం, స్వార్థం. ఆ స్థానంలో ప్రేమ, గౌరవం ఇతరులపై శ్రద్ధ ఉంటే ఇలా జరుగుతుందా? ఏమో!
ఎమోషన్లెస్ రోబోట్ లాగా మారి పోతున్న మనిషి ఈ గ్రహంపై అత్యంత విచిత్రమైన జంతువేమో!