చిన్న పట్టణం పెద్ద సంబరం – నాదేళ్ళ అనురాధ

సంవత్సరం పొడవునా మనం బోలెడు పండుగలు జరుపుకుంటూనే ఉంటాం. పండుగ ఏదైనా సందడంతా పిల్లలదే కదా. నవంబర్‌ నెలలో ఒక జాతీయ నాయకుడి పుట్టినరోజుని అచ్చంగా పిల్లల పండుగగా చేసుకునే అలవాటు మనకుంది. దానికి కారణం ఆ నాయకుడికి పిల్లల పట్ల ఉన్న ప్రేమ. అయితే ఇటీవల పిల్లల పండుగ అంటూ వివిధ తేదీల్లో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సంబరాలు జరుపుకుంటున్నాం.

అలాంటి పండుగ ఒకటి డిసెంబర్‌ 17వ తేదీన జహీరాబాద్‌లో జరిగింది. అదెక్కడంటారా? చెపుతాను, ముందు నా గొడవ వినండి! ఈ నేల, ఈ ఆకాశం, ఈ గాలి, ఈ ప్రవహించే నది, ఆ గోరువెచ్చని సూర్యుడు, ఆ వెన్నెల కురిపించే చంద్రుడు, ఆ చెట్టు, ఈ పిట్ట, ఈ పువ్వులు, ఆ నవ్వులు, ఈ కేరింతలు, ఇన్నిన్ని ఆనందాలు… ఎవరివి? ఎవరి కోసం? మన కోసమే, మనందరివీనూ అంటారా? నిజమే. అవన్నీ అచ్చంగా మనవే. అవునూ, అవన్నీ కలగలిసి ఒక్కచోట పోగుపడి ఒక అందమైన రూపం తొడుక్కుని మన ఎదురుగా, మనతోనే, మన మధ్యనే ఉందంటే అదేమిటంటారు?? ఒక్కసారి ఆలోచించండి.
అనగనగా బోలెడు మంది బుజ్జిబుజ్జి పిల్లలు! అంటే, అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా. ప్రపంచానికి ఇంత అందం, ఆకర్షణ, ప్రకృతికి ఇన్నిన్ని వన్నెచిన్నెలు, నిరంతర చైతన్యం వాళ్ళే కదూ ఇచ్చేది! వాళ్ళని ప్రేమించకుండా ఉండగలగటం సాధ్యమే?! సాధ్యం కాదని మనకి తెలుసు. వాళ్ళని ప్రేమిస్తాం. ప్రేమించాం కనుక, పెద్దలం కనుక, వాళ్ళకంటే శారీరకంగా బలవంతులం కనుక పెత్తనం తీసుకుని వాళ్ళని ఏదో అద్భుతమైన వ్యక్తులుగా ప్రపంచానికి అందించేద్దామని బోలెడు పథకాలు వేసేస్తుంటాం. ఎన్నెన్నో ఆలోచనలు చేసేసి వాళ్ళని పంజరాల్లో చిలకల్ని చేసి, వాళ్ళకి నడకలు నేర్పుతున్నామని, గొప్పవాళ్ళని చేస్తున్నామని గర్వపడిపోతాం. కానీ, మనం ఎవరం అవన్నీ చేసేసేందుకు అని ఒక్కసారీ ప్రశ్నించుకోం. అది అజ్ఞానం వల్లనో, అహంకారం వల్లనో?!
పిల్లలు చెప్పే తియ్యని కబుర్లు, వాళ్ళ కమ్మని కలలు, ఆశలు, ఇష్టాలు, అయిష్టాలు వినే తీరిక మనకుండదు. వాళ్ళని గొంతులు విప్పనివ్వం. తూనీగ వెంట పరుగులెత్తనివ్వం. పెరట్లోనో, బాల్కనీ కుండీలోనో చిగురించే చిన్ని మొక్కని చూడనివ్వం. చెట్టు మీద పాట పాడే పిట్టని చూడనివ్వం. ‘‘కుహుకుహు’’ అంటూ కోయిలతో కలిసి కూనిరాగాలు తియ్యనివ్వం. సమయం లేదు. ఎంతసేపూ వాళ్ళకి ఏమి కావాలో మనం నిర్ణయించి, నియంత్రిస్తాం. నియంతలైన మన మధ్య వాళ్ళ చిన్నబోయిన ముఖాల్ని పట్టించుకోం. స్వేచ్ఛగా అందమైన లోకంలోకి వచ్చిన వాళ్ళ హాయిని హరించేసి క్రమశిక్షణ భలేగా నేర్పేస్తాం.
అదిగో నడక నేర్పాం, బడిలో వేశాం, పరుగందుకో అంటూ వెంటపడతాం. మనం నెరవేర్చుకోలేక పోయిన కలల్ని నెరవేర్చమని ఆంక్షలు విధిస్తాం. వాళ్ళకి బడి వాకిట్లోంచే చదువంటే విసుగు, క్రమశిక్షణంటే కోపం మొదలవుతాయి. బడి అంటే ప్రశ్నించకుండానే నేర్చుకోవటం, అవగాహన లేకుండానే పరీక్షలు పాసవటం, ఇంకా పెద్ద పరీక్షలు పాసవటం… ఇంతే!!
అబ్బా, ఎంత నిస్సారమైన జీవితాల్ని రాస్తున్నాం పిల్లల కోసం?! పెద్దలమైనంత మాత్రాన మనకెవరిచ్చారు ఈ హక్కు? ఇదేం హక్కు? హక్కంటే తీసుకోవటమేనా? మరి పిల్లలకి ఏమిస్తున్నాం? హాయిగా ఆడి, పాడి, నవ్వే సమయాన్ని ఇవ్వని మనం వాళ్ళని నిజంగానే ప్రేమిస్తున్నామా? ఔనంటే అంతకు మించిన హిపోక్రసీ లేదు. పెద్దల్ని గట్టిగా కోప్పడేస్తున్నాననుకుంటున్నారా? ఇప్పటి పిల్లల్ని, వాళ్ళ కళ్ళల్లోని దిగుల్ని, ప్రశ్నల్ని మనం చాలామందిమి నిర్లిప్తంగా చూస్తూనే ఉన్నాం. కొందరు మాత్రం అలా చూసి ఊరుకోకుండా ఏదైనా చేసి వాళ్ళ ముఖాల్లో సంతోషాల్ని, వెలుగుల్ని తెచ్చేందుకు ఏవేవో చేస్తున్నారు. ఈ కొత్త పండుగ… అదే. పిల్లల పండుగ కోసం ఎక్కకెక్కడి పిల్లల్నీ రారమ్మంటూ పిలిచి, వాళ్ళకిష్టమైన ఆటల్ని, పాటల్ని, కథల్ని, బొమ్మల్ని… దేన్నైనా వాళ్ళ ఊహల్లోంచి తయారు చెయ్యమని ఒక వేదిక అందించి, వాళ్ళల్లో ఉన్న సహజమైన ప్రతిభని వెలికి తీస్తున్నారు. ఇదేదో బావుంది కదూ. అప్పుడెప్పుడో నేను, నాలాంటివాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు మాకే దిగుళ్ళు, బెంగలు లేవు. బడికి హాయిగా ఆడుతూ, పాడుతూ వెళ్ళాం. ఆనక ఇంటికొచ్చి ఆటలాడుకున్నాం. చదువులూ చదువుకున్నాం. అప్పుడిలాంటి పండుగ లేదు, అవసరపడనే లేదు.
ఇంతకీ జహీరాబాద్‌ పిల్లల పండుగ చూద్దామని వెళ్ళానా, అక్కడ ఒక రహస్యం అర్థమైంది…
ఇక్కడ వేలల్లో కనిపించిన పిల్లలను మించి వాళ్ళ పెద్దల్ని చూశాను. పిల్లల్ని అడ్డం పెట్టుకుని టీచర్లమంటూనే, తల్లిదండ్రులమంటూనే వాళ్ళూ ఈ సంబరాల్లో చేరిపోయారు. వాళ్ళ ముఖాల్లోనూ పిల్లల ముఖాల్లో కనిపించిన ఆనందమే కనిపించటం చూశాను. తమ దైనందిన జీవితాల్లోంచి పెద్దలు ఒక ఆటవిడుపును కనిపెట్టారు. ఒత్తిడి ఎరుగని అందమైన ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తమ పిల్లల్లోని స్వయం ప్రతిభ తాము ఇన్నాళ్ళూ కనిపెట్టలేకపోయారన్న విస్మయంతో చూశారు. వాళ్ళని ప్రయోజకుల్ని చేసే బాధ్యత తమదన్న గర్వం, పెద్దరికం సిగ్గుపడిరది. ఇంతకీ ఇది ఎవరి పండుగ? పిల్లలదా, పెద్దలదా? ఎవరు ఎవరికి గురువులవుతున్నారు? పెద్దలా, పిల్లలా? పిల్లలు ప్రకృతి లాగే ఇవ్వటం తెలిసినవాళ్ళు! పెద్దలం ఎప్పటికి ఈ సూత్రాన్ని నేర్చుకుంటాం?
జహీరాబాద్‌ తెలంగాణలో ఒక చిన్న పట్టణం. వార్తల్లో ఎక్కువగా కనిపించదు. దాదాపు అరవై వేల మంది ప్రజలుంటారు కాబోలు. నిశ్శబ్దంగా, తన మానాన తను బతికేస్తున్న ఆ చిన్న పట్టణం కొత్త చైతన్యంతో వెలిగిపోయింది. కొత్త రంగుల్ని అద్దుకుంది. ఆకాశంలోనే కాక నేల మీద కూడా ఇంద్రధనుసుల్ని మెరిపించింది. ఇక్కడ జరిగిన పిల్లల పండుగకి రాష్ట్రంలోను, పక్క రాష్ట్రంలోనూ ఉన్న అనేక మంది పిల్లలు వచ్చి రకరకాల ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. రంగురంగుల పువ్వులతో, పక్షులతో కళకళలాడుతున్న తోట కంటికింపుగా ఆవిష్కరించబడిరది. సంగీతం, జానపద గీతాలు, కథ చెప్పటం, కథ రాయటం, బొమ్మలు వేయటం, కాగితంతో బొమ్మలు చేయడం, మట్టితో బొమ్మలు చేయటం, ఏకపాత్రాభినయం, జానపద నృత్యం, శాస్త్రీయ నృత్యం, స్పెల్‌ బి, ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీ, ఇలా రకరకాల అంశాల్లో పిల్లల్ని జూనియర్లు, సబ్‌ జూనియర్లు, సీనియర్లుగా విభజించి పోటీలు నిర్వహించారు. ఆయా అంశాల్లో నిష్ణాతులైన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వీటిని నిర్వహించారు. పిల్లలు వ్యర్థ పదార్ధాలతో అందమైన బొమ్మల్ని తయారు చేశారు. ఇవన్నీ ఈ పిల్లలకి ఎవరు నేర్పిస్తున్నారు?
అనవసరమైన, అనారోగ్యకరమైన విషయాలవైపు మళ్ళకుండా పిల్లలకి ప్రయోజనకరమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పుతున్నదెవరు? అభివృద్ధి చెందినవని చెప్పుకునే కొన్ని జిల్లాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ పిల్లలకున్న అవకాశాలు వేరు. అవి అందని ఈ ప్రాంతపు పిల్లల కోసం ఎవరు తాపత్రయపడుతున్నారు? ఒక ప్రాంతం భౌగోళికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు. సామాజిక అసమతౌల్యం ఉండి ఉండొచ్చు. కానీ పిల్లల్లో ప్రతిభ ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదు కదా.
దీనికంతకూ నేపథ్యంగా జహీరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలకి గత కొన్ని సంవత్సరాలుగా వేసవి శిబిరాల్ని నిర్వహిస్తూ అనేక రకాలైన అంశాల్లో శిక్షణ అందిస్తున్నవారు డాక్టర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ శివబాబు గార్లు. జహీరాబాద్‌ పిల్లల పండుగ వెనుక ఉన్నది పిల్లల పట్ల వారికున్న చిక్కని ప్రేమ. వారి అభిరుచుల్ని పంచుకోగలిగే మిత్రులను పోగుచేసుకుంటూ చుట్టూ ఉన్న సమాజానికి ఒక కొత్త చైతన్యాన్ని, రాబోయే తరానికి ఒక స్ఫూర్తిని అందించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక్కడ ఒక ఉదాహరణ చెపుతాను.
జహీరాబాద్‌ పిల్లల పండుగకి వెళ్ళి అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికుల కాలనీలో పిల్లల్ని పలకరించాం నాతోపాటుగా మరికొందరం. వారికోసం సాయంకాలం ఉచితంగా నడపబడుతున్న ట్యూషన్‌ సెంటర్‌ని చూశాం. అక్కడ నవీన్లు, వరుణ్‌లు, తేజలు, జ్యోతిలు, షర్మిలలు… అందరూ ప్రపంచంలోని పిల్లల్నే ప్రతిబింబిస్తున్నారు. బోలెడు కలలు కంటున్నారు. బోలెడు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. బోలెడు నాయకత్వ లక్షణాల్ని కలిగి ఉన్నారు. ఈ పిల్లలంతా ఆనందంగా ఎదురొచ్చి ‘‘మా విజ్జమ్మ మాకన్నీ నేర్పిస్తుంది’’ అని చెప్పారు. ఈ విజ్జమ్మే డా.విజయలక్ష్మి! ఆ పిల్లలు ఏడాది క్రితం వరకూ బడి ముఖం ఎరుగరంటే నమ్మలేం. వారంతా వలస కార్మికుల పిల్లలు. వారిలో పదేళ్ళ వయసు పైబడిన వాళ్ళూ ఉన్నారు. కానీ ఈ ఏడాదిగా బడిలో వాళ్ళు చూసినది, నేర్చుకున్నది తక్కువది కాదు. వాళ్ళ చురుకుదనం, తెలివితేటలు, చైతన్యం చూస్తే వారి భవిష్యత్తు పట్ల మాత్రమే కాదు, ఆ ప్రాంతం, దేశం భవిష్యత్తు పట్ల కూడా బోలెడంత న మ్మకం కుదిరింది. అమాయకంగా కనిపిస్తున్న ఆ పసివాళ్ళ శక్తియుక్తులు, కుతూహలం రేపు ఏ ప్రయోగాల వైపు, ఏ విజయాల వైపు నడిపిస్తాయో!
ఈ పిల్లల బడి చదువులకు కారకురాలైన విజయలక్ష్మి, శివబాబుగార్ల వెనుక వీరి పెద్దలు, కుటుంబ సభ్యులు బలంగా ఉన్నారు. ఆ పెద్దలు జీవితం పొడవునా నడుస్తూ వస్తున్న దారుల్లోని దార్శనికత ఈ డాక్టర్లకి మార్గదర్శకమైంది. ఆ దారులన్నీ పిల్లల ఆదర్శవంతమైన భవిష్యత్తులోకే. వీళ్ళ ప్రయత్నం చూసి, మేమూ వస్తున్నామంటూ ఎందరో పిల్లల ప్రేమికులు వచ్చేశారు. తరచుగా వినిపించే కొన్ని పేర్లను మాత్రం చెపుతాను. ఎందుకంటే అందరినీ పేరుపేరునా చెప్పాలంటే వ్యాసం సుదీర్ఘమవుతుంది. అయినా వాళ్ళు తమ పేర్లనీ, తమ అస్తిత్వాన్నీ ఆ పిల్లల ప్రపంచంలో ఎప్పుడో మరిచేపోయారు.
అన్నవరపు కుటుంబ సభ్యులు, కాళిదాసు గారు, సి.ఎ.ప్రసాద్‌ గారు, చిత్రకారుడు అన్వర్‌, మంచి పుస్తకం సురేష్‌ భాగ్యలక్ష్మి గార్లు, చిత్రకారుడు అడవిరాముడు, రకరకాల బొమ్మల్ని, విద్యల్ని నేర్పే ఫయాజ్‌, ఇంకా ఎందరో టీచర్లు, ప్రొఫెసర్లు, రచయితలు, డాక్టర్లు… ఒకరేమిటి అన్ని రంగాల్లోని ప్రముఖులు వచ్చేశారు. వాళ్ళ వాళ్ళ స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని కూడా వెంటబెట్టుకొని మరీ వచ్చేశారు. పిల్లలకోసం తమ పనులన్నీ పక్కనపెట్టి మరీ వచ్చారు. ఈ పండుగ విశేషం ఇంతకంటే ప్రత్యేకంగా ఏమి చెప్పాలి?
జహీరాబాద్‌ ఆనందంతో పులకించింది. పిల్లల కోసం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినందుకు ఆ చిన్ని పట్టణం కొంచెం… కొంచెంగానైనా గర్వపడిరది! చరిత్రలో తన పేరుని పది కాలాల పాటు నిలబెట్టుకోబోతున్నందుకు నిటారుగా నిలబడి, గట్టిగా ఊపిరి తీసుకుంటోంది. రాబోయే కాలంలో ఇక్కడి పిల్లలు ఎన్నెన్ని అద్భుతాలు చేస్తారో, ఏయే ఆవిష్కరణలు చేస్తారో చూడాలని ఉంది. దానికి తగిన భూమిక, ఒక వాతావరణం ఇప్పటికే అక్కడ తయారైంది. ఊరు ఊరంతా పండుగ సంబరంలో మునిగిపోయింది. కావాలంటే ఈ ఫోటోలు చూడండి. పిల్లలకి, వారి వెనుక మేమున్నామంటున్న డాక్టర్లకి జేజేలు!
ఇప్పుడు చెప్పండి ఇది ఎవరి పండుగ? ఇంత ఆనందాన్ని ప్రపంచానికి, పెద్దలకి పంచిచ్చిన ఈ పిల్లల్ని ఏమందాం? వచ్చే ఏడు మీరూ వచ్చి చూడండి. నేను చెప్పిన దాంట్లో అతిశయమేదైనా ఉంటే అడగండి మరి.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.