మా అమ్మ కాశీ అన్నపూర్ణ, పరకాల కాళికాంబ గార్లు మంచి స్నేహితులు. మా అమ్మకి నాకంటే ఎక్కువమంది స్నేహితులుండేవారు. 1960 ప్రాంతాల్లో మా నాన్న కొబ్బరికాయల వ్యాపారం చేసేవాడు. అందుకోసం నర్సాపురంలో మకాం పెట్టాడు.
60 సంవత్సరాల క్రితం నాటి ఈ ముచ్చటను ఇప్పుడెందుకు గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే పరకాల కాళికాంబ అత్తయ్య పుస్తకానికి ముందు మాట రాయడానికి. నేనే ఎందుకు రాయాలి? నా బాల్యంలో తనతో ముడిపడి ఉన్న కొన్ని జ్ఞాపకాలను పంచుకుందామని. కాళికాంబ గారి ఇద్దరు కొడుకులు పరకాల ప్రభాకర్, పరకాల సుధాకర్‌లు నా చిన్ననాటి నేస్తగాళ్ళు. ముఖ్యంగా ప్రభాకర్ నాకు ఇప్పటికీ చాలా ఆత్మీయుడు. తన కోరిక మీదే ఈ పుస్తకం బాధ్యతను నేను తీసుకున్నాను.
అరవై సంవత్సరాల నాటి సంగతులైనా ఆ బంధం ఎప్పుడూ తెగింది లేదు. అడపాదడపా కలవడం, కబుర్లాడుకోవడం జరుగుతూనే ఉంది. నా జ్ఞాపకాలన్నీ నర్సాపురానికి, మా సీతారామపురానికి చెందినవైనా కొన్ని హైదరాబాద్‌కు కూడా కలిసి ఉన్నాయి. రెండిరటినీ కలపాలనే ఈ ప్రయత్నం. ఈ అంశంలో ఎంతవరకు సఫలీకృతమౌతానో తెలియదు.
చాలా సంవత్సరాల క్రితం ఈనాడు/ఈటీవీ స్టూడియోలో ప్రభాకర్‌ని ప్రతిధ్వని కార్యక్రమంలో చూశాను. అప్పట్లో ప్రతిధ్వని కార్యక్రమానికి ప్రభాకర్ యాంకర్‌గా ఉండేవాడు. ప్రభాకర్, నేను కలిశాం. కాళికాంబ అత్తయ్య గారు హైదరాబాద్‌లో తన దగ్గరే
ఉంటున్నారని తెలిసి మంచి రేవులలో ఉన్న ప్రభాకర్ వాళ్ళింటికి వెళ్ళాను. చాలా సంవత్సరాల తర్వాత కాళికాంబ అత్తయ్యని చూశాను.
‘అమ్మాజీ’ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచారు. మా అమ్మ తన తల్లి పేరు నాకు పెట్టుకుంది. అందుకే నన్ను ‘అమ్మాజీ’ అని పిలుచుకునేది. మా అమ్మమ్మ పేరు సత్యవతి. ఆమెను నేను చూడలేదు. నేను పుట్టిన పధ్నాలుగు రోజులకు ముక్కోటి ఏకాదశి రోజు చనిపోయిందట. అమ్మమ్మ పేరు నాకు స్థిరపడిరది. మా బంధువులందరూ అమ్మాజీ అనే పిలుస్తారు. నాలుగు జనరేషన్స్ పిల్లలకి నేను అమ్మాజక్కను. నిజం! చిన్నా పెద్ద వరసలు కలపకుండా అమ్మాజక్కా అని పిలిచేది నన్నొక్కదాన్నే.
అలా మా కాళికాంబ అత్తయ్యకి, ప్రభాకర్‌కి నేను అమ్మాజీనే. ప్రభాకర్‌ని నేను ‘‘ఒరే! బావా!’’ అని పిలిచేదాన్ని చిన్నప్పుడు. నాకంటే పదేళ్ళు చిన్నవాడు. అయినా అలాగే పిలిచేదాన్ని. సరే! చాలా సంవత్సరాల తర్వాత మేము కలిశాం కదా! అత్తయ్య, నేను బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. 2005లో అమ్మ చనిపోయింది. ఆ విషయం తెలిసి చాలా బాధపడిరది. ‘‘అన్నపూర్ణ వదిన గారు చనిపోయారని నాకు తెలియదు అమ్మాజీ. మేమిద్దరం ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం. ఎక్సైజ్ వదినగారు, నేను, మీ అమ్మగారు ఎంతో కలివిడిగా
ఉండేవాళ్ళం’’. ఎక్సైజ్ వదిన గారి గురించి అదే ఎక్సైజ్ అత్తయ్య గారి గురించి తర్వాత రాస్తాను.
అలా కాళికాంబ అత్తయ్యతో కలయికలు, కబుర్లు మొదలయ్యాయి. ప్రస్తుతం తను 90 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. కరోనా కల్లోల సమయంలో తనని కలవలేదు. ఆ వయస్సు వాళ్ళని ఎవర్ని కలవాలన్నా భయమేసేది. నేను అసలే రోడ్లమ్మట బలాదూర్‌గా తిరిగే మనిషిని. వలస కార్మికులు సమస్యల సుడిగుండాల్లో నలుగుతున్నప్పుడు, ఆ విధ్వంస సమయంలో నేను కరోనాని లెక్కచేయకుండా తిరిగాను. ఆ కారణంగానే ఎంతో ఇష్టమైన పెద్దల్ని కూడా కలవలేదు. కరోనా ఉధృతి తగ్గాక అత్తయ్యని చూడడానికని వెళ్ళాను. అప్పటివరకు మామూలుగా తిరిగిన ఆవిడ బాత్‌రూమ్‌లో పడిపోయి మంచానికి పరిమితమయ్యారు. అలాగే మంచంమీద కూర్చునే కబుర్లు చెప్పారు. మా కబుర్లయ్యాక నేను ప్రభాకర్‌తో మాట్లాడుతున్నప్పుడు ‘అమ్మాజీ! ఇదేంటో చూడు’ అని ఒక నోట్‌బుక్ చూపించాడు. చక్కటి చేతివ్రాతతో దాదాపు వంద పేజీల పుస్తకం.
‘‘ఎవరు రాశారు!’’
‘‘లండన్‌లో ఉన్నప్పుడు అమ్మ రాసింది.’’
‘‘అమ్మ రాశారా?’’ నేను ఆశ్చర్యపోయాను.
‘‘అవును అమ్మాజీ. తన అనుభవాలను రికార్డు చేసింది. లండన్‌లో ఉన్నప్పుడు నేను రాయమని ఎంకరేజ్ చేశాను.. చాలావరకు రాసింది. అసంపూర్ణంగా మిగిలిపోయింది. నాన్నగారు చనిపోయాక తను ఎమ్మెల్యే అయింది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. అవన్నీ, తన అనుభవాలన్నింటినీ రాసింది. పుస్తకంగా వేస్తే ఎలా ఉంటుందంటావ్?’’ అన్నాడు.
‘‘చాలా బావుంటుంది. నేను ఒకసారి చదువుతాను. తప్పకుండా పుస్తకం వేద్దాం’’ అని చెప్పి ఆ నోట్‌బుక్‌ను నాతో తెచ్చుకున్నాను. అరవై ఏళ్ళ క్రితం నాకు తెలిసిన అత్తయ్య ఈ పుస్తకంలో కనబడలేదు. ఈవిడ పరకాల కాళికాంబ, కమ్యూనిస్టు కార్యకర్త. కులాంతర వివాహం చేసుకున్న ధీర. కమ్యూనిస్టు ఉద్యమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న ఉద్యమ కెరటం. వ్యక్తిగతంగానూ, ఉద్యమంలోనూ, రాజకీయాల్లోనూ ఎంతో క్రియాశీలంగా బ్రతికిన ధీశాలి. ఆవిడ చేతివ్రాత వెంట పరుగులు పెడుతూ చదివాను. ఆవిడ ఉద్యమానుభవాలు చదువుతున్నప్పుడు ఒళ్ళు గగుర్పొడిచింది. ఈ పుస్తకంలో ఉన్న కాళికాంబ వేరు, నాకు తెలిసిన కాళికాంబ అత్తయ్య వేరు. నా బాల్యంలో నేనెరిగిన కాళికాంబ అత్తయ్య గురించే నేను ముందుమాటలో రాయగలను.
అప్పుడు నాకు ఎనిమిదో, తొమ్మిదో సంవత్సరాలుంటాయి. మా ఊరు సీతారామపురం. నర్సాపురానికి నాలుగు కిలోమీటర్ల దూరం. మేము చాలావరకు నడిచే చదువుకోవడానికి నర్సాపురం వచ్చేవాళ్ళం. గుర్రంబండి, సైకిల్, నడక… అప్పుడప్పుడూ ఎక్కేవాళ్ళం. ఎర్రబస్సులొచ్చాయనుకుంటాను. కానీ చిన్నప్పుడు బస్సెక్కిన జ్ఞాపకం లేదు. పెద్ద కాలువలో సరుకులేసుకున్న పడవలు నడిచేవి. మా తాతనాన్న పడవమీద టైలర్ హైస్కూల్‌కి వెళ్ళేవాళ్ళమని బోలెడు కథలు చెప్పేవాడు. మా చిన్నాన్నలందరినీ నాన్న అని పిలిచేవాళ్ళం. పిన్నమ్మ, పెద్దమ్మల్ని వాళ్ళ ఊళ్ళోతో కలిపి వాళ్ళ పేరుకు నాన్న తగిలించి పిలిచేవాళ్ళమన్నమాట. తాత నాన్న, సుబ్బ నాన్న, కాశీ నాన్న అని పిలిచేవాళ్ళం. కొత్తపేటమ్మ, సీసలమ్మ, కాకరపుర్రమ్మ, పుచ్చల్లంకమ్మ… మా పిన్నమ్మల్ని, పెద్దమ్మల్ని ఇలా గమ్మత్తుగా పిలిచేవాళ్ళమన్న మాట.
ఏడుగురు అన్నదమ్ముల్లో మా నాన్న రెండోవాడు. ఉమ్మడి కుటుంబంలో మా నాన్న ఎక్కువగా వ్యవసాయం పనుల్లో అమ్మని పిలిచేవాళ్ళం ఉండేవాడు. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. మా తాత, మామ్మలకి తొమ్మండుగురు పిల్లలు. మా చిన్నప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం. మా తాత కొండవీటి వెంకటరత్నం ఇంటి యజమాని. అచ్చమైన పేట్రియార్క్. డబ్బు వ్యవహారమంతా ఆయనదే. సంపాదించడం, భూములు కొనడం ఆయనే చెయ్యాలి. కొడుకులు… ముఖ్యంగా, మా నాన్న కొండవీటి శ్రీరామమూర్తి చాలా కష్టజీవి. ఒంటిమీద షర్టయినా లేకుండా పొలానికి వెళ్ళి శ్రమ చేసి, పశువుల కోసం గడ్డి కోసి తలమీద మోసుకొచ్చి అలసిపోయి, మా వీథి అరుగుల మీద నిద్రపోయేవాడు. అంతటి కష్టజీవి మా నాన్న.
వ్యవసాయం కాకుండా కొబ్బరికాయల వ్యాపారం చెయ్యాలని నాన్న ఎందుకనుకున్నాడో నాకు తెలియదు. ఈ వ్యాపారం కోసమే మా నాన్న సీతారామపురం నుండి నర్సాపురానికి మకాం మార్చాడు. రాయపేటలో రూ.25 అద్దెకి ఒక పెంకుటిల్లు తీసుకున్నారు. అప్పటికి మా పెద్దక్కకి పెళ్ళయింది. నూకరాజు గారని ఒకాయన ఇల్లది. ఈ నూకరాజు గారికి బజారులో మారుతీ మెడికల్ స్టోర్స్ ఉండేది. మా నాన్న చాలాసార్లు నన్ను తనతో తీసుకెళ్ళి, మెడికల్ షాపులో కూర్చోబెట్టేవాడు. అప్పుడప్పుడు కొబ్బరికాయల కొట్టుకి కూడా తీసుకెళ్ళేవాడు.
మేం నర్సాపురంలో అద్దెకుండే ఇల్లు నూకరాజు గారిదని చెప్పాను కదా! నూకరాజు గారి అమ్మాయి అన్నపూర్ణ నా ఫ్రెండు, క్లాస్‌మేటూను. మేమిద్దరం ‘‘హిందూ స్త్రీ పునర్వివాహ సహాయ సంగం స్కూల్’’లో చదువుకునేవాళ్ళం. అది ఓరియంటల్ స్కూల్. అంటే సంస్కృతం తప్ప వేరే సబ్జక్టులుండవు. మా నాన్నకి తెలియక నన్నీ స్కూలులో చేర్చాడు. పదవ తరగతి పాస్ అవడానికి నేను చాలా కష్టపడ్డాను. అన్నపూర్ణ, నేను కలిసి స్కూల్‌కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళిల్లు కూడా మా ఇంటిముందే
ఉండేది. అష్టకష్టాలు పడి మేమిద్దరం పదవ తరగతి పాసయ్యాం. అదంతా ఓ పెద్ద కథ.
మేము అద్దెకుండే ఇంటికి కుడివైపు కొంచెం పెద్దగా ఉండే పెంకుటిల్లుండేది. ఎడం వైపున పరకాల కాళికాంబ గారి ఇల్లు ఉండేది. ఆ వైపున కొన్ని గదులుండేవి. మా ఊరివాళ్ళే కొంతమంది అబ్బయిలు అద్దెకుండేవాళ్ళు. చదువుకోసమన్న మాట. కాళికాంబ గారి ఇంటికి, మా ఇంటికి మధ్యలో ఓ తలుపుండేది. అదెప్పుడూ తీసే ఉండేది. ప్రభాకర్, సుధాకర్ చాలా చిన్నవాళ్ళు. నేను వాళ్ళకన్నా కొంచెం పెద్దదాన్ని. మా తమ్ముడు వాళ్ళీడువాడే. అందరం కలిసి తెగ ఆడేవాళ్ళం. ఆటల మధ్యలో కాళికాంబ అత్తయ్య మాకు తినడానికి బోలెడన్ని పెట్టేవారు. మా ఇంట్లో చిరుతిళ్ళు ఉండేవి కావు.
ఆటలు చాలా సీరియస్‌గా సాగుతున్నప్పుడు పరకాల సుధాకర్ పరుగెత్తుకుని వచ్చి ‘‘అన్నయ్యా! అమ్మ పిత్తోంది రా’’ అని ఇంట్లోకి లాక్కెళ్ళిపోయేవాడు. సుధాకర్ చిన్నపిల్లాడు. ‘ల’ పలికేది కాదు. ఎన్నిసార్లు ఏడిపించినా అలాగే పిలిచేవాడు. పైగా ఐదు నిమిషాలకోసారి ఆ మాట అంటూ వచ్చేవాడు. ఏమి ఆటలాడేవాళ్ళమో గుర్తు రావడంలేదు. ప్రభాకర్ బట్టల్లాక్కుని వేసుకునేదాన్ని. గౌనుమీద షర్టు వేసుకుని తిరిగేదాన్ని. కాళికాంబ గారింట్లో నాన్‌వెజ్ వండేవాళ్ళు కాదు. ప్రభాకర్ మా ఇంట్లో మాతో పాటు నాన్‌వెజ్ తినేవాడు. మా నాన్‌వెజ్ ఫుడ్‌కి ఓ కథుంది.
మా ఇంటికి ఓ పక్క పెద్దింట్లో ఓ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కుటుంబం అద్దెకుండేది. అప్పట్లో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పదవంటే అబ్బో! చాలా పవర్‌ఫుల్ పోస్టన్నమాట. బహుశా అప్పుడు ప్రొహిబిషన్ అమల్లో
ఉన్నట్లుంది. ప్రొహిబిషన్ Ê ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ అని పిలిచేవాళ్ళు. వాళ్ళ పేర్లేవీ గుర్తులేదు కానీ కాళికాంబ గారు, ఎక్సైజ్ ఆవిడ గొప్ప స్నేహంగా ఉండేవారు. మా అమ్మ వాళ్ళిద్దరినీ వదినగారూ అని పిలిచేది. మమ్మల్ని అత్తయ్య గారూ అని పిలవమనేది. ఎక్సైజ్ అత్తయ్య గారింట్లో ముగ్గురో, నలుగురో పిల్లలుండేవారు. అప్పుడప్పుడూ మా ఆటల్లోకి వచ్చేవాళ్ళు కానీ అత్తయ్యగారు కొంచెం స్టేటస్ మెయింటైన్ చేసేవారు. పిల్లల్ని మాతో ఎక్కువగా కలవనిచ్చేవారు కాదు. కాళికాంబ అత్తయ్య అలా కాదు. మేము పల్లెటూరి నుంచి వచ్చిన పేద రైతు కుటుంబమైనా అత్తయ్య ఎప్పుడూ మమ్మల్ని తక్కువగా చూడలేదు.
తెల్లారగానే ప్రతిరోజూ ఎక్సైజ్ వారింటికి ఏమిటేమిటో వచ్చేవి. కూరగాయలు, పాలు, పండ్లు, చేపలు, నాటు కోళ్ళు… ఇంకా ఏంటేంటో తెచ్చి ఇచ్చేవారు. అప్పట్లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్‌స్పెక్టర్ అంటే… అబ్బో గొప్ప హోదా అన్నమాట. వాళ్ళింటికొచ్చిన వాటిల్లో మాకూ భాగం ఇచ్చేవాళ్ళన్నమాట. ముఖ్యంగా నాటుకోళ్ళు, చేపలు మా ఇంట్లో కూడా ఉడికేవి. ఫ్రెష్ కూరగాయలు కూడా. మా అమ్మ నాన్‌వెజ్ వండినప్పుడల్లా ప్రభాకర్ మాతో తినేవాడు. కాళికాంబ అత్తయ్యగారికి తెలుసో లేదో నాకు గుర్తులేదు. ఇంక మా సినిమా ప్రోగ్రాముల గురించి చెప్పాలి. రాయపేటలో మా ఇంటికి దగ్గర్లో శారదా హాలు, మెయిన్ రోడ్డు మీద వైజయంతి హాలు ఉండేవి. శారదా హాలుకి వెళ్ళే దారిలోనే ఎక్సైజ్ Ê ప్రొహిబిషన్ ఆఫీసుండేది. అక్కడినుండి సినిమా టిక్కెట్లు ఫ్రీగా వచ్చేవి. రిక్షాలెక్కి అందరం శారదా హాలులో సినిమా చూడ్డానికి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో రిక్షా తప్ప మరే వాహనమూ ఉండేది కాదు. రిక్షా లేకపోతే నడక. అలా చాలా సినిమాలు చూసినట్టు గుర్తు కానీ ఏం సినిమాలు చూశామో అస్సలు గుర్తులేదు.
వేసవి శెలవులకి ప్రభాకర్ మా సీతారామపురం వచ్చేవాడు. చాలామంది చుట్టాల పిల్లలు వేసవి శెలవులంతా మా ఊళ్ళోనే ఉండేవారు. జీడిపప్పులు, మామిడి పండ్లు, ముంజెలు బాగా దొరుకుతాయి మా ఊళ్ళో. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఊరంతా బలాదూర్ తిరగొచ్చు. చెట్లెక్కొచ్చు. కాలవల్లో చేపలు పట్టడం, ఈత కొట్టడం లాంటివి చాలా ఉంటాయి. పిల్లల ఆటలకి పట్టపగ్గాలుండేవి కాదు. మా
ఉమ్మడి కుటుంబంలో పిల్లల్ని ఎవరూ ఏమీ అనేవారు కాదు. మేమాడిరది ఆటా, పాడిరది పాటా. రోజంతా తోటల్లో తిరిగి తిండివేళకి ఇంటికొస్తే అన్నం పెట్టేవాళ్ళు. 1975లో నేను అతి కష్టంమీద డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చేశాను. మా నాన్న నన్ను తీసుకొచ్చి మా చిన్నాన్న ఇంట్లో దింపేశాడు. అప్పటికి నాన్న చేసిన అన్ని వ్యాపారాలూ దివాళా తీసి మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయింది. మా నాన్నకి వ్యవసాయం చేయడం తెలుసు కానీ వ్యాపారం చేయడం రాదు. తుకారాం వ్యాపారం చేసి మునిగేవాడు. ఆ అమ్మ వద్దన్నా వినకుండా వ్యాపారంలోకి దిగి చాలా నష్టపోయాడు. నేను ఉద్యోగం సంపాదించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని చాలా ప్రయత్నం చేశాను కానీ 1979 వరకు నాకు ప్రభుత్వ ఉద్యోగం దొరకలేదు. 1979లో గ్రూప్ ఫోర్‌లో సెలక్టయ్యాను. పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లోనే జూనియర్ అసిస్టెంట్‌గా జాయినయ్యాను. అప్పటికి మా నాన్న చనిపోయాడు.
నాకు ఉద్యోగం రాకముందు మా అమ్మ నన్ను కాళికాంబ అత్తయ్య గారింటికి తీసుకెళ్ళి నాకు ఉద్యోగం చూడమని అడిగింది. అలా రెండుసార్లు వెళ్ళినట్లు గుర్తు. అప్పటికి పరకాల శేషావతారం గారు మినిస్టర్‌గా ఉన్నారు. తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పారు కానీ ఎందుకో నాకు ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేశాను. చిన్న చిన్న ఉద్యోగాలేవో చేశాను.
కాళికాంబ అత్తయ్య గారి ‘‘అనుభవాలు, జ్ఞాపకాలు’’ చదివాక నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను నా బాల్యంలో చూసిన అత్తయ్య కాదు. కులాంతర వివాహం చేసుకుని, కమ్యూనిస్టు ఉద్యమంలో సాహసోపేతంగా పనిచేసిన ఈ పరకాల కాళికాంబ నాకు ఈ పుస్తకం ద్వారానే తెలిసింది. చదువుతూ ఎన్నోసార్లు మా అమ్మ బతికి ఉంటే ఎంత బావుండేది అనిపించింది. వీళ్ళిద్దరిదీ కలిపి ఒక ఫోటో కూడా లేదే! నెల రోజుల క్రితం అత్తయ్యని కలిసి మాట్లాడినపుడు మీ పుస్తకం ప్రింట్ చేస్తున్నామని చెప్పాను. ఆవిడ జ్ఞాపకశక్తి చాలా తగ్గిపోయింది. ‘‘నేను అమ్మాజీని, మాది ‘సీతారాంపురం’ అన్నప్పుడు సీతారామపురం వదిన గారమ్మాయి అమ్మాజీవా అని గుర్తు తెచ్చుకున్నారు. మెల్లమెల్లగా కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకుని మాట్లాడారు. ఆవిడ తన జ్ఞాపకాల్లో పోలవరం సంఘటన గురించి గుర్తు చేశాను కానీ తనకి గుర్తులేదు. ఆ సంఘటన చదువుతుంటే నాకు ఒళ్ళు గగుర్పొడిచింది.
‘‘నేను వచ్చి ఓ నెల్లాళ్ళుండి మళ్ళీ పోలవరం వెళ్ళిపోయాను. బస్సు దిగి ఇంటికి వచ్చేటప్పుడు సామాన్లతో చాలా ఇబ్బంది పడుతూ నడుస్తున్నాను. ఆ రోజుల్లో మనుషులు లాగే రిక్షాలుండేవి. ఆ రిక్షాలు నేను ఎక్కేదాన్ని కాదు. పొద్దుపోయింది. కటిక చీకటి. అప్పటికి ఆ ప్రాంతంలో కరెంట్ లేదు. ఒంటరిగా రావడం చూసి ఎవరైనా ఏదైనా చేస్తారనే భయం. చిన్న పాకలో ఓ హోటలుంది. ఆ హోటల్ నుంచి ఎవరో సిగరెట్ కాల్చుకుంటూ నడుస్తున్నారు. ఆయన ఎవరో తెలియదు. నేను కూడా భుజం మీద ఓ మూట, రెండు చేతుల్లోను సంచులు, పెట్టె పట్టుకుని నడుస్తున్నాను. గట్టిగా నడిస్తే ఆ శబ్దానికి వెనక్కి తిరిగి చూసి ఒంటరిగా వస్తున్న నన్ను ఆ చీకట్లో ఏమైనా చేస్తారేమోనని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుండగా కొంత దూరం వచ్చాక దగ్గు వినబడిరది. ఆ దగ్గు ఆయనదే అనుకుని కొంత దూరం నడిచాను. మళ్ళీ దగ్గు వినిపించింది. సిగరెట్టు వెలుతుర్లో మనిషి మనక మసకగా కనిపిస్తున్నారు. ఏమండీ! ఏమండీ! అని ధైర్యం తెచ్చుకుని పిలుస్తున్నాను. ఏమాలోచిస్తూ నడుస్తున్నారో వినిపించుకోలేదు. ఇంతలో నా చేతిలో ఉన్న ట్రంకు పెట్టె జారి కింద పడిపోయింది. ఆ శబ్దానికి వెనక్కి తిరిగి చూసి ‘ఎవరూ’ అన్నారు. ‘నేనండీ’ అన్నాను. దగ్గరకొచ్చి మళ్ళీ ఎవరూ అన్నారు ‘నేనే, చాలాసేపటి నుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చేస్తున్నారు’ అన్నాను. ‘కాళికాంబా!’ అని ‘ఇంత రాత్రివేళ వస్తున్నావేంటి!’ అన్నారు.’
ఇలాంటి సంఘటనలు, అనుభవాలు, జ్ఞాపకాలు ఈ పుస్తకం నిండా చాలా ఉన్నాయి. పోలీసుల వేధింపులు, జైళ్ళు,
ఉద్యమాలు, పిల్లల్ని పెంచడానికి పడ్డ కష్టాలు… వెరసి కాళికాంబ గారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. గుర్తున్నంత వరకు తన జ్ఞాపకాలను రాసి ఉంచడం ద్వారా ఆ తరంలోని చాలామంది ఉద్యమ భాగస్వాముల గురించి ఎంతో వివరంగా తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రముఖ సినీ నటుడు అల్లు రామలింగయ్య, పి.వి.నర్సింహరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, పరకాల పట్టాభిరామారావు, ఉద్దరాజు రామం గారు, బుర్రకథ నాజర్… ఇలా ఆనాటి ఎందరో ప్రముఖ వ్యక్తుల ప్రస్తావన ఈ పుస్తకంలో ఉంది. వాళ్ళందరితో తమకున్న అనుబంధాన్ని చాలాచోట్ల ప్రస్తావించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సమితి ప్రెసిడెంటుగా చేసిన మా చిన్నాన్న కొండవీటి సుబ్బారావు గారి గురించి కూడా కాళికాంబ గారు రాశారు.
‘‘మనకు తెలియని మన చరిత్ర’’ పుస్తకం రికార్డు చేసిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీర నారీమణులకు ఏ మాత్రం తీసిపోని పరకాల కాళికాంబ గారు రాసుకున్న ఈ అసంపూర్ణ జ్ఞాపకాలను అందరూ చదవాలనే ఉద్దేశ్యంతో ఆమె పెద్ద కొడుకు పరకాల ప్రభాకర్ తీసుకొచ్చిన ఈ పుస్తక రూపకల్పనలో నేను కొంత పాలుపంచుకున్నాను.
(ఇటీవల మరణించిన పరకాల కాళికాంబ గారికి నివాళి)