(The sky gets dark slowly… Zhou Daxin)ఈ పుస్తకం చదవమని ఎవరో సూచించారు. చదువుతుంటే చాలాసార్లు అబ్బూరి ఛాయాదేవి గారు, ఆవిడ నాకు రాసిన ఉత్తరం గుర్తు వచ్చాయి. జీవితాన్ని, మరణాన్ని ఆవిడ అద్భుతంగా ప్లాన్ చేసుకున్న తీరు కళ్ళముందు ఆవిష్కృతమైంది.
ప్రతి మనిషి జీవితంలో ఆటపాటలతో గడిచిపోయే బాల్యం, మిలమిల మెరిసే యవ్వనం, పొద్దు వాలుతున్నట్లుగా అనిపించే వృద్ధాప్యం తప్పనిసరిగా ఎదురయ్యే దశలు. జీవితపు చివరి దశ ఎన్నో సమస్యలతో నిండి ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య, సామాజిక సమస్యలతో పాటు ఒంటరితనం, ప్రియమైన వారి ఎడబాటూ వేధిస్తూ ఉంటాయి. ఈ సమస్యలతో పాటు తమకి వృద్ధాప్యం సమీపించిందని, దానికి తగిన కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని అంగీకరించకపోవడం, తమ పరిస్థితులను కరెక్టుగా అంచనా వేసుకోకపోవడం వల్ల మరిన్ని సమస్యలు చుట్టుముడతాయి.
జనరేషన్ అంతరాల సందిగ్ధ సమయాల్లో కూడా తమకు అన్నీ తెలుసునని, ఎవరి మాటా విననక్కర్లేదని అనుకోవడం, దీనివల్ల కుటుంబసభ్యులతో స్పర్థలు పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు వారి పిల్లల భావాలతో అంగీకరించలేకపోవడం వల్ల వారి మధ్య స్పర్ధలు పెరుగుతాయి. ఆ కారణంగా పెద్దవారు ఒంటరిలవుతారు. వయసు మీద పడుతున్నప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఈ పుస్తకంలో ఈ క్రింది అంశాలను రాశాడు డేక్సిన్.
మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, మన చుట్టూ ఉన్నవాళ్ళు క్రమంగా కనుమరుగైపోతూ ఉంటారు. మన పిల్లలు, యువతరం వారి వారి జీవన పోరాటాల్లో మునిగి ఉంటారు. వారి సొంత జీవితాలు, వాళ్ళ పిల్లల విషయాలతో చాలా బిజీగా ఉంటారు. అప్పటివరకు మనతో బతికిన మన జీవిత భాగస్వాములు కూడా మనకంటే ముందే కనుమరుగైపోవచ్చు అందుకే ఒంటరిగా ఉండడం, ఏకాంతాన్ని ఆస్వాదించడం అలవర్చుకోవాలి. అందరూ వెళ్ళిపోతున్నారని దుఃఖపడడం వల్ల ఎలాంటి లాభం ఉండదని అర్థం చేసుకోవాలి. దానిని ప్రకృతి సహజమైన ప్రక్రియగా అవగాహన చేసుకోవాలి.
మీరెంతటి అత్యున్నతమైన పదవిలో పనిచేసి రిటైరైనప్పటికీ సమాజం మీ హోదాను గుర్తు పెట్టుకోదు. నేనంత ఉన్నత పదవిలో పనిచేశాను కదా ఇప్పుడు కూడా లైమ్లైట్లో ఉండాలనుకుంటే తీవ్ర ఆశాభంగం తప్పదు. ఒక మామూలు వ్యక్తిగా ఒద్దికగా ఒక పక్కన నిలబడి సంతృప్తి చెందడం మనం తప్పకుండా నేర్చుకోవాలి. పోయిన పదవి, హోదాని గుర్తు చేసుకుంటూ ఉంటే కుంగిపోవడం తప్ప వేరే ఏమీ ఉండదు. వయసుతోపాటు ఎన్నో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఒకప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో బతికాను ఇప్పుడు ఆ రోజులు ఏమైపోయాయి అని దిగులు పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి.
సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మన కదలికలు కొన్ని ప్రదేశాలకు మాత్రమే లిమిట్ అయిపోతాయి. ఇంట్లో కూడా తిరగలేని పరిస్థితి ఎదురవ్వొచ్చు. మనం పుట్టినప్పుడు మంచం మీదే కదా పుట్టాం. మన తల్లి మనల్ని మంచం మీదనే కన్నది. పుట్టుకతోనే మనకి మంచంతో మంచి అనుబంధం ఉంటుంది. వృద్ధాప్యంలో కూడా చాలాసార్లు ఎక్కువమంది మంచానికే పరిమితం అవ్వాల్సి రావచ్చు. అలాంటి స్థితిలో మనకు సేవ చేయడానికి మనవారెవరూ మిగిలి ఉండకపోవచ్చు. దానివల్ల మనతో ఎలాంటి సంబంధం లేని నర్సులో, సంరక్షకులో మనల్ని చూసుకోవాల్సి రావచ్చు. మనం ఎల్లప్పుడూ వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. వారిని విసిగించడం వల్ల వారి ముఖాల మీద చిరునవ్వు చెదిరిపోయి మన పట్ల విసుగుతో ఉండిపోతారు. డబ్బు ఇచ్చి నియమించుకున్నప్పటికీ తప్పనిసరిగా మనం వారి పట్ల కృతజ్ఞతతో వ్యవహరించాలి. డబ్బు చెల్లిస్తున్నాం కాబట్టి సేవ చేసే వారి పట్ల నిర్దయగా ప్రవర్తించడం పొరపాటని అర్ధం చేసుకోవాలి. వృద్ధులు చాలాసార్లు ఆర్థికంగా మోసాలకు గురవుతుంటారు. ఎంతో కష్టపడి దాచుకున్న పొదుపు సొమ్ము మీద కుటుంబ సభ్యులు, లేదా బయటివారు ఒక కన్నేసి మోసం చేయాలని అనుకుంటారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాబడి, ఖర్చుల మీద సరైన నియంత్రణ కలిగి ఉండాలి. వయసు మీద పడుతున్నా మనలో కొన్ని కళలు మిగిలి ఉంటాయి. రచయితలమైతే అప్పుడప్పుడూ రాయడం, పుస్తకాలు చదవడం, సంగీతం వినడం లాంటి అలవాట్లను విడిచిపెట్టకూడదు. టీవీ మంచి వినోదాన్ని ఇస్తుంది. ఒంటరినైపోయానన్న ఆలోచన రానీయకపోవడం మంచిది. ఆ ఆలోచన జీవితాన్ని దుర్భరం చేస్తుంది. మన బిడ్డలు, మనుమలు వారి వారి జీవన సంఘర్షణలో ఆటుపోట్లు ఎదుర్కొంటుండొచ్చు. మనం ఆ విషయాలను తప్పకుండా అర్థం చేసుకుంటే మనకి మనశ్శాంతిగా ఉంటుంది. వారికీ వెసులుబాటుగా ఉంటుంది.
సో… మనకి మిగిలిన సమయాన్ని ప్రశాంతంగా, నిర్మలంగా గడపడానికి ప్రయత్నిద్దాం. అదే మనకి మనం చేసుకునే మేలు.