పరస్పర స్వేచ్ఛనిచ్చే నైతికత : స్త్రీవాదం అందించే లైంగిక రాజకీయ దృక్కోణం – బెల్‌ హుక్స్‌

అనువాదం: సునీత అచ్యుత
స్త్రీవాద ఉద్యమం, లైంగిక విముక్తి పోరాటం రాకముందు, అనేకమంది స్త్రీలకు తమ లైంగిక కోరికల గురించి మాట్లాడటం కష్టంగా, ఇంకా చెప్పాలంటే అసాధ్యంగా ఉండిరది. లైంగిక కోరికలు, లైంగిక ఆనందం రెండూ ఎప్పుడూ కేవలం మగవాళ్ళకు మాత్రమే కలుగుతాయని ఆడవాళ్ళకి చిన్నప్పటినుంచి చెప్పటమే కాక, అటువంటి ఆనందం కోరుకునే ఆడవాళ్ళు నీతిలేని వాళ్ళని, గుణం లోపించిన వాళ్ళని కూడా

నూరిపోస్తారు. ఆ సెక్సిస్టు ఆలోచనా ధోరణి ఆడవాళ్ళందరినీ పతివ్రతలు లేదా లంజలనే రెండు గుంపులుగా విడగొట్టి, వారు తమకి తాము ఒక ఆరోగ్యకరమైన లైంగిక ఆస్తిత్వాన్ని ఏర్పర్చుకోవడానికి ఏ పునాది ఏర్పడకుండా చేసింది. అదృష్టవశాత్తూ స్త్రీవాద ఉద్యమం ఈ సెక్సిస్టు మూసలని బలంగా సవాలు చేసింది. సరిగ్గా గర్భనిరోధక సాధనాలు దేశంలో అందరికీ అందుబాటులోకి వచ్చిన చారిత్రక సందర్భంలోనే ఈ సవాలు కూడా రావడం కొంత సహాయపడిరది.
నమ్మకమైన గర్భ నిరోధక సాధనాలు అందుబాటులోకి రాకముందు ఆడవాళ్ళు తమ లైంగిక అస్తిత్వాన్ని బలపరుచుకోవాలని అనుకున్నప్పుడల్లా అక్కర్లేని కడుపు, ప్రమాదకరమైన అబార్షన్‌ల రూపంలో వారికి ‘శిక్షలు’ లభించేవి. గర్భ నిరోధక సాధనాలు అందుబాటులోకి రాకముందు ఆడవాళ్ళు అనుభవించిన ఘోర పరిస్థితులు, దాని కారణంగా లైంగిక జీవితంలో పుట్టుకొచ్చిన రుగ్మతల గురించి మనం ఇప్పటికీ కావాల్సినంత సాక్ష్యాలు కూడగట్టలేదు. మగవాళ్ళు శృంగారం కోరుకోవటం, శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ గర్భం ధరించే ప్రమాదం ఉంది కాబట్టి అదంటేనే ఆడవాళ్ళు భయపడటం ` అలాంటి ప్రపంచాన్ని తలచుకుంటేనే భయంతో శరీరం జలదరిస్తుంది. లైంగిక కోరికలు ఉండే ఆడవాళ్ళకి సెక్స్‌ అంటేనే భయంతో కలగలిసిపోయి ఉండిరదన్న మాట. వద్దన్నా మీదికి వచ్చే మగవాళ్ళని, అఘాయిత్యాలకు పాల్పడే మొగుళ్ళని, అక్కర్లేని కడుపు తీయించుకోవటానికి ప్రాణాన్ని ఫణంగా పెట్టటాన్ని గుర్తించి
ఆడవాళ్ళు ఏమేం చేశారో కూడా మనకింకా పూర్తిగా తెలియదు. తెలిసిందేమిటంటే స్త్రీవాద విప్లవం తర్వాత స్త్రీల లైంగిక ప్రపంచం పూర్తిగా మారిపోయిందని.
అమ్మలనుభవించిన లైంగిక బాధలు, లైంగికత అంటేనే వారికున్న అసహ్యం, భయం, శతృత్వం చూసిన మాకు, సరిగ్గా లైంగికత గురించి తెలిసే యుక్త వయస్సులో స్వేచ్ఛ, ఆనందం, సుఖం అన్నీ ఆశ చూపిన ఈ ఉద్యమంలోకి రావటం ఒక అద్భుత విషయం. ఇప్పుడు స్త్రీల లైంగిక కోరికల వ్యక్తీకరణకు ఎంత తక్కువ అడ్డంకులు ఉన్నాయంటే స్త్రీల శరీరాలు, వారి లైంగికతపై జరిగిన పితృస్వామ్య దాడుల గురించిన చారిత్రక జ్ఞాపకాలే తుడిచి పెట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ మరుపు నీడలోనే గర్భస్రావం అంటే కేవలం పొట్టలో ఉన్న పిండం ప్రాణం గురించిన చర్చలు జరుగుతున్నాయి. స్త్రీలకి చట్టపరమైన గర్భస్రావ హక్కు తీసేస్తే వారి లైంగికతపై పడే వినాశకర ప్రభావం చర్చలోకి కూడా రావట్లేదు. మనం ఇంకా లైంగిక తృప్తి అంటే తెలియని అనేక తరాల స్త్రీల మధ్యలో బ్రతుకుతున్నాం. వారికి ఇప్పటికి కూడా సెక్స్‌ అంటే భయం, ప్రమాదం, సర్వనాశనం, నష్టం.
స్త్రీల లైంగిక విముక్తికి నమ్మకమైన, భద్రమైన గర్భ నిరోధక సాధకులు అవసరం. అది లేకుండా ఆడవాళ్ళు తమ లైంగిక చర్యల ఫలితాలపై నియంత్రణ సంపాదించలేరు. స్త్రీలు లైంగిక స్వేచ్ఛని పొందాలంటే తమ శరీరాల గురించిన జ్ఞానం సంపాదించాలి, లైంగిక నిబద్ధత అంటే అర్ధం చేసుకోవాలి. దాని గురించిన అవగాహన ఏర్పరచుకోవాలి. మొదట్లో స్త్రీవాద ఆక్టివిజం కేవలం ఆడవాళ్ళకి ఎప్పుడు కావాలంటే, ఎవరితో కావాలంటే శృంగారం చేసుకునే స్వేచ్ఛ పైన దృష్టి కేంద్రీకరించింది, కానీ లైంగికత గురించిన విమర్శనాత్మక విద్యపైన దృష్టి పెట్టలేదు. మన శరీరాల్ని సెక్సిస్టు వ్యతిరేక దృష్టితో ఎలా గౌరవించుకోవాలి, మనల్ని విముక్తుల్ని చేసే శృంగారం ఎలా ఉండొచ్చు అనే వాటి గురించి చర్చించలేదు.
1960లు, 1970లలో లైంగిక స్వేచ్ఛ అంటే లైంగిక విశృంఖలత్వమే అని అర్ధం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేది. అప్పట్లో, ఇప్పుడు కూడా కొంతమేరకు పరలింగ సంపర్కులయిన మగవాళ్ళకి లైంగికంగా విముక్తులయిన ఆడవాళ్ళంటే ఎప్పుడు పడితే అప్పుడు, తమవంటూ ఏ డిమాండ్లు, ముఖ్యంగా భావోద్వేగపరమైన డిమాండ్లు లేకుండా, తమతో పడుకునే ఆడవాళ్ళు, అనేకమంది పరలింగ సంపర్కులయిన స్త్రీవాదులు కూడా ఇటువంటి భావనలతోటే ఉండేవాళ్ళు. ఎందుకంటే, వాళ్ళు తమ లైంగిక ఆచరణకు పితృస్వామ్య సమాజ మగవాళ్ళని నమూనాలుగా తీసుకునేవాళ్ళు. కాకపోతే, త్వరలోనే అందరికీ లైంగిక స్వేచ్ఛ, అంటే లైంగిక విశృంఖలత్వం కాదని అర్థమయింది.
స్త్రీవాద ఉద్యమం ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడు రాడికల్‌ లెస్బియన్‌ యాక్టివిస్టులు స్ట్రెయిట్‌ ఆడవాళ్ళు మగవారితో తమకున్న బంధాలను పునఃపరిశీలించుకోవాలని అంటూ, అసలు పితృస్వామ్య సమాజంలో స్త్రీ పురుషుల సంబంధాలు ఎంత మేరకు లైంగికంగా విముక్తి చెందుతాయోనన్న ప్రశ్న లేవనెత్తారు. ఈ రకమైన విచారణ ఉద్యమానికి మేలు చేసింది. పరలింగ సంబంధాల్లోని స్త్రీల విమర్శనాత్మక దృష్టికి పదును పెట్టడమే కాకుండా, లెస్బియన్‌ దృష్టికోణంలోని బలాన్ని, బలహీనతలను కూడా బయటపెట్టింది. ‘స్త్రీవాదం సిద్ధాంతమయితే, లెస్బియనిజం దాని ఆచరణ’ అన్న స్లోగన్‌తో ప్రభావితులై పురుషులను వదిలేసి స్త్రీలతో సంబంధాల్లోకి ప్రవేశించిన స్త్రీలకి, ఆయా సంబంధాలు కూడా భావోద్వేగ పరంగా, ఇతరత్రా కష్టాలతో కూడుకున్నవనీ అర్థమయింది.
లెస్బియన్‌ సంబంధాలు పరలింగ సంబంధాల కంటే బాగున్నాయా అన్న విషయం, ఇద్దరూ ఒకటే సెక్స్‌కి చెందిన వారా లేదా అనేదానిపై ఆధారపడలేదు. ఏ సంబంధంలోనయినా ఒకరిది పైచేయి, మరొకరు వారికి అణిగి మణిగి ఉండాలనే బలమైన సాంస్కృతిక పూనిక నుండి అవి బయటపడ్డాయా లేదా అనే దానిపై ఆధారపడ్డాయి. లెస్బియన్‌ సంబంధాల్లో లైంగిక విశృంఖలత్వాన్ని కూడా పరలైంగిక సంబంధాల్లోని విశృంఖలత్వం లాగే మనం లైంగిక విముక్తిగా భావించలేము. రెండిరటినీ ఒకటే అనుకున్న ఆడవాళ్ళు, వారి లైంగిక భాగస్వాములు ఎవరయినా సరే, తీవ్ర ఆశాభంగానికి లోనయ్యారు.
అంతకు ముందే పరలింగ సంబంధాల్లో పురుషాధిక్యత, హింస చవిచూసిన స్త్రీలు, స్త్రీ పురుష సంబంధాల్లో తాము లైంగిక సంతోషాన్ని అనుభవించట్లేదని ఏ మాత్రం దాచుకోకుండా బయటికి చెప్పారు. తమ అనుభవాల నుండో, తమ దగ్గరి స్నేహితులు, కామ్రేడ్ల అనుభవాల నుండో అనేకమంది స్త్రీవాద ఆలోచనా పరులు ఈ లైంగిక విముక్తి భావనతో విరక్తి చెంది అసలు శృంగారం, మగవాళ్ళతో సంబంధాలంటేనే బయటికి చెప్పలేనంత లోతైన అసహ్యం ఏర్పరచుకున్నారు. అప్పటివరకూ ఇటువంటి విమర్శ శత్రువులైన మగవాళ్ళతో పడుకోకండి అన్న రాడికల్‌ లెస్బియన్ల నుండి మాత్రమే వచ్చింది. వారి సరసన ఇలా మగవాళ్ళతో విరక్తి చెందిన ఈ పరలింగ స్త్రీలు కూడా చేరారు. ఉన్నట్లుండి లైంగికత గురించిన ఈ చర్చ, ముఖ్యంగా లైంగిక చర్య గురించిన చర్చ అంతా అసలు స్త్రీ పురుష శృంగారం అంతా లైంగిక దౌర్జన్యమేనని, యోనిలో పురుషాంగం పెడితే అది రేప్‌ అని మారిపోయింది.
కొంతకాలం ఈ సిద్ధాంతాలు, వాటిని ప్రచారం చేసిన స్త్రీల ప్రభావం అప్పుడప్పుడే కొత్తగా, విభిన్నమైన లైంగిక అస్తిత్వాలను ఏర్పర్చుకుంటున్న యువతులపై తీవ్రంగా ఉండేది. చాలామంది యువతులు ద్విలింగ (బై సెక్సువల్‌) సంబంధాలను ఎంచుకుని, వాటిల్లో తమకే శృంగార విషయాల్లో నిర్ణయాధికారం ఉండేటట్లుగా చేసుకున్నారు. అయితే, అత్యధిక శాతం యువతులు స్త్రీవాద ఆలోచన నుండే మొహం తిప్పేసుకున్నారు. తిప్పుకుని అప్పటికే పాతబడిన సెక్సిస్టు లైంగిక స్వేచ్ఛ భావనలని, ఒకరకమైన పగతో జీవితాల్లోకి ఆహ్వానించారు.
లైంగిక సుఖం/ప్రమాదం, లైంగిక స్వేచ్ఛ/బంధనాలకి మధ్య ఉండే ఘర్షణల పర్యవసానంగా ఏర్పడే వైరుధ్యాలు, విభేదాలు లైంగిక సాడో మాసోషిజానికి ఒక ఆకర్షణీయమైన భూమికను ఏర్పరచాయి. లైంగికత గురించిన స్త్రీవాద అధ్యయనాలన్నీ అధికారం/పవర్‌ చుట్టూనే తిరుగుతాయి. ఎంత సమానత్వం గురించి మాట్లాడినా లైంగిక ఆకర్షణ, కామోద్రేకంలో అధికారం, అధికార లేమి అన్నవి బయటికన్నా భిన్నరీతిలో ప్రదర్శించబడతాయనే జ్ఞానం లైంగికతకి సంబంధించినంత వరకూ అణిచే వాళ్ళు, అణచబడే వాళ్ళు అన్న కేటగిరీలు మాత్రమే విషయాన్ని అర్ధం చేసుకోవటానికి సరిపోవని తేలింది. స్త్రీవాద లెస్బియన్‌ శృంగారంలో పైన/క్రింద లేక అధికారం/అధికార లేమి అన్నవి ఆమోదకరమైన శృంగార విన్యాసమున్న విషయం బయటికొచ్చి పరిలింగ శృంగారం గురించి స్త్రీవాదం చేసిన విమర్శని కుదిపేసింది.
లెస్బియన్‌ లేక పరలింగ సంబంధాల్లోని స్త్రీలు ఇటువంటి శృంగారంలో పాల్గొన్నప్పుడు వారిని విముక్త స్త్రీలుగా భావించాలా లేదా అన్న గొడవ అసలు లైంగికత గురించిన రాడికల్‌ స్త్రీవాద చర్చకి ముగింపు పలికింది. ఈ విషయంతో ముడిపడి ఉన్నదే పితృస్వామ్య పోర్నోగ్రఫీ అంటే ఏమిటనే చర్చ. ఉద్యమాన్ని విభజించి, ముక్కలు చేసే శక్తి ఉన్న ఈ విషయాలు ముందుకొచ్చిన 1980ల చివరిలో లైంగిక స్వేచ్ఛ, లైంగికత గురించిన చర్చంతా బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ప్రైవేట్‌ ప్రదేశంలో జరపటం మొదలయింది. లైంగికత గురించి జరిగిన బహిరంగ చర్చ ఉద్యమాన్ని నాశనం చేసింది.
సాంప్రదాయ వాదులు, పరిశుద్ధ వాదులు, సెక్స్‌ వ్యతిరేకులయిన స్త్రీవాదులు మాత్రమే బహిరంగంగా లైంగికత గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. స్త్రీల లైంగిక విముక్తిని చర్చించి, సెలబ్రేట్‌ చేసిన ఉద్యమం ఇప్పుడు లైంగికతకి సంబంధించి కేవలం లైంగిక హింస, దాని బాధితుల గురించి మాత్రమే బహిరంగంగా మాట్లాడుతోంది. ఒకప్పుడు లైంగిక స్వేచ్ఛని ఛాంపియన్‌ చేసిన స్త్రీవాదులే వయసు మీద పడేకొద్దీ లైంగిక ఆనందం అంత ముఖ్యమైంది కాదనీ, బ్రహ్మచర్యం గొప్పదనీ అనటం మొదలుపెట్టారు. అసలు లైంగిక కోరికలు, ఆచరణ గురించి బహిరంగంగా మాట్లాడే స్త్రీలందరూ స్త్రీవాద రాజకీయాలకు దూరంగా జరగటమో, వాటిని కొట్టిపారేయటమో చేశారు. అన్నిటికన్నా ముఖ్యమైనదేమిటంటే, స్త్రీవాద ఉద్యమాన్నే ప్రధానంగా సెక్స్‌కు వ్యతిరేకమైందిగా పరిగణించటం. ఆలోచనాపరులయిన స్త్రీవాదులు లైంగికోద్రేకం, ఆనందం గురించి చేసిన చర్చంతా వెనక్కి వెళ్ళిపోయింది. అందరూ దాన్ని పట్టించుకోవటం మానేశారు. దాని చోటులో స్త్రీలు, పురుషులూ ఇద్దరూ కూడా లైంగిక స్వేచ్ఛకి సంబంధించిన పితృస్వామ్య నమూనాలపై ఆధారపడటం మొదలుపెట్టారు.
లైంగిక విముక్తి, స్త్రీవాద ఉద్యమాల తర్వాత, ఇప్పటికి కూడా మగవాళ్ళకి నచ్చినప్పుడే పరలింగ సంబంధాల్లో శృంగారం జరుగుతోందనీ, సమలింగ సంబంధాల్లోని యువతులు, యువకులకు బహిరంగ ప్రదేశాల్లో వారి లైంగిక ఆచరణను సమర్ధించే వాతావరణం ఇప్పటికీ లేదనీ, లైంగికత గురించి పతివ్రత/కులత అనే ద్వివిధ కల్పన ఇప్పటికీ స్త్రీ పురుష శృంగార సంబంధాల్లో ప్రధానంగా
ఉంటోందని, పితృస్వామ్య పోర్నోగ్రఫీ మీడియాలో ప్రముఖ పాత్ర పోషిస్తోందని, అక్కర్లేని గర్భం ఎక్కువవుతోందనీ, అనేకమంది టీనేజర్లు సంతృప్తి, భద్రత లేని సెక్స్‌లో పాల్గొంటున్నారని, అనేక పరలైంగిక, సమలైంగిక వివాహాల్లో ఆడవాళ్ళు సెక్స్‌లో పాల్గొనట్లేదనీ మనకి తెలుసు. ఈ విషయాలన్నీ లైంగికత గురించిన స్త్రీవాద చర్చని మళ్ళీ మొదలుపెట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. మనమింకా విముక్త లైంగిక ఆచరణ అంటే ఏమిటో కనుక్కోవాల్సిన అవసరం ఉంది.
మౌలికంగా పరస్పర గౌరవం, అలాగే స్వచ్ఛందంగా, పూర్తి ఆమోదంతో మాత్రమే లైంగిక తృప్తి, ఆనందం పొందగలమనే నమ్మకం విముక్త లైంగిక ఆచరణకు అవసరం. పితృస్వామ్య సమాజంలో తమ సెక్సిస్టు ఆలోచన వదులుకోకపోతే స్త్రీలు, పురుషులకి కావాల్సినంత ఆనందం దొరకదు. అనేకమంది స్త్రీలు, పురుషులూ కూడా పురుషాంగం ఎంత గట్టిగా ఉంది, ఎంతసేపు నిలబడి ఉందనే విషయం పైనే మగవాళ్ళ లైంగిక సామర్ధ్యాన్ని నిర్ణయిస్తున్నారు. ఇది సెక్సిస్టు ఆలోచన. ఆడవాళ్ళ లైంగికత కేవలం తమ ఆనందం కోసమేననే సెక్సిస్టు ఆలోచన మగవాళ్ళు ఎలా వదులుకోవాలో, ఆడవాళ్ళు కూడా ఈ పురుషాంగ కేంద్రంగా ఉండే లైంగిక ఆచరణని, ఆలోచనని వదులుకోవాలి.
లైంగిక విముక్తి స్త్రీవాద ఉద్యమాలు ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు పురుషులు సమానత్వాన్ని అన్ని రంగాల్లో ఒప్పుకున్నా శృంగారంలో ఒప్పుకోరని స్త్రీలకు అర్ధమయింది. పడక గదిలో పురుషులకి తమకి కావల్సింది ఇవ్వటానికి, లైంగిక ఆనందాన్ని పంచుకోవటానికి సిద్ధంగా ఉండే స్త్రీ కావాలి గానీ, ఆడవాళ్ళు తమకేం కావాలో అడక్కుండా అతడికేం కావాలో చేస్తే మాత్రమే వారిని శృంగార భాగస్వాములుగా ఒప్పుకోవటానికి సిద్ధపడతారని, ఆమెకెప్పుడు శృంగారం కావాలో మాత్రం వారి దృష్టిలో ప్రధానం కాదనీ తెలిసింది. ఆడవాళ్ళకి తమకి శృంగారం వద్దని చెప్పటానికి ఆయా సంబంధాల్లో చోటు ఉండదు. అంతే కాదు, మగవారికి భాగస్వామి శృంగారానికి ఒప్పుకోనప్పుడు, బయటికి వెళ్ళి వెతుక్కుంటానని చెప్పటం చాలా మామూలు విషయంగా పరిగణింపబడుతుంది. ఒక పక్క ఈ ఆడ శరీరం తను కోరుకున్నప్పుడల్లా సిద్ధపడాలని, లేకుంటే ఏ ఆడ శరీరమైనా లైంగిక తృప్తికి సరిపోతుందనే వాదన పితృస్వామ్య అధికార భావజాలాన్ని బలోపేతం చేసేదే కదా!
విముక్తమైన శృంగార సంబంధాల్లో ఇద్దరు భాగస్వాములకు శిక్షలు పడతాయనే భయం లేకుండా ఎన్నిసార్లు, ఎప్పుడు శృంగారంలో పాల్గొనాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలి. తాము కాకుండా ఇంకొకళ్ళు తమ లైంగిక కోరికలు తీర్చటానికి సిద్ధంగా ఉండాలని అనుకున్నంత వరకూ ఇప్పుడున్న లైంగిక ఆధీనత కొనసాగుతూనే ఉంటుంది. నిజమైన స్త్రీవాద లైంగిక విముక్తి రాజకీయాలు స్త్రీల లైంగిక కార్యశీలతని కేంద్రంగా చేసుకుంటాయి. ఎంతవరకయితే స్త్రీలు తమ శరీరాలు, లైంగికత ఇతరుల సేవ కోసమేనని నమ్ముతారో అప్పటివరకూ ఎటువంటి కార్యశీలత ఏర్పడదు. వృత్తిపరంగా వేశ్యలయిన స్త్రీలు తమ శరీరాల్ని వస్తువుల కోసం మారకం చెయ్యటం ద్వారా తాము విముక్తులమయ్యామని అంటుంటారు. అయితే, తమ భౌతిక అవసరాలను తీర్చుకోవటానికి ఇతర మార్గాలు వారికి అందుబాటులో లేనంత వరకూ, వేరే దారి లేక ఆమె ఈ మార్గాన్ని అవలంబించినట్లే, ఆమెకి తన శరీరంపైన నియంత్రణ లేనట్లే. అత్యధిక శాతం పరలింగ స్త్రీలు తమ లైంగికత మగవాళ్ళని ఆకర్షించటంలోనే ఉంటుందనే సెక్సిస్టు భ్రమల్లో నుండి బయట పడలేకుండా ఉన్నారు. తమని తాము నమ్మాలంటే వాళ్ళు సమ లింగ సంబంధాలు, స్వయంతృప్తి, బ్రహ్మచర్యం కూడా పితృస్వామ్య సంస్కృతిలోని మగవాళ్ళతో సంబంధాలతో సమానమైనవని నమ్మాలి. వయసు మీద పడిన స్త్రీవాదులు కూడా ఈ సంస్కృతిలో మగవారితో లైంగిక సంబంధాలు ఏర్పర్చుకోవాలంటే స్త్రీత్వం, లైంగికంగా ఆకర్షణ గురించిన సెక్సిస్టు మూసల్లోకి ఇమడాల్సి వస్తోంది.
పురుషుల చూపుల్లో పడటానికి మాత్రమే కాకుండా మన లైంగికతకి, మన లైంగిక కార్యశీలతకి మనమెప్పుడయితే విలువ ఇచ్చుకుంటామో అప్పుడే నిజమైన లైంగిక విముక్తి పొందే స్థాయికి వచ్చినట్లని ఎప్పుడో రాడికల్‌ స్త్రీవాదులు చెప్పింది సరైనదే అన్పిస్తుంది. మనకిప్పుడు కూడా ఈ విషయాన్ని లైంగిక కోరికల వ్యక్తీకరణ గురించి అర్థం చేయించటానికి స్త్రీవాద సిద్ధాంతం అవసరమే.
లైంగికత గురించి స్త్రీవాద చర్చలో పరిమితులు ఉన్నప్పటికీ, పరస్పర స్వస్థత గురించిన సిద్ధాంతం, ఆచరణ రెండిరటినీ చర్చించి, భవిష్యత్తులో శృంగారం పట్ల ఒక కల్పనని ఏర్పరచిన సామాజిక న్యాయ ఉద్యమం కేవలం స్త్రీవాద రాజకీయాలే. లైంగిక కోరికలని వ్యక్తీకరించే హక్కు, మనల్ని మనం బలపరుచుకోవటం రెండూ లైంగిక సంతృప్తికి అవసరమనే నమ్మకాలను సూత్రాలుగా పరిగణించే శృంగార కల్పన మనకి అవసరం. అటువంటి శృంగార భావన మనల్ని ఒంటరితనం నుండి, పరాధీనత నుండి కమ్యూనిటీ వైపు తీసుకెళ్తుంది. మన లైంగిక వాంఛలని స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోగలిగే ప్రపంచంలో మనల్ని బలపరిచి, మన ఎదుగుదలకి తోడ్పడే లైంగిక ఆచరణని ఎంచుకోవటం తేలికవుతుంది. అవి విశృంఖలత్వం కావచ్చు, బ్రహ్మచర్యం కావచ్చు, ఒక స్థిరమైన లైంగిక అస్తిత్వం కావచ్చు లేక సెక్స్‌, జాతి, వర్గం, లైంగిక ధోరణితో సంబంధం లేకుండా ఆయా వ్యక్తులతో సంబంధాలను బట్టి కలిగే కోరిక కావచ్చు. లైంగిక విముక్తి ఉద్యమం రావాలంటే లైంగికత గురించి రాడికల్‌ స్త్రీవాద చర్చ మళ్ళీ ప్రారంభం కావాలి.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.