నంబూరి పరిపూర్ణ గారిని నేను కలిసింది రెండేసార్లు! అదీ ఈ మధ్యనే. సౌదా ‘రామాయణం’ సినిమాలో కైకసి పాత్ర చేస్తరేమో అడగడానికి వస్తమని వారబ్బాయి అమరేంద్ర గారికి చెప్తే, హైదరాబాద్ వస్తున్న అమ్మను తీసుకుని, వచ్చేవారం రండి అన్నరు ఆయన. నేనూ, సౌదా వెళ్ళినం. ఓ రెండు గంటలు
ఉన్నమనుకుంట ఆవిడ దగ్గర. పరిపూర్ణ గారి కూతురు, రచయిత్రి శిరీష గారు కూడా ఉన్నరపుడు మాతో. సౌదా సినిమా గురించి చెప్తే నిబద్ధ విద్యార్థినిలా విన్నరు పరిపూర్ణమ్మ. అడిగి అడిగి తెలుసుకున్నరు కైకసి గురించి, సినిమా థీమ్ గురించీ. ఎక్కడా ఉత్సాహం తగ్గకుండా రెండు గంటలు నిముషాల్లా గడిచినై… ‘అన్నేళ్ళ వయసులోనూ’ అనే మాట వాడటం లేదు నేను. పరిపూర్ణ గారి విషయంలో ఈ స్పేస్ ఫిల్లర్స్ అవసరం లేదు. నిత్య సత్య కమ్యూనిస్టు ఆమె. వేయి పూల వికసింతకూ, నూరు ఆలోచనల సంఘర్షణకూ హృదయపు లోగిలి సతతమూ తెరిచే ఉంచిన క్రాంతికారిణి ఆమె.
విద్యార్థి దశలో పోరాటాల గురించి తలచుకుని ఎంత కళ్ళ నిండుగా వెలుగులతో చెప్పారో… సౌదా రామాయణం సినిమా ప్లాట్ గురించి, రావణ బ్రహ్మ, కైకసి గురించి చెప్తే అంతగా అబ్బురపడుతూ విన్నరు. కొత్త విషయాల పట్ల ఆమె జిజ్ఞాస అపూర్వం అనిపించింది. నిజానికి కొన్ని దశాబ్దాల పాటు కమ్యూనిస్టుగా ఉన్నవారు అతి సులువుగా పుక్కిటి పురాణాలు అని కొట్టి పడేస్తరు. ఆవిడ అట్ల లేరు. చాలా మర్యాదగా, డెమోక్రటిక్‌గా ఉన్నరు. మనుషుల పట్ల ఆమె వాత్సల్యానికి ఆవిడకు ఎప్పుడూ ఏ భావజాలమూ అడ్డు రాలేదు అనిపించింది. ‘వయసు రీత్యా సినిమా చేయలేను బాబూ’ అన్నరు. మేము నిరాశపడ్డం కానీ అర్థం చేసుకున్నం. మొన్న, ఆవిడ స్మృతుల తలపు సమయాన అమరేంద్ర గారు అన్నరు ` మీరు అమ్మను కొంచెం ఒప్పించవలసింది అని. ఎప్పుడో ఆవిడ చిన్నప్పుడు ప్రహ్లాదుడుగా నటించారు, ఇప్పుడు కైకసిగా చూసి ఉండవలసింది అన్నరు. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని పాత్ర చేసి, విష్ణు వైరి రావణుడి తల్లి పాత్ర చేయడమా అని చమత్కరించారట కూడా పరిపూర్ణమ్మ. అది కేవలం చమత్కారమే. ఎందుకంటే సామాజిక జీవనంలోని విభిన్నత, వైవిధ్యం, భావాల సంఘర్షణ, ఆ ఫిక్షన్ లోంచి పుట్టే చలనశీలతా అన్నీ ఆవిడకు తెలుసు. ఆవిడ అన్నింటి సంగమం.
నేను ఆవిడను కలిసిన రెండు సందర్భాలలోనూ పాటలు అడిగి మరీ పాడిరచుకున్న. విద్యార్థి దశలోని ఉద్యమ గీతాలు సహా మల్లీశ్వరి సినిమాలో భానుమతి పాట, రాజమకుటంలో లీల పాటా పాడారు. ఏ పాట పాడినా అదే తన్మయత్వం. మనసు పెట్టి చేసే పని ఏదైనా అందమే. అట్లా ఆవిడ అద్భుత సౌందర్యశీల. కైకసి పాత్రకు ఆవిడ ఎందుకు అంటే సౌదా అన్నడు నాతో, ‘‘ఆ కళ్ళలో తీక్షణత, ఆ మోములో ప్రసన్నత… అచ్చు మన మూలవాసిలా, మన దక్షిణ భారతదేశపు ఇంట్లో తల్లిలా ఉన్నరని’’.
జోహార్ నంబూరి పరిపూర్ణమ్మా! మమ్మల్ని వదలకండి. మీ జీవితమే ఒక స్ఫూర్తిగా మా మెదడు కొసళ్ళకు నిప్పులు అంటుతూనే ఉండాలి. రాసరికపు జిత్తుల, రణతంత్రపుటెత్తులలో పడిÑ కన్సూమరిజమూ, కేపిటలిజపు వలలో ఇరికిÑ ఎడమన విసిరే కుడి, కుడిని కసిరే ఎడమల రందిలో మునిగిÑ కులాల కంపూ, మతాల మత్తులో జోగిÑ అస్తిత్వాలా, విశ్వజనీన సమభావమా అనే మీమాంసలో మునిగి… కకావికలం అయ్యే నిన్నటి`రేపటి సంధికాలాల మనుషులమైన మా బోంట్లకు మీరు ‘వెలుగుదారి’. లవ్యూ!!