నంబూరి పరిపూర్ణ గారితో గానీ, ఆవిడ రచనలతో గానీ నాకు ప్రత్యేకమైన పరిచయం మొన్నీమధ్య వరకూ లేదు. కొన్నేళ్ళ క్రితం వరకూ తెలుగు సాహిత్యంతో క్షీణించిన నా సంబంధం మెల్లిమెల్లిగా తిరిగి బలపడుతున్న తరుణంలో ఒక అవకాశం దొరికింది ఢల్లీి సాహితీ వేదికతో 2018`19లో ఏర్పడిన పరిచయం వల్ల. ‘అమరేంద్ర’గారి పేరుతో దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా పరిచయం ఉంది నాకు. ఆయన పాటించే
డిసిప్లిన్డ్ లైఫ్ గురించి చాలా ఏళ్ళ క్రితమే విని అబ్బురపడ్డాను. అయితే ఆయనతో పరిచయం కలుగుతుంది అన్న కనీసపు ఊహ కూడా లేదప్పుడు.
దాసరి శిరీష గారితో ప్రత్యక్ష పరిచయం ఉన్నా ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే నేను వెళ్ళి మరో ప్రపంచంలో పడడంతో, ఆ విత్తనాలు సహజంగానే శుష్కించిపోయాయి.
ఒకరోజు ‘మా అమ్మ’ అంటూ పరిచయం చేశారు అమరేంద్ర గారు.
ఆవిడకి అప్పటికి 89. వినికిడి సామర్ధ్యం కొద్దిగా తగ్గుతోంది. నా ఇంటిపేరు వినగానే, ‘‘బందా కనకలింగేశ్వర రావు…’’ అంటూ ఆవిడ కళ్ళు వెలిగాయి. తర్వాత మరోసారి కనిసినప్పుడు నన్ను చూసిన కాసేపటికి, ‘‘గుత్తి వంకాయ కూరోయి బావా…’’ అంటూ ఎవరూ అడగకుండానే, ఏదో ఆత్మీయమైన జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటున్నట్లు, ఆ పాట పల్లవిని ఆలపించారావిడ! అవన్నీ చిన్న చిన్నవే అయినా గుర్తుపెట్టుకోవడానికి నాకు మిగిలిన అమూల్యమైన జ్ఞాపకాలు. ఒకరోజు అమరేంద్ర గారు, ‘‘వెలుగుదారుల్లో…’’ని ఇంగ్లీష్‌లోకి చేద్దామనుకుంటున్నాను, మీరు సహకరిస్తారా? అంటూ అడిగారు. వెంటనే ఒప్పుకొన్నాను.
అది మొదలు, రోజూ పొద్దున్నే 5:59కల్లా (క్షణం అటూ ఇటూ కాకుండా) ఫోన్ మ్రోగేది. నేను 5:45 కల్లా కంప్యూటర్ ముందు సిద్ధంగా ఉండి, అటెండ్ చేసేవాడిని. ఒక గంటన్నరా, రెండు గంటల సేపు, లైను అవతలివైపు నుంచి ఆయన ఇంగ్లీష్‌లో డిక్టేట్ చేయడం, ఇవతలివైపు ఇయర్ ఫోన్స్ ధారినై నేను కీబోర్డ్‌ని టకటకలాడిరచడం! సరైన అర్ధాన్ని స్ఫురింపజేసే ఇంగ్లీష్ పదాలతో ఒక్కొక్క వాక్యాన్నీ అమరేంద్ర గారు కూర్చి చెప్పడం, నేను టైప్ చేయడం. ఈ క్రమంలో ఎన్నో ఎనెక్డోట్లు, (ఈ పదం ఒకసారి చెక్ చేయండి) చెణుకులు, ప్రపంచపు తీరుతెన్నుల మీద ఆయన అందించే కొత్త కొత్త ఱఅంఱస్త్ర్‌ష్ట్రం, క్లుప్తమైన, అప్రాప్రియేట్ అయిన పదాల కోసం అన్వేషణ, ఇలాంటివన్నీ షరా మామూలు వ్యవహారాలుగా జరిగేవి. ఆరేడు వారాల కాలంలో అనువాదం పూర్తయింది.
అప్పుడు పరిపూర్ణ గారితో ‘‘పరిచయం’’ మరింత విస్తృతమైంది. నా మనస్సులో వారిపట్ల గౌరవం కొత్త ఎత్తులకి ఎగబాకింది. ఏడెనిమిది దశాబ్దాల క్రితం, చెప్పుకోదగిన దన్నులేవీ లేని తన ప్రపంచంలోకి అడుగుపెట్టి, పువ్వు పుట్టగానే పరిమళించిన చందంగా తనకు స్వతఃసిద్ధంగా అబ్బిన నైపుణ్యంతో, కళాభినివేశంతో బాలతారగా వెండితెర మీద వెలగడం ఒక ఫీట్ అనుకుంటే, ఆ ఫీట్‌ని పరిపూర్ణగారు ఎంతో అలవోకగా చేపట్టి సమర్ధవంతంగా నిర్వహించారన్న మొదటి అద్భుతమూÑ చిన్నప్పటి నుంచే విశ్లేషణాత్మకమైన ఆలోచనా ధోరణికి అలవడి, పగటిని పగలు అనీ, రాత్రిని రాత్రి అనీ గుర్తించినంత స్పష్టంగా సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక విషయ పరిజ్ఞానాలను ఔపోసన పట్టిన వైనమూ, తన దృష్టికి వచ్చిన ఏ సమస్యకూ పరిష్కారాన్ని వెదక్కుండా ఉండలేని ఆవిడ పట్టుదలాÑ
ఆనాటి సగటు యుక్తవయసు మహిళలందరూ చదువో, ఉద్యోగమో, సంసారమో అంటూ జీవితాలని స్ధిరపరచుకునే దశలో, అటు ఉద్యమానికి, ఇటు సంసారానికి చెందిన తలకు మించిన బాధ్యతలని నిర్వహించుకొస్తూ, జీవితాంతం తోడంటాడని నమ్మిన సహచరుడు రంగు మార్చుకొని, తనను నడిసంద్రపు నావను చేసి, తను ఎంచుకున్న ప్రవాహంలో కలసినప్పుడు పరమ ధైర్యంగా, సహనం`స్వావలంబన`స్వాభిమానాలతో, వ్యక్తిగత దైన్యాలని పళ్ళబిగువున భరిస్తూ తన బిడ్డలకీ, చుట్టూ ప్రపంచానికీ ఆదర్శవంతంగా నిలిచేలా తన జీవితాన్ని స్థితప్రజ్ఞంగా తీర్చిదిద్దుకొన్న విధమూÑ
…ఈ అద్భుతాలన్నీ పొందుపరచుకున్న ఆవిడ విశిష్ట జీవనసౌరభాన్ని అమరేంద్ర గారితో కలిసి మోస్తూ ప్రపంచానికి చేరవేసే పవనలేశంగా మారినప్పుడు, ఆ అదృష్టానికి మురిశాను.
తర్వాత్తర్వాత ఆ విలక్షణ జీవనగాథలోని భాగాలు గుర్తొచ్చినప్పుడల్లా కాసేపు బాధానందాల తర్వాత, ఆవిడకు గౌరవాన్విత నమస్కారాలూ మనసులోనే చెప్పుకునేవాణ్ణి. ముదిమిని లెక్కే చేయకుండా, అత్యంత ఊహాతీతంగా ఇప్పటికి కూడా ఆవిడ చేపడుతున్న రచనా వ్యాసంగాన్ని గమనించి, తన రొటీన్‌తో ఆవిడ ఎందరికి ఆదర్శవంతురాలయ్యారో కదా అన్న వాస్తవపు ఎరుక కలిగేది.
ఇలా పరుగెడుతున్న రోజుల మధ్య ఉన్నట్టుండి, ఆవిడ మరి లేరన్న వార్తా చేరింది.
ఆవిడతో ప్రత్యక్ష పరిచయమున్న వారికీ, ఆవిడ రచనలు చదివి, తద్వారా ఆవిడ పట్ల గౌరవ మర్యాదలు ఏర్పరచుకొన్న వారికీ ఆవిడ గురించి నాలుగు మాటలు రాయడం సులభం కావచ్చు. ఆవిడ గురించి వింటున్న కొద్దీ, స్వయంగా ఒక దీపమై, తరతమ భేదరహితంగా తన ప్రపంచంలోని వారందరికీ సమానంగా వాత్సల్యాన్నీ, మార్గదర్శకత్వాన్నీ అందించిన ఆవిడ వైనాన్ని తెలుసుకొంటున్నకొద్దీ, క్షణక్షణానికీ కాంతివేగంతో వ్యాపిస్తున్న ఆవిడ వ్యక్తిత్వ కాంతికి అక్షర సుమాంజలులు అర్పించడానికి అసలు నాకు అర్హతే లేదేమోననిపించింది. ఎంచుకున్న బాటలో నిర్మలంగా, నిర్ద్వంద్వంగా ఆవిడ నడచిన తీరుకి, మనఃస్ఫూర్తిగా కృతజ్ఞతాంజలులు.
సార్థక నామధేయురాలై, కీర్తిపతాకాల రెపరెపలమీద మోజు లేకుండా, తను ఏర్పరచుకొన్న నియమాల చుట్టూ జీవితాన్ని అల్లుకొని, చివరి నిమిషం వరకూ దారుల్లో వెలుగులు విరజిమ్ముతూనే నిష్క్రమించిన పరిపూర్ణగారి జీవితానికి అనంతకోటి ప్రణామాలు.
తల్లి మీద ఆపేక్ష బిడ్డలకు సహజం. కానీ, తల్లి తనకే కాదు, ‘‘ప్రపంచానికే తల్లి’’ అన్న ఎరుకను కనుగొన్న బిడ్డలకు ఆవిడ భౌతికాస్తిత్వం మరుగైనా పెద్ద మార్పు ఉండదని నా నమ్మకం. ఆవిడ మాటలు, చేతలు, రాతలు, పాటలు, అధిరోహించిన శిఖరాలు, ప్రపంచానికి ఆవిడ పంచిన వాత్సల్యం, సకారాత్మకమైన ప్రోత్సాహం, మేరునగసమానంగా ఎదిగిన ఆవిడ వ్యక్తిత్వం, ఆ బిడ్డలతో బాటు ఎన్నో జీవితాలకి స్ఫూర్తిని పంచుతూనే ఉంటాయి… నిరంతరంగా.