ప్రతి చోటా
నాకు ఎదురయ్యే ప్రశ్న
సహనానికి పరీక్షలా
ఎంతటి కఠిన సమయాల్లోనైనా
ఒక అక్షరం కూడా
తారుమారు కాని ప్రశ్న
సభలో, సమావేశంలో
పరిచయం లేకపోయినా
అడిగే ప్రశ్న
నా విద్యార్హతలు పెరిగినా
ప్రశ్నించే స్థాయిలో మార్పు లేదు
ప్రశ్న కూడా మారడం లేదు
కులమతాలజి
ఐక్యతారాగం
ఈ ప్రశ్నలోనే కనిపిస్తుంది
ఎల్లలు దాటినా
లిపి లేని భాషలో సైతం
బలంగా వినిపిస్తున్న ప్రశ్న
జాతీయ వేదికైనా
అంతర్జాతీయ వేదికైనా
అదే ప్రశ్న ఎదురౌతోంది
ముళ్లకిరీటం లాంటి ప్రశ్న
నా ఉనికిని విస్మరిస్తూ అడిగే ప్రశ్న
నేను కుంచించుకు పోయే ప్రశ్న
అదే మీ నాన్న ఎవరు ?
నీ భర్త ఏం చేస్తాడు ?
పిల్లలెందరు ?
ఇవి మా అన్నను అడగని ప్రశ్నలు
తమ్ముడిని ప్రశ్నించరు
అక్క, చెల్లమ్మలకే ప్రత్యేకం