సమాజంలో పరివర్తనొస్తే `
మరి స్త్రీలెందుకింకా తెరల వెనుక?
అదృశ్యంగా పురుషుల చాటుగా?
గొంతెత్తి అరవాలంటే భయం వాళ్ళకి
వాదనలు చేస్తే వేస్తారు గయ్యాళులన్న ముద్ర!
ఆఫీసుల్లో మొగవాళ్ళదే పెత్తనం
ప్రమోషన్లలో వారిదే పైచేయి
సినిమా రంగంలో హీరోలకే పెద్ద మొత్తాలు
ఎంత చక్కని అభినేత్రి అయినా
గుర్తింపు మేల్ యాక్టర్ల తర్వాతే
సాహిత్య రంగంలోనూ కానరాదు వ్యత్యాసం
స్త్రీవాద రచయిత్రులంటే చులకన భావం
ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను
మంటగొల్పుతున్నారన్న ఆరోపణ!
మహిళలు గొప్ప రచనలు చేస్తే
సందేహిస్తారు వారి ప్రతిభాపాటవాలను
పతి దేవుళ్ళు రాసిస్తే తమ పేరు మీద
ప్రచురించుకున్నారన్న అపవాదులు!
అంగాంగాలను అందచందాలను ప్రదర్శిస్తూ
అవార్డులు తెచ్చుకుంటారన్న నిరాధార నిందలు!
ఇక మహిళా సాధికారత అయ్యిందా సఫలం?
గ్రామాల్లోకి చొచ్చుకు పోయిందా?
దిగువ మధ్యతరగతి మగువల
బతుకులు మారాయా?
అట్టడుగు వర్గాల అతివల మాట?
ఇంటా బయటా చాకిరితో సతమతమవుతూ `
తాగొచ్చి కొట్టే మొగుళ్ళ ఆగడాలకు బలవుతూ `
వారి వ్యధల కతలు ఎప్పటికి సుఖాంతమయ్యేను?
సమానత్వం చేతల్లో కనపడదు!
మార్పు మాటలకే పరిమితం!