కారణాలేవైతేనేం కల్లోలాలేవైతేనేం
కన్నీళ్ళెప్పుడూ మావే
జాతులేవైతేనేం జగడాలేవైతేనేం
జరుగుతున్న ఘోరాలు మా పైనే
కాష్ఠం అంటించింది మీరైతే
కాలుతున్నది మేమే
మీ అహంకారం ముందు మీ అభిజాత్యం ముందు
మా ఆత్మాభిమానం మంటగలుస్తూనే ఉంది
మీ పురుషత్వమే ఆయుధమైన చోట
మా శరీరాలూ మనస్సులూ గాయపడుతూనే ఉన్నాయి
మీ చేతలు విషం కక్కినప్పుడల్లా
మా కళ్ళు రక్తాశ్రువులను వర్షిస్తూనే ఉన్నాయి
బట్టబయలైంది మా నగ్న దేహాలేనా
మీ రాక్షసత్వపు అసలు రూపాలు కూడా
సిగ్గూ బిడియం చితికి పోయింది మాదేనా
ఛాతీలు విరిచి సాధించామనుకుని విర్రవీగి ఊరేగుతూ
ప్రపంచానికి పచ్చిగా దొరికిపోయిన మీ దొరతనానిది కూడా
అమానవీయంగా అత్యంత హేయంగా
మా దేహాలు మీ యుద్ధ క్షేత్రాలవడమే అమానుషం
వెలుగు పువ్వుల కాగడాలమై స్త్రీలందరి కోసం
మేము శాంతి ప్రదర్శన చేస్తుంటే
కొత్త వేకువ కోసం దిక్కులు పిక్కటిల్లేలా
మా ఆర్తనాదాలు వినిపిస్తూంటే
చూడలేని వినలేని ధృతరాష్ట్ర సభాసదులయ్యారు
మీరు వేటాడుతున్న నేలలో సగం హక్కుదారులం
మీరు పోరాడుతున్న హక్కులకు సగం వాటాదారులం
మీరు గంగవెర్రులెత్తుతున్న జాతిని
అసలు సృష్టించినవాళ్ళం
పురుషత్వమే వీరత్వమనుకుంటే
మాతృత్వానికి మంటపెట్టడం మాకో లెక్కా ?
జాతి వైరంలో పావులైనా
జాతి నేరంలో పాపులైనా
మా స్మృతిలో ముద్రించుకుపోయిన మీ పాశవికత
ఏ శిక్షాస్మృతిలోనూ ఇమడనిది
మీ చర్మాలు ఒలిచి సిగ్గిల్లిన మా శరీరాలపై కప్పినా
ఆ శిక్ష ఎంత మాత్రమూ సరిపోనిది
మంటను మీ కడుపులు నింపే వంట కోసం తప్ప వాడని వాళ్ళం
మీరేమిట్రా నిలువనీడను కాల్చడానికే వాడతారు?
యుగాలు మారినా మీరు మారరేంరా?
మీ మలాన్ని చేతుల్తో కడిగి చెంగుల్తో తుడిచి
ఎత్తుకుని పెంచిన వాళ్ళం
మీ మెదళ్లలో పేరుకుని మేటవేసిన రక్కసి మురికిని
దేనితో కడగమంటారు?!