ఆఫ్ఘనిస్తాన్ లో –
ఆడవాళ్ళకు రక్షణ లేదు
వారి తరపున నిలబడి మాట్లాడేవారు లేరు
వంటరితనంతో కృంగిపోతున్న
వారికి ఓదార్పు కరువైంది
మొదట బాలికల చదువు మీద
మితిమీరిన ఆంక్షలు
బడులకు వెళ్ళకుండా కట్టడులు
చదువుకోవాలని వారు పడే ఆరాటానికి
అడ్డుగోడలు కట్టే అధికారులు
ఇక ఇప్పుడు తాలిబాన్ తమ కనుకూలంగా మార్చుకున్న షారియా చట్టాన్ని ముందుకు తెచ్చింది
వివాహేతర సంబంధాలున్న అతివలను ప్రజల ముందు
వీధుల్లో రాళ్లతో కొట్టి, కొరడా దెబ్బలతో గాయపరిచి
చంపడాన్ని మళ్ళీ ప్రవేశ పెడుతున్నది
అది అల్లా ఆదేశమంటున్నది
మహిళా లాయర్లు న్యాయాధిపతులు
ఉండటానికి వీల్లేదంటున్నది
తమ దేశంపై పాశ్చాత్య ప్రభావాలను వ్యతిరేకిస్తున్నది
తొంభైల దశకాల్లోని అంధకారబంధురమైన
తాలిబాన్ ఉన్మాద రాజ్యం పాలనను
తిరిగి తెచ్చే దురాలోచన చేస్తున్నది
అంతర్జాతీయ సమాజాలు మౌనం వహించాయి
ఇదేమి న్యాయమని ప్రశ్నించే దేశం కానరాదు
అందుకే తాలిబాన్ హద్దులు మీరుతున్నది!
మగువల మానవ హక్కులను ఘోరంగా ఉల్లంఘిస్తున్నది!
ఎవరికీ సంజాయిషీ ఇవ్వనఖర్లేదని విర్రవీగుతున్నది!