కబుర్ల చెట్టు పైన, పాటల కొమ్మ మీద కూచుని కమ్మని రాగాలు పాడే ఒక పాల పిట్ట ఒక ఉదయాన తలవాల్చేసి ఇక గొంతు విప్పదు. మరిక పాట పాడదు. చెట్లన్నీ ఏడుస్తాయి. ఆకాశం మూగబోతుంది. చుట్టూ నల్లని మౌనం ఆవరిస్తుంది.
పాల పిట్ట స్వేచ్ఛగా ఎగురుతూ చుట్టూ చూస్తుంది. ‘‘నేనిక ఎంతో ఎత్తుకు ఎగురుతాను. నాకే నొప్పీ బాధా లేదు’’ అని సంతోషంతో కేరింతలు కొడుతూ కిందికి చూసి విషాదంగా తనను తాను చూసుకుంటుంది. తన ప్రపంచం ఇప్పుడు వేరని గ్రహించి, కింద తన కోసం కన్నీళ్ళు రాలుస్తున్న వారిని చూసి దయతో ‘‘నేనెక్కడికీ వెళ్ళను ఇన్ని బంధాలు తెంచుకుని, ఇంత ప్రేమను వదులుకుని. సాయీ అని మీరు ప్రేమగా పిలిస్తే మీ గుండెలో పాటనై పరిగెత్తుకు వస్తాగా! మీ చేతిలో దీపమై వెలుగుతాగా!’’ అని మొహం తిప్పుకుని మేఘాల్లోకి మాయమై పోతుంది.
సాయి పద్మ పేరు నాకు 2000లో పరిచయం. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. నిడదవోలు మాలతి గారు తన కథల అనువాదం పనులు వైజాగ్‌లో ఉండే సాయి పద్మ అనే అమ్మాయి చూస్తుందనీ, వీల్ చైర్‌లో ఉండి బోలెడు పనులు నిర్వహిస్తుందనీ చెప్పారు.
2012లో నేను ఫేస్‌బుక్‌లోకి వచ్చినపుడు మొదట కలుపుకున్న కొద్ది స్నేహాల్లో సాయి పద్మ ఒకరు. ఎంత త్వరగా స్నేహం కలుపుకుంటుందంటే, నా భర్త ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో పని చేస్తాడని తెలిసి, వెంటనే ఉత్సాహంగా తనని స్నేహితుల్లో కలుపుకుని ఆ ఫీల్డ్‌లో తనకి ఉన్న సందేహాలన్నీ అడిగి తెలుసుకుంది.
‘తమ్మి మొగ్గలు’ బ్లాగ్‌ని నిన్న మొన్నటి వరకూ రాస్తూనే ఉంది. ‘వాకిలి’ మాగజైన్‌లో తను రాసిన ‘‘రంగ పిన్ని ఆకాశం’’ కథ నాకు చాలా నచ్చిందని మెసేజ్ పెడితే ఫోన్ నంబర్ అడిగి తీసుకుని ఎంతసేపు మాట్లాడిరదో! ఇద్దరికీ ఇష్టమైన టాపిక్ సంగీతం కావడంతో దాని గురించిన కబుర్లు దొర్లేవి. ఒక్కో సమయాన ఫోన్‌లో పాటలు అటూ ఇటూ ప్రవహించేవి. వ్యక్తుల గురించి ఎన్నడూ తను మాట్లాడి ఎరుగదు.
ఇవన్నీ పక్కనబెడితే, సాయి పద్మ ఒక వ్యక్తిగా, ఒక నమూనా శక్తిగా నాకెప్పుడూ అబ్బురమే. అతి కష్టం మీద నిలబడి నాలుగడుగులు వేసి ఆమె నవ్వే నవ్వు నాకొక టానిక్. కోటి కాంతులు మెరిసే ఆ నవ్వు చేయి పట్టి నడిపించే ఒక ధైర్య దీపిక. నిజానికి ఆమె శారీరక స్థితి అందరూ భరించగలిగేది కానే కాదు. కానీ, అది ఆమె పట్టించుకున్నట్లే కనపడదు. అమ్మ కథలు చెప్తూ, తన భుజం ఆసరాగా ఇచ్చి నిలిపిన ఆడపిల్లల గురించి చెప్తూ, బాధని నవ్వు మాటున పాతేసి, ‘పదండి, కలిసి నడుద్దాం’ అంటుంది.
జీవితంలో అన్నీ ఉన్నా, ఏదో ఒక శూన్యాన్ని సృష్టించుకుని బాధపడే వాళ్ళు బాధపడుతుంటే, వీల్ చైర్ వాడుకదార్లకు జరిగే పోటీలకు పోయి ట్రోఫీలు తేవడంలో పద్మ బిజీగా ఉండేది. చుట్టూ ఉన్న మనుషుల మీద ఫిర్యాదులతో కొందరు బతికేస్తుంటే, పదిమంది ఆడపిల్లలని పోగేసి ‘‘పదండి, బతుకులు బాగు చేసుకుందాం’’ అని అడుగు కలిపే పనిలో నిమగ్నమై ఉంటుంది.
అంతటి శరీర కష్టాన్ని మోస్తూ కూడా దాన్ని ఎన్నడూ లెక్కచేయని పద్మ, ఒక ఉదయాన సడన్‌గా బై చెప్పి వెళ్ళిపోయింది. పద్మ పంచిన చైతన్యం, పద్మ ఇచ్చే ధైర్యం, పద్మే స్వయంగా ఒక మోటివేషన్ స్టోరీగా మారి నడిపే మొక్కవోని తనం ఆమె చుట్టూ ఆమె నీడలో పరుచుకుని ఉన్న మిత్రులు ఎన్నడూ వృధా కానివ్వరు.
ఆమె ఒక కరదీపికై చూపిన దారిని ఎవరూ అంత తేలికగా విడిచిపోరు. పద్మ కన్న కలలు చిన్నవేం కాదు. అందంగా కనపడే ఆ కలల వెనుక పిల్లల భవిష్యత్తు ఉంది. వారు గొప్ప గొప్ప స్థానాలకు చేరాలనే ఆమె తపన ఉంది. ఆమె ఆశయ సాధనలో భాగమైన వారికి వాటి విలువ బాగా తెలుసు. కళ్ళముందు లేకపోయినా, కనపడని శక్తిగా పద్మ చూపే వెలుగు దారిలో వారంతా పయనం సాగిస్తారు. గమ్యాన్ని చేరుకుంటారు. ఆ పిల్లల ముఖాన ఒక రోజు సాయి పద్మ చెరగని చిరునవ్వై విరగబూస్తుంది.
సాయి పద్మ ఒక వ్యక్తి కాదు, దీపం, ఒక వెలుగు, ఒక తపన, కలల తీరాన్ని చేరే ఒక పడవ, ఆ పడవకు చుక్కాని. ఆ పడవలో బయలుదేరి వెళ్తారు స్వాప్నికులు, ఆమె కన్న కలల్ని నిజం చేసేందుకు!
ఆ కలలు తీరాలు చేరతాయి. అదే కదా పద్మకి మనమివ్వగలిగే ప్రేమ. ఆ రోజు ఆకాశంలో ఒక వెలుగు పువ్వై నవ్వుతుంది… సాయి.