ఎలా ఉన్నావు? చివరికి, నీ కోరికనే నెరవేర్చుకున్నావు, నీవే ముందు వెళ్ళావు. దహన సంస్కారాల అనంతరం, అస్థికలు సేకరిస్తున్నప్పుడు నీ వెన్నెముకకి అమర్చిన టైటానియం రాడ్స్ చూస్తూనే అర్థమయింది, ప్రతి వేసంగిలో ఎందుకు అంటావో, ఎండాకాలం వచ్చేసింది ఆనంద్, ఈ రాడ్స్ తాలూకు వేడిని భరించాలి అని.
ఆ రాడ్స్‌ని అమర్చడానికి ఉపయోగించిన హుక్స్ మరియు రెండు అంగుళాల స్క్రూలు. అంత భరిస్తూనే ఎన్ని కార్యక్రమాలు చేశావు. ఆటలలో (రైఫిల్ షూటింగ్, వీల్‌చైర్ బాస్కెట్‌బాల్), పుస్తక పఠనంలో, కారు డ్రైవింగ్‌లో, ఈత కొట్టడంలో, పాటలలో, మాటలలో, సేవలో, చర్చలలో, కౌన్సిలింగ్‌లలో, కోరాలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంలో, నా కోరికను మన్నించి ప్యారడీ పాటలు కూర్చి పాడడంలో, చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో … అసాధ్యురాలివి. ఇన్ని చేయగలిగిన నీ విజయం వెనుక మంత్రం… ‘అవకాశాలను నీవే సృష్టించుకుని, ఆ నలుగురు ఏమనుకుంటారో అని పట్టించుకోకుండా నిరంతరం ధైర్యంతో ప్రయత్నిస్తూ సాధన చేసి సాధించుకోవడం’. అందుకే మరి నీవు ప్రాంతీయంగా, రాష్ట్ర, దేశ, విదేశాలలో అవార్డులతో,
రివార్డులతో కీర్తింపబడ్డావు. అది బి.బి.సి. ప్రకటించిన ప్రపంచంలో శక్తివంతమైన వంద మహిళలైనా, రోటరీ/లయన్స్ ఇంటర్నేషనల్ అయినా, 256 ూనజుRూజుూ స్ఫూర్తిదాయక మహిళలైనా, ఏది ఏమైనా అందరి ఎరుకలో ఇమిడావు.
నీ పరిధిలోకి వచ్చిన వారందరికీ ప్రేమని పంచావు, అభిమానాన్ని చవిచూపించావు, సమస్యలు పరిష్కరించావు, ఎప్పుడూ నిన్ను ప్రత్యక్షంగా కలవకపోయినా సరే కొండంత అండగా నిలిచావు. అందుకేనేమో నిన్ను ఆఖరి చూపు తనివి తీరా చూసుకోవడానికి ఎక్కడెక్కడినుంచో విమానాల నుండి వాలిపోయారు. ఇక మొబైల్‌లో మెసేజ్‌లు, ఎఫ్.బి.లో పోస్టులు కోకొల్లలు. వారందరికీ రిప్లై ఇవ్వాలంటే నాకు ఎంత సమయం పడుతుందో! ఇక నీ అభిమాన సంఘాలు, ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో సంస్మరణ సభలు/సమావేశాలు, మాట్లాడదామని మొదలుపెట్టి గొంతు మూగబోయిన వారెందరో. ఇక నిన్ను పెంచిన పిన్ని పరిస్థితి వర్ణనాతీతం. వీరూ వారూ అని లేరులే. కొందరి ఉక్రోషం ` ‘చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది’, ‘ఇంత తొందరగానా’, ‘అన్నీ అనుభవించాల్సిన సమయానికి వెళ్ళిపోవాలా’. కానీ, నీ ఆత్మీయుడిగా, అనునిత్యం నీవే నా ధ్యాస, నీవే నా శ్వాసగా బ్రతుకుతున్న నేను, శారీరక, మానసిక బాధని, వ్యధని, వేదనని అనుభవిస్తున్న నిన్ను కళ్ళారా చూశాను. శరీరం భరించే శక్తి తెలియకుండా క్షీణిస్తుంటే నీవు మాత్రం ఏమీ చేయలేవు కదా. నీకూ తెలియని స్థితి. అనాయాస మరణం అంటే నా అనుభవంలోకి వచ్చింది. అమ్మ, అత్తయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు, పెద్దమ్మ, పెదనాన్న మరణించడం చూడలేదు.
నీవు దాటిన రెండు గండాలు చూశాను. ఒకటవది, వీల్‌ఛైర్ లాక్ తీసుకుని, మొబైల్‌లో ఫోటోలు తీసుకుంటూ కంట్రోల్ తప్పి వాలు వైపుకి వెళ్తున్న వీల్‌ఛైర్ రాయికి తగలడంతో బయటపడ్డావు. రెండవది, ఇంట్లో వార్డ్‌రోబ్‌కి ఉన్న నిలువుటద్దం తలమీద పడడం. నేనే ఎందుకు నీ మరణం… అసలు ఎందుకు పరిచయం అయ్యాము? ఏమిటీ బంధం? ఎప్పటి బంధమిది? ఎప్పటివరకు? సమాధానం దొరకదు. దొరకని వాటి గురించి వెతకడంలో సమయం, శ్రమ పెట్టకుండా మన మానస పుత్రికలో/పుత్రులో (జెండర్ రహిత జీవాలు) మనం స్థాపించిన సంస్థలు అవినాష్ (మిల్లీ బాక్స్), బ్రేస్ ఎయిడ్, ఈకజెన్, గ్లోబల్ ఎయిడ్, నీ సంగీత, సాహిత్యాలను ముందుకు తీసుకువెళ్తాము. నీవు సంతోషించే సమయం చెప్పాలి, మన హామ్లెట్ పిల్లలు పది మంది టెన్త్ పరీక్షలు పాసయ్యారు. పై చదువులకు ప్లాన్ చెయ్యాలి. కొత్త ప్రభుత్వపు విధి విధానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
ఈసారి నేను ఒంటరిగా ఓటు వేసి వచ్చాను. ఆ రోజు, ఓ రోజు నీవన్న మాటలు గుర్తుచేసుకున్నాను. ‘‘ఆనంద్, ఈ సారి ఓటు వేయడానికి వెళ్ళేటపుడు, నేను నీ సహాయం తీసుకోను. నా త్రిచక్ర వాహనం వాడతాను. కావాలంటే నేనే నిన్ను దిగబెడతాను’’. ఉండి
ఉంటే ఎందరికో స్ఫూర్తినిచ్చేదానివి. అలాగే పలు విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నాము. పిల్లల కోసం, అవసరం ఉన్నవారి కోసం ఎన్నెన్నో ప్లాన్ చేసుకున్నాము. జంటగా పయనం అయ్యేవారము, ఇప్పుడు… నీ జ్ఞాపకాలతో ఒంటరిగా. అందుకే కాలాన్ని నమ్మకూడదు, చేయాల్సిన పనులు చేసేద్దాం అనేదానివి. ఇప్పుడు అవన్నీ నేను చేయాలి. నేను ఒంటరి కాదని చెప్పడానికేనా బోలెడు మంది మిత్రుల దగ్గర ఆనంద్‌ని చూసుకుంటామని మాట తీసుకుంది. నీ నిండా నేనే అని తెలుసు. నేను ప్రయాణాలలో నీకు రాసిన ఉత్తరాలు ఎంత అపురూపంగా దాచుకుని చదువుకునేదానివి. ఎంతో తృప్తితో మొహం వికసించిన కమలంలా ఉండేది. ఇవన్నీ చూడకండానే వెళ్ళిపోయింది అత్తయ్య. అయినా నేను నిన్ను ఒక పాపలా చూసుకుంటాను అన్న మాటతో తను ఎంత ఉప్పొంగిపోయిందో. అందుకే నిశ్చింతగా
ఉండగలిగేది. నిశ్చింతగా వెళ్ళిపోగలిగింది. మరి అమ్మమ్మ, నానమ్మ, అమ్మ కలిశారా? వాళ్ళతో నీవు మాట్లాడినా, వాళ్ళతో మా విషయాలే చెప్తావని తెలుసు. అక్కడ ఉన్నా నీ మనస్సు ఇక్కడే అని తెలుసు. అందరూ పంపిన మెసేజ్‌లు ఒకటే ‘రెస్ట్ ఇన్ పీస్’. ఇన్నాళ్ళూ పనిచేశావు, ఇక రెస్ట్ తీసుకో. మల్టీ టాస్కింగ్‌లు చేయకు.
ఓసారి, హ్యాండ్ క్రాఫ్టర్ నోట్ బుక్ ఇస్తూ ఇలా అన్నావు:
Dearest Nandu,
Many Master pieces Die in the brain
Sometimes
before they see the limelight
they deserve
This is for such chiseled wisdom
that your mind & soul possesses
Let me be the chosen friend
That reads it first…
Please start writing
With love & respect
Sai Padma
(14/01/2016)
నీవు కోరినట్లు రాస్తూ ఉంటాలే.
మనం రోజూ ఒక ముద్దు పేరుతో పిలుచుకునేవారిమి. నీవు నన్ను ఆఖరుగా పిలిచిన పేరుతో ముగిస్తా…
ఇప్పటికీ… ఎప్పటికీ… నీ.. చిట్టిముత్యాలు
–