`
నా పేరు జి.శిరీష. నేను ప్రస్తుతం ఔచీూ (సిరిపురం) కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మాది విజయనగరం జిల్లా, గజపతినగరం మండలంలోని కొత్త బగ్గాం గ్రామం. నేను బిఎస్‌సి (వీూజూ) చదువుకున్నాను.
మాది చాలా పేద కుటుంబం. మేము నలుగురు పిల్లలం. నా తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తారు. వాళ్ళు నన్ను చదివించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గ్లోబల్ ఎయిడ్ సంస్థ ద్వారా పద్మ మేడం, ఆనంద్ సార్ నన్ను చదివించారు.
నేను ఆరు నుంచి పదవ తరగతి వరకు గజపతినగరంలోని గ్లోబల్ ఎయిడ్ హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. ఆ తర్వాత గొట్లాంలోని గాయత్రి జూనియర్ కాలేజిలో ఇంటర్మీడియట్, విశాఖపట్నం ఎం.వి.పి.కాలనీలోని సమత డిగ్రీ పి.జి.కాలేజీలో బిఎస్‌సి (MSCS) చదివాను. నా చదువంతా గ్లోబల్ ఎయిడ్ సంస్థ ద్వారా పద్మ మేడం, ఆనంద్ సార్‌ల సహకారంతోనే కొనసాగింది. మా అమ్మ నాకు ఆరు సంవత్సరాల వయసప్పుడే చనిపోయింది. తర్వాత పద్మ మేడం నన్ను అమ్మలా చూసుకున్నారు. నేనేది చదివితే అది చదివిస్తానని భరోసా ఇచ్చారు. నా ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పేవారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో పద్మ మేడం నా వెనుక ఉండి నన్ను ముందుకు నడిపించేవారు. ఒక తల్లిగా, ఒక శ్రేయోభిలాషిగా ఉండి నాకు అండగా ఉండేవారు. నా కష్ట సమయాల్లో ఓదార్చేవారు. నేను ఏ విషయానికైనా భయపడితే ధైర్యం చెప్పేవారు. మంచి సలహాలు ఇచ్చేవారు. ఏ సమయంలో ఎలా చెయ్యాలి అని మార్గదర్శిగా నన్ను ముందుకు నడిపేవారు.
తాను ఒక మహావృక్షమై మమ్మల్నందరినీ, గ్లోబల్ ఎయిడ్ సంస్థనీ ముందుకు నడిపించేవారు. ఒక మహావృక్షం కింద పక్షులు ఎలా అయితే సేద తీరతాయో అలా పద్మ మేడం నీడలో చాలామంది ఉండేవారు. ప్రస్తుతం ఉన్న ఈ బిజీ ప్రపంచంలో ఎవరి జీవితంలో వాళ్ళు హడావిడిగా ఉంటారు. కానీ పద్మ మేడం మాత్రం తన జీవితాన్ని అందరికీ సహాయం చేయడానికే అంకితం చేశారు. తను వీల్‌చైర్‌లో ఉన్నప్పటికీ తన వైకల్యాన్ని పక్కన పెట్టి తన తెలివితేటలన్నీ ఉపయోగించి, పేదవారికి సహాయం చేయడం, టాలెంట్ ఉండి కూడా ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను చదివించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు.
అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు అంటారు. కానీ మా పద్మ మేడం మాత్రం అడగకుండానే అన్నీ ఇచ్చారు. పద్మ మేడం గురించి ఎంత చెప్పినా తక్కువే. నా జీవితాన్ని ఆమే ముందుకు నడిపించారు. అమ్మాయిలు అన్ని విషయాల్లో ముందుండాలని అనేవారు. పేదవారికి ఇంకా సహాయం చేయాలని, అందర్నీ ఇంకా చదివించాలని అనేవారు.
మా మధ్య పేగు బంధం లేకపోయినా నన్ను కన్నకూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు. తన ప్రేమ సాటిలేనిది.
తన ప్రేమ అమితం,
తన బంధం అద్భుతం,
తన ఓర్పు అలుపెరగనిది.
SHE IS LADY LEGEND..