నా పేరు భాషా. మాది మెంటాడ గ్రామం. నేను 2010వ సంవత్సరంలో ఈ గ్లోబల్ ఎయిడ్ సంస్థలో చేరాను. మొదటిసారిగా సాయిపద్మ మేడం గారితో ఫోన్‌లో మాట్లాడడం జరిగింది. ఆమె మాటల్లో పిల్లలంటే ఎంతో ఇఫ్టమని, సమాజానికి ఏదైనా సాధించాలని, ఈ సమాజంలో తనకు ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని, ఏదైనా చెయ్యాలనే భావన ఉన్న విషయాన్ని గ్రహించాను.
పాఠశాలలను నిలబెటట్టడం, వాటిని పునరుద్ధరణ చేయడం వంటివి ప్రభుత్వాలు చెయ్యాలి. కానీ పాఠశాలలు లేని గ్రామాల్లో వాటిని ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఆలోచనలు చాలా గొప్పవి. అలాంటి గొప్ప ఆలోచనలు చేసి పిల్లల్లో, మాలాంటి వాళ్ళలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు సాయిపద్మ మేడం. ఆడపిల్లలు ఎలా ఉంటారు, వారి గురించి ఎవరు, ఎలా ఆలోచిస్తారు అనే విషయాన్ని గ్రహించి, వాళ్ళ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని ఎప్పుడూ తపన పడుతూ ఉండేవారు. అందరూ బాగుండాలని కోరుకునే, ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధ తనదే అన్నట్లు భావించి దాన్ని తీర్చగలిగే గొప్ప మనస్సు ఉన్న వ్యక్తి, మహిళా శక్తి సాయిపద్మ మేడం.
డా.బిఎస్‌ఆర్ మూర్తి గారు, శ్రీమతి ఆదిశేషుల ముద్దుల కూతురైన సాయిపద్మ మేడం తాను పుట్టిన ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని, తాను పుట్టిన ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకురావాలనే ఆశయాలను, కోరికలను మా గ్లోబల్ ఎయిడ్ సంస్థ ద్వారా తీర్చుకున్నారు. పాఠశాలలు, హాస్టళ్ళు, వ్యవసాయం, స్కిల్ డెవలప్‌మెంట్, హెల్త్ క్యాంపులు, సోలార్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో నన్నూ భాగస్వామ్యం చేయడంతో పాటు, పదిమందికీ మంచి పని చేస్తున్నాం అనే భావన మా అందరిలో తీసుకొచ్చారు. మాలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే ఫోన్ చేసి ఎలా
ఉన్నావని అడిగి, జాగ్రత్తగా ఉండయ్యా అని ప్రేమతో పలకరించే గొప్ప మనసు మా మేడంది.
సాయిపద్మ మేడం ఆదర్శాలను, కోరికలను నిలబెట్టడానికి మేమందరం ప్రయత్నిస్తుంటాం. ఆనంద్ సార్, పద్మ మేడంలు మాకు ఏ ఏ కార్యక్రమాలు ఎలా చెయ్యాలో చెప్పి తల్లిదండ్రులుగా ముందుండి మమ్మల్ని నడిపించేవారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి మేడం మాతోనే ఉన్నారు, ఆమే మాతో చేయిస్తున్నారు అనేలా ఉండాలని, ఏదైనా ఆమెతోనే సాధ్యమయ్యేలాగా ఇకపై మా అందరి బాధ్యతగా ముందుకు సాగుతాం. ఎవరు అన్నారో నాకు తెలియదు కానీ, గొప్పవారిని ఆ భగవంతుడు ముందుగానే తీసుకుపోతాడు అంటారు కదా! అలా మా మేడంని మాకు కాకుండా చేశాడు ఆ దేవుడు. మా, నా జీవితంలో ఎవరికైనా ఒక గొప్ప స్థానం ఉంది అంటే అది మా పద్మ మేడంకు మాత్రమే సొంతం. ‘‘నా జీవితంలో మరువలేని గొప్ప వ్యక్తి, శక్తి పద్మ మేడం. పద్మం అంటే పువ్వు కాదు, మా అందరి జీవితాల్లో వెలుగులు నింపే దివ్వే అయ్యారు’’.
‘‘We miss you madam’’ `