విశాఖ సాయిపద్మ – అరణ్య కృష్ణ

కలల తెప్ప వేసుకొని బతుకు సముద్రం మీదకి లంఘించిన ధీరోదాత్త సాయి పద్మ!
కొంతమందిని కలిస్తే, వారితో మాట్లాడితే బ్రతుకు మీద ప్రేమ పుడుతుంది. ఒక్క కరచాలనం చాలు వాళ్ళు నీ సమస్త అస్తిత్వంలోకి చైతన్యాన్ని పంపుతారు. అలాంటి చైతన్య సముద్రం విశాఖ మిత్రురాలు సాయి పద్మ ఇవాళ మధ్యాహ్నం మరణించారని తెలిసినప్పుడు మనసు కకావికలమైపోయింది.

తనని తాను మూడు వందల మంది పిల్లలకి తల్లిగా భావించుకునే ఒక గొప్ప బాధ్యతాయుతమైన సామాజిక వేత్త ఆమె. సామాజిక ఉద్యమకారిణి, లాయర్‌, గాయని, కవి, రచయిత్రి… ఇలా ఎన్నో అంశాల్లో జీవితాన్ని సఫలీకృతం చేసుకున్న ధన్యజీవి సాయి పద్మ. ఆత్మవిశ్వాసానికి మరో పేరు సాయి పద్మ.
అల్లూరి సీతారామరాజు మీద రాసిన నా కవిత ‘అతడు నా స్వప్నం’ చదివిన సాయి పద్మ దాన్ని ఇంగ్లీషులోకి అనువదించడంతో ఆమె పరిచయమయ్యారు. పుట్టుకతోనే ఫిజికల్‌ ఛాలెంజ్డ్‌ పర్సన్‌ అయిన ఆమె చక్రాల కుర్చీ నుండే జీవితంలో ఎన్నో సాధించడం గురించి తెలుసుకొని చాలా ఇన్‌స్పైర్‌ అయ్యారు. ఆ సమయంలో ఆమె అమెరికా నుండి ప్రత్యేకంగా తెప్పించుకున్న క్యాలిపర్స్‌ తొడుక్కుని నిలబడడానికి, నడవడానికి విపరీతంగా శ్రమిస్తూ ప్రాక్టీస్‌ చేసేవారు. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం నన్ను కదిలించాయి, అబ్బురపరిచాయి. ఆ స్ఫూర్తితో ‘నువ్వొక జెండా’ అనే కవితని రాశాను. నేను నా మిత్రులెవరి మీదా కవితలు రాయలేదు ఒక్క సాయి పద్మ విషయంలో తప్ప. (ఆ కవిత నా కవిత్వ సంపుటి ‘‘కవిత్వంలో ఉన్నంతసేపూ…’’లో కూడా ఉంది. ఆ కవితని నేను మార్చి 8, 2016న ఆమెకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌ చేశాను. అప్పుడు ఆమె సాధన మీద నిలబడి ఉన్న ఫోటోని జత చేస్తూ, గొప్పగా ఇలా స్పందిస్తూ ఆ కవితని షేర్‌ చేశారు.
‘‘నన్ను నేను శిల నుండి శిల్పంగా మార్చుకోవాలన్న సంకల్పం మాత్రమే నాది. మిగతా క్రెడిట్‌ అంతా… నా చుట్టూ ఉన్న, నా భర్త, కుటుంబం, స్నేహితులు, బంధువులు, ముఖ్యంగా నా మూడు వందల మంది పిల్లలదే. నిజమే… వీళ్ళ కలలు, ఆశయాలు, ఆదర్శాలు మోస్తున్న జెండాని నేను. నా గురించి నేను రాసుకున్నా, ఇంత సూటిగా, చక్కగా రాయలేకపోయేదాన్ని అండీ… మీరు ఇవాళ నాకే కాదు, ఎంతోమంది కదలలేని శరీరాలకి, మనసులకి చలనం తెప్పించారు. ఈ అక్షరాలే చెకుముకిరాయి… థాంక్స్‌ చిన్న పదం… మనఃపూర్వక కృతజ్ఞతలు… ఇలా ఆలోచించే ప్రతి మనిషికీ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…!!’’
ఈ వాక్యాలు చదువుకున్న నా గుండె ఆనందంతో నిండిపోవడం నాకిప్పటికీ జ్ఞాపకముంది.
ఆ తరువాత ఆమెతో కొన్నిసార్లు మాట్లాడాను. ఆమె తన కథల్ని ఇంగ్లీష్‌లోకి చేసిన అనువాదాల గురించి కూడా మాట్లాడేవారు. నా కవిత్వ సంపుటి ‘‘కవిత్వంలో ఉన్నంతసేపూ…’’ మీద ఒక వివరణాత్మక సమీక్ష కూడా రాశారు. మొత్తం మీద అదొక మ్యూచువల్‌ అడ్మిరేషన్‌!
విశాఖ వెళ్ళినపుడు కలిసేవాడిని. చివరగా క్రితం సంవత్సరం మా పెద్దక్క విశాఖలోనే చనిపోయినప్పుడు మా అక్క, బావల బట్టలు కొన్ని బ్యాగుల్లో సర్ది, వాళ్ళింటికి తీసుకెళ్ళి ఎవరికైనా ‘నీడీ సెక్షన్స్‌’లో ఇవ్వండని ఆవిడకిచ్చాను. ఆవిడ చాలా సంతోషించి ‘ట్రైబల్‌ పీపుల్‌కి అందచేస్తానండీ’ అన్నారు. ఆవిడని చూడటం అదే ఆఖరుసారి. మరణం ఎవరికైనా తప్పదు కానీ కొందరు వెళ్ళిపోవడం మనం ఎప్పటికీ అంగీకరించలేం. మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సామాజికంగా ఎంతో విలువైన వ్యక్తి అయినప్పుడు, తనని తాను చైతన్యపు కాగడా వేసుకొని పర్వత శిఖరాగ్రాన వెలుగుతున్నప్పుడూ…!
సాయిపద్మకి నా వినమ్ర నివాళి!
నువ్వొక జెండా!
పక్షి ఎగరాలని కలలు కనదు
కానీ నువ్వు మాత్రం
నడవాలని కలలు కన్నావు
నడకలోనే కదా మట్టిస్పర్శ తగిలి
చెట్టులా భూమితో నీకూ అనుబంధమేర్పడేది
నడుస్తున్పప్పుడే కదా అరికాళ్ళపై
మొత్తం భారం మోపిన స్వదేహం మీద మమకారం పెరిగేది
నడిస్తేనే కదా శీతలమైన శరీరానికి చెమటలు పట్టి
చల్లగాలి హాయిగా ఒంటిని ప్రేమగా నిమిరేది
నడిచినప్పుడే కదా నీ జీవితం
నీ స్వంతం అని నమ్మిక కలిగేది
బహుశ అమ్మ పొట్టలోనే
ముణగతీసుకొని బజ్జున్నప్పుడే మడతలు పడ్డ కాళ్ళని
భూమ్మీద ఇంకా కూడతీసుకోక మునుపే
కాలం వేటగాడు కొట్టిన బాణం దెబ్బకి
జింకపిల్లలా ఎగిరిపడి వుంటావు
అయితేనేం గాయం నొప్పిని భరిస్తూనే
వేటగాడి బాణాన్ని నీ చేతులతోనే ఊడపెరుక్కుంటున్నావు
ఆదిమానవుడు చెకుముకి రాళ్ళతో ప్రయోగాలు చేసి
అడవులకి అగ్గిపెట్టగలిగినట్లు
నిస్తేజంగా పడివున్న కాళ్ళల్లో నిప్పు పుట్టించి
నిర్లిప్త అవయవాల్లో కొలిమి రాజేసి
దేహయంత్రానికి చురుకు తెప్పిస్తున్నావు
నువ్వు నడవాలన్న కల నిజమవ్వాలంటే
కాళ్ళ దగ్గర మొరాయించిన నాడీ వ్యవస్థని
చల్‌ చల్‌ గుర్రం అంటూ ఎలాగైనా ఉత్సాహపరచాలిగా
కుంచించుకుపోయిన వెన్నెముకని
తట్టిలేపి ఆత్మవిశ్వాసంగా నుంచోపెట్టాలిగా
అందుకే
వైకల్యం విసిరే సవాలుని పిడికిళ్ళతో స్వీకరించి
కలల తెప్ప వేసుకొని బతుకు సముద్రం మీదకి లంఘించావు
మోకాళ్ళకి కాలిపర్స్‌ తొడిగి
నిస్సత్తువైన నరాల్లోకి శక్తిని చొప్పిస్తున్నప్పుడు
ప్రాణాల్ని పలకరించే నొప్పితో నువ్వు స్వంతంగా వేసే అడుగులు
భూమండలం మీద వైకల్యాన్ని సవాల్‌ చేస్తున్న వ్యోమగామి
అడుగుజాడలు!
ప్రసవ వేదనని మించిన నొప్పితో
నీకు నువ్వే కొత్త జన్మనిచ్చుకుంటున్న తల్లివి
అమ్మతనంతో సంబంధం లేకుండా
నీకు నువ్వే పొత్తిళ్ళలో బిడ్డవి
…..
అక్కడ చూడు
కాలం బాణం దెబ్బ తగిలి కుప్పకూలిన వాళ్ళెవరో
నీ వంక ఆశగా చూస్తున్నారు
వెళ్ళి చేయందిస్తావు కదూ!
(విశాఖ సాయిపద్మకి ` ‘కవిత్వంలో ఉన్నంతసేపూ…’’ నుండి)
`

Share
This entry was posted in సాయి పద్మ ప్రత్యేకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.