సాయి పద్మ వికసించిన పద్మం – అనుశ్రీ మెండు

గ్లోబల్‌ ఎయిడ్‌ ఫౌండర్‌గా, సేవామూర్తిగా, ప్రేమమయిగా, పుస్తకాల పురుగుగా, గానకోకిలగా, న్యాయవాదిగా, ధైర్యం చెప్పే మనిషిగా సాయి పద్మ గురించి సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకోగలిగాను. ఆమె పోలియో వల్ల నడవలేరు. కానీ, మనిషిని మించిన పనులు చేస్తూ ఉండేవారు. ఆమె ద్వారా చాలామంది మహిళలు సాధికారత పొందారు.

ప్రపంచాన్ని చూడాలని, పుస్తకాలు, సోషల్‌ మీడియా ద్వారా మనుషుల్ని కలవాలని పనిచేస్తూ ఉండేవారు. తను చదువుకున్నవి, తనకు తెలిసినవి అందరికీ చెప్పాలని, అందరూ బాగా బ్రతకాలని కెమెరా ముందుకు వచ్చి కోరుకునేవారు.
కథల్ని, జీవితాల్ని, కళల్ని, కళాకారుల్ని మరియు ప్రయాణాలని ఇలా రకరకాల అంశాల మీద వీడియోలు తీస్తారని తెలుసుకున్నప్పుడు చాలా మందిలో ఉన్న న్యూనతా భావం చచ్చిపోవాల్సిందే. లావుగా ఉన్నామనో, ఆరోగ్యం పాడైపోయిందనో, నల్లగా ఉన్నామనో, పొట్టిగా ఉన్నామనో… తమలో తామే ఏదో ఒక వంకలు వెతుకుతూ, మనం చాలా పనులు చేయకుండా, ఉన్న సమయాన్ని ఎలా గడపాలో తెలియక సతమతమవుతూ ఉంటాం.
ఎదుటివారి మీద నిందలు వేస్తూ, మనం చేయవలసిన పనుల్ని వదిలివేస్తూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటాం. కానీ తన గురించి తెలిసిన వారు ఎవరైనా తమలో తామే ధైర్యం తెచ్చుకొని మనం ఏదైనా సాధించవచ్చని, ఏదైనా చేయడానికి అందం లాంటివి ఏమీ అవసరం లేదని, తన ద్వారా అందరికీ చాటి చెప్పారు. 52 ఏళ్ళ వయసులో కన్నుమూసినా, ఆమె చేసిన సేవలు, ఆమె ఆత్మస్థైర్యం మాత్రం ఆదర్శంగా నిలుస్తాయి.
సాయిపద్మ 1971లో విజయనగరం జిల్లా గజపతినగరంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. వాళ్ళిద్దరికీ పోలియో వ్యాక్సిన్‌ గురించి అవగాహన ఉన్నప్పటికీ అప్పటి రోజుల్లో ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం 90 రోజులు నిండిన పిల్లలకు మాత్రమే ఆ వ్యాక్సిన్‌ ఇవ్వాలి. కానీ తనకు ఒకటిన్నర నెల మాత్రమే కావడంతో వ్యాక్సిన్‌ను వేయించలేకపోయారు. అప్పటికే తనకు పోలియో రావటంతో కాళ్ళతో పాటు, గొంతు కూడా పోవడంతో తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసి, విదేశాల నుండి కూడా డాక్టర్‌ని రప్పించి మరీ ట్రీట్‌మెంట్‌ ఇప్పించినా ప్రయోజనం లేకపోయింది.
52 షాక్‌ ట్రీట్‌మెంట్స్‌ కూడా ఇప్పించారు. అప్పుడు గొంతు కొంచెం నయమైంది. తన వెన్నెముక పూర్తిగా వంగిపోవడంతో పదేళ్ళ వయసుకే ఎన్నో కఠినమైన పరీక్షలను భరించవలసి వచ్చింది. సర్జరీ చేసి కొంతమేరకు వెన్నెముకను సరిచేయించారు. గొంతు వరకు ఇసుకలో కప్పిపెట్టి ఉంచడం వలన ఆ వేడికి వెన్నెముక సరవుతుందని తెలియడంతో విశాఖపట్నం బీచ్‌లో తనకు ఆ ట్రీట్‌మెంట్‌ కూడా ఇప్పించారు. ఆ వేడికి తట్టుకోలేక శరీరం కమిలిపోయి ఎంతో బాధ కలిగినా తను అంత చిన్న వయసులోనే అన్నింటినీ తట్టుకునేది.
12 ఏళ్ళ వయసులో అందరూ విహార యాత్రలకు, అమ్మమ్మ, తాతల దగ్గరికి వెళ్తుండగా తను మాత్రం హాస్పిటల్‌ చుట్టూ తిరిగి 18 ఆపరేషన్లు చేయించుకుంది. తాను నడవాలన్న కోరిక, తపనతో ఎంత కఠినమైన బాధనైనా ఓర్చుకునేది. ఆపరేషన్ల కారణంగా తన చేతులు, గొంతు సరైనప్పటికీ కాళ్ళు మాత్రం సరికాలేకపోయాయి.
1987లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన సాయిపద్మకు డాక్టర్‌ అవ్వాలనుకున్న కోరిక నెరవేరలేకపోయింది. తనలాంటి ఎంతోమందికి సేవ చేయడం కోసం తాను చదవాలనుకున్న చదువులు సైతం తన అంగవైకల్యాన్ని ఎత్తిచూపుతూ చదవకుండా చేయడం ఎంతో బాధపెట్టింది. తనలా మరొకరికి కాకుండా ఉండాలని ఆమె లా చదివారు. ఎంతోమంది వికలాంగులకు సహాయం చేస్తూ, ధైర్యాన్నిస్తూ వారికి అండగా ఎన్నో కేసులను వాదించారు. తను వాదించిన కేసులలో 75% పైగా మంచి ఫలితాలను సాధించారు.
వికలాంగుల కోసమే కాకుండా హెచ్‌ఐవి రోగుల కోసం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్తూ, ప్రత్యేకమైన శిక్షణనిస్తూ అంగవైకల్యం వాహనం నడపడానికి కూడా అడ్డు రాదని నిరూపించారు. ఆపరేషన్‌ సమయంలో మంచం మీద ఉండవలసి వచ్చినపుడు ‘లైఫ్‌’ అనే పుస్తకం రచించి రచయిత్రిగా కూడా మంచి గుర్తింపును పొందారు. తన జీవితంలో ఎదురైన అనుభవాలను అందరితో పంచుకున్నారు.
సాయి పద్మ గారి గురించి తెలుసుకోవాలంటే ఒకటేమిటి, ఆమె చేయని పనులు లేవనిపిస్తంది. సంగీత సాధన కూడా చేసిన సాయి పద్మ అమెరికాలో కూడా ప్రదర్శనలు ఇచ్చి అలా వచ్చిన డబ్బుతో ఎంతోమంది వికలాంగులకు ఆపరేషన్లు చేయించారు. ఇలా తను ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమందికి చేదోడువాదోడుగా ఉన్నారు.
ఆమె పెళ్లి కూడా ఒక ఆదర్శమైనదే. ఇప్పటి రోజుల్లో చీటికీమాటికీ అది లేదు, ఇది లేదు అంటూ విడాకులిస్తున్న వారందరికీ కూడా తను ఒక ఆదర్శవంతురాలిగా నిలిచారు. ఎంతోమందికి కౌన్సిలింగ్‌ ఇప్పించి వారి కాపురాలను నిలబెట్టారు. 2008లో తనలాగే ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసిన ప్రజ్ఞానంద్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. పెళ్ళి చేసుకోగానే మరణానంతరం తన దేహాన్ని దానం చేయాలని హామీ పత్రం రాసిచ్చారు. వివాహానంతరం వారిరువురి సామాజిక సేవ ఇంకా ఎక్కువగా సాగింది. ‘అందంగా లేదని, అనుకున్నవన్నీ చేయట్లేదని అనేక వంకలతో భార్యలను వదిలించుకుంటున్న ఇప్పటి లోకంలో నా భర్త నన్ను ఎంతో ఇష్టపడి పెళ్ళిచేసుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటి భర్త దొరకడం నా అదృష్టం’ అని చెబుతూ ఉండేవారు సాయిపద్మ.
2017లో బిబిసి నిర్వహించిన టాప్‌`100 టాలెంటెడ్‌ ఉమెన్‌ జాబితాలో కూడా సాయి పద్మ చోటు దక్కించుకున్నారు.
కొంతమంది రిలీజ్‌ చేసిన ఆమె వీడియోలు చూసినప్పుడు, అవి ఈ ప్రపంచానికి ఎంతో అవసరం అనిపించింది. వాటిలో కొన్ని మచ్చుతునకలు:
అమ్మమ్మలా అమ్మ పని చేయదని పిల్లలెందుకు సాధిస్తారు?
ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ కుటుంబ సభ్యులుగా మారిపోతున్నాయా?
సోషల్‌ మీడియాలో చాలామంది ఫేస్‌లెస్‌గా ఎందుకుంటారు?
పరువును కాపాడే బాధ్యత ఎప్పుడూ ఆడవాళ్ళ మీదే ఎందుకు పెడతారు?
డ్రెస్‌ ఎవరి ఛాయిస్‌? అత్తా కోడళ్ళ గొడవలో నలిగిపోయేది అబ్బాయిలేనా?
అన్నీ ఉన్నా సంతోషం ఎందుకు లేదు?
సాయిపద్మ వీడియోలను చూసినప్పుడు ఆమె మనందరికీ ఎన్నో విషయాలను తెలియజేశారని, తననుంచి మరెన్నో విషయాలను నేర్చుకోవాల్సి ఉందని తెలుస్తుంది. తన సంపాదనతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఎన్నో ఘనవిజయాలను సాధించి అంగవైకల్యం ఒక సమస్యే కానీ, రుగ్మత కాదని నిరూపించారు సాయి పద్మ. వికలాంగ పిల్లల కోసం మూడు పాఠశాలలను కూడా కట్టించారామె. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సాయి పద్మ 52 ఏళ్ళకే మరణించడం మనందరికీ బాధించదగ్గ విషయం. కానీ, తన మాటలు, తన విజయాలు, తన కష్టం వెనుక ఉన్న బాధలు తెలుసుకుని, మానసిక వికలాంగులుగా ఉన్న అందరూ ఆ రుగ్మత నుండి బయట పడాలని ఆశిస్తారని అనుకుంటున్నాను.
సాయి పద్మ నాకు నేరుగా తెలియకపోయినా స్నేహితుల ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్నాను. ఆమె ఇన్‌స్పిరేషన్‌తో తన గురించి, తన జ్ఞాపకాల గురించి ఇలా తెలియజేయడానికి నాకు కలిగిన అవకాశానికి చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడిప్పుడే రచయిత్రిగా ఎదగాలన్న ఆలోచనతో నేను చిన్న రచనలను మొదలుపెట్టిన సమయంలో ఇంత గొప్ప వ్యక్తి గురించి రాయటం, తనని ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా గుర్తుంచుకోవడం నా రచనలకు ధన్యం అని చెప్పుకోవాలి.
తన జ్ఞాపకాలతో స్ఫూర్తిని పొందుతూ, రచయిత్రుల లోకంలోకి అడుగుపెడుతున్న…

Share
This entry was posted in సాయి పద్మ ప్రత్యేకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.