అమెరికన్ రాయబారి, మెలన్ వెర్‌వీర్
డా. జె.భాగ్యలక్ష్మి
ప్రెసిడెంట్ బ్యారక్ ఒబామా ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకు సంబంధించిన విషయాలకు స్వేచ్ఛాయుతమైన రాయబారిని నియమించటమన్నది చరిత్రలో ఇదివరకు ఎన్నడూ జరగనిది. ప్రత్యేకంగా ఎంబాసిడర్-అట్-లార్జ్ పదవిని సృష్టించడం ఎంతో హర్షించదగిన విషయం. అమెరికా ప్రభుత్వంలో కొత్తగా ఏర్పరచిన గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూస్ శాఖకు మెలన్ వెర్‌వీర్ డైరక్టరుగా ఉంటూ రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు ప్రగతి సాధించే విషయాలలో విదేశీ విధానానికి ఇతర కార్యక్రమాలకు ఈమె సమన్వయకర్తగా వ్యవహరిస్తుంటారు. స్త్రీలకు, బాలికలకు విద్యావకాశాలు ఉండేటట్లు, ఆరోగ్య విషయమై వసతులుండేటట్లు, వారిపట్ల దౌర్జ న్యాలు జరగకుండా వారి హక్కులు మానవ హక్కులుగా పరిరక్షింప బడేటట్లు, స్త్రీలకు రాజకీయ, ఆర్థిక సాధికారత చేకూరేటట్లు ఈమె కృషి చేస్తారు.
స్త్రీల సమస్యలను గమనించి, వాటికి సంబంధించిన ఇతర విషయాలను స్వయంగా చూసి వాటి పరిష్కారాలకై తమ విదేశీ విధానంలో మార్పులు, చేర్పులు చెయ్యటానికి ఈమె ఎన్నో దేశాలు పర్యటిస్తుంటారు. ఇటీవల భారత దేశానికి వచ్చిన మెలన్ వెర్‌వీర్ న్యూఢిల్లీలో మహిళా జర్నలిస్టులతో కొంత సమయం గడిపారు. ఆత్మస్థైర్యంతో, ఏమాత్రం తొణ క్కుండా, స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా నున్న స్త్రీల సమస్యల గురించి ఈమె మాట్లాడారు. అందులో కొన్ని అంశాలు :
స్త్రీల పట్ల హింస, దౌర్జన్యం
ప్రపంచ సంస్థ అయిన యునిసెఫ్‌లో స్త్రీలపట్ల హింసను అరికట్టటానికి కొన్ని విధులున్నాయి. వాస్తవానికి హింసకు గురయిన స్త్రీకి ఆసరాగా ఉండి, ఆమెకు న్యాయం చేకూర్చటానికి కొన్ని వసతులుండాలి. ఆమె ఉండటానికి ఒక స్థలముండాలి. ఆ భయంకరమైన అనుభవం నుండి బయటపడటానికి, ఆ షాక్ నుండి తేరుకోవటానికి తగిన సలహాలు, వైద్యసహాయం అవసరమవుతాయి.
ఈ విషయమై పురుషులకు నచ్చజెప్పటానికి, వారు అవగాహనతో సరయిన తీరులో నడుచుకొనేటట్లు చూడటానికి ఇప్పుడు కొందరు యన్.జి.ఓ.లు ముందుకు వస్తున్నారు. సమస్యలను పరిష్కరించటంలో పురుషులను భాగస్థులను చేయటమే వీరి ముఖ్యోద్దేశము.
ఈ సందర్భంగా అంబాసెడర్ మెలన్ వెర్‌వీర్ పాకిస్థాన్ యువతికి సంబంధించిన సంఘటన పేర్కొన్నారు. పాకిస్థాన్ గ్రామంలో ఒక యువతిని శిక్షించటానికి మూకుమ్మడిగా ఆమెను బలాత్కారానికి గురిచేశారు. ఇంతకూ ఆమె చేసిన నేరమేమీ లేదు. ఆమె సోదరుడు మరో యువతితో సన్నిహితంగా ఉన్నాడని ఈమెను శిక్షించారు. కోర్టుదాకా ఈ కేసు వెళ్ళింది కాని మొదట ఆమెకు న్యాయం జరగలేదు. మళ్ళీ కోర్టుకు వెళ్తే ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చి నష్టపరిహారం క్రింద డబ్బు చెల్లించారు. ఆ డబ్బుతో ఆమె తన ఊర్లో బాలబాలికలకు ఒక పాఠశాల ప్రారంభించింది. ఇదేమని అడిగితే విద్య లేకుండా తమ గ్రామంలో ఏదీ మారే అవకాశం లేదని ఆమె చెప్పింది.
”చట్టాలు ఏర్పడుతాయిగాని అవి అమలుకావు. స్త్రీలపై దౌర్జన్యాలను, హింసాత్మక చర్యలను వ్యక్తిగత విషయాలుగా భావించి నిర్లక్ష్యం చేయటానికి వీలులేదు. ఇవి గొప్ప అపరాధాలు. అపరాధం చేసిన వాళ్ళకు శిక్ష పడాల్సిందే. బాధితులకు న్యాయం చేకూర్చాల్సిందే” అని వెర్‌వీర్ కచ్చితంగా చెప్పారు.
మహిళా టెర్రరిస్టులు
”కొన్ని దేశాలలో స్త్రీలే టెర్రరిస్టులుగా, ఆత్మాహుతి చేసుకొనే బాంబులుగా పని చేస్తున్నారే వీరిని గురించి ఏమంటారు?” అని అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు. ”ఇతరులు వీరిని చేరి ఈ చర్యలకు ప్రేరేపించకముందే మనం వీరిని చేరుకోవలసి ఉంది. వారికి అవగాహన అవసరం” అన్నారు.
అమెరికా ప్రధాన స్రవంతిలో స్త్రీల సమస్యలు
అమెరికాలో ప్రధాన స్రవంతిలో స్త్రీల సమస్యల గురించి ప్రస్తావించినపుడు అమెరికాకు వలస వచ్చిన స్త్రీల సమస్యలు ఎక్కువ అని అన్నారు. అత్యధిక సంఖ్యలో వీరు తరలి వస్తున్నందున ఉద్యోగాలలో, విద్యారంగంలో మరెన్నో విషయాలలో ఇక్కట్లు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. భారతదేశం లాగే అమెరికా కూడా చైతన్యవంతమైన నాగరిక సమాజమని, ఎందరో యన్.జి.ఓ.లు పనిచేస్తున్నారని చెప్పారు. ఆసియా-పసిఫిక్ స్త్రీల అవసరాలు గుర్తించి, వారికి సహాయం చెయ్యటానికి ప్రత్యేకమైన విభాగాన్ని ప్రభుత్వం నెలకొల్పిందన్నారు.
అమెరికా ప్రథమ మహిళ
”ప్రథమ మహిళ శ్రీమతి మిషెల్ వృత్తిరీత్యా న్యాయవాది అయినందున మిలిటరీ కుటుంబాల అవసరాలు ఆమె గుర్తించారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యమిచ్చారు. ఒబామా ప్రెసిడెంటు కావటమన్నది, ఒక నల్లజాతి వ్యక్తి వైట్‌హౌస్‌లో ఉండటమన్నది చారిత్రాత్మక విషయం. ఆయన పదవి చేపట్టినపుడు టెలివిజన్ల ముందు ఎన్నో కుటుంబాలు ఆనందబాష్పాలు రాల్చాయి” అని అమెరికన్ రాయబారి అన్నాడు.
అమెరికాలో స్త్రీ ప్రెసిడెంటు
అమెరికాలో స్త్రీ ప్రెసిడెంటు కాకుండా ఎందుకు ప్రతిఘటిస్తారు అన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించారు.
”ప్రగతికి అవరోధంగా పైన గాజు కప్పున్న మాట వాస్తవమే. కాని ఈసారి 18 మిలియన్ (180 లక్షలు) ప్రజలు ఓట్ల ద్వారా దానికి పగుళ్లు వచ్చేటట్టు కొట్టారు. ఒకనాడు ఈ గాజుకప్పు తప్పక బద్దలవుతుంది. ఒక మహిళ అధ్యక్షురాలవుతుంది. ఇప్పుడు హిల్లరీ క్లింటన్ ప్రముఖ స్థానంలోనే ఉన్నారు. ఈమె స్త్రీల సమస్యలను ఎంతగానో పట్టించుకొంటారు. ఎన్నో ప్రాంతాలు పర్యటించి, స్త్రీలను కలుసుకొని సమస్యలు అర్థం చేసుకొంటారు. తన వెనక మనమందరం ఉండాలని ఆమె కోరుకొంటారు. ఆమె నిజంగా స్త్రీల విషయాల కోసం పోరాడుతారు.”
భారతదేశంలో స్త్రీలు
”భారతదేశం పెద్ద ప్రయోగశాల వంటిది. అవకాశాలిస్తే స్త్రీలు ఏమేమి సాధించగలరో ఇక్కడ చూపించారు. స్త్రీల విషయంలో పెట్టుబడి పెడితే అదెంతో లాభదాయకమని ఎన్నో అధ్యయనాలు తెలియజేశాయి. స్త్రీల స్వయంసహాయక సముదాయాలు ఎంతో సమర్ధవంతంగా నడుస్తున్నాయి. స్త్రీలు నిజమైన మార్పు తీసుకొని రాగలరు. దేశ ఆర్థిక స్థాయికి తోడ్పడగలరు. స్త్రీల విషయంలో మరింతగా పెట్టుబడులు వచ్చేటట్లు చూడటం నా కర్తవ్యం. ఇది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది” అని రాయబారి మెలన్ వెర్‌వీర్ తమ చివరి మాటగా అన్నారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags