పి. సత్యవతి
అంతా మామూలే – రక్తమోడే రహదార్లూ, యాసిడ్ దాడులూ, ఆత్మహత్యలు, కట్నం వేధింపులు, గృహహింస, స్వామీజీలు, బాబాలు, అమ్మలు, పాపలు, చిలకజోస్యాలు, ప్రశ్నలు, వాస్తులు, తావీజులు, నోములు, వ్రతాలు. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, తలబిరుసుతనాలూ… మామూలు కన్న కాస్త ఎక్కువ కూడా! సామాన్య జనానికి అన్నీ తక్కువే.. చుక్కల్లోకి పోయిన నిత్యావసరాలు.. సెల్‌ఫోన్లు తిని బతకాలి కామోసు.. ఏ ఆశతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలో! ధ్వంసమౌతున్న ప్రజలు పన్నుల మీద కొన్న ప్రభుత్వ ఆస్తుల్ని, వాళ్ళూ వాళ్ళూ కొట్టుకున్నప్పుడు జరిగే ”కొల్లేటరల్ డామేజీ”ని చూసి అందులో మాడి మసైపోయి మామూలు మనుషుల్ని చూసి ఏ ఆశతో దేనికోసం ఎదురుచూస్తాం? కానీ మనిషన్నాక కూస్తంత ఆశ లేకపోతే ఎలా మనుగడ సాగిస్తాం? అందుకోసం ఇప్పుడు ఇక్కడి సంక్షోభానికి తెరపడుతుందని, కొత్త సంవత్సరంలో వివేకం, విచక్షణా జ్ఞానం వికసించి వర్ధిల్లుతాయని ఆశిద్దాం. అందుకోసం ఈ సంక్షోభ సందేహాస్పద, సంక్షుభిత సమయంలో కొన్ని అసందర్భ విషయాలు చెప్పేసి అసంతృప్తినీ ఆవేదననీ మిగిల్చిన ఈ సంవత్సరానికి వీడ్కోలు చెప్పేస్తా.
సునీతా నామ్ జోషి అని ఒక మంచి రచయిత్రి వుంది. ఆవిడ ఫెమినిష్ట్ టేల్స్ అని ఒక పుస్తకం వ్రాసింది. అందులో నాకు బాగా నచ్చిన ఒక చిన్న కథ.
పిల్లులు-గంటలు
”పిల్లి మెడలో గంటెవరు కడతారు” మూషిక సభలో క్లిష్టమైన ప్రశ్న.
”నా వల్ల కాదు బాబూ!! అసలే నాకు చాలామంది పిల్లలు. బోలెడంత బజారు పని కూడా వుంది” అంది ఒక మూషికం.
”నా వల్ల కూడా కాదు. పైగా ఇలాంటి అర్థంలేని తగాదాలంటే నాకసలు ఇష్టం లేదు నేను శాంతికాముకురాలిని” అంది నీలం మూషికం.
”నా వల్ల అసలే కాదు. నేనసలే చిట్టెలుకని. ఈ గంటేమో చాలా బరువు” అంది చిట్టెలుక.
”నేనసలు కట్టను..ఈ గంటల వ్యవహారమేమిటో నాకసలు తెలీదు” అంది పెద్ద మూషికం.
”నేను కడతాను.. | గీరిజిజి ఖిళి రిశి తీళిజీ బి జిబిజీది ఇదంతా చాలా సరదాగా వుంటుంది” అంది పిచ్చి మూషికం.
”కాదు కాదు..నేనే కడతాను. నాకు కీర్తి కావాలి” అంది హీరో మూషికం.
”బాగానే వుంది కానీ మనం కొంతకాలం నిరీక్షిస్తే పిల్లి ఎలాగూ చచ్చిపోతుంది అప్పుడు మనకే బాధా వుండదు” అంది తెలివికల మూషికం.
”అవునవును..గంట సంగతి మర్చిపోదాం” అన్నాయి మూషికాలన్నీ ముక్తకంఠంతో..
కొన్ని మర్చిపోయాయి..కొన్ని మర్చిపోలేదు.
ఒకసారి ఒక విసుగుపుట్టే మీటింగులో కూచుని నేనూ నిర్మలా కనిపెట్టిన సామెతలు.
1. వృద్ధపురుషా ఏకపత్నీవ్రత. 2. మూడు (మగ) క్రాఫులు ఒక చోట కూడవు. 3. క్యాంటీన్‌లో మెక్కి వచ్చిన మొగుడికి పెళ్ళాం ఆకలి ఏమి తెలుస్తుంది…మరికొన్ని మరోసారి…
ఈ సంవత్సరం ఉత్తమ రాజకీయ పదం అవార్డు గ్రహీత ”మనోభావాలు”.
వ్రాయడానికి బుర్రలో ఏమీ లేక ఇలా గాలిపోగుచేసి పేజీ నింపాననుకుంటున్నారు కదా? ఇందులోనూ ఒక సూది వుంటుంది వెతకండి.
ఈ సంవత్సరంకూడా కొన్ని పుస్తకాలు కాని నాకదివరకు దొరకని ఇపుడు ఈ సంవత్సరం దొరికి అప్పుడు ఎందుకు చదవలేదా, ఎందుకు మిస్ అయ్యానా అని ఆశ్చర్యపోయిన రెండు మంచి పుస్తకాలు ”సలామ్ హైదరాబాద్” లోకేశ్వర్‌ది, మరొకటి ”ఫైన్ బాలన్స్” రోహిన్టన్ మిస్త్రీది.. ఈ సంవత్సరం నా మనసులో నిలిచిపోయి వెన్నాడుతున్న కథ ”బాలేదు జ్వరమొచ్చింది.”వినోదిని కథ…