స్త్రీల కృష్ణపక్ష జీవితం….. ఒక పరిశోధన – వి. ప్రతిమ

చంటి పిల్లల్ని చంక నేసుకుని, స్త్రీలు స్వాతంత్రోద్యమంలోకి నడిచి, జైళ్లకు కూడా వెళ్లిన చరిత్ర మనది….
ఇంతటి ధైర్య సాహసాలూ, దృఢమైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశంలో ఇప్పటికీ స్త్రీల ఆస్తిత్వాలు ప్రశ్నార్ధకాలే?…. వారి హక్కులు అవాస్తవాలే.

స్త్రీల జీవితాల చుట్టూ పదిలంగా అల్లి వుంచబడిన, అన్ని రకాల భ్రమలని బద్దలు చేసుకుంటూ, స్త్రీలు ముందడుగు వేసినట్లుగా పైకి కనిపిస్తుంది కానీ, వారి జీవితాలలోని చేదు పొరలు, చీకటి దుఃఖాలూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం బాధాకరం. అందునా భర్తని పోగొట్టుకున్న ఒంటరి స్త్రీల పరిస్థితి, వారి మీది నియంత్రణలు, వెలుగు చూడనివ్వని చీకట్లు, పేరంటాలకు, శుభకార్యాలకూ ఆహ్వానించని అవమానాలు, ముఖం చూడని అపశకునాలూ. ఎవరైనా ఒకరిద్దరు ధైర్యం చేసి ఒకింత అలంకరించుకుని, బయటకు వెళితే గుసగుసలు, అవహేళనలు ఒక దైన్య స్థితి ఒంటరి స్త్రీది.
వారిని అలా కృష్ణపక్షంలోకి నెట్టివేసిన వ్యవస్థ యొక్క దుర్మార్గం సంగతేమిటి? దాన్ని మనం ఎలా ప్రతిఘటించి, మార్చుకోవాలి? ఈ అన్ని విషయాలను లోతులకెళ్ళి పరిశీలించి, పరిశోధించి, చర్చించి, వ్యాసాలు రాయించి, అప్పటికే వచ్చిన వ్యాసాలను సేకరించి, ఇంకా సాహిత్యంలో ఒంటరి స్త్రీల మీద వచ్చిన రచనల తాలూకూ సమీక్షలను సమీకరించి, అనిశెట్టి రజిత ప్రధాన సంపాదకురాలిగా ప్రచురించిన ‘‘భారతదేశంలో వితంతు వ్యవస్థ’’ ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.. డాక్టర్‌ కొమర్రాజు రాజ్యలక్ష్మి, చందనాల సుమిత్ర, తమ్మెర రాధిక ముగ్గురూ సంపాదకులుగా వ్యవహరించారు.
నిజానికి పితృస్వామ్యం, మతం రెండూ జమిలి నిర్మాణాలు. మనదేశంలో సంస్కృతి పేరుతో డిప్లమాటిగ్గా అమలవుతోన్న అనేక దురాచారాలలో వితంతు వ్యవస్థ ఒకటి. ‘‘విద్వ’’ అన్న సంస్కృత పదం నుండి రూపొందించబడిన ‘‘విధవ’’ అన్న పదం పలకడానికి మనసొప్పదు మనకి. భర్త చనిపోయిన భార్య వితంతువు అయితే, మరి భార్య మరణించిన భర్తని ఏమని పిలవాలి? అనుకుంటే ‘‘విదురుడు’’ అంటారట. ఆ పదం ఎక్కడా ప్రాచుర్యంలో లేకపోవడం గమనార్హం. అంటే భార్య మరణించిన తర్వాత ఆమె కర్మకాండలలోనే, ఆ పురుషుడు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అర్హుడు. ఆ పరిస్థితుల్లో విదురులు ఎక్కడుంటారు మనకి. ఎంతటి వివక్ష?
భర్త మరణించిన తర్వాత స్త్రీలు ఎడబాటు దుఃఖంతోపాటుగా, అశాంతిని నింపే తంతులు, శారీరకమైన నిబంధనలు, ఇంటి చాకిరిలో మునిగి తేలాలన్న నిర్బంధం, ఇవన్నీ కూడా భరించాల్సి ఉంటుంది. ఈ నియంత్రణలన్ని లైంగికంగా ఆమెను నిలవరించడం కోసం బ్రాహ్మణీయ పితృస్వామ్య వ్యవస్థ తాలూకు కుట్ర అన్నది మనకి విదితమే.
అసలు స్త్రీల లైంగిక అణిచివేతే కులం పుట్టుకకు మూలం. స్త్రీల లైంగికతను అదుపు చేయడానికే కులవ్యవస్థ ఏర్పాటు చేయబడిరది అంటారు విమల. అది నిజం కూడా. గుంపులు, సమూహాలు, వర్ణాలూ క్రమంగా కులంగా మారి స్థిరపడిరది. భారతదేశానికే ప్రత్యేకమైన బ్రాహ్మణీయ పితృస్వామ్యం ఎట్లా స్త్రీలని కుటుంబాలలో, శాశ్వత బందీలను చేసి కుటుంబాన్నే కాకుండా, పరువు… ప్రతిష్టలను కూడా మోసే ఒక అట్లాస్‌లా ఆమె లైంగికత్వాన్ని వ్యక్తిత్వాన్ని, మొత్తంగా అస్తిత్వాలని కుదించి, తమ జీవితాలను తామే అదుపులో ఉంచుకొనే, తామే భస్మం చేసుకునే, భస్మాసుర వారసులుగా, బానిసలుగా ఎట్లా మార్చి వేసిందో, వ్యవస్థీకృతం చేసిందో చాలా లోతులకు వెళ్లి, ఉద్వేగపూరితంగా అర్థం చేయిస్తారు కొల్లాపురం విమల తన వ్యాసంలో.
అనేకరకాలైన కఠిన నిబంధనలతో ఒంటరి స్త్రీగా, తాత్విక అన్వేషణలను ఎంచుకోవడానికి అనుమతి లేని, పనికిరాని మిగులుగా ఆమెని నిర్దేశించడం ఈ బ్రాహ్మణీయ పితృస్వామ్య వ్యవస్థ నిర్దేశించిన కుట్ర అన్నది లోతుగా చర్చకు వస్తుంది ఈ వ్యాసాలలో.
బండరాళ్లు మనుషులుగా మారకపోవచ్చును గాని, మనిషి రాయిగా మారేటువంటి స్థితిని వితంతు జీవితం కల్పిస్తుంది.
మనందరికీ తెలుసు ఆధునిక సంస్కరణోద్యమానికి ఆద్యుడైన రాజారాం మోహన్‌ రాయ్‌ వంటి వారి అకుంఠిత కృషి వల్ల, ఆ నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం సతీసహగమనాన్ని నిషేధిస్తూ చట్టం తేవడం జరిగింది (1856). అయితే ‘‘సతీ’’ అన్నది నేరుగా మంటల్లోకి తోసి, చంపడం అయితే, వితంతు తంతు బతికి ఉన్న ఒంటరి స్త్రీలకి క్షణక్షణం మరణం.అంటే ఒకేసారి చస్తావా?
లేక బతికుండి రోజు రోజూ చస్తావా? అంతే తేడా. ఈ విస్మృత ప్రాణులు రకరకాలుగా పిలవబడతారని తెలిసి విస్తుపోతాం మనం.
‘‘హాఫ్‌ విడోస్‌’’, ‘‘ టైగర్‌ విడోస్‌’’ ఇలా…. కాశ్మీర్‌లో పురుషులు, అబ్బాయిలు హఠాత్తుగా మాయమై పోవడం. అలా వెళ్ళిన
వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాకపోవడం ఉంటుంది. అటువంటి వారి భార్యల్ని ‘‘హాఫ్‌ విడోస్‌’’ అని అంటారు. అలాగే పశ్చిమ బెంగాల్‌ అటవీ ప్రాంతంలో నూరుకి పైగా బెంగాల్‌ టైగర్స్‌ సంచరిస్తూ ఉంటాయి. అటవీ దినుసుల కోసం అడవిలోకి వెళ్లిన ఆదివాసీ పురుషులు ఆ పులుల వాత బడి మరణిస్తే, వారి భార్యల్ని ‘‘టైగర్‌ విడోస్‌’’ అని పిలుస్తారట.
ఇక బృందావనంలోని వితంతు సమూహాల దుర్భర స్థితి మనందరం విన్నదే. అసలు మొట్టమొదట వితంతు స్త్రీలను సతి సహగమనాల నుండి కాపాడడం కోసం. చైతన్య మహాప్రభు వారిని బృందావనంకి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించారని, ఆ తర్వాత కాలంలో కుటుంబ సభ్యులచేత నిరాకరింపబడిన వితంతువులు. భక్తితోనో, మానసిక స్థిమితం కోసమో విరివిగా బృందావనం చేరుకోవడం మొదలయిందని తెలుస్తోంది. చాలామంది గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కోవడం, భజనలు చేసి పొట్ట పోషించుకోవడం, ఈ క్రమంలో యుక్తవయసులో ఉన్న ఒంటరి స్త్రీలు లైంగిక వేధింపులకు గురవడం, ఇలా బృందావనంలోని వితంతువుల నీడలను బెంగాలీ దర్శకుడొకరు ‘‘వైట్‌ రెయిన్‌బో’’ అన్న సినిమాగా కూడా తీశారు.
సామ్రాజ్యవాద విధానాల మూలంగా భారతదేశంలో, ఒక్కసారిగా దెబ్బతిన్న వ్యవసాయం వల్ల అప్పుల పాలైన రైతులు ఎట్లా ఆత్మహత్యలు అంచులకు నెట్టబడ్డారో మనందరికీ తెలుసు. ఆ ఆత్మహత్యల ఋతువులో ప్రాణాలు కోల్పోయిన రైతుల యొక్క భార్యల్ని, అంటే భర్త లేని దుఃఖాలనీ, అప్పులని అవమానాలని, భరిస్తూనే పిల్లల కోసం మొక్కవోని ధైర్యంతో నిలబడ్డ వారిని ఏమని పిలవాలి?
అలా సంభవించిన వేలాదిమంది రైతుల ఆత్మహత్యలని గమనిస్తూ, వాటలోి కొన్నింటిని అధ్యయనం చేసి, కోట నీలిమగారు వెలువరించిన పరిశోధక గ్రంథం ‘‘విదర్భలో వితంతువులు’’. వితంతువుల అదృశ్య ప్రపంచాన్ని లోపలి నుండి దృశ్యమానం చేయడం, మరొకటి ఈ వితంతు స్త్రీలు తమ భర్తలను కోల్పోక ముందు, కోల్పోయిన తరువాత, వారి మీద అనేక స్థాయిలలో విధించబడే అదృశ్యతలను గురించి చెప్పడం, ఇంకా మరిన్ని కోణాల నుండి వితంతు స్థాయిని గురించి చర్చించడం ఈ పుస్తకంలోని అంశాలు. సమాజంలో ఎట్లా వాళ్ళు అదృశ్య జీవులుగా, విస్మృత ప్రాణులుగా మిగిలిపోతారో చెప్తూ, ఈ పరిశోధనకు తీసుకున్న అందరికందరూ స్త్రీలుగా పుట్టకూడదని కోరుకోవడాన్ని గురించి కూడా వివరిస్తుందీ పుస్తకం. ఈ పుస్తకం మీద మెట్టు రవీందర్‌గారు రాసిన లోతైన సమీక్షని మనం ఇందులో చూడొచ్చు. ఆనాడు వితంతువులు తమకి ఆపాదించబడిన అదృశ్యతలను తట్టుకోలేక గంగా, గోదావరి వంటి నదులకు వెళ్లి స్వచ్ఛందంగా మరణంలో ప్రశాంతతను వెతుక్కుంటే, దానికి పవిత్రతను అంటగట్టి అవహేళన చేసే పరిస్థితులు కూడా మన సమాజంలో వుండేవి. 1936 ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌ సరిహద్దుల్లో జరిగిన యదార్థగాధ వాటర్‌ నవలగా మలచబడిదనీ మనకు తెలుసు. చుహియా అన్న బాలవితంతువు బలవంతంగా వితంతు ఆశ్రమానికి చేర్చబడి అక్కడ ఆమె ఎదుర్కొన్న కష్టాలు, ఆమె కేంద్రకంగా చుట్టూ అనేక మంది యువతుల, స్త్రీల చీకటి దుఃఖాలు, చిత్రించబడిన నవల ఇది. తిరునగరి దేవకి రాసిన వాటర్‌ నవలా సమీక్ష ఈ పుస్తకంలో కలికి తురాయి.
బృందావనంలో వితంతు స్త్రీల పరిస్థితిని చిత్రిస్తూ దీపా మెహతా తీసిన వాటర్‌ సినిమాకి ఆధారం ఈ నవల. ఆ సినిమా మీద దాడులు జరిగాయి. ఆ సినిమా నిషేధించడం వంటివన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఆనాడు వితంతు వివాహాల గురించి వీధుల్లోకి వచ్చిన స్త్రీ ఉద్యమకారులు వారి సాహిత్యం, వారు చేసిన రచనలు తాలూకు సమీక్ష చూసినప్పుడు వెనకటి స్త్రీల యొక్క దృఢమైన చైతన్యవంతమైన వ్యక్తిత్వాలు మనని విస్మయపరుస్తాయి.
బ్రాహ్మణ బాల వితంతువు సూరీడు యొక్క సుదీర్ఘమైన జీవనయానంలోని ఎగుడు దిగుడులు, దుష్ట సంప్రదాయాలు, దుఃఖపు చీకట్లను చిత్రిస్తూ మాలతి చందూర్‌ రాసిన ‘‘శతాబ్ది సూరీడు’’ నవల మీద అలాగే వాసిరెడ్డి సీతాదేవి నవలల్లోని వితంతు జీవన చిత్రణ మీద ప్రత్యేక వ్యాసాలు, వితంతు దైర్యస్థితిని మళ్లీ ఒకసారి గుర్తు చేస్తాయి. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవా? అనుకుంటే వితంతు సమస్య రూపాలను మార్చుకుని హింస అంతర్గతంగా అమలవుతూనే ఉన్నదని చెప్పుకోవడానికి మనం బాధపడాలి, సిగ్గుపడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రాహ్మణీయ పితృస్వామ్య వ్యవస్థ సృష్టించిన వితంతు వ్యవస్థ భర్తను కోల్పోయిన ఒక నిస్సహాయురాలైన స్త్రీకి విధించే మరణం శాసనం. ఆమే జీవించి ఉండగానే విదించే ఒక సామాజిక మరణం.
మనిషిగానే పుట్టిన ఆడపిల్ల, స్త్రీగా మార్చబడుతుంది. భర్త మరణిస్తే ఆ స్త్రీ వితంతువుగా చేయబడుతుంది. స్త్రీ అనాధ అవుతుంది. ఈ వ్యవస్థలో ఇది అంతులేని కథ, గొలుసు కష్టాల పరంపర’’. ఆధునిక తెలుగు సాహిత్యంలో చర్చించబడిన వితంతు సమస్య తాలూకూ రచనలు తీసుకుని కాత్యాయని విద్మహే, శీలా సుభధ్రా దేవి కొండేపూడి నిర్మల, కేఎన్‌ మల్లీశ్వరి, అనిశెట్టి రజిత, కొండవీటి సత్యవతి వంటి ఎందరో విజ్ఞులు, విమర్శకులు సామాజిక చింతనాపరులు దుఃఖభరితమైన వితంతు వ్యవస్థ తాలూకూ అనేక రకాలైన చీకటి కోణాలను తవ్వి తీసి సమీక్షించి, చర్చకు పెట్టిన తీరు అభినందనీయం. బాధాకరం. విశ్వాసాల పునాదుల మీద నడుస్తున్న వ్యవస్థలు మూఢాచారాలలోకి, మూఢాచారాల లోకి మారడాన్ని గురించి ఈ వ్యాసాలు చర్చిస్తాయి, ఎత్తి చూపిస్తాయి. వెంటనే మనం ప్రతిఘటించాల్సిన అవసరాన్ని సూచిస్తూ, ఒంటరి మహిళల జీవితాలలో వెలుగులు నింపాల్సిన చైతన్యాన్ని మనలో ప్రసరింపజేస్తాయి.
రండి రండి… మొత్తంగా ఈ మూఢత్వపు చీకట్లకి స్వస్తి పలికి, వితంతువు అన్న పదాన్ని లేకుండా చేసి, అదృశ్యతలో తచ్చాడుతున్న ఒంటరి స్త్రీలను కాపాడుకుందాం రండి. మనని మనం చైతన్యపరచుకుందాం రండి. ఆధునిక తెలుగు సాహిత్యానికి ఇంత గొప్ప గ్రంథాన్ని చేర్పు చేసిన ఈ సంపాదకులను ఇందులో భాగమైన అందరినీ అభినందిద్దాం రండి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.