పరువు – వి. శాంతి ప్రబోధ

ఇప్పుడు బతికి ఉన్నానా.. చచ్చిపోయానా.. లేక చనిపోయి బతికానా అని చిన్నగా నవ్వుకుంటూ చేతిలో మొబైల్‌ పక్కన పెట్టింది ఆమె. కానీ, ఆమె ఆలోచనలన్నీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టర్‌ మీద, ఆ వెనుక వస్తున్న రకరకాల వ్యాఖ్యానాల పైనే ఉన్నాయి. ఎంత వద్దనుకున్నా అవి జోరీగల్లా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి.

అయినవాళ్లు, కానివాళ్ళు ఉడతా భక్తిగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌లో వార్తలు ఆమెకు చేర్చుతున్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న రచ్చ చూసి మొదట నవ్వొచ్చింది. కానీ రాను రాను ఆమె హృదయం భారమైంది. ఆలోచిస్తున్న కొద్దీ అయోమయంగా ఉంది. అనేక ప్రశ్నలు కలగాపులగంగా చేరి ఆమెపై దాడి చేస్తున్నాయి. బుర్ర ఎదగని బిత్తిరి వెధవలు. ప్రతివాడూ ఎగేసుకొచ్చి రాళ్ళేసేవాడే, నోటి దూల తీర్చుకునేవాడే… మనసులో తిట్టుకుంది. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా ఏంటి?! అని సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నది.
ప్రేమ ప్రేమను ప్రేమించాలిగా… ఇలా వికటాట్టహాసం చేస్తున్నదేమిటి? ఇంత కిరాతకంగా వ్యవహరిస్తున్నదేమిటి? అంటే ప్రేమను మించినదేదో ఆడిస్తున్నట్లేగా… అదేంటి…?
కులం, మతం, వర్గం, అహం, అధికారం, ఆధిపత్యం లేక మరేదైనా కావచ్చు కొత్త ఆలోచనలు ఆమెలో రూపుదిద్దుకుంటూ. ఏదైనా సరే ఆ ప్రేమికులను నల్లిని నలిపినట్టు నలిపేస్తున్నదని తలపోస్తున్న ఆమెను ‘నాన్నపై పంతంతో వచ్చేశావా? లోపలి కత్తుల కుత్తుకలు గుర్తించి వచ్చేశావా? లేదా రోషన్‌పై ఆకాశమంత ప్రేమతో వచ్చేశావా?’’ ఆమె మనసు నిలదీసింది. ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న కూతుర్ని. నిన్న మొన్న పరిచయం అయిన రోషన్‌ ఎక్కువయిపోయాడేంటి? అమ్మానాన్న అంటున్నట్టు నేనతని మాయలో పడ్డానా? ఆస్తి కోసం నన్ను వలలో వేసుకున్నాడా? లేక నేననుకుంటున్నట్టు అతనే నా మాయలో పడ్డాడా?
‘మీరు దండలు మార్చుకోవడానికి మీ ఇద్దరి ప్రేమ మాత్రమే సరిపోతుందా? మీ చుట్టూ ఉన్న కుటుంబం, సమాజం, వారితో ప్రేమ, బంధం అవసరం లేదా?’ మరిన్ని ప్రశ్నలు సంధించింది మనసు. నిజానికి, నా భర్తతో ఏకాంత ద్వీపంలో బతకాలని నేనెప్పుడూ కోరుకోలేదు. నాకు అందరూ కావాలి. అందరిలో మేమూ ఉండాలి అన్నదామె. పెళ్లంటే అంగరంగ వైభోగంగా పెద్దల సమక్షంలో జరిగే సప్తపది, కన్యాదానం, తాళిబొట్టు మాత్రమేనా? కాదు. నేనొక వస్తువును కాదు నన్ను మా నాన్న కన్యాదానం చేయడానికి అని ఈ మధ్యే అర్ధమైంది. అసలు నా ప్రేమబంధం పట్ల జనాలకు వచ్చిన నష్టం ఏంటి? కష్టం ఏంటి? ఎందుకంత దుర్భాషలాడుతున్నారు? నాకు నచ్చినట్టు బ్రతకడం తప్పా..? అలా బతకడం మొదలు పెట్టానని నిన్నటివరకూ నన్ను మెచ్చిన చాలా మందికి నచ్చకుండా పోయానా!
అత్తింటి వైపు దానికి తీట ఎక్కువై మావాడిని లేపుకు పోయిందని చాలా చండాలంగా మాట్లాడుకుంటున్నారు. అమ్మో… గొప్పోళ్ళ పిల్లల్ని అస్సలు నమ్మకూడదు. కింది కులాల అమాయకులైన అబ్బాయిల వెంట పడి లేపుకుపోయి వాళ్ళ గొంతుకోస్తారని తిట్టిపోస్తున్నారు. కొడుకు కలెక్టర్‌ కావాలని కలలుకంటున్న ఆ తల్లిదండ్రుల ఆశలు పోతే పోనీ… ఆ తల్లిదండ్రులను జీవచ్ఛవాలుగా మార్చకుంటే చాలు అని నా మొహం మీదే ఆడిపోసుకుంటున్నారు. నన్ను శత్రువును చూసినట్లు చూస్తున్నారు. నిన్న వచ్చిన రోషన్‌ అక్క మన కులం పిల్లను చూసుకుంటే మంచిగుండేది కదరా అన్నది. ప్రత్యేకించి నన్ను ఏమీ అననప్పటికీ తమ్ముడి ప్రాణం పట్ల ఆమెలో గూడుకట్టుకున్న భయం, భీతి ఆ కళ్ళలో కనిపించాయి. ఈ విషయంలో వారి బాధను, భయాన్ని అర్ధం చేసుకోగలను. నొప్పి అనుభవించే వాళ్లకు ఒకలా, చూసే వాళ్లకు ఒకలా అనిపిస్తుందేమో! ఆలోచిస్తున్న ఆమె భారంగా కళ్ళు మూసుకుంది.
ఆమె కళ్ళ ముందు రోషన్‌ ప్రత్యక్షం అయ్యాడు. రోషన్‌కి నేనంటే చెప్పలేనంత ప్రేమ. నాకు రోషన్‌పై ఉన్నది మోహమో… వ్యామోహమో కాదు. స్వచ్ఛమైన ప్రేమ. అవసరాల ప్రేమ కాదు. మనసుతో ప్రేమించిన ప్రేమ. మనసుతో ముడి పడిన ప్రేమ. ఆ ప్రేమే అతని కోసం నన్ను బయటకు నడిపించింది. అతను లేని నేను లేను. ఆ విషయం ఇటు అత్తింట అటు పుట్టింట ఎవరికీ అర్థం కావడం లేదు అని తల్లడిల్లి పోయింది. పసితనపు ఛాయలు వీడని ఆ యువ హృదయం. అప్పటివరకూ సింగిల్‌ బెడ్‌ రూమ్‌ అపార్ట్మెంట్‌ ఆరో అంతస్తు నుంచి బయటకు చూస్తూ రకరకాలుగా తలపోస్తున్న ఆమె మొబైల్‌ అందుకుని నాలుగు అక్షరాలు టైపు చేసిందల్లా ఆగి ఫోన్‌ పక్కన పెట్టేసింది. వెళ్లి పెన్ను పేపర్‌ అందుకున్నది.
‘‘నాన్నా…
నీ దృష్టిలో చచ్చిన నేనీ పిలుపు పిలవొచ్చో లేదో… కానీ నువ్వెప్పుడూ నాకు నాన్నవే. అందుకే పిలుస్తున్నా… పిల్లల మనసు అర్థం చేసుకోని పెద్దలు వారిని దుర్మార్గులుగా చిత్రిస్తూ కామెంట్‌ చేయడం, సంస్కారం, మర్యాద లేనివాళ్లుగా ముద్ర వేయడం చూస్తున్నా.
మా పెళ్లి విషయంలో జనం రెండుగా చీలిపోయి చేస్తున్న వ్యాఖ్యానాలు, ముఖ్యంగా మిమ్మల్ని సపోర్ట్‌ చేస్తూ నన్ను దుయ్యబడుతూ, తీవ్రంగా దూషిస్తూ… అవి చదువుతుంటే నా మనసు పడే వేదన మీకు తెలవాలని మీ ముందుకు వచ్చా. చదువుతారో చించేస్తారో మీ ఇష్టం. తప్పో ఒప్పో మాకు ఇష్టమై మేం పెళ్లి చేసుకున్నాం. మా తల్లిదండ్రులుగా అది మీకు నచ్చకపోవచ్చు. మీ మనసుకు చాలా కష్టం కలిగి ఉండవచ్చు. కాదనను. బిడ్డ తెల్వక తప్పు చేస్తే బిడ్డ తప్పును కన్నవాళ్ళు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారని అంటారు. కానీ మీరేంటి నాన్నా కన్నబిడ్డ చావు ఫ్లెక్సీలు పెట్టి చావు చేసి భోజనాలు పెట్టారు. ఈ లోకంలో పెద్దల ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకున్న ప్రేమ జంటల తల్లిదండ్రులంతా ఇట్లాగే చేశారా? ఎవరో ఎందుకు? మీది ప్రేమపెళ్ళి. మీ పెద్దలు ఇలాగే చేశారా? ఇంతవరకు ఏ తండ్రి చేయని పని మీరు చేశారు. మీ చర్యను కీర్తించే సోషల్‌ మీడియా చూస్తుంటే పేగుబంధం విలువ ఇదేనా అని భయం వేస్తున్నది. తల్లిదండ్రులు పిల్లలను పెంచేది ఒక బాధ్యతతోనా, ప్రేమతోనా లేక తమ పరువు, అధికారం, ఆధిపత్యం నిలబెట్టడం కోసమా? ఎందుకు నాన్నా? మీ చర్యలు చూసేగా, మీ విపరీత ప్రవర్తన వల్లేగా ప్రతివాడు నోటికొచ్చినట్టు వాగుతున్నది. బిడ్డ చచ్చిందని పోస్టర్‌ వేయడం కాదు నేనైతే ఇద్దర్నీ చంపి పోస్టర్‌ వేద్దును కొందరి కామెంట్‌. అవి చూసి మీకు సంతోషాన్నిచ్చి మీ అహాన్ని తృప్తి పరుస్తున్నాయేమో?! కానీ, మేం గౌరవించే పెద్దల్లో ఇంత క్రూరత్వం దాగి ఉందా. ఇంత విద్వేషం, కల్మషం ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నా నాన్నా. ఆ జనానికి మరేం పనిలేదేమో! ఎదుటివాళ్ళ జీవితాల్లోకి దూరి కోడై కూయడమే పనేమో! నా గురించి వాళ్ళకి ఏం తెలుసని అడ్డమైన కూతలు కూస్తున్నారు? నీ చేతలు చూసే లవ్వు అంటూ కొవ్వు పట్టి మోసం చేసానని మీ వైపు వకాల్తా పుచ్చుకున్న జనం నాపై దుమ్మెత్తి పోస్తున్నారు. చెప్పండి నాన్నా నేను మిమ్మల్ని మోసం చేసానా? మీరు నన్ను మోసం చేశారా? గుండె మీద చెయ్యేసి నిజం చెప్పండి.
నాన్నా నువ్వెన్నడు ప్రేమించకూడదు, లేచిపోయి పెళ్లిచేసుకోకూడదు అని ఫత్వా జారీచేయలేదు కదా… అందుకే మీ మీద నమ్మకంతో నా ప్రేమ విషయం నిజాయితీగా నీ ముందు పరిచా. కానీ నువ్వేం చేశావ్‌, ఓ వైపు నాపై తండ్రి ప్రేమ కురిపిస్తూ మరో వైపు నన్ను దగా చేయడం మొదలు పెట్టావు, నీ కులం, మతం, స్టేటస్‌ మంట కలుస్తాయనుకున్నావో, కని పెంచిన తండ్రిగా అది నీ హక్కు అనుకున్నావో… ఏమనుకున్నావో కానీ నన్ను మోసం చేసావ్‌. కుట్రలు చేసావ్‌. పాపం అమ్మ మధ్యలో చాలా నలిగి పోయింది. నా బంగారు తల్లి కావాలంటే కొండ మీద కోతినయినా తెచ్చి పెడతా అన్నప్పుడు, నా తల్లి నవ్వుతుంటే జగమే నవ్వుతున్నట్టు ఎంత హాయిగా ఉంటుందో అన్నప్పుడు నీవి మాయమాటలని తెలియదుగా… మా నాన్నకి నేనంటే ఆకాశమంత ప్రేమ అని మురిసిపోయా. ఈ ప్రపంచంలో ఉత్తమమైన తండ్రివి నీవేనని నిన్ను అంత ఎత్తున కొండ శిఖరంపై నిలబెట్టుకున్న. నిన్నటి వరకు నువ్వే నా హీరో. నువ్వంటే ఒక అడ్మిరేషన్‌.
రోషన్‌తో నా జీవితం పెనవేసుకోవాలని బలమైన వాంఛ మొదలైనప్పుడు కూడా అతను నువ్వు చూసుకున్నంత ప్రేమగా, బాధ్యతగా ఉంటాడా, నీ దగ్గర ఉన్నంత భద్రంగా అతని దగ్గర ఉండగలనా అని సవాలక్ష సార్లు ఆలోచించా తెలుసా నాన్నా…
తండ్రిగా నువ్వెప్పుడూ నా ఆలోచనని ప్రోత్సహిస్తావని, నా ప్రేమను బేషరతుగా అంగీకరిస్తావనే భరోసాతోనే కదా ఏ దాపరికాలు లేకుండా రోషన్‌ విషయం మీ ముందుకు తెచ్చాను.
నాన్నా… నేను అడగకుండానే బోలెడు బొమ్మలు, బట్టలు, బంగారు నగలు కొన్నావ్‌, నా పేరున లెక్కలేనన్ని ఆస్తులు ఏర్పరచావు. మొబైల్‌, లాప్టాప్‌ ఇలా ఏది అడిగితే అది ఇచ్చి నా కోరికలన్నీ తీర్చావ్‌. మరి, నా జీవితంలో ముఖ్యమైన పెళ్లి విషయంలో ఎందుకిలా కఠినంగా మారిపోయావ్‌ నాన్నా… అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కోరిక తీర్చి వెనుక ఉండి ముందుకు నడిపిస్తావనుకున్నా. కానీ, నా కలల వీధుల్లో సంగ్రామం సృష్టిస్తారని అస్సలు ఊహించలేదు నాన్నా.
నీకు పుట్టుకతో వచ్చిన కులం, మతంతో పాటు నువ్వు సంపాదించిన భవనాలు, కార్లు, నగలు, ఆస్తులు, విందులు, విలాసాలు నీ హోదా పెంచిన అహంతో బుసలు కొడతావని ఏ మాత్రం తెలుసుకోలేకపోయాను. నీ అహం నా ప్రేమని, కలల్ని, భవిష్యత్‌ ని కాటు వేయబోతున్నదని తెలిసిన క్షణం స్థాణువయ్యా. అప్పటి నుంచి నన్ను నేను వెతుక్కోవడం, నా ప్రయాణపు దారులు వేసుకోవడం మొదలు పెట్టా నాన్నా… తప్పదుగా మరి!
నాన్నా.. ఎంత ద్రోహం తలపెట్టావ్‌. మనసులో ద్రోహ చింతన పెట్టుకుని ఈ బిడ్డపై ప్రేమను ఎట్లా నటించావ్‌. అదంతా బిడ్డపై ప్రేమ అని నిన్ను నీవు మభ్యపెట్టు కున్నావు. మీ దృష్టి వక్రీకరించి కలుషితమైంది నాన్నా. ఈ క్షణంలో నా చిన్ననాటి సంఘటన గుర్తొస్తున్నది. చిన్నప్పుడెప్పుడో రెండాకుల మొలకను తుంచబోతే వారించి మొక్కలు పెంచాలని ప్రోత్సహించావు. ప్రాణ వాయువు ఇచ్చే మొక్కలు ఎదిగి నీడనిస్తాయని చెప్పావ్‌. మరి ఇప్పుడు, ఆ మొక్క లాగే ఎదుగుతున్న నా ప్రేమను తుంచి ఊపిరి తీయాలని ఎందుకు చూశావ్‌ నాన్నా. నా ప్రేమ మారాకులు తొడిగి విస్తరించాలని కోరుకోవాలిగా !.
జీవితంలో ఒక లక్ష్యం నిర్దేశించుకుని అది సాధించడం కోసం సివిల్స్‌కి సన్నద్ధం అవుతున్న రోషన్‌ని నల్లిని నలిపినట్లు నలిపేస్తానని బెదిరించావు. ఆ విషయం నాతో చెప్పని అతను తన ప్రేమను పక్కన పెట్టి లక్ష్యసాధనలో ఉన్నాడు. ఫోన్‌ ఆఫ్‌ చేశాడు. ఆ విషయం నాకు తెలియదు. అతని మాట వినకుండా ఒక్కపూటైనా ఉండలేని నేను వారం తర్వాత అతన్ని వెతుక్కుంటూ వెళ్లి స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీలో కలిశా. పరీక్షా సమయం వృధా చేసుకోవద్దు, ఇప్పుడు కష్టపడితే భవిష్యత్‌ మనదేనని పంపించేశాడు. అతన్ని డిస్టర్బ్‌ చేయకూడదని మౌనంగా వచ్చేశా, కానీ మా చుట్టూ ప్రేమ తీగలు అల్లుకుపోతూనే ఉన్నాయి నాన్నా.
నా ప్రేమను వ్యక్తం చేస్తూ, మా భావి జీవితం పట్ల కలలు కంటూ ప్రతి రోజు పోస్ట్‌ చేయని ఒక ప్రేమ లేఖ రాస్తూన్న సమయంలో నా ముందుకు ఫారిన్‌ పెళ్లి కొడుకును తెచ్చి పెట్టారు. ఊహించని పరిణామానికి రెక్కలు విరిగిన పక్షిలా విలవిలలాడా. మీ నిజస్వరూపం తెలిసింది. నా ప్రేమను బతికించుకోవాలని ఆరాటం. నా పెళ్లి, నా జీవితం నా ఇష్టాయిష్టాలతో పనిలేకుండా మీరు ముహూర్తం పెట్టించేస్తే ఎలా తట్టుకోగలను నాన్నా. మీ మాట వినలేదు. మొండికేశా. గదిలో బంధిస్తే పిల్లి పిల్ల అయినా ఎదురు తిరగక మానదు కదా.. నా విషయంలోనూ అదే జరిగింది. నా స్వేచ్ఛను, నా ప్రేమను, నా భవిష్యత్తు మీ చేతుల్లోకి తీసుకుని విధ్వంసం సృష్టిస్తుంటే, మీకు నచ్చినట్లు బతకాలని శాసిస్తుంటే, ఎలా నాన్నా… మీకు నచ్చకపోతే ఆ విషయం నాకు చెప్పాలి. లేదా నా బతుకు నాకు వదిలేయాలి. కానీ అలా జరగలేదు. నెత్తిపై పెద్ద బండరాయి ఎత్తేసిందని, గుండె గూటిని తన్నేసి పోయిందని ఆక్రోశిస్తున్నారు కానీ చిన్నప్పటి నుంచి ఎంతో సున్నితంగా పెంచిన కూతురు ఎందుకిలా చేసిందని ఒక్క క్షణమైనా ఆలోచించారా నాన్నా.. అసలు నీ పెద్దరికం అంతా ఏమైపోయింది? నా మనసు చంపుకుని నువ్వు చెప్పినట్లు చేసుకుని ఆ తర్వాత నేనెన్ని సంబంధాలు పెట్టుకున్నా మీకు పెద్ద మ్యాటర్‌ కాదు. నచ్చిన వాడిని చేసుకోవడం మాత్రం పెద్ద నేరం. యుద్ధం చేయాల్సినప్పుడు చేయాలని ఎక్కడో చదివిన వాక్యం నన్ను నడిపించింది. మరి జీవితాంతం నేను సుఖసంతోషాలతో ఉండాలంటే యుద్ధం చేయక తప్పదు కదా! అందుకే ప్రేమాభిమానాల అర్థం తెలియని మీతో, నిరంకుశ నియంతగా మారిన మీతో, చెప్పేదానికి చేసే దానికి చాలా దూరం అయిన మీ వ్యక్తిత్వంతో యుద్ధం చేయడానికి వెనుకాడలేదు. పాపం అమ్మ మనిద్దరి మధ్య నలిగిపోయింది. నేను ఇంట్లో నుంచి బయటకి వచ్చినందుకు పాపం అమ్మ. ఇప్పుడెంత కన్నీళ్లపర్యంతమవుతున్నదో .. లోపలి బాధ ఎవరికి చెప్పుకోగలదు? జీవితాంతం అమ్మకీ మానసిక వేదన తప్పదేమో…!
రోషన్‌పై ప్రేమ మొలిచి ఆకుపచ్చగా నా హృదయమంతా అల్లుకుపోయింది. ప్రేమకున్న శక్తి ఏంటో నీకు అనుభవమేగా… నీ అల్లుడు చెడ్డవాడు కాదు. చెడు అలవాట్లు లేవు. చదువు, సంస్కారం ఉన్నవాడు. నీ బిడ్డ అంటే ప్రేమ, గౌరవం, బాధ్యత ఉన్న వాడు. మన ఆస్తిపాస్తుల ఊసు ఎరగని అతనితో స్నేహం కోసం, ప్రేమ కోసం ఆరాటపడిరది నేనే. చివరికి అతని ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా పెళ్ళికి ప్రేరేపించింది, ఒప్పించింది నేనే. మేం ప్రేమించుకోవడం తప్పా? లేక పెళ్లి చేసుకోవడం తప్పా? ఎంత తరచి చూసినా నేను చేసిన దాంట్లో తప్పేమీ కనిపించడం లేదు. సిగ్గుతో తలదించుకోవలసిన పని కాదని మేం బలంగా నమ్ముతున్నాం.
నాన్నా నీకు పరువు తప్ప కన్నబిడ్డ ప్రేమ కనిపించలేదు. చదువుండి సంస్కారం లేకపోతే ఏం లాభం? తల్లిదండ్రులకు కూతురు ముఖ్యమా… పరువు ముఖ్యమా? నేను ధైర్యం చేయకపోతే నా ఇష్ట సఖుడి జీవితమే పోతుంది. అతన్ని కని పెంచిన తల్లిదండ్రులకు గుండెకోత మిగులుతుందని అర్థమైన తర్వాత మౌనంగా ఎలా ఉండగలను?! తల్లిదండ్రుల కోసం, బంధువుల కోసం, సమాజం కోసం రాజీపడి జీవితాంతం మనసు ఒకచోట, శరీరం ఒకచోట ఉంటూ ఎలా బతకగలను? తల్లిదండ్రుల నిర్ణయాన్ని ఎలా స్వాగతించగలను?
నిజానికి నాకిది సాహసమే. నా ఇష్టాన్ని కాదని పరువు ప్రతిష్ట అని వేలాడుతూ నన్ను ఇంటికి బందీ చేయడం వల్లనే కదా ఈ సాహసం చేయాల్సి వచ్చింది. ఇద్దరం ఉద్యోగంలో స్థిరపడ్డాక పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలన్న మా నిర్ణయం ఆవిరైపోయింది. మనం ఒకటి తలిస్తే కాలం మరొకటి నిర్ణయించింది. ఏం చేద్దాం… నువ్వు చెప్పింది జరగాలి అనే పంతం, పట్టుదల, పెళుసు బారిన మనోభావాలు, అహంకారంతో నా కలల్ని కాల్చేయాలని చూస్తారని అసలు ఊహించలేదు. ఆ విషయం తెలిసిన క్షణాల్లో నేనెంత నరకం అనుభవించానో నీకు తెలుసా…
అసలు పరువు అంటే ఏంటి నాన్నా? నేను రోషన్‌ మాయలో పడి నిన్ను కాదనుకోవడం కాదు నాన్నా… నువ్వే కులం, ధనం మాయలో కన్నబిడ్డ కలల్ని, ఆకాంక్షల్ని కాటికి పంపాలనుకున్నావ్‌. బరితెగించానని నన్ను తిడుతున్నారు కానీ మనిషి ప్రాణం తీయడానికి బరి తెగించింది నువ్వే కదా నాన్నా… నీవు పరువు కోసం చేసిన తెగింపే నన్ను నా ప్రేమను నిలుపు కొమ్మని తెగించేలా చేసింది. ఇదంతా జరగడానికి కారణం ఎవరు నాన్నా.. నేనా మీరా? నీకు నాకంటే, నా ప్రేమ కంటే బంధువులు, సమాజం ముఖ్యం అయిపోయి నేను శత్రువుగా మారిపోయా కదూ…
‘ఒక ఆడపిల్ల ధైర్యంగా తలెత్తుకుని నిలబడి, తనకు నచ్చినట్లు చేస్తే సమాజం అంత వణికిపోతుందా… కులం పరువు తొక్క తోటకూర అంతా దండుగామారి వ్యవహారం అక్కా… పెద్దలు అర్థం చేసుకోవచ్చుగా… అట్లా ఆలోచిస్తే అందరూ ఎంత హాయిగా ఉండొచ్చు’ అన్నది చెల్లి. చిన్న పిల్లయినా ఎంత ఉన్నతంగా ఆలోచించింది. గబ్బిలాల్లా కులం, మతం, ఆస్తి అంతస్తులు అంటూ ఎన్నాళ్ళు పట్టుకు వేలాడుతారు నాన్నా.. కుల పైత్యం నెత్తికెక్కిన ఇంత గలీజు సమాజంలోనా నేనున్నది అని సిగ్గుగా ఉన్నది. ఈ నిమిషాన మేము సంపాదనపరులు కాకపోవచ్చు. కానీ ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా ఎవరిపై ఆధారపడకుండా బతకగలమనే సంపూర్ణ విశ్వాసం మాకుంది నాన్నా…
మీ అభీష్టానికి వ్యతిరేకంగా నేను పెళ్లి చేసుకోవడం మీ అహాన్ని, ఆధిపత్యాన్ని దెబ్బ తీసి ఉండొచ్చు. లేదా మీకు బాధ కలిగించి ఉండవచ్చు. కాదనను. కానీ, నన్ను ఫ్లెక్సీకి ఎక్కించి, పోస్టర్లు వేసి చావు చేస్తే కొత్త పరువు పుట్టుకొచ్చిందా నాన్నా? ఈ సృష్టిలో ప్రతి జీవికి నచ్చిన తోడుని వెతుక్కుని జతకట్టడం సహజం. అలాగే, నచ్చిన తోడు వెతుక్కుని, చట్టప్రకారం పెళ్లి చేసుకున్నందుకు శ్రద్ధాంజలి ఘటిస్తూ చావు ఫ్లెక్సీ పెట్టావు. అది మర్యాదనా? స్వతంత్రంగా ఎదిగిన బిడ్డల్ని, వారి నిర్ణయాన్ని వారికి వదిలేస్తే, వారి ప్రేమను గెలిపిస్తే మీరనుకునే పరువు మర్యాదలు ఇంకా ఎత్తుకు ఎదిగి ఉండేవని ఆ వైపుగా ఎందుకు ఆలోచించరు నాన్నా…
మీలాంటి వారి పగ ప్రతీకారం ఎదుర్కోలేకనే కదా ఎన్నో ప్రేమ జంటలు మృత్యు ఒడికి చేరేది. కానీ మేం ఆ పిచ్చి పని ఎప్పటికీ చేయం. మమ్మల్ని మేం నిలబెట్టుకోగలం. మా ప్రేమను బతికించుకోగలం. ఈ విషపూరిత కులమతాల సమాజంలో మేం ఓడి బతకాలనుకోవట్లేదు. పోరాడి బతకాల్సిందే. జీవితం అంత సింపుల్‌ కాదని ఎంతో విలువైనదని ఈ నెల రోజుల కాలం నేర్పింది.
మా జీవితం బాధ్యత మాదే… ఏడ్చే నోళ్లను ఏడవనిస్తూ… బేఫికర్‌ మా దారిలో మేం నడుస్తాం నాన్నా… చావు ఫ్లెక్సీ మీ బహుమతి అనుకుని భద్రంగా దాచుకుంటా… బెల్‌ మోగడంతో రాయడం అపి, వెళ్లి తలుపు తీసి స్థాణువై నిలబడిపోయింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.