మనమున్నాము కాబట్టి మరెందరో కూడా మనలానే ఉండి ఉంటారు. మనకు అవసరాలు ఉన్నాయి కాబట్టి మిగిలిన వారికి కూడా అవసరాలు ఉండే ఉంటాయి. కానీ బాధా మనదే బాధ్యతా మనదే. లొంగదీసేవారము మనమే, లొంగిపోయేవారమూ మనమే. సర్వం అద్వైతమే. కానీ ద్వైతంలో చూస్తేనే కిటుకు బోధపడేది.
ఆడవారి మీద మగవారి దుండగత్వం, దౌర్జన్యం, హింస, మోసం – ఇవన్నీ చెప్తాము. కానీ వ్యవస్థ ఇదంతా సృష్టిం చింది అని తరచూ మర్చిపోతాము. ఈ దౌర్జన్యాన్ని ప్రోత్సహించే అదే వ్యవస్థ, దౌర్జన్యం అమలు చేసేవారిపై కూడా దౌర్జన్యం చేయగలదు అని గుర్తించము.
పుట్టినప్పటి నుండే వీడు పెద్దయ్యి వంశానుద్ధరించే పురుష పుంగవుడు. అతని మగతనం, సామర్ధ్యం, శక్తిని ఒక్కో మాట(వారసుడు, వంశోద్ధారకుడు), ఒక్కో ప్రవర్తన(కాళ్ళు పట్టాలా నాన్నా), ఒక పొగడ్త(నీకేరా మగాడివి), తిట్టు (ఆడ దానిలా ఏడుస్తావేం)- ఇలా అతని చుట్టూ కోటగట్టి, ఈ మగతనపు బింకపు అపో హలో బంధిస్తుంది. భయమేసి చెప్పుకునే నాధుడేడీ? చుట్టూ ఎత్తైన గోడలు. భావో ద్వేగాలు అక్కడ నుండి దాటలేవు. కోపా నికి ఆగ్రహానికి, భీభత్సానికి మాత్రమే ఆ కోట ద్వారాలు తెరుచుకుంటాయి. కోట లోపల మౌనంలో ఆ చిన్ని మనసు పడే ఆవేదన అనవసరం.
ఏడవకు ఏడవకు బాబు నువ్ కోపాన్ని ప్రదర్శించడానికే పుట్టావు ఇక్కడ. నీ బాధని కోపానిగా మార్చేద్దామ్. ఆ కరెన్సీ మాత్రమే చెల్లుతుంది ఇక్కడ. నీ భయాన్ని చెప్పుకుంటే నీ భార్యే కాదు, నీ తల్లే అసహ్యించుకుంటుంది. మగాడివి కదా నాన్న.. ధైర్యంగా ఉండాలి. నీకు ఏడ్చే అర్హత లేదు, ఓదార్పు, ప్రేమలను కూడా ఆయుధాలుగా మార్చుకో.
అదిగో అటు చూడు. ఆడవాళ్ళంతా ఎంత ఆనందంగా ఉన్నారో. ఆ పిల్ల ఈ పిల్ల బుగ్గని గిల్లి కొరికింది. నన్నే చేసుకోవే అంటోంది. కాదు వాళ్లు లెస్బియన్లు కారు, అచ్చంగా స్నేహితులే. ఇదిగో, ఇంకో పడుచు పిల్ల తన స్నేహితురాలికి తినిపి స్తుంది. పక్కన అమ్మాయేంటి ఏడుస్తోన్నది? మిగిలిన అమ్మాయిలు ఓదారుస్తున్నారు. మనకు మందుకొడితే తప్ప ఆ భాగ్యం లేదు కదరా! ఓదార్పు కూడా ఓల్డ్ మాంక్ బాటిల్ నుండి అరువు తెచ్చుకున్నదే.
ఉద్యోగం పురుష లక్షణం కదరా బాబు. మరి ఉద్యోగం ఉందా? ఎంత జీతం? అయ్యో వాడికన్నా తక్కువా? ఎక్కడ కొన్నావు ఇల్లు? టూ బెడ్రూమా?, విల్లానా? భార్యకి, పిల్లలకి నగలు చేయించావా? ఫామిలీని ఫారెన్ ట్రిప్‌కి తీసుకెళ్ళావా? ఎలాంటి కారు వాడుతు న్నావు? చెప్పు చెప్పు, ఎంత వెనకేసావు?
మీ జీవితం అంతా పరిమాణ క్రమమే. నీ పురుషాంగం నుండి నీ కారు సైజు దాకా. నీ ప్లాట్, ఫ్లాట్, నీ బ్యాంకు బాలన్స్, నీ షేర్ల విలువ బట్టే మార్కెట్లో నీ విలువ. కట్నాలు తీసుకున్నారని మిమ్మల్ని ఆడిపోసుకుంటారు గాని డబ్బులిచ్చి కొనుక్కోబడే ఆర్టిఫిషల్ అక్వేరియములురా మీరంతా.
ఏ నాన్న.. సెక్సువల్ పెరఫార్మన్స్ గురించి భయాలా, ప్రశ్నలా? వాటికి ఒక దిక్కుమాలిన దారి ఉంది. నీలానే అవగాహన తక్కువ, అపోహలు ఎక్కువ ఉన్న స్నేహితులు, హకీమ్‌లు, వీధి చివర మూలికలు, మునక్కాయ పులుసులు, వయాగ్రాలు – విపరీత ధోరణులు. క్రియేషన్‌కు, రిక్రియేషన్‌కు, మీకు ముగ్గులా ముచ్చట్లా- పాపం! పిల్లల సంగతి తరవాత, మీ సామర్ధ్యం కొలవడానికి సమాజం సదా సిద్ధపడే ఉంది.
దుఃఖం, ఆవేదన, భయం, బలహీనత – ఇవేమి చెప్పకురా అయ్యా! నువున్నది రక్షించడం కోసమే. నీకు రక్షణ ఎందుకు? కావాలంటే భక్షించుకో. తిట్టు, తన్ను, లాగు, తొయ్యి, జుట్టు పట్టుకో, యోనికి కాపలా కాయి, లేదంటే దానిని హిం సించు, రక్తించు. అంతేకాని సహాయం కావాలని చేయి చాచకురా. అర్ధించకు, నీ మగాడి ఎలిమెంట్ మైనస్ అయి పోతుంది.
సరే నీ కోరికలు ఆపుకో, నీకు పుట్టబోయే పిల్లల్ని పాజ్‌లో పెట్టు. కానీ నీ అక్క, చెల్లి పిల్లల్ని ఈ ప్రపంచంలో రాకుండా ఎలా చేయగలవు! అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు, పురుళ్ల దగ్గర నుండి, ఓణీలు, నగలు, మెట్టెలు, పెళ్లిళ్లు – ఏందిరా అయ్యా నీకీ బాధ?
మరేం మార్గం. ఉందిగా దారి. దా… మిగిలినది నీ ఆధిపత్యమే. పెత్తనం చెలాయించు. గీతలు గీయి, ఎటిఎం కార్డులు లాక్కో, ఇష్టం లేకుండా రమించు (నీ హక్కు కదరా), ఛీత్కారాలు భరించు. మగ జంతువు అని తిట్టించుకో, ఒళ్ళు విరుచుకో, సిగ్గుని మడచుకో, లేదా ధీమాగా ధరించు.
నీలో పురుషత్వం ఏమోగాని, మనిషి తనాన్ని చంపేసారు కదరా! పోన్లే డబ్బు, దస్కం, ఆస్తి, పురుషత్వం ఇలా అన్ని రకాల కిరీటాలు తీసేసాక కూడా నీకు మగవాడు అనే కిరీటం మిగిలి పోయింది కదా. అప్పుడప్పుడు నొప్పి పుడుతుందేమో, తల భారమైందేమో, బరువు మోయలేకు న్నారేమో… కిరీటాన్ని తీసేయండి నాయనా!