చ్చో చ్చో .. పాపం. ఆ పెద్దవ్వకు చూత్తే పానం కలకల ఐయితాంది. ముత్యాలసొంటి ముగ్గురు కొడుకులని మురిసిన తల్లి గాచారం గిట్ల కాలబడే అంటూ లోనికి వెళ్ళిపోయింది యాదమ్మ. యాదమ్మ ఎప్పుడూ ఇంతే. చెప్పేదేదో సరిగ్గా చెప్పదు. చేట చీపురుతో వచ్చిన యాదమ్మను చూస్తూ సస్పెన్స్ సీరి యల్‌లా కాకుండా చెప్పేదేదో సరిగ్గా చెప్పి చావొచ్చుగా… కసిరింది మా అత్త గారు.
‘‘ప్చ్… పాపం. ఆ తల్లి గాచారం అట్లా కాలబడ్డది. పిస్స పిస్స అయిపోయింది. కొడుకుల కోడళ్ల యాదిల ఉండరట. దిమాక్ లేని మాటలకు ఒక్క కోడలు దగ్గర రానియ్యదట. కొడుకులకు తల్లి మీద పానమున్న వాళ్ళేం జేత్తరు తల్లికి? కొడుకులు మనిషిని పెట్టి ఊర్లనే ఉంచిన్రట. మాధవి మేడం తల్లి పోయి అక్కకు అర్సుకుంటడట. నిన్న మాధవి మేడం తల్లికి, ఆమె అక్కకు తెచ్చుకున్నది.’’ అంటూ వాకిలి శుభ్రం చేయడానికి వెళ్ళిపోయింది యాదమ్మ.
ఆడపిల్లలు లేని ఆవిడ మాధవిని సొంత కూతురులా ప్రేమిస్తుందని తెలుసు. అప్పుడ ప్పుడు వచ్చి వెళుతుంది. ఈ రెండేళ్ల క్రితం ఆవిడ భర్త ఆక్సిడెంటులో పోయారు. ఆ సంఘటన, ఒంటరితనం ఆమెను బాగా కుంగ దీసింది. కళ్ళేదుట ఉన్న కొడుకుల్ని గుర్తించ లేకపోవడం, పేర్లు మరచిపోవడం, బాత్‌రూమ్ ఏదో, బెడ్‌రూమ్ ఏదో గుర్తించ లేకపోవడం వంటి గందరగోళ పరిస్థితి లోకి వెళ్ళింది. ఒక్కోసారి తనలో తానే ఏదేదో మాట్లాడటం చూసి కొడుకులు ఆసుపత్రిలో చూపిస్తే డిమెన్షియా అని చెప్పారని, ఆవిడ సంరక్షణ భారం మోయడానికి కొడుకులు, కోడళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని, రోజు రోజుకి డిమెన్షియా లక్షణాలు పెరిగి అల్జీమర్స్ కూడా తోడయిందని ఈ మధ్య మాధవి బాధపడటం గుర్తొచ్చింది.
అయ్యో పాపం. మా మేనత్త కూతురు వకుళ కూడా అలాగే చిత్తవైకల్యంతో బాధ పడుతున్నది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కోసారి అందరిపై కోపంగా ఉంటే ఇంకోసారి ఎప్పుడో చిన్నతనంలోకి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి మలమూత్రాలు
వచ్చేది కూడా తెలియదు. వయసు పెరిగి మతిస్థిమితం పోయిందనుకున్నారు కానీ, అది చిత్తవైకల్యం అని తెలిసింది. పాపం దాన్ని కాపాడుకోవడానికి తిప్పలు పడ్తాంది బిడ్డ. ఉద్యోగం కూడా సెలవు పెట్టేసింది. ఇట్లాంటి వాళ్ళని చూసుకోవటం ఎంత కష్టమో… పగవాళ్ళకి కూడా ఆ కష్టం వద్దు… స్వగతంలో మా అత్తగారు మాధవి వాళ్ళ పెద్దమ్మ, మా అత్తగారి కజిన్ మాత్రమేనా!
మనదేశంలో 60 ఏళ్ళు పైబడిన వారిలో దాదాపు కోటి ఎనిమిది లక్షల మంది డిమెన్షియా బాధితులే. అంటే 8.44% బాధపడుతున్నారని ఓ అధ్యయనం చెబుతున్నది. డిమెన్షియా వచ్చిన వారిలో దాదాపు 60-70 శాతం మందికి అల్జీమర్స్ ఉందని WHO లెక్కలు చెబుతున్నాయి. పట్టణ ప్రాంతం (5.3) కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే (8.4) ఎక్కువ అని తెలుస్తున్నది. అదే స్త్రీ పురుషులలో చూసినప్పుడు మహిళల్లో 9.0% ఉంటే పురుషుల్లో 5.8% మాత్రమే. బహుశా గతంలో కంటే ఇప్పుడు మనిషి జీవితకాలం పెరగడం, అందులోనూ పురుషుల కంటే మహిళల జీవిత కాలం మరింత ఎక్కువగా ఉండడం, మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా అనిపిస్తున్నదేమో! ఆమె మానసిక స్థితిలో మార్పు, వ్యక్తిత్వంలో మార్పు రావడం వెనుక ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్‌కి ఏమైనా సంబంధం ఉందా? జన్యుపరమైన కారణాలు ఉన్నాయేమో! అదీకాక గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు వాడే రకరకాల మందుల ప్రభావం వంటి వాటిపై పరిశోధన అవసరం. పురుషులతో పోల్చుకున్నప్పుడు మహిళల్లో క్రమబద్ధమైన వ్యాయామం చేసే అవకాశం తక్కువ. మెదడు చురుకుగా ఉండే కార్యకలాపాలు తక్కువ, సరైన ఆహారం తక్కువ.
బయటి ప్రపంచంతో సంబంధాలు తక్కువ. అవన్నీ కూడా ఆమె చిత్తవైకల్యానికి దారి తీస్తున్నాయి కావచ్చు. ఏదేమైనా చిత్తవైకల్యం పెరగడానికి, లింగ వ్యత్యాసాలకు కారణమేంటో పరిశోధనలు జరగాలి. కొత్త విశ్లేషణలు, తగిన వైద్యం అందాల్సిన అవసరం మాత్రం ఉంది.
మాధవి పెద్దమ్మ విషయంలో ఆమె కొడుకులు కోడళ్లను సమాజం దోషులుగా చూస్తున్నది కానీ వాళ్ళ పరిమితులు వాళ్లవి. అత్తయ్య అన్నట్లు చిత్తవైకల్యంతో ఉన్న వారి సంరక్షణ సామాన్య విషయం కాదు. ఖరీదైనది. చిత్తవైకల్యం ఉన్న వ్యక్తుల వ్యక్తిగత సంరక్షణ అవసరం. ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యుడు, సామాజిక కార్యకర్త, నర్సు, సంరక్షకులు వగైరా వగైరాలతో 15 మందితో కూడిన బృందం అవసరం. ఇది మన దేశంలో సాధ్యమా? మనదేశంలో చిత్తవైకల్యంతో ఉన్న రోగులకు సహాయం అందించే ప్రభుత్వ సంస్థలున్నాయా? కేరళలో ఒక సంస్థ మినహా ఎక్కడా లేవు. మన రాష్ట్ర విషయానికి వస్తే, ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు నిర్వహించే డిమెన్షియా ఆశ్రమాలు లేదా కేర్ సెంటర్స్ హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. నెలకు 70 వేలకు పైగా వసూలు చేసే ఆ సెంటర్స్ చేరుకో గలిగేది ఎంతమంది? ఎగువ మధ్య తరగతి, మధ్యతరగతి, అల్పా దాయ వర్గాల డిమెన్షియా బాధితులకు అందని ద్రాక్షే కదా..! మామూలు ఓల్డేజ్ హోమ్స్, నర్సు సహాయంతో ఇంటి వద్దే సంరక్షణ అందించడం ప్రభావంతంగా ఉండదు. అందుకే ప్రైవేటు సంస్థలు డిమాండ్ చేసే మొత్తం ఎక్కువ.
క్రమంగా పెరిగిపోతున్న చిత్తవైకల్యం దృష్టిలో పెట్టుకుని ఈ మానసిక స్థితిలోని వారి కోసం పసిపిల్లలకు డే కేర్ సెంటర్స్ లా డిమెన్షి యా డే కేర్ సెంటర్స్, వృద్ధాశ్రమాలు ఉన్నట్లు గా చిత్తవైకల్యంతో బాధపడే వారి సంరక్షణ కోసం ఆశ్రమాలు ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉంది. డిమెన్షియాని ఎదుర్కోవడం కోసం క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే విధంగా చిత్తవైకల్యం గలవారితో సంరక్షకులు ఎలా ప్రవర్తించాలో తెలిపే శిక్షణ అవసరం కూడా ఉంది.
మనదేశంలో ఈ డిమెన్షియా పట్ల అవగా హన చాలా తక్కువ. ఈ సమస్య ఆరోగ్య ప్రాధా న్యతగా గుర్తించి కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై దృష్టి పెట్టి నేషనల్ డిమెన్షియా యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. మారుతున్న జీవన శైలి, జీవన ప్రమాణం, సామాజిక సాంస్కృతిక పరిస్థితుల్లో మహిళను చిత్తడి చేస్తున్నది చిత్తవైకల్యం. ఆ దాడిని ఆపడం లేదా నయం చేయడం సాధ్యం కాకపోవచ్చు కానీ దానిని నెమ్మదింప చేయవచ్చు. ఆ దిశగా ప్రభుత్వ అడుగులు పడాలని కోరుకుందాం.