అనువాదం: ఎ. సునీత
నిజమైన స్వాప్నికులం కావాలంటే మన ఊహలన్నీ వాస్తవ పరిస్థితులలో బలంగా వేళ్ళూనుకుని ఉండాలి, అలాగే ఆయా పరిస్థితుల నుండి ముందు కెళ్ళి కొత్త సంభావ్యతల గురించి కూడా ఆలోచించగలగాలి. సమకాలీన స్త్రీవాదానికున్న బలం ఏంటంటే తనని, తన మార్గాన్ని మార్చుకోగలగటం. పాతబడిపోయిన ఆలోచనలు, కార్యాచరణని పట్టుకు వేళ్ళాడే సామాజిక న్యాయ ఉద్యమాలన్నీ విఫలమవుతాయి.
ముందుచూపున్న స్త్రీవాదానికి (విజనరీ ఫెమినిజం) 1960ల మొదట్లోనే బీజాలు పడ్డాయి. స్త్రీ విముక్తి ఉద్యమం మొదలయినప్పుడే కొంతమంది ఇటువంటి ముందు చూపున్న స్త్రీవాదులు ఇట్లా కలలు కనే వాళ్ళు: సంస్కరణ దశలో ఇప్పుడున్న జాత్యహంకార పెట్టుబడి దారీ పితృస్వామ్య వ్యవస్థలో పౌర హక్కులని సంపాదించుకోవటానికి స్త్రీవాదం పని చెయ్యాలి: కానీ, అదే సమయంలో దాని క్రింద గోతులు తవ్వి, ఆ వ్యవస్థనే కూల దొయ్యటానికి అవసరమయ్యే రాడికల్ విప్లవ దిశగా పని చెయ్యాలి. అధిపత్యంపై ఆధారపడిన సంస్కృతిని మార్చి వేరే సంస్కృతి సృష్టించాలి: ఒక సమూహ తత్వంలో వేళ్లూనుకున్న భాగస్వామ్య ఆర్ధికం, సామ్యవాదంతో కూడిన ప్రజాస్వామ్యం, జెండర్, జాతి పరమైన వివక్ష లేని ప్రపంచం, ఒకరి మీద మరొకరు ఆధారపడి, ఒకరిని ఒకరు చూసుకునే నైతికతతో కూడిన మానవ సంబంధాలు, ఈ భూగోళం మీద అందరూ శాంతియుతంగా, క్షేమంగా ఎలా బ్రతకాలో, అసలు భూగోళాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసిన సంస్కృతి. అటువంటి ప్రపంచం కోసం కలలు కన్నారు వీళ్ళు.
ఉద్యమం ముందుకెళుతున్న క్రమంలో రాడికల్/విప్లవ స్త్రీవాద స్వప్నాలు మరింత స్పష్టతని, సంక్లిష్టతని సంతరించుకున్నాయి. అయితే వున్న సామాజిక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే సంస్కరణ వాద స్త్రీవాదుల నిరంకుశత్వ నీడలో ఈ స్వప్నాలు మరుగున పడిపోయాయి. కొంతమంది జెండర్ ఆధారిత ఆర్ధిక వివక్ష తగ్గితే తమ సామాజిక వర్గాల్లోని మగవాళ్ళతో సమానంగా తమకీ అవకాశాలు వస్తాయని నమ్మి దాని కోసం పని చేస్తే, మరి కొంత మంది సంస్కరణ వల్లే వాస్తవ పరిస్థితులలో కొంతయినా మార్పు వస్తుందని నమ్మారు. అయితే స్త్రీవాద సంఘర్షణకి గుండె కాయ అయిన విప్లవాత్మక భావనలని వదిలెయ్యటం వల్ల అది పెట్టుబడిదారీ పితృస్వామ్యం స్త్రీవాద ఉద్యమాన్ని వాడుకోవటానికి ఉపయోగపడిరది.
సామాజిక వ్యవస్థలో పైకి వెళ్ళటం సాధ్యపడి, వర్గ ఆధిపత్యం, పైకి వెళ్లే అవకాశాల మోహంలో పడిన స్త్రీలలో తర్వాత అతి కొద్ది మంది వ్యవస్థని కూల దొయ్యటానికి సిద్ధ పడ్డారు. కారల్ గిల్లిగాన్ వంటి స్త్రీవాద ఆలోచనా పరులు మనకి ‘స్త్రీలలో పురుషుల కన్నా ఇతరులని చూసుకునే గుణం
ఉంటుందనీ, అందుకే నైతికతతో ప్రవర్తిస్తుంటారని’ చెప్పారు గానీ, తమ కంటే తక్కువ అధికారాలున్న స్త్రీలతో అధికారమున్న స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారో చూస్తే మనకు తప్పకుండా వేరే అభిప్రాయం కలుగుతుంది. ‘తమ’ అనుకునే సమూహాల స్త్రీలతో (జాతి కావొచ్చు, రేస్ కావొచ్చు) స్త్రీల ఈ నైతిక ప్రవర్తన ‘తమది’ కాని సమూహాల స్త్రీలతో కలిసినప్పుడు కన్పించదు. ఆ సహానుభూతి, సంఫీుభావం ఎక్కడా కనిపించవు. విశేషాధికారాలు వుండే స్త్రీలు (ప్రధానంగా తెల్ల జాతి స్త్రీలే కానీ కొంతమంది వేరే వాళ్ళు కూడా) శ్రామిక, పేద స్త్రీలని క్రిందికి తొక్కి పెట్టటం అనే కార్యక్రమంలో చాలా త్వరగా చేరి పోయారు.
ముందు చూపు వున్న స్త్రీవాదం స్త్రీల పరిస్థితులని మార్చి, వారి వ్యక్తిగత అధికారాల్ని పెంచటం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. దాని కోసం ఉద్యమం ‘సమాన హక్కుల’ ఎజెండా నుండి పక్కకి తొలిగి అందరు స్త్రీలు, ముఖ్యంగా పేద స్త్రీలని కలుపుకునే అక్షరాస్యతా ఉద్యమం వంటి దాన్ని చేపట్టాల్సి వస్తుంది. స్త్రీవాదాన్ని నేర్పించటానికి ఏ స్కూళ్ళు, కాలేజీలు లేవు. అటువంటివి స్థాపించటానికి ఏ ప్రయత్నం జరగలేదు. చదువుకున్న తెల్లజాతి స్త్రీలు ఉద్యోగ రంగంలో వివక్ష తొలగింపు చర్యల వల్ల బాగా ప్రయోజనం పొందారు. కానీ స్త్రీవాద సూత్రాల పైన ఆధారపడ్డ సంస్థల్ని నిర్మించటంలో పెద్దగా ఆసక్తి కన్పించలేదు. అటువంటి సంస్థలు పెద్ద పెద్ద జీతాలు ఇవ్వలేవు. బాగా డబ్బున్న స్త్రీవాద కార్యకర్తలు కూడా తమ డబ్బుని మౌలిక నైపుణ్యాలు లేని స్త్రీల ప్రయోజనాల కొరకు విద్యా కార్యక్రమాలను చేపట్టటం కోసం వినియోగించలేదు.
ముందు చూపున్న స్త్రీవాద ఆలోచనా పరులు విస్తృత ప్రాతిపదికపై ఆధారపడిన – వర్గంతో సంబంధం లేకుండా బాలికలు, బాలురు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికోసం స్త్రీవాద ఉద్యమ అవసరాన్ని – అర్ధం చేసుకున్నారు గానీ, దానికి సంబంధించిన సిద్ధాంతాన్ని అందరికీ అర్ధమయ్యే, చెప్పగలిగే భాషలో రాయలేదు, రూపొందించలేదు. ఈ రోజుల్లో అకడమిక్ సర్కిళ్లలో అందరూ పొగిడే స్త్రీవాద సిద్ధాంతం కేవలం బాగా చదువుకున్న వారికి తప్ప వేరే ఎవరికీ అర్ధంకాని అతి అధునాతన భాషలో ఉంటుంది. మన సమాజంలో అత్యధిక జనాభాకి స్త్రీవాదం గురించి మౌలిక అవగాహన కూడా ఉండదు. వాళ్ళు అర్ధం చేసుకోగలిగే చోట – స్కూళ్లల్లో, బయటా విరివిగా లభించే సమాచారంలో – అది దొరకదు, ఎందుకంటే అసలు అటువంటి రచనలు లేనే లేవు. అందరికీ అవసరమైన స్త్రీవాద
ఉద్యమం నిర్మించాలంటే మనం అందరికీ అర్ధమయ్యే స్త్రీవాద రచనలని సృష్టించటం కూడా అవసరం.
మనకి కూడా టెలివిజన్ ఛానెళ్లు, లేకుంటే ఆ ఛానెళ్లలో మనకొక టైం అంటూ ఉండేటంత వనరులని స్త్రీవాద కార్యకర్తలు ఇప్పటికీ సమకూర్చుకోలేదు. ఇప్పటికీ ఏ టెలివిజన్ ఛానెల్లో ఒక స్త్రీవాద వార్తా సంచిక గానీ రేడియో షో గానీ లేదు. చేయాలనుకునే వారి దారిలో పెద్ద అడ్డంకి ఏమిటంటే – ‘స్త్రీలు’ వస్తువుగా వున్న ఏ వార్తయినా ‘స్త్రీవాదం’ గానే పరిగణించబడటం, దాన్లో ఏ మాత్రం స్త్రీవాద విశ్లేషణ, అవగాహనా లేకపోయినా సరే. మనకి స్త్రీల గురించి, జెండర్ గురించి మాట్లాడే రేడియో కార్యక్రమాలు వున్నాయి, కానీ వాటిని స్త్రీవాదం గురించి మాట్లాడేవిగా పరిగణించటం కష్టం. సమకాలీన స్త్రీవాదం సాధించిన గొప్ప విజయం ఏమిటంటే, ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు చాలా మంది జెండర్, స్త్రీల గురించి మాట్లాడటానికి సిద్ధపడటం. అయితే ఆ చర్చలు స్త్రీవాద దృక్పధం నుండి మాత్రం జరగట్లేదు.
ఉదాహరణకి, స్త్రీవాదం సమాజంలో ఒక సాంస్కృతిక విప్లవాన్ని తెచ్చి ఆడవాళ్లపై, పిల్లలపై మగవాళ్లు చేసే హింసని గురించి అందరూ ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది. ప్రసార సాధనాల్లో ఈ హింస గురించి చర్చలు అనేకం జరుగుతాయి గానీ, పురుషులు చేసే హింసని, పురుషాధిపత్యంతో, దాన్ని పితృస్వామ్యంతో అనుసంధించి చూడటం అరుదుగా జరుగుతుంది. ఈ దేశంలో అత్యధిక పౌరులు ఇప్పటికీ ఇళ్లల్లో పురుషులు చేసే దాష్టికానికి, సమాజంలో పురుషాధిపత్యానికి మధ్య సంబంధాన్ని అర్ధం చేసుకోలేదు. ఆ వైఫల్యమే, కుటుంబ సభ్యులను, స్నేహితులను, తోటి విద్యార్థులను క్రూరంగా హత్యలు చేసే యువకుల గురించి కార్యాచరణ విఫలం కావటానికి కూడా కారణం. ప్రసార సాధనాల్లో ఇటువంటి హింస గురించి జరిగే చర్చల్లో ఈ హింసని పితృస్వామ్య ఆలోచనా ధోరణులకు ఎప్పుడూ జోడిరచరు.
విస్తృతంగా విమర్శనాత్మక చైతన్యం పెంపొందించటం కోసం స్త్రీవాద విద్య అవసరం. దురదృష్టవశాత్తూ వర్గపరమైన కులీనతత్వం స్త్రీవాద ఆలోచనా రీతుల దిశని నిర్దేశించింది. అత్యధిక శాతం స్త్రీవాద ఆలోచన పరులు, సిద్ధాంత కర్తలు తమ పనిని విశ్వవిద్యాలయాల్లో చేస్తారు. చాలా వరకూ మనం పిల్లల పుస్తకాలు రాయం, స్కూళ్లలో చదువు చెప్పం. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చెప్పే చదువు ఎట్లా
ఉండాలనే దాని గురించి బలమైన లాబీ ఏర్పాటు చేసుకోము. స్త్రీవాద ఉద్యమం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే నేను పిల్లల కోసం పుస్తకాలు రాయటం ప్రారంభించాను. అలాగే వినగలిగే పుస్తకాలు (ఆడియో పుస్తకాలు) చదవటం, రాయటం రాని వ్యక్తులకి కూడా ఈ సందేశాన్ని చేర వెయ్యటానికి పనికొస్తాయి.
స్త్రీవాద ఉద్యమం కొత్తగా మొదలు పెట్టాలంటే మన రాజకీయాలు రాడికల్‌వనే సందేశాన్ని ప్రతి ఇంటి తలుపు తట్టి చెప్పటం అవసరం. రాడికల్ విషయాలని పాతాళంలోకి తొయ్యటం మన సమాజంలో మామూలే. కాబట్టి స్త్రీవాదం అందరి దృష్టిలోకి రావటానికి, అందరికీ చేరటానికి మనం చాలా పని చెయ్యాలి. స్త్రీవాదమంటే సెక్సిజం, సెక్సిస్టు ఆధిపత్యం, పీడన అంతం చెయ్యటానికి జరిగే ఉద్యమమని, దానిలో జెండర్ వివక్షని అంతం చేసి, సమానత్వాన్ని తేవటం భాగం కాబట్టి మనది మౌలికంగా ఒక రాడికల్
ఉద్యమమని చెప్పగలగాలి.
స్త్రీవాద ఉద్యమకారులు సెక్సిజంని సమూలంగా ప్రశ్నించకుండా సంస్కరణపై దృష్టి కేంద్రీకరించటంతో స్త్రీవాద రాడికల్ తత్వం గురించి అయోమయం తలెత్తింది. అనేక రకాల స్త్రీవాదాలు ఉండొచ్చు అన్న భావనని ముందుకు తీసుకెళ్ళటంతో సాంప్రదాయ వాదులు, ఉదారవాదులు దీన్ని వాడుకున్నారు. తమ అవకాశాలని మెరుగుపరుచుకునే స్త్రీల వర్గపరమైన ప్రయోజనాలకు సంస్కరణ వాదం చాలా ఉపయోగపడిరది. వీళ్ళే ‘అధికార స్త్రీవాదం’ (పవర్ ఫెమినిజం) అనే భావనని మొదటిగా వాడిన వాళ్ళు. వీళ్ళే నెమ్మదిగా స్త్రీవాదులు కూడా గర్భస్రావానికి వ్యతిరేకమైన వైఖరి తీసుకోవచ్చు అని చెప్పటం ప్రారంభించారు. ఇది ఇంకొక తప్పుడు భావన. తమ శరీరాలపై కనీస పౌర హక్కుని ఇవ్వటం ఒక మౌలిక స్త్రీవాద సూత్రం. ఆమె ఆ హక్కుతో గర్భస్రావం చేయించుకుంటుందా అన్నది వ్యక్తిగత నిర్ణయం. చేయించుకోవటం స్త్రీవాదానికి వ్యతిరేకం కాదు. కానీ ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఉండటం ఒక మౌలిక స్త్రీవాద సూత్రం. వర్గపరమైన ప్రయోజనాలు, అధికారం, సంపద కోసం కాంక్ష రెండూ కలిసి పేద, శ్రామిక వర్గ స్త్రీల ప్రయోజనాలను కులీన స్త్రీలు తాకట్టు పెట్టటానికి దారి తీశాయి.
ఒకప్పుడు స్త్రీవాద ఆలోచనని స్వీకరించిన వాళ్ళు ఇప్పుడు సంక్షేమ వ్యతిరేక విధానాలని సమర్థిస్తున్నారు. ఈ రెండిరటి మధ్య వారికి ఏ వైరుధ్యం కనిపించట్లేదు. తమ తరహా స్త్రీవాదానికి తామే ఒక పేరు పెట్టుకుంటున్నారు. స్త్రీవాదాన్ని ఒక వస్తువుగా, ఒక లైఫ్ స్టైల్‌గా మార్చేయటంతో అసలు స్త్రీవాద రాజకీయాల ప్రాధ్యాన్యత మరుగున పడిపోయింది. ఇప్పుడు అనేక మంది ఆడవాళ్లు స్త్రీవాదం లేని పౌర హక్కులని కోరుకుంటున్నారు. బయట సమానత్వం ఉండాలి గాని ఇంట్లో పితృస్వామ్యం దెబ్బ తినకుండా ఉండాలని భావిస్తున్నారు. పితృస్వామ్యంతో ఇలా లాలూచీ పడటం, ఉదాహరణకి ఆడవాళ్లు బయట జీతం కోసం పని చెయ్యటం లాంటివి, ఆడవాళ్ళని ఇంకా బలహీనులని చేస్తాయని ముందు చూపున్న స్త్రీవాదులు ముందే ఊహించారు. వ్యవస్థలో మౌలిక మార్పులు లేకుండా ఇచ్చే హక్కులని, అంతే తేలిగ్గా మన పాలకులు వెనక్కి తీసేసుకోగలరు. ఇప్పటికే పునరుత్పత్తి హక్కుల విషయం, ప్రత్యేకించి గర్భస్రావం విషయంలో ఇది స్పష్టమయింది. పితృస్వామ్య సమాజంలో పౌర హక్కులు ఇవ్వటం ఒక రకంగా ప్రమాదకరంగా పరిణమించింది. ఎందుకంటే మన ఆధిపత్య నిర్మాణాలు మారుతున్నాయనీ, పరిస్థితులు పెద్దగా మారక పోయినప్పటికీ మనం బాగానే ఉన్నామనే భావనకీ దారి తీశాయి. వాస్తవంలో ఆడవాళ్లు స్త్రీవాదం నుండి దూరం జరగటంతో సామాజిక నిర్మాణాలు మరింత బలపడ్డాయి.
తీవ్రమైన స్త్రీవాద వ్యతిరేకత (బాక్ లాష్ ) కూడా స్త్రీవాద ఉద్యమం బలహీనపడ్డానికి దారి తీసింది. ఈ బాక్ లాష్లో ప్రధాన భాగం అవకాశవాదం, సాంప్రదాయిక ఆడవాళ్ళ స్త్రీవాదం ఎంత పనికమాలిందో ఎత్తి చూపడం. ఉదాహరణకి డానియెల్ క్రిటెండన్ రాసిన ‘మన అమ్మలు మనకి చెప్పని విషయాలు: ఆధునిక స్త్రీ ఎందుకు సంతోషంగా వుండలేదు’ అన్న పుస్తకంలో మనందరం ఇంట్లో వుండి, పిల్లల్ని కని బాగా పెంచాలని ఆడవాళ్ళకి చెప్తుంది. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి మధ్య మౌలికంగా మనస్తత్వంలోనే తేడాలున్నాయనే విషయం మనందరం ఒప్పుకోవాలని, ఆడవాళ్లు సంతోషంగా లేకపోవటానికి అన్నింటి కన్నా పెద్ద కారణం స్త్రీవాదమేననీ కూడా వాదించింది. స్త్రీవాదాన్ని విమర్శించే వాళ్ళు ఆధునిక సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కునే అన్ని రకాల అసంతృప్తికి స్త్రీవాద ఉద్యమాన్నే తప్పు పడతారు. వాళ్లెప్పుడూ పితృస్వామ్యం, జాత్యహంకారం, పురుషాధిపత్యం లేదా వర్గపరమైన దోపిడీ గురించి మాట్లాడరు. ఈ పుస్తకాలన్నీ అందరికీ అర్ధమయ్యే భాషలో ఉంటాయి. కానీ వీటిని తిప్పికొట్టటానికి అవసరమైన స్త్రీవాద సిద్ధాంతం మాత్రం ఎక్కడా అందుబాటులో లేదు.
రాడికల్ స్త్రీవాదులతో, ముఖ్యంగా మధ్య వయస్కులతో, అంటే 35 నుండి 65 ఏళ్ల వయసు వారితో, నేను మాట్లాడినప్పుడు, స్త్రీవాదం చూపించిన నిర్మాణాత్మక ప్రభావం గురించి అద్భుతమైన వాంగ్మూలం ఇస్తుంటారు. దీన్ని గురించి రాయటం చాలా అవసరం ఎందుకంటే ఇది స్త్రీవాదం ఆడవాళ్ళ జీవితాలని మరింత కష్టతరం చేసిందనే సాధారణ అభిప్రాయాన్ని తిప్పి కొట్టటానికి పనికొస్తుంది. వాస్తవానికి పితృస్వామ్య ఆలోచన, కార్యాచరణ, వ్యవస్థలో జీవిస్తూ స్త్రీవాద ఆలోచన, కార్యాచరణ కలిగుండటం ఆడవాళ్ళకి కష్టతరంగా పరిణమించిందనేది నిజం.
ముందు చూపున్న స్త్రీవాదం స్త్రీలు, పురుషులు అందరినీ స్త్రీవాదులుగా మార్చటం ఎంత ముఖ్యమో అర్ధం చేసుకుంది. మగ
వాళ్ళు సెక్సిస్టులుగా ఉన్నంత వరకూ ఆడవాళ్లు అందరూ స్త్రీవాదులుగా మారినా వాళ్ళ జీవితాలు పెద్దగా మారలేవని వాళ్లకి తెలుసు. ఆ పరిస్థితిలో జెండర్ యుద్ధాలు మామూలవుతాయి. మగవాళ్ళని తమ యుద్ధంలో తోటి కామ్రెడ్లుగా ఒప్పుకోలేని స్త్రీవాదులు, మగవాళ్ళకి స్త్రీవాద రాజకీయాల నుండి ప్రయోజనాలు లభిస్తే ఆడవాళ్లు దాని పర్యవసానంగా నష్టపోతారు అని అనుకునే స్త్రీవాదుల వల్ల సాధారణ ప్రజ స్త్రీవాదాన్ని అనుమానంతో, రోతగా చూసింది. ఇలా మగవాళ్ళని ద్వేషించే స్త్రీలు తమకి వాళ్ళతో వున్న సమస్యలని ఎదుర్కునే బదులు, స్త్రీవాద పురోగతిని అడ్డుకున్నారు. మగవాళ్ళు స్త్రీవాద బానర్‌ని పట్టుకుని పితృస్వామ్యాన్ని సవాలు చెయ్యటం అత్యవసరం. ఈ భూగోళం మీద మానవ జాతి సురక్షితంగా కొనసాగాలంటే పురుషులు స్త్రీవాదులుగా మారటం తప్పనిసరి.
ఆడవాళ్ళు, మగవాళ్లు, ఏ వయసు వాళ్లయినా సరే, సెక్సిజంకి వ్యతిరేకంగా పని చేసినప్పుడు స్త్రీవాద ఉద్యమాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళతారు. మనం ఆ పని ఒక సంఘంలో చేరి మాత్రమే చెయ్యాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుండయినా స్త్రీవాదం కోసం పని చెయ్యచ్చు. ఇంట్లో, మనం నివసించే చోట, మనల్ని మనం చైతన్యవంతులం చేసుకుని మన దగ్గరి వాళ్ళని కూడా చైతన్యవంతుల్ని చెయ్యొచ్చు. స్త్రీలు, పురుషుల వ్యక్తిగత జీవితాల్లో మార్పు కవసరమైన నమూనాలను స్త్రీవాద ఉద్యమం ఇప్పటి వరకూ సృష్టించలేక పోయింది. స్త్రీవాద రాజకీయాలు మనమెటు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనే విషయాల గురించి స్త్రీవాదులుగా మనకుండే బలమైన నమ్మకాలలో వేళ్లూనుకుని వున్నాయి. అయితే మార్పు ఎలా తేవాలి అన్న విషయం గురించి మన వ్యూహాలు అంత గొప్పగా లేవు.
స్త్రీవాదానికి ఒకే దారంటూ ఏమీ లేదు. విభిన్న రకాల నేపధ్యాల నుండి వచ్చిన వ్యక్తులకి తమ జీవితాలకి పనికొచ్చే స్త్రీవాద సిద్ధాంతం అవసరం. నల్ల జాతి స్త్రీవాద మేధావిగా నల్ల జాతి జీవితాల్లో జెండర్ పాత్రలని విమర్శనాత్మకంగా పరిశీలించి వాటిని మార్చటానికి అవసరమయ్యే ప్రత్యేకమైన వ్యూహాలని తయారు చేసుకోవటం, నల్ల జాతి ప్రజలందరికీ స్త్రీవాద సంఘర్షణ గురించి అర్ధం చేయించటం నాకు ప్రధానం.
తెల్ల జాత్యహంకార పెట్టుబడిదారీ పితృస్వామ్యంలో మన స్థానాన్ని అర్ధం చేసుకోవాలంటే మన జీవితాలని జెండర్, జాతి, వర్గం దృక్పధాల నుండి ధైర్యంగా పరిశీలించుకోమని ముందు చూపున్న రాడికల్ స్త్రీవాదం ప్రోత్సహిస్తుంది. చాలా ఏళ్ళు స్త్రీవాదులు జెండర్ ఒక్కటే స్త్రీల సామాజిక స్థానాన్ని నిర్ణయించే అంశమని తప్పుడు అభిప్రాయంలో వుండేవాళ్ళు. ఈ నమ్మకం బద్దలు కావటం స్త్రీవాదానికి పెద్ద మలుపు. స్త్రీవాద ఉద్యమం ప్రజా ఉద్యమం కాకుండా ఉండటానికి జాతి, వర్గ పక్షపాతాలు ఎట్లా పనిచేసాయో ఈ గుర్తింపు స్త్రీలకి అర్ధం చేయించింది.
ఇప్పుడు మనం స్త్రీవాద పోరాటాన్ని తిరిగి ప్రారంభించటానికి సిద్ధంగా వున్నాము. స్త్రీలు, పురుషులు అందరి సంక్షేమానికి పితృస్వామ్యం ప్రమాదకరమని అర్ధం చేయించటంలో బాగా సఫలమైంది. కాబట్టే స్త్రీవాదానికి అంత వ్యతిరేకత వచ్చింది. మగ దురహంకారం, సెక్సిజం వల్ల సమాజానికి గల ప్రమాదాలని గురించి వాస్తవాలని చెప్పి ఉండకపోతే అది విఫలమై ఉండేది. అప్పుడు స్త్రీవాదంపై దాడులు చెయ్యాల్సిన అవసరమే ఉండేది కాదు. పితృస్వామిక ప్రసార సాధనాలు మగవాళ్ళు స్త్రీవాద తరగతి గదుల్లోకి వెళ్ళటం నిషేధమనే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాయి గానీ ఎప్పుడూ లేనంతగా మగవాళ్ళు స్త్రీవాద సిద్ధాంతాన్ని చదివి స్త్రీవాదులుగా మారుతున్నారు. స్త్రీవాద ఉద్యమంలో ఈ మార్పే దాన్ని పితృస్వామ్యానికి ప్రమాదంగా మార్చింది. ముందే చెప్పినట్లు కేవలం స్త్రీల మీదే దృష్టి పెట్టి ఉంటే పితృస్వామ్య యధాతథ స్థితి కొనసాగి ఉండేది, స్త్రీవాదంపై దాడి చెయ్యాల్సిన అవసరం వచ్చేది కాదు.
పితృస్వామిక ప్రసార సాధనాలు, సెక్సిస్టు నాయకులూ పదే పదే స్త్రీవాదం చచ్చిపోయిందని, దానికి అర్ధమే లేదని మనకి పదే పదే నొక్కి చెప్తుంటారు. వాస్తవమేమిటంటే, ప్రపంచంలో ప్రతి చోటా, స్త్రీలు, పురుషులు జెండర్ సమన్యాయం గురించి ఘర్షణ పడుతున్నారు, తమని బందీగా ఉంచి, నిర్బందించే సామాజిక పాత్రలని నుండి స్వేచ్చని కోరుకుంటున్నారు. స్త్రీవాదం వైపు తిరిగి సమాధానాల కోసం చూస్తున్నారు. ముందు చూపున్న స్త్రీవాదం మనకి భవిషత్తు గురించి ఆశనిస్తుంది. ఒకరి నొకరు చూసుకుని, ఒకరిపై ఒకరు ఆధారపడి నైతిక విలువలకి ప్రాధాన్యతనిచ్చే స్త్రీవాద ఆలోచన ఆధిపత్యానికి ముగింపు పలికి అసమానతల ప్రభావాన్ని మారుస్తుంది. పరస్పర సంబంధాలు సాధారణ విలువగా మారిన సమాజంలో అందరి మధ్య అన్ని సమయాల్లో సమానత్వం ఉండకపోవచ్చు గానీ, ఆ అసమానతలు పరాధీనతకి, వలస పాలనకి, అమానవత్వానికీ దారి తీయవు.
సెక్సిజంని, సెక్సిస్టు దోపిడీని అణచివేతని ఎదిరించే స్త్రీవాద ఉద్యమం ఇప్పటికీ బ్రతికే వుంది. మనకి ప్రజా ఉద్యమం లేకపోవచ్చు గానీ ఆ ఉద్యమ పునర్నిర్మాణం మన ప్రాధమిక లక్ష్యం. స్త్రీవాదం మన జీవితాలకి ఉపయోగకరంగా ఉండాలంటే ముందు చూపున్న స్త్రీవాద సిద్ధాంతం మన సమకాలీనతకి, మన కాలానికి అనుగుణంగా నిర్మించబడుతూ ఉండాలి. స్త్రీలు, పురుషులు జెండర్ సమానత్వ దిశగా చాలా ప్రయాణం చేశారు. స్వేచ్ఛ వైపు వేసిన ఆ అడుగులు మనకి ముందు కెళ్ళటానికి మరింత శక్తి నివ్వాలి.
మనం వెనకటి కాలం నుండి నేర్చుకుని స్త్రీవాద సూత్రాలు మన ప్రజా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో పని చేసేటట్లుగా భవిషత్తు కార్యాచరణ రూపొందించుకోవాలి. ఆధిపత్యాన్ని అంతం చేసి మనందరం న్యాయం, శాంతి కోరుకుంటూ జీవించేటట్లు చెయ్యటమే స్త్రీవాద రాజకీయాల లక్ష్యం. స్త్రీవాదం అందరి కోసం! – సమాప్తం