అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార

నేనీ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది?

నన్ను నేను పరామర్శించుకుంటూ.. పరిసర ప్రపంచంతో నాకున్న సంబంధాలేమిటి, అందులో నా స్థానం ఎక్కడని ప్రశ్నించుకుంటూ చేసిన అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం. నేను కేరళ మూలాలున్న ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను.

అయితే యాభై ఏళ్లకు పైగా నా కార్యక్షేత్రమంతా హైదరాబాద్‌ నగరమూ, కొండలూ గుట్టలతో నిండిన ఆ చుట్టుపక్కల ప్రాంతాలే. పాశ్చాత్య దేశాల్లో ‘బ్రా’లను తగలబెట్టడాన్ని ఓ ర్యాడికల్‌ చర్యగా పరిగణిస్తుంటే ` పధ్నాలుగేళ్ల వయసులో బ్రా ధరించినందుకు మా కుటుంబమే నన్నో నీతిమాలినదానిగా చూసింది. నా యవ్వనపు రోజులన్నీ చిన్న చిన్న తిరుగుబాట్లతో, గణితం మీద వ్యామోహంతో గడిచిపోయాయి. 1970లలో నేను నక్సలైట్‌ ఉద్యమంవైపు మొగ్గాను, ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లాను. ఇదంతా చూసి, నాకెవరో ‘బ్రెయిన్‌ వాష్‌’ చేశారని అనుకున్నారు నా తల్లిదండ్రులు. నన్ను బలవంతంగా మద్రాసుకు తరలించి, ఆ బ్రెయిన్‌ వాష్‌ను ‘రివర్స్‌’ చేయించటం కోసం నాకు కరెంట్‌ షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు. దానివల్ల నా జ్ఞాపకశక్తి చెదిరి పోయింది. ఎంతగా అంటే` స్నేహితులు నానా కష్టాలూ పడి నన్ను మద్రాసు నుంచి తప్పించి, హైదరాబాద్‌కు తీసుకువచ్చిన తర్వాత.. నేను ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తినే గుర్తుపట్టలేకపోయాను. మానసికంగా అంతా అయోమయమైపోయింది. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టులను తప్పించుకోడానికి నేనూ, నా భర్త సిరిల్‌ రెడ్డీ ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయి, ఘజియాబాద్‌లో బాల్మీకీల మధ్య జీవించటం ఆరంభించాం. అక్కడ వాళ్లకి ఇంగ్లిష్‌ నేర్పించటం వంటి రకరకాల పనులు చేశాం. ఆ కాలంలో నాకు తరచూ ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుండేది. 1980లో మేం హైదరాబాద్‌కు తిరిగి వచ్చాంగానీ ఇక్కడ మాకోసం ఎదురు చూసే కుటుంబంగానీ, పార్టీ గానీ ఏదీ లేదు. అయినప్పటికీ ఈ నగరమే మా ఇల్లు అయ్యింది. స్నేహితుల సహాయంతో మేం హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (హెచ్‌బీటీ)ని నెలకొల్పాం. వామపక్షవాదులు, అంబేడ్కరిస్టులతో ఎక్కువగా కలసి పనిచేస్తూ, తక్కువ ధరలకే పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రచురణ సంస్థగా దాన్ని తీర్చిదిద్దాం. నా కుంగుబాటుకు హెచ్‌బీటీ పని ఓ అద్భుతమైన మందులా పనిచేసింది. అనతికాలంలోనే హెచ్‌బీటీ అంటే గీత అనే అభిప్రాయం ఏర్పడిరది, అదిప్పటికీ కొనసాగుతోంది. అయినప్పటికీ నేనీ పాత్రలో పూర్తిగా స్థిరపడలేకపోయాను. ఏ విప్లవం కోసమైతే నేను జీవించానో, కలలు కన్నానో అది దరిదాపుల్లో కూడా కనిపించకపోవటం నన్ను చాలా అశాంతికి గురి చేసింది. ఏదో తెలియని తపన మనసులో అసంతృప్తి రేపుతుండేది. అప్పటికి నా వయసు ముఫ్పై ఏళ్లు.
అప్పుడే, అంటే 1984లో, నేను మొట్టమొదటిసారిగా ఇబ్రహీంపట్నంలో అడుగుపెట్టాను. హైదరాబాద్‌కు నైరుతిగా, ఓ గంట ప్రయాణ దూరంలో, రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది ఇబ్రహీంపట్నం. అక్కడంతా రెడ్లదే పెత్తనం. కొండలూ, గుట్టలతో రాళ్లమయంగా ఉండే ఆ ప్రాంతంలో జనం.. రెడ్డి భూస్వాముల దోపిడీ, దాష్టీకాల మధ్య నలిగిపోతుండే వారు. దళితులు, ముఖ్యంగా మాదిగల చేత ఆ రెడ్లు వెట్టిచాకిరీ చేయించుకుంటూ, వాళ్లను సేవకులుగా చూస్తుండేవాళ్లు. అలాంటి ప్రదేశంలో నేను దాదాపు పది సంవత్సరాల పాటు భూ పోరాటాల్లో పాల్గొన్నాను. ఆ పోరాటాలకు దళితులే ఎక్కువగా నాయకత్వం వహించేవారు. ఏ రకంగా చూసుకున్నా కూడా, అక్కడ నేనో బయటి వ్యక్తిని. నాకేమాత్రం అనుభవంలేని వ్యవహారాల్లో తలదూర్చాను. మార్క్సిస్టు`లెనినిస్టు ఉద్యమంలో పాల్గొంటూ విప్లవం గురించి కలలు కనడం వేరు` నాలాంటి స్త్రీ నిరుపేద ప్రజలతో కలసి పనిచేయడం వేరు. అయినా కూడా వారు నాకు తమ ఇళ్లలోనే కాదు, తమ హృదయాల్లో సైతం చోటిచ్చారు.
అక్కడి రెడ్లు అత్యంత క్రూరులైన భూస్వాములు. జనాలకు భయంకరమైన శిక్షలు వేసేవాళ్లు. జనం వీపుల మీద పెద్ద పెద్ద బండరాళ్లను పెట్టి గంటల తరబడి నొక్కేవాళ్లు. కొన్ని గ్రామాల్లో అయితే కొత్తగా పెళ్లైన మాదిగ వధువులను శోభనం కాకముందే దొర గడీకి లాక్కుపోయేవారు. కూలికి వచ్చిన తల్లులు బిడ్డకు పాలివ్వాలని వెళ్తుంటే.. వాళ్లు నిజంగా బాలింతలా కాదా అని పరీక్షిస్తూ.. వాళ్ల రొమ్ములను నొక్కి చూసేవాళ్లు. ఏ ఊరు వెళ్లినా పేదలు, దళితులపై జరుగుతున్న ఇలాంటి దుర్మార్గాల గురించి ఎన్నో వ్యథలు వినపడుతుండేవి.
నేనీ ప్రాంతానికి ఓ విఫల ఆదర్శవాదిగా వచ్చాను. యవ్వనంలో ఎన్నో ఏళ్లు రకరకాల నిష్ప్రయోజనకర సాహసాలతో గడచిపోయిన తర్వాత.. కనీసం ఎవరికో ఒకరికి, ఎంతో కొంత ఉపయోగపడాలన్న తపనతో ఇక్కడికి వచ్చాను. ఎక్కువగా మాదిగలతోనే కలసి బతికాను. వాళ్లు నన్ను అక్కున చేర్చుకున్నారు, ఒక రకంగా తమ జీవితాల్లో భాగం చేసుకున్నారు. తమ పాటలు పాడి వినిపించేవాళ్లు, నేను ఎలాంటి దుస్తులు ధరిస్తే ఇందిరమ్మలా కనిపిస్తానో చెప్పేవాళ్లు. తమ శక్తియుక్తుల గురించీ, తాము చేయాలనుకుంటున్న పోరాటం గురించీ వాళ్లకు చాలా స్పష్టమైన అవగాహన వుండేది. వారితో పాటు నేను కూడా వాళ్ల కూలీల సంఘంలో అంతర్భాగమయ్యాను. దాని పేరు ‘ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీ సంఘం (ఐటీవీసీఎస్‌)’, మేం క్లుప్తంగా ‘సంఘం’ అనేవాళ్లం. యూనివర్సిటీలో చదువుకున్న ఒక బ్రాహ్మణ స్త్రీ` ఎందరో రెడ్డి, రావు పేర్లుగల స్నేహితులున్నామె` మాదిగలతో కలసి జీవించడానికి ఇబ్రహీంపట్నం ఎలా వచ్చింది? అంతేకాదు, అలా వచ్చిన నేను ఆ తర్వాత ఆ పోరాటాన్ని ఎప్పుడు, ఎందుకు, పలా వదిలేశాను? వీటి గురించే మీరిప్పుడు చదవబోతున్నారు.
నేనా గ్రామాల్లో పనిచేస్తున్నప్పుడు నా భర్త సిరిల్‌ రెడ్డి నాకు కొండంత అండగా నిలబడ్డాడు. అప్పుడాయన హైదరాబాద్‌లో పేదలకు న్యాయ సహాయం అందించే ‘సలహా’ అనే సంస్థలో వున్నాడు. మేమిద్దరం కలిసే మా వ్యూహాలను రూపొందించే వాళ్లం. తను హెపటైటిస్‌ వ్యాధి బారినపడి ఏడాదిన్నరకు పైగా మంచం మీద వున్నప్పుడు కూడా తన బాగోగులు చూసుకునేందుకు వేరే ఏర్పాట్లు చేసుకుని, నా పనిని మాత్రం ఆపొద్దంటూ ప్రోత్సహించాడు. నా బ్రాహ్మణత్వాన్ని సిరిల్‌ ఎప్పుడూ విమర్శిస్తూనే ఉండటం నాకు చాలా ఉపయోగపడిరది. ముఖ్యంగా తిండి విషయంలో నాకున్న దురభిప్రాయాలను వదిలించుకుని, నేను మారడానికి ఆ విమర్శలే దోహదం చేశాయి. కొత్తరకం మాంసాహారం తినడానికి నేను సంకోచించిన ప్రతిసారీ సిరిల్‌ నాలోని బ్రాహ్మణత్వమే అందుకు కారణమని ఎత్తి చూపేవాడు. అలాగే నేను డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడినప్పుడూ, చిన్నచిన్న వ్యాపారస్తుల వద్ద బేరాలాడినప్పుడూ విమర్శించేవాడు. బ్రాహ్మణ స్నేహితులతో అనుబంధం పెంచుకోవడం, బ్రాహ్మణులు చేసే పొరపాట్లను సానుభూతితో అర్థం చేసుకోవడం, ఇతర కులాలవారి పట్ల మాత్రం భిన్నంగా వ్యవహరించడం వంటి పద్ధతులను తప్పుపట్టి, నా ప్రవర్తనకు కారణమైన మూలాలను ఎత్తిచూపేవాడు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పెళ్లిచేసుకుని, రకరకాల కష్టనష్టాలను ఎదుర్కొన్న కుటుంబంలో పుట్టిపెరిగినందు వల్ల సిరిల్‌కు కుల దౌష్ట్యం, అణచివేతల గురించి నాకంటే ఎక్కువ అవగాహన వుండేది. భారతదేశంలో దు:ఖదాయకమైన చాలా అంశాలకు హిందూ బ్రాహ్మణిజమే కారణమని అతనూ, అతని తోబుట్టువులూ సరిగ్గానే గుర్తించారు. నాకు ప్రజల్లో ఎక్కువ గుర్తింపు రావటం సిరిల్‌ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, పైగా తనే నాకు అనేక విధాలుగా మద్దతిచ్చాడు. తనే గనక లేకపోయి ఉంటే నేనిక్కడ చెప్పబోతున్న కథకు అసలు ఆస్కారమే వుండేది కాదు.
ఈ ప్రయాణలో మాకు ఎంతోమంది నిస్వార్థంగా, అండగా నిలబడ్డారు. వాళ్లలో న్యాయవాదులు` బొజ్జా తారకం, గొర్రెపాటి మనోహర్‌, సి.వి.మోహన్‌ రెడ్డి, సి.పద్మనాభ రెడ్డిలను ముందుగా చెప్పుకోవాలి. అలాగే మా పోరాటంలో ప్రతి దశలోనూ ఎంతోమంది పౌర సమాజ కార్యకర్తలు మాకు చేయూతనిచ్చారు, పాత్రికేయులు మా కథనాలకు విశేష ప్రాధాన్యతనిచ్చారు, స్నేహితులు అనేక విధాలుగా తోడుగా నిలబడ్డారు. ఆ రోజుల్లో నేను ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌కు వచ్చివెళ్లిన ప్రతిసారీ భూస్వాముల కిరాయి హంతకులు నా మీద దాడిచేసే ప్రమాదం పొంచి వుండేది. మా ఇల్లు ఓ దిగువ మధ్యతరగతి ప్రాంతంలో వుండేది. చుట్టుపక్కల కొన్ని పక్కా ఇళ్లు, ఎక్కువభాగం రకరకాల రేకుల ఇండ్లు ఉండేవి. వాటిలో చిన్న చిన్న వర్తకులు, తోపుడు బళ్లవాళ్లు, ఇళ్లల్లో పనిచేసేవాళ్లు నివసిస్తుండేవారు. మమ్మల్ని కలవడానికి గ్రామాల నుంచి ప్రతిరోజూ వందల మంది రావడం, ఒక్కోసారి జనం లారీల్లో దిగడం, మా ఇంట్లో చోటులేక చాలామంది బయటే నిలుచుండిపోవటం.. ఇదంతా మా చుట్టుపక్కల వాళ్లు రోజూ చూస్తుండే వాళ్లు. మొదట్లో మా ఇంటికి అంతమంది ఎందుకొస్తున్నారో ఆరాలు తీశారు. ఒకసారి కారణం తెలిశాక.. ఇరుగుపొరుగు అంతా మాకు ఎంతో అండగా నిలబడ్డారు. దూరం నుంచి వచ్చినవాళ్లకు నీళ్లివ్వటం, తరచూ మాకు ఆహారం పంపించటం వంటివే కాదు.. ఎవరైనా కొత్తవాళ్లు, అనుమానితులు మా వీధిలో అడుగుపెడుతున్నారా? అన్నదీ గమనిస్తుండేవాళ్లు.
1970లలో పెరిగి పెద్దయిన తరం మాది. కొన్ని విధాలుగా మేం చాలా అదృష్టవంతులమని చెప్పాలి. స్త్రీ విముక్తి ఉద్యమం మాకు జీవితంలో నిర్భయంగా ఉండాలని నూరిపోసింది. ఇక మాతో పాటు చదువుకున్న మగపిల్లలు, పురుషులంతా కూడా మమ్మల్ని వాళ్ల ప్రత్యర్థులుగానో, శత్రువులుగానో, లేకపోతే వాళ్ల మీద పెత్తనం చెలాయించే ఆడమనుషులుగానో చూడలేదు. పైగా మాకు ఎదురు ఎన్నో రకాలుగా సాయంగా నిలబడ్డారు. ఇక 1980ల నుంచీ ఐదుగురు పెద్దలు నాకు మార్గదర్శకులుగా వుండటం మరింత అదృష్టమనే చెప్పాలి. వాళ్లు` సీకే నారాయణ రెడ్డి, ఎస్‌.ఆర్‌.శంకరన్‌, ఎన్‌.వి. రాజా రెడ్డి, సి. పద్మనాభ రెడ్డి, బొజ్జా తారకం.. ఈ ఐదుగురూ కూడా తమతమ రంగాల్లో అసాధారణమైన వ్యక్తులు. సీకే నారాయణ రెడ్డి జీవిత పర్యంతం కమ్యూనిస్టు, నేను చూసిన అత్యంత సున్నిత హృదయులు! మేమిద్దరం లాభాపేక్ష లేని పుస్తక ప్రచురణ సంస్థ హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌లో కలిసి పనిచేశాం. అక్కడ ఆయనే నా ఆంతరంగికుడు. ఇక ఐఏఎస్‌ అధికారి, దళితులకు ప్రత్యక్షంగా మేలు చేసే అనేక ప్రభుత్వ పథకాల రూపకల్పనకు బాధ్యులైన ఎస్‌.ఆర్‌. శంకరన్‌ నాకు సన్నిహితులే కాదు, అడుగడుగునా నన్ను మెలకువగా ఉంచిన మార్గదర్శి కూడా. అలాగే ఎన్‌.వి. రాజా రెడ్డి సోషలిస్టు, జమీందారు, గొప్ప పుస్తక ప్రియులు, దేనినైనా ఆసక్తిగా తెలుసుకునేవాళ్లు. తెలంగాణ ప్రాంతం గురించీ, ఇక్కడి సమాజం గురించీ అపారమైన పరిజ్ఞానం వుందాయనకు. ఈ ప్రాంత సంస్కృతిని అర్థం చేసుకుని, ఇక్కడి ప్రజలతో మమేకమవటంలో ఆయన నాకు ఎంతో సాయం చేశారు. సి. పద్మనాభ రెడ్డి సీనియర్‌ న్యాయవాది, ఎంతో అప్యాయంగా ఉండేవాళ్లు, నా కేసులను ఎన్నింటినో ఆయనే వాదించారు. బొజ్జా తారకం కూడా సీనియర్‌ న్యాయవాదే, గొప్ప దళిత కార్యకర్త, నేను చాలా సన్నిహితంగా కలిసి పనిచేసిన వారిలో ఆయన ఒకరు. వీళ్లు ఐదుగురూ నా కోసం తమ సమయం, శక్తియుక్తులన్నింటినీ వెచ్చించారు.
ఇక మా కుటుంబానికి వస్తే` భావోద్వేగాలు రేగినప్పుడు వాళ్లు నాకు సంబంధించిన జ్ఞాపకాలను కూడా దూరం పెట్టాలని అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్లకు నేనొక సమస్యాత్మక బంధువుగానో, సమస్యాత్మక స్నేహితురాలిగానో మిగలొచ్చు. మా అక్కచెల్లెళ్లకు, వాళ్ల కుటుంబాలకు, ఇంకా అనేకమంది నా బ్రాహ్మణ మిత్రులకు.. నేను మా వాళ్ల గురించి చెడుగా రాయడం, వాళ్లను అసమానతా భావాలుగల ఛాందసులుగా, అసహనశీలురుగా చిత్రించడం నచ్చకపోవచ్చు. పైగా, ఇలా రాయడం ద్వారా నేను పాత గాయాలను కెలుకుతుండవచ్చు కూడా. వాళ్ల దృష్టిలో ఇంట్లో విషయాలు బయటపెట్టుకోవటం పెద్ద తప్పు. అయితే నేనిక్కడ మా కుటుంబానికి సంబంధించిన చెప్పుకోకూడని రహస్యాలుగానీ, సిగ్గుపడాల్సిన విషయాలుగానీ ఏమీ రాయడం లేదు. నిజానికి నా కుటుంబం ఏమంత అసాధారణమైనదీ, దుర్మార్గమైనది కూడా కాదు. ఆ మాటకొస్తే మా తల్లిదండ్రులు ఎన్నడూ మా మీద గానీ, మరెవరిమీదైనా గానీ చెయ్యెత్తి కూడా ఎరగరు. కాకపోతే మన సమాజంలో పితృస్వామిక భావాలను, కుల కట్టుబాట్లను.. సూర్యోదయ సూర్యాస్తమయాల్లా అవెంతో సర్వసాధారణమైనవన్నట్లు, శాశ్వతమైనవన్నట్లు నమ్మేలా చేయటం, వాటిని అత్యంత ‘సహజీకరించటం’ వల్ల తలెత్తిన సమస్య ఇదంతా! ఒకసారి రాయడం మొదలుపెట్టిన తర్వాత ఇక వాటిని తడమటం అనివార్యమైంది.
‘సంఘం’తో కలసి ఓ దశాబ్దకాలం పాటు వేతన, భూ పోరాటాల్లో పాల్గొన్న తర్వాత, 1998లో నేను మళ్లీ హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌కి తిరిగి వచ్చాను. అప్పట్నించీ మాకు ఎప్పుడు కొత్త ఉద్యోగులు అవసరమైనా వెంటనే నేను` మీ పిల్లలు ఎవరైనా ఉంటే పంపండంటూ ఇబ్రహీంపట్నంలోని మా మిత్రులకు కబురు పంపేదాన్ని. వాళ్ల పిల్లలు సిటీలో ఉండి మా దగ్గర పని చేస్తూనే, చదువుకుని జీవితంలో మెరుగ్గా స్థిరపడతారన్నది మా ఉద్దేశం. అలా ఇబ్రహీంపట్నం నుంచి పద్ధెనిమిదేళ్లకు పైబడిన కుర్రాళ్లు ఎంతోమంది హెచ్‌బీటీ కార్యాలయానికి వచ్చి పని చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు కూడా.
వీళ్లు హెచ్‌బీటీ ఆఫీసు పనుల మీద తరచూ బ్యాంకులకు వెళ్లటంÑ జమాఖర్చులు రాయటం, పద్దుల పుస్తకాలను నిర్వహించటంÑ ప్రెస్‌కు వెళ్లి పుస్తకాల ప్రింటింగ్‌ పనులను చూడటం, పోస్ట్‌ ఆఫీసులకు వెళ్లి పుస్తకాలను పంపటంÑ సమావేశాలేవైనా జరుగుతుంటే అక్కడ స్టాల్‌ పెట్టి పుస్తకాలు అమ్మటంÑ ప్రూఫులు సరిచూడటంÑ ఆ ప్రూఫులను, రాతప్రతులను రచయితలు, అనువాదకుల ఇళ్లకు తీసుకువెళ్లి ఇచ్చి రావటం.. ఇలా నిత్యం రకరకాల పనులు చేస్తూ.. ఎన్నో కొత్త విషయాలు, పని పద్ధతులు నేర్చుకునే వాళ్లు. ఈ పనుల మధ్య ఎప్పుడైనా కాస్త ఖాళీ దొరికితే నన్ను ఆ నాటి ఇబ్రహీంపట్నం సంగతులు చెప్పమని అడుగుతుండే వాళ్లు. ‘ఫలానా ఊళ్లో అప్పుడేమైంది, ఇళ్లల్లో మా పెద్దవాళ్లు చెబుతుంటే విన్నాం, అప్పుడు ఎందుకలా జరిగింది..?’ ఇలా బోలెడన్ని ప్రశ్నలు అడుగుతుండేవాళ్లు. నేనే మనసు విప్పి వాళ్లకు అన్నీ చెప్పటానికి కొద్దిగా తటపటాయించేదాన్ని. ఒక్కోసారి ఇబ్రహీంపట్నం పని తాలూకూ సమాచారమంతా.. అదేదో నాకు మాత్రమే చెందిన గుప్త నిధిలా అనిపిస్తుండేది. అన్నింటినీ మించి, చేసిన పని గురించి చెప్పుకోవటం ఏం బాగుంటుందన్న ఆలోచనా ఉంది. ఇక 2014లో నేను` ఉస్మానియా యూనివర్సిటీలో మతోన్మాద గూండాల చేతుల్లో హత్యకు గురైన విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి జీవిత చరిత్ర రాసినప్పుడు అలాగే ఇబ్రహీంపట్నం పోరాటాల గురించి కూడా రాయాలంటూ హెచ్‌బీటీలోని నా యువ సహచరులంతా ఒత్తిడి పెంచారు. ‘ఆ రోజుల్లో ఎంతో ఉత్తేజభరితమైన సంఘటనలు జరిగాయి… వాటి గురించి మాకు పూర్తిగా తెలుసుకోవాలని ఉంది’ అంటుండే వాళ్లు. మొత్తానికి` నా భర్త సిరిల్‌ రెడ్డి దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడి, 2018లో చనిపోయిన తర్వాత నాకు కొంత తీరిక సమయం దొరికింది. అప్పుడు దీని గురించి రాద్దామని మొదలుపెట్టాను. అదే సమయంలో మా అమ్మాయి లీల కూడా పీహెచ్‌డీ చేసేందుకు అమెరికా వెళ్లిపోయింది. సిరిల్‌ చనిపోయాక నన్ను ఒంటరితనం ఆవరించింది. రోజులు చాలా దుర్భరంగా అనిపించేవి. ఏదో ఒకటి చేసి నన్ను నేను చురుకుగా, క్రియాశీలంగా ఉంచుకోవాలి. అందుకోసం` నా జీవితంలో అత్యంత ఉల్లాసభరితమైన కాలం గురించి రాయటం మొదలుపెడితే` మనసుకు కాస్త సాంత్వన చిక్కుతుంది, అది ఆ నిస్పృహ నుంచి బయటపడేందుకు దోహదం చేస్తుందనిపించింది. అలాగే నా యువ సహచరులకు కొంత వరకూ మా ఉమ్మడి చరిత్రను తిరిగి అందించినట్టూ అవుతుందని ఆశపడ్డాను.
రాయడం అనేది ఒక బరువు దించుకునే పని. అనుకున్నట్టే` ఆనాటి అనుభవాల గురించి రాయడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నా తొలి చిత్తు ప్రతిని అభిషేక్‌ భట్టాచార్య, చైత్ర శ్రీశైల అనే ఇద్దరు యువ పాఠకులు చదివి, నన్ను ఎన్నెన్నో ప్రశ్నలు అడిగారు. ఆ విధంగా దీన్ని తిరగరాసేందుకు, మరింత విస్తరించేందుకు కారకులయ్యారు. మొదటి చిత్తు ప్రతిలో కేవలం ఇబ్రహీంపట్నం కార్యకలాపాల గురించి మాత్రమే వుంది. వాళ్లిద్దరూ అసలు మీరు ఇబ్రహీంపట్నం ఎందుకు వెళ్లారని అడిగారు. దీంతో నక్సలైట్‌ ఉద్యమంతో నా పూర్వ అనుబంధాన్ని గురించి వివరించాల్సి వచ్చింది. అప్పుడు వాళ్లు అసలు నక్సలైట్లలో ఎందుకు కలిశారని ప్రశ్నించారు. దానికి సమాధానంగా నా బాల్యం గురించీ, మా కుటుంబం గురించీ రాశాను. ఇక 2020లో కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఖాళీ సమయం దొరకటంతో మొదటి చిత్తు ప్రతిని సిద్ధం చేశాను. అప్పుడే దీని ప్రచురణ గురించి కూడా కాస్త గట్టిగా ఆలోచించటం మొదలుపెట్టాను. ముందు ఈ స్క్రిప్టును నా సన్నిహిత మిత్రులు జి. మనోహర్‌, రaుమూర్‌ లహిరిలకు చూపించి, వాళ్లతో చర్చించాను. వాళ్లిద్దరూ కూడా ఇబ్రహీంపట్నం పోరాటాలను మొదటి నుంచీ చాలా దగ్గరగా అనుసరిస్తూ వచ్చినవాళ్లే, కొన్నిసార్లు ప్రత్యక్షంగా కూడా భాగమయ్యారు. వాళ్లు ఆసాంతం చదివి, ఎక్కడెక్కడ సరిదిద్దితే బాగుంటుందో చాలా ఉపయుక్తమైన సూచనలు చేశారు. ఆ తర్వాత నవయాన ప్రచురణ సంస్థ (ఈ పుస్తకం ఆంగ్ల మూలాన్ని ప్రచురించింది వాళ్లే) తరఫు నుంచి వాళ్ల సంపాదక బృందం ఎన్నో ప్రశ్నలు, సందేహాలు సంధించింది, ఎక్కడెక్కడ మరిన్ని వివరాలు జోడిరచాలో సూచించింది. వాటన్నింటి మీదా మళ్లీ పని చేసి, మొత్తం తిరగరాయాల్సి వచ్చింది. ఈ క్రమంలో పుస్తకం పరిథి, పరిమాణం రెండూ నేను ఊహించిన దానికంటే పెద్దగా అయిపోయాయి.
దాదాపుగా ఇరవై ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత… నేను మళ్లీ వెనుదిరిగి ఆనాటి ఇబ్రహీంపట్నం వ్యవసాయ కూలీ సంఘం (ఐటీవీసీఎస్‌) సహచరులను సంప్రదించడం మొదలుపెట్టాను. ఇది కేవలం ఆ నాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకోవటం, సరిచూసుకోవటం కోసమే కాదు.. ఆ ఉద్యమ రూపాన్నీ, దాని తాలూకూ పోరాట పద్ధతులనూ మరింత కచ్చితత్వంతో ఒడిసిపట్టేందుకు, మమ్మల్నందరినీ మార్చివేసిన ఆనాటి పోరాట పధాన్నీ, గమనాన్నీ, దాని చట్రాలనూ మరింత క్షుణ్ణంగా పునర్నిర్మించేందుకు కూడా ప్రయత్నించాను. దీనిలో భాగంగా రaుమూర్‌ లహిరి, శశికుమార్‌లతో కలసి మా సంఘం మాజీ కార్యకర్త శంకరయ్యను విస్తృతంగా ఇంటర్వూ చేశాను. నిజానికి అదంతా రాస్తే మరో పెద్ద పుస్తకమే అవుతుంది. అలాగే ఈ పుస్తక రచనకు పూనుకోవటం నేను మళ్లీ మా అక్కచెల్లెళ్లతో తిరిగి సంబంధాలు పెంచుకునేలా చేసింది, అది నాకెంతో సంతోషాన్నిచ్చిన మరో అంశం.
కొందరు వ్యక్తుల్ని, పేర్లను, ప్రాంతాలను, తేదీలను, సంఘటనలను నేను గుర్తుపెట్టుకోవడంలో కొన్ని పొరపాట్లు జరిగివుండొచ్చు. ప్రూఫులను చూస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకూ తప్పులన్నింటినీ సరిదిద్దాను. ఈ తప్పులకు కారణాన్ని నాకు ఇచ్చిన షాక్‌ ట్రీట్‌మెంట్‌ మీద వేయచ్చు కానీ వయసు మీదపడుతున్నప్పుడు మనందరికీ జ్ఞాపకశక్తి కొంత తగ్గటం సహజమే కదా. ఈ రచన ముందస్తు ప్రతులను చదివిన కొందరు మిత్రులు కొన్ని తప్పుల్ని సరిచేశారు, ఇంకా కూడా ఏమైనా మిగిలివుంటే మలి ముద్రణలో సరిచేస్తాను.
ఇబ్రహీంపట్నం పనిని గుర్తు చేసుకునేందుకు ప్రధానంగా నాకు నాలుగు అంశాలు సాయపడ్డాయి. మొదటిది: 1985 నుంచీ నేను ‘మెయిన్‌స్ట్రీమ్‌’ పత్రికకు వరసగా వ్యాసాలు రాస్తూ వచ్చాను. అవన్నీ చాలావరకూ నేను ఇబ్రహీంపట్నంలో పని చేస్తున్నప్పుడు కలుసుకున్న రకరకాల వ్యక్తుల గురించి రాసినవే. అలాగే దళిత దృక్పథంతో 1989లో ప్రారంభమైన చిన్న పత్రిక ‘నలుపు’కు కూడా కొన్ని వ్యాసాలు రాశాను. అవి బాగా ఉపయోగపడ్డాయి. రెండవది: 2002లో స్త్రీల అధ్యయన సంస్థ ‘అన్వేషి’ వారు నన్ను ‘న్యాయ ప్రక్రియల్లో మహిళలు: రెవెన్యూ కోర్టుల తీరుతెన్నులపై’ ఒక పత్రం సమర్పించమన్నారు. దానికోసం నేను యాచారం బుడ్డ జంగయ్య, తాటిపర్తి సత్యమ్మలను ఇంటర్వ్యూ చేశాను. అవీ అక్కరకొచ్చాయి. మూడవది: నలుపు పత్రిక కోసం పనిచేసిన చిత్రకారుడు నారు` ఆ రోజుల్లో మేం ఇబ్రహీంపట్నంలో చేసిన పనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలు, వ్యాసాల వంటి క్లిప్పింగులన్నింటినీ సేకరించి, వాటిని పెద్ద పెద్ద షీట్ల మీద అతికించి చాలా జాగ్రత్తగా భద్రపరిచాడు. అదో పెద్ద ఆదరువు. ఇక చివరగా: మేం ఉద్యమ కాలంలో ఉపయోగించిన కోర్టు ఫైళ్లు, లీగల్‌ డాక్యుమెంట్లు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఎవరికైనా సమస్యలొస్తే సాయం చేసేందుకు ఉపయోగపడతాయని నేను వీటిని దాచిపెట్టి ఉంచాను. ఇవన్నీ కలిసి మా ఉద్యమ కాలాన్నీ, నాటి ఘట్టాలనూ, పద్ధతులనూ ఓ క్రమంలో పొందుపరిచేందుకు ఓ చిన్నసైజు భాండాగారంలానే ఉపయోగపడ్డాయి.
ఇదో సుదీర్ఘ ప్రయాణం. ఉత్సుకతతో నక్సలైట్‌గా ఉద్వేగభరితమైన జీవితాన్ని ఆరంభించి, మధ్యలో నిస్పృహలోకి జారిపోయి, ఓ ప్రచురణకర్తగా మారి, చివరికి ఇబ్రహీంపట్నంలో దళిత కార్మిక వర్గాలు స్వతంత్రంగా చేపట్టిన విముక్తి పోరాటాల్లో ఓ పనిముట్టునవటం, వాటిలో ముఖ్య పాత్ర పోషించటం వరకూ.. ఎంతో దూరం వచ్చిన ఈ ప్రయాణంలో నేను చాలా తప్పులు చేశాను. అసలు ఎటుపోతున్నానో, నా ముందున్న మార్గం ఏమిటో అయోమయంగా అనిపించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ పుస్తకం ఓ వ్యక్తి జ్ఞాపకాలు, స్మృతులకు సంబంధించినదే అయినప్పటికీ ఇది ముఖ్యంగా సంఘం పోరాటాల, విజయాల గాథó కూడా!
ఆత్మకథలు, స్వానుభవ చరిత్రలన్నీ వెనుదిరిగి గతంలోకి తొంగిచూస్తూ, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రాసేవే. ఇందులో రచయిత తాను కావాలని ఎంపిక చేసుకున్న అంశాలే, అదీ తాను పాఠకులకు ఏవి చెప్పాలని అనుకుంటున్నారో అవి మాత్రమే ఉంటాయన్నది నిస్సందేహం. నేను అగ్రకులంలో పుట్టిన దాన్ని, కులం వేసిన కంచెల్లో సవర్ణుల వైపుకు చెందిన దాన్నని నాకు తెలుసు. కానీ ఇబ్రహీంపట్నంలో పని చేసిన ఆ కొద్ది సంవత్సరాలూ నేను` కంచెకు ఆవలి వైపున వున్న దళిత కులాల వారితో కలగలిసి, గాఢమైన అనుబంధంతో పని చేశాను. తరతరాలుగా అణిచివేతను ఎదుర్కొంటున్న ఆ ప్రజలు.. కులం అన్నది ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చిపెడుతోందో చాలా స్పష్టంగా, కచ్చితంగా ఎలా అంచనా వేయగలుగుతున్నారో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతోంది. ఒక రకంగా ఈ రచన ద్వారా నన్ను నేను అర్థం చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నాను. ఇవాల్టికీ మన సమాజంలో కులపరంగా, హోదాపరంగా, డబ్బుపరంగా.. అన్ని రకాలుగా కలిగిన వాళ్లే ఎక్కువగా తమ కథలు రాస్తున్నారన్న విషయం నాకు తెలుసు. అలాగే రాస్తున్నది నేను కాబట్టి` నాకు నచ్చని, నాకు సరిపడని అంశాలేమైనా ఉంటే వాటిని నాకు అనుకూలంగా మార్చటం, తొలగించడం వంటివి చోటుచేసుకునే అవకాశం ఉందన్న విషయమూ నాకు తెలుసు. ఆ మాటకొస్తే అసలీ పుస్తకమే ఇలాంటి ఎన్నో లోటుపాట్లకు సంబంధించినది!
ఈ పుస్తకాన్ని నేను భయం భయంగానే మీ చేతుల్లో పెడుతున్నాను. ఆ ముప్పై ఏళ్ల వయసులోని నా అపరిపక్వతలను కొంత అర్థం చేసుకుని, సానుభూతితో చదవమని కోరుతున్నాను. ఇబ్రహీంపట్నం సకల సమాచారంతో, వివరణలతో నా ముందరకు వచ్చేం నిలబడలేదు. అక్కడ నేను ఏం చూశానో, ఏం అనుభవించానో ఆ పరిస్థితుల ప్రతిఫలనమే ఈ రచన. ఇప్పటికే బలంగా పాతుకుపోయిన భావాలు, నాకు తెలియకుండానే చిరకాలంగా నాపైన ప్రభావం చూపే అవకాశం ఉన్న చట్రాలన్నింటి నుంచీ బయటపడేందుకు, వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నించాను. ఈ పుస్తకం చదివిన తర్వాత దళితులు` వారి స్థానాన్ని నేను తీసేసుకున్నాననీ, వారి తరఫున నేనే పెద్దరికం ఆపాదించుకున్నాననీ (చాలా సందర్భాలలో నేనలా చేసివుండవచ్చు కూడా), అలాగే నా బ్రాహ్మణీయ యోగ్యతల గురించి గొప్ప చేసి చెప్పుకున్నాననీ నాపై విమర్శలు ఎక్కుపెట్టొచ్చు. ఇక బ్రాహ్మణులు` తమ స్థాయి తగ్గించి, తమ గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేశాననీ, అలాగే నా కులాన్నీ, కుటుంబాన్నీ నడిరోడ్డున నిలబెట్టాననీ నాపై కన్నెర్ర చెయ్యొచ్చు. ఇంకా ఎంతోమంది వేర్వేరు కోణాల్లో ఈ రచనను ఆక్షేపించవచ్చు. అయినప్పటికీ, ఎంత లోపాలతో కూడుకున్నదైనా దీన్ని రాయటం మాత్రం అవసరమనే నేను భావిస్తున్నాను. మన తప్పులు.. సరిదిద్దడానికి వీల్లేనివని అనుకోవడం పొరపాటు. తప్పులను గ్రహించడానికీ, మార్పులకూ ఎప్పుడూ అవకాశం వుంటుంది. కుల నిర్మూలన మన లక్ష్యమైనప్పుడు సవర్ణులు తప్పక మారతారనే నేను ఆశ పడతాను. ఈ ఆత్మ విమర్శ, నన్ను నేను బయటపెట్టుకోవటం.. ఆ ఆశలోంచి వచ్చినవే!
1. ఇంట్లో బ్రాహ్మిణ్‌ని, బడిలో కేథలిక్‌ని
నేనొక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగాను. మా కుటుంబం ఎప్పుడూ ఒక చోట ఉండేది కాదు. నాన్న ఉద్యోగ రీత్యా మేం దేశంలోని అనేక నగరాలలో నివసిస్తూవచ్చాం. మా తల్లిదండ్రులకు మేం ఐదుగురం ఆడపిల్లలం. నేను నాలుగోదాన్ని. మా పెద్దక్కయ్య తిరువనంతపురంలో, మా అమ్మమ్మ వాళ్లింట్లో పుట్టింది. రెండో అక్కయ్య బెంగళూరులో, మూడో అక్కయ్య రాజ్‌కోట్‌లో పుట్టారు. నేను 1953లో షోలాపూర్‌లో పుట్టాను. నా తర్వాతి చెల్లెలు బొంబాయిలో పుట్టింది. అమ్మానాన్నా ఇద్దరూ తమిళం మాట్లాడేవారు. అయితే మా అమ్మావాళ్ల పూర్వీకులు దాదాపు మూడు వందల ఏళ్ల క్రితమే తమిళనాడులోని రామనాథపురం జిల్లా నుంచి కేరళలోని తిరువనంతపురానికి వలస వెళ్లారు. అక్కడ వాళ్లు పూర్వం నుంచీ బ్రాహ్మణులు ఉంటున్న కరమన అగ్రహారంలో ఉండేవాళ్లు. మేం తరచూ అక్కడికి వెళ్లొస్తుండేవాళ్లం. అప్పటికే మా అమ్మమ్మ వైధవ్యం పొందింది. ఆమె చాలా సౌమ్యురాలు. ఇంటి బరువుబాధ్యతలన్నీ అమ్మా వాళ్ల అన్నయ్య, అంటే మామయ్యే చూసుకునేవారు. ఆయన పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. ఇంకో సోదరుడు కూడా ఉన్నాడుగానీ ఆయనకు కొన్ని మానసిక సమస్యలుండేవి. అయినా ఆయనంటే అందరికీ ఎంతో ఇష్టం. ఎప్పుడు ఎవరికే సాయం కావాలన్నా ఆయన ఉత్సాహంగా ముందుకొచ్చేవాడు. అక్కడ మా బంధుగణం ఇంకా చాలానే వుందిగానీ కాలేజీలో చేరిన తర్వాత వాళ్లతో నా సంబంధాలు బాగా తగ్గిపోయాయి.
మా నాన్నా వాళ్లది కేరళ అలెప్పీ జిల్లాలోని హరిపాడ్‌. దాదాపు ఓ వందేళ్ల క్రితమే అక్కడ స్థిరపడ్డ వాళ్లకు ఇళ్లూ పొలాలన్నీ ఉండేవి. మేం అలవాటుపడ్డ పట్టణపు ఇళ్లతో పోలిస్తే అక్కడిది చాలా పెద్ద ఇల్లు. ఒక్క హాల్లోనే తేలికగా ఓ ముప్పై మంది పద్మాసనం వేసుకుని కూచోవచ్చు. ఇంటి చుట్టూ వరండాలు కూడా అంతే విశాలంగా వుండేవి. మా తాతయ్య హరిపాడ్‌లో సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసేవారు. అయితే నేను పుట్టక ముందే ఆయన చనిపోయారు. ఇక మా నానమ్మ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. మేం ఆమెను అమ్మామి అని పిలిచేవాళ్లం. బాల్యంలో నా మీద బలమైన ముద్ర వేసిందామె. తను రవిక తొడుక్కునేది కాదు. గుండుతో, నుదుట విభూతి రాసుకుని వుండేది. మనవలు, మనవరాళ్లందరికీ తనే వంట చేసి పెట్టేది. మమ్మల్నందర్నీ హాల్లో వరసగా కూచోబెట్టి వడ్డించేది. మా కోసం అప్పుడప్పుడు థెరిటిపాలు అని ప్రత్యేక వంటకం ఒకటి చేసిపెట్టేది. పాలు, పంచదార, కొన్ని మసాలా దినుసులు కలిపి, గట్టిపడేంత వరకూ బాగా మరగబెట్టి చేసే ఆ వంటకాన్ని మేమందరం చాలా ఇష్టంగా తినేవాళ్లం. మా అమ్మ పేరు లక్ష్మి. బంధువులంతా తనని ఎఛ్మి అనేవాళ్లు. అమ్మకు నానమ్మ అంటే అంత ఇష్టముండేది కాదు. నానమ్మ తనకు భూతవైద్యం మంత్రం ఏదో వేసిందనీ, మీరు ఆమె పెట్టేది ఏదీ తినొద్దనీ మాతో చెబుతుండేది. నేను మాత్రం ఆ మాటల్ని ఎప్పుడూ పట్టించుకునేదాన్ని కాదు. ఈ పెద్ద వాళ్ల బుర్రలు అంతే, వీళ్లందరి కంటే నేను చాలా భిన్నం అనుకునేదాన్ని. బాల్యంలో మనకు ఎదురైన అనుభవాలు, ఆ చిన్నతనంలో మన మనసుల్లోకి ఇంకిన అంశాలు.. పెద్దయ్యాకా మనతో వస్తాయన్న విషయం నాకు అప్పుడంతగా తెలీదు. ఆ అత్తా`కోడళ్ల మధ్య సంబంధాలంత బాగుండేవి కాదు. దాని గురించి మా అమ్మానాన్నల మధ్య తరచూ గొడవలు కూడా అవుతుండేవన్న విషయం నాకింకా బాగా గుర్తే.
నాన్న పేరు కె.హెచ్‌. రామస్వామి (కిళకెమడం హరిహర రామస్వామి). ఆయన పోస్ట్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌ డిపార్ట్‌మెంటులో ఇంజినీరుగా పనిచేసేవారు. చిన్నప్పుడు మా నాన్నా, వాళ్ల అన్నదమ్ములంతా కూడా తిరువనంతపురం కాలేజీల్లో చదువుకున్నారు. ట్రావెన్‌కోర్‌ రాజు బ్రాహ్మల పట్ల ప్రత్యేక అభిమానం చూపిస్తూ వాళ్లకు ఉచితంగా భోజనం, వసతి సౌకర్యాలు కల్పించేవాడు. మహారాజావారి ధర్మసత్రాల్లో తాము ఎలా వున్నామో, వీధి లైట్ల కింద ఎలా చదువుకున్నామో నాన్న మాకు తరచూ చెప్తుండేవారు. అయితే, నన్నూ మా నలుగురు అక్కచెల్లెళ్లను మాత్రం క్రైస్తవ నన్స్‌ నడిపే ఓ కాన్వెంట్‌ స్కూల్లో చదివించారు. దానివల్ల మాకు ఇంట్లో తమిళంలో, బయట ఇంగ్లీష్‌లో మాట్లాడడం బాగా అలవాటైంది. మా తల్లిదండ్రులు కేవలం మలయాళంలో మాత్రమే రాయగలిగేవారు. 1980ల తర్వాత, ముఖ్యంగా నేను ఇబ్రహీంపట్నంలో ఉంటున్న రోజుల్లో అమ్మ నాకు ఉత్తరాలు రాస్తూ.. తమిళాన్నే మళయాళ లిపిలో రాసేది. ఆ లిపి రాదు కాబట్టి వాటిని తమిళులెవ్వరూ చదవలేకపోయేవారు. వాటిని నాకు చదివి పెట్టే మళయాళీలకేమో అదేమీ అర్థంకాక తికమకగా ఉండేది! నేను కాస్త పెద్దదాన్ని అయ్యాక.. మా తల్లిదండ్రులు మాట్లాడే చిత్రమైన తమిళమన్నా, చిన్నప్పటి మా ఇంటి వంటకాలన్నా నాకు చాలా అపురూపంగా అనిపించేవి. అప్పట్లో హైదరాబాద్‌లో కేరళ అయ్యర్ల పెళ్లి ఒకటి జరుగుతోందని తెలిసి, కేవలం తిరువనంతపురం అయ్యర్ల వంటకాలు రుచి చూడటం కోసమే.. పిలుపు లేకపోయినా అక్కడికి వెళ్లిపోయాను. ఎక్కడన్నా ఉన్నట్టుండి ఆ మలయాళీ యాసలో మాటలు వినిపిస్తే నాకు తెలీకుండానే ఒక్కక్షణం ఆగి, ఓ చెవ్వు అటేసి ఇష్టంగా వింటూ, ఆస్వాదించే దాన్ని. చిన్ననాటి ఆ రుచులు, సవ్వడులు, జ్ఞాపకాలకు ఉండే ఆకర్షణ, ప్రభావం అంతటిది. ముఖ్యంగా వాటికి దూరమైన వాళ్లకు అవి మరింత అపురూపం!
పత్రులకు: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ఫోన్‌ నం. 93815 59238/040-2352 1849 EMAIL:hyderabadbooktrust@gmail.com

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.