నిన్న కలలో..
అమ్మ నన్ను చూడాలనీ,
నా దగ్గరికి రావాలనీ పరితపించింది
దగ్గర ఎనభై కదా
ఊతమిచ్చే చేతులుంటే తప్పా
ఈ ఒడ్డుకి ఈది రాలేదు..
ఎన్నెన్నో ముచ్చట్లనీ వాటి తాలూకూ
ఉద్వేగాలని మూటకట్టి
నాతో పంచుకొని తేలిక పడాలని
పిట్టపిల్లలా రెక్కలళ్లారుస్తూ
ఎదిరిచూస్తోంది..
ఏ నడి రేయో తెల్లారిందనుకొని
లేచి కూర్చుంది..
నడిచి వచ్చిన అడుగులనీ,
నాన్న నీడలనీ మననం చేసుకుంటూనే..
ఎప్పుడో మడిచి పెట్టుకున్న
పేజీలోకి జారి,
తిరిగి వేకువ పొద్దయ్యింది..
ఒక్క చెట్టు పువ్వుల్లాగే
నేనూ అందరితో పాటు మొగ్గతొడిగితి
అచ్చు అదే రంగు అదే రూపు అదే పరిమళం..
అయితే..
‘ఆడిపిల్ల’నని నాపై శీత కన్ను
ముక్కు పచ్చలారక ముందే పెరికి
ఏడికో ఇసిరి చేతులు
దులుపుకున్నరు బాధ్యులు
ఇప్పుడు
అమ్మను చూడాలనీ,
ఆ మమతల ఒడిలో సేద తీరాలనీ,
నాన్న నీడన నన్ను నేను పరచుకొని
తేలిక పడాలని ఉంది.!
ఇప్పుడు..నేను పరాయినట
అక్కడా.. ఇక్కడా..
రమ్మంటేనే..చుట్టాన్నై పోయిరావాలిట.
మనసాగక వెళ్లాలనుకున్నా..
వీలు చూసుకొని,
అనుమతి తీసుకొని వెళ్ళాలి..!
ఈ వక్రగీతకు వ్యూహకర్త
ఎవ్వడో గానీ,
వాడి బుద్ది వైకల్యాన్ని ఈడ్చి జాడిచ్చి
శుద్ధి చెయ్యాలని ఉంది.