రైతు ఆత్మహత్యలు జరిగిన కుటుంబాల్లో మహిళలపై వ్యవస్థీకృత హింస – ఒక విశ్లేషణ – పరుచూరు జమున

‘‘భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న వ్యవస్థీకృత హింస‘‘ అనే అంశంపై పూనాలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంలో రెండు రోజులపాటు పోయిన నెల ఆగస్టు 28, 29 తేదీల్లో ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సును మహిళా కిసాన్‌ అధికార్‌ మంచ్‌ (MAKAM), సొసైటీ ఫర్‌ ప్రమోటింగ్‌ పార్టిసిపేటివ్‌ ఇకోసిస్టమ్‌ మేనేజ్‌ మెంట్‌ (SOPPECOM), NRAS, SPPU సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి.

ఆ సంస్థల తరఫున తాము చేసిన అధ్యయనంలో వెల్లడైన అంశాలను కర్ణాటక నుంచి కూరుగంటి కవిత, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి రుక్మిణి రావు, ఎస్‌.ఆశాలత, మహారాష్ట్ర నుంచి సీమ కులకర్ణి, పంజాబ్‌ నుంచి అనుపమ ఉప్పల్‌ సదస్సు ముందు చర్చకు పెట్టారు.
ఈ సదస్సులో వామ పక్ష పార్టీల నుంచి అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు శ్రీ రాజన్‌ క్షీర్‌ సాగర్‌, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీమతి పశ్య పద్మ పాల్గొన్నారు. ఐద్వా నుంచి మరియం ధవలే, ఎన్‌ ఎఫ్‌ ఐ డబ్ల్యూ మహారాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి లతా బిసే పాల్గన్నారు. సిపిఎం పార్టీ జాయింట్‌ సెక్రటరీ, కిసాన్‌ సభ అధ్యక్షుడు శ్రీ ఉమేష్‌ దేశముఖ్‌ రాష్ట్రీయ కిసాన్‌ మంచ్‌ నుంచి యువరాజ్‌ గట్కల్‌, రైతు స్వరాజ్య వేదిక నుంచి కొండల్‌ పాల్గొన్నారు. ఇంకా వివిధ రైతు సంఘాల, మహిళా సంఘాల, స్వచ్చంద సేవాసంస్థల ప్రతినిధులు, వివిధ విశ్వ విద్యాలయాల అధ్యాపకులు, మేధావులు, రైతు ఆత్మహత్యలు జరిగిన కుటుంబాల్లోని మహిళలు, మహిళా రైతు ఉద్యమాల నాయకులు, కార్యకర్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
వ్యవసాయంలో మహిళల ఉనికి సంఖ్యాపరంగా అత్యధిక స్థాయిలో ఉన్నప్పటికీ, వారికి రైతులుగా గుర్తింపు లేదు. వ్యవసారంగానికి సంబంధించిన నిర్ణయాత్మక స్థానాల్లో వారు లేరు. వ్యసాయానికి ప్రధాన వనరులైన భూమి, నీరు వారికి అందుబాటులో లేవు. విత్తనాలు వారి చేతుల్లోంచి జారిపోయి కొర్పోరేట్‌ వ్యవస్థ చేజిక్కించుకొంది. ఎరువులు, పురుగు మందులు, ఇతర వ్యవసాయ ఉత్పాదక వస్తువులపై ఆధిపత్యం మార్కెట్‌, దానిని స్థానికంగా అదుపుచేసే వడ్డీ వ్యాపారులదే. యంత్రాలు వారి పనిని తగ్గించేశాయి. పురుగు మందులు వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. వాణిజ్య పంటలు, ఏక పంట విధానాలు వారి ఆహార భద్రతను దెబ్బతీయడమే కాకుండా వాళ్ళ జీవితాల్లోకి నేరుగా హింసను ప్రవేశ పెట్టాయి. మహిళా రైతులు తమ హక్కులను సాధించుకోవడంలో వర్గం, కులం, పితృస్వామ్యం, ఇతర రకాల సామాజిక వ్యత్యాసాలు, స్త్రీల పట్ల వివక్ష ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. వ్యవస్థాగతంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మహిళలను మరింత సంక్లిష్ట స్థితిలోకి నెడుతున్నాయి. పరోక్షంగా వారిపై హింస పెరగడానికి కారణమవుతున్నాయి. 1995 నుంచి 1922 వరకు ఉన్న డేటా పరిశీలిస్తే దేశంలో ప్రతి 36 నిమిషాలకొక రైతు ఆత్మహత్య జరుగుతోంది. 402308 కుటుంబాల్లో మహిళలు ఈ దేశంలో వ్యవసాయ రంగంలో విధానాలకు, వ్యవస్థీకృత హింసకు బలవుతున్నారు. (రైతు ఆత్మహత్యల పట్టిక, మహిళల స్థితిగతుల పట్టిక చూడండి.)
వ్యవసాయ రంగంలో మహిళల స్థితి:
దేశ జనాభా ప్రస్తుతం : భారతదేశ జనాభా చైనాను అధిగమించి 145.34 కోట్లకు చేరుకుంది. (2024 – ఆగష్టు)
మొత్తం స్త్రీ జనాభా : 691776131 – 48.4%(2023), మొత్తం గ్రామీణ జనాభా : 909121500 – 63.64%(2023)
గ్రామీణ మహిళల్లో 74.8% వ్యవసాయంలో పనిచేస్తున్నారు, అయితే 14% వ్యవసాయ క్షేత్రాలు మాత్రమే మహిళల చేతుల్లో ఉన్నాయి. గ్రామాల్లో మహిళలే ఇంటి పెద్దలుగా ఉన్న కుటుంబాల సంఖ్య కూడా 14.9%శాతంగా ఉంది.

స్త్రీ పురుషుల నిష్పత్తి : 940:1000 (2011 జనాభా లెక్కలు), గ్రామీణ ప్రాంతాల్లో 1037, దేశ సగటు 1020గా ఉందని చీఖీనూ సర్వే – 5 చెబుతోంది. ఆడపిల్ల పుట్టుక కంటే ఒంటరిగా మారుతున్న స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచబ్యాంకు సేకరించిన అధికారిక లెక్కల ప్రకారం – దేశ జనాభాలో 15 సంవత్సరాల వయస్సుకు పైబడిన వారిలో మొత్తం కార్మికుల శాతం 56.76%. మొత్తం కార్మిక శక్తిలో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నవారు:42.86% (2022). మొత్తం కార్మిక శక్తిలో – మహిళలు 32.7%, పురుషులు 76.80%, రోజుకో గంట మాత్రమే పని చేసే వాళ్ళు కూడా ఈ లెక్కలోనే ఉంటారు. (2023) మొత్తం మహిళా కార్మిక శక్తిలో – 59.24% మంది స్త్రీలు, మొత్తం పురుష కార్మికుల్లో – 37.09.% మంది పురుషులు వ్యవసాయ రంగంలోనే పని చేస్తున్నారు. (2023). మొత్తం కార్మిక శక్తిలో – స్వయం ఉపాధిలో ఉన్న వారు 15.9% మంది. వీరిలో 31.13% మంది స్త్రీలైతే, 8.6% మాత్రమే పురుషులున్నారు. అసంఘటిత రంగంలో మహిళలు అత్యధికంగా ఉన్నారు.
సదస్సు బాధిత మహిళల గుండె చప్పుడుతో వారి వ్యధాభరిత గాధలు వినడంతో మొదలయ్యింది.
వీర్‌ పాల్‌ కౌర్‌: వీర్‌ పాల్‌ కౌర్‌ పంజాబ్‌ రాష్ట్రంలోని మాన్సా జిల్లాకు చెందిన రాళ్ళ గ్రామం నుంచి వచ్చింది. ఆమె తండ్రి అప్పుల భారం మోయలేక 1995లో ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆమెకు మెట్టినింటిలో కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. మామగారు పత్తి పంట మీద విపరీతంగా పెట్టుబడులు పెట్టి పంట చేతికిరాక, విపరీతంగా నష్టపోయాడు. ఆ నష్టాన్ని భరించలేక బాధతో ఆత్మహత్య చేసుకొన్నాడు. పెళ్లయిన నాలుగేళ్లకే ఆమె భర్త కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. వ్యవసాయంలో నష్టాన్ని ఎదుర్కోలేక ఆత్మహత్యే శరణ్యమనుకొన్నాడు. భర్త చనిపోయిన నాటికి వీర్‌ పాల్‌ ఇద్దరి చిన్న పిల్లలకు తల్లిగా ఉంది.
ఒంటరితనం, చిన్న వయస్సు, వనరులలేమి, వరుసగా కుటుంబంలో మూడు ఆత్మహత్యలతో భరించలేని బాధ, స్వంత కుటుంబీకుల నుంచి అవమానాలు, దిక్కు లేని తనం – అన్నీ తట్టుకొని తన ఇద్దరి పిల్లల కోసం ఆ చిన్నారి తల్లి బాధ్యతల బరువు నెత్తి కెత్తుకొని, ఏటికి ఎదురీత మొదలు పెట్టింది. వ్యవసాయ కూలీగా మారింది, గాజులమ్మింది. ఆ స్థితి నుంచి బతికి బయట పడటానికి, పొట్ట నింపుకోవడానికి చిన్న చితక పనులెన్నో చేసింది. చివరకు అంగన్వాడీ వర్కర్‌ అయ్యింది. ఆమె అత్తింటి వారు ఆమె భర్త పేరు మీద ఉన్న భూమిని ఆమెకు ఇవ్వడానికి నిరాకరించారు. అతని మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇవ్వలేదు. అవి సమర్పించని కారణంగా ఆమెకు ప్రభుత్వం ఎలాంటి సహాయాన్ని, మద్దతుని అందించలేదు.
తన జీవితంలో ఎదురైన కష్టాలు తనలాంటి మరొకరికి రాకూడదనే ఉద్దేశ్యంతో ఆమె రైతు ఆత్మహత్యలకు గురైన కుటుంబాలను సమీకరించడం మొదలుపెట్టింది. 2017లో కిరణ్‌ జీత్‌ కౌర్‌ అనే మరో బాధితురాలితో కలసి ‘‘కిసాన్‌ మజ్దూర్‌ ఖుద్‌ ఖుషీ పీడిత్‌ పరివార్‌‘‘ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఇద్దరు కలసి 3000 కుటుంబాలతో మొదలుపెట్టిన ఈ సంస్థలో ఇప్పుడు 1650 మంది రైతు ఆత్మహత్యలకు గురైన కుటుంబాల వారు సభ్యులుగా ఉన్నారు. వారంతా ప్రతి నెలా మాన్సా, పాటియాలా, బార్నాల మొదలైన పట్టణాల్లో రైతు మహిళలకు మద్దతుగా వారి హక్కుల సాధనలో భాగంగా సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు జరుపుతారు. తరచుగా గురుద్వారాల ముందు సభలు జరుపుతారు. రైతు ఆత్మహత్యలు జరిగిన కుటుంబాల్లోని మహిళలకు మద్దతుగా నిలబడతారు. వారి గుర్తింపు కోసం పోరాడతారు.
వీర్‌ పాల్‌ 2019 లోకసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. మట్టికుండను ఆమె తన ఎన్నికల చిహ్నంగా ఎంచుకొంది. ఆమె విజయం సాధించనప్పటికీ, ఆ సందర్భంలో ఆమె చేసిన ప్రచారాన్ని ఏ అధికారి మర్చిపోలేదు. తనకి పట్టనట్టు, తెలియనట్టుగా ఉండ లేడు అంటుంది ఆమె ఎంతో ఉద్వేగంతో. ఇప్పుడామె వయస్సు 48 సంవత్సరాలు. ఏడవ తరగతి వరకు చదువుకొంది. తానా పిల్లలిద్దరినీ ఒక ఎన్జీవో సహాయంతో చదివించింది. భూమి లేదు. కానీ మూడు లక్షల రూపాయల అప్పు మాత్రం ఉంది. అమ్మాయికి 26 ఏళ్ళు, అబ్బాయికి 24 సంవత్సరాలు. మృత్యు మృదంగాన్ని వింటూ, దాని కరాళ నృత్యాన్ని వీక్షిస్తూ గుండె ధైర్యాన్ని చిక్కబట్టుకొని, బాధల ఉప్పెనలో బతికి బయట పడిన ధీర మహిళ… వీర్‌ పాల్‌ పేరుకు తగినది.
అల్కా మతలే : అప్పులు పేరుకుపోయి, పంట నష్టపోయి, భర్త ఆత్మహత్య చేసుకోవడంతో 2011లో అల్కా మతలే జీవితం ఒక మలుపు తిరిగింది. ఆమె భర్త ఆత్మహత్యను రైతు ఆత్మహత్యగా గుర్తించారు. కానీ, ఆమెకు మాత్రం ప్రభుత్వం ఎలాంటి ఆర్ధిక సహాయాన్ని అందించలేదు. నష్టపరిహారం ఇవ్వలేదు. వాళ్లకి మూడెకరాల భూమి ఉంది. భర్త చనిపోయాక భూమి అంతా భర్త అన్నగారు అంటే ఆమె బావగారి స్వాధీనంలోకి వెళ్ళింది. ఆ భూమి మీద ఆయనదే పెత్తనం. ఆమె జోక్యం చేసుకొంటే, కూతురి పెళ్ళికి రాను అని చెప్పాడు. దాంతో ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. మౌనంగా అవమానాన్ని, అన్యాయాన్ని భరించింది. వ్యవసాయం చేయడానికి అత్తింటివారే అప్పు పెట్టారు. కానీ విపరీతమైన వడ్డీ వసూలు చేస్తున్నారు. పంట అమ్మేటప్పుడు కూడా ఏదో ఒక మతలబుతో మోసం చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పంట భీమా దొరకలేదు. ఆర్ధిక ఇబ్బందులకు తోడు, వాతావరణంలో మార్పులు, కొత్తరకం తెగుళ్లు, పంట పురుగులు, సమయానికి కూలీలు దొరకక వ్యవసాయంతో నానాపాట్లు పడుతోంది. లంచాలు పెట్టనందుకు రేషన్‌ కార్డు కూడా దొరకలేదు. పాత రేషన్‌ కార్డు మీద ఆమె పేరు లేదని రేషన్‌ కూడా ఇవ్వడం లేదు. ఇదంతా భర్త పోవడంతో కుటుంబం, ప్రభుత్వం తన మీద నడుపుతున్న వ్యవస్థీకృత హింసేనని ఆమె అంది.
పిల్లల చదువులతో వైద్య చికిత్సలతో అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయని, రోజువారీ జీవనం కోసం తన భూమిని సాగుచేయడమే గాక రోజుకూలి పనులకు కూడా వెళుతున్నానని చెప్పింది. ఇంత చేసినా చుట్టూ ఉన్న వారిపై ఆధారపడక తప్పడం లేదన్నది. ఆమె కథ గ్రామీణ భారతంలో చిన్న సన్నకారు రైతుల, మహిళా రైతుల దీనావస్థను తెలియ చేస్తుంది. అదే సందర్భంలో వ్యవస్థీకృత వైఫల్యాలను బట్టబయలు చేస్తున్నది. ఎటువంటి మద్దతు వ్యవస్థలు లేక అలక లాంటి ఎందరో అవినీతికి దోపిడీకి గురవుతున్నారు. తమకున్న కొద్దిపాటి భూమిని వ్యవస్థీకృత అడ్డంకులతో, చిక్కు ముడులతో సరిగా ఉపయోగించుకోలేక పోతున్నారు. సమర్ధవంతమైన మద్దతు వ్యవస్థల ఏర్పాటుతో గ్రామీణ మహిళలకు సామాజిక ఆర్ధిక భద్రత కల్పించడానికి తగు చర్యలు తీసుకోవడం ద్వారా మహిళా రైతుల, చిన్న సన్నకారు రైతుల జీవితాల్లో ఆశాదీపాలు వెలిగించవచ్చును.
శ్రీలత: తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాకు చెందిన కొలనుపాక గ్రామం నుంచి వచ్చింది. 2015 డిసెంబర్‌లో ఆమె భర్త గవ్వల యాదగిరి ఆత్మహత్య చేసుకొన్నాడు. చనిపోయేనాటికి అతను ముప్పయ్యేళ్ల యువకుడు. మూడెకరాల స్వంత భూమి, రెండెకరాల కౌలు భూమిలో వ్యవసాయం చేస్తుండేవాడు. ఐదెకరాల వ్యవసాయంలో పెట్టుబడికి తీసుకొన్న అప్పులు ఆరులక్షలకు చేరుకోవడంతో ఆ భారం మోయలేనని ఎవరికీ చెప్పాపెట్టకుండా ఆత్మహత్య చేసుకొన్నాడు. భర్త మరణంతో శ్రీలత అనేక సమస్యలను ఎదుర్కొంది. పదవ తరగతి వరకు చదువుకొన్న శ్రీలత తన స్కూలు ఉపాధ్యాయుల మద్దతుతో చదువు కొనసాగించింది. ఇప్పుడు ప్రవేటుగా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు తయారవుతోంది. అత్తమామలు భర్త పేరుమీద ఉన్న భూమిని ఆమెకివ్వడానికి నిరాకరించారు. ఎన్నో ప్రయత్నాలు చేయగా చివరికి భూమిని ఆమె కొడుకుల పేర్ల మీదికి మార్చారు. ఆమెను సంరక్షకురాలిగా ఉంచారు. 2018లో ఆమెకు ఎక్స్‌ గ్రేషియా మంజూరైనట్టు ప్రభుత్వం నుంచి ఒక లేఖ అందింది. కానీ చెల్లింపు మాత్రం, చాలామందితో కలసి ఎక్స్‌ గ్రేషియా కోసం కోర్టులో కేసు వేసిన తరువాతనే 2022లో జరింగింది. ఎక్స్‌ గ్రేషియా మొత్తంలో అత్తమామలు వాటా అడగటంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. వాళ్ళ మాటలు పడలేక రకరకాల వత్తిళ్లకు లోనయి ఆడపడుచుకు 50వేలు ఇచ్చింది. వడ్డీ వ్యాపారులకు లక్షరూపాయలు బకాయి తీర్చింది. అప్పటికే ఎన్నో వత్తిళ్లకు గురై మూడు లక్షల బకాయిని నానాపాట్లు పడి తీర్చింది. మిగిలింది పిల్లల చదువుకోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసింది. ప్రస్తుతం అత్తింట్లోనే ఒక గదిలో ఉంటుంది. వారి బాగోగులు కూడా చూసుకుంటోంది. కుటంబాన్ని నడపడానికి ఆమె రకరకాల పనులు చేస్తుంది. ఒక్క పనిచేస్తే జీవనం సాగాదు అంటుంది. తమ భూమిలో వ్యవసాయం చేస్తుంది. ఇతరుల పొలాల్లోకి కూలీగా వెళుతుంది. కుట్టు పని చేస్తుంది. ఈ మధ్యనే అంగన్వాడీ వర్కేర్గా తీసుకొన్నారు. దాంతో నెలకు 7,800 జీతం వస్తోందని చెప్పింది.
మా ఆయన జీవితం ప్రాణాలు ఆరు లక్షల రూపాయలా? అని ఆశ్చర్యపోతుంది. ఆరులక్షల కోసం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలన్నది ఇప్పటికీ ఆమెకు జవాబు దొరకని ప్రశ్నేనని అంటుంది. తన అనుభవాన్ని తలచుకొని, వ్యవసాయంలో రైతు పైకి కనపడకుండా నిరాశ నిస్పృహలతో ఎంతలా కుంగిపోతాడో కదా అని దుఃఖిస్తుంది.
బుర్ర సముద్రం గంగమ్మ : గంగమ్మ పన్నెండేండ్ల వయస్సు నుంచే వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. ఇపుడామెకు 55 సంవత్సరాలు. ఆమె పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడే భర్త ఆత్మహత్య చేసుకొన్నాడు. ఒంటరిగానే ముగ్గురు పిల్లల్ని పెంచి పోషించింది. అందరికీ పెళ్లిళ్లు చేసింది. ఇంకా భాధ్యతలన్నీ తీయనుకొంటున్న సమయంలో రెండో కొడుకు ఎర్రిస్వామి 2022, జూన్‌ మాసంలో ఆత్మహత్య చేసుకొన్నాడు. అతివృష్టి, పంట పురుగు విపరీతం కావడంతో, పంట నష్టంతో ఎర్రిస్వామి కుప్పకూలిపోయాడు. బాకీ తీర్చమని వడ్డీ వ్యాపారుల నుంచి వచ్చిన వత్తిళ్లు తట్టుకోలేక ప్రాణం తీసుకొన్నాడు. గంగమ్మ ఇప్పుడు భర్తను పోగొట్టుకొన్న కోడలిని, తండ్రిని పోగొట్టుకొన్న ముగ్గురు పిల్లలని (మనుమలను) సాకుతోంది. గంగమ్మకు మూడెకరాల భూమి ఉంది. దానికి తోడు ఎకరాకు 5000 రూపాయల చొప్పున ఏడెకరాల దేవుడి మాన్యాన్ని కౌలుకి తీసుకొంది. వయసు మీదకొస్తున్నా లెక్క చేయకుండా సొంత భూమిని, కౌలుకు తీసుకొన్న దేవుడి మాన్యాన్ని సాగు చేస్తూనే ఉంది. ఈ దేవుడి మాన్యాన్ని ముప్పయ్యేళ్ళ నుంచి సాగుచేస్తు, ఇంత వరకూ ఆమెకు పంట సాగుదారు హక్కుల కార్డు (జజRజ కార్డు) ఇవ్వనే లేదు. ఫలితంగా ప్రభుత్వ భూమినే కౌలుకి చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి మద్దతు, సహాయ సహకారాలు అందటం లేదు. అందరి మాదిరిగానే ప్రవేటు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయించాల్సి వస్తోంది. పంట రుణం పొందేందుకు సాగుదారుకి ఈ కార్డు సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌ పంట సాగుదారుల హక్కుల చట్టం, 2019 కింద ఈ కార్డును మంజూరు చెయ్యాలి.
అలివేలమ్మ: అలివేలమ్మకు 13 ఏళ్ళ వయసులోనే బాల్య వివాహమైంది. భర్త వ్యవసాయ దారుడు. పంటలు పండక, అప్పులు పేరుకుపోయి, బాకీలు తీర్చలేక ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇద్దరు చిన్న పిల్లల్తో దిక్కు తోచని స్థితిలో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నది. కానీ, రెడ్స్‌ అనే స్థానిక స్వచ్చంద సంస్థ ఆమెకు అండగా నిలవడంతో ఆశలు చిగురించాయి. ఆమె ఇప్పుడు తనలాంటి ఒంటరి మహిళలను మరో నలుగురిని కలుపుకొని ఏడెకరాల భూమిని కౌలుకి తీసుకొంది. అయిదుగురు కలసి ఆ భూమి మీద కష్టపడి పని చేస్తారు, ఈ సంఘటిత వ్యవసాయంలో వచ్చిన పంటను అందరు సమంగా పంచుకొంటారు, పంట అమ్మితే వచ్చిన డబ్బును కూడా సమంగా పంచుకొంటున్నారు. బహుళ పంటల విధానాన్ని అనుసరించడం వల్ల భూమి బాగు పడటమే కాక, ఇంట్లో ఆహార భద్రత పెరిగిందని ఆమె వివరించింది. పంటలు కూడా నష్ట పోకుండా విజవంతంగా వ్యవసాయం చేసుకోగల్గుతున్నారు. ఊర్లో స్వయంసహాయక సంఘం (ూనG) నుంచి అప్పు తీసుకొని కూతురికి పెళ్లి చేసి పంపించానని గర్వంగా చెప్పింది. జీవితంలో ఒక పెద్ద భాధ్యతను నెరవేర్చానన్న తృప్తి ఆమెలో నిండుగా కనిపిస్తుంది. ఆమెకి ఆత్మ విశ్వాసం పెరిగింది అని చెప్పడానికి చుట్టుపక్కల వాళ్ళు కూడా ‘‘ఆమె బిడ్డకి పెళ్లి చేసి పంపింది’’ అని గొప్పగా చెబుతుంటారు. ఇప్పుడు ఆమె సమాజంలో చాలా ధైర్యంగా మసలు గలుగుతోంది.
అధ్యయనంలో వెల్లడైన అంశాలు : రైతు అనే పదాన్ని వివిధ సంస్థలు వివిధ రకాలుగా నిర్వచిస్తున్నాయి. బాధితులకు అందిస్తున్న సహాయ సహకారాలు కూడా రాష్ట్రానికో తీరుగా ఉన్నాయి. ఎక్కడా సమగ్ర విధానాలు లేవు.
ఆంధ్ర ప్రదేశ్‌లో: రైతు ఆత్మ హత్యలు జరిగిన కుటుంబాలకు నష్ట పరిహారం, పునరావాస కల్పనకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన జీవో అద్భుతంగా అందరికీ మార్గదర్శకంగా ఉంది. కానీ అమలు మాత్రం నేల మీద దేకుతూ ఉంది. అడుగులు వేయడం లేదు, పరుగుల ప్రసక్తే లేదు. ప్రభుత్వ ఉతర్వు జి.ఓ. 421 అమలులోకి వచ్చి పదేళ్లయినా సక్రమంగా అమలు జరగటంలేదు. రైతు ఆత్మహత్యలు జరిగిన కుటుంబాల్లో కేవలం 15% నుంచి 20% మందికి మాత్రమే ఎక్స్‌గ్రేషియా లభించింది. చాలా కొద్దిమందికి మాత్రమే అంత్యోదయ ఆహార భద్రత కార్డులు, ఇల్లు, పిల్లలకు చదువు సదుపాయం లభించాయి. రైతు ఆత్మహత్య నిర్దారణకు ఆకుటుంబం 13 రకాల డాక్యుమెంట్లను ప్రభుత్వ అధికార్లకు సమర్పించాలి. ప్రభుత్వ సహాయాన్ని అందిపుచ్చుకోవడంలో ఇవే ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. రైతు ఆత్మహత్య జరిగిన కుటుంబాన్ని తక్షణం సందర్శించి, ఆరాతీసి, తీసుకొన్న అప్పులను ఒకేసారి ఇంత మొత్తం అని ఇచ్చేసి తీర్చేసే ఒప్పందం (వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌) చేయాలి. 50 శాతం కుటుంబాలకు ఈ సదుపాయం అందనే లేదు. ప్రభుత్వ శాఖల్లో జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ స్థాయిల్లో గణాంకాలు ఒకే విధంగా లేవు. మొత్తం రైతు ఆత్మహత్యల్లో కౌలురైతుల ఆత్మహత్యలు 75% ఉన్నాయి. ఎక్స్‌ గ్రేషియాను ఏడు లక్షలకు పెంచుతూ 2015 లో కొత్త జి.ఓ. విడుదలయ్యింది కానీ కౌలు రైతులకు సంబంధించిన కేసుల్లో క్రెడిట్‌ కార్డు సమర్పిస్తేనే ఆ కుటుంబానికి సహాయం అంద చేస్తామంటున్నారు. ఫలితం ఆచరణలో కొందరికి ప్రభుత్వం సహాయం అందని ద్రాక్షే.
తెలంగాణలో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995 నుంచి 2013 వరకు 36358 రైతు ఆత్మహత్యలు జరిగితే వాటిలో 60% తెలంగాణ ప్రాంతంలోనే జరిగాయి. వీటిలో మహిళా ఆత్మహత్యల సంఖ్య: 6974. దేశ వ్యాప్తంగా చూస్తే రైతు ఆత్మ హత్యల్లో – మహిళా ఆత్మ హత్యల శాతం 15% ఉంది, కానీ తెలంగాణలో దాన్ని మించిపోయి 19.18% గా ఉంది. రాష్ట్రం విడిపోయి కొత్త ప్రభుత్వం వచ్చినా ఇవి ఆగటం లేదు. దేశంలో మహారాష్ట్రా తరువాత తెలంగాణాలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నసీబ్‌ 2014 నుంచి డాటాను వర్గీకరించడం మొదలుపెట్టింది. దాని ప్రకారం 2014 నుంచి 2023 వరకు జరిగిన మొత్తం 7064 ఆత్మహత్యల్లో 8% వ్యవసాయ కూలీలు ఉన్నారు. వారిలో 21.8% మహిళలు. అలాగే సాగుదార్లలో 13.8% ఉన్నారు. రైతు ఆత్మ హత్యల్లో – అధికులు 75.14% కౌలు రైతులు. వీరిలో 28.6% చిన్నరైతులయితే, 34.1% సన్నకారు రైతులు బ్యాంకుల నుంచి రుణాలు దొరకక, వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకున్న వారు అధికంగా బి.సి., ఎస్‌.సి., ఎస్‌.టి కులాలకు చెందినవారే. మహిళలకు ఏడాదికి 75 రోజుల పనే దొరుకుతోంది. కూలి 250 నుంచి 500 రూపాయల వరకు సీజను బట్టి, పనిని బట్టి లభ్యమవుతోంది. సగం మందికి కూడా నష్ట పరిహారం దొరకలేదు. వీటన్నింటికి తోడుగా 40 ఎళ్ళ లోపు వయస్సున్న మహిళలు ఇంటి వాతావరణం లోను, పని చేసే చోటా లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
కర్ణాటక: కర్ణాటక ప్రభుత్వం తొలుత 2003-04లో ఆత్మహత్య రైతు కుటుంబానికి ఒక లక్ష రూపాయలను నష్ట పరిహారంగా ఇవ్వాలని నిశ్చయించి అమలు చేసింది. 2015లో ఈ మొత్తాన్ని అయిదు లక్షలకు పెంచుతూ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. ప్రత్యేకంగా కౌలురైతులకు కూడా వర్తింప చేస్తూ ప్రభుత్వ ఉతర్వులు విడుదలయ్యాయి.
అధ్యనంలో భాగంగా సేకరించిన గణాంకాల ప్రకారం ఇక్కడ 85% మందికి నష్ట పరిహారం అందుతోంది. రైతు ఆత్మహత్యతో వితంతువైన రైతు భార్యకు నెలకు 2000 రూపాయల వితంతు పింఛను, పిల్లలకు పియూసీ వరకు స్కూలు, హాస్టల్‌ ఫీజుల చెల్లింపు, అంత్యక్రియలకు స్థానిక పంచాయతీ అధికారుల సిఫార్సులను బట్టి 5000 నుంచి 20000 వేల వరకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. అనంతపురం, కడప, విశాఖ జిల్లాల్లో రైతుస్వరాజ్య వేదిక నడిపిస్తున్న ‘కిసాన్‌ మిత్ర’ హెల్ప్‌ లైన్‌ ద్వారా ఆ జిల్లాల్లో 1489 కేసులు స్వీకరించారు. వాటిలో 50% మేర కేసులను వివిధ అధికారుల ముందుంచి పరిష్క్రించగలిగారు. రెడ్స్‌ సంస్థ ఒంటరి మహిళలను సమీకరించి వారికి అండగా నిలుస్తోంది. వారితో కలెక్టివ్‌ ఫార్మింగ్‌ మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది.
మహారాష్ట్ర: మహారాష్ట్రలో దాదాపు 80% వ్యవసాయ భూమి వర్షాధారితమైనది. గత అరవై సంవత్సరాలకు పైగా వివిధ దశల్లో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు కేటాయించడంతో దాదాపు పది లక్షల ఎకరాల మేర పంట భూమి తగ్గిపోయింది. 48 శాతం వ్యవసాయ భూమిలో 80% మంది వ్యవసాయదారులు పని చేయడం వలన భూమి కొరతతో రైతు మీద కూడా విపరీతంగా వత్తిడి పెరిగింది. వర్షాధారిత వ్యవసాయంలో తరచూ కరువు కాటకాలతో రైతులు కూలీలుగా వలసలు వెళ్లడం, ఆత్మహత్యలకు పాల్పడటం ఎక్కువయ్యింది. ఈ రెండు సందర్భాల్లో గూడా ఇంటిలో ఒంటరిగా మిగిలిపోయిన మహిళలే వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లి కుటుంబాన్ని పోషించాల్సిన భారాన్ని నెత్తికెత్తుకుంటున్నారు. మహారాష్ట్రలో 1995 నుంచి 2022 వరకు 96000 మంది రైతు ఆత్మ హత్యలు చేసుకొన్నారు. వీరిలో 9.7% మంది మహిళలు ఉన్నారు. (నసీబ్‌ డేటా ప్రకారం) 18 నుంచి 60 ఏళ్ళ పైబడిన రైతులతో అన్ని వయస్సుల వారు ఆత్మహత్యలు చేసుకొంటున్న వారిలో ఉన్నప్పటికీ, 31 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సులో ఆత్మహత్య చేసుకొంటున్న రైతులు అధికంగా ఉన్నారు.
సోయాబీన్‌, పతి పంట చేతికొచ్చే సమయంలో ఆగస్టు డిసెంబర్‌ మధ్య ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయి. చాలా ఎక్కువ సంఖ్యలో వివిధ జిల్లాలకు ఈ సమస్య విస్తరిస్తోంది. భూమి కలిగిన రైతునే రైతుగా గుర్తిస్తున్నారు, అదే విధంగా వ్యవస్థాగతమైన రుణాన్ని తీసుకొని ఉండాన్ని కూడా ప్రమాణంగా తీసుకొంటున్నారు. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా చాలా మందికి అందటం లేదు. యవత్మాల్‌ 54% మందికి, వార్ధాలో 44% మందికి నాందేడ్‌లో 24% మందికి అనర్హత వేటు పడిరదని అధ్యనంలో వెల్లడైంది.
పంజాబ్‌: పచ్చవిప్లవం సాధించిన పంజాబ్‌ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది. 95% భూమికి నీటి వసతి ఉంది. గోధుమ, వరిపంటలో దేశంలోనే అత్యధిక ఉత్పత్తి సాధించింది. హెక్టారుకు 2.6 కిలోవాట్ల చొప్పున దేశంలోనే అందరికంటే అధికంగా విద్యుత్‌ అందుతుంది. యాంత్రీకరణ చూస్తే ప్రతి 9 హెక్టార్లకు ఒక ట్రాక్టర్‌ నడుస్తోంది. దేశంలోని ట్రాక్టర్లన్నింటిలో 11% ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. దేశ ఆహార గిడ్డంగుల్లో 60% గోధుమ, 40% వరి వీరు పంపిందే. అయితే రైతుల మీద అప్పుల భారం, ఆత్మహత్యల సంఖ్య తక్కువగా లేదు. పంజాబ్‌లో మహిళా రైతుల ఆత్మహత్యలను గృహిణుల ఆత్మహత్యలుగా పేర్కొన్నారు. మహిళలను రైతులుగా గుర్తించి రికార్డుల్లో నమోదు చేయలేదు కాబట్టి ఇలా జరిగింది. దీనిని బట్టి దేశ వ్యాప్తంగా, అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన నిర్ధారణ లేదని స్పష్ట మవుతుంది. భూసారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ఖరీఫ్‌ పంట చేతికొచ్చే సమయంలో, వాణిజ్య పంటలు వేసి నష్ట పోవడం వల్ల, పంట రుణాలు ఎన్నో రెట్లుగా పంట విలువను మించిపోయి, అప్పుల భారంతో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. 57% శాతంగా ఉన్న ప్రవేటు రుణాలను కూడా సంస్థాగతం చేయాలన్న సిఫారసును ప్రభుత్వం అసలు పట్టించుకోవడంలేదు.
మద్దతు ధరలతో పాటు మార్కెట్లో వ్యవసాయ ఉత్పాదక వస్తువుల ధరలు పెరిగిపోవడంతో సంక్షభం తీవ్ర మావుతూనే ఉంది కానీ, తగ్గటం లేదు. ఇటువంటి పొలాల్లో పని చేస్తున్న రైతులు, కూలీలు అందరు తీవ్ర అ నారోగ్యానికి గురై విపరీతమైన వైద్య చికిత్సల కోసం పెద్ద మొత్తాల్లో అప్పులు చేవలసి వస్తోంది. ప్రభుత్వం మూడు లక్షల మేరకు నష్ట పరివారం ఇస్తుందని, అందులో 25% తల్లికి మిగిలింది భార్యకు ఇస్తుందని, వీటితో ఒక రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలనీ చెబుతోంది. వివిధ శాఖల మధ్య సమన్వయం లేక బాధిత కుటుంబాలు తరచు సహాయం కోసం వీధికెక్కి పోరాటం చేయడం తప్పడం లేదు.
సదస్సులో వామ పక్షాల గళం : అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు శ్రీ రాజన్‌ క్షీర్‌ సాగర్‌ మాట్లాడుతూ కిసాన్‌ సమ్మాన్‌ నిధి, పంట భీమా పథకం, పంట ఎగుమతి, దిగుమతి వ్యాపారం, కనీస మద్దతు ధర మొదలైనవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కేవలం నీళ్లు విద్యుత్‌ అంశాలు మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని ఈ రంగంపై చేసే అందరు అవగాహనా చేసుకోవాలన్నారు. అందరు అవగాహన చేసుకోవాలన్నారు. సరళీకరణ విధానాల అమలు మొదలయ్యాక తొలుత పారిశ్రామిక రంగంలో వాటిని అమలు చేశారని, ఇప్పుడు వ్యవసాయ రంగంలో సరళీకరణ మొదలయ్యిందన్నారు. పంట మార్పిడి విధానాలతో ఉపాధి లేమి: ‘‘కొత్తగా సోయాబీన్‌, బి.టి. పత్తి పంటలను ప్రవేశ పెట్టారు. పెసర పంట స్థానంలో సోయాబీన్‌ వచ్చింది. పెసర చేలల్లో మహిళలే పనిచేసేవారు. వారు ఇంటికి వచ్చేటప్పుడు పెసరకాయలు, పప్పు ఇంటికి తీసుకొనిపోయి, వాటితో ఎదో ఒక వంట చేసి ఇంటిల్లిపాదికి తినిపించేవారు. సోయాబీన్‌ పంట వేయడంతో ఆడవాళ్ళకు పని పోయింది, ఇప్పుడు ఆ పంట పొలాల్లో మగవాళ్లే పని చేస్తారు. మగవాళ్ళకు పొలం పని చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఏదైనా ఆహారంలోకి తెచ్చే అలవాటు లేదు. కుటుంబం తీసుకొనే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోయాయి. పాతకాలంలో పత్తి పంట వేస్తే దీపావళి పండుగ వెళ్ళిపోయినప్పటి నుంచి మార్చి వరకు పుష్కలంగా పని దొరికేది. బి.టి పత్తి వేయడంతో కేవలం నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో మాత్రమే పని ఉంటుంది. పనులు తక్కువైన కారణంగా కూలీలు ఎక్కువై, వేతనాలు తగ్గిపోతున్నాయి. ఇదంతా వ్యవసాయరంగంలో ఉపాధి లేని పెరుగుదల, అభివృద్ధి – పంటల మార్పిడి విధానంతో జరిగింది. కానీ మన ఆర్ధిక శాస్త్ర వేత్తలు ఇలాంటి విషయాలపై చర్చించడం లేదని ‘‘ అన్నారు.
కనీస మద్దతు ధర, రుణ మాఫీ చట్టాలు చేయాలి: మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కారణంగా రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, రైతు పండిరచే పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని, వ్యవసాయరంగం లాభదాయకంగా లేదని, పంట మీద పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాని పరిస్థితిని అయన వివరించారు. రైతులు పండిరచిన వివిధ పంటలకు మద్దతు ధర నివ్వాలని, స్వామినాథన్‌ కమిటీ సిపార్సు చేసిన కనీస ధరగా నిర్ణయించాలని చెప్పారు. ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకొని సంయుక్త కిసాన్‌ మోర్చా రెండు బిల్లులను తయారు చేసి పార్లమెంటు ముందు ఉంచిందని చెప్పారు. మొదటిది కనీస మద్దతు ధర చట్టం, రెండోది రుణ మాఫీ చట్టం అని, కేరళ ప్రభుత్వం రుణ మాఫీ చట్టాన్ని చేసిందని వివరించారు. ఈ చట్టం అసాధ్యం కాదని, ఈ దేశంలో పారిశ్రామిక వేత్తలకు దివాళా తీసినట్టు (పaఅసతీబజ్‌ూషవ) ప్రకటించే విధానం ఉందని, దానికింద పారిశ్రామిక వేత్తలకు 30లక్షల కోట్ల రూపాయలు ఋణం మాఫీ జరిగిందని, రైతుకి అలాంటి అవకాశాన్ని ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
మహిళలపై వివిధ ప్రభుత్వ విధానాల ప్రభావం: గ్రామీణ భారతంలో నిరక్షరాస్యత అధికంగా ఉందని, అటువంటప్పుడు డిజిటలైజేషన్‌ పాలసీ ఎవరికి ఎక్కువగా ఉపయోగ పడుతుందని ఆయన ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యల కారణంగా వితంతువులైన మహిళలను – యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల భార్యలు మాదిరిగానే వార్‌ విడోస్‌గా ప్రకటించి, నెలకు పది వేల రూపాయల చొప్పున పెన్షన్‌ ఇవ్వాలని ఆయన కోరారు.
మహిళలపై పని భారం అధికంగా ఉందని, స్త్రీల చేతుల్లో కొత్త కోయడానికి కత్తి, కలుపుతీయడానికి ఉపయోగపడే చిన్న పనిముట్టు తప్పితే ఎలాంటి సాధనాలు లేవని, వారి పని భారాన్ని తగ్గించే సాంకేతిక ప్రగతి లేదని ఆయన అన్నారు. అలాగే సహజ వనరులు మహిళకు అందుబాటులో లేకుండా పోతున్నాయన్నారు. మహిళల విద్య వైద్యానికి సంబంధించిన అంశాలపై కూడా తగిన కృషి లేదన్నారు. ఉదాహరణకు ద్రాక్ష తోటలపైన కొట్టే క్రిమి సంహారక మందులు ఆ తోటల్లో పని చేసే మహిళలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నాయని, అటువంటి అంశాలపైనా పరిశోధనలు జరపాలని అయన సూచించారు. వ్యవసాయ రంగంలో మహిళలు నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరించేందుకు వీలుగా వారిని వివిధ నాయకత్వ స్థానాల్లోకి తీసుకోవాలని చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
తెలంగాణా రైతు సంఘం నాయకురాలు శ్రీమతి పశ్య పద్మగారు మాట్లాడుతూ సంయుక్త కార్యాచరణ: ఇటీవలకాలంలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరంతరంగా ఐక్య పోరాటం సాగించి, విజయం సాధించిన మహత్తర పోరాట అనుభవాన్ని, ఆ పోరాట విజయాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ రంగంలో మహిళల హక్కుల సాధనకు సంయుక్త కార్యాచరణతో, సంఘటితంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. లీగల్‌ పోరాటాల ఆవశ్యకత : రైతు సంఘం ఆధ్వర్యాన 421 జి.ఓ. సరిగా అమలు చేయడం లేదని, సక్రమమైన అమలును డిమాండ్‌ చేస్తూ లోకాయుక్తలో 149 మంది రైతులతో కేసు వేసిన తర్వాత 1.50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా వచ్చిందని ఇంకా అనేక అంశాలపై కేసులు నడుస్తున్నాయని, మనం మళ్ళీ మళ్ళీ కేసులు వేస్తూనే ఉండాలని, ఆందోళనా కార్యక్రమాలను కొనసాగిస్తూనే దానికి సమాంతరంగా లీగల్‌ పోరాటాన్ని తప్పని సరిగా సాగించాలని అన్నారు.
మైక్రో ఫైనాన్స్‌ సంస్థల దోపీడీ: ఈ సంస్థల దోపీడీని ఎదుర్కోవాలి, మనం ప్రేక్షకుల్లా చూస్తూ కూర్చోకూడదు. వాటిని నియంత్రించడానికి చట్టం చేయాలని పోరాడి సాధించాము. వాటిని ప్రభుత్వం బహిష్కరించాలి. ఈ సమస్య పైన కూడా మనందరం మన ఆలోచనలను పంచుకోవాలని ఆమె కోరారు.
మండీల ఏర్పాటు, ఆధునీకరణ: రైతు పంట పండిరచి, ఆ పంటను మార్కెట్టుకు తీసుకోచ్ఛే మార్గంలో దాదాపు 20% నుంచి 30% శాతం మేరకు నష్టపోతున్నారని, మార్కెట్‌ అందుబాటులో లేక మహిళా రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి నాలుగైదు గ్రామాలను ఒక క్లస్టర్‌గా ప్రకటించి, క్లస్టర్‌ స్థాయి మండీల ఏర్పాటుకు ఉద్యమించాలని ఆమె అన్నారు. రైతు తన పంటను అమ్ముకోవడానికి రెండు-మూడు మైళ్ళ కంటే ఎక్కువ దూరం ప్రయాణించకూడదు. ధాన్యంలో 17% తేమ కంటే ఎక్కువ ఉంటే కొనుగోలు చేయరు. ప్రతి కొనుగోలు కేంద్రంలో చిన్న సైజు డ్రైయర్లను (ధాన్యం ఆరబెట్టే యంత్రాలను) ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని ఆమె అన్నారు.
కౌలుదార్ల సంఘం ఏర్పాటు: కౌలుదార్ల సమస్యల పరిష్కారానికి మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కౌలుదార్ల సంఘం ఏర్పాటు చేయాలన్నారు. భూమి లేని పేద మహిళలకు భూమిలో హక్కు సాధించటంతో పాటు, మహిళల ఆస్థి హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం పైన కూడా ఉద్యమకారులు దృష్టి పెట్టాలని, కేరళ రాష్ట్రంలో కుటుంబ స్త్రీ పధకంలో భాగంగా – కొందరు మహిళలు కలసి గ్రూపుగా సహకార వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతున్నారు. కేరళ నమూనా – కోఆపరేటివ్‌ వ్యవసాయం మహిళలకు కొన్ని అవకాశాలను కల్పిస్తుంది. ఈ పధకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చెయ్యవలసిందిగా డిమాండ్‌ చేయాలని ఆమె అన్నారు.
ఐద్వా నాయకురాలు మరియం ధవళే మాట్లాడుతూ: పునరావాస పాకేజ్‌: మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి నష్ట పరిహారాలు కాదు, పునరావాస పాకేజ్‌ ఇవ్వాలన్నారు. మహిళలు రకరకాల పనులు చేస్తున్నారు, ఇల్లు వదిలిపెట్టి వలసలు పోతున్నారు, అక్కడ లైంగిక దాడులకు గురవుతున్నారు, వీరందరికి సరైన ఉపాధి కల్పించాలని, భద్రత, రక్షణ కల్పించాలని ఆమె చెప్పారు.
వివిధ రుణాలు – దోపిడీ: మైక్రోఫైనాన్స్‌ సంస్థల దోపిడీ విధానాలపై 13 రాష్ట్రాల్లో, 10వేల కుటుంబాలను సర్వే చేస్తున్నామని తెలిపారు. 17 మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ఒకే గ్రామంలో, ఒక్కరిని కూడా వదలకుండా అందరిని అప్పుల్లో ముంచెత్తాయని, రిజర్వు బ్యాంకు ఇటీవల వారి రుణాలపైనున్న సీలింగ్‌ తొలగించిందని, వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపున మహిళలను దోచుకొంటూనే మరోవేపున పాలసీ తయారీ కమిటీల్లో, కమిషన్లలో వీరే బైఠాయించి తమ దోపిడీకి అనువైన నిర్ణయాలు తీసుకొంటున్నారని అన్నారు. మైక్రోఫైనాన్స్‌ సంస్థల కారణంగా ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్లో ఆత్మహత్యలు జరిగాయని, ఇప్పుడు దేశమంతటా ప్రబలుతున్నాయన్నారు.
రైతుల ఆత్మహత్య అనంతరం ఆ కుటుంబ మహిళలు పనుల కోసం జీవనం కోసం వలసలు వెళుతున్నారని, వెళ్లే ముందు అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని ఇస్తున్నారని, నిరక్షరాస్యులైన మహిళలు ఆ అప్పు తీరుస్తున్న లెక్కలు సరిగా తెలియవని, ఈ తరహా అప్పులపైనా
ఉద్యమకారులు దృష్టి పెట్టాలన్నారు.
ఉపాధి కల్పన: ఉపాధి హామీ పధకం కింద, మహిళలకు సరైన వేతనంతో పని కల్పించాలని, అందుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని, ఈ పధకం కింద వేతనాలను తక్షణం చెల్లించాలని, చెల్లింపులను వాయిదా వేయకూడదని అన్నారు. ఈ కుటుంబాల్లో పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత ప్రభుత్వానిదే నన్నారు. గ్రామాల్లో మహిళలకు భజనలు చేయడం, పూజలు చేయడం నేర్పడం కాదు, వారికి భూమిపై హక్కు కల్పించాలి, ఆ హక్కు కోసం పోరాడే వాతావరణాన్ని కల్పించాలి, అలా జరిగితే ఆడపిల్ల పెళ్లిళ్లకు ప్రభుత్వాలు సాయం చేయనవసరం లేదని, స్త్రీలను బిచారీల కింద చూడటం మానేయాలని ఆమె హక్కులకు రక్షణ కల్పించాలని ఆమె చెప్పారు.
సదస్సులో వివిధ వ్యక్తుల ప్రసంగాల్లోని ప్రధానాంశాలు:
1. వ్యవసాయ కుటుంబాల్లో ఆత్మహత్యలను గుర్తించడానికి, వారికి అవసరమైన సహాయ సహకారాలను, పునరావాసాన్ని కల్పించడానికి ప్రభుత్వం ఒక సమగ్ర మైన విధానాన్ని రూపొందిచాలి.
2. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ శాఖలన్నీ (వ్యవసాయం, రెవిన్యూ, పోలీసు మొదలైన శాఖలు) ఒకే రకమైన డాటాను నిర్వహించాలి. ప్రస్తుతం ఇవి భిన్నంగా ఉన్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడిరచిన రైతు ఆత్మహత్యల డేటాను క్రమబద్ధీకరించాలి. ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే ప్రచురించాలి, ఉపశమనాన్ని మెరుగ్గా అమలు చేయడం కోసం డేటాలో జీవిత భాగస్వాముల పేర్లను కూడా చేర్చాలి. కులము, వయస్సు, లింగం, వైవాహిక స్థితి, చదువు, వృత్తి, ఆత్మహత్యకు కారణాలు, స్వయం ఉపాధి, రోజువారీ వేతనాలు పొందే వ్యక్తి, గృహిణి, పట్టణ గ్రామీణ వర్గీకరణ వివరాలు ఇవ్వాలి.
3. ‘రైతు ఆత్మహత్యలు’ నిర్ణయించడానికి ఉపయోగించే ప్రమాణాలను సవరించాలి. ఆత్మహత్య చేసుకొన్న రైతును గుర్తించడానికి అవసరమైన విధానాలను, డాక్యుమెంటరీ సాక్ష్యాలను సరళీకృతం చేయాలి. రైతు ఆత్మహత్య జరిగిన కుటుంబానికి ఎక్స్‌ గ్రేషియా మొత్తాన్ని, నష్ట పరిహారాన్ని అందించడానికి తీసుకొన్న ప్రమాణాల పట్టికను సవరించాలి. రైతు అంటే అనేక రాష్ట్రాల్లో భూమి యజమానులను, భూమి హక్కుదారులను మాత్రమే రైతులుగా గమనించడం వలన, మహిళా రైతులు, కౌలు రైతులు మినహాయింపుకి గురవుతున్నారు.
4. రైతు బ్యాంకుల నుంచి అప్పు తీసుకొంటేనే నష్ట పరిహారాన్ని అందిస్తున్నారు. ప్రవేటు వడ్డీ వ్యాపారుల నుంచి ఋణం తీసుకున్నప్పుడు దీనిని వర్తింప చేయడం లేదు. మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో సంస్థాగత రుణాలు తీసుకొన్న రైతులను మాత్రమే అర్హులుగా గుర్తిస్తున్నారు. కేవలం వడ్డీ వ్యాపారుల నుండే ఋణం తీసుకొని, వారి ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడితే అటువంటి ఆత్మహత్యను కూడా గుర్తించడం లేదు, వారి కుటుంబాన్ని ప్రభుత్వ సహాయానికి అనర్హమైనదిగా పరిగణిస్తున్నారు.
5. మహిళా రైతులలో అనేక బలహీన వర్గాలు, ముఖ్యంగా సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాల పట్ల (దళితులు, ఆదివాసీలు) ప్రత్యేక శ్రద్ధ అవసరం. మద్దతు అందించేటప్పుడు వారికి ప్రాధాన్యత నివ్వాలి.
6. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజలతో విస్తృతమైన చర్చలు నిర్వహించి రూపొందించిన ఉతర్వుల ముసాయిదా పత్రాన్ని అనుసరించి అదే మాదిరిగా ప్రతి రాష్ట్రం, రైతు ఆత్మహత్యల నివారణ, వారి కుటుంబాలకు ఉపశమనం, నష్ట పరిహారం, పునరావాసం కల్పించే విధానాలను రూపొందించి అమలు చేయాలి.
7. ఆత్మహత్యలు జరిగిన ప్రాంతాల్లో అన్ని వివరాలతో కూడిన మహిళా రైతుల డేటా బేస్‌ తయారు చెయ్యాలి. మహిళా రైతులందరికి గుర్తింపు కార్డులు జారీ చెయ్యాలి.
8. దేశ వ్యాప్తంగా రైతు ఆత్మహత్య జరిగిన కుటుంబానికి కనీసం ఏడు లక్షల రూపాయల పరిహారం మంజూరు చేయాలి, మూడు నెలల్లోపు ఆ మొత్తాన్ని మహిళ ఖాతాలోకి జమ చేయాలి.
9. ఆత్మహత్య బాధిత కుటుంబాలకు చెందిన మహిళల ఆందోళనలను పరిష్కరించడానికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలి. భూమి భార్య పేరు మీదికి బదలాయించడం, పెన్షన్‌, ఆరోగ్య సంరక్షణ, విద్య, గృహనిర్మాణం, వ్యవసాయం కొనసాగింపుకి అవసరమైన సహాయం మొదలైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, తక్షణ పరిష్కారాలను చూపాలి. వ్యవసాయ శాఖను నోడల్‌ ఏజెన్సీగా ఉంచి , గ్రామ స్థాయినుంచి, రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటుచేసి, సంబంధిత శాఖల సమన్వయంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు.
10. రుణ విముక్తి, సామాజిక భద్రత కల్పించడం, ఆర్థిక పునరావాసం కోసం మద్దతు ఇవ్వడానికి ప్రాధాన్యత నివ్వాలన్నారు. రైతు ఆత్మహత్య జరిగిన కుటుంబంపై ఉన్న అన్ని రుణాలను రద్దు చేయాలి. ఆ కుటుంబంలోని స్త్రీలకు ఎలాంటి రుణభారం లేకుండా రుణ విముక్తం చేయాలి. ఆ కుటుంబాల్లోని మహిళలందరికీ నెలకు 5000 పెన్షన్‌ అందించాలి. మహిళ పేరుతో రేషన్‌ కార్డు జారీ చెయ్యాలి. ఆ కుటుంబాన్ని అంత్యోదయ అన్న యోజన కిందకి తీసుకోవాలి.
11. పర్యావరణ పరంగా మంచి వ్యవసాయ పద్ధతులతో కూడిన సమగ్ర వ్యవసాయ విధానాల గురించి శిక్షణలు ఇవ్వాలి. ప్రత్యేకంగా ఎక్స్‌టెన్షన్‌ సపోర్ట్‌ని అందించాలి. వారి పంటలకు మార్కెట్‌తో అనుసంధానం చేయాలి. ఉమ్మడి భూమి లీజుల ద్వారా సామూహిక వ్యవసాయ ప్రయత్నాలను ప్రోత్సహించాలి.
12. మహిళలకు ఉపాధి కోసం ఉపాధి హామీ పధకంలో పని కోసం జాబ్‌ కార్డ్‌లను ఇవ్వాలి. పశువులను అనుబంధ జీవనోపాధిగా అందించాలి. అదేవిధంగా, వ్యవసాయం కొనసాగించడానికి అవసరమైన వ్యవసాయ ఉపకరణాలను, చిన్న యంత్రాలను అందించాలి.
13. స్త్రీలు వైవాహిక ఆస్తిలో తమ హక్కును పొందటానికి వీలు కల్పించేలా ప్రభుత్వం ఒక విధానం రోపొందించి అమలు చేయడం అవసరం. రెవెన్యూ శాఖ చట్టపరమైన వారసుల నమోదు కోసం శిబిరాలు నిర్వహించాలి. వ్యవసాయ వితంతువుల డేటా ప్రజలకు అందుబాటులో పబ్లిక్‌ డొమైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచాలి.
14. ప్రభుత్వ ప్రమాణాల కారణంగా – ప్రభుత్వ సహాయ సహకారాలు పొందడానికి ‘‘అర్హత’’ కోల్పోయిన రైతు ఆత్మహత్యల కేసులు ఇంకా అనేకం ఉన్నాయి. ఈ కుటుంబాలన్నింటిని కూడా తక్షణం అర్హుల జాబితాలో చేర్చి, నిర్దారణకు గ్రామసభ ఆధారిత ప్రక్రియలను అమలు చేయాలి. 2010 సంవత్సరాన్ని కటాఫ్‌ తేదీగా తీసుకొని బాధిత కుటుంబాలన్నిటికి నష్టపరిహారం చెల్లించాలి.
15. మహారాష్ట్రలో, కర్ణాటకలో చెరుకు తోటల్లో పని చేసే కార్మికులకు ఎలాంటి భద్రతలేదన్నారు. చెరుకు కొట్టడానికి భార్యాభర్తలిద్దరిని జంటగా పనిలోకి తీసుకొంటారు. దీని వలన ఒంటరి మహిళలకి పని దొరకటం లేదు. పనిలో భాగంగా భర్త చనిపోయినప్పుడు, పనిని కూడా కోల్పోవలసి వస్తోందని చెప్పారు.
రైతులు వలస కూలీలుగా మహారాష్ట్ర ఉంచి కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి పని చేసేటప్పుడు, పొలంలో మనిషి హఠాత్తుగా చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇవ్వడం లేదన్నారు. భూమి యజమాని అలాంటి పత్రాన్ని తన గ్రామం నుంచి చేయించి ఇస్తే, ఆయన పొలంలోనే మనిషి మరణించాడు కాబట్టి ఆయన నష్ట పరిహారం ఇవ్వవలసి వస్తుందని ఇవ్వడం లేదు. పరాయి చోట అధికారులు, భాష, తలకు మించిన ఖర్చు అన్ని ప్రతి బంధకాలుగానే ఉన్నాయి. అలా చాల మంది చిన్న సన్నకారు రైతులు వలస కూలీలుగా వెళ్ళినప్పుడు ప్రమాదాల్లో మరణిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందటం లేదు. కనీసం కుటుంబ లబ్ది పధకం కింద ఇవ్వవలసిన ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు జరిగిన కుటుంబాలన్నిటికి, ఆ దారుణం జరిగినప్పుడు వెంటనే తాత్కాలిక సహాయంగా కుటుంబ లబ్ది పధకం కింద ఆ సొమ్మును అందించాలి.
16. వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే మహిళలకు కూడా లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించాలి.
అనేక కోణాల్లో సమస్య విశ్లేషణ: సదస్సులో వివిధ రకాల కోణాల్లో రైతు ఆత్మహత్యలపై అధ్యనాలను చేసిన వారు ప్రసంగించారు. వారితో అనేక అంశాలపై సందేహాలకు ప్రశ్నలు జవాబుల రూపంలో ముఖాముఖీ నడిచింది. పంజాబ్‌ ఆత్మహత్యలపై అధ్యయనం చేసిన రంజనా పథి, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీగా పనిచేస్తున్న కోట నీలిమ విదర్భలో రైతు ఆత్మహత్యల కారణంగా వితంతువులైన మహిళల స్థితిగతులపై అధ్యనం చేసిన తన అనుభవాలను, ఆలోచనలను పంచుకొన్నారు. పాటియాలా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ జస్విందర్‌ సింగ్‌ పంజాబ్లో వివిధ సందర్భాల్లో రైతు ఆత్మహత్యలపై తాను చేసిన అధ్యయనాలను వివరించారు. కేరళ రాష్ట్ర రైతు సంక్షేమ బోర్డు డైరెక్టర్‌ పి. ఇందిరా దేవి తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలను వివరించారు. సహజ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ రామాంజనేయులు పర్యావరణానికి అనుకూలమైన, ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల గురించి, ఆ విధానాల్లో ఉత్పత్తయిన పంటలకు ప్రత్యామ్నాయ మార్కెట్లు, ప్రోసెసింగ్‌ పద్ధతులు గురించి వివరించారు. ఇవి మహిళలకు అనుకూలంగా, వారికి పని కల్పించే విధంగా
ఉంటాయన్నారు. రైతు సామ్రాజ్య వేదిక కార్యకర్త శ్రీ కొండల్‌ మాట్లాడుతూ రైతు సహాయక కేంద్రాలు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎలా ఏర్పాటు చెయ్యాలో వివరించారు, వాటి ద్వారా సమస్యలనెలా పరిష్కరించాలో తెలియ చేశారు.
ముగింపు సందర్భంలో సదస్సులో పాల్గొన్న అందరూ – రెండు రోజులపాటు ఎన్నో నూతన అంశాలను లోతుగా తెలుసుకున్నామని, చర్చలు ఉద్యమస్ఫూర్తితో ఫలవంతంగా సాగాయని, నూతన ఉత్తేజాన్ని అందించాయని అన్నారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.