కన్నడ స్త్రీవాద రచయిత్రి డా. హెచ్. ఎస్ శ్రీమతితో హేమ. ఎస్ గారి ఇంటర్వ్యూ.
కన్నడ మూలం: హేమా. ఎస్.
అనువాదం : ఘట్టమరాజు
‘‘మేడమ్, వంటింట్లో నిల్చొని మీ ‘గౌరి దుఃఖం’ చదువుతూ పొయ్యి, పుస్తకం రెంటితోనూ సరితూగుతూ వున్నాను’’ అని హెచ్.ఎస్. శ్రీమతి గారితో ఫోన్లో మాట్లాడుతూ అన్నాను. ‘‘వంటింటినీ, పుస్తక పఠనాన్నీ సరితూగిస్తూ ఆనందించు.
నీ సాధన చిన్నదేమీ కాదు సుమా! ఎంజాయ్!’’ అని ప్రతిస్పందించారు. ప్రముఖ కన్నడ రచయిత్రి హెచ్.ఎస్. శ్రీమతి గారు. ఇది మా ఇద్దరి మధ్యా జరిగిన తొలినాటి దూరవాణి మాటామంతీ. మేడం గారితో ముఖాముఖి మాట్లాడటానికి వేళాపాళా ఏర్పాటు చేసుకొని, ఆమె అనువాద గ్రంథాల్నీ, మౌలిక వ్యాస సంపుటాల్నీ మరోసారి ముందేసుకొని శ్రద్ధగా చదవసాగాను.
‘‘నేను రచనా వ్యాసంగం మొదలుపెట్టిందే నా యాభైయ్యవ ఏట’’ అని ఆమెగారు చెప్పడం నిజమో, అబద్ధమో అన్న అనుమానం నాకు కలిగిన మాట వాస్తవమే. మేడంగారి రచనా వ్యాసంగం ఆలస్యంగానే మొదలయింది. స్త్రీవాదం గురించి ఆమె ఎంతో విలువైన పుస్తకాలు రాశారు. పాఠకలోక దృక్పథాన్నీ, మానవ జీవిత విధానాన్నీ మార్పు చేసిన స్త్రీవాద ఆలోచనల్నీ హెచ్.ఎస్. శ్రీమతిగారు అక్షర రూపంలో మన ముందుంచారు. బెంగుళూరు, యలహంకలోని స్వగృహంలో ఆమెను కలిసి మాటకచ్చేరి మొదలెట్టాను. స్త్రీవాదంతో ప్రారంభమైన మా సాహిత్య చర్చ చాలాసేపు కొనసాగుతూ ఆత్మీయ సంవాదానికి ఎలా దారి తీసిందో తెలిసిందే కాదు. రైలు గబగబా ముందుకు దారితీస్తూ, పట్టాలెప్పుడు మార్చిందో, సాహిత్య చర్చ కాస్తా స్త్రీల జీవితాల అంతరంగ మథనానికి అద్దం పట్టిందో తెలిస్తే కదా! మాట కచ్చేరి చివర్లో మా ఇద్దరి మధ్యా కాస్సేపు మౌనం గాఢమౌనం ఆవరించింది. ఎప్పటికీ మరవలేని దృశ్యమది.
వ్యవస్థ మనకు నేర్పిన విలువల్ని బఅశ్రీవaతీఅ చేసుకోవాల్సిన బాటలో మునుముందుకు సాగాలని ఆమె చెప్పిన మాటలు ఇల్లు చేరేదాకా నా చెవుల్లో గింగురుమంటూనే వున్నాయి. ఈ బఅశ్రీవaతీఱఅస్త్ర విలువల్ని వదిలించుకొనే దారిలో పయనించడం మనం మొదలెట్టాలి మరి. హెచ్.ఎస్. శ్రీమతి బెంగుళూరికి దగ్గరలో వున్న హొసకోటెకు చెందిన వ్యక్తి. ఆమె బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి కన్నడంలో ఎమ్.ఏ., పిహెచ్.డి. పట్టాలు సంపాదించారు. బెంగుళూరులోని ఓ డిగ్రీ. కళాశాలలో ఉపన్యాసకురాలిగా పనిచేసి ఆమె హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన శాఖలో ఆచార్య పీఠం అలంకరించి పదవీ విరమణ చేసి, బెంగుళూరు యలహంకలో కుటుంబంతో సహా స్థిరపడ్డారు. ఆమె ఇంతవరకు సుమారు 30 పుస్తకాల దాకా ప్రచురించారు. చహరె (ముఖాలు), సేరికొండ ఎలెగళు (కూడుకొన్న ఆకులు), ఉద్గమ (పుట్టుక) హళగన్నడ సాహిత్యాధ్యయన సమీక్ష (ప్రాచీన కన్నడ సాహిత్యాధ్యయన సమీక్ష) గౌరి దుఃఖ, మహాశ్వేతాదేవి గారి రెండు సంపుటాలు, ది సెకెండ్ సెక్స్, ఎల్లరి గాగి స్త్రీవాద (అందరి కోసం స్త్రీవాదం) స్త్రీవాద అంచి నింద కేంద్ర దెడెగె (అంచు నుంచి కేంద్రం దాకా), స్త్రీవాద మత్తు లైంగికతావాద (స్త్రీ వాదం – లైంగికతావాదం) స్త్రీవాది చింతనె కెలవు ప్రశ్నెగళు, సందేహగళు (స్త్రీవాద చింతన -కొన్ని ప్రశ్నలు, అనుమానాలు) త్రివేణి కాదంబరిగళ మరు ఓదు (త్రివేణి నవలలు – మరో అధ్యయనం) ఆధునిక భారత దల్లి మహిళె (ఆధునిక భారతంలో మహిళ) స్త్రీవాద పారిభాషిక కోశ (స్త్రీవాద పారిభాషిక పదకోశం) వారి రచనల్లో ముఖ్యమైన వాటిని మాత్రమే పేర్కొంటున్నాను. డా.హెచ్.ఎస్. శ్రీమతి కన్నడ పాఠక జగత్తుకు కొన్ని ప్రముఖ స్త్రీవాద దృక్పథాల్ని, చింతనల్ని పరిచయం చేశారు. ఆలోచనల్ని రేకెత్తించే పుస్తకాలు రచించారు. అలాంటి విదుషీమణితో ఇంటర్‌వ్యూ.
మీరు సాహిత్యం వైపు ఎప్పుడు ఆకర్షితులయ్యారు? మీ తల్లిదండ్రుల నుంచి సాహిత్యాధ్యయనం పట్ల ఆసక్తి, ప్రోత్సాహాలు చిన్నప్పటి నుంచి లభించాయ్యా? వాటి గురించి కాస్తా వివరంగా చెప్తారా?
అలాంటి అనుకూల వాతావరణం ఏమీ వుండలేదు. నేను సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగాను. ఏదైనా సాధించాలన్న ఆలోచన కూడా నాకు కలగలేదప్పుడు. ఆ కాలంలో ఆడపిల్లల్ని చదివించాలన్న కోరిక చాలా తక్కువగా వుండేది. ఓ విధంగా మా ఇంటి వాతావరణం కాస్త మెరుగైనదనే తోస్తుంది. మా ఇంట్లో ఆడపిల్లల్ని కాస్తో కూస్తో చదివించే తత్వముండేది మా అమ్మానాన్నలకు. ఆడపిల్లల్ని ఏదో యస్.యస్.యల్.సి. దాకా అయినా చదివిస్తే, వాళ్లకు కాసింత సుళువుగా పెళ్లి కావొచ్చన్న భావన, ఆశ వాళ్లది. కాస్తా సంగీతం, ఇంటి పనిపాటా నేర్పిస్తే చాలు, ఆడపిల్లల వివాహాలు తప్పకుండా, యుక్తవయస్సులోనే జరిగిపోతాయన్న నమ్మకం పెద్దల కుండేది. మా పుట్టింటి వైపు వాళ్లకు కాసింత చదువు అబ్బింది. సాహిత్యం, సంగీతం పట్ల ఆసక్తి వుండేది. మా పిన్నమ్మ, మా మేనమామ కూతురు కాలేజి మెట్లెక్కినవాళ్లే. మా వూళ్లో హొసకోటెలో హైస్కూలు దాకానే వుండేది. మా అక్కలను అంతకు పైగా చదివించనే లేదు. నేను కాలేజిలో ప్రవేశించడం మాత్రం ఓ యాదృచ్ఛికమే. మా అన్నను కాలేజీలు చదివించాలని మా తల్లిదండ్రులు బెంగుళూరులో ఓ ఇల్లు చేశారు. మా మకాం బెంగుళూరు సిటీకి మారడం వల్ల నేను కూడా కాలేజీలో చదవాలని మంకుపట్టు పట్టాను. ఎనిమిది రోజుల పాటు కట్టు ఉపవాసం చేసి నా పట్టు సాధించగలిగాను. మా అన్న కూడా నాకు వత్తాసుగా నిలిచాడు. కొన్ని కాలేజీల నుంచి అప్లికేషన్ ఫారాలు తెచ్చాడు. మా మేనమామ కూతురు హోంసైన్సు కాలేజి నుంచి బి.ఎస్సి చేసింది. మా అమ్మానాన్నలు నీవు పైచదువులు చదవాలనుకుంటే హోంసైన్సే చదువు అన్నారు. బి.ఎస్ సి. కోర్సు ముగించిన తర్వాత కన్నడంలో మంచి మార్కులు రావడం వల్ల మా కన్నడ అధ్యాపకులు నన్ను యం. ఏ. కన్నడంలో చేరమని పురికొల్పారు. దాంతో కన్నడ ఎం.ఏ. కూడా పూర్తి చేశాను.
ఈ చదువులు ఆడపిల్లల జీవితాలకు పూరకమయ్యాయా? ఈ విద్యావిధానం వాళ్ల విముక్తికి ఏమైనా దోహదం చేసిందా?
ఆడపిల్లల కాలేజీ చదువు అనేది ఓపెద్ద రాజకీయం. ఇప్పుడు వాళ్లకు లభిస్తున్నది పితృప్రధాన విద్యావిధానమే తప్ప మరొకటి కాదు. పితృప్రధాన సమాజం విలువలే వాళ్లకు బోధింపబడుతున్నాయి. ఆ సమాజానికి అనుగుణమైన విధంగానే నడుచుకోవాలనే సిద్ధాంతాలనే వాళ్లకు నేర్పుతున్నారు. వాళ్లు చదివే చదువులకూ వృత్తులకూ పొంతన కుదరటమే లేదు. పైగా స్త్రీల బతుకుకూ వాళ్లు చదివే చదువుకూ మధ్య పెద్ద కందకం వుంది. ఇది ఆడవాళ్లకూ, మగవాళ్లకూ వర్తిస్తుంది. ఆడవాళ్లు ఎంత చదువులు చదివినా, పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని, ఇంకా రకరకాల పాత్రలు ధరిస్తూ, నటిస్తూ, పరిస్థితులకు తలొగ్గుతూ మానసికంగా రాజీ పడక తప్పదు. ఆ స్త్రీలు ఎంత ఉన్నత విద్య అభ్యసించినా లింగాధారిత సంప్రదాయ బద్ధమైన పాత్రలకు తగినట్లు అభినయిస్తూ ఈ పాతరల నుంచి వెలుపలికి రాలేకపోవటం చింతించాల్సిన సంగతి. ఈ మాట పురుషులకు కూడా అన్వయిస్తుంది. ఈ గొడ్డు సంప్రదాయాల నుంచి బంధవిముక్తులు కావాలంటే స్త్రీలు చైతన్యం పుంజుకోక తప్పదు. ఈ చైతన్యం కలగకుండా వ్యవస్థ స్త్రీజాతిని అణిచి పెట్టేందుకు నిరంతర ప్రయత్నం చేస్తూనే వుంటుంది. ఈ వొత్తిళ్లకులోనై మహిళలు క్రమంగా తమ అస్తిత్యాన్నే మరిచిపోతారు. మీకు ఎక్కడి నుంచో ప్రేరణ లభించవచ్చు, ఇంకెక్కడి నుంచో అవకాశాలు దొరకొచ్చు. అప్పుడు మహిళా ప్రపంచం నిద్రలేస్తుంది. స్త్రీలు అడ్డు ఆటంకాల్ని ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. వాళ్ల పోరాటం చాలా కాలం దాకా సాగుతూ వుంటుంది. వాళ్లల్లో ఈ పోరాట తత్వం ప్రజ్జ్వరిల్లుతూ వుండాల్సిందే. ఇప్పటి విద్యావిధానం మహిళా జాగృతికి తోడ్పడేలా లేదు, లేనే లేదు.
మీ రచనా వ్యాసంగం ఎప్పుడు మొదలైంది?
చిన్నప్పటి నుంచి కథలు, నవలలు తెగ చదివేదాన్ని. నేను కన్నడ ఎం.ఎ. చదివేటప్పుడు తప్ప మరెప్పుడూ సాహిత్యాన్ని కానీ, రచనా వ్యాసంగాన్ని కానీ సీరియస్ గా తీసుకోనే లేదు, రచనా వ్యాసంగం నాకొక ప్రయోగంలానే తోచింది. నాకు యాభై ఏళ్లుదాటాకనే నేను రచనా రంగప్రవేశం చేశాను. రాయాలా వద్దా అనే విచికిత్సలోనే వుండి పోయేదాన్ని, రాసినదాన్ని కాస్తా భద్రంగా గుట్టుగా దాచిపెట్టేదాన్ని. స్త్రీవాదం గురించి చదవడం మొదలుపెట్టాక, దాన్ని గురించి కొన్ని వ్యాసాలు రాసి జాగ్రత్త పరిచాను. ఆ వ్యాసాలు ‘చహరె’ (ముఖాలు) అన్న శీర్షికతో పుస్తక రూపంగా వెలువడిరది. తర్వాత అప్పుడప్పుడు అనువాదాలు చెయ్యడం ప్రారంభించాను.
హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో మహిళా అధ్యయన కేంద్రంలో మీ అనుభవాల గురించి కాస్తా తెలియచేస్తారా?
హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయంలో మహిళా అధ్యయన కేంద్రం స్థాపించబడిరది. అధ్యాపక వర్గంలో నేనొక్కతే మహిళని. మిగతా వాళ్లందరూ మగవాళ్లే. నేను మహిళా అధ్యయన కేంద్రానికి అధ్యక్షురాలిగా బాధ్యత వహించాక, ఆశాఖకు ఓ నిర్దిష్టమైన రూపకల్పన చేయాలని నిశ్చయించాను. స్త్రీవాద సాహిత్యం గురించి లోతుగా, విస్తారంగా చదవడం మొదలెట్టాను. అప్పటికి కర్నాటకలో స్త్రీవాదం గురించి విజయా దబ్బె, సుమిత్రాబాయి మొదలైన వాళ్లు ఉపన్యాసాలిచ్చే వాళ్లు, వ్యాసాలు రాసేవాళ్లు. చర్చలు జరిపేవాళ్లు. అమెరికన్ ఫెమినిజం (అమెరికా స్త్రీవాదం) గురించి గోష్ఠులు, చర్చలు సాగుతుండేవి. స్త్రీవాద మంటే స్త్రీలపట్ల సానుభూతి చూపుతూ, వాళ్ల పరంగా మాట్లాడాలి. మహిళలకు అన్యాయాలు జరిగితే, వాటికి వీరు విరుద్ధంగా మాట్లాడాలి. ఇలా స్త్రీవాద చర్చ ప్రాథమిక స్థాయిలో జరుగుతుండేది. కాని అప్పటికే అమెరికాలో స్త్రీవాదం మొదలై నూరేళ్ళు దాటాయి. కాని ఇక్కడ అలాంటి స్త్రీవాద ఉద్యమాలు ఇంకా ప్రారంభం కాలేదు.బహుశా కన్నడ సాహిత్య విద్యార్థులు సాహిత్య విమర్శలో స్త్రీవాద సాహిత్య విమర్శను ఓ భాగంగా చదివే వాళ్లు. ఓ కన్నడ కావ్యాన్నో, కథనో, నవలనో చదువుతూ దాన్లో స్త్రీపరంగా ఏ విషయాలున్నాయి? స్త్రీకి వ్యతిరేకంగా ఏ సంగతులున్నాయి? వీటిని పట్టిక ద్వారా చదివే వాళ్లు. అంతే అప్పటికి నలభై ఐదేళ్లు దాటిన నాకు సంసార జీవితంలో స్త్రీలు కష్టపడుతున్నారనీ, మగ వాళ్లు వాళ్లని బాధిస్తున్నారన్న సంగతి బాగా అర్థమయింది. కాని ఈ పితృప్రధాన వ్యవస్థలో స్త్రీలతో పాటు పురుషులకు కూడా కష్టాలు వాటిల్లు తున్నాయన్న సంగతి మాత్రం బోధపడి వుండలేదు. ఇది తెలుసుకోవడానికి మన విద్యావిధానం కాని, సంఘం కాని వెసులుబాటు కలిగించనే లేదు. ఈ దృక్పథంతో స్త్రీవాదం గురించి మాట్లాడేవాళ్లు నేటికీ కొద్దిమందే కనపడుతున్నారు.
మహిళా అధ్యయన కేంద్రం పని చెయ్యడం ప్రారంభమయింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్త్రీవాదం ఎలా వుందో తెలుసుకొనడం మొదలెట్టాను. యు.జి.సి. నిధులు లభించడంతో మా కన్నడ విశ్వవిద్యాలయంలో యం.ఎ. తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక విద్యార్థులకు పాఠ్యక్రమం తయారు చెయ్యాలి కదా! పాఠాలు నిర్ణయించాలి కదా? అప్పటికి కర్నాటకలో బెంగుళూరు విశ్వవిద్యాలయం అధీనంలో ఆ నగరంలోని ఎన్.ఎమ్.కె.ఆర్.వి. మహిళా డిగ్రీ కళాశాలలో మాత్రమే మహిళా అధ్యయనం డిగ్రీ స్థాయిలో బోధింపబడుతుంది. ఆ పాఠ్యక్రమం కూడా అంత సమంజసంగా వుండలేదు. మహిళా అధ్యయనం అంటే అంతర్విషయ (ఇంటర్ డిసిప్లినరీ) అధ్యయనం అన్న అర్థంలోనే భావింపబడుతుండేది. చరిత్ర, ఆర్థికశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం ఇలాంటి విషయాల్లోని పరస్పర సంబంధాల గురించి, ఆయా రంగాల్లో మహిళలు సాధించిన ఘనకార్యాల గురించి ప్రస్తావించడమే మహిళా అధ్యయనంలో బోధింపబడుతుండేది. ఇలాంటి పాఠ్యక్రమమే ఇతర చోట్లు అనుసరింపబడుతుండేది. ‘మహిళా అధ్యయనం’ కోసం సముచితమైన పాఠ్య ప్రణాళికను రూపొందించాలని సంకల్పించాను. అమెరికా, ఇంకా ఇతర దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో బోధింపబడుతున్న ‘మహిళా అధ్యయనం’ పాఠ్యక్రమాన్ని సంపాదించి కూలంకషంగా పరిశీలించాను. చాలా చోట్ల బోధింపబడుతున్న పాఠ్యక్రమాన్ని పరిశీలించిన తర్యాత నాకొక ధోరణి స్పష్టమయింది. జ్ఞానవలయాల్ని ప్రశ్నించడమే ‘మహిళా అధ్యయనం’ ముఖ్యోద్దేశ్యమన్నది నాకు అవగతమైంది. మహిళల పరంగా రచనలు చేస్తున్న వివిధ రంగాల్లో, శాఖల్లో పనిచేస్తున్న బుద్ధిజీవుల్ని సమావేశపరిచి, ‘మహిళా అధ్యయనం’ కోసం పకడ్బందీ ప్రణాళికను రూపొందించేందుకు ఒక నిపుణుల సమితిని ఏర్పాటుచేసి, ఆవిషయంపై తర్ఫీదు ఇచ్చే కార్యాగారాన్ని నిర్వహించాం. వివిధాంశాల పాఠ్యక్రమం వెనుక మహిళ వుండి తీరాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో స్త్రీవాద సమాజశాస్త్రం, స్త్రీవాద మనశ్శాస్త్రం, స్త్రీవాద సాహిత్యం, స్త్రీవాద జ్ఞానమీమాంసల పాఠ్యక్రమం తయారు చేశాం.
జనప్రియ సాహిత్యం గురించి మీ అభిప్రాయ మేమిటి? దాని దుష్పరిణామాల గురించి మీ రేమంటారు?
జనప్రియ సాహిత్య పరిణామాల గురించి చర్చించడానికి ముందు మనం ఓముఖ్యవిషయం గురించి ఆలోచించాలి. సాహిత్య విలువలు సృష్ఠించిన వాళ్లెవరు? జనప్రియ సాహిత్యం జీవిత విలువల్ని మరుగుపరుస్తున్నదన్న పూర్వ నిశ్చిత అభిప్రాయాల్ని ఆపాదిస్తున్న వాళ్లెవరు? జనప్రియ సాహిత్యం తేలికైనదని నిర్ధరించిన వాళ్ళెవరు? జనప్రియ నవలలు, సాహిత్య నవలలు పరిమిత పాఠక జగత్తు కంటే విశాలతరమైన పాఠక ప్రపంచాన్ని ఎందుకు పొందగలిగాయి? ఈ జనప్రియ సాహిత్యం యువతను ఆకర్షించిందంటే, సీరియస్ సాహిత్యం పట్ల యువ ప్రపంచం మొగ్గు చూపలేదంటే కారణాలేమిటి? జనప్రియ సాహిత్యానికి సీరియస్ సాహిత్యమన్న ముద్ర ఎందుకు పడలేదు? ఇలాంటి ప్రశ్న లెన్నో పుట్టుకొస్తాయి. మహిళా సాహిత్యాన్ని వంటింటి సాహిత్యమన్నారు కొందరు. అవును. ఆ వంటిల్లే స్త్రీల లోకం, ప్రపంచం, ఆ మహిళా లోకాన్ని కూడా నిర్బంధించారు. అలాంటప్పుడు రచయిత్రులకు కనపడేది పురుష ప్రపంచం మాత్రమే, పురుషులు నేర్పించిన పాఠాల్నే వాళ్లు వల్లెవేయాల్సి వచ్చింది. అంటే రచయిత్రుల దృష్టి కూడా పురుషులు సృష్టించిన చూపే విద్యావంతురాళ్లైన మహిళలు కూడా పురుషుల దృష్టితోనే రాయాల్సి వచ్చింది. వాళ్లకు సొంత చూపుతో రాసే హక్కు కూడా లేకుండా పోయింది. స్త్రీ సంవేదన అంటారే అదేమిటో రచయిత్రులకు తెలియకుండా పోయింది. ఇది రచయిత్రుల మూలభూత సమస్య, తల్లి హృదయం, తల్లిపేగు అన్న పదప్రయోగాలున్నాయి చూశారూ అవి స్త్రీ సంవేదనను, స్త్రీ హృదయాన్ని ఆవిష్కరిస్తాయి అంటారే? అది నిజమేనా? జనప్రియ సాహిత్య రచనలు కాలక్షేపానికి పనికొచ్చే మరమరాల్లాంటివి మాత్రమే అంటూ అవి అపాయకారులని అనడమెందుకు? స్త్రీల హృదయాల్లోని భావాలు అక్షరరూపంలో వెలువడటానికి పరితపించాయి. ఆ తప్తసంవేదన బహిర్గతమవడానికి పత్రికల్లో ఓ దారి దొరికింది. ఆ జనప్రియ మహిళా సాహిత్యాన్ని అదేం చెప్తుందో చదివి తెలుసుకోండి.
నాకు సమాజంలో వేరేది ఏదీ చూసేందుకు వీలు పడటం లేదని రచయిత్రి చెప్తున్నదా? లేక కళ్లముందు కనపడుతున్న భ్రమా లోకంలో విహరించమని పాఠక ప్రపంచానికి చెప్తున్నదా? ఇలా ఒకే మూసలో తయారైన పాఠక సముదాయం ఏర్పడినందువల్ల ఆ మహిళా సాహిత్యం కాస్తా జనప్రియ సాహిత్యమై స్థిరపడిపోయింది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించే రచయిత్రులు, చదివే పాఠకులు ఒకే రకమైన మనస్తత్వం, అభిరుచులు కలిగి వుండటం కారణంగా దానికి జనప్రియ సాహిత్య మన్న ముద్రపడిరది. ఇది పురుష పుంగవులకు ఇంపితం కాలేదు. నచ్చలేదు. అంతే.
మన జనప్రియ ధారావాహిక నవలల్లో స్త్రీ పాత్ర చిత్రణ ఎలా గుందంటారు?
ఇది పితృ ప్రధాన వ్యవస్థ రాజకీయం తప్ప మరింకేమీ కాదు. స్త్రీలు రెండడుగులు ముందుకు వేస్తే, పురుష మహాశయులు వాళ్ళని నాలుగడుగులు వెనక్కు లాగుతారు. ఇదే ప్రస్తుతం నడుస్తున్నది. నేటి వ్యవస్థ అంతా పితృస్వామ్య సిద్ధాంతాల ఆధారంగా నడుస్తోంది. ఆగరిడీలోనే తర్ఫీదు పొందిన రచయిత్రులు సృష్ట్పించిన స్త్రీ పాత్రలు కూడా అలాగానే వుండిపోతాయి. ఆధునిక స్త్రీలు, స్త్రీవాదులు అందరూ ఋణాత్మక గుణాలు కలిగినవాళ్లే అని ముద్ర వేయబడతారు, ఇటీవల స్త్రీలు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు, వాళ్ల స్వాతంత్య్రాన్ని అరికట్టడానికి సమూహ మాధ్యమాలు, ప్రచార సాధనాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇంటి ఖర్చులు నిభాయించేందుకు గాను వాళ్లు నాలుగు గోడలు దాటి, బయటి కెళ్లి ఉద్యోగాలు చేయవలసి వచ్చింది. బయటి ప్రపంచంలో తిరగడం వల్ల వాళ్లను హద్దుల్లో పెట్టుకోవడం సాధ్యం కాని పని: అందువల్ల పితృప్రధాన వ్యవస్థ విలువల్ని పోషించే ఈ ధారావాహి దూరదర్శన్ కార్యక్రమాలు వాటినే సమాజంలో స్థాపిస్తాయి. ఆ విలువల్నే బలపరుస్తాయి కూడా. ఆ లక్ష్మణరేఖల్ని దాటి పోకూడదని శాసిస్తాయి కూడా. పురాణ ప్రవచనాల క్షేత్రంలోనూ ఇదే సాగుతుండేది. ఇక పండగ పబ్బాల సంగతి చూద్దాం. నోములు- వ్రతాలు పతిపూజనే ప్రతిపాదిస్తాయి, బలపరుస్తాయి. ఇలానే ఎందుకు జరగాలి? తత్త్వశాస్త్రం, పురాణాలు, ధార్మిక ప్రవచనాలు, సాహిత్య, సమాచార మాధ్యమాలు, సృజనాత్మక కళామాధ్యమాలు కూడా పితృప్రధాన విలువల పరిధిని దాటి ముందుకు సాగటంలేదు.
స్త్రీవాద అధ్యయనం వల్ల మీ మనన – చింతనల్లో ఏవైనా మార్పులు సంభవించాయా?
నేర్చుకొన్న పాఠాల్ని మళ్లీమళ్లీ మననం చెయ్యాలి. ఆలోచించాలి. నేను అనుసరించాల్సిన జ్ఞాన సూత్రాల్ని కొత్తగా నిర్మించుకోవాలి. ఆ దృష్టితో ప్రపంచాన్ని చూడాలి. ఇది వరకు నేర్చుకొన్న తప్పుడు పాఠాల్ని సవరించుకోవాలి. వాటిని పాటించకుండా జగ్రత్త పడాలి. స్త్రీవాద సాహిత్య అధ్యయనం వల్ల నేను నేర్చుకొన్న పాఠాలివే. స్త్రీవాదం Rవసవటఱఅవ aఅస బఅశ్రీవaతీఅఱఅస్త్ర (పునః వివేచన, తప్పుడు పాఠాల విసర్జన) నాకు నేర్పిందిదే. నాలో జీర్ణించుకు పోయిన, రక్తగతమైన పాఠాలు మరిచిపోవడం అంత సులభమైన పని కాదు. పితృస్వామ్య విలువలు స్త్రీలనే కాదు, పురుషులను కూడా తీవ్రంగా బంధించాయి. ఎంత చదివినా, ఇంకెంతగానో నేర్చుకొన్నా వాటి ప్రభావం మన ఆచార వ్యవహారాల్లో నీతి నియమాల్లో నుంచి తొంగి చూస్తూనే వుంటుంది. ఆ లక్ష్మణ రేఖల్ని దాటాలంటే మన మెంతగానో ఆలోచించి, ధైర్యంగా ముందడుగు వేయాల్సి వుంటుంది. ఆ బంధాల్ని తెంచి వేసుకొని ముందుకు సాగాలని సంకల్పం చేసుకోవాల్సి వుంటుంది. అమ్మమ్మ, ముత్తమ్మల కాలం నాటి నియమ నిబంధనలు మన జీవితాల్లో ఎంత లోతుగా వేళ్లూరి పోయాయో చూద్దాం. సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టూ విధానాన్నే పాటించిన నాకు ఆ పద్దతిని వదిలిపెట్టి, కొత్త మాదిరిగా బట్టలు వేసుకోవాలన్న ఆలోచన 55 ఏళ్ల వయస్సు వచ్చే దాకా రానే లేదు. కాలేజీ మెట్లు ఎక్కాక నేను చీర కట్టుకోవడం నేర్చుకొన్నాను. ఒంటినిండా చీర కట్టుకొని చరుగను కప్పుకొని పోతేనే కాని కాలేజికి వెళ్లేందుకు అవకాశం లభించింది కాదు. ఈ గొడ్డు సంప్రదాయాన్ని వదిలేయాలని నిశ్చయించుకున్నాను. ఈ పాతకాలపు కట్టుబొట్టు పద్దతిని మానేసి, కొత్తరకం బట్టలు ధరించాలన్న పట్టు కలిగింది. చూడీదార్ డ్రెస్సు కొని పెట్టుకున్నాను. దాన్ని పెట్టెలోంచి తీసి కట్టు కోవడానికి ఆరునెల్ల దీర్ఘకాలం పట్టింది. ఈ నవనాగరిక వేషం వేయకూడదని నాకెవ్వరూ చెప్పలేదు, నన్ను అడ్డుపెట్టిన వాళ్లు అసలే లేరు. అయినా నేను కొత్తరకమైన ఆ చూడీదారు కట్టుకొని గడప దాటడానికి అంత కాలం పట్టిందన్న మాట! పెళ్లయి, ఒక పిల్లకు తల్లి అయిన తర్వాత నన్ను ఉద్యోగం చేయొద్దని ఎవరూ నిర్బంధించలేదు. అయినా నేను పంజరంలోని పక్షి లాగా నాలుగ్గోడల మధ్యనే వుండి పొయ్యానంటే అందుకు బాధ్యులెవ్వరు చెప్పండి? పురుషులకు వ్యతిరేకంగా నిలబడేది ఒక ఎత్తయితే, సామాజిక వ్యవస్థకు విరుద్ధంగా నిలిచి పోరాడటం మరో ఎత్తు. ఈ రెండిరటి మధ్య తేడావుంది.
మాతృత్వం గురించి మన సంఘంలో ఎన్నో నియమ నిబంధనలున్నాయి. వీటిని కొత్త దృష్టితో వ్యాఖ్యానించడం కుదురుతుందంటారా? బిడ్డల ఆలనా పాలనా, గృహిణి బరువు బాధ్యతల గురించి చర్చించాలంటే వీలవు తుందంటారా? వీటన్నింటి గురించి చర్చించడం, పునః పరిశీలించడం, వ్యాఖ్యానించడం, గొడ్డు సంప్రదాయాల్ని వదిలిపెట్టడం ఓ నిరంతర ప్రక్రియ. మన మాటలు చేతలు ఎలా వున్నాయి? వీటిని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ వుండాలి. స్త్రీల పెంపకం, చదువు సంధ్యలు, పెళ్లి, గృహలక్ష్ముల బరువు బాధ్యతల గురించి చర్చలూ, వ్యాఖ్యానాలు అప్పుడప్పుడు జరుగుతూ వుండాలి. నాకు ఏంకావాలి? నేను ఎలా జీవించాలి? మొదలైన స్త్రీ జీవిత విషయాల గురించి చర్చలు జరపడానికి ఈ వ్యవస్థ అనుమతించదు. అందువల్ల మహిళలు క్రమంగా ఒక్కో విషయం గురించి ఆలోచించాలి. ఈ విషయమై స్త్రీలు మగవాళ్లను కాని, కుటుంబాన్ని కాని, మాతృత్వాన్ని కాని ద్వేషించరాదు. వాటి గురించి లోతుగా చర్చించాలి, మళ్లీ మళ్లీ వ్యాఖ్యానించాలి.
స్త్రీవాద సాహిత్యాన్ని అధ్యయనం చేయడంవల్ల మీ దృక్పథంలో ఎలాంటి మార్పులు వచ్చాయి?
స్త్రీవాద సాహిత్యాన్ని చదవడం వల్ల చిన్నప్పుడు నా మనస్సులో గూడు కట్టుకొన్న ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు వెతకడానికి మొదలెట్టాను. సాహిత్య కేంద్రితమైన విలువల ఆధారంగా సాహిత్య రచనల్ని అవగాహన చేసుకోవడం నిలిపేశాను. సాహిత్య ప్రియులు స్త్రీవాద సాహిత్యాన్ని అర్థం చేసుకోవడంలోనూ స్త్రీవాద అధ్యయనం చేసిన వాళ్లు చూసే దృక్పథంలోనూ తేడా వుంది. దీన్ని మనం తెలుసుకోవాలి. స్త్రీవాద సిద్ధాంతాల్ని అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి అవసరమైన సాహిత్య సామగ్రిని సేకరించి చదువుతాను. ఇతర శాస్త్రాల్ని ఆర్థికశాస్త్రాన్ని చదువుతాను. ఇంకా ఎన్నో రకాల శాస్త్ర గ్రంథాల్ని అధ్యయనం చేస్తాను. సాహిత్య అధ్యయనం నాకు అంత ముఖ్యమైనది కాదు. సాహిత్య ప్రియులు తమ పరిధిలో ఇతర శాస్త్రాల్ని అధ్యయనం చేస్తారు. స్త్రీవాద సాహిత్య అధ్యయనం కూడా వారికి అలాంటిదే. వాళ్లకు స్త్రీవాద శాస్త్ర మీమాంస అధ్యయనం ముఖ్యమైనది కాదు. వాళ్ల దృష్టి అంతా సాహిత్య రచనల్లో స్త్రీపాత్ర చిత్రణ ఎలా జరిగిందన్న సంగతి మీదే. నాకు సాహిత్య అధ్యయనం ఉపాంగం మాత్రమే. కెట్ మిలెట్ ూవఞబaశ్రీ జూశీశ్రీఱ్‌ఱషం సిద్ధాంతాన్ని నిరూపించేటప్పుడు, విశ్లేషించేందుకు గాను సాహిత్యాన్ని వాడుకొంది. దాని ఆధారంగా పితృస్వామ్య విధానాలు ంవఞబaశ్రీజూశీశ్రీఱ్‌ఱషంను ఎలా నడిపిస్తాయో విశ్లేషించింది. పితృస్వామ్యం స్త్రీలపై ఏవిధంగా పెత్తనం చెలాయిస్తుందో వివరించి చెప్పింది. ఇలాంటి విశ్లేషణ చేయాలంటే సాహిత్యం తోడ్పడుతుంది. జనప్రియ సాహిత్యం కావొచ్చు, గంభీరమైన శిష్టసాహిత్యం కావొచ్చు వీటిల్లో స్త్రీల జీవితాల్ని ఏ దృక్పథంతో పరిశీలించబడిరదో నేను ఆసక్తితో చూస్తాను, కేవలం సాహిత్య విద్యార్థి దృక్పథంతో రచనల్ని పరిశీలించడం, ఆ నీతి నియమాల బంధం నుంచి విముక్తి చెందాను. సాహిత్య రచనల్లో మహిళల జీవితం ఏవిధంగా చిత్రించబడిరదో గమనించడమే నా ధ్యేయం. ఒకవేళ స్త్రీలు పురుషులు విధించిన కట్టుబాట్లను పాటిస్తూ, పంజరంలోని పక్షుల్లాగా బతుకు బండిని ఈడుస్తున్నారా? అన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాను. స్త్రీల జీవితాలు పురుషుల సైగలతో నడుస్తున్నాయా లేదా స్త్రీలే తమ బతుకుల్ని తామే నడుపుతున్నారా? అన్న సంగతి గమనించడమే నాకు ముఖ్యం. ఒకరి జీవితాల్ని మరొకరు శాసించకూడదన్నదే నా ఆశయం, ఆకాంక్ష. సమాజం కేంద్రంగా స్త్రీ స్వతంత్రంగా తన కర్తవ్యాల్ని తాను నిర్వహిస్తూ తన ప్రత్యేక భూమికను ఆమె ఏవిధంగా నిర్వహిస్తున్నదో పరిశీలించడమే నా ముఖ్య ఉద్దేశ్యం.
సాహిత్యం వాడి కల సాధనం, కొరముట్టు, అది మానవ జీవితానికి అద్దంపడ్తుంది. అది స్త్రీ జీవితాన్ని వాస్తవిక దృష్టితో చిత్రిస్తున్నదా? లేక లేని పోని రంగుల కలగా చిత్రిస్తున్నదా? అన్నదే ముఖ్యమైన విషయం, గమనించదగ్గ సంగతి. సాహిత్య రచనల్లో మహిళ కేంద్ర భూమిక నిర్వహిస్తూ, ఆమె బుద్ది కుశలతకు ప్రాధాన్యమిస్తూ వెలువడు తున్నాయా లేదా అన్న సంగతి నా కెంతో ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తాయి. నేను మొదట్లో భ్రమాలోకంలో పుట్టి పెరిగాను, ఇప్పుడు ఆ బంధనాల్ని తెగతెంచి బయటికి రావాలన్నదే నా ఆశ, ఆకాంక్ష. ఆ విముక్తి మార్గంలో ప్రస్తుతం నేను నడుస్తున్నాను.
స్త్రీవాద అధ్యయనం ప్రారంభించాక, సాహిత్యానికి పూర్తిగా దూరమయ్యారా? లేదా సాహిత్యాన్ని కొత్త చూపుతో చదవడం మొదలు పెట్టారా?
సాహిత్యానికి దూరమయ్యానని చెప్పలేను. స్త్రీవాద సాహిత్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే సాహిత్యం కూడా ఓ పనిముట్టు లాగా తోడ్పడుతుంది. స్త్రీవాద అధ్యయనానికి సాహిత్యం ఎంత వరకు దోహదం చేస్తుందో పరిశీలించడం మొదలుపెట్టాను. ‘ది సెకెండ్ సెక్స్’ కడపటి అధ్యాయం ఆధారంగా కన్నడ సాహిత్యాన్ని విశ్లేషించాను. రచయిత్రి కెట్ మిలెట్ ంవఞబaశ్రీ జూశీశ్రీఱ్‌ఱషం అనే సిద్ధాంతాన్ని నిరూపించే టప్పుడు పాశ్చిమాత్య సాహిత్యాన్ని పరికరంగా వాడుకొన్నారు. ఆ పుస్తకాన్ని అనువదించాలనుకొన్నాను. దాన్ని తర్జుమా చేసేటప్పుడు కన్నడ సాహిత్యాన్ని ంవఞబaశ్రీ జూశీశ్రీఱ్‌ఱషం ప్రాతిపదికగా చేసుకొని విశ్లేషించాలనుకొన్నాను.
బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి గారి కొన్ని రచనల్ని అనువాదం చేశారు కదా! దానికి ప్రేరణ ఎలా కలిగింది? దాని నేపథ్యం గురించి కాస్తా వివరిస్తారా?
ఆ అనువాదం అనుకోకుండా నాకు లభించిన అవకాశం. మహాశ్వేతాదేవి కేంద్ర సాహిత్య అకాడెమి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగుళూరు వచ్చారు. యాదృచ్ఛికంగా ఆమెకు ఆతిథ్యమిచ్చే అదృష్టం కలిపొచ్చింది. అంత పెద్ద రచయిత్రి మా ఇంట్లో ఎలాంటి ఇబ్బందులకు గురవుతారో అన్న ఆందోళన నన్ను కలవరపరిచింది. ఆమె మూడు రోజుల పాటు మా యింట్లో బస చేశారు. ఆ మహాతల్లి చిరునవ్వు చిందిస్తూ మూడు దినాలు మా ఇంటిల్లిపాదికీ ఎంత ఆనందం కలిగించారో మా అందరితో ఎంతగా కలిసి పోయారో చెప్పలేను. మేము ఆమెను ప్రేమతో ‘అక్కా’ అని పిలిచే వాళ్లం. ఆమె కలకత్తాకు వెళ్లాక, మా ఇద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. నేను అనువాదాలు చేస్తున్నానన్న సంగతి తెలిశాక, నా రచనలన్నింటిని కన్నడంలోకి అనువదించటానికి అనుమతి ఇచ్చారు. నాకు పరమానందం కలిగింది. నా అనువాద కార్యం కొనసాగడానికి దాన్నొక ప్రయోగంగా భావించాను.
స్త్రీవాద శాస్త్ర గ్రంథాల్ని కన్నడీక రించడానికి మీరు ఎందుకు పూనుకొన్నారు?
స్త్రీవాదానికి సంబంధించిన ఇతర భాషా గ్రంథాల్ని చదివేకొద్దీ – ముఖ్యంగా ఇంగ్లీషు – పుస్తకాల్ని – ఇలాంటి విలువైన పుస్తకాలు కన్నడంలో లేవే అన్న కొరత నన్ను బాధించింది. ఇలాంటివి కన్నడంలో లభిస్తే, మహిళా అధ్యయనం అభ్యసించే విద్యార్థి లోకానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్న కోరిక నాలో పొడమింది. స్త్రీవాదం గురించిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాక, వాటిలోని ప్రతిపాదనల్ని, సిద్ధాంతాల్ని కన్నడ స్త్రీ జీవితాల చిత్రణకు అన్వయిస్తూ నేను పత్రికల్లో ప్రచురించిన వ్యాసాల్ని ‘చహరె’ (ముఖాలు) ‘సేరికొండ ఎలెగళు’ (కూడుకొన్న ఆకులు) అన్న రెండు సంకలనాలుగా ప్రచురించాను. అది నా స్త్రీవాద అధ్యయనానికి పూర్వరంగ మనుకోవచ్చు, తర్వాత కొంత ధైర్యం పుంజుకొని ‘సెకెండ్ సెక్స్’, ‘బెల్ హుక్స్’ ‘చిమమాండ’ పుస్తకాల్ని అనువదించాను. అలా నా అనువాద క్రియ క్రమంగా మారాకులు తొడగసాగింది.
కన్నడంలో ఇప్పుడు స్త్రీవాద పరిస్థితులు ఎలాగున్నా యంటారు?
బౌద్ధిక చర్చలు, చింతనలు జరిగాయే కాని సమాజంలోని స్త్రీలల్లో చైతన్యం కలిగిందని చెప్పలేను. స్త్రీవాదం గురించి చర్చలు చేయడం, గోష్ఠులు నిర్వహించడం ఓ ఎత్తు. వాటిని విడమరిచి చెప్పి, మహిళల్లో ఆలోచనలు రేకెత్తించి, వాళ్లల్లో చైతన్యం కలిగేలా చేయడం ఇంకో ఎత్తు. స్త్రీవాద చింతనల్ని, సిద్ధాంతాల్ని ఈ పితృస్వామ్య వ్యవస్థ తీవ్రంగా అడ్డుకొంటుంది. ఈ అడ్డు అటంకాలకు ఎదురొడ్డి నిలిచి, తమ జీవిత యాత్ర పురుషాధిక్యం లేకుండా సాగించే మంచి రోజులు ఇంకా రాలేదనీ, ఇప్పట్లో వస్తాయనీ చెప్పలేం.
కార్పొరేట్ ప్రపంచం, ఆధునిక సాంకేతిక వ్యవస్థ లోని ఉద్యోగావకాశాలు స్త్రీల స్థితిగతుల్ని మార్చాయంటారా?
లేదు. మహిళ ఆర్థికంగా కొద్దిగా పుంజు కొంది. కాని ఆమె మానసికంగా ఇంకా పితృస్వామ్య విలువల మధ్యే నలిగిపోతూ వుంది. ఆమె ఆ బంధనాల్నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తే చాలు పితృస్వామ్య వ్యవస్థ ఆమెను ఇతర సూత్రాల్లో బందీ చేయడానికి తలపెడ్తుంది. ఉదాహరణకు సమాచార (వార్తా) మాధ్యమాల వైఖరి గమనించండి. వాటిల్లో ప్రచురింపబడే, ప్రసారమయ్యే చర్చలు కానివ్వండి, గోష్ఠులు కానివ్వండి. అవి మహిళల పరంగానే కనపడుతున్నా పితృస్వామ్య వ్యవస్థలోని విలువల్నే సమర్థిస్తున్న విధానమే వ్యక్తమవుతుంది. ఇక స్త్రీలకు సంబంధించిన శీర్షికలను గమనిస్తే వంటలు – పిండి వంటలు, ఇంటి అలంకార విధానాలు, పిల్లల పెంపకం, చదువు సంధ్యలు – వాటి పరిధులు, పరిమితులు స్పష్టమవుతాయి. ఇవన్నింటిని గమనిస్తే ఆడవాళ్ల జీవితాల్లో పితృస్వామ్య విధానాలే కొనసాగుతున్నాయనేది తెలుస్తుంది. మహిళల్ని పంజరాల్లో బంధించడానికి రకరకాల ‘మిథ్’ లు సృష్టింపబడటం మనకు బాగా తెలుస్తుంది. ఈ ‘మిథ్’లను ధ్వంసం చేయడం చాలా కష్టం. ఇక పాప్యులర్ సినిమాల సంగతంటారా? అదో భయంకర మాయాలోకం. ధైర్యసాహసాలు ప్రకటించే కథానాయిక వుందనుకోండి. నాయకుడు ఆమె తప్పు చేసినట్లు నిరూపించి, తన తప్పుల్ని ఒప్పుకొనేటట్లు చేసి తన దారికే మళ్లిస్తాడు. ఐ.ఏ.ఎస్. అధికారిగా పనిచేస్తున్న కథానాయిక. తాను కింద పడేసిన పెన్ను తీసుకొనేందుకుగాను కిందికి వంగి భర్త కాలిబూట్లు తాకి కళ్లకు అద్దుకొని తన స్థాన మదే అని భావించినట్లు సినిమాల్లో చూపించబడుతుంది. అంటే స్వతంత్ర వ్యక్తిత్వం రూపొందించుకొనేందుకు ప్రయత్నించి, గెలుపు సాధించిన తాను మళ్లీ పితృస్వామ్య అధికారాన్ని ఒప్పు కొన్నట్లేగా? ఇలా ‘మిథ్’ల వలయంలో చిక్కుకు పోతుంది.
వివిధ రంగాల్లో కృషి చేసి ప్రసిద్ధమైన మహిళల్ని ఇంటర్య్వూ చేస్తూ వాళ్లను మీకు వంట చేయడం వచ్చా? అనే ప్రశ్న తప్పని సరిగా వేస్తారు. సంఘం అంటే అందరికీ నచ్చే విధంగానే వాళ్లతో సమాధానం చెప్పించేందుకు ప్రయత్నిస్తారు. ఇలా సాగుతుంటాయి పత్రికల్లోనూ, టి.వి.ఛానళ్లలోనూ ముఖాముఖి సందర్శనాలు ఈ కల్లబొల్లి ‘మిథ్’లు మహిళల జీవితాల్ని చుట్టుముట్టి, వాళ్ల శక్తి సామర్థ్యాల్ని కుంచింప చేస్తుంటాయి. ఈ మిథ్యా ప్రపంచం నుంచి ఆడవాళ్లు, మగవాళ్లు బయటపడ్తే కాని వాళ్లకు వాస్తవ ప్రపంచమంటే ఏమిటో బోధపడదు. అందుకే స్త్రీవాద తత్త్వశాస్త్రం ఈ మహిళలు తమకు కావాల్సిన, ఇష్టమైన జీవితాల్ని తామే నిరూపించుకోవడానికి అవసరమని నేను భావిస్తాను. స్త్రీలు తమకు అవసరమైన జ్ఞాన విజ్ఞానాల్ని సంపాదించుకొని మేల్కొని ముందడుగులు వేయగల రంటాను. వాళ్ల బతుకుల్లోని దుస్థితి తొలిగిపోయి సుస్థితి ఏర్పడగలదని భావిస్తాను నేను.
సిమోన్ దబూవా, బెల్ హుక్స్ ల గ్రంథాల్ని ఈ కన్నడీ కరించారు కదా. మరి మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయి?
సిమోన్ దబూవా అస్తిత్వవాదం లోని మూలభూతమైన ‘నేనెవ్వరు’? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు సంకల్పించింది, సిద్ధమయింది. ఆ సందర్భంగా ఆమె అందుకు సంబంధించిన వివిధ శాస్త్రాల్ని అధ్యయనం చేసి సవాలు చేసింది కూడా. ‘ది సెకెండ్ సెక్స్’ను అనువదించేటప్పుడు నాకు చాలా ఇబ్బందులు కలిగాయి. సిమోన్ బూవా విజ్ఞాన శాస్త్రాల్ని, తత్వశాస్త్రాన్ని ప్రస్తావిస్తారు. ఇంకా ఎన్నో శాస్త్రాల్లోని ప్రధాన విషయాల్ని ప్రశ్నిస్తారు. ఇదంతా వొంట బట్టించుకోవడం చాలా కష్టమైన పని. కొన్ని సందర్భాల్లో కె.వి.నారాయణ్ గారితో చర్చించి నా సందేహాల్ని తీర్చుకొని అనువాదంలో ముందుకు సాగాను. ఎన్నో క్లిష్టమైన సందర్భాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘బెల్ హుక్స్’ గ్రంథాన్ని అనువదించే సమయంలో మరికొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ స్త్రీవాదం విదేశాల్లో మొదలై ఎన్నో దశాబ్దాలు గడిచాయి, స్త్రీవాద ఉద్యమం బౌద్ధికంగా ఎంతో వృద్ధి చెందింది. అమెరికా నల్లజాతి స్త్రీవాదం గురించి నాలో జిజ్ఞాస కలిగింది. ఎందుకంటే అమెరికా నల్లజాతి స్త్రీలు వర్ణ వివక్షను తీవ్రంగా, క్రూరంగా అనుభవించిన వాళ్లు, ఇప్పటికీ అనుభవిస్తున్న వాళ్లు కూడా. వాళ్లు ఓవైపు తమ జాతిలోనే పితృస్వామ్య వ్యవస్థతతో పోరాడాలి. మరో వైపు అమెరికాలోని తెల్లజాతి వాళ్ల వర్ణ వివక్షతతో తలపడాలి. అడకత్తెరలో చిక్కుకున్న పోక చెక్క లాంటి దుస్థితి వాళ్లది. అంతే కాదు, మరో సమస్యను కూడా ఆ మహిళలు ఎదురించాలి. ఆ స్త్రీవాదులు జాతి మగవాళ్ల పరంగా వుండాలా లేదా సామాన్య స్త్రీల పరంగా నిలవాలా అన్నదే అది. అప్పుడు వాళ్లకు యథార్థ పరిస్థితి తెలిసొస్తుంది. భారతదేశ స్త్రీల పరిస్థితి కూడా ఇలానే వుంది కదా అని నాకు అనిపించింది. అమెరికా నల్లజాతి స్త్రీల లాగానే ఇక్కడి వాళ్లు కూడా జాతిపరమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ దళిత స్త్రీవాద మనేది పుట్టుకు రావడం మనం గమనించాలి. విచిత్ర మేమంటే ఇక్కడ స్త్రీవాదం ఇంకా బలపడలేదు. అది సమాజంలోని ప్రధాన స్రవంతితో చేరలేదు. ఈ ముఖ్యవాహిని స్త్రీవాదం బౌద్దికంగా పితృస్వామ్య బంధాల నుంచి విడివడలేదు. ఇక దళిత స్త్రీలు దళిత పురుషుల కబంధహస్తాల నుంచి బయటికి రాలేదు. ఈ సమస్యను ఎదురించాలంటె అమెరికా నల్లజాతి స్త్రీవాదుల మార్గాన్నే మన దళిత స్త్రీవాదులు అనుసరించాల్సి వుంటుంది. ఈ సమస్యలను అర్థం చేసుకోవాలని నేను నల్లజాతి స్త్రీవాదుల గ్రంథాల్ని చదవసాగాను. వాటిలో కొన్నింటిని కన్నడీకరించాను కూడా. ప్రస్తుతం నేను పెట్రీషియా హిల్ రాసిన ‘బ్లాక్ ఫెమినిస్ట్ థాట్’ పుస్తకాన్ని అనువదించాలనుకొన్నాను.
రకరకాలుగా జరుగుతున్న పోరాటాల్లో పాల్గొంటున్న మహిళల వల్ల స్త్రీవాద ఉద్యమానికి ఏమైనా ప్రయోజనం కలుగుతున్న దంటారా?
నేటి మహిళా సమస్యలకు పరిష్కారం కుదరాలంటే ఇలాంటి పోరాటాలు చాలా అవసరం కూడా. ఈ పోరాటాల కారణంగా ఆవశ్యకమైన, ఉపయోగకరమైన ఆలోచనలు, చింతనలు లభిస్తాయి. ఇవి తాత్త్విక సిద్ధాంతాలుగా రూపొందుతాయి. మన దేశంలో బహుశా ఇది సాధ్యం కాలేదనుకుంటాను.
స్త్రీవాద విమర్శ గురించి తెలియచేస్తారా?
స్త్రీవాద విమర్శ మహిళా అధ్యయనంలో ఓభాగం అంతే, మరేమీ కాదు. స్త్రీవాద అధ్యయనం సాహిత్యంలోని ఓ భాగం మాత్రమే. స్త్రీవాద అధ్యయనం ఆడవాళ్లు మాత్రమే చేయాలన్న పరిస్థితి ఏర్పడటం విచిత్రంగా వుంది. ఇదొక విపర్యాసం.
సాహిత్య చరిత్రను స్త్రీవాద దృక్పథంతో పరిశీలించి తిరగరాసే ప్రయత్నాలు ఏమైనా జరిగాయంటారా?
జరగలేదనే చెప్పాలి. మా కన్నడ. విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో మహిళా చరిత్ర సంపుటాలు వెలువరించాలని ప్రయత్నించాం. ఆ ప్రణాళికను రూపొందించేందుకై కొన్ని గ్రూపులు చేసి వాళ్లకు స్త్రీవాద దృక్పథం గురించి తెలియచేసేందుకుగాను శిక్షణ శిబిరాలు నిర్వహించాం. ఈ విషయానికి సంబంధించిన సామగ్రి కొంత సేకరించగలిగాం. పాఠ్య ప్రణాళిక కూడా రూపొందించగలిగాం. అంతేకాని ఆసామగ్రిని శాస్త్రీయంగా విశ్లేషించే పని మాత్రం తృప్తికరంగా సాగలేదు. ఈ ప్రణాళిక ఒక్కరితో సాధ్యమయ్యే పనికాదు. లభించినంత సహకారంతోనే స్త్రీవాద పారిభాషిక పదకోశం తయారు చేశాను. స్త్రీవాద అధ్యయనంలో ఉపయోగించిన పదాల అర్థాల్ని వివరించడం మాత్రం చేయగలిగాం.
ఆలోచనలు – అభిప్రాయాలు
1) పురుషులే చరిత్రను రాసినప్పుడు అందులోని చింతనలు వాళ్ల పరంగానే వుంటాయి. కేంద్ర స్థానంలోనూ వాళ్లే వుంటారు. కాని చరిత్రలో స్త్రీలకు స్థాన ముండదు. చరిత్రలో మనకు కొందరే స్త్రీలు కనపడతారన్న ప్రశ్న కలుగుతుంది. చరిత్రలో ఎంత మంది స్త్రీలు వున్నారన్న ప్రశ్న ఉదయించకూడదు. వాళ్లయినా ఎందుకున్నారని ప్రశ్నించాలి.
2) స్త్రీ ప్రపంచాన్ని చూసే అవకాశాలు ఎక్కువైనట్లల్లా ఆమె జ్ఞానం విస్తరించింది. అప్పుడే ఆమెలో పురుష ద్వేషం మొదలయింది. పితృస్వామ్య వ్యవస్థలో పురుషుడే కేంద్ర స్థానంలో వుండి, స్త్రీల విమర్శకు కారణమవుతాడు, ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే స్త్రీల నిరాదరణకు, అణచివేతకు కారణాల్ని అన్వేషించకుండా, పనిముట్టయిన మగవాణ్ణి ద్వేషించడం మొదలు కావడం. ఈ పొరపాటే స్త్రీపురుషుల మధ్య ద్వేషం రగులు కోవటానికి కారణమయింది.
3) ఒక సమస్యను అర్థం చేసుకొన్నామంటే బాధ కలగటం తథ్యం. మనస్సుకు నొప్పి కలిగిందన్న సంగతి తెలిసింది. దాన్ని పోగొట్టుకోవాలన్న విషయమూ అర్థమయింది. కాని ఆ బాధను తోలగించుకోలేక విలవిల లాడక తప్పింది కాదు. అందుకని నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు. సమస్యల్ని పరిష్కరించుకొనే ప్రయత్నం మాత్రం సాగుతూనే వుండాలి. గమ్యం చేరుకోలేక పోయినా ప్రయాణం సాగుతూ వుండాలి. ఇది చాలా ముఖ్యం.
4) ఆడవాళ్ల శోషణ, హింసకు మూలకారణం మగవాళ్లు కాదు, పితృస్వామ్య విలువలన్న సంగతి గమనించాలి. స్త్రీవాద తత్త్వ శాస్త్రంలోని మొట్ట మొదటి పాఠం ఇదే. పురుషస్వామ్య విలువలు ఓ వ్యవస్థలో ఏవిధంగా మారాయో తెలుసుకోవడం కూడా ఈ తొట్టతొలి పాఠంలోని ఓ ప్రధాన అంశమే. ఈ వ్యవస్థీకరణకు దారి తీసేవి ఆర్థికశాస్త్రం, సమాజశాస్త్రం, మనస్తత్వశాస్త్రం మొదలైన శాస్త్రాలే అన్న సంగతి మరవకూడదు. ఈ శాస్త్రాలే పురుషస్వామ్య విలువల్ని ఆచరణలో పెడ్తాయి. ఈ ప్రక్రియలో ఆడా, మగా ఇద్దరూ పాలు పంచుకోవాల్సి వస్తుంది. వీళ్లే పితృస్వామ్య వ్యవస్థీకరణలో సాధనాలుగా వ్యవహరింపబడతారు. మన మెవ్వరం స్వతంత్రంగా ఆలోచించే స్థితిలో కాని, పోరాడే చేసే స్థితిలో కాని వుండలేం. సాంఘిక వ్యవస్థలో – చట్రంలో- జీవించే టప్పుడు స్వతంత్ర వ్యక్తిత్వం భూమిక పరిమితమే. ఈ పరిధిని దాటడం సులభమైన పని కాదు.
5) జ్ఞానం పితృస్వామ్య వ్యవస్థలోంచి పుట్టుకొచ్చిందే. దీన్ని ప్రశ్నించడం స్త్రీవాద ఆలోచనే, చింతనే. ఒక వేళ ఎవరైనా జ్ఞానం అన్నది తటస్థమైనది అనొచ్చు. కాని దాన్ని సృష్టించిన వాళ్లు ఎవరూ అంటే వచ్చే జవాబు ఏమిటో తెలుసు. మానవ చరిత్రలో భాషను సృష్టించిన వాళ్లెవరు అంటే పురుష పుంగవులే భాషా సృష్టికర్తలు అని స్త్రీవాద భాషావేత్తలు చెప్తారు. భాషను సృష్టించిన వాళ్లు పురుషులే అని తేలినప్పుడు ఈ సంపూర్ణ జ్ఞాన వ్యవస్థను నిర్మించినవాళ్లు కూడా పురుష మహాశయులే కదా!
6) పురుషుని దృష్టితో స్త్రీ తన్ను చూసుకోవడం, సౌందర్య సాధనల సృష్టి, అలంకార సామగ్రి – ఈ అంతటినీ సృష్టించింది వ్యాపార జగత్తే కదా. దీన్నే ఫెమినిస్ట్ పాలిటిక్స్ అంటారు. దీన్ని అర్థం చేసుకొంటే చాలు, ఎదుటివాళ్ల ప్రతిఘటనల్ని ఎలా అరికట్టాలో తెలుసుకోగలం.
7) ఇంతవరకూ స్త్రీవాదం గురించి సాహిత్య వేత్తలు మాట్లాడినంతగా ఇతర శాస్త్రవేత్తలు చర్చించడం లేదు. జ్ఞానవిజ్ఞాన వ్యవస్థ పూర్తిగా పితృస్వామ్య వ్యవస్థ ప్రధానంగా వుండటం వల్ల, అన్ని రంగాల్లోనూ స్త్రీ వ్యతిరేక వ్యవస్థ వేరూరి వుండటం కారణంగా జ్ఞాన వలయాలు కూడా స్త్రీ జీవితాలకు వ్యతిరేకంగానే వున్నాయని భావించవచ్చు.