సమాజంలో కాలానుగుణంగా మార్పులు చోటుచేసుకుంటాయి. తదనుగుణంగా సమాజ ప్రతిబింబమే సాహిత్యం కాబట్టి, సామాజిక నేపథ్యంలో సాహిత్యంలో కాలక్రమంలో అనేక మార్పులు సంభవించాయి. అందులో భాగంగానే వివిధ వాదాలు, దృక్ఫథాలు వచ్చాయి.
అటువంటి వాటిలో ప్రముఖమైన విప్లవ కథలోని స్త్రీ జీవిత చిత్రణను ఈ వ్యాసంలో చర్చించాను. ఇందులో తెలంగాణ కథా రచయిత్రులు 1991-2015 మధ్యలో రాసిన కథలను ఈ వ్యాస పరిధిలోకి తీసుకున్నాను.
తెలుగునాట విప్లవ సాహిత్యం అన్ని ప్రక్రియలలో వచ్చింది. ఇందులో ప్రధాన భాగాన్ని విప్లవ రచయితల సంఘం ఆక్రమించిందనడంలో అతిశయోక్తి లేదు. విప్లవ సాహిత్యంలో వివిధ ప్రక్రియల పరంగా చూసినప్పుడు మొదటగా కవిత్వం ఆక్రమిస్తుంది. తర్వాతి స్థానంలో కథా ప్రక్రియ ఉంటుంది. ప్రధానంగా తెలంగాణ స్త్రీ కథా రచయిత్రులు రాసిన విప్లవ కథల్లోని స్త్రీ జీవిత చిత్రణను చర్చించాను.
విప్లవంలో స్త్రీలు-మాతృత్వం: సమాజంలోని స్త్రీలే విప్లవోద్యమంలోకి అడుగుపెడతారు. కాబట్టి దాదాపుగా ఏ స్త్రీకైనా ప్రకృతి సిద్ధంగా సంక్రమించే మాతృత్వాన్ని వదులుకోవడం ఇష్టం ఉండదు. కానీ విప్లవోద్యమంలో పనిచేసే క్రమంలో కఠిన నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. తత్ఫలితంగా మాతృత్వాన్ని త్యాగం చేయడమే. అసలు పెళ్ళి చేసుకోకుండా ఉండటమో, పెళ్ళి చేసుకున్నా పిల్లల్ని కనకుండా ఉండటం, పిల్లల్ని కన్నా కూడా వారిని ఇతరుల దగ్గర పెంపకానికి ఉంచి, ఉద్యమంలో మరణం సంభవిస్తే పిల్లల్ని అసలు చూడలేరు. బతికి బయటపడితే ఎన్నో సంవత్సరాల తర్వాత పిల్లల్ని చూసే అవకాశం దొరుకుతుంది. ఇటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని స్త్రీ జీవితాన్ని చిత్రించిన కథలను మనం ఇక్కడ గమనించవచ్చు.
‘పిల్లలు’ కథను రాసింది తాయమ్మ కరుణ. విప్లవ దళంలో పనిచేసేవారు వారి జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తూ జీవిస్తారు. ఉద్యమానికి అంకితమవుదామనుకున్న దంపతులు పిల్లల్ని కనడం వల్ల ఎలాంటి పరిణామాలు సంభవించవచ్చు. అటువంటి సందర్భాలలో పిల్లల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వలేమన్న విషయాన్ని తెలుసుకొని పిల్లల్ని కనాలనే నిర్ణయాన్ని మార్చుకున్న దంపతులు ఈ ‘పిల్లలు’ కథలో కనిపిస్తారు. వారే ప్రదీప్, సుమలు. సుమకు మొదటిసారి ప్రెగ్నెన్సి వస్తే అబార్షన్ చేయించుకుంటుంది. తల్లి కావాలని ఏ స్త్రీకైనా ఉంటుంది. అదే కోరిక సుమకు కూడా కలుగుతుంది. పరిస్థితుల వల్ల రెండవ సారి కూడా అబార్షన్ చేయించుకోక తప్పదు. వీరితోపాటే విప్లవోద్యమంలో పనిచేసిన కవిత జీవితం కూడా వర్ణానాతీతంగా ఉంటుంది. ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చి, అది కూడా మొదటిసారి అబార్షన్ చేయించుకున్న సమయంలో రూపురేఖలు ఏర్పడిన పిండం చూసి ఆమె దుఃఖించిన తీరును, తర్వాత మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చాక బిడ్డని కని, డాక్టర్లైన దంపతులకు కవిత ఎవరికీ తెలియకుండా తన బిడ్డను ఇచ్చిన తర్వాత బిడ్డకు దూరంగా ఉంటూ ఆవిడ పడిన కష్టనష్టాలను ఈ కథలో గమనించవచ్చు.
‘‘పిల్లల్ని కనడం స్త్రీలకు ప్రకృతి ఆపాదించిన శరీర ధర్మం. దాని కారణంగా ఒకప్పుడు ‘సృష్టికర్తలుగా’ గౌరవం పొందిన స్త్రీలు తమ ఉన్నత స్థానాన్ని కోల్పోయి ఆధీనులుగా బ్రతకవలిసి వస్తోంది. పిల్లలని పెంచడం అంత తేలికైన విషయం కాదు. విప్లవోద్యమంలో పురుషులతో పాటు సమానంగా పాలుపంచుకోవాలని కోరుకొనే వారికి పిల్లలని కనడం అంటే గెరిల్లా జీవితానికి దూరం కావడమే, అందువల్ల దండకారణ్యంలో మొట్టమొదట కాలుపెట్టిన మళ్ల రత్నమాల (నిర్మల) వంటి ఎందరో మహిళా విప్లవకారులు తమ పసిబిడ్డలను ఇతరులకి అప్పగించి గెరిల్లా జీవితంలోకి వెళ్లవలసిన పరిస్థితి. దానిలో ఎంతో మానసిక సంఘర్షణ ఉంటుంది. తల్లులకి ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. ఒక దశాబ్దం గడిచేసరికి పిల్లల్ని కని మళ్లీ ఇతరులకి ఇవ్వడం కంటే అసలు కనకుండా ఉండడం మేలు అనే కఠిన నిర్ణయాలు తీసుకోగలిగే స్థాయికి మహిళా గెరిల్లాలు రాగలిగారు. గెరిల్లాలకు తమ పిల్లలను, బయటి పిల్లలను ఒకలా ప్రేమించే తారతమ్యం ఉండదు. ఒకవేళ పిల్లలు ఉంటే వారిని వదిలిపెట్టి విప్లవోద్యమంలోకి వస్తే వారికి దూరంగా ఉండటం వలన సంఘర్షణకు లోనవుతారు. పిల్లల్ని కనకుండా ఉండాల్సి వస్తే మానసిక వేదనకు గురికావడం చూస్తూనే ఉంటాం. ఇతరుల పిల్లలను తమ పిల్లలుగా ప్రేమించగలిగే ఔన్నత్యం సంతరించుకోవడం వంటి ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి’’ (అనురాధ, బి. వియ్యుక్క-అజ్ఞాత రచయిత్రుల కథా సంకలనం (సంఫుటి-2). 2023. పుట: 15, 16). ఈ విధంగా విప్లవోద్యమంలో స్త్రీ ఎదుర్కునే ఇబ్బందులు, అందునా అమ్మతనాన్ని అనుభవించలేని స్థితిని చూడవచ్చు.
‘కాంత పున్నం వెన్నెల’ కథను పద్మకుమారి రాసింది. ఇందులో కాంత, పున్నం విప్లవోద్యమంలోకి అడుగుపెడతారు. ఉద్యమంలో మాతృత్వం పట్ల మమకారం ఉండకూడదు. కానీ కాంత వ్యక్తిగత జీవితానికి, రాజకీయ జీవితానికి సంఘర్షణలో ఓ బిడ్డకు జన్మనిస్తుంది. భర్తకు ఇచ్చిన మాట మేరకు దళంలో పనిచేసే తోటి వారి సహాయంతో బిడ్డను పున్నం తల్లికి అప్పజెప్పాలని తీసుకొని వెళ్తుంది. తల్లిగాని, చెల్లిగాని వారివారి వ్యక్తి జీవిత కారణాల వల్ల బిడ్డను పోషించలేమంటారు. తర్వాత ఆమే మైదాన ప్రాంతానికి రావాల్సి వస్తుంది. పున్నం మరణించాక పున్నం తల్లిదండ్రులు కాంతను అక్కున చేర్చుకుంటారు. పున్నం తల్లిదండ్రులది పేద కుటుంబం. అప్పటికే పున్నం బిడ్డ ఆరోగ్యం బాగా లేకపోయినా పాలు, మందులు ఇప్పించలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో బతుకు ఎంత భారమైన సహచరుడి ఆదర్శాలకు విరుద్ధం కనుక పోలీసులు ఇచ్చే అవార్డును కూడా తిరస్కరిస్తుంది.
కాంత అత్త మామ- ‘‘ఈ పసి గుడ్డును నేనెట్ల సాదుకొనేది? కూలి పనికి పోకపోతే ఎల్లదాయె. అయినా తల్లి లేకుండా పిల్లను సూసుకొనుడు మాటలా? నా వల్ల యాడైతది?’ అని ఆమె తేల్చేసింది. పున్నం వాళ్ల పెద్దక్క అందుకొని ‘బైట ఏం బాగలేదు. వచ్చే పోలీసులు, పొయ్యే పోలీసులాయె. మీ కోసం పెట్టే కష్టాలే అన్నీ ఇన్ని కావు. చిన్నోడినే వాళ్లకు దొరకకుండా కాపాడుకోడం యాతనైపోయింది. మీరు లోపల ఉంటే దీన్ని సాదుకోవడం ఎట్ల? అని ఆ ఊహే భయం అనిపించిందేమో ఆగిపోయింది.’’ (అనురాధ, బి. వియ్యుక్క-అజ్ఞాత రచయిత్రుల కథా సంకలనం (సంఫుటి-2). 2023. పుట: 45). కాంత చెల్లెలు నీల ‘‘నాకేడెతదక్కా, నీవు లోపల ఉండుకుంటూ నేను పాపను పెంచుకోవడం మాటలా? కొన్నేళ్లు నీవు బయటే ఉండి, ఆ తర్వాత మళ్లీ పోతే అప్పుడు అంత ఇబ్బంది ఉండదు కాని..’’ (అనురాధ, బి. వియ్యుక్క-అజ్ఞాత రచయిత్రుల కథా సంకలనం (సంఫుటి-2). 2023. పుట: 47) అంటుంది. విప్లవోద్యమంలో పనిచేసి, అనివార్య కారణాల వలన ఉద్యమం నుంచి తిరిగి వచ్చి కూలి పనులు చేసుకుంటూ పాప అవసరాలు తీర్చుతూ, తన జీవితాన్ని సాగిస్తున్న కాంత పాత్రను ఈ కథలో చూడొచ్చు.
విప్లవోద్యమం-స్త్రీల తెగువ: ‘కానుక’ కథను మిడ్కో రాశారు. విప్లవోద్యమంలో పనిచేసే సీతక్క రేపటి విప్లవ వారసులుగా ఎదుగుతుందన్న చిన్నారులకు దోపిడీ పీడనలు, ఆ పీడనలు పోవాలంటే చేయాల్సిన పోరాటాల గురించి తెలియజేసే కథ. తాయమ్మ కరుణ రాసిన ‘మహిళలు ధైర్యంగా నిలబడగలరా’ కథలో విప్లవోద్యమంలో డిప్యూటీ కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్న విమల ఫైరింగ్ జరిగే పరిస్థితుల్లో అందులో పనిచేసే దళ సభ్యునికి పాము కాటు వేస్తే ఆ పరిస్థితిని అదిగమించి ఆమె కాపాడే ధైర్యాన్ని తెలియచెప్పిన కథ. విమల డిప్యూటీ కమాండర్. ఓ రోజు ఫైరింగ్ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో కొత్తగా ఉద్యమంలోకి వచ్చిన అనిల్‌కు ఇంకా గెరిల్లా జీవితం అలవాటు పడకపోవడంతో వారిని అలర్ట్ చేస్తుంది. ముందు జాగ్రత్తతో హాస్పిటల్‌కి ఏ దారినుండి తీసుకెళ్లాలో చెప్పి డబ్బులు ఇచ్చి హాస్పిటల్‌కి పంపుతుంది. విమల హాస్పిటల్‌కు వెళ్లడం వల్ల అక్కడ ఆమెను ఫైరింగ్‌లో ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈమె డిప్యూటీ కమాండర్. ధైర్యంగా ఒక ప్రాణాన్ని కాపాడిన విమల పాత్రను ఈ కథలో చూడవచ్చు.
గజ్జెల సరోజ రాసిన ‘సాహస యోధురాలు’ కథలో విప్లవ ఉద్యమంలో జరిగే యుద్ధఘట్టాలకు సంబంధించి పద్మ చేసిన సాహసయుద్ధం గురించి తెలిపే కథ. దళంలో పనిచేసేవారు ఎవరైనా కొత్తగా చేరినవారిని వారి ఇష్టానుసారం మాత్రమే పార్టీలోకి ఆహ్వానించి, దళంలో వారు పనిచేయడానికి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. కుమారి లాంటి వారు ఎంతో కృషి చేసిన వారు దళంలో ఉంటారు. దళంలోని స్త్రీలు ఎంతో కష్టపడుతూ పోరాటం చేస్తారు. అందుకు తగిన పాత్రలు పద్మ, కుమారి. దళంలో ఎప్పటినుంచో పనిచేస్తున్న పద్మ, కొత్తగా చేరడానికి ఆసక్తి కనబరిచిన కుమారిని చాలా రోజులు పరిశీలించి, ఆమె ఇష్టప్రకారమే దళంలో చేర్చుకుని, కీలక బాధ్యతలు అప్పగిస్తుంది.
విప్లవోద్యమం-ఇతర స్త్రీల సహకారం: మీడ్కో ‘ఉక్కు కోట’ కథలో విప్లవోద్యమంలో పనిచేసే స్వామిని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేసే క్రమంలో తప్పించుకొని ఓ ఊరికి వెళ్తాడు. దళంలో ఉన్న అన్నలపై పోలీసులు కాల్పులు జరుపుతుండగా తప్పించుకొని ఓ ఇంటికి చేరిన స్వామిని రక్షించడం తన ప్రాణానికి ప్రమాదమని తెలిసినా ‘ఉక్కుకోట’గా మారి స్వామిని రక్షించిన స్త్రీ రాజవ్వ. విప్లవోద్యమం కోసం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ స్త్రీలు పనిచేస్తారు.
మిడ్కో రాసిన ‘వెనుకబాటు’ కథలో వెంకన్న దళ సభ్యులకు సద్ధి తీసుకొని వెళ్లేవాడు. అతనికి దళంలో పనిచేయడం అంటే చాలా ఇష్టం. తాను ఎందుకు రాలేకపోతున్నాడూ దళంలోని సభ్యులకు వివరించే ప్రయత్నం చేయగా దళ సభ్యుడైన సోమన్న వెంకన్నకు దళంలో చేరడానికి భార్యతో ఎలా ఉండాలో చెబుతూ ఇలా అంటాడు. ఇంట్లో భార్యకు వెంకన్న సహాయపడే విషయమై నలుగురికి వండి పెట్టడం భార్య పని అనడంతో సోమన్న వెంకన్న భుజంపై చెయ్యేసి ‘‘గదంత నీ పని అనికాదే! అట్లంటే అదంతా అక్కదొక్కదానిది కూడ కాదు. ఈ వంట ఎని, ఇంటి పని ఎటుంటవంటే… రోజు చేసిందే చేసుడు కడిగించే కడుగుడు. చాన యాష్ట తెప్పిస్తది. ఆ పనితోటే ఆడోళ్లు నాలుగ్గోడల మధ్య మగ్గిపోతే వాళ్లకు నాలుగు విషయాలు ఎట్లా తెలుస్తయి. అప్పుడు వాళ్ళు మనకంటే ఎప్పుడూ తక్కువగానే
ఉండిపోతారు. అందుకే మన కమ్యూనిజం ఏం చెప్తది ఆడోళ్లను వంటిళ్లనుండి విముక్తి చేస్తేనే వాళ్లు అభివృద్ధి అయ్యేది. వాళ్లు అభివృద్ధి అయితేనే సమాజం అభివృద్ధి అయితది. వాళ్లను వంటింటి నుండి విముక్తి చేయాలంటే వంటపని సామాజికం కావాలె. అప్పటిదాకా మనమే వాళ్లకు వంటపనిల, ఇంటిపనిల సాయం చేయాల్నే. అంతేకాదు నువ్వు ఏ పని చేసినా అంటే పొలం కొన్నా, అప్పు చేసినా, ఇల్లు అమ్మినా, పండుగకు బట్టలు తెచ్చినా ఏ ముచ్చటయినా అక్కకు కూడా చెప్పాలె. గివన్ని చేసినవంటే అప్పుడు అక్క నీకు వేరే ఇండ్లలో మొగోళ్లకు మధ్య తేడాను గుర్తిస్తది. నువ్వట్ల కొట్టుడు, తిట్టుడు బందువెట్టి నీతో సమానంగా ఆమెను గౌరవిస్తే ఆమె నీ మాటను తప్పకుండ వింటదే! అప్పుడే నువ్వు ఇంత మంచిగ ఎందుకున్నవో తెలుసుకుంటుంది. పేపర్ల వచ్చే మన వార్తలు, మన పత్రికలు, కథలు చదివి వినిపియ్యాల్నే. మన పార్టీ గురించి, పోరాటం గురించి, భూస్వాముల దోపిడి గురించి చెప్పాలె. ఇగ అన్నీ నీ కెరికేగద, ఊళ్లె అందరికి చెప్తనే ఉంటివి కదా! అన్నాడు. సోమన్న చిరునవ్వు నవ్వుతూ…’’(అనురాధ, బి. వియ్యుక్క-అజ్ఞాత రచయిత్రుల కథా సంకలనం(సంఫుటి-2). 2023. పుట: 495) అంటూ భార్యను దళంలోకి తీసుకురావడానికి నిజా నిజాలను చెప్పాలని వివరిస్తాడు.
దళంలో అన్నలు పనిచేయడానికి స్త్రీలే కారణమంటూ వారి భర్తలు ఎన్కౌంటర్లో మరణించినా, వారి కాళ్ళ మీద వారు నిలబడే ధైర్యంతో ఉండాలని ఇలా అంటాడు. ‘‘వెంకన్నా! అక్క నీతోటి రాకున్నామాయేగానీ… వుండాల్నా వద్దా? రేవు నీ కోసం పోలీసులు మీ ఇంటి మీద పడి బాధ పెడుతుంటే చిన్నగా దాచే తెలివి, వాళ్లని ఎదుర్కొంటూ పిల్లలను పోషించే ధైర్యం వుండాలెకదా! మరి ఆవన్నీ ఎప్పుడొస్తయి? నువ్వు అన్నలతోటి ఎందుకు తిరుగుతున్నానో, నువ్వు చేసే పని మంచి అనే సంగతి ఆమెకు అర్ధం చేయిస్తేనే ఆమె నీకు సహకరిస్తది. అక్కల సహకారం లేకుంటే మన పోరాటమే గెలవదు. ఊరినిండ పోలీసులున్నప్పుడు కూడా మన దళాన్ని కంటికి రెప్పలా కాపాడేది, పోలీసుల కంటపడకుండా దళానికి తిండి తెచ్చేది అక్కలేనే. ఉత్తర తెలంగాణలయితే… పోలీసులు ఊర్లమీద పడి ఆగమాగం చేస్తుంటే, కారంపొడి రోకండ్ల తోటి అళ్లని ఎదుర్కొనేది అక్కలె, జీవుకద్దంపడి, పోలీస్ స్టేషన్లముందు ధర్నా చేసి సంఘం అన్నలను అక్కలే ఇడిపిస్తున్నారు. అందుకే అక్కలు లేకుంటే మన ఉద్యమం ముందుకు పోదనే మన పార్టీ గూడ గుర్తించింది. వాళ్లను దళంలోకి తీసుకోవడానికి ప్రత్యేక దృష్టిని మొదలుపెట్టింది. కొత్తగా ‘అక్కల దళం’ కూడ పెట్టింది అని ఉత్సాహంగా చెప్పసాగింది చిన్నక్క.
అక్కల దళమానే! అంటే అంతా అక్కలే వుంటరా? ఆత్రుతగా అడుగుతాడు వెంకన్న. అవునే అంతా అక్కలే వుంటారు. అట్లాంటివి ఇంకా ఎన్నో పెట్టాలె. అప్పుడే మనం పోరాటం గెలుస్తాం. అందుకే నువ్వు కూడ వస్త వస్త అనొద్దు, అక్కను కూడా నీతోటి వచ్చేటట్టు తయారు చేయాలె. పెళ్లయిన వాళ్లంతా ఇద్దరూ కలిసి వస్తేనే మంచిదని మన పార్టీ చెపుతున్నది అంటాడు సోమన్న.
మరి పెళ్లి కానోళ్ల సంగతేందే? అపుడే వచ్చిన సంఘ సభ్యుడు రవన్న అందరికి లాల్ సలామ్ చెపుతూ అడిగిండు నవ్వుతూ. పెళ్లి కానోళ్లు కూడ ముందే చూసుకోవాలె…! చూడు మన రాజన్న చూసుకోలేదా మరదల్ని! ముందు తానొచ్చె… వెనుకాల అక్కను రప్పించె! అంటూ సీనన్న రాజన్నను చూపిస్తూ పక్కున నవ్విండు. (అనురాధ, బి. వియ్యుక్క – అజ్ఞాత రచయిత్రుల కథా సంకలనం (సంఫుటి-2). 2023. పుట: 496, 497) అందుకే అక్కలు లేకుంటే మనం ఉద్యమం ముందుకు పోదనే విషయం మన పార్టీ కూడా గుర్తించిందంటూ వివరిస్తాడు. ఈ సంభాషణ విన్న తర్వాత చిన్నక్క అనే దళ సభ్యురాలు తాను దళంలో చేరకపోతే ఎంత నష్టం జరిగేదోనని ఆలోచిస్తుంది.
దళంలో స్త్రీల ప్రోత్సాహం లేకపోతే ఇలాంటి పరిస్థితుల నుండి తమను తాము కాపాడుకోలేని సందర్భాల గురించి తెలియజేపిన కథ. భర్త స్త్రీకి సహాయంగా లేని పక్షంలో భర్తను కూడా ప్రోత్సహించని పరిస్థితులు ఉంటాయని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఎల్లంకి అరుణ రాసిన ‘అమ్మంటే’ కథలో 80 సంవత్సరాలు ఉన్న అన్నపూర్ణమ్మ విప్లవకారురాలు. ఏ అర్ధరాత్రి సమయంలోనైనా దళ సభ్యులకు కడుపునింపే మంచి అమ్మ మనస్తత్త్వం ఆమెది. వారు అనారోగ్య సమస్యలతో ఉంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ సలహా మేరకు ఎంతో ప్రేమగా చూసుకునే స్వభావం ఆమెది. కమ్యూనిస్టు పార్టీతో అన్నపూర్ణమ్మ కుటుంబం సన్నిహిత సంబంధం కలిగినది. అన్నపూర్ణమ్మ ఒకప్పుడు ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఆమెను ఊర్లో వారు ‘అమ్మ’ అని సంభోదిస్తారు. విప్లవ పార్టీ గురించి గెరిల్లా జీవితం ఫైరింగ్ సెంటర్ ప్రజా పోరాటాలు మొదలైన అంశాల గురించి చెప్తే అంత పెద్ద వయసులో కూడా ఎంతో ఆసక్తిగా వింటుంది. విప్లవకారులకు చోటు కల్పించి సహాయం చేస్తే పోలీసుల నుండి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిసినా, ధైర్యంగా సహాయం చేసిందంటే 80 ఏళ్ల అన్నపూర్ణమ్మ మనస్తత్వాన్ని ఎంత పొగిడినా తక్కువే.
తాయమ్మ కరుణ రాసిన ‘తగిన శాస్తి’ కథలో విప్లవ సంఘ నాయకుని భార్య పోషవ్వ. ఆమె ఇంటికి పోలీసులు ఓ రోజు మారు వేషంలో వస్తారు. పోషవ్వ భర్త వివరాలు చెప్పమంటూ పోషవ్వని అడుగుతారు. పోషవ్వకు వచ్చిన వారి మీద అనుమానం వస్తుంది. వారు అన్నం పెట్టమని అడగడంతో పట్టుకొస్తా అని ఊర్లోకి వెళుతుంది. పోషవ్వకు ఊర్లో వాళ్ళు ఇచ్చిన సమాచారంతో వచ్చినవారు పోలీసులని తెలుస్తుంది. వచ్చిన వారిని ఎలా వారంతట వారు తిరిగి వెళ్లేలా చేయాలి అనే ఉపాయాన్ని ఆలోచిస్తుంది. దుర్వాసన వెలువడే అన్నాన్ని పోలీసులకు పెడుతుంది. సాధారణంగా అలాంటి అన్నాన్ని కూడా అన్నలు ఎలాంటి వంకలు పెట్టకుండా తినే సందర్భాలు ఆమెకు తెలుసు. కానీ పోలీసుల్లో ఒకరు నోట్లో పెట్టుకోగానే కక్కుకుంటాడు. అందులో మరొకరు వెంటనే బూతు పదజాలంతో మాకు పాసిపోయిన అన్నం పెడతావే అని తిట్టుకుంటూ లేస్తాడు. అబద్ధం చెప్పిన పోలీసులతో వారు ప్రవర్తించే తీరును వారితోనే తెలియజెప్పి అక్కడినుండి వెళ్లిపోయేలా చేస్తుంది పోషవ్వ. విప్లవోద్యమానికి సహకరించే స్త్రీలు ఎంత చాకచక్యంగా ఉండి దళ సభ్యులను రక్షిస్తారో ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.
తాయమ్మ కరుణ రాసిన ‘నీళ్లు-చేపలు’ కథలో భగత్ ఒక ఏరియా ఎల్ జి ఎస్ కమాండర్. జనంతో మాట్లాడుతూ కూడా అలర్ట్‌గా ఉండాలని, అన్ని గమనించాలనే విషయాన్ని అలవాటుగా మర్చిపోతుంటాడు భగత్. అక్కడికి పోలీసులు వచ్చారనే సమాచారం తెలియడంతో అక్కడికి వచ్చిన ఇద్దరు మహిళలు రాకేశ్, భగత్‌లను వారి వారి ఇళ్లకు తీసుకొని వెళ్తారు. ఒక పెద్దావిడ ఇంట్లో రాకేష్, లక్ష్మీబాయి ఇంట్లో భగత్ ఉంటారు. ఇంట్లోకి చేరిన పోలీసుల్లో ఒకరు రాకేష్ ఎవరని ప్రశ్నించగా నా కొడుకు జ్వరం వచ్చి మంచం మీద మూలుగుతున్నాడని చెప్పడంతో పోలీసు నమ్ముతాడు. లక్ష్మీబాయి ఇంట్లోకి వెళ్లి పోలీసులు ప్రశ్నించగా నా భర్త అని సమాధానం చెబుతుంది. ఆ విషయాన్ని నమ్మని ఎస్ఐ వయసులో వ్యత్యాసం ఎక్కువగా కనిపించడంతో ఇద్దరినీ ప్రశ్నించగా వారి నుండి సమాధానాలు ఒకే విధంగా రావు. మా వివాహం అయ్యి రెండు సంవత్సరాలు అవుతుందని భగత్ చెప్పగా, లక్ష్మీబాయి ఆరు నెలలు అని చెప్తుంది. అబద్ధం చెప్తున్నారనే చెంపల మీద కొట్టగా పోలీసులు కాళ్లు పట్టుకొని నా భర్త భగత్‌ను వదిలిపెట్టమని వేడుకుంటుంది. అబద్ధం చెప్పిన మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని పోలీసులు చెప్పగా, మేం చెప్పేది నిజమని నిజంగా పెళ్లి చేసుకుని ఆరు నెలలు అయిందని, కానీ రెండు సంవత్సరాల నుండి కలిసుంటున్నామని చెప్తుంది లక్ష్మీబాయి. ఆయన మొదటి పెళ్ళానికి ఇద్దరు పిల్లలు. నాకు పిల్లలు లేరు. ఈ విషయం ఊర్లో తెలిస్తే మమ్మల్ని బ్రతకనీయరు. ఆయన పెళ్ళాం వచ్చి తీసుకెళ్తుంది సారూ అంటూ పోలీసుల ముందు గట్టిగా ఏడవడంతో నమ్మిన పోలీసులు మొదటి పెళ్ళాం నల్లగా ఉండేదని పెళ్ళాన్ని వదిలి ఉంటావారా అని గట్టిగా మందలించి ఈసారి నేను వచ్చే సమయానికి నీ పెళ్ళాం దగ్గరికి వెళ్లి పోవాలని చెప్పి అక్కడి నుండి పోలీసులు వెళ్లిపోతారు. లక్ష్మీబాయి అన్నల కష్టాలను ఆలోచించి పోలీసుల చేతుల్లో ఎన్కౌంటర్ అయితే ఎలా అని ఆలోచించి, వారిని కాపాడడం కోసం అబద్ధం చెప్తుంది. సాధారణంగా ఓ స్త్రీ ఇంకొకరిని భర్తగా చెప్పుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది ఆమె ధైర్యం తెగువ చూపించి భగత్ ప్రాణాలు కాపాడిన ధైర్యశాలిగా లక్ష్మీబాయి కనిపిస్తుంది.
విప్లవోద్యమం-స్త్రీల నిజాయితి: ఎల్లంకి అరుణ ‘దిద్దుబాటు’ కథలో ఎవరైనా తప్పులు చేస్తే, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పడానికి వెనకాడతారు. అలాంటిది చేయని తప్పుకు దళ సభ్యుల చేతిలో లచ్చిరెడ్డి, రాజక్కలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. వీరు ఊరు ఆదాయ వనరులపై అవినీతి చేశారని ఎక్కువమంది ప్రజల పుకార్ల వల్ల దళ సభ్యులు నమ్ముతారు. అది నిజమేనా? కాదా? అని ఆలోచించకుండా వారిని చేయని తప్పులకు దళ సభ్యులు శిక్షిస్తారు. తదనంతరం విషయం తెలుసుకున్న తర్వాత ఇలాంటి తప్పులు మళ్ళీ తలెత్తకుండా ‘దిద్దుబాటు’ ఉద్యమంలో భాగంగా తీర్మానాలు రాసి వారందరి ముందు భారతి క్షమాపణ చెప్పడాన్ని బట్టి నిష్పక్షపాతంగా వ్యవహరించే భారతి స్వభావం ప్రజల పట్ల నమ్మకంగా కనిపిస్తుంది.
ముగింపు: విప్లవోద్యమంలో స్త్రీలు చాలా తక్కువ మందే చేరతారు. అందులో వారు మగవారి కంటే భిన్నమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అడవుల్లో సాహసంగా పనిచేయడం, మాతృత్వాన్ని త్యాగం చేయడం, పిల్లలకు దూరంగా ఉండటం వంటివన్ని నిత్య వేదనలుగానే ఉంటాయి. విప్లవోద్యమానికి సామాన్య స్త్రీలు సైతం ప్రజాక్షేత్రంలో ఉంటూనే భయం, బెరుకు లేకుండా విప్లవకారులకు సహకరించే విధానం కూడా పైన పేర్కొన్న కథల్లో చూడవచ్చు. పెన్ను, గన్ను పట్టిన మహిళా మణులను కథల్లో చూడవచ్చు. అజ్ఞాతవాతంలోంచి వచ్చిన తర్వాత తమ అనుభవాలను పంచుకున్న వారు కొందరైతే, అజ్ఞాతంలో ఉంటూనే మారు పేర్లతో కథలు రాసిన వారూ ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ఒక ప్రముఖమైన భాగంగా విప్లవ కథను చూడవచ్చు.
(పరిశోధకురాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం)