ఉర్దూ కథా సాహిత్యంలో దళితుల సమస్యలు – డా॥ ఎ. షబ్బీర్‌ బాషా

‘దళిత్‌’ అను పదము సంస్కృత భాషలోని ‘దళ్‌ధాతు’ అను పదము నుండి ఉద్భవించినది. దీని యొక్క అర్థం విరిచి భాగాలుగా చేయడం. హిందీ`ఆంగ్ల నిఘంటువులో ‘దళిత్‌’ అను పదానికి అర్థం depressed మరియు downtrodden అని వుంది.

ఆర్యుల కాలంలో సమాజం నాలుగు భాగాలుగా విభజించబడినది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ విభజన మను యొక్క పుస్తకం మన్వాస్మృతి ఆధారంగా జరిగింది. దీనిని అనుసరించి బ్రహ్మ తన యొక్క ముఖం నుండి బ్రాహ్మణులను, తన భుజాల నుండి క్షత్రియులను తన ఉదరం నుండి వైశ్యులను మరియు తన పాదాల నుండి శూద్రులను ఉద్బవించారు. ఈ విధంగా శూద్రులు సమాజంలో అందరి కంటే నిమ్న జాతిగా పరిగణించబడ్దారు.వారు అందరికి సేవలు చేసే వారుగా పేరుపొందారు. వారు సమాజంలో అస్పృశ్యులుగా భావింపబడ్డారు. వారు తాకినది ఎవ్వరూ తినడానికి వీలులేదు. వారిని ఊరులోని బావి నుండి నీరు తీసుకొనివ్వలేదు. వారిని ఊరి చివరలో నివసించడానికి ఆజ్ఞాపించడం జరిగింది. అగ్ర వర్ణాల వారు తినడానికి ఏమైతే ఇస్తారో దానిని తిని తమయొక్క జీవనం సాగించేవారు. వారి స్త్రీలు అర్థనగ్నంతో ఉండేవారు. వారికి విద్యను అభ్యసించే అనుమతి లేకుండెను. ఒకవేళ ఎవరైనా తప్పుగా శ్లోకాలను వింటే వారి చెవిలో సీసం కరిగించి పోసేవారు. ఇలాంటి ఎన్నో రకాల అరాచకాలకు వారిని గురిచేసేవారు. బౌద్దమతం ఉద్బవించిన తరువాత బుద్దుడు ఇలాంటి వారికి ‘‘మీ వెలుగు మీరే అవ్వండి’’ అని నినదించారు. వారు వీరికి సరైన మార్గాన్ని నిర్ధేశించారు. మరియు హిందూ మతంలోని దురాచారాలను గురించి వీరికి క్షుణ్ణంగా తెలిపారు. బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొందడానికి వీరిని ఏకం చేశారు. ఈ కారణంగా శూద్రులు బౌద్ధమతం వైపు ఆకర్షితులయ్యారు.
భారతదేశంలో ముహమ్మదీయుల రాకతో ఒక నూతన శకం ఆవిర్భవించినది. వారు సమాజంలోని కుల, మత భేదాలను రూపుమాపారు. దీని యొక్క ప్రభావం శూద్రులపై పడినది. కాకపోతే మహమ్మదీయ రాజులు వీరి గురించి ఎలాంటి సంస్కరణలు చేయలేదు. ఎందుకనగా వారు ఈ యొక్క సమస్యను హిందువుల అంతర్గత సమస్యగా భావించారు. మహాత్మగాంధీజీ శూద్రులు అను పదాన్ని తొలగించి హరిజనులు అన్నారు. తర్వాత హరిజనుల నుండి దళితులు అనే పదం వినియోగించబడినది.
డాక్టర్‌ అయాజ్‌ అహ్మద్‌ ఖురైషీ దళితులను ఈ విధంగా నిర్వచించారు. ‘‘సమాజంలో అందరి కంటే బలహీనుడు, కష్టజీవి సానుభూతికి నోచుకోని, వేరు చేయబడ్డ, ఏమి పొందని అణచివేయబడ్డ, సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత, సాంప్రదాయ మరియు ఇతర మానవీయ విలువలకు దూరమైన తెగ, సామాజిక న్యాయం లభించని తెగ దళితుల తెగ క్రిందకు వస్తుంది’’`1 ప్రఖ్యాత ఆధునిక దళిత సాహిత్యవేత్త తులసీరాం దళిత సాహత్యమును ఇట్లు నిర్వచించిరి.
‘‘నేటి చరిత్రలో డాక్టర్‌ అంబేద్కర్‌ యొక్క సార్వభౌమత్వమే దళిత సాహిత్యం యొక్క ప్రధాన అంశము’’ ` 2 షర్వన్‌ కుమార్‌ లంబా ఇట్లు నిర్వచించిరి.
‘‘దళిత సాహిత్యం యొక్క ప్రధాన అంశం మనిషి, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ యొక్క తత్వం ద్వారా దళితులకు తమ బానిసత్వం గురించి తెలిసింది. వారి యొక్క బాధలకు భాష దొరికింది. ఎందుకనగా ఈ యొక్క సమాజానికి బాబా సాహెబ్‌ రూపంలో ఒక గొప్ప నాయకుడు దొరికాడు. దళిత సాహిత్యం దళితుల యొక్క ఈ బాధల గురించే ఉద్భవించినది. దళిత సాహిత్యం యొక్క బాధ ‘నా’ బాధ కాదు. సమస్త దళిత సమాజం యొక్క బాధ’’ ` 3.
ఉర్దూ సాహిత్యంలో దళిత సాహిత్యం యొక్క భావన హిందీ మరియు ఇతర భాషలలోలాగ లేదు. దీనికి కారణం ఇస్లాంలో భేదభావాలు, కుల మత తారతమ్యాలు, అంటరానితనం అనే భావనలకు చోటులేదు. సాహిత్యం అనేది సమాజ దర్పణం. ఉర్దూ రచయితల యొక్క సంబంధాలు భారతదేశ సమాజంతో కూడి వున్నాయి. మరొక కారణం ఏమనగా ఆరంభదశలో ఎందరో ముస్లిమేతర రచయితలు ఉర్దూలో కథలను రాసేవారు. ఇలాంటి రచయితలలో ప్రేమ్‌చంద్‌, క్రిష్ణ్‌ చందర్‌, రాజేంద్ర సింగ్‌ బేది మొదలైనవారు ప్రముఖులు.
ఉర్దూ సాహిత్యంలో దళిత సమస్యలను ప్రస్తావించని మొదటి రచయిత ప్రేమ్‌చంద్‌. ఇతను దాదాపు 12 కథలలో దళిత సమస్యలను పేర్కొన్నారు. వాటిలో కఫన్‌, నజాత్‌, పూస్‌కి రాత్‌, దూద్‌కి కీమత్‌, ఠాకూర్‌ కా కువాన్‌, ఘాస్‌వాలీ, మరియు గిల్లీ దందా మొదలైనవి పేర్కొనదగినవి. ప్రేమ్‌చంద్‌ తన కథలలో దళితుల పట్ల జరిగే దౌర్జన్యాలతో పాటు జమీందారీ వ్యవస్థ ద్వారా దళితుల మీద జరిగే దహనకాండలను కూడా తెలిపారు. అంబేద్కర్‌ ఎప్పుడైతే జాతి యొక్క అన్యాయాలను భరిస్తున్నారో అదే సమయంలో ప్రేమ్‌చంద్‌ దళితుల యొక్క బాధలు, కష్టనష్టాలను తన కథల ద్వారా వివరించారు.
ప్రేమ్‌చంద్‌ తన కథా సాహిత్యంలో పేర్కొన్న దళిత సమస్యల యొక్క సంబంధం మత సాంప్రదాయాల కంటే సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులతో ముడిపడి వుంది. వారి కథలతో దళితుల యొక్క సమస్యలు మరియు వాటి యొక్క పరిష్కారాలు రెండూ లభిస్తాయి. డాక్టర్‌ జూహీబేగం ఇలా వ్రాస్తున్నారు.
‘‘అంటరాని వారి యొక్క సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను గురించి తెలుపుతూ వారి వర్ణ లేదా ధర్మ వ్యవస్థలో మార్పు గురించి కాదు దాని యొక్క అంతం గురించి మాట్లాడుతారు. దళితుల యొక్క పరిష్కారానికై వారి యొక్క తోడ్పాటుకుగాను నడుం బిగించారు. దేశ గ్రామీణ సమాజంలో కుల, వర్ణ వ్యవస్థను తెలిపే సమయంలో దళిత సమాజం యొక్క దయనీయ పరిస్థితులను వివరిస్తూ ప్రేమ్‌చంద్‌ తన తరపు నుండి ఏమీ మాట్లాడరు, కాని అతని కథలలోని విభిన్న పాత్రలు తనకు సమాజంలో ఎదురవుతున్న ఏ తెగ మీద జాలి, దయ వుందో సాక్య్షం చెబుతాయి. దూద్‌కీ కీమత్‌, తాలీఫ్‌, నేక్‌ బఖ్తీ కే తాజ్‌యానె, ఘాస్‌వాలీ, లాల్‌ ఫీత, మందిర్‌ మరియు కఫన్‌ మొదలైన కథలు వీటికి ప్రత్యక్ష ఉదాహరణలు’’ ` 4.
ప్రేమ్‌చంద్‌ తర్వాత దళిత సమస్యల గురించి రాసిన రచయిత క్రిష్ణ్‌చందర్‌. అతను రాసిన కాలుభంగీ మరియు మహాలక్ష్మీ కా పుల్‌ అనే రెండు కథలలో దళితుల సమస్యల గురించి వివరించడినది. క్రిష్ణ్‌చందర్‌ తన కథలలో సమాజంలో దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలను మరియు అసమానతలను గురించి క్షుణ్ణంగా వివరించారు. కాలు భంగీ అనే కథలోని దళిత సమస్యలను తెలుపుతూ డాక్టర్‌ నుజ్‌హత్‌ పర్వీన్‌ ఇలా వ్రాస్తున్నారు.
‘‘కాలు భంగీ యొక్క పాత్ర ఎందువలన ప్రధానమైనది అనగా అతను ఎల్లప్పుడూ రచయిత ముందు నిలబడి ఉంటాడు మరియు అతని కథను రాయమని ప్రాధేయపడుతూ వుంటాడు. రచయిత బాల్యం నుండి యవ్వనం వరకూ కాలుభంగీని చూస్తూ వుండేవారు. అతని విదివిధానాలు, అలవాట్లు అన్నింటిపైన తన దృష్టి ఉండేది. అందువలన కాలు భంగీ యొక్క సమస్త కథను వారు ఈ కథలో వినిపించారు. కాలు భంగీ ఒక ఆస్పత్రిలో రొగుల బట్టలు ఉతికేవాడు ఆస్పత్రి అంతా ఊడ్చి శుభ్రపరిచేవాడు. కాకపోతే అతని సహాయాన్ని, సేవను ఎవ్వరూ గుర్తించేవారు కాదు. ఎందుకనగా అతడు దళిత కులానికి చెందినవాడు మరియు సమాజంలో
ఇలాంటి వారికి ఎలాంటి విలువ ఉండదు’’ ` 5.
సాదత్‌ హసన్‌ మంటో సమాజంలోని యధార్థ సంఘటనలను రాసే ప్రముఖ రచయిత. అతను రాసిన కథలలో భంగిన్‌ మరియు షుగల్‌ అనేవి దళితులకు సంబధించినవి. తను రాసిన కథ భంగిన్‌లో మన్‌టో దళిత సమస్యలను చాలా ప్రభావవంతంగా తెలిపారు. ఈ కథలలో దళిత స్త్రీ దగ్గర వచ్చే వాసనను ఆజాతి యొక్క వాసనగా చిత్రీకరించి చెప్పబడినది. ఈ కథలో సమాజంలో వ్యాపించిన అంటరానితనం గురించి తెలుపబడినది. మంటో రాసిన మరో కథ షుగల్‌లో ఒక దళిత బాలిక యొక్క వృత్తాంతాన్ని వివరించబడినది. ధనవంతులు తమ భోగ విలాసాల కొరకు పేద దళిత బాలికలసు దౌర్జన్యంగా తమ వెంట తీసుకొని వెళ్ళేవారు. దానిని చూసి కూడా ఎవ్వరూ ఏమి అనడానికి సాహసించేవారు కాదు. ఇది దళిత సమాజం యొక్క బాధాకర విషయం, దళితులు తమకు జరిగే అన్యాయం పట్ల ఎదురించలేరు. ఈ కథలో ప్రస్తుత సమాజ దుర్భర వ్యవస్థ యొక్క స్థితిగతులను గురించి వివరించబడినది. ధనవంతులు పేదవారిని తమ యొక్క అవసరాలకు వాడుకొంటున్నారు. దీని గురించి కూడా ఈ కథలో ప్రస్తావించబడినది.
రచయిత్రి ఇస్మత్‌ చుగ్‌తాయి తన కథలలో ధనిక సమాజంపై వ్యంగ్యోక్తులు విసిరారు. తను రాసిన కథ ‘‘దో హాథ్‌’’లో ఇదే అంశంపై ప్రస్తావించడం జరిగింది. ఇందులో దళిత దంపతుల యొక్క కథను వివరించారు. ఇస్మత్‌ చుగ్‌తాయి ఈ కథలో ధనిక సమాజం యొక్క లోటుపాట్లను గురించి చాలా ధైర్యంగా చాకచక్యంగా వర్ణించారు. రచయిత్రి దళిత సమస్యలను ముందుంచి ధనిక సమాజం గురించి మరియు అక్కడ ముసుగులో జరిగే నాటకాల గురించి విపులంగా కుండబద్ధలు కొట్టినట్లు అభివర్ణించారు.
ఖాజా అహ్మద్‌ అబ్బాస్‌ ఉర్దూ కథా సాహిత్యంలో ఒక ప్రముఖ రచయిత. అతని కథలు ‘‘తీన్‌ భంగీ’’ మరియు టేరిలైన్‌కి పత్‌లూన్‌ దళిత సమస్యలను ప్రస్తావిస్తూ వ్రాయబడినవి. తన కథ ‘‘తీన్‌ భంగీ’’లో ఒక అగ్ర జాతికి చెందిన వ్యక్తి డబ్బు మీద వ్యామోహంతో దళితులు శుభ్రపరిచే పనిని చేయడానికి సిద్దపడతాడు. కాని ఆ పనిని చేయడం తనకు అవమానంగా భావిస్తాడు. అక్కడే కాలి చరణ్‌ అనే పేరుగల దళితుడు అగ్రజాతి వానిగా మారి శుభ్రపరిచే పని చేయడానికి సిద్దమయ్యాడు. ఎందుకనగా ఎక్కువ డబ్బులు లభించడం వలన ముఠామేస్త్రి వారిని గుర్తిస్తారు. ఈ కథ ద్వారా ఖాజా అహ్మద్‌ అబ్బాస్‌ అగ్రవర్ణాల వారు తమ యొక్క గౌరవాన్ని కాపాడుకోవడానికి దళితులు చేసే శుభ్రపరిచే పనిని చేయడానికి కూడా సిద్ధపడతారు అని నిరూపించడానికి శాయశక్తుల కృషి చేశారు.
అహ్మద్‌ నదీం ఖాస్మీ తన కథ ‘‘మూచీ’’లో చెప్పులు కుట్టే ఒక దళితుని వ్యథను వివరించారు. ఆ దళితుడు అదే వృత్తిలో ఉన్నప్పటికీ డబ్బులేని కారణంగా తన పెళ్ళిలో వేసుకోవడానికి చెప్పులను పొందలేడు. అతని వియ్యంకులు పెళ్ళిలో ధరించుటకు కావలసిన వస్త్రాలు మరియు చెప్పులను సమకూర్చుకొని రమ్మని ఆజ్ఞాపించారు. మూచీ అనే దళిత యువకుడు జమీందార్‌ కొరకు అందమైన చెప్పులు తయారు చేస్తాడు మరియు తన పెళ్ళిలో వాటిని ధరించడానికి జమీందార్‌ గారిని అనుమతి అడుగుతాడు. అప్పుడు జమీందార్‌ గారు ఇలా అంటారు.
‘‘నా చెప్పులు నా పాదాల కొరకు, నీచుల తల కొరకా? అతను వెళ్ళి మంచం మీద కూర్చున్నారు…
‘‘ఈ చెప్పులతో వాడి చర్మం ఒలిచి తీయాలనిపిస్తూ వుంది.’’ తర్వాత అతను దళితుని వైపు తిరిగి గుడ్లు ఉరిమి ఇలా గర్జించాడు. ‘‘ఇక్కడికి చావు’’ దళిత యువకుడు నెమ్మదిగా నడుస్తూ మంచంవైపు వచ్చాడు. ‘‘తిరిగి ఇలాంటి సాహసం చేస్తే తోలు తీస్తాను’’ రాజు కోపంతో అన్నాడు. కొంత సమయం తర్వాత దళిత యువకుడు ఇలా అన్నాడు. ‘‘తప్పు జరిగిపోయింది యజమాని గారు’’ చాలు వెళ్ళు ఇక్కడ నుండి’’ రాజు అన్నాడు ` 6.
ఇటువంటి అనేక రకాల సమస్యలను రచయితలు తమ యొక్క కథలలో పేర్కొన్నారు.
పైన పేర్కొనబడిన కథలే కాకుండా అలీ అబ్బాస్‌ హుస్సేనీ యొక్క కథ ‘హమారాగావ్‌’ హయాతుల్లా అన్సారి యొక్క కథ ‘ఢాయీ సేర్‌ ఆటా’ సెహల్‌ అజీం ఆబాదీ యొక్క కథ ‘అలావు షకీల అఖ్తర్‌ యొక్క కథ ‘డాయిన్‌’, మరియు జీలాని బాను యొక్క కథ ‘కంపెనీ’ గియాస్‌ అహ్మద్‌ గదీ యొక్క కథ ‘బాబా లోగ్‌, కలాం హైదరీ యొక్క కథ ‘నా మర్ద్‌’ ఇక్బాల్‌ మజీద్‌ యొక్క కథ ‘ఆగ్‌ కె పాస్‌ బైఠీ ఔరత్‌’, వాజీదా తబస్సుమ్‌ యొక్క కథ ‘జూఠన్‌’, షౌకత్‌ హయాత్‌ యొక్క కథ ‘మాధవ్‌’ మరియు సలాం బిన్‌ రజ్జాక్‌ యొక్క కథ ‘ఎక్‌లో ఎ కా అంగోఠా’ మొదలైనవి ప్రముఖంగా ప్రస్తావించదగినవి.
ఈ విధంగా ఉర్ధూ కథా సాహిత్యంలో దళితుల యొక్క సమస్యలను మరియు కష్టాలను రచయితలు విపులంగా విశదీకరించారు. దళితుల పట్ల జరిగే దౌర్జన్యాలు, అవమానాలు, అరాచకాలు మరియు వారి యొక్క పేదరికం గురించి కూడా ఉర్ధూ రచయితలు చాలా నిశితంగా వివరించారు. బ్రాహ్మణ సమాజం ధార్మిక గ్రంథాలను ఆసరాగా తీసుకొని కొన్ని వేల సంవత్సరాల వరకు దళితులపై దౌర్జన్యాలు మరియు అమానవీయ చర్యలకు పాల్పడుతూ వుండేది. సమాజంలో దళితులను తమ హక్కులకు దూరం చేసారు. దీని వల్ల వారిలో ఆలోచనా శక్తులు లేకుండా పోయాయి. మరియు సమాజంలోని సమస్త దయనీయ కర్మలు వారిపై మోపబడ్డాయి. సమాజంలో అగ్రకులాల వారికి అంటరానితనం తగదు. ఒకవేళ వారిని ఎవరైనా దళితులు తాకితే ధార్మిక క్రియల ద్వారా వారిని శుభ్రపరిచేవారు. సమాజంలో అగ్రకులాల వారు తమయొక్క శక్తులను అడ్డుపెట్టుకొని దళిత స్త్రీలను మరియు బాలికలను లొంగదీసుకొనేవారు. పెళ్ళి గురించి ప్రస్తావన వస్తే అక్కడ కుల, మత బేధాలను చూసేవారు. దేవాలయాలను, చెరువులను, బావులను, పాఠశాలలను దళితులు కష్టపడి తమ చేతులలో తమ యొక్క ప్రావీణ్యాన్ని ఉపయోగించి నిర్మించేవారు. కాకపోతే ఈ నిర్మాణాలన్నీ భవనాలుగా తయారైన తరువాత వారికి ప్రవేశం ఉండేదికాదు. ఎందుకనగా వారు అందులోనికి ప్రవేశిస్తే అవి అపవిత్రమవుతాయి అనే భావన ఉండేది. ఇది ఎలాంటి మతం మరియు ఎలాంటి సమాజ ఆచారం? ఇది కొన్ని శకాల నుండి సమాజంలో నడుస్తూ వుంది. గౌతమ బుద్దుడు నుండి మహాత్మగాంధీ వరకు సమాజంలో దీనిని ఖండిరచారు. కాని ఎవ్వరూ కూడా దీనిని పూర్తిగా రూపుమాపలేకపోయారు. డాక్టర్‌ అంబేద్కర్‌ వలన సమాజంలో నెమ్మదిగా మార్పు వస్తూ వుంది. నేడు దళితులు వారి యొక్క హక్కులను పొందుట కొరకు దళిత ఉద్యమాల ద్వారా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మారుతున్నటువంటి సమాజ పరిస్థితులను ముందుంచి గొప్ప తత్వవేత్తలు, కథానాయకులు, రచయితలు, కవులు మరియు సాంఘిక, మత, సంఘ సంస్కర్తల యొక్క బాధ్యత ఏమనగా వారు దళితుల సమస్యలను గురించి చర్చించి వారి హక్కులను పొందే విధంగా కృషి చేయాలి. ఈవిధంగా చేయడం వలన భారతదేశ సమాజంలో నాటుకుపోయిన కుల, వర్ణ, అగ్ర నిమ్న యొక్క భేదభావాలను అంతం చేయడానికి వీలవుతుంది మరియు దళిత వర్గం వారు సమాజంలో తమ యొక్క హక్కులను, స్వాతంత్య్రాన్ని పొంది ప్రశాంతంగా సుఖసంతోషాల తోటి తమ జీవితాలను మెరుగుపరుచుకోగలరు.
ఉపయుక్త గ్రంథాలు :
1. ఉర్థూ కథలలో దళిత సమస్యలు : డా॥ నుజ్‌హత్‌ పర్వీన్‌. పేజి నెం.23
2. ఉర్థూ కథలలో దళిత సమస్యలు : డా॥ నుజ్‌హత్‌ పర్వీన్‌. పేజి నెం.26
3. ఉర్థూ కథలలో దళిత సమస్యలు : డా॥ నుజ్‌హత్‌ పర్వీన్‌. పేజి నెం.26
4. ప్రేమ్‌చంద్‌ కథలలో నిమ్న వర్గాలవారి సమస్యలు : డా॥ జూహీ బేగం. పేజి నెం.27
5. ఉర్థూ కథలలో దళిత సమస్యలు : డా॥ నుజ్‌హత్‌ పర్వీన్‌. పేజి నెం.48
6. కథ ‘మూచీ’ : పేజి నెం.259 (అతిధి బోధకులు, ఉర్ధూ విభాగం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.