అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార

1974లో నా బీఎస్సీ పూర్తయింది. ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ చదవడానికి దరఖాస్తు చేశాను. నిజానికి నాకు చాలా పొందికగా, అడుగడుగునా సవాళ్లు విసురుతుండే గణితం అంటే చాలా ఇష్టం. కానీ నేను విద్యార్థి, మహిళా ఉద్యమాల్లో పూర్తిగా తలమునకలై పోవటంతో ఆ కోర్స్‌వర్క్‌ కోసం ఎక్కువ సమయం వెచ్చించలేనని అర్థమైంది.

దీంతో స్టాటిస్టిక్స్‌ వైపు మళ్లాను. అదే ఏడాది ఏప్రిల్‌ నెలలో ఓ రోజు నాన్న నన్ను పిలిచి ‘నేను మద్రాస్‌కు ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకోవాలనుకుంటున్నాను. మాతో పాటు నువ్వూ మద్రాస్‌ వచ్చేస్తావు కదా’ అని అడిగాడు. వెంటనే నేను ‘వస్తాను నాన్నా’ అనేశాను. కానీ నిజానికి నేను హైదరాబాద్‌ వదిలేది లేదని నాకు స్పష్టంగా తెలుసు. అయినా ఆ రోజు నాన్నకి అలా అబద్ధం చెప్పినందుకు నాకిప్పటికీ సిగ్గుగానే అనిపిస్తుంటుంది. హైదరాబాద్‌లో స్వతంత్రంగా ఉండగలను, అదే నాకు ఇష్టం కూడా. కానీ ఆ మాట నాన్నకు చెప్పటానికి ఆ క్షణంలో నాకు ధైర్యం చాల్లేదు. మనసులో మాత్రం మా కుటుంబం హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోతే నాకింక ఇంటి సమస్యలుండవని సంబరపడ్డాను. నాన్న మద్రాస్‌కు ట్రాన్స్‌ఫర్‌ అడగటం, ఆర్డర్స్‌ రావడం వెంటవెంటనే జరిగిపోయాయి. నేను అప్పుడు పేల్చాను బాంబు: ‘‘మీతో మద్రాస్‌కు రాను. హైదరాబాద్‌లోనే వుంటా’’ అనేశాను.అది ఎంత పెద్ద గొడవలకు దారి తీసిందంటే.. ఆ ప్రకంపనలు మొత్తం క్యాంపస్‌ను, మా లెక్చరర్లను, ఫ్రెండ్స్‌ని, చివరికి వాళ్ల తల్లిదండ్రులను కూడా తాకాయి. ఆ వేసవిలో బీఎస్సీ పరీక్షలు అవుతూనే నేను ఇంట్లోంచి బయటకొచ్చేసి.. నా పాత క్లాస్‌మేట్‌, మా పార్టీ సహచరుడు బూర్గుల ప్రదీప్‌ వాళ్ల ఇంట్లో ఆశ్రయం పొందాను. వాళ్లది చాలా మంచి కుటుంబం, వాళ్లు నన్నెంతో ఆదరంగా చూసుకున్నారు. ప్రదీప్‌, వాళ్ల అమ్మగారు, ఐదుగురు సోదరులు, వాళ్ల భార్యా పిల్లలు, ప్రదీప్‌ సోదరి రమ, ఆమె కుటుంబం.. అంతా కలసి ఒకే ఇంట్లో ఉండేవారు. భయం, కోపం, తీవ్రమైన ఆందోళన, అనిశ్చితిల మధ్య ఏమీ పాలుపోని స్థితిలో ఉన్న నాకు వాళ్లంతా అండగా నిలబడ్డారు. ప్రదీప్‌ వాళ్ల వదిన డా.మంగుత నర్సింగ్‌రావు అయితే నన్ను ప్రతి రోజూ క్యాంపస్‌కు కారులో తీసుకెళ్లి, తీసుకొచ్చేవారు. ఓ పక్క పరీక్షలు జరుగుతుండగా నాన్న ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ దగ్గర నిలబడి గట్టిగా అరుస్తున్నా కూడా ఆమె లెక్కచేసేది కాదు. నాన్న వెళ్లి మా లెక్చరర్లనీ, స్నేహితుల తల్లిందండ్రులనీ.. ఇలా చాలామందిని కలిసి ఎలాగైనా జోక్యం చేసుకుని, నేను ఇంటికి తిరిగొచ్చేలా చేయాలని కోరటం మొదలుపెట్టాడు. సుమీత్‌ సిద్దు తండ్రి అయితే కాస్త చొరవ తీసుకుని నాన్నతో ‘‘చూడండి రామస్వామీ.. ఆమెను వదిలెయ్యండి, తనే ఇంటికి తిరిగొస్తుంది. వదలకుండా గట్టిగా పట్టుకున్నారో ఎక్కడికైనా పారిపోవచ్చు’’ అని చెప్పాడు. ఆ కఠిన పరీక్షా సమయంలో ప్రదీప్‌ కుటుంబం నాకు వాళ్లింట్లో చోటు మాత్రమే కాదు, నన్ను గురించి నేను ఆలోచించుకోటానికి అవసరమైన వెసులుబాటు కూడా కల్పించింది. అంతటి బేషరతు మద్దతుకు నేను అర్హురాలినో కాదో తెలీదుగానీ.. వాళ్లే గనక అండగా నిలబడకపోయి ఉంటే ఆ రోజు నేనేం చేసేదాన్నో నాకే తెలీదు.
నా జీవితాన్ని కీలక మలుపు తిప్పిన రెండో సంఘటన ఇది. ఇక నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నాకు స్కాలర్‌షిప్‌ వుంది. దాని సాయంతో హైదరాబాద్‌లో వుంటూ పెద్ద ఇబ్బంది లేకుండానే పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తిచెయ్యచ్చు. చివరికి నా విషయంలో ఇంక చెయ్యగలిగిందేం లేదని గ్రహించి.. అమ్మానాన్నా ఓ రాజీ మార్గం ప్రతిపాదించారు.. నేను పరాయి ఇళ్లలో వుండకుండా మారేడుపల్లిలోని మా పెద్దక్కయ్యా వాళ్లింట్లో వుండి చదువుకోవాలన్నారు. సర్లెమ్మని 1974 వేసవిలో అమ్మా వాళ్లు అటు మద్రాస్‌కు వెళ్లగానే నేను పెద్దక్కయ్యా వాళ్లింటికి మారాను. ఇక్కడ మరీ ఎక్కువ ఆంక్షలు ఉండేవి కాదు. అమ్మానాన్న లాగా వీళ్లు నన్ను అంతలా గుచ్చిగుచ్చి ప్రశ్నించగలిగే వాళ్లు కూడా కాదు. దీంతో నేను వాళ్లింట్లో ఉంటూ కూడా నా పార్టీ కార్యక్రమాలను నిరాటంకంగానే కొనసాగించాను. బీఎస్సీ పూర్తవగానే ఓయూలోనే ఎమ్మెస్సీ(స్టాటిస్టిక్స్‌)లో చేరిపోయాను. అప్పటికే నాకు తల్లిదండ్రుల అండ, నియంత్రణ లేకుండా ఒంటరిగా బతకగలనన్న ధీమా వచ్చింది. అన్నివిధాలా ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండే 21 సంవత్సరాల యువతిని నేను. జీవితంలో ఇక లక్ష్మణ రేఖలన్నీ దాటేశానన్న భావన వచ్చేసింది. ఇక 1975 ఎమర్జెన్సీలో ఇంటిని పూర్తిగా వదిలి దూరంగా ఉండాల్సి రావటం గొప్ప సాంత్వననిచ్చింది!
1974లోనే, మా తల్లిదండ్రులు మద్రాస్‌కు వెళ్లిపోయిన తర్వాత, పార్టీ నన్ను ఒక ముఖ్యమైన పని మీద బెనారస్‌ పంపింది. నా నడుముకు భారీ నగదు వున్న బెల్టు ఒకటి కట్టి, బరువుగా వున్న ఓ ట్రంకు పెట్టె, ఓ అడ్రస్‌ కాగితం చేతికిచ్చారు. వాటిని ఆ అడ్రస్‌లో వున్నవారికి అందజేయాలి. బెనారస్‌లో రైలు దిగి, రిక్షా మాట్లాడుకున్నాను. కానీ ఎంత వెతికినా మేమిద్దరం ఆ అడ్రస్‌ పట్టుకోలేకపోయాం. తిరిగీ తిరిగీ రిక్షా అతనికి విసుగొచ్చింది. నన్నూ, నా ట్రంకుపెట్టెనూ నడిరోడ్డు మీద దింపేస్తానని ఒకటే బెదిరింపు. అప్పుడు నాకు నిజంగా గుండె జారిపోయినట్టయింది. అంత బరువున్న పెట్టెను తీసుకుని నేనెక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి?! చివరికి ఎలాగైతేనేం చాలా సందుగొందులు తిరిగి, ఆ ఇంటిని కనిబెట్టాం. నేను ఆ ఇంట్లోకి వెళ్లే సరికి అక్కడ సత్యనారాయణ్‌ సింగ్‌, జయశ్రీ రాణా, మరో ఇద్దరు వున్నారు. వాళ్లు మార్క్సిస్ట్‌`లెనినిస్ట్‌ (ఎంఎల్‌) పార్టీ ముఖ్యులు, వాళ్ల గురించి వినటమేగానీ నేను ఎప్పుడూ చూడలేదు. సత్యనారాయణ్‌ సింగ్‌ మా పార్టీ ప్రధాన కార్యదర్శి, 1952లో జంషెడ్‌పూర్‌లో టాటాలకు వ్యతిరేకంగా భారీఎత్తున జరిగిన కార్మిక పోరాటానికి నాయకత్వం వహించి, ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇక జయశ్రీ రాణా మనిషి చిన్నగా ఉంటుందిగానీ పెద్ద పేరున్న నాయకురాలు. బెంగాల్‌కు చెందిన ఆమె ఎంఎల్‌ పార్టీల పరిధిలోనే ప్రత్యేకంగా ‘బోల్షెవిక్‌ పార్టీ’ని స్థాపించింది. నా నడుముకు పెట్టిన బెల్టులో భారీగా నగదు ఉంది. అలాగే ట్రంకు పెట్టె తెరిచి చూస్తే దాన్నిండా తుపాకులు, పిస్తోళ్లు! భయంతో ఒక్కసారిగా నా వెన్నులో వణుకు వచ్చింది. అక్కడి నుంచి మర్నాడే బయల్దేరిపోయాను, తిరిగి వచ్చేప్పుడు నాకు పెద్ద లగేజీ ఏం లేదు. అదో పెద్ద ఊరట, పార్టీ అగ్రనేతలను కలుసుకున్నందుకు సంతోషం.
తిరిగి వస్తూనే పార్టీలో పెద్ద గొడవ పెట్టుకున్నాను. అప్పుడు నాకు పార్టీ కాంటాక్ట్‌గా ఉన్నది సిరిల్‌. కోపంగా తన దగ్గరకు వెళ్లి` ‘‘నాలాంటి కొత్త వాళ్లతో అంతంత డబ్బు, అన్ని తుపాకులు పంపిస్తారా? ఆ పెద్ద ట్రంకు పెట్టెలో ఏముందని పోలీసులు ఆరా తీస్తే..? పెట్టె ఇంత బరువుందేంటని రైల్వే పోర్టరు అడిగితే…? ఆ అడ్రస్‌ దొరక్కపోతే నేను బెనారస్‌లో ఇరుక్కుపోయేదాన్ని కాదా? పరిస్థితి ఏమై వుండేది?’’ అంటూ గట్టిగా నిగ్గదీశాను. ‘‘అందుకే కదా నిన్ను పంపింది!’’ అన్నాడు సిరిల్‌ చాలా తాపీగా. ‘‘మీలాంటి వాళ్లైతేనే అంతా సురక్షితం. మిమ్మల్ని ఎవరూ అనుమానించరు. ఆ పని ఎలాగైనా పూర్తి చేసే తెగువ నీకుంది, నాకు తెలుసు’’ అన్నాడు. ఈ తర్కం ఏమిటో నాకేమంత సమర్థనీయంగా అనిపించలేదు. కానీ ఇది మాత్రం జీవితంలో నాకో విలువైన అనుభవంగా నిలిచింది.
మేం విపరీతంగా చదివేవాళ్లం. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలని తహతహలాడిపోతుండేవాళ్లం. ఉద్యమాలు ఎందుకు, ఎక్కడ, పలా మొదలయ్యాయో, ఏయే రూపాలు తీసుకున్నాయో తెలుసుకోవాలి విపరీతమైన తపన. కానీ ఇలాంటి విషయాలను చర్చించే పుస్తకాలు అంత తేలికగా దొరికేవి కావు. ప్రజా గ్రంథాలయాల్లో అయితే కచ్చితంగా వుండవు. అందుకని మేం తరచుగా మా పాత మిత్రులైన సరళ్‌ సర్కార్‌, వీణా శతృఘ్న, రమా మేల్కోటే వంటి వాళ్ల ఇళ్ల మీద పడుతుండేవాళ్లం. అక్కడైతే మాకు పుస్తకాలు, తిండి ` రెండూ దొరికేవి. సరళ్‌ సర్కార్‌ అప్పట్లో హైదరాబాద్‌లోని మ్యాక్స్‌ ముల్లర్‌ భవన్‌లో జర్మన్‌ భాష బోధిస్తుండేవాడు. మేం హిమాయత్‌నగర్‌లోని ఆయన రూమ్‌కు వెళ్లి రాజకీయాలు చర్చిస్తూనే.. పాలపొడి డబ్బాలోంచి కొద్దికొద్దిగా కొట్టేస్తుంటే, ఆ డబ్బా మాకు దొరక్కుండా దాచుకోలేక ఆయన నానా అవస్థలూ పడుతుండేవాడు! కాలక్రమంలో ఆయన మరియా మీస్‌ అనే జర్మనీకి చెందిన మాజీ నన్‌ను పెళ్లి చేసుకున్నాడు. స్త్రీవాదిగా, రచయిత్రిగా ఆమెకు పేరుంది. ఇక వీణా శతృఘ్న వైద్యురాలు, తర్వాతికాలంలో ‘అన్వేషి’ స్త్రీల అధ్యయన సంస్థను స్థాపించటంలో కీలక పాత్ర పోషించింది. ఆమె భర్త ఎం.శతృఘ్న హైదరాబాద్‌లోనే ఓ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తూ, ‘ఇకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ’ పత్రికకు కూడా రాస్తుండేవాడు. చాలా సరదా మనిషి, ఎప్పుడు వెళ్లినా మమ్మల్ని బాగా చూసుకునేవాడు. ఆయన మా కోసం తరచూ వంట కూడా చేసిపెట్టే వాడు. దానర్థం వీణ చెయ్యలేదని కాదుగానీ.. అదే వంట మగవాళ్లు చేస్తే దాన్ని మరింత మెచ్చుకోలుగా, గొప్పగా గుర్తు పెట్టుకుంటాం కదా!
క్రమంగా చిత్రహింసలను ఎదుర్కొనేందుకు మమ్మల్ని మేం సంసిద్ధుల్ని చేసుకోవటం మొదలుపెట్టాం. దాని గురించి మాలో మేమే చాలా చర్చించుకునే వాళ్లం, వేర్వేరు ప్రాంతాల్లో అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వాళ్లు వాటిని ఎలా ఎదుర్కొన్నారో, వాళ్ల అనుభవాలేమిటో విస్తృతంగా చదివేవాళ్లం. అయితే ఆ తర్వాతగానీ మాకు తెలిసి రాలేదు, ఒక వ్యక్తిని నిజంగా చిత్రహింసలను ఎదుర్కొనే విధంగా ఎవరూ తయారు చెయ్యలేరని! అలాంటి సందర్భాల్లో మా సన్నిహిత మిత్రులే ఎలా లొంగిపోయారో కళ్లారా చూశాం కూడా.
నేను మా పార్టీ సాంస్కృతిక విభాగం ‘అరుణోదయ’లో చేరాను. 1974లో ఏర్పాటైన ఆ సంస్థలో చేరమని నన్నెవరూ ఒత్తిడి పెట్టలేదు, నాకే ఇష్టంగా వుండేది. కానీ 1975లో ఎమర్జెన్సీ విధించడానికి ముందు అనంతపురంలో జరిగిన ఒక సాంస్కృతిక సదస్సులో గద్దర్‌, భూపాల్‌రెడ్డిల ప్రదర్శన చూశాక నా ఆసక్తి మొత్తం ఆవిరైపోయింది. ఆ సదస్సులో పాల్గొనేందుకు నేనూ, లలితా మా వీధిబాగోతం బృందంతో వెళ్లాం. గద్దర్‌, భూపాల్‌ రెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిృస్ట్‌`లెనినిస్ట్‌) తరఫున, వాళ్ల సాంస్కృతిక విభాగంతో వచ్చారు. (తర్వాత ఆ పార్టీనే 1980లో ‘పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌’గా మారింది.) అప్పటికే గద్దర్‌ పేరు మార్మోగిపోతుండేది. వాళ్ల ప్రదర్శన నిజంగానే అదిరిపోయింది. వాళ్ల ఆటా, పాటా పూర్తిగా కార్మిక వర్గంతో, వాళ్ల సంప్రదాయాలతో మమేకమైపోయాయి. గద్దర్‌ పాటలు` మన ఊళ్లలో జానపద కళారూపంగా బాగా ప్రాచుర్యం పొందిన, హిందూ పౌరాణిక కథలు చెప్పేందుకు ఉపయోగించే ‘బుర్ర కథ’ తరహాలో సాగటం, పైగా అవి పక్కా తెలంగాణ యాసలో ఉండటంతో జనం ఉర్రూతలూగిపోయారు. పైకి గద్దర్‌ వాళ్ల పాటలు ఎంతో సృజనాత్మకంగా, అందంగా అప్పటికప్పుడే అల్లినట్టు, అక్కడికక్కడే స్పందిస్తున్నట్లు అనిపించినా.. దాని వెనక ఎంతో ఆలోచన, ప్రణాళిక, సాధన ఉన్నాయని తేలిగ్గానే అర్థమవుతుంది. ఇక మా పాటలేమో పుస్తకాల్లో, పాఠాల్లో రాసే మాదిరి ‘ప్రామాణిక’ తెలుగులో, అదీ శాస్త్రీయ బ్రాహ్మణ సంప్రదాయ బాణీల్లో వున్నాయి. వీటన్నింటినీ మించి` మేం కేవలం పాటలు పాడేవాళ్లమే తప్ప.. గద్దర్‌లా జనాన్ని కదిలించి, వారిలో భావోద్వేగాలను రగిలించలేమని అర్థమైంది. ఆయన వేదిక ఎక్కితే అదో అనర్గళ శక్తి ప్రవాహమే! మావి కుప్పిగంతులు.
ఇక నేను అరుణోదయ కోసం ప్రదర్శనలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. అందులో అర్థం, ఔచిత్యం లేవనిపించింది. అదీకాక, ఎప్పుడూ ఊళ్లు తిరుగుతూనే ఉండటం, నిరంతరం జనం ముందు ప్రదర్శనగా నిలబడాల్సి వస్తుండటంతో బాగా అలసిపోయాను. అయితే నేనూ, లలితా అలా అర్థాంతరంగా వైదొలగడం సంస్థకు ఒక రకంగా దెబ్బే. ఎందుకంటే ఆ రోజుల్లో ఇద్దరు యువతులు వేదిక మీద నిలబడి సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వడం జనాన్ని బాగా ఆకట్టుకునేది. మా నిర్ణయాన్ని చాలామంది సభ్యులు వ్యతిరేకించారు. కానీ ఒక్క నీలం రామచంద్రయ్య (ఎన్‌ఆర్‌) మాత్రం నన్ను సమర్థించటమే కాదు, మా నిర్ణయాన్ని వ్యతిరేకించొద్దని అందరికీ నచ్చజెప్పారు కూడా. కర్నూలు జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ కొంతకాలం ఎమ్మెల్సీగా కూడా చేశారు. ఆయనంటే నాకు చాలా అభిమానం, గౌరవం. ఎవరు మాట్లాడుతున్నా ఆయన చాలా శ్రద్ధగా, ఓపికగా వినేవాళ్లు, అవసరమైతేనే తను మాట్లాడేవారు. పార్టీలో చేరిన కొత్తలో మా వ్యవహారాలను ఆయనే చూసుకునేవాళ్లు, మేం ఏదైనా పని చేస్తామంటే వద్దనే వాళ్లు కాదు. గతంలో కమ్యూనిస్టు పార్టీలు అనుసరించిన విధానాలను పరిచయం చేస్తూ, ఆ అనుభవాల ఆధారంగా సలహాలు ఇస్తుండేవాళ్లు, అవి చాలా ఉపయుక్తంగా కూడా వుండేవి. విషయం ఏదైనా తను తప్పనిసరి అనుకున్నప్పుడే జోక్యం చేసుకునేవారు. ఉదాహరణకు ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) ఏర్పాటు గురించి మొదటిసారి మేం ఆయనతో చర్చించినప్పుడు శ్రద్ధగా విన్నారు తప్పించి ఇలా చెయ్యండి, చెయ్యొద్దనేం చెప్పలేదు. అదే పీడీఎస్‌యూ నిర్వహణ గురించి చర్చించేటప్పుడు చాలా మాట్లాడే వారు.
నేను చురుకుగా పని చేసిన మరో సంస్థ పీఓడబ్ల్యూ. పార్టీతో అనుబంధం వల్ల ఆ సంస్థకు కొంత మేలూ, కీడూ.. రెండూ జరిగాయి. రకరకాల కార్యక్రమాలు చేపట్టటం, వాటికి వ్యూహాలను రచించటం, ప్రణాళికలను సిద్ధం చేసుకోవటం, జనంలోకి విస్తరించటం వంటి విషయాలను పార్టీ నుంచి నేర్చుకోవటం వల్ల పీఓడబ్ల్యూ కొంత లాభపడిరది. అదే సమయంలో, మా పార్టీ పట్ల జనంలో నెలకొన్న అభిప్రాయాలు, ఆ ఇమేజ్‌ కారణంగా ఆ సంఘానికీ కొంత నష్టం జరిగిందని చెప్పక తప్పదు, ఎంతైనా నక్సలైట్‌లంటే జనానికి భయం కదా! మా సంస్థకూ, పార్టీకీ ఎలాంటి సంబంధం లేదని బహిరంగంగా ఎన్నోసార్లు మేం ప్రకటనలు చేశాం, ఖండిరచాం. కానీ నిజానికి మేం ఎవర్నని మోసం చెయ్యగలం? ఆ మాటకొస్తే, నేను పార్టీ వదిలేసి నలభై ఏళ్లు దాటిపోయింది, అయినా ఇప్పటికీ హైదరాబాద్‌లోని కొన్ని సమూహాల్లో నన్నొక నక్సలైట్‌గా చూస్తుంటారు.
ప్రగతిశీల మహిళా సంఘం పీడీఎస్‌యూతో చాలా సన్నిహితంగా వుండేది. అందరం విద్యార్థులమే కావటంతో ఇతర సంఘాలలో వారితో కూడా మాకు మంచి సంబంధాలుండేవి. అప్పుడప్పుడే స్థిరపడుతున్న ఈ సంస్థలకు ఉన్నట్టుండి రెండు సమస్యలు ఎదురయ్యాయి. ఒకటి పార్టీ కోసం అత్యవసరంగా కొత్త క్యాడర్‌ను రిక్రూట్‌ చేసుకోవటం. రెండోది దేశంలో హఠాత్తుగా ఎమర్జెన్సీ ప్రకటించటం. క్యాడర్‌ నియామకమన్నది ప్రతీ వామపక్ష విభాగంలోనూ పెద్ద కార్యక్రమమే. అది నిరంతరాయంగా అవసరమవుతూనే ఉంటుంది. నేటికీ వామపక్ష పార్టీల్లో ఇది కొనసాగుతూనే ఉంటుంది. పార్టీ నాయకులు కూడా ఈ అంశానికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.
వాళ్లు ప్రజా ఉద్యమాలను ఉన్నట్టుండి బలవంతానా చీలుస్తుంటారు, ఏదో ఒక గ్రూపులో చేరాలంటూ జనాన్ని బలవంత పెడుతుంటారు. ఎక్కడ తమ క్యాడర్‌ను కోల్పోతామో అన్న భయంతోనే వాళ్లు భావసారూప్యం ఉన్న ఇతర గ్రూపులతో కలిసి పని చేసేందుకు ఇష్టపడరు కూడా. పార్టీలో స్వేచ్ఛగా అధ్యయనం చేయటం, అరమరికలు లేకుండా చర్చించడం వంటివి వాళ్లకు నచ్చకపోవటానికి కూడా ఇదే కారణం. పార్టీలో విద్యార్థులను ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి కాలపు కార్యకర్తలుగా(ఫుల్‌ టైమర్లుగా), తర్వాత పూర్తిస్థాయి విప్లవకారులుగా మార్చేస్తుంటారు. దానర్థం` ఆ విద్యార్థులు వివిధ రంగాలకు చెందిన ప్రజలను కలుసుకోవడం, వారితో కలసి పనిచేయడం వంటివేమీ లేకముందే, ప్రజా ఉద్యమాలకు పూర్తిగా సన్నద్ధం కాకముందే ఇలా జరిగిపోతుంది. పార్టీలో చేరిన తర్వాత వాళ్లు తమ కుటుంబాలతో సంబంధాలను ఏ విధంగా కొనసాగించొచ్చనే చర్చే వుండదు. పార్టీలో ఉన్న మహిళలకు పుట్టే పిల్లల గురించి ఆలోచన ఉండదు, వారి జీవితాల్లో తలెత్తే విషాదాల గురించి పట్టించుకోరు. అదే విధంగా కొత్త క్యాడర్‌లో వచ్చే మార్పుల గురించి, వారి తక్షణ భవిష్యత్తు గురించి కూడా పెద్దగా చర్చ ఉండదు. పార్టీ క్యాడర్‌గా బలమైన ఆదర్శాలతో కొద్దికాలం పని చేసిన తర్వాత యువ క్యాడర్‌ మానసికంగా డస్సిపోవటం తథ్యం. ఆ అనివార్య పరిస్థితులను తట్టుకునేలా వాళ్లను సంసిద్ధుల్ని చేయరు. చుట్టూ బోలెడన్ని భద్రతా సవాళ్ల మధ్య, నిరంతర అనిశ్చితిలో పని చేయటం మూలంగా వారిలో రకరకాల మానసిక, అస్తిత్వ సమస్యలు తలెత్తుతుంటే.. వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పేవారుగానీ, మద్దతుగా నిలిచే ఏర్పాట్లుగానీ ఉండవు. తమకు తాముగా ఓ సహాయక వ్యవస్థను ఎలా ఏర్పరచుకోవచ్చో నేర్పించరు. బహుశా, ఈ కారణాలన్నింటి వల్లే కావొచ్చు, పార్టీలో క్యాడర్‌ ఎంత వేగంగా చేరతారో అంతే వేగంగా తిరిగి వెళ్లిపోతుంటారు కూడా. అందుకే వామపక్ష పార్టీల్లో ఈ ఉపసంహరణల రేటు చాలా ఎక్కువ.
4. విప్లవ బాటకు పగుళ్లు
1975 జూన్‌ 25. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన రోజది. అప్పటికి నా వయసు సరిగ్గా ఇరవై ఒకటి. నాకూ, నాలా రాజకీయంగా చురుకుగా వున్న ఎంతో మంది మిత్రులకు జీవితంలో అదో మైలురాయిలా నిలిచిపోయింది. నలభై ఐదేళ్ల తర్వాత కూర్చుని రాస్తుంటే.. ఇప్పుడు కూడా మా జీవితాల్లో జరిగిన అనేకానేక సంఘటనలకు అదొక కొండగుర్తుగా మిగిలిపోయిందని, ‘ముందు`తర్వాత’ అన్నట్లు తరచూ దాని ప్రస్తావన వస్తూనే ఉంటుందని అర్థమవుతోంది. అత్యవసర పరిస్థితిని ప్రకటించిన వెంటనే పార్టీ మాలో చాలామందిని అజ్ఞాతంలోకి వెళ్లిపొమ్మని సూచించింది. బహుశా, అవకాశం
ఉండుంటే మాకు మేంగా అలాంటి నిర్ణయం తీసుకుని ఉండేవాళ్లం కాదేమో. అప్పుడు నేను పార్టీ నగర కమిటీకి నాయకత్వం వహిస్తున్నాను. ఆ కమిటీ ప్రధానంగా విద్యార్థులు, స్త్రీలు, కార్మిక సంఘాల కార్యక్రమాలను, బస్తీ ఉద్యమాలను పర్యవేక్షిస్తుండేది. బస్తీల్లో, వాడల్లో నివసిస్తుండే పేదలను సమీకరిస్తుండేది. అత్యవసర పరిస్థితి అనేది మా అందరికీ ఓ కొత్త పరిణామం, అదో ఫాసిస్టు పోకడ. అప్పటి వరకూ ఎక్కడో పుస్తకాల్లో చదవటం తప్పించి మేమెవ్వరం చూసింది కాదు. అందుకే ఎలాంటి ప్రశ్నలూ వేయకుండా పార్టీ ఆదేశాలను పాటించాం. తన మీద కేసులేమీ లేకపోయినా 1973 నుంచే సిరిల్‌ అజ్ఞాతంలో వుంటున్నాడు. జార్జి రెడ్డి తమ్ముడు కాబట్టి అతని కదలికల మీద కచ్చితంగా పోలీసుల కన్నుంటుందనీ, దానివల్ల విద్యార్థుల్లో పార్టీ చేపడుతున్న కార్యక్రమాల విషయం బయటపడి, అది పార్టీకి ఎప్పుడైనా ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంటుందని చెప్పుకుంటుండేవాళ్లు. క్రమంగా` మేం సామూహిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల వచ్చే గుర్తింపు ప్రమాదకరంగా పరిణమించవచ్చన్న అవగాహనను పార్టీ మాకు కలిగించింది. మేం ఇంక ఎక్కువ కాలం బహిరంగంగా ఉండి పనిచేసే పరిస్థితి లేదు.
పార్టీ మమ్మల్ని అజ్ఞాతంలోకి వెళ్లమంటే మొదట్లో అదేదో ముందు జాగ్రత్తగానే చెప్పారనుకున్నాం. కానీ అదెంత కీలక నిర్ణయమో తర్వాత మాలో చాలామందిని చకచకా అరెస్టులు చేస్తుంటేగానీ అర్థం కాలేదు. ఎమర్జెన్సీ ప్రకటిస్తూనే మాలో ఎం.శతృఘ్న, డా.వీణా శతృఘ్న, సి.ఎన్‌.చారిలను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. నిజానికి వాళ్లు ముగ్గురూ లెక్చరర్లు, వృత్తి నిపుణులు. అలాగే హైదరాబాద్‌ నగరంలోనే బొజ్జా తారకం, వరవరరావు, నిఖిలేశ్వర్‌, జ్వాలాముఖి వంటి ర్యాడికల్‌ మేధావులనే కాదు, చివరికి సీకే నారాయణరెడ్డి వంటి సీపీఐ`ఎంఎల్‌ మాజీ కార్యకర్తలనూ అరెస్టులు చేశారు.
అప్పుడే మమ్మల్ని అందర్నీ తీవ్రంగా కలిచివేసిన ఘటన ఒకటి జరిగింది. పీడీఎస్‌యూలో చాలా చురుకుగా ఉండే యువనేత జంపాల ప్రసాద్‌, మంచి ధైర్యవంతుడు, ఎక్కడా రాజీపడని వ్యక్తి. జార్జి రెడ్డి హత్య జరిగిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. పార్టీ అతనికి కార్మికులను సమీకరించే పని అప్పగించి కోస్తాంధ్ర ప్రాంతానికి పంపింది. అక్కడకు వెళ్లిన ఆయన పార్టీ ముఖ్య నేత నీలం రామచంద్రయ్య (ఎన్‌ఆర్‌)తో కలిసి విజయవాడలో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు వాళ్లను అరెస్టు చేసి, విపరీతంగా చిత్రహింసలు పెట్టి, 1975 నవంబర్‌లో చంపేశారు. ఎప్పటిలానే ‘ఆత్మరక్షణ కోసం జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయారనే’ ఎన్‌కౌంటర్‌ కథను ప్రచారం చేశారు. నిజానికి నీలం రామచంద్రయ్యతో పాటు అరెస్ట్‌ అయివుండకపోతే జంపాల ప్రసాద్‌ను చంపివుండేవారు కాదని మాకు తెలుసు. ఎన్‌ఆర్‌ అంటే మా అందరికీ ఎంతో అభిమానం, కానీ పార్టీ అగ్రనాయకుడిగా ఆయనకు ఏదో రోజు అలాంటి ముప్పు ఉంటుందన్నది మేం ఊహించిందే. కానీ జంపాల ప్రసాద్‌ను కూడా హత్య చెయ్యటంతో మేమంతా ఒక్కసారిగా చలించిపోయాం. దీనర్థం ఇక తర్వాత మాలో ఎవరికైనా ఇదే జరగొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మా గ్రూపుకు చెందినవాళ్లను, ఇతర గ్రూపుల్లో వాళ్లను ఎంతోమందిని వరసగా అరెస్టులు చేశారు, చిత్రహింసలు పెట్టారు.
అత్యవసర పరిస్థితి మొట్టమొదటిసారిగా మాలో తీవ్ర విభేదాలను సృష్టించిపెట్టింది. అసలు
ఉద్యమంలో కొనసాగే విషయంలోనే మా గ్రూపులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. కొందరు సీరియస్‌గా పరీక్షలకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నారు. మరికొందరేమో తమ కుటుంబాలకు దూరమై, వారిని వేదనకు గురి చెయ్యలేమన్నారు. పైగా ఎమర్జెన్సీ జూన్‌లో ప్రకటించటం, అది సరిగ్గా సెమిస్టర్లు పూర్తయ్యే సమయం కావటంతో చదువు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితీ నెత్తి మీదకు వచ్చింది. మేం విద్యార్థులుగా, భవిష్యత్తు మేధావులుగా, ఎంతో ఎత్తులకు ఎదిగే అవకాశం ఉన్న చదువరులుగా క్యాంపస్‌లో ప్రవేశించాం. మరి మా తల్లిదండ్రులూ, టీచర్లూ ఆశిస్తున్నట్టు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు సంసిద్ధం కావాలా? లేక విద్యార్థులుగా చదువుతూ, మమ్మల్ని మేం చైతన్యపరచుకుంటూ, మా చుట్టూ వున్న ప్రజలను చైతన్యపరుస్తూ సమాజంలో మార్పు కోసం, విప్లవం కోసం పని చేయాల్సిన బాధ్యత మా మీద ఉందా..? తరచూ మేమీ రెండు ప్రశ్నల మధ్యా నలిగిపోతుండేవాళ్లం. నేను జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆశయంతో ఉన్నాను. అప్పటికే పెళ్లి చేసుకోకూడదని, మంచి ఉద్యోగం సంపాదించుకుని నా కాళ్ల మీద నేను నిలబడాలని నిర్ణయించుకున్నాను. చదువుల్లో ముందంజలో ఉంటున్నాను కూడా. ఇక వాటన్నింటినీ పక్కన పెట్టేయాలా? మా స్నేహితుల్లో కొందరు ముందే జాగ్రత్త పడ్డారు. పరీక్షలు రాశారు, తమ కుటుంబాలతో చాలా సన్నిహితంగా మెలుగుతూ, భవిష్యత్తులో తమకు వారి అండాదండా ఉండేలా చూసుకుంటున్నారు. మరి నేనెందుకు మొండిగా ఇలాగే వుంటున్నట్టు? నాలోని విప్లవ ఆకాంక్ష, ఏదో సాధించాలన్న తపన, ఆశయం ఈ సందేహాలనన్నింటినీ పక్కనబెట్టేలా చేశాయి.
ఇల్లు వదిలి వెళ్లిపోవటమన్నది నాలాంటి యుక్త వయసు ఆడపిల్లలకు అంత తేలికైన విషయం కాదు. దానర్థం పురుషులకి సులభమనేం కాదుగానీ వాళ్లు అప్పుడప్పుడు బయట ఉండటం, స్నేహితులతో కలిసి గడపటం, ట్రిప్పులకు వెళ్లటం వంటివి సహజంగా జరిగిపోతుంటాయి. కానీ ఆడపిల్లలు, యువతుల విషయానికి వచ్చేసరికి అదో పెద్ద జీవన్మరణ సమస్య! ఒకసారి గడప దాటి బయటికి వెళ్లిపోతే ఆడపిల్ల తిరిగి ఇంట్లో అడుగుపెట్టడం అంత సులభం కాదు. నా విషయమే తీసుకుంటే అత్యవసర పరిస్థితికి ముందే ఇంట్లో పరిస్థితి నరకంలా ఉండేది, బోలెడన్ని టెన్షన్లు పడ్డాను. అప్పటికే మా కుటుంబాన్ని నేను కాస్త ఎడం పెట్టానన్న భావన కలగటం మొదలైంది. ఇక అత్యవసర పరిస్థితితో కుటుంబం నుంచి పూర్తిగా వేరుపడాల్సి రావటం కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి.
కార్యకర్తలు పెద్దసంఖ్యలో అజ్ఞాతంలోకి వెళ్లిపోతుండటం.. నాటి ప్రజా ఉద్యమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మా కార్యక్రమాలను కొనసాగించటం కష్టంగా తయారైంది. పైగా మాలో చాలామందిమి కొత్తవాళ్లం. మాకు అనుభవం లేదు, పోనీ పని చేసి, ఆ అనుభవాల నుంచి నేర్చుకుందామా.. అంటే అంత సమయమూ లేదు. ఈ కష్ట కాలంలో మేమందరం కలిసి ఐక్యతతో, ఒక గ్రూపుగా పని చేసేందుకు అప్పటికి మా మధ్య సంబంధాలు అంత బలపడలేదు కూడా. రాత్రికి రాత్రే మా స్నేహితుల్లో చాలామందిని అరెస్ట్‌ చేసేశారు. పోలీసులకు దొరక్కుండా దూరంగా, జాగ్రత్తగా ఉండాలని పార్టీ నుంచి మాకు సమాచారం అందింది. మొదట్లో మాకు ఇదంతా చాలా కొత్తగా, కాస్త తమాషాగా కూడా అనిపించింది. ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్న మా యువతరానికి అదో సరికొత్త అనుభవం. కుర్రాళ్లంతా వేర్వేరు చోట్ల గదులు చూసుకున్నారు. మా అమ్మాయిలం అందరం తెలిసిన కుటుంబాల దగ్గరకు వెళ్లి, వాళ్ల ఇళ్లలో తలదాచుకున్నాం. సాధారణంగా తల్లిదండ్రులు ఎప్పుడూ ఆడపిల్లల మీద, వాళ్ల కదలికల మీద ఓ కన్నేసి వుంచుతారు. అలాంటి పరిస్థితుల్లో మేం అజ్ఞాతంలోకి వెళ్లటమంటే ఇక కుటుంబాలతో మా సంబంధాలు శాశ్వతంగా మారిపోయినట్లే. పార్టీ మాకు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లోని కుటుంబాలతో కలిసి వుండేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ కుటుంబాలన్నీ కూడా చాలావరకూ పార్టీ క్యాడర్‌కు దగ్గరి బంధువులవి, సన్నిహితులవి. ఒక్కో కుటుంబం మాలో ఒక్కో విద్యార్థికి ఆశ్రయం ఇచ్చి, తమ ఇంట్లో ఉంచుకునేందుకు అంగీకరించిందన్న మాట. వాటిలో చాలా భాగం నిరుపేద కుటుంబాలు. దీంతో మా జీవితాలు మునుపెన్నడూ లేనంతగా మారిపోయాయి. మధ్యతరగతి వాతావరణం నుంచి వచ్చిన మేమంతా ఒక్కసారిగా దిగువ మధ్యతరగతి లేదా కడు బీద కుటుంబాల మధ్యకు వెళ్లిపోయాం.
కొన్ని రోజులు ఒక ఇంట్లో ఉంటే, మరికొన్ని రోజులు ఇంకో ఇంట్లో.. ఇలా తరచూ నా మకాం మారిపోతుండేది. కొంతకాలం ఒకే ఒక్క చిన్న గదిలో కాపురం ఉంటున్న కుటుంబంతో కూడా ఉన్నాను. వాళ్లింట్లో అన్నంలోకి రెండు పూట్లా నీళ్ల చారు ఒక్కటే ఉండేది. మరీ చప్పగా అనిపిస్తే ఎప్పుడైనా నంజుకోడానికి బయటి నుంచి మిర్చి బజ్జీలు కొనితెచ్చే వాళ్లు. ఇక కాఫీ, టీల ప్రశ్నే లేదు. చుట్టూ ఉన్న చాలా కుటుంబాలన్నింటికీ కలిపి ఒక్కటే బాత్రూము. అందులోనూ తీవ్రమైన నీటి కొరత. వీటన్నింటికీ తోడు చెయ్యటానికి పెద్ద పనేం లేక రోజంతా అందరం ఆ చిన్న గదిలోనే కుక్కుకుని కూర్చునేవాళ్లం. వంట చెయ్యటానికి ఏమీ లేదు కాబట్టి పెద్దగా ఇంటిపనీ వుండేది కాదు. వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించేదాన్ని కానీ.. నేనేమో అప్పటి వరకూ కేవలం తోటి విద్యార్ధులతో మాత్రమే ఉండటానికి అలవాటు పడినదాన్ని కావటంతో వారితో మాట కలపటం, ఆ అనుభవం చాలా కొత్తగా, ఇబ్బందిగా కూడా అనిపించేది. వాస్తవానికి 1968 నుంచీ నేను హైదరాబాద్‌లోనే వుంటున్నా తెలుగులో మాట్లాడటం అంత బాగా రాలేదు. దీనికి గ్రామీణ ప్రాంత విద్యార్థులతో అంతగా సంబంధాల్లేకపోవటమే ముఖ్య కారణమని చెప్పుకోవాలి. ఎందుకంటే నా స్నేహితులంతా కూడా ఇంగ్లీష్‌లోనో, దక్ఖనీ ఉర్దూలోనో మాట్లాడుతుండేవాళ్లు. బాహ్య ప్రపంచంతో సంబంధాల్లేకుండా ఇళ్లలోనే ఉండిపోయే మహిళలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తప్పించి నగరంలో మిగతా వాళ్లంతా అప్పట్లో ఉర్దూలోనే మాట్లాడుతుండే వాళ్లు. దీంతో నాకు తెలుగు అంతగా పట్టుబడలేదు. ఇక వచ్చీరాని నా కొద్దిపాటి తెలుగులోనే ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి, వాళ్లను స్నేహితులుగా చేసుకోవటానికి నానా తంటాలూ పడ్డాను గానీ అదంత తేలికేం కాదని అర్థమయ్యింది. అక్కడి జీవితం చాలా కష్టంగా, అప్పటి వరకూ నాకు తెలిసిన దానికి పూర్తి భిన్నంగా వుంది. పేదలు ఇంతటి దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తుండటం చూసిన తర్వాత.. పేదరికాన్ని నిర్మూలించటం, దారిద్య్రం నుంచి వారికి విముక్తి కల్పించటం వంటి ఆదర్శపూరిత లక్ష్యాలను చేరుకోవటం మరింత కష్టమని అర్థమైపోయింది. మొత్తానికి చేసేదేం లేక ఆ గదిలోనే ఓ మూల చేరి, రోజంతా పుస్తకాలు చదువుతూ కాలం గడిపేదాన్ని. రాత్రి అవ్వగానే సిటీ కాస్త సర్దుమణిగేది కాబట్టి బయటకొచ్చి కాస్త స్వేచ్ఛగా గాలి పీల్చుకునే దాన్ని. ఇంక లాభం లేదు, ఎలాగోలా సొంతంగా ఓ రూము తీసుకుని, అక్కడి నుంచి బయటపడాలన్న తపన పెరిగిపోయింది.
పార్టీ సమావేశాలు సాయంత్రం ఎప్పుడో లేటుగా మొదలై.. రాత్రి బాగా పొద్దుపోయే వరకూ, ఒక్కోసారి తెల్లవారే వరకూ కూడా కొనసాగుతుండేవి. ఈ మీటింగులు అజ్ఞాతంలో వున్న కామ్రేడ్స్‌ ఆశ్రయం పొందుతున్న ఇళ్లలో కాకుండా ఇతర స్నేహితుల ఇళ్లలో జరిగేవి. ఇలాంటి సమావేశాల్లో ఒకటి, పటోళ్ల ఇంద్రారెడ్డి గదిలో కూడా జరిగింది. అప్పుడాయన సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పీడీఎస్‌యూ కార్యకర్తగా పని చేస్తున్నాడు, లా కాలేజీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తన స్నేహితులతో కలిసి ఒక రూము అద్దెకు తీసుకుని అందులో ఉంటున్నాడు. ఎమర్జెన్సీ కాలంలో ఆయనను కూడా అరెస్టు చేసి పద్ధెనిమిది నెలల పాటు జైల్లో ఉంచారు. ఆ తర్వాత, పి.ఇంద్రారెడ్డి 1985లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్‌.టి.రామారావు కేబినెట్లో మంత్రిగా కూడా చేశాడు.
మేం మా సమావేశాల కోసం ఎంచుకునే గదులు ఎప్పుడూ చాలా చిన్నవిగా, ఇరుకిరుగ్గా వుండేవి. పైగా మేం అందరం లోపలికి చేరగానే కిటికీలూ, తలుపులన్నీ మూసేసేవాళ్లం. మగవాళ్లు సిగరెట్లు తాగుతుండటంతో లోపలంతా ఆ పొగ పట్టేసి మాకు చాలా చికాకుగా వుండేది. దీంతో గదిలో పొగ తాగొద్దని ఆడవాళ్లం అందరం వాళ్లతో తరచూ గొడవ పడుతుండే వాళ్లం. దీనికి వాళ్లు చాలా తెలివిగా ‘పాపం.. అమ్మాయిలు సిగరెట్లు తాగలేరు’ అని వెటకారం చేస్తూ మమ్మల్ని రెచ్చగొట్టి, మాలో కూడా కొందరు సిగరెట్‌ తాగేలా చేసేవాళ్లు. బస్సులు ఎక్కే పరిస్థితి లేదు కాబట్టి సమావేశాలు అయిపోయిన తర్వాత మేం రిక్షాల్లో మళ్లీ మా షెల్టర్లకు వెళ్లిపోయే వాళ్లం. రిక్షా వాళ్లు కూడా ఎంతో ఆదరంగా ఉండేవాళ్లు, మేం రిక్షా దిగి ఇంట్లోకి వెళ్లేంత వరకూ కూడా వాళ్లు అక్కడే నిలబడి, మేం భద్రంగా లోపలికి వెళ్లామని నిర్ధారించుకున్న తర్వాతే తిరిగి వెళ్లేవాళ్లు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏమంటే` మేం రాత్రుళ్లు అంత పొద్దుపోయాక ఇళ్లకు తిరిగి వస్తున్నా కూడా మమ్మల్ని ఎవరూ సెక్స్‌ వర్కర్లుగా పొరపడకపోవడం! అయితే సెక్స్‌ వర్కర్ల కదలికలు, వాళ్ల వ్యవహార శైలి ఎలా ఉంటుందో నాకు అప్పటికంత అవగాహన కూడా లేదనుకోండి, అది వేరే విషయం.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.