అమ్మా నువ్విక వెళ్లిపో! – భండారు విజయ

నీ మనసును ఎంత కఠినం చేసుకోకపోతే, నువ్వంత మాటను అంటావో, నేను అర్ధం చేసుకోగలను వసుధా! కానీ ఆ మాటలకు మీవాళ్ళందరూ నిన్ను ఎలా ఛీత్కారంగా చూస్తారో తెలుసా? ఎంత బాధ వున్నా, నువ్వా మాట అనకుండా వుండాల్సింది.

కళాధర్‌ ఆ మాటలు చెప్పడం ఇప్పటికి ఏ వందోసారో! వసుధ గుండెల్లోంచి తన్నుకు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ భర్త వైపు చూసింది. నువ్వు కూడా నన్నే తప్పు పడుతున్నావా? ముఖంపై పట్టిన చెమటను కర్చీఫ్‌తో అద్దుకుంటూ తుడుచుకుంది. అలా అని కాదూ.. ఇప్పుడా గొడవలు అవసరమా? కన్నకొడుకులేనా వాళ్లసలు? ఆ పనికిమాలిన వారిని నేను గౌరవించాలా? చిన్నప్పుడే, నాన్న మా అమ్మను ఒంటరిని చేసి, శాశ్వితంగా వదిలి వెళ్లిపోతే, పసికూనలుగా వున్న మమ్మల్ని ఆమె ఎంత కష్టపడి పెంచిందో వాళ్లకు తెలియదా? వాళ్లెలా మర్చిపోతారు? అమ్మను ఈ దుస్థితికి తెచ్చిందే వాళ్లే కదా!. బతికున్న తల్లిని కూడా వాళ్ళు ఆదరించలేక పోతున్నారంటే వాళ్ళనేమనాలి? మాకోసం ఆవిడ ఎన్ని అవమానాలను భరించిందో? ఎన్ని భయంకర పరిస్థితులను ఎదుర్కొందో? కన్నతల్లి అన్న కనికరం కూడా లేకుండా, పెళ్ళాల మాటలు విని ఆమెను హింసించడం ఎంతవరకు సబబు? కనీసం మనుషులపై వుండాల్సిన ప్రేమ, అభిమానాలను మరచి, ఆమెకు మనఃశాంతిని లేకుండా చేసి వాళ్లెం బాపుకుంటారు? వాళ్లిన్ని దుర్మార్గాలు చేస్తున్నా, నోరు మూసుకుని కూర్చోవాలా? వాళ్ళు చేసిన పనులేవీ మీకు కనబడడం లేదా? ఐతే నువ్వు వాళ్ళ నీచమైన అల్పత్వాన్ని సమర్ధిస్తున్నారా? అదికాదూ వసుధా! వాళ్ళ గురించి ఎవరికి తెలియదో చెప్పు.! నీకు వాళ్ళ నైజం తెల్సి కూడా మాట్లాడడం ఎందుకు? భార్యకు సర్దిచెప్పే ధోరణిలో అన్నాడు కళాధర్‌. అమ్మా! వసుధ గారంటే మీరేనా? వాళ్ళ వాదోప, వాదాలను విచ్ఛిన్నం చేస్తూ అడిగాడు సెక్యూరిటీ గార్డు.
నేనే! ఏమైంది? ఖంగారు పడుతూ లేచి నిలబడిరది వసుధ. జయమ్మగారి తాలూకు వారిని డాక్టరుగారు పిలవమన్నారమ్మా! భార్యా, భర్తలిద్దరూ వేగంగా అడుగులు వేస్తూ ఐసియు రూము వైపు నడిచారు. అప్పటికే అక్కడ నిలబడి వున్న ఆయమ్మ వీళ్ళను చూస్తూ.. మేడం చెప్పులు బైటనే విప్పండి. లోపల హ్యంగరుకు గౌను వుంటుంది. వేసుకుని, మీ అమ్మగారిని చూసి రండీ అంది. సర్‌! మేడంగారి బంధువులు అనుకుంటా ఎవరో? ఇప్పటిదాకా ఇక్కడ పెద్ద గొడవ చేసి వెళ్లారు. ఏదేదో మాట్లాడారు. హాస్పటల్లో చేర్పించిన వారికి మాత్రమే మేం సమాధానం చెబుతాం మీక్కాదూ.. అని డాక్టరుగారు కోప్పడి, వారిని ఇక్కడ నుంచి పంపించేశారు. మిమ్మల్ని పిలవమని చెప్పారు. వాళ్ళు వెయిటింగ్‌ రూములో కూర్చున్నారంటూ, వాళ్ళు కూర్చున్న వైపు చూపించింది. కళాధర్‌ ఆమె చూపిన వైపు చూసాడు. లోపల వసుధ అన్నయ్య, వదినలతో పాటు, ఆమె ఇద్దరు తమ్ముళ్లు, మరదళ్ళు వాళ్ళ పిల్లలు కూర్చుని కనబడ్డారు. వసుధ భుజంపై చెయ్యి వేసి, ముందు లోపలికెళ్ళి, మీ అమ్మగారిని చూసి, ధైర్యం చెప్పిరా.. అని ఆమెను ఐసియు గదిలోకి పంపి వెయిటింగ్‌ రూము వైపుగా కదిలాడు. వసుధ మౌనంగా లోపలికి వెళ్ళి పోయింది. కళాధర్‌ తమ దగ్గరకే రావడం చూసిన బావమరుదులు మర్యాద పూర్వకంగా లేచి నిలబడ్డారు.
అనవసరంగా ఎందుకు మోహన్‌ డాక్టర్లతో గొడవ? ఇప్పుడు మీ అమ్మగారున్న పరిస్థితిని, అర్ధం చేసుకోకుండా! కొంచెం కోపంగానే విసుక్కున్నాడు. అది కాదూ బావా! మేమెళ్లి అమ్మను చూస్తామని అంటే వద్దని ఆంక్షలు పెడుతున్నారు. ఒక్కరినైనా పంపండీ అంటే? అదీ కుదరదంటే కుదరదని తెగేసి చెబుతుంటే, ఎవరికైనా కోపం రాదా? తాము చేసిన దాంట్లో తప్పేమీ లేదంటూ వివరణ ఇస్తున్న భర్తను చూస్తూ కళ్ళతోనే మోహన్‌ భార్య వారిచింది. ఆవిడగారి ప్రియమైన కూతురు, అల్లుడు వుండగా, మనం ఇక్కడ ఉండడం దండగ. బావగారు మీరు ఎంత మాట్లాడినా అది వేస్టే. విమల్‌ భార్య నిర్మల తన అసహనాన్ని వెళ్లగక్కింది. మోహన్‌ తలదించుకుని, భార్య వెంట నడుచుకుంటూ వెళ్లిపోయాడు. మిగిలినవాళ్ళు కూడా, అభాద్యతగా ఏమీ పట్టనట్లుగా, భార్యల వెనుకనే తల ఒంచుకుని పోతున్న బావ మరదులను చూస్తూ, చివుక్కుమన్న మనసుతో కళాధర్‌ స్థాణువులా నిలబడిపోయాడు.
ఛీ! ఏం మనుషులు? తల్లి అంటే బొత్తిగా ప్రేమ లేకుండా వీళ్లెలా బతుకుతున్నారో, ఏమో? హాస్పటల్‌ వరకు వచ్చి, హాస్పటల్‌ మీద అలగి అలా ఎలా వెళ్ళబుద్ది అవుతోందో? మనసులోనే విసుక్కున్నాడు. మోహన్‌ భార్య రమ్య గురించి వసుధ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. మోహనుకు భార్య కాక ముందు ఆమె తన అన్న, వదినల ఇంట్లో చదువు సంధ్యా లేక ఇంటి పనులకే పరిమితమై ఎంతో కష్టపడిరది. అన్ని కష్టాలు పడ్డ ఆమె అత్తగారిని మాటలతో హింసించడం ఎంత ఘొరం? బహుశా! అవన్నీ ఆమె మర్చిపోయి
ఉండవచ్చు. బాధగా అక్కడున్న కుర్చీలో కూర్చుని ఆలోచనల్లో పడ్డాడు కళాధర్‌.
… … …
జయలక్ష్మి, రామచంద్రయ్య దంపతులకు పెండ్లి అయిన ఏడాదికే పెద్ద కూతురు అరుంధతి పుట్టింది. ఆమె పుట్టిన పది సంవత్సరాల వరకు వాళ్ళకు రెండో సంతానం కలగలేదు. రామచంద్రయ్య ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో బడిపంతులు ఉద్యోగం చేసేవాడు. జయలక్ష్మి కూడా అదే పాఠశాలలో కుట్టు టీచరుగా కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసింది. పెద్ద కూతురు తర్వాత ఆలస్యంగా మోహన్‌ పుట్టాడు. ఆ తర్వాత వరుసగా వసుధ, విమల్‌, విజయ్‌ పుట్టడంతో జయలక్ష్మి తన
ఉద్యోగానికి విరామం ఇచ్చి, పిల్లల పెంపకంలో మునిగిపోయింది. మోహన్‌ డిగ్రీ పూర్తైన తర్వాత సినీ నటుడు కావాలన్న ఆశతో తల్లిదండ్రులను ఒప్పించి మద్రాసుకు మకాం మార్చాడు. సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ కొంత డబ్బు ఇంటికి పంపిస్తూ ఉండేవాడు. మోహన్‌ మద్రాసు వెళ్లే నాటికి వసుధ ఇంటర్‌ చుదువుతోంది. చదువు మీద పిచ్చితో డాక్టరు కావాలని ఆశపడిరది. తల్లిదండ్రుల ప్రోద్భలంతో ‘ఎంబిబిఎస్‌’ ఎంట్రన్స్‌ కోచింగ్‌ లో చేరింది. మొదటి విడతలో సీటును సంపాదించలేక పోయింది. రెండోసారి మరో ప్రయత్నం చేస్తానన్న కూతురు మాటను కాదనలేక రామచంద్రయ్య మరో అవకాశం కూతురుకు ఇచ్చాడు. ముందస్తు జాగ్రత్తగా, వసుధను బీఎస్సీలో చేర్పించి, ఇయర్‌ వేస్ట్‌ కాకుండా చూసాడు. లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ లో ‘ఫ్రీ’ సీటు వస్తే గనుక, డిగ్రీ కాలేజీని వదిలి, తప్పకుండా ‘ఎంబిబిఎస్‌’ లో చేర్చుతానని, రామచంద్రయ్య గారు కూతురుకు మాట ఇచ్చాడు.
… … …
వసుధ తల్లి ఐదో తరగతి వరకు మాత్రమే చదివింది. ఆ తర్వాత ఆమె తండ్రి, ఇంట్లోనే మాస్టారును పెట్టి, ప్రాధమిక, మాధ్యమిక, విశారద, భాషాప్రవీణ లాంటి హింది భాషా పరీక్షలు ప్రైవేటుగా కట్టించి రాయించారు. ప్రాధమిక విద్య అనంతరం ఆమెకు పెండ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. తన తండ్రి, తనకు ఇష్టమైన చదువుకు అవకాశాన్ని కల్పించడం తనకు గొప్ప విషయం. అదే విషయాన్ని కూతురు వసుధకు అనేకసార్లు చెప్పి మురిసిపోయేది. అమ్మ, నాన్నల వివాహానంతరం, నాన్నను ఒప్పించి అమ్మ కుట్టుమిషన్‌ నేర్చుకుంది. మా పెద్దక్కయ్య పుట్టిన తర్వాత, అమ్మకు కుట్టు టీచరుగా ప్రభుత్వ పాఠశాలలో చేరమని ఉత్తర్వులు రావడంతో నాన్న ఆమెను ప్రోత్సహించి, ఉద్యోగంలో చేర్పించాడు. ఆమె జీవితంలో భర్త ఇచ్చిన ప్రోత్చాహం గొప్ప పరిణామంగా భావించేది. తన ప్రతిభతో సాధించుకున్న ఉద్యోగం పట్ల ఆమెకు చాలా గౌరవం వుండేది. ఇంటికి దగ్గరగా వుండి, అమ్మకు
ఉద్యోగం కన్ఫర్ట్‌గా వుండడంతో, తన విధులను నిర్విగ్నంగా నిర్వహించకలిగింది. తొమ్మిది సంవత్సరాలైనా, రెండో సంతానం కలగకపోవడంతో, అమ్మకు అత్త, ఆడపడుచులతో పాటు తోటికోడళ్ళ ఆరళ్ళు ఎక్కువయ్యాయి.
సమాజంలో సంతానం లేకపోవడమే ఒక పెద్ద దోషం, నేరంగా భావిస్తారు. అలాంటి స్త్రీలను గొడ్రాలంటూ మాటలతో చిత్రవధ చేస్తుంది. ఒక్క బిడ్డను మాత్రమే కనిన స్త్రీలను కూడా అంతే ధారుణంగా మాటలతో హింసించడం ఆరోజుల్లో ఎక్కువగా వుండేది. ‘ఒక రూపాయి, రూపాయి కాదు, ఒక బిడ్డ, బిడ్డా కాదు’ అన్నట్లుగా మా అమ్మను కూడా అందరూ వేధించేవారు. పెద్దక్క పుట్టిన పదేళ్లు గడచినా, అమ్మకు మరో బిడ్డ కలగలేదు. దాంతో ‘ఒంటికంటి సోమలింగం’, ఒంటి బిడ్డతల్లి ఇంటికి చేటు, కీడు అంటూ నిరంతరం ఇంట్లోవాళ్లు ఆమెను ఎద్దేవా చేస్తూ కించపరచేవారు. ఆ బాధను తట్టుకోలేక, అమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అది తెలిసిన నాన్న అమ్మను కోప్పడి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసి నన్ను బాధ పెట్టకూ… అని మాట తీసుకున్నారు. రెండో సంతానం కలగడం లేదన్నఅబధ్రతతోనే అమ్మ, తను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి, ఇంటికే పరిమితమైంది. అది తెలిసిన అమ్ముమ్మ, తాతయ్యలు అమ్మను వాళ్ళింటికి తెచ్చుకున్నారు. నాన్నకు తెలియకుండా అమ్మతో నాటు మందులేవో, తాగించడం వల్లనే మా అన్నయ్య పుట్టాడని అమ్ముమ్మ చెప్పేది. ఇవేమీ తెలియని నాన్న, తన స్నేహితుడైన, ఒక డాక్టర్‌కు చూపించి, మందులు ఇప్పించడం వల్లనే అమ్మకు మళ్ళీ సంతానం కలిగిందని అమ్మే చెప్పేది. అవేవీ తెలియని నానమ్మ వాళ్ళు, మా ఇంటి ఇలవేల్పు వీరభద్రేశ్వరుని కృప, మహిమ అంటూ చెప్పే వాళ్లు. అన్నయ్య, తర్వాత రెండేళ్లకు నేనూ, నా తర్వాత, ఇద్దరు తమ్ముళ్ళు పుట్టడం జరిగింది. అమ్మ మాత్రం అన్ని ఆలోచనలు మానేసి, ఇంటి ఆలన, పాలన, మా పెంపకాలలోనే పూర్తిగా మునిగిపోయింది.
… … …
‘ఓడలు-బండ్లు, బండ్లు-ఓడలు అయిపోతాయన్నట్లుగా,’ అంతమంది పిల్లల పెంపకంలో నాన్న ఆర్ధిక స్థితిగతుల్లో పెను మార్పులు రావడం మొదలయ్యాయి. అమ్మ నేర్చుకున్న ఆ కొద్దిపాటి విద్యతోనే, మాతోపాటు, ఊరిలోని పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. కొందరికి కుట్టుమిషను నేర్పేది. దాంతో అమ్మ సంపాదన నాన్నకు చేదోడుగా వుండేది. నాన్న అర్ధంతర మరణం వలన మాకు ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టాయి.’ బతకలేక బడి పంతులు’ అన్న నానుడికి నిజం చేస్తున్నట్లుగా నాన్న ఫామిలీ పెన్షన్‌ మాకు సరిపోయేది కాదు. చాలా కష్టంగా వుండేది. అప్పటివరకూ నాన్నకు చేదోడుగా వుండద్దానికి కష్టపడిన అమ్మకు మా బాధ్యతల భారం మరింత పెరిగింది. అన్నింటికీ సర్ధుకుపోయే అమ్మను నాన్న చాలా అపురూపంగా చూసుకున్నాడు. మేం పుట్టి బుద్దెరిగే వరకు, అమ్మా, నాన్నలు చిన్న మాట అనుకున్నది మేం చూడలేదు. ఒకరినొకరు కించపరచుకున్న సందర్భం కూడా లేదు. అలాంటి సహచరుడిని కోల్పోయిన అమ్మ నిజంగా దురదృష్టవంతురాలే. అలాగే, నాన్న మరణం ఆమెను బాగా క్రుంగదీసింది. ధైర్యాన్ని కూడగట్టుకుని మమ్మల్ని పెంచిన విధానం మా బంధువులకు చాలా ఆశ్చర్యంగా వుండేది.
నా ప్రాధమిక విద్య అంతా అమ్ముమ్మ వాళ్ళ ఊర్లో జరిగినా, ఉన్నత విద్య మాత్రం మా అమ్మ పర్యవేక్షణలోనే జరిగింది. ఆమె మాకు కన్నతల్లి మాత్రమే కాదు. ఒక గురువు, నేస్తం కూడా. బహురూపాలలో పొదివి పట్టుకుని మమ్మల్ని నడిపించింది. ఆమెకు బిడ్డలుగా పుట్టడం గొప్ప అదృష్టం. నాకు నాలుగు సంవత్సరాలున్నప్పుడు, నాన్న బతికివున్న కాలంలోనే మా అక్కకు వివాహం కావడం వలన, పెరిగి పెద్దైయ్యాక, నాకే కాదు మా తమ్ముళ్ళకూ, మాకోక సొంత అక్క వున్నదన్న సంగతే తెలియదు. నాన్న పోయాక, అమ్మ శ్రమను చూడలేక, ఆమెను కూర్చోబెట్టి వద్దన్నా, వినకుండా నేనే అన్ని పనులు చేసేదాన్ని. నాతో పాటు తమ్ముళ్ళకూ పనులను పురమాయించే దాన్ని. రాత్రి ఏ పన్నెండు గంటలకో నిద్రలేచి, తరగతి చదువులు చదువుకునేదాన్ని. ఆ సందర్భాలలో అమ్మే నాకు తోడు, నీడ. అమ్మతో నా అనుబంధం మరువలేని, మరుపురాని మధుర స్మృతుల కావ్యం. ఎల్లవేళలా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంది.
తమ్ముళ్ళు ఇంటరులో వున్నారు కాబట్టి కాస్త రిలీఫ్‌గా ఫిల్‌ అవుతున్న మా కుటుంబంలో నాన్నకు కార్డియోస్టోక్‌ రావడం, కొలుకుంటాడు అనుకున్న టైంలో తిరిగి రెండోసారి స్టోక్‌ వచ్చి హాస్పటల్‌ నుండి తిరిగి రాకుండానే మరణించడం నా కెరియర్‌ ను పూర్తిగా మార్చివేసింది. ఇంట్లో మిగిల్చిన విషాదం అనేక బాధ్యతలను పెంచింది. డిగ్రీ పూర్తి చేయకుండానే తల్లి, తమ్ముళ్ళ ఆలన, పాలన కోసం
ఉద్యోగాల వేటలో పడిపోయాను. ఒకవైపు డిగ్రీ చేస్తూ మరోవైపు టెన్త్‌ స్టాండర్డ్‌ వాళ్ళకు ట్యూషన్లు చెప్పేదాన్ని. ఇంటికి వచ్చాక అమ్మ కుట్టిన బ్లౌజెస్‌కు హుక్స్‌, హెమింగ్స్‌ చేస్తూ సహాయపడేది. డిగ్రీ అయిపోయిన వెంటనే దొరికిన ఉద్యోగమల్లా చేస్తూ, నాన్న కారుణ్య నియామకంలో పెద్ద తమ్ముడికి
ఉద్యోగం ఇప్పించి, ఊపిరి పీల్చుకున్నాను. ఆ సమయంలోనే పరిచయమైన కళాధర్‌తో నా వివాహం, అక్క, అన్నయ్యల సహాయ, సహకారాలతో జరిగిపోయింది.
కళాధర్‌ జీవితంలోకి వచ్చాక, నా జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు అనుభవించిన కష్టాలు ఒకరకంగా గట్టిక్కినట్ళైంది. కళాధర్‌ సహాయంతో చిన్న తమ్ముడిని హాస్టల్‌ చేర్పించి చదివించాను. పెద్ద తమ్ముడికి పెండ్లి చేసి, తల్లి కష్టపడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తమ్ముళ్ళకు అండగా నిలబడగలిగాను. భూమిపై పుట్టిన ప్రతి జీవికి అమ్మనే మొదటి గురువు. జ్ఞానాన్ని అందించే క్రమంలో, ప్రతివారి జీవన మలుపుల్లో ఒక్కొక్కరు కనుమరుగై పోవడం సహజం. కానీ అమ్మలు అలా కాదూ.. తాము జీవించి ఉన్నంత కాలం పిల్లల కోసం త్యాగాలు చేస్తూ.. వారినెప్పుడూ అంటిపెట్టుకునే వుంటారు. తల్లుల దృష్టిలో పిల్లలు ఎంత ఎత్తు ఎదిగినా, వాళ్ళకెప్పుడూ పిల్లలు చిన్నవాళ్ళుగానే కన్పిస్తారు.
… … …
పిల్లల పెండ్లిళ్ళు అయిపోయాక, జయమ్మ జీవితం దుర్భరంగా మారిపోయింది. కొడుకులు తనవారైనా, కోడళ్ళ చేతుల్లోకి పెత్తనాలు వెళ్లిపోయాయి. ఫలితంగా ఆమె పడక గదిలోనుంచి ఆ ఇంటి హాల్లోకి మారిపోయింది. అది చూసిన వసుధ తమ్ముళ్ళిద్దరికీ పెద్దక్లాస్‌ తీసుకుంది. అమ్మ మన కోసం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుంది. నాన్న చనిపోయిన తర్వాత అన్నీ తానై మనల్ని ఎంత అపురూపంగా పెంచిందో మర్చిపోకండిరా అంటూ తమ్ముళ్లన బతిమిలాడిరది. కానీ వాళ్ళ అసమర్ధత వలన మరదళ్ళ అనాలోచిత ధోరణుల వలన తల్లిని దారుణంగా అవమానిస్తూ, దిగజారిపోవడం చూస్తూ తట్టుకోలేక పోయింది వసుధ. గత్యంతరం లేని పరిస్థితిలో తల్లిని గత ఆరు సంవత్సరాల క్రితం తన దగ్గరికి తెచ్చుకుంది. తండ్రి చనిపోయిన తర్వాత, అతనికి వచ్చిన పెన్షల్‌ డబ్బుల పంపకం రోజున వచ్చిన మోహన్‌, తిరిగి తమ్ముళ్ళ పెళ్ళిళ్ళప్పుడు తప్ప, మరెప్పుడు రాలేదు. అక్కకెప్పుడూ తన ఇల్లు, బాధ్యతలు తప్ప పెద్దగా ఎప్పుడూ, ఎవరిని పట్టించుకున్నదే లేదు. ఎవరు ఎలా వున్నా, జయమ్మ బాధ్యతలను మోయడం వసుధకు తప్పలేదు. అందరూ ఎవరి జీవితాల్లో వాళ్ళు పిల్లాపాపలతో సెటిల్‌ అయ్యారు. వసుధ కూతురు రశ్మి పెండ్లిలో అక్క, అన్నదమ్ములు, వారి పిల్లలందరూ వచ్చినప్పటికీ, అందరి నడుమ వున్న కన్నతల్లి విషయంలో మాత్రం ఎవరిలో ఎటువంటి మార్పు లేకపోవడం వసుధను మరింత బాధపెట్టింది. ఓరోజు అందరినీ కూర్చోబెట్టి, ఇంత మానవత్వం లేకుండా ఎలా బతుకుతున్నారు. కన్నతల్లిని పలుకరించలేని మీ బతుకులు ఒక బతుకేనా? ఆమె చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేయడానికి మీకు నిజంగానే సిగ్గులేదూ, అని నిలదీసింది. ఎవ్వరూ ఏమి మాట్లాడకుండానే ముఖాలు ముడుచుకుని వెళ్లిపోవడం చూసిన తల్లి కళ్ళు తుడుచు కోవడం ఆమె ఎప్పటికీ మరచిపోదు. కూతురు పెళ్లి హడావిడి అయిపోయి, ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయాక తల్లికి గుండెనొప్పి రావడంతో వారం రోజుల క్రితం ఇదిగో ఈ హాస్పటల్‌ లో చేర్పించింది.
వసుధా! డాక్టర్‌ పిలుస్తున్నారట.. పదా వెళ్దాం అన్న భర్త మాటలకు తల్లి జ్ఞాపకాల తుట్టె నుండి వసుధ బయటకు వచ్చి భర్త వైపు చూస్తూ.. అదేంటి ఇప్పుడే కదా వెళ్ళి వచ్చింది అంతలో ఏమైంది? అమ్మ బాగానే వుంది కదా! మళ్ళీ ఎందుకు డాక్టర్‌ రమ్మంటున్నారు? ఏమో! తెలియదు.. పదా వెళ్దాం..! భార్య చెయ్యి పట్టుకుని కళాధర్‌ ఐసియులోకి అడుగు పెట్టాడు. బెడ్‌ మీద తల్లికి పెట్టిన వెంటిలేటర్‌ను చూసి, వసుధ భయపడిపోయింది. ఇప్పటి వరకు బాగానే వుంది. ఆపరేషన్‌ కూడా సక్సెస్‌ అయిందని డాక్టర్స్‌ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా భర్తను మళ్ళీ ఏమైంది అమ్మకు అని అడిగింది. మళ్ళీ స్టోక్‌ వచ్చిందట. సీరియస్‌గా వుంది. రెండోసారి సివియర్‌ పెయిన్‌ వచ్చింది. బతకడం కష్టం అంటున్నారు. భార్య భుజం నొక్కుతూ మెల్లగా అన్నాడు కళాధర్‌.
పొద్దున తన తల్లి కోలుకుందని సంబరపడిరది. మళ్ళీ తను తల్లిని ఇంటికి తెచ్చుకుంటానని ఆశ పడిరది. తన కళ్ళముందే, తన ఆశ అడియాస అవుతుంటే, తట్టుకోలేకపోతోంది. డాక్టర్స్‌ హడావిడిగా అటు, ఇటు తిరుగుతుంటే తల్లి ఇక తనకు దూరం అవుతుందేమోనన్న అనుమానం మరింత పెరగసాగింది. ఆమె ఆలోచనలు గ్రహించినట్లుగా వసుధను అక్కడ నుంచి తీసుకుని వెళ్ళమని కళాధర్‌కు డాక్టర్స్‌ సైగ చేయడంతో భార్యను తీసుకుని కళాధర్‌ బయటకు వచ్చాడు. అప్పటికే బెడ్‌ సోర్సస్‌తో బాధపడుతున్న తల్లిని చూడడం ఆమెకు పదేపదే గుర్తుకు వస్తోంది. ఇంటికి వెళ్ళాక తను బాగుచేసుకోవచ్చులే అనుకుంది. కానీ ఇంతలో మళ్ళీ ప్రమాద గంటికలు మోగడం ఆమెను మరింతగా కలవర పెడుతోంది. జరుగుతున్నా పరిణామాలను తట్టుకోలేక పోతోంది. ఈ ప్రపంచంలో తనకున్న ఏకైక ఆప్తురాలు అమ్మ. ఆమె కూడా తనకిప్పుడు దూరమైతే, తన పరిస్తితి ఏంటి? దుఃఖంతో ఆమె భర్తను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది.
కళాధర్‌ భార్యకు నచ్చచెప్పే ప్రయత్నంలో.. వసుధా! ఎందుకు ఏడుస్తావు? బ్రతికినన్ని రోజులు ఆమెకు కొడుకుల ఆదరణ లబించలేదు. ఆమె సంతోశం ఎవ్వరూ కోరుకోలేదు. పిచ్చి తల్లి ఆమె ఏరోజు సుఖపడలేదు. మీ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఆమెకు కష్టాలే! రెండు సార్లు కాళ్ళు విరిగితే నీ తమ్ముళ్ళు కానీ, అన్నయ్య, అక్క కానీ కనీసం ఆమెను చూడడానికి కూడా రాలేదు. చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్న తల్లి కోసం వచ్చి కూడా హాస్పటల్‌లో గొడవ చేసి, ఆమెను చూడకుండానే వెళ్ళిపోయారు. చివరి దశలో నువ్వే ఆమెకు సేవలు చేసి, ఋణాన్ని తీర్చుకున్నావు. ఇప్పుడామె డెబ్బైలో పడుతోంది.. ఇన్నిరోజులు నుంచి పడిన కష్టాలు ఆమెకు విముక్తిని ప్రసాదించాయని సంతోషపడు. అంతే కానీ బాధపడకు.. అన్నాడు ఓదార్పుగా.. నర్సు వచ్చి మళ్ళీ డాక్టరు గారు మిమ్మల్ని రమ్మంటున్నారని పిలవడంతో ఇద్దరూ అటువైపుగా కదిలారు.
డాక్టర్‌! పెదవి విరియడంతో వసుధకు దుఃఖం ఆగలేదు. గుండె చాలా బలహీనంగా కొట్టుకుంటోంది, అది ఎప్పుడైనా ఆగిపోవచ్చు. పల్స్‌ రేట్‌ క్షణ క్షణానికి పడిపోతోంది. మేము శాయశక్తులా ప్రయత్నించాం. ఇక లాభం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మేడమ్‌! మీ వాళ్ళను పిలుచుకుని ఒక నిర్ణయం తీసుకోండి. వెంటిలేటర్‌ తీసిన వెంటనే ఆమె ఊపిరి ఆగిపోతుంది. లేదూ ఇలాగే వెంటిలేటర్‌పై వుంచాలని మీరు చెబితే ఉంచుతాం. ఏ విషయం చెప్పండి? అది ఉంచినా ప్రయోజనం వుండదు. ఒకటి, రెండు రోజుల్లోనో పొయ్యే ప్రాణమే కానీ, నిలిచేది కాదు అంది నర్సు.
కళాధర్‌ భార్యవైపు చూశాడు. కోపంతో వెళ్ళిన బావమరుదులను పిలవడం తన బాధ్యత అనుకుని, వాళ్ళకు కాల్‌ చేస్తాను. ఎంతైనా తర్వాత కార్యక్రమాలు చేయాల్సింది వాళ్లేగా.. అంటూ భార్యను అక్కడ నుంచి బయటకు తెచ్చాడు. వసుధ మౌనం వహించింది. అమ్మా!! ఇక వెళ్లిపోమ్మా! వెళ్లిపో! నిన్ను కాపాడుకోలేని నన్ను క్షమించమ్మా! కళాధర్‌ అన్నట్లుగా తల్లీ మీద సర్వహక్కులు ఈ సమాజంలో ఎప్పుడూ వాళ్ళదే.. కదమ్మా!! నీ బాధలు, బాధ్యతల నుండి చివరి విరామం తీసుకుని వెళ్లిపోతున్నావా! అమ్మా! వెళ్లిపో!. మనసులోనే వసుధ, తల్లికి నమస్కారం పెట్టుకుంది.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.