కామ్రేడ్‌ సాయిబాబా అమరత్వాన్ని ఎత్తిపడదాం! ఆదివాసులపై యుద్ధాన్ని వ్యతిరేకిద్దాం!

మన ప్రియతమ సహచరుడు, అనేక ప్రజాసమూహాల నాయకుడు, భారత పీడిత ప్రజా ఉద్యమాల మిత్రుడు, కవి, విప్లవ మేధావి, అధ్యాపకుడు, ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం అపారమైన కృషి చేసి, రాజ్య కక్షకూ తప్పుడు కేసులో నిర్బంధానికీ, తద్వారా అనారోగ్యానికీ గురై, శరీరం శిథిలమైపోయి 2024 అక్టోబర్‌ 12, శనివారం హైదరాబాదు నిమ్స్‌ ఆస్పత్రిలో కన్నుమూసిన ప్రొ. జి ఎన్‌ సాయిబాబాకు కన్నీటి జోహార్లు!

తన యాబై ఎనిమిది సంవత్సరాల జీవితంలో కనీసం ముప్పై ఎనిమిది సంవత్సరాలు సాయిబాబా ప్రజా జీవితంలో, ప్రజాపోరాటాలలో ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏ ప్రజా సమూహం తమ హక్కుల కోసం నినదించినా తన గొంతు కలిపాడు. వారి పోరాటాలకు సంఫీుభావం తెలిపాడు. వారి పోరాటాలను విశేషంగా ప్రచారం చేసి దేశవ్యాప్తంగానూ, అంతర్జాతీయంగానూ విస్తృత సంఫీుభావం సమీకరించాడు. అందువల్లనే ఇవాళ సాయిబాబాను సకల పీడిత ప్రజా సమూహాలూ సగౌరవంగా, ప్రేమపూర్వకంగా సంస్మరించుకుంటున్నాయి. అమలాపురం సమీపంలోని సన్నవిల్లి గ్రామంలో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబంలో గోకరకొండ సత్యనారాయణ మూర్తి – సూర్యావతి దంపతులకు 1967 జూలై 24న పుట్టిన గోకరకొండ నాగ సాయిబాబా ఐదో ఏట పోలియో వ్యాధికి గురై రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు. కొడుకు ఎట్లాగైనా చదువుకోవాలని తల్లి పూనిన దృఢదీక్షతో, ఆమె కష్టంతో చదువు ప్రారంభించి, కొనసాగించాడు. కుటుంబ ఆర్థికస్థితి, అంగవైకల్యం సవాళ్లను ఎదిరిస్తూ ఇరవయో ఏటి వరకూ జీవిత పోరాటంలో విజేతగా, విద్యలో అత్యంత ప్రతిభావంతుడిగా నిలిచాడు.
ఇరవయో ఏట ఎంఎ (ఇంగ్లిష్‌) చదువు కోసం హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో ప్రవేశించిన సాయిబాబా విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రభావంలోకి, ప్రజా జీవితంలోకి కళ్లు తెరిచాడు. వైద్య పరిభాషలో 90 శాతం అంగ వైకల్యం ఉన్న వ్యక్తి అయినప్పటికీ, సామాజిక ఉద్యమాల పట్ల కుతూహలంలో, ఉద్యమాలలో పాల్గొనాలనే స్ఫూర్తిలో సగటు విద్యార్థులందరినీ మించిపోయాడు. రెండు సంవత్సరాల అధ్యయనం, పరిశీలన, ప్రజా ఉద్యమాలలో నేరుగా పాల్గొనాలనే తపన 1990 ఆగస్టులో మండల్‌ కమిషన్‌ సిఫారసుల అమలు కోసం, బహుజనుల రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో సాకారమయ్యాయి. అప్పటికి ఎం ఫిల్‌ విద్యార్థిగా సాయిబాబా ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు, నాయకత్వం వహించాడు. అప్పటి నుంచి 2024 సెప్టెంబర్‌ లో వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడు కలిసిన ప్రతి ఒక్కరితో, పాల్గొన్న సమావేశాలలో ఆదివాసుల పోరాటానికి సంఫీుభావం కోరుతూ మాట్లాడిన దాకా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సాయిబాబా పాల్గొన్న, నాయకత్వం వహించిన, మార్గనిర్దేశకత్వం చేసిన ప్రజా పోరాటాలు ఎన్నో ఉన్నాయి.
సాయిబాబా పాల్గొన్న, నాయకత్వం వహించిన ప్రజా ఉద్యమాల జాబితా ఇస్తే, అది 1990 ల తర్వాత భారత ప్రజా ఉద్యమాల చరిత్ర అవుతుంది. మొట్టమొదట 1990లో బహుజనుల రిజర్వేషన్ల కోసం ఉద్యమించాడు. 1992లో తాను చదువుతున్న సీఫెల్‌ లో రోజు కూలీలుగా పని చేస్తున్న తాత్కాలిక మెస్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలని ఉద్యమించాడు. 1995లో ఆంధ్రప్రదేశ్‌ జైళ్లలో ఖైదీల సౌకర్యాలు మెరుగు పరచాలని, హక్కులను కాపాడాలని ఉద్యమించాడు. 1996లో సామ్రాజ్యవాద దోపిడీ పీడనల కింద దేశంలోనూ, అంతర్జాతీయంగానూ జాతుల సమస్య నానాటికీ ఎంత తీవ్రతరంగా మారుతున్నదో ప్రామాణిక సమాలోచనల అంతర్జాతీయ సదస్సు నిర్వహించాడు. ఆ సమాలోచనలను పుస్తక రూపంగా వెలువరించాడు. 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలకవర్గాల కింద హక్కుల అణచివేతకూ, అన్యాయానికీ గురైన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరే ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి, వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటనకు ఆలోచనలు అందించాడు. 1998లో ఆంధ్రప్రదేశ్‌ మీద ప్రపంచ బ్యాంకు పడగనీడకు వ్యతిరేకంగా ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం, సంక్షేమ పథకాల కోత పట్ల నిరసన ఉద్యమం నిర్మించాడు. ఆ తర్వాత ఢల్లీికి మారి, అన్ని రాష్ట్రాల నుంచి తమ సమస్యల మీద పోరాటాల కోసం ఢల్లీి వచ్చే వివిధ రాష్ట్రాల ప్రజా సమూహాలకు సంఫీుభావ కేంద్రంగా మారాడు.
2003లో ఢల్లీిలో రాంలాల్‌ ఆనంద్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా చేరిన ఏడాది రెండేళ్లలోనే మధ్య భారత అరణ్యాలలో అత్యంత విలువైన ఖనిజ నిలువలను కార్పొరేట్లకు అప్పగించడం కోసం అక్కడి ఆదివాసులను వెళ్లగొట్టడానికి ప్రభుత్వం పన్నుతున్న కుట్రను గుర్తించాడు. మావోయిస్టు పార్టీ మీద దాడి ఆ ఆదివాసుల మీద కార్పొరేట్‌ యుద్ధంలో భాగమే అని గుర్తించాడు. అంతకు ముందే హైదరాబాదులో సామ్రాజ్యవాద వ్యతిరేక వేదికను నిర్మించిన అనుభవంతో, 2004లో ముంబాయిలో వివిధ ప్రజా ఉద్యమాల ఉమ్మడి వేదికగా నిర్వహించిన ముంబై రెసిస్టెన్స్‌ 2004 అనుభవంతో ప్రజల మీద యుద్ధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం నిర్మించాడు. సల్వాజుడుంను వ్యతిరేకిస్తూ దేశదేశాలలో ప్రచారం చేశాడు. ఒకవైపు సల్వాజుడుం చట్ట వ్యతిరేకమనీ, రాజ్యాంగ వ్యతిరేకమనీ సుప్రీంకోర్టు తీర్పు చెపుతుండగా, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ ప్రారంభించింది. ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ కు వ్యతిరేకంగా సాయిబాబా దేశమంతటా, విదేశాలలోనూ సంఫీుభావాన్ని కూడగట్టాడు. 2014 మేలో అరెస్టయ్యే వరకూ ఆ పనిలోనే ఉన్నాడు. పది సంవత్సరాల అక్రమ నిర్బంధం తర్వాత విడుదలయ్యాక ఆ పని కొనసాగింపు గురించే మాట్లాడాడు.
ఈ విస్తృత పోరాట జీవిత క్రమంలో సాయిబాబా విప్లవ రచయితల సంఘం, అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక, జాయింట్‌ ఆక్షన్‌ కమిటీ ఫర్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌, ఫోరం అగెనెస్ట్‌ ఇంపీరియలిస్ట్‌ గ్లోబలైజేషన్‌, రెవల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, జాయింట్‌ ఆక్షన్‌ ఫోరం ఫర్‌ ఇండిజెనస్‌ పీపుల్‌, కోఆర్డినేషన్‌ ఆఫ్‌ నేషనాలిటీస్‌ అండ్‌ డెమోక్రటిక్‌ మూవ్మెంట్స్‌, ఫోరం అగెనెస్ట్‌ వార్‌ ఆన్‌ పీపుల్‌, కమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌, ఇంటర్నేషనల్‌ లీగ్‌ ఫర్‌ పీపుల్స్‌ స్ట్రగుల్స్‌ వంటి ఎన్నో సంస్థలలో సభ్యుడిగా, కార్యకర్తగా, నాయకుడిగా పని చేశాడు. పీపుల్స్‌ రెసిస్టెన్స్‌, జన్‌ ప్రతిరోధ్‌, ఉద్యమం వంటి అనేక పత్రికలు నడిపాడు. ఎన్నో పత్రికల్లో రచనలు చేశాడు, ప్రచార సాధనాలలో గళం వినిపించాడు. దేశదేశాలలో ఎన్నోచోట్ల ఉపన్యాసాలు ఇచ్చాడు. ఢల్లీిలో దేశవ్యాప్త ప్రజా ఉద్యమాల వ్యాఖ్యాతగా, ప్రతినిధిగా, సమాచార కేంద్రంగా, వారధిగా నిలిచాడు.
అలా భారత ప్రభుత్వం ప్రజల మీద సాగిస్తున్న యుద్ధం గురించి ఢల్లీి వేదికగా దేశవ్యాప్తంగానూ, అంతర్జాతీయంగానూ తెలియజెపుతున్నాడు గనుకనే, దానికి ప్రతిఘటనను కూడగట్టడంలో అగ్రభాగాన నిలిచాడు గనుకనే భారత రాజ్యానికి సాయిబాబా అనే పేరే కంటగింపయింది. ఎలాగైనా ఆయన గళం వినిపించకుండా చేయాలని కుట్రలూ కుహకాలూ మొదలయ్యాయి. ఆనాటి హోమ్‌ మంత్రి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సాయిబాబా పేరు ప్రస్తావించి పాలకవర్గాల కక్షను వ్యక్తం చేశాడు. చివరికి 2013 సెప్టెంబర్‌ లో యూపీఏ ప్రభుత్వపు చివరి రోజులలో మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో ఒక అబద్ధపు కేసును సృష్టించి, ఢల్లీిలో సాయిబాబా ఇంటి మీద దాడి చేసి, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, పుస్తకాలు, తన పరిశోధనా సమాచారం ఎత్తుకుపోయారు. 2014 మేలో మనిషినే ఎత్తుకుపోయి, పాండు నరోటే, మహేష్‌ టిర్కి, విజయ్‌ టిర్కి, ప్రశాంత్‌ రాహీ, హేమ్‌ మిశ్రాలతో కలిపి ఆ అబద్ధపు కేసులో నిందితుడిగా చూపి నిర్బంధించారు. ఏడాది తర్వాత బెయిల్‌ మీద కొద్ది కాలం బైట ఉండగలిగినప్పటికీ, 2017 మార్చ్‌ 7న గడ్చిరోలీ సెషన్స్‌ కోర్టు ఎటువంటి నేరం లేకపోయినా, సాక్ష్యాధారాలు లేకపోయినా ప్రాసిక్యూషన్‌ అబద్ధాలను నమ్మి అత్యంత దుర్మార్గంగా సాయిబాబాకూ మరి నలుగురికీ యావజ్జీవ శిక్ష, ఒకరికి పది సంవత్సరాల శిక్ష విధించింది. ఆ తీర్పు మీద అప్పీలు వినడానికి హైకోర్టు ఐదు సంవత్సరాలు తాత్సారం చేసింది. అలా యావజ్జీవ శిక్ష పడిన ఖైదీగా ఏడు సంవత్సరాల పాటు సాయిబాబాను అండా సెల్‌ లో నిర్బంధించి, అత్యవసరమైన ఆరోగ్య సేవలు అందకుండా చేసి, తక్షణ వైద్యం అందకుండా నిర్లక్ష్యం వహించి, తీవ్రమైన అనారోగ్యం బైటపడినప్పుడు కూడా బెయిల్‌, పెరోల్‌ నిరాకరించి, చివరికి తల్లికి కాన్సర్‌ సోకినప్పుడు, మరణించినప్పుడు కూడా పెరోల్‌ నిరాకరించి, ఉద్యోగం నుంచి తొలగించి అత్యంత అమానుషంగా ప్రవర్తించడంలో పోలీసు అధికారులు, జైలు అధికారులు, ఆస్పత్రి అధికారులు, కాలేజీ యాజమాన్యం, న్యాయవ్యవస్థ అందరికందరూ సాయిబాబాను, వేధించడంలో, హత్య చేసే కుట్రలో భాగమయ్యారు.
చివరికి అసలు కేసు పెట్టడానికి, అరెస్టు చేయడానికి అవసరమైన ప్రాథమిక చట్టబద్ధ అనుమతులే లేవనే సాంకేతిక కారణంతో 2022 అక్టోబర్‌ లో బొంబాయి హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌ కేసును కొట్టివేసి ఆరుగురు నిందితులూ నిర్దోషులని ప్రకటించింది. కాని అప్పటికే సాయిబాబా సహ నిందితుడు, ఆదివాసి పాండు నరోటే జైలులోనే మరణించాడు. నిర్దోషిగా నిర్ధారణ కాకముందే రాజ్యం పాండు నరోటేకు మరణశిక్ష విధించింది. ఆ తీర్పు వచ్చిన కొద్ది గంటలలోనే ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి, అసాధారణంగా శనివారం న్యాయమూర్తులను కూచోబెట్టి, స్టే తీసుకువచ్చింది. ఆ స్టే మీద ఏడాది తర్వాత సుప్రీం కోర్టు, మళ్లీ నాగపూర్‌ బెంచీ లోనే మెరిట్‌ మీద విచారణ జరగాలని అంది. చివరికి నాగపూర్‌ బెంచీ 2024 మార్చ్‌ లో సాంకేతిక కారణాల రీత్యానూ, మెరిట్‌ రీత్యానూ ఈ కేసు చెల్లదని, నిందితులందరూ నిర్దోషులని తీర్పు చెప్పింది.
అలా సాయిబాబా చివరి పది సంవత్సరాలు తన హక్కులను కొల్లగొట్టిన, తన ఆరోగ్యాన్ని ధ్వంసం చేసిన, తన కనీస మానవ స్థితిని భగ్నం చేసిన అమానుష పోలీసు, జైలు, ఆస్పత్రి, న్యాయ వ్యవస్థల మీద పోరాడాడు. జీవితమే పోరాటం అనే మాట అరిగిపోయింది గాని, సాయిబాబా విషయంలో మాత్రం అది అక్షరాలా వాస్తవం. ఆయన జీవితమంతా పోరాటమే. ఆయన జీవితమే పోరాటం.
అలాగే జీవితమే సందేశం అనే మాటకు కూడా ఆయన నిలువెత్తు నిదర్శనం. ఆయన జీవిత సందేశం ప్రజా పోరాటానికి సంఫీుభావం, ప్రజాపోరాటంలో భాగస్వామ్యం, ప్రజాపోరాటం గురించి ప్రచారం, ప్రజా పోరాటానికి వీలైనంత విశాలమైన ఐక్యసంఘటనతో మద్దతు కూడగట్టడం. ఇవాళ ఆయనకు నివాళి అర్పించడమంటే ఆ సందేశాన్ని గ్రహించడమే, మన అవగాహనలోకీ, ఆచరణలోకి తెచ్చుకోవడమే.
దేశంలో మొత్తంగా ప్రజా ఉద్యమాలను, ప్రశ్నను, ఆలోచనను, భిన్నాభిప్రాయాన్ని, ప్రత్యేకంగా ఆదివాసీ ఉద్యమాన్ని చంపివేయడానికి పాలకవర్గ పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. నిర్మూలిస్తాం అని వాయిదాలు పెడుతున్నాయి. ఇది ప్రజలపై పాలకులు సాగిస్తున్న యుద్ధం. ఈ యుద్ధంలో భాగంగానే 1967 నాటి ఊపా చట్టాన్ని (ఆన్‌ లా ఫుల్‌ ఆక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ ఆక్ట్‌ -చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం) నాటి మన్మోహన్‌ సింగ్‌ – చిదంబరం ప్రభుత్వం బైటికి తీసి 2009లో కోరలు పెట్టింది. ఆ తర్వాతి మోడీ-షా ప్రభుత్వం ఆ కోరలకు మరింత పదును పెట్టి విషం పూసి, భీమా కోరేగాం కేసుతో సహా అనేక కేసులు బనాయించింది. ఇప్పటికీ వేలాది మంది విప్లవోద్యమ కార్యకర్తలు, ఆదివాసులు, దళితులు, ముస్లింలు ఈ క్రూరమైన ఊపా చట్టం కింద ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నవారందరినీ ఊపా విషపు కాటుతో హత్య చేయాలని పాలకుల ప్రయత్నం. ఆ వ్యూహానికి కొనసాగింపే ఆపరేషన్‌ సమాధాన్‌, ఆపరేషన్‌ ప్రహార్‌, ఆపరేషన్‌ అనకొండా, ఆపరేషన్‌ కగార్‌ వంటి అనేక యుద్ధ చర్యలతో మావోయిస్టు ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాలను, ఆదివాసులను అణచివేయాలని ప్రభుత్వాలు చేస్తున్న కుటిల యత్నాలు. అటువంటి పాలకవర్గ ప్రయత్నాలన్నిటినీ, ప్రతి ఒక్కదాన్నీ కామ్రేడ్‌ సాయిబాబా, తన వ్యక్తిగత శారీరక ఇబ్బందులను కూడా అధిగమించి ప్రతిఘటించాడు. ఆయన స్మృతిలో మనలో ప్రతి ఒక్కరమూ అనుసరించవలసిన విలువ అది. ఊపా రద్దు, ఊపా కేసుల ఎత్తివేత, ఊపా ఖైదీలందరి విడుదల, ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేత, ఆదివాసుల మీద యుద్ధం ఆపివేత, భారత ప్రజల సామాజిక సంపద అయిన ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే విధానాల రద్దు వంటి డిమాండ్ల మీద విశాల ఐక్యసంఘటనతో సమస్త ప్రజారాశులనూ ఏకం చేసి ఎలుగెత్తడమే, పోరాడడమే కామ్రేడ్‌ సాయిబాబాకు నివాళి.
జోహార్‌ కామ్రేడ్‌ జి ఎన్‌ సాయిబాబా!
కామ్రేడ్‌ జి ఎన్‌ సాయిబాబా ఆశయాలను కొనసాగిద్దాం!
కామ్రేడ్‌ సాయిబాబా స్ఫూర్తిలో ఊపా రద్దుకై పోరాడుదాం!
ఆదివాసులపై రాజ్యం సాగిస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకించడమే కామ్రేడ్‌ సాయిబాబాకు నివాళి!

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.