నేరం, న్యాయం, శిక్ష అన్నీ, హింసే పునాదిగా నడిచే రాజ్యం చేతుల్లో ఆయుధాలైనప్పుడు, సమాజపు అట్టడుగు మనుషుల గొంతుకయ్యే మానవతా వాదులందరూ నిర్బంధించబడుతారు, హత్యలు చేయబడతారు. ఈ హత్యలన్నీ ‘‘రాజ్యాంగబద్ధంగానే’’ జరుగుతూ ఉంటాయి. చీమూ, నెత్తురు లేని మనుషులు మౌనంగా వీటికి అంగీకారం తెలుపుతుంటారు.
ప్రొ. సాయిబాబ చేసిన నేరమేంటి? ఆయనను పదేండ్లు ఎందుకు కఠిన ఏకాంత నిర్బంధంలో పెట్టారు? మీ చట్టం ప్రకారమే పదేండ్ల నిత్య హింస తర్వాత ఆయన ఏ నేరం చేయలేదని ఒప్పుకున్నారు. కానీ జైలుకు వెళ్లక ముందు ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. జైలు హింసనే ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. రాజ్యం కోరుకున్నది ఇదే. ఆయనను కోలుకోలేని పరిస్థితికి నెట్టడమో, చనిపోయేలా చేయడమో. పాండు నరోటె, ఫాదర్ స్టాన్ స్వామి విషయంలో ఇదే చేసింది. భీమా కోరేగావ్ కుట్ర కేసులో అక్రమంగా నిర్బంధించబడిన అనేక రాజకీయ ఖైదీలను మృత్యు ముఖంలోకి నెట్టివేసింది.
సాయిబాబ జైలు నుండి విడుదల అయిన తర్వాత అనేక జాతీయ, అంతర్జాతీయ మీడియా, పౌర హక్కుల సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అన్ని సంభాషణల్లో ఎక్కడా ‘‘అయ్యో నాకే ఎందుకు ఇట్లయ్యింది’’ అనే స్వీయ జాలి (సెల్ఫ్ పిటీ) లేదు. తన అంగవైకల్యం, దాని ద్వారా జైలు జీవితంలో దుర్భలమైన పరిస్థితి గురించి సానుభూతి చూపే వాళ్లకు ఎంతో ధైర్యంగా ‘‘నాకు కావాల్సింది సానుభూతి కాదు, సంఫీుభావం’’ అని చెప్పిన పోరాట వీరుడు. తాను ఏదో గొప్ప పని చేశాననే ఆత్మస్తుతి లేదు. తాను చేస్తున్న పనంతా ఒక నాగరిక మనిషిగా మొత్తం సామాజిక మేలు కోరి చేసే తన విప్లవ ఆచరణలో భాగమే అనుకున్నాడు. ఎక్కడా కించిత్తు భయం కాని, నిరాశగాని లేదు. ఒక తెలుగు ఇంటర్వ్యూలో సాయిబాబను అడిగారు ‘‘మిమ్మల్ని ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడినందుకే పదేండ్లు జైలులో పెట్టారు కదా, మీరు ఇప్పుడు మళ్లీ ఆదివాసుల గురించే మాట్లాడుతున్నారెందుకు?’’ అని. దానికి సాయిబాబ చెప్పిన సమాధానం ఇంకా నా చెవుల్లో మోగుతూనే ఉంది. ‘‘నాగరికుడు అనుకుంటున్న మనిషి అభాగ్యులైన ఆదివాసుల గురించి మాట్లాడకపోతే ఆ నాగరికతకే అర్థం లేదు.’’ సాయిబాబ పోతూ పోతూ మన తెల్ల బట్టల మీద, మన మేధో భుజకీర్తుల మీద, మన ఆత్మస్తుతి మీద, మన అభివృద్ధి భ్రమల మీద, భయాల మీద ఒక ప్రశ్న వేసి పోయాడు. నాగరిక, మానవీయ మనిషిగా ఆ ఆదివాసుల మీద సనాతన, కార్పోరేట్ సర్కార్ సాగిస్తున్న అంతిమ యుద్ధానికి ఎటువైపు నిలబడతావు? అని. వాడు కలగంటున్న వికసిత భారత్ (సారాంశంలో సనాతన భారత్) లో దళితుల, బహుజనుల, మత మైనారిటీల, మహిళల బతుకులేమవుతాయి? అని.
బహుశా ఈ చర్చను మనకు అందించడం కోసమే (ఆయనే అన్నట్లు చిన్న జైలు నుండి పెద్ద జైలుకు) వచ్చి వెళ్లిపోయాడేమో. అనేక ఆరోగ్య సమస్యల మధ్య కూడా వందల మందితో సంభాషించాడు. ఎంతో రాయాల్సి వుందని అనేక ప్రణాళికలు వేసుకున్నాడు. మళ్ళీ తరగతి గదుల్లో పాఠాలు చెప్పాలని ఎంతో ఆత్రుత పడ్డాడు. అవన్నీ ఆగిపోతాయేమో కాని అతను ఎంచుకున్న మార్గం, చూపిన తెగువ ఎప్పటికి ఆగిపోవు. రాజ్యమా సిగ్గుపడు! నువ్వు చంపింది ఒక మానవతావాదిని. ప్రొ. సాయిబాబను భౌతికంగా లేకుండా చేయగలిగావు, కానీ ఆయన స్ఫూర్తిని చంపే శక్తి నీకుందా? సోక్రటీస్ దగ్గర నుండి అంటోనియో గ్రాంసీ, ఆ తర్వాత ఎందరో ప్రజా మేధావులను, ఉద్యమకారులను చంపగలిగావు కానీ వాళ్ల దారిని చెరిపేయగలిగావా? అది నీ వల్ల అవుతుందా?! చరిత్ర ఏం చెబుతుందో తెలియదా? అంతిమ యుద్ధంలో ప్రజలే విజేతలు! ఆ ప్రజల గొంతుకై, వాళ్ళ కోసం పరితపించిన ప్రపంచ మానవుడు, అమరుడు ప్రొ.జి.ఎన్. సాయిబాబకు జోహార్లు! తోటి మనిషి గురించి, ప్రకృతి గురించి ఆలోచించే, ఆరాటపడే మనుషులు ఉన్నంతవరకూ నీవు బతికే వుంటావు. అమర్ రహే ప్రొ. సాయిబాబ! నీ అంతిమ యాత్రలో నడవలేనోమో కాని, నీవు సాగిన దారే మాదారి!