గోడ మీది బొమ్మ

 వారణాసి నాగలక్ష్మి
గోడ మీద కాలెండర్‌ గాలికి రెపరెపలాడుతోంది. దానిలో అమ్మభుజం మీద నిద్రపోతున్న పసివాడూ, మమకారం వెల్లువవుతున్న కళ్ళతో వాణ్ణి చూసుకుంటున్న తల్లీ కనిపిస్తున్నారు. పురుషోత్తం కోసం ఎదురుచూస్తూ కూర్చున్న నిర్మల దృష్టి కాలెండర్‌ మీద పడింది. ‘ఎంత ముద్దొస్తాడో బుజ్జిముండ! ఎంత నిశ్చింత వాళ్ళమ్మ దగ్గర!’ అనుకుంది. మంచం మీద హాయిగా నిద్రపోతున్న నందూని చూస్తూ ‘బుజ్జిగాడు పెద్దవాడైపోకముందే వాణ్ణెత్తుకుని ఇలాంటి ఫొటో ఒకటి తీయించుకోవాలి… ఎన్నిసార్లు అడిగినా ఇవాళా, రేపూ అంటాడు వాళ్ళ నాన్న’ అసంతృప్తిగా, నిష్ఠూరంగా అనుకుంది. నిద్రలోనే నందూ పెదవులమీద బోసినవ్వు కదిలింది. నిర్మల మొహంలో మమత పొంగింది. చీకూచింతా లేని లోకంలో విహరిస్తున్న చిన్నవాణ్ణి కదపాలనిపించలేదు. కానీ తప్పదు. అప్పటికే వంటిల్లు సర్దేసి వాడికి కావలసినవన్నీ బుట్టలో సర్ది ఉంచింది. ఆటో కోసం వెళ్ళిన పురుషోత్తం వచ్చేసరికి అంతా రెడీగా ఉండాలి! మనసంతా ముడుచుకుపోయింది.
‘అక్కడంతా ఎలా ఉంటుందో ఏమో! ఆ కళ్ళజోడాయన అన్నట్టు స్టంటు సీన్లూ, కత్తులూ, కటార్లూ ఉంటాయేమో! చంటి వెధవ దడుసుకుంటాడో ఏమిటో! ఛీ… అనవసరంగా దీన్లో దిగడమైంది’ అనుకుంది అశాంతిగా.
ఆటోకోసం బజారువైపు నడుస్తున్న పురుషోత్తం ‘దశ తిరిగే సూచనలు చాలానే కనిపిస్తున్నాయ్‌ ఈ మధ్య, అనుకున్నాడు ఉత్సాహంగా. ‘అన్నీ అనుకున్నట్టే జరుగు తున్నాయ్‌!’ ఈ నిమ్మీ కుక్కపిల్లనొకర్తినీ సరిగ్గా మానేజ్‌ చెయ్యాలి’ అనుకున్నాడు భార్యని తలుచుకుని కొంచెం చిరాకుపడుతూ. నాలుగడుగులు వేసేసరికి రోడ్డు పక్కగా ఆగి ఉన్న ఆటో కనిపించింది. వెనకసీట్లో కూర్చుని పేపరు చదువుకుంటున్నాడు డ్రైవర్‌. మనసులో ఆశ్చర్యపోతూ ‘సారధీ స్టూడి యోస్‌కి వస్తావా?’ అనడిగాడు పురుషోత్తం. ఎక్కమన్నట్టు చెయ్యి చూపించి ముందు సీట్లోకి మారాడు ఆటో అతను.
ఇంటిదారి చెపుతూ ”ఏంటోయ్‌ విశేషాలు పేపర్లో?” అడిగాడు.
”ఏవుఁంటాయండి? హత్యలూ, దోపి డీలూ, రేప్‌లూ! సగం పేపర్‌ ఇవే! ఇంకపోతే ప్రతిపక్షాల ఆరోపణలూ, నేతల హామీలూ, సినిమా కబుర్లూ మిగతా సగం” అన్నాడు ఆటో అతను చప్పరిస్తూ.
”మిగిలినయన్నీ మనకెందుకులే… సినిమా విశేషాలేంటీ? మన ఫీల్డు అదేగా!” అన్నాడు కాలర్‌ సర్దుకుంటూ గొప్పగా. ఆటో అతను ఓరకంట పురుషోత్తాన్ని చూస్తూ ” ‘నువ్వే నేను’ సినిమా చూశారా సార్‌?” అడిగాడు.
”మూడుసార్లు చూశానయ్యా బాబూ! సూపర్‌హిట్‌ మూవీ కదా. ఏంటీ న్యూసు?” ఆసక్తిగా అడిగాడు.
”అందులో గుఱ్ఱం మీద ఫైటింగు సీనుంది చూశారా? దాని మీద ఏదో గొడవైందంట సార్‌. యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు వాళ్ళు ఆ సినిమా ఆడ్డానికి వీల్లేదని కేసు పెట్టారంట!”
”ఎందుకో?”
”ఆ బోర్డువాళ్ళ పర్మిషన్‌ లేకుండా జంతువుల చేత యాక్టింగు చెయ్యించ కూడదంట సార్‌!”
”ఏందయ్యా వీళ్ళ గొడవ? రేపు సిన్మాల్లో ఆవుల్నీ, గేదెల్నీ చూపించినా గొడవ లేపేలా ఉన్నారే?” హేళనగా అన్నాడు పురుషోత్తం.
”హింసపెట్టి జంతువుల చేత యాక్టింగు చేయించేది నేరమంట సార్‌.”
”ఏడిసినట్టుంది! వాటిమీద బరువులేసి మోయిస్తేనూ, పొలం పనులు చేయిస్తేనూ తప్పులేదా? సిన్మాలో హీరోగారితో సమంగా యాక్ట్‌ చేయిస్తే తప్పా?” వెటకారంగా నవ్వి ”అదిగో… ఆ షాపు పక్కనాపు” అన్నాడు.
భుజాలెగరేసి ఆటో ఆపాడు డ్రైవర్‌. పిల్లాడితో నిర్మల ఎక్కగానే ఆటో కదిలింది. కొంత దూరం పోయాక నిర్మల మొహం వైపు చూశాడు పురుషోత్తం. మామూలుగా అతనామె మొహం వైపూ, కళ్ళ వైపూ చూడడు. వాటిలో ప్రస్ఫుటమయ్యే ఆమె మనోభావాలతో అతనికి పనిలేదు. అతని ఆలోచనలన్నీ తన ఇష్టం, తన అవసరాలు, తన నిర్ణయాలు… వీటి చుట్టూ తిరుగు తాయి. నిర్మల మొహం చూడగానే ఎర్రబడ్డ కళ్ళూ, ముక్కూ కనిపించి చిర్రెత్తుకొచ్చిందతనికి.
”ఆ దరిద్రగొట్టు మొహం ఏందే? నీ కొడుక్కాకపోతే కో అంటే కోటిమంది దొరుకుతారే వాళ్ళకి! మాటలు కూడా రాకముందే వాడు సిన్మా హీరో అవుతున్నాడే ఎర్రిమొహవాఁ! హాపీగా పార్టీ చేసుకునేది పోయి ఏడిచ్చస్తున్నావు! అక్కడ నీ మొహం చూశారంటే మన్ని వచ్చిందారినే పొమ్మంటారు!” తగ్గుస్థాయిలోనే కటువుగా నిర్మలమీద అరిచాడు పురుషోత్తం.
ఆటో అతను ముందున్న అద్దంలోంచి వెనక సీట్లోకి చూశాడు. ఎర్రబడ్డ కళ్ళు తుడుచుకుంటోందామె. ఒడిలో ఏడాది దాటిన పిల్లాడు బుగ్గన చుక్కతో బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. నల్లటి కళ్ళతో ప్రపంచాన్ని విస్మయంగా చూస్తున్నాడు. చిరాగ్గా చూపు ముందుకి సారించిన పురుషోత్తం కళ్ళు ఆటోవాడి కళ్ళతో కలిశాయి. మొహం చిట్లించి ”నువ్వు పోనీవోయ్‌” అని కసురుకున్నాడు.
ఆటోవాడు స్పీడు పెంచి, ”ఆ మాటకొస్తే జంతువులు నటించిన సిన్మాలన్నీ గొడవల్లో పడ్డవే సార్‌. హాథీ మేరే సాథీ కాణ్ణుంచి లగాన్‌, జోధా అక్బర్‌ దాకా అన్ని సిన్మాలూ కేసుల్లో ఇరుక్కున్నవే” అన్నాడు పాత సంభాషణ కొనసాగిస్తూ.
”అసలేంటయ్యా వీళ్ళ గొడవ?” చిరాకుపడ్డాడు పురుషోత్తం.
”ఏమో సార్‌! రోజుకింతసేపే పని చేయించాలనీ, షూటింగు స్పాట్‌లో పశువుల డాక్టరుండాలనీ ఏవో రూల్సున్నాయంట సార్‌. ఆ జంతువులకే ఇబ్బందీ లేకుండా నటన రాబట్టుకోవాలంట!” అపుడే చదివిన వివరాలన్నీ అప్పచెప్పాడు ఆటోవాడు.
‘నయం! చంటిపిల్లల్ని సినిమాల్లోకి తీసుకోకూడదని రూలు పెట్టారు కాదు! జలుబు చేసినా, దగ్గొచ్చినా నటించడానికి లేదనీ, కళ్ళమీద లైట్లు వెయ్యకూడదనీ, చెవుల్లో చప్పుడవకూడదనీ రూల్సు పెట్టారంటే మన నోట్లో మన్నే’ అనుకున్నాడు పురుషోత్తం పిల్లాడిని చూస్తూ. అన్యమనస్కంగా ఉన్న నిర్మలను గమనిస్తూ ‘ఇదిగాని విందంటే ఏవో పిచ్చి కండిషన్లు పెట్టి నస మొదలెడుతుంది. ఎవడో లాయరు దగ్గరకి పోయి కేసుపెట్టినా ఆశ్చర్యం లేదు’ అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే ‘వెర్రిమొహంది… దీనికంత సీను లేదుగాని, ఈ టాపిక్‌ ఇంక కట్టిపెడితే మంచిది’ అనుకుని ”ఎవళ్ళ గొడవో మనకెందుకులే! త్వరగా పోనీ” అన్నాడు.
నిర్మల మనసు గతంలో తిరగాడు తోంది. పురుషోత్తం పనిచేస్తున్న ఫాక్టరీ మూతపడే స్థితికి రావడం, సరిగా అప్పుడే ”ఎప్పటికీ నీకోసం” సినిమాలో ఏడాది పిల్లాడి పాత్ర కోసం ముద్దులొలికే పిల్లాడు కావాలని పేపర్లో ప్రకటించడం, వాళ్ళడిగినట్టుగా పిల్లాడి ఫొటోలు, ఇతర వివరాలతో కవరు పోస్టు చెయ్యడం, ఎన్నాళ్ళో ఎదురుచూశాక వాళ్ళనించి స్క్రీన్‌ టెస్టు కోసం ఆహ్వానం రావడం వరసగా గుర్తొచ్చాయి. పిల్లాడిని తీసుకుని తనూ, భర్తా సారథీ స్టూడియోస్‌కి వెళ్ళడం గుర్తొచ్చింది. పెద్దపెద్ద రేకుల నిర్మాణాలు, షెడ్‌లూ, చక్రాల మీద ట్రాక్స్‌ మీద కదిలే కెమెరాలు, వాటిని నడుపుతూ వింత భాష మాట్లాడే టెక్నీ షియన్లూ… అదో కొత్త ప్రపంచంలా కని పించింది. తమలాగే చంటిపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు ఓపిగ్గా నిరీక్షించడం, హీరో యిన్‌ అవస్థపడుతూ ఎత్తుకోగానే పసివాళ్ళు ఏడవడం, ఆ ఏడుపు పట్టించు కోకుండా మైక్‌లో వినిపిస్తున్న పాటకి అనుగుణంగా హీరోయిన్‌ అడుగులు వెయ్యడం తను ఎపుడూ చూడని ప్రపంచం అది!
పైకి సరదాగా పలకరించుకుంటున్నట్టే ఉన్నా అక్కడున్న తల్లిదండ్రులంతా ఒకరినొకరు ప్రత్యర్థులా చూసుకోవడం, ఆ పిల్లలతో నందూని పోల్చుతూ ”వీళ్ళంతా బేకారుగాళ్ళే! మనవాడితో పోటీకెవరూ లేరు. వాడిదంతా వాడి బాబు పోలిక!” అని పురుషోత్తం తన చెవిలో చెపుతూ కాలర్‌ ఎగరేయడం తలుచుకుంది నిర్మల. అప్పటి వరకు తను సంతోషంగానే ఉంది నిజానికి. ఒంటిగంటకి కారియర్లలో భోజనాలు వచ్చాయి. ”అంతా భోజనానికి రండి సార్‌” అని కాటరింగు వాళ్ళు పిలవగానే ”మగపెళ్ళివారిలా ఉంది మన పని” అన్నాడు పురుషోత్తం.  దాంతో ”షూటింగంటే మజాకా కాదండి. పెళ్ళికెళ్ళినట్టుంటుందనుకున్నారేమో! చంటిపిల్లలు ఈ లైట్ల వెలుగులూ, వేడీ తట్టుకోలేరు. ఫైటింగు సీన్లలో పిల్లాడ్ని ఎగరేసి పట్టుకోడాలూ, కత్తులూ, పిస్తోళ్ళూ, ఎత్తుకోడం చేతకాని పిల్ల హీరోయిన్ల చేతుల్లో చంటివాళ్ళు ఉక్కిరిబిక్కిరైపోవడం… ఎందుకొచ్చిన అవస్థ అనిపించినా, సినిమా అంటే మోజూ, వాళ్ళిచ్చే డబ్బంటే ఆశా… ఏవంటారు?” అన్నాడు పురుషోత్తం పక్కన కూర్చున్నతను.
అప్పటిదాకా సినిమాల్లో ఉయ్యాల సీన్లు, పసివాడికి అటూ ఇటూ హీరో హీరోయిన్ల చిలిపి సరసాలూ… వీటి గురించే ఆలోచిస్తున్న తనకి పసివాడిని లాక్కుని పారిపోయే సన్నివేశాలూ, గూండాల భయంకరాకారాలు, ఏడ్చేడ్చి కందిపోయిన పిల్లల మొహాలూ గుర్తొచ్చాయి. తిండి కూడా తినాలనిపించలేదు. వెళ్ళిపోదామని పురుషోత్తం వెంటపడింది ప్రాధేయపడుతూ. అతనికెంత కోపం వచ్చిందో!
”ఏంటే? ఆ కళ్ళజోడు వాడి మాటల్లో పడ్డావా? వాడి కొడుకుని చూశావా? ఎలక పిల్లాడిలా ఉన్నాడు. మనవాడితో పోటీ చెయ్యలేక ఆ ఏడుపు!” అని కసిరాడు. ”వీడు సెలక్టయితే కదా కావాలో వద్దో మనం డిసైడయేది? ఆ టెస్టేదో కానీక ఏంటి నీ నస?” అని గదిమాడు. దాంతో ఏమీ అనలేకపోయింది తను.
నందూ వంతు వచ్చేసరికి తన ఒళ్ళో హాయిగా నిద్రపోయి లేవడం వల్ల వాడు మంచి మూడ్‌లో ఉన్నాడు. వెలుగులన్నీ వింతగా చూస్తూన్న వాడినెత్తుకుని వెనక వినిపిస్తున్న సంగీతానికి అనుగుణంగా నాలుగడుగులు వేసి హీరోయిన్‌ వెళ్ళిపోయింది. సరిగ్గా వారం రోజుల్లో ఆనందుబాబు సెలక్టయ్యాడని తెలియడం, వెంటనే వెళ్ళి పట్టలేని ఆనందంతో వాళ్ళ షరతులన్నిటికీ పురుషోత్తం ఒప్పేసుకుని రావడం… అక్కడికీ తను అడిగింది ”కథేమిటి? ఫైటింగు సీన్లుంటాయా?” అని.
”ఎహె… ఫైటింగు సీన్లుంటే ఈడు చేస్తాడా ఫైటింగు? దేనికి సంతోషించాలో దేనికియాడవాలో తెలిసి చావదు నీకు” అని తన మీద చిరాకుపడ్డాడు.
”ఫైటింగుంటే ఇరవైవేలు కాదు. లక్ష ఇస్తామన్నా మనకొద్దు” అని తను మొండికేస్తే.
”డబ్బంటే లెక్కలేనట్టు మాట్టాడుతున్నావేంటే ఇయాళ? లక్షంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలో తెలుసా? నాకు వీడు ‘బాడ్‌లక్‌’ తెచ్చాడనుకుని బాధపడుతుంటే ఎంత లక్కిఫెలోనో ఇపుడు తెలిసింది! నువ్విట్టా అడ్డం కొట్టకుండా ఉంటే వీడెంట నాక్కూడా సినిమాల్లో ఛాన్స్‌ దొరుకుతుంది” అని నచ్చచెప్పాడు. ఇన్నాళ్ళకి అతను ‘లక్కిఫెలో’ అంటూ కొడుకునెత్తుకుని ముద్దులాడుతుంటే నిజానికి తనకెంతో ఊరటగా ఉంది. అదేకాక తనెంత కాదన్నా అతను వినడని కూడా తెలుసు. అతన్నెంత ఎదిరిస్తే తన కాపురంలో అంత ఘర్షణ తప్పదు. ఎంత నచ్చని విషయంలోనైనా తన ప్రతిఘటన వర్షానికి తలెత్తే పుట్టగొడుగు లాంటిదే. దానికి బలం లేదు. అందుకే ఎప్పటిలాగే తన దిగులు మనసులోనే అదిమేసి అతను చెప్పినట్టు చెయ్యడానికి సిద్ధపడింది.
దాని ఫలితమే ఇవాల్టి ప్రయాణం. భర్త చివాట్లు పెట్టగానే ఒళ్ళో ముద్దులొలుకు తున్న నందూని చూస్తూ, ‘తనే అనవసరంగా బెంగ పడుతోందేమో, అక్కడంతా హాయిగా సాగిపోతుందేమో’ అని మనసు సమాధాన పరుచుకుంది నిర్మల. వాళ్ళు షూటింగు స్పాట్‌ చేరేసరికి తొమ్మిదైంది. పదకొండింటిదాకా ఎదురుచూశాక హీరోయిన్‌ ‘కమోనీ మేడమ్‌’ వచ్చింది. ‘ఆనందుబాబుకి మేకప్‌ చెయ్యాలి, తీసుకు ర’మ్మన్నారు హడావుడిగా. మేకప్‌రూమ్‌లో వాడికి పౌడర్‌ రాసి, బుగ్గన పెట్టిన చుక్క తుడిచేసి, నల్లటి బొట్టుబిళ్ళ అంటించారు. డైపర్‌ వేసి సిల్కుజుబ్బా, పైజమా తొడిగారు. మెళ్ళో రెండు గొలుసులు వేశారు. అరగంట తాత్సారం తర్వాత జోలపాట సీను మొదలైంది. ఆ లైట్ల వేడికీ, అలవాటులేని మొహాలని చూసీ ఆపకుండా ఏడ్చాడు నందూ. అనుకున్న ఎఫెక్ట్‌ కోసం చాలాసేపు తంటాలు పడ్డారు. ఎయిర్‌కూలర్‌ దగ్గర కూర్చోపెట్టుకుని, ఇంటినుంచి తెచ్చిన పప్పు అన్నం, పెరుగన్నం తినిపించింది నిర్మల. తర్వాత కొంచెం అస్థిమితంగా ఉన్నా అపుడపుడు కొద్దిగా నవ్వుమొహం పెట్టడంతో జోలపాట మొదటి చరణం పూర్తిచేశారు. చివరికి హీరో హీరోయిన్లు బాబునెత్తుకుని పకపకా కిలకిలా నవ్వుతుంటే సీను ముగిసింది. ఆఖర్లో పిల్లవాడు ఏడ్చినా వాడి మొహం కనపడకుండా షూట్‌ చేసి ‘పాకప్‌’ చెప్పారు.
మరునాడు బయల్దేరినప్పటినుంచి ఫిలింసిటీ చేరేదాకా హాయిగా పడుకున్నా, అక్కడ తోటల్లో హీరోయిన్‌తో పాట సీన్లో మాత్రం ఆపకుండా ఏడ్చాడు నందూ. చమ్కీల చీరలో ఉన్న హీరోయిన్‌ వాడిని ఎత్తుకుని అడ్డదిడ్డంగా పరుగెడుతుంటే నిర్మలకి తట్టుకోవడం కష్టమైంది. ఆ చీరమీది చమ్కీలన్నీ నిర్మల గుండెల్లో కత్తుల్లా గుచ్చుకున్నాయి. పురుషోత్తం మాత్రం టీకాఫీలందించే కుర్రాళ్ళమీద అధికారం చెలాయిస్తూ, భోజనం దగ్గర అడిగి వడ్డించు కుంటూ హాయిగా గడిపాడు. షూటింగు ఆగినపుడల్లా పరుగెత్తుకెళ్ళి పిల్లాడిని అందుకుంటున్న నిర్మలని చూసి, ”నీ ఆత్రం కూలా” అని పకపకా నవ్వాడు. షూటింగు పూర్తయాక సిటీకొస్తున్న వేన్‌లలో ఒక దానిలో ఎక్కి ఇల్లు చేరారు. పురుషోత్తం ఉల్లాసంగా ఈలపాట పాడుకుంటుంటే పిల్లాడిపనీ, ఇంటిపనీ పూర్తిచేసుకుని అలసిపోయి నిద్రపోయింది నిర్మల.
మర్నాడు కూడా అదే విధంగా ఫిలింసిటీ చేరారు. డైరెక్టరు సీను వివరిస్తుంటే ఇద్దరూ శ్రద్ధగా విన్నారు. ముందుగా మార్కెట్‌లో షాపింగు చేస్తున్న హీరోయిన్‌ చేతిలో పసివాడిని గూండాలు లాక్కుని పారిపోవడం వరకు తీస్తామనీ, తర్వాతి సీన్లలో హీరోయిన్‌ కేకలు విని పోలీసులు వాళ్ళ వెంటపడతారనీ, గూండాలు పారిపోయి రైల్వేస్టేషన్‌ చేరతారనీ, అక్కడ రైలుపట్టాలకడ్డంగా కొంత ‘ఛేజింగు సీను’ నడుస్తుందనీ, అపుడు హీరో ‘ఎంటరవు తాడనీ, ట్రైన్‌లో ఫైటింగు తర్వాత ఒక గోడౌన్‌లో గూండాలందర్నీ మట్టికరిపించి, పసివాడిని రక్షిస్తాడనీ, చివరికి ఎయిర్‌ పోర్టులో చంటివాడితో సహా హీరోహీరోయిన్లు విమానం ఎక్కుతారనీ కథ వివరించారు. వింటున్న నిర్మల గుండెల్లో రాయిపడింది, కళ్ళవెంట బొటబొటా నీళ్ళు కారిపోయాయి. డైరెక్టర్‌ అది చూస్తూనే
”ఎందుకమ్మా అంత భయపడ్తారు? ఎక్కడా బాబుకిబ్బంది కలగనివ్వం. మామీద నమ్మకం ఉంచండి” అన్నాడు. ఆ మాత్రానికే చల్లగాలి సోకిన మేఘంలా భోరుమంది నిర్మల.
”వద్దండి సార్‌ మా బాబుకిదంతా! ఇంకెవరికేనా ఇచ్చెయ్యండి ఈ వేషం. మాకొద్దుసార్‌ ప్లీజ్‌!” అంది ఏడుస్తూ. చుట్టూ టెక్నీషియన్స్‌ పోగయ్యారు. ”ఏమైంది?” అంటూ నిర్మాత వచ్చాడు. విషయం అర్థం కాగానే.
”ఏందయ్యా పురుషోత్తం? అంతా చెప్పి ఆమె ఒప్పుకున్నాకే తీసుకొచ్చా నన్నావ్‌? సగం షూటింగయ్యాక వేలకొద్దీ ఎడ్వాన్సు గుంజి, ఇప్పుడిట్టా అంటే ఎట్టా?” అన్నాడు కోపంగా.
పురుషోత్తం నిర్మల దగ్గరకొచ్చి, భుజం చుట్టూ చెయ్యేసి, ”ఏంటదీ అట్టా భయపడ్తావ్‌? పిల్లాడు ఏడవకుండానే పెద్దోడవుతాడా ఏంది?” అన్నాడు నవ్వుతూ బుజ్జగిస్తున్నట్టు. అతని లోపల రగులుతున్న కోపం అంతా ఎడమవైపునించి ఆమెని చుట్టి, ఆమె కుడి భుజాన్ని పట్టుకున్న చేతివేళ్ళలోకి చేరింది. బొటనవేలిని ఆమె జబ్బలోకి బలంగా నొక్కుతూ, మిగిలిన వేళ్ళన్నంటినీ కసిగా ఆమె భుజం చుట్టూ బిగించాడు. ఆ చర్య ఇస్తున్న సూచనని గ్రహించగానే నిస్సహాయంగా దుఃఖాన్ని దిగమింగింది నిర్మల. రోజంతా మార్కెట్‌ సీను షూటింగు నడిచింది. గూండాలు ఎత్తుకుని పారిపోతుంటే పిల్లవాడు ఏడవడం సహజంగానే ఉంటుంది గనుక నందూ ఏడుస్తున్నా పట్టించుకోకుండా షూటింగు సాగించారు. భారంగా ఇల్లు చేరేసరికి రాత్రయింది. ఓవైపు అన్నం వండుతునే రెండోవైపు నీళ్ళుకాచి నందూకి స్నానం చేయించి, అన్నంపెట్టి వాడిని పడుకో బెట్టింది నిర్మల. అంతవరకు బోనులో సింహంలా ఆగాడు పురుషోత్తం. తన బాధలో అతని ఆగ్రహాన్ని గమనించని నిర్మల నీరసంగా పిల్లవాడిని నిద్రపుచ్చి రాగానే ”ఏందే? ఏంది నీ వేషం? చిలక్కి చెప్పినట్టు చెప్పినా ఆడ నీ లెక్కేందని ఎదవేడుపు లేడు స్తావా? ఈ ఏషంగాని చెయ్యి జారిందంటే నిన్ను నరికి పారేస్తా” అన్నాడు ఆమె జుట్టు పట్టి బలంగా వెనక్కి గుంజుతూ.
ఎర్రటి జీరలు తేలిన ఆ కళ్ళు చూస్తూ దిమ్మెరపోయింది నిర్మల. ఇదివరకెపుడూ అతను తనమీద చెయ్యి చేసుకోలేదు. కుడిభుజం మీద అతను నొక్కిపట్టుకున్నచోట ఇంకా నెప్పిగానే ఉంది. ఇప్పుడిలా! ఇంక ఈ సినిమా వేషం నుంచి తన కొడుకు తప్పించుకోలేడని ఆమెకర్థమైంది. చికిత్స అసాధ్యమైన రోగాన్ని నోరుమూసుకుని భరించినట్టు గుండెరాయి చేసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. అన్నం వడ్డించ గానే కడుపునిండా తిని బ్రేవ్‌మని త్రేన్చుతూ అతను చెయ్యి కడుక్కుంటే నిర్మల కడుపులో తిప్పినట్టైంది. కంచాలూ, గిన్నెలతో పాటు కళ్ళూముక్కు కూడా కడుక్కుని పని ముగించుకొచ్చి, పిల్లవాడి పక్కన పడుకునే సరికి పురుషోత్తం రంగులకలల్లో తేలుతూ నిద్రపోతున్నాడు. సొమ్మసిల్లి పడుకున్న పసివాడి ఒంటిమీద అద్దాలూ, చమ్కీలూ గుచ్చుకుని కమిలిన గుర్తులు కనిపించాయి. పదిలంగా వాడిని దగ్గరగా పొదువుకుని పడుకున్న నిర్మల కళ్ళనుండి వెచ్చని కన్నీళ్ళు కారిపోయాయి.
తెల్లవారుజామున నందూ ఒళ్ళు వేడిగా తగిలి మెలకువ వచ్చింది నిర్మలకి. కంగారుగా భర్తని లేపింది. చిరాకుపడుతూ లేచాడు పురుషోత్తం. పిల్లాడి జ్వరం సంగతి తెలియగానే తన రంగులకల కాస్తా చెల్లా చెదురైనట్టనిపించిందతనికి. త్వరగా సినిమా తయారై రిలీజైతే కొత్త అవకాశా లొస్తాయని ఎదురుచూస్తుంటే వీడు కాస్తా జ్వరం తగిలించుకున్నాడని విసుగేసింది. ”వెళ్ళి ఆ క్రోసిన్‌ సీసా పట్రా” అన్నాడు నిర్మలతో. రెండు చెంచాల సిరప్‌ పిల్లాడికి తాగించి అతను మళ్ళీ నిద్రపోతే, తన చల్లని చేతుల్తో వాడి నుదురూ, పాదాలూ వత్తుతూ వాడి పక్కనే వాలిందామె.
పొద్దున్నే పురుషోత్తాన్ని లేపి కాఫీ అందిస్తూ ”ఇవాళ షూటింగొద్దు. ఒక్కరోజు ఆగుదాం” అంది నిర్మల బ్రతిమాలుతూ.
ఆమెని పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తూ ”ఎనిమిదింటికి వేన్‌ వస్తుంది. రెడీగా ఉండు!” అన్నాడు ఎక్కువ మాటలు అనవసరం అన్నట్టు. వీధిలో వేన్‌ ఆగుతూ కనపడగానే ”సెట్స్‌ మీద వీడి జ్వరం మాట ఎత్తావో నా అంత విలన్‌ ఇంకోడుండడు జాగ్రత్త!” అన్నాడు కరుగ్గా. నందూకి మళ్ళీ క్రోసిన్‌ తాగించి, ఆ సీసా కూడా బుట్టలో పెట్టుకుని వేన్‌ ఎక్కారిద్దారూ.
ఫిలింసిటీలోని రైల్వేస్టేషన్‌లో ఆ రోజు షూటింగు జరిగింది. పోలీసులు వెంటాడుతుంటే గూండాలు పట్టాలకడ్డంగా పరుగెట్టడం, పోలీసులకి అందకుండా పిల్లవాడిని ఒకరి చేతుల్లోంచి ఇంకొకరి చేతుల్లోకి ఎగరేసినట్టుగా అందించడం… రకరకాలుగా షూటింగు సాగింది. మధ్యలో విరామం దాకా ప్రార్థించుకోవడం, విరామసమయంలో పరుగెత్తుకెళ్ళి పిల్లవాడిని అందుకోవడం… నిర్మల ఉన్మత్తురాలిలా గడిపింది రోజంతా. పిల్లాడు నవ్వాల్సిన పనిలేదు గనుక, వాడు ఏడుస్తున్నా సొమ్మసిల్లి ఉన్నా షూటింగు సాగిపోయింది. నిర్మల కూడా మౌనంగా వాళ్ళకు సహకరించింది ఎలాగోలా ఇది పూర్తై, దీన్నించి బయట పడాలని.
సాయంత్రం షూటింగు పూర్తయేసరికి పిల్లాడికి మళ్ళీ జ్వరం వచ్చింది. రాత్రికి దగ్గూ, జలుబూ వచ్చాయి. ముక్కుకారిపోతూ నీరసంగా ఏడుస్తున్న నందూని చూసి ఏమనుకున్నాడో దగ్గర్లో ఉన్న పిల్లల డాక్టర్‌ దగ్గరకి తీసుకెళ్ళాడు పురుషోత్తం. అతను తెచ్చిన మందులు జాగ్రత్తగా తాగించి, మెత్తటి ఇడ్లీ తినిపించి పడుకోబెట్టింది నిర్మల. దేనికీ ఎదురుచెప్పకుండా మౌనంగా పనులు చేసుకుంటున్న భార్యని చూసి, దారిలో పడిందని సంతోషించాడు పురుషోత్తం.
తెల్లవారినా నందూకి జ్వరం తగ్గలేదు. కొంతసేపు ఆలోచించి సినిమావాళ్ళకి ఫోను చేశాడు పురుషోత్తం. విషయం వినగానే ”అయ్యో! కమోనీ మేడం డేట్స్‌ చాలా కష్టం మీద దొరికాయి సార్‌… ఎట్టా మరి? హీరోయిన్‌ ఉన్న సీన్లు మాత్రం తీద్దాం లెండి ఈ ఒక్కరోజు. తర్వాత రెండ్రోజులు బ్రేక్‌ ఇవ్వచ్చు. మన యూనిట్‌లో డాక్టరున్నాడు. గంటా రెండు గంటల్లో బాబు పోర్షన్‌ పూర్తిచేసేద్దాం” అన్నారు.
అలవాటైన పద్ధతిలో మళ్ళీ పురుషోత్తం తిట్లు తిని, శరీరాన్నీడుస్తూ తయారైంది నిర్మల. నలతగా ఉన్న నందూని చూస్తూనే యూనిట్‌లో అంతా ‘అయ్యో’ అన్నారు. నిర్మాత కూడా వచ్చి బాబు సీన్లన్నీ చకచకా పూర్తిచేసేసి స్పెషల్‌వాన్లో ఇంట్లో దింపేయమని సూచనలిచ్చాడు. ముందు హీరోహీరోయిన్లు బాబుతో విమానమెక్కే సన్నివేశం పూర్తిచేసి, తర్వాత గోడౌన్‌లో హీరో గూండాలతో తలపడుతుంటే, పిల్లాడిని గుండెకు హత్తుకుని పరుగులతో వచ్చి హీరోయిన్‌ కార్లో కూర్చునే సీను పూర్తి చేశారు. కక్కటిల్లిపోతూ ఏడుస్తున్న నందూతో సీన్‌ చాలా సహజంగా వచ్చింది. చెవులకి పెద్ద పెద్ద జూకాలు, మెడలో యాంటిక్‌ నగలు, అద్దాల చీరతో ఎండలో తళతళ లాడుతున్న కమోనీ టిస్యూ పేపర్లతో చెమట తుడుచుకుంటూ వచ్చింది. మనసు లో చీదర అంతా ముఖంలో కనిపిస్తుంటే ”అబ్బ! ఏం ఏడుపురా నాయనా! చెవి గింగు ర్లెత్తిపోయింది” అంది కార్లో కూర్చుంటూ.
”ఈ ఎండల్లో ఈ డ్రెస్సూ, మేకప్పూ, వీటికి తోడు చెవిలో ఏడుస్తున్న పిల్లాడితో పరుగెట్టడం!” నవ్వుతూ ఫిర్యాదు చేసి, కారు తలుపేసుకుంది. ఏడ్చేడ్చి సోలిపోయిన చంటివాడిని గుండెకి హత్తుకుని చేదెక్కిన మనసుతో వేన్‌ ఎక్కింది నిర్మల.
వారంరోజులపాటు జ్వరం తగ్గు ముఖం పట్టలేదు. భయంతో ఉలికిపడుతూ, నసగా ఏడుస్తున్న పిల్లవాడిని కనిపెట్టుకుని సరైన నిద్రా, తిండీ లేకుండా శుశ్రూష చేసింది నిర్మల. జ్వరం తగ్గేసరికి నందూ చిక్కి సగమయ్యాడు. ‘ఇంక సినిమా యూనిట్‌ నుంచి ఫోనొచ్చేస్తుందేమో’ అని నిర్మల భయపడుతుంటే ‘ఇంకా ఫోను రాలేదు’. ఇంకెవర్నేనా పెట్టేసుకున్నారేమో అని పురుషోత్తం భయపడ్డాడు. ఇంక ఆగలేక అతను సినిమా ఆఫీసుకి వెళితే, ఏం ఉపద్రవం తెస్తాడో అని భయపడుతూ ముందుగదిలో కూర్చుంది నిర్మల.
సాయంత్రమవుతుంటే హుషారుగా ఇల్లు చేరాడు పురుషోత్తం. చేతిలో పెద్ద పాకెట్‌. పెద్ద ఘనకార్యం చేసినవాడిలా నిర్మలవైపు ఓచూపు పారేసి, పాకెట్‌లోంచి ఫ్రేమ్‌ చేసిన పెద్ద ఫొటో బయటికి తీశాడు. అది బాబునెత్తుకుని నవ్వుతున్న కమోనీ ఫొటో! నోట్లో పిడికిలితో అసౌకర్యంగా ఉన్న నందూ, అద్దాల చీరలో, రాళ్ళ నగలతో కృత్రిమమైన నవ్వుతో మెరిసిపోతున్న కమోనీ! ఫొటోని ఎక్కడ తగిలించనా అన్నట్టు కలియజూసి, గోడకున్న తల్లీబిడ్డల కాలెండర్‌ తీసేసి, ఆ మేకుకి తగిలించాడు. ఫొటోలో కొడుకుని చూస్తూ ”నందూరాజా! సూపర్‌ స్టార్‌ నందూరాజా!! రేపట్నించి షూటింగుల్తో బిజీరా పండుగాడా! మన్ని తీసేశారేమో అని కంగారుపడుతూ వెళ్తే కొత్త సిన్మాలో ఏషం దొరికిందిరా లక్కీఫెలో!” అన్నాడు పట్టలేని సంతోషంతో.
కిందపడ్డ కాలెండర్‌ని భావరహితంగా చూస్తూ గోడకి చేరగిలపడ్డ నిర్మల ముఖ కవళికల్లో ఒక్కసారిగా ఏదో మార్పొచ్చింది. పిడికిలి బిగుసుకుంది. ‘తన పిల్లలజోలికొస్తే పిల్లి కూడా పులై ఎదురుతిరుగుతుంది’ అనుకుంది లేచి నిలబడుతూ.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.