హిమజ
లాడ్లీ మీడియా అవార్డు!
గత సంవత్సరం చివర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలని, సాహిత్య కారులని అందరి దృష్టిినీ ఆకర్షించిన అవార్డు. మన దేశంలో ఆడపిల్లల హక్కుల మీద, వారిపై ప్రకటితమయ్యే వివక్షకు వ్యతిరేకంగా వార్తలు, సంపాదకీయాలు రాసే పాత్రికేయులకు లాడ్లీ మీడియా అవార్డు ఇస్తున్నారు. గత రెండేళ్ళుగా యు.ఎన్.ఎఫ్.పి.ఏ పాప్యులేషన్ ఫస్ట్, ముంబయి సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో గత సంవత్సరం ‘భూమిక’లో తాను రాసిన సంపాదకీయానికి జాతీయ స్థాయిలో లాడ్లీ మీడియా అవార్డునందుకున్న కె. సత్యవతి 2009 సంవత్సరానికిగాను ఈ అవార్డుల కోసం ఎంట్రీల స్వీకరణ, అవార్డుల ప్రదానోత్సవ సభ నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. డిసెంబరు 17, 2009 శీతాకాలపు సాయంత్రం రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరిగింది.
టీవీ మాధ్యమంద్వారా అందరికీ సుపరిచితురాలైన ఝూన్సీ ‘భూమిక’ సత్యవతిని వేదికపైకి ఆహ్వానించారు. తరువాత సత్యవతి మాట్లాడుతూ – మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు వచ్చిన సహృదయులందరికీ నమస్కారం. స్వాగతం. ఉద్వేగంతో నాకు మాటలు రావడం లేదు. ఒక అంశం పట్ల ఇంతమంది నిబద్ధతతో ఇక్కడికి రావడం గొప్పగా వుంది. నిజానికి ఈ సభ జరపడానికి నేపధ్యం ఆడపిల్లలపై వున్న ప్రేమ. స్త్రీల అంశాలపట్ల వున్న తపన. గారాలపట్టి, మా ఇంటి మహాలక్ష్మి అంటూనే మట్టుబెట్టడానికి వెనుకాడని అమానవీయ సంస్కృతికి, టెక్నాలజీకి, ఆలోచనలకి, ఆచరణకి వ్యతిరేకంగా మేం పనిచేస్తున్నాం. సమాజంలో భయం కొలిపే రీతిలో పడిపోతున్న ఆడపిల్లల సంఖ్య పట్ల ఆందోళనతో భూమిక పత్రిక ద్వారా హెల్ప్‌లైన్‌ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే వున్నాం. అయినా ఈ సమస్యపట్ల చేయాల్సినంత చేయడం లేదన్న అసంతృప్తి మాకుంది.
ఏ ఒకరితోనో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం వచ్చే అవకాశం లేదు. అందుకే సమాజంలోని అన్ని వర్గాలవారిని కదిప,ి కలుపుకుంటూ, ఈ సమస్య గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్న ఆకాంక్ష మాకు చాలా కాలంగా వుంది. మేము చేస్తున్న చిన్న పనికి గత సంవత్సరం వచ్చిన గుర్తింపు ద్వారా ఇతర రాష్ట్రాలో అలాంటి కార్యక్రమం జరుగుతోందని మాకు అర్ధమైంది. పాప్యులేషన్ ఫస్ట్ ఆడపిల్లల హక్కులమీద పనిచేస్తున్న పాత్రికేయుల్ని గుర్తించి అవార్డులివ్వడాన్ని అభినందిస్తున్నాను. వారు తమ కృషిని కొన సాగించాలని ఆశిస్తున్నాను అని అన్నారు.
సాధారణంగా సభలు సమావేశాలు అంటే వేదికమీద పొడవాటి బల్ల, కుర్చీలు, వాటిని అలంకరించే విశిష్ట అతిధులు, ప్రముఖులు వగైరా వగైరా వుంటాయి. ఈ సమావేశం అందుకు భిన్నంగా, అంటే ఏ ఆడపిల్లల హక్కుల కోసం, వివక్షని పోగొట్టడాని కోసం లాడ్లీ మీడియా అవార్డు నిర్ధేశించబడిందో, ఆ ఆడపిల్లలకీ, వారిలోని సృజనాత్మకతను ప్రదర్శించుకునే వీలు కలిగించిన వేదికగా మలచబడింది.
టీవీ పాటల కార్యక్రమంలో, స్వయంగా తాను రాసి పాట పాడి అందర్ని మెప్పించి అభినందనలు అందుకున్న చిన్నారి మధుప్రియ ముందుగా వేదికని పంచుకుంది.
”ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని
బాధపడకమ్మా
నీవు దిగులు చెందకమ్మా”
తన జీవితాన్నే పాటగా రాసిన మధుప్రియ మరో రెండు సందర్భాల్లో తను రాసిన పాటలు –
”అమ్మా నువ్వు యాడున్నవమ్మా
నీ కోసం ఏడుస్తున్నా”
”ఆడవారి బతుకుల్లో వెలుగురేఖ
తధ్యమని-కలగన్నానే చెల్లీ కలగన్నానే…అంటూ పాడి అందరి అభినందనలు అందుకుంది.
తరువాత రెయిన్‌బో హోంనుంచి వచ్చిన ఆరుగురు చిట్టి చిట్టిపాపలు కొన్ని రైమ్స్ అభినయించి అతిధులందరినీ ఆహ్లాద పరిచారు.
రెయిన్ బో హోం నుంచే మరో 12 మంది బాలికలు
”ఆత్మబలం కూడగట్టి ఆకసాన్ని వంచుదాం.
స్వర్గమన్నదే వుంటే నేలపైకి దించుదాం…” అంటూ తమ ఆకాంక్షల సాధనకు ఆశయాల నీరు పోసి సాగు చేద్దాం! అన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. మధుప్రియకి, రెయిన్‌బో హోం బాలికలకి పాప్యులేషన్ ఫస్ట్ డైరెక్టర్ ఎ. ఎల్. శారద మెమొంటోలు ఇచ్చారు. తరువాత ఎ.ఎల్. శారద మాట్లా డుతూ సభలో వున్న కవులకి జానపద కళాకారులకి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభానిర్వహణను భుజాలపై వేసుకున్న భూమికకు అభినందనలు తెలిపారు. మార్చి 2005 లో ముంబైై కేంద్రంగా పనిచేస్తూ ఈ అవార్డులను నెలకొల్పడం జరిగిందని చెప్పారు. అవార్డులందుకున్న పాత్రికేయులందరినీ అభినందిస్తూ ‘నవోదయం’ పత్రిక టీంని ప్రత్యేకంగా ప్రస్తావించారామె.
‘నవోదయం’ పత్రిక. అచ్చంగా మహిళలే నడుపుతున్న పత్రిక. చిత్తూరు జిల్లాకు చెందిన, పదకొండుమంది స్వయం సహాయక బృందంలోని మహిళాసభ్యులు, పదో తరగతి మాత్రమే చదివి ఓ పత్రిక పెట్టారు. అదే నవోదయం. ఇప్పుడు ప్రెవేటుగా డిగ్రీలు పాసయ్యి ఉన్నత స్థాయిని చేరుకుంటున్నారు. ఈ పత్రికకి కధనాల సేకరణ, ఎడిటింగు, ఆర్ధిక లావాదేవీలు, పత్రికను తీసుకురావడం అన్నీ తామే అయి నడవడం వారి విశిష్టత. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే మహిళా సదస్సులకు వీరు హాజరవుతుంటారు. నవోదయం పత్రిక టీంకి రాష్ట్రస్థాయి డేటా న్యూస్ ఫీచర్ అవార్డు ఇదివరకే లభించింది. వేధింపులతో ఆడవారి ఆర్తనాదాలు, చిరునామాలేని చిన్నారులపట్ల వీరి కథనాలకు గాను లాడ్లీ మీడియా దక్షణ భారతదేశ పురస్కారం లభించింది.
అనంతరం లాడ్లీ మీడియా నేషనల్ కో ఆర్డినేటర్ డాలీ ఠాకూర్ మాట్లాడుతూ నేటి ఈ సభలో తానూ భాగమవ్వడం తనకెంతో ఆనందంగా వుందని చెప్పారు. నవోదయం పత్రిక టీంని ప్రశంసిస్తూ ఆడపిల్లలకి – డ్రీం మోర్-డూ మోర్-లెర్న్‌మోర్-అండ్ బికమ్ మోర్ అని పిలుపునిచ్చారు.
ఈ సంవత్సరం దక్షిణ భారత లాడ్లీ మీడియా పురస్కారాలు మన రాష్ట్రానికి చెందిన పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా వారే కాక కేరళ, కర్ణాటక, చెన్నై నుంచి వచ్చిన పాత్రికేయులు కూడా అందుకున్నారు. తెలుగులో – చల్లపల్లి స్వరూపరాణి, ‘నారిభేరి’ ఈటీివీ రజని, వి.వి. రాజు, వార్తలో పనిచేసే ఎస్. ఎస్. ఉమామహేశ్వరి ఈ అవార్డులు అందుకున్నారు.
మొత్తం పధ్నాలుగు మంది అవార్డు గ్రహీతలకు – మానవహక్కుల సంఘం ఛైర్మన్ శ్రీ సుభాషణ్ రెడ్డిగారు, మహిళా న్యాయమూర్తి జస్టిస్ రోహిణి, ఐ.జి. ఉమాపతి, తొలి ప్లేబాక్ గాయని రావు బాలసరస్వతి చలం కలాన్ని తన గళం నవ్వులతో ఊగించిన ”ఊర్వశి” శారదా శ్రీనివాసన్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవి, స్త్రీవాద రచయిత్రి ఓల్గా, ఎ. ఎల్ శారద, డాలీ ఠాకూర్ పాప్యులేషన్ ఫస్ట్ ప్రతినిధి అనూజా గులాటీ అవార్డులు ప్రదానం చేసారు.
చివరగా సెంటర్ ఫర్ ఫర్‌ఫామింగు ఆర్ట్స్ ‘ఆరభి’ వారు సమర్పించిన ‘వయొలిన్ సింఫనీ’ సభికులందర్నీ ఆకట్టుకుంది. 40 మంది వయొలిన్ విద్యార్ధులు ఒక్కసారిగా 40 వయోలిన్‌లపై వర్షించిన రాగాలు అద్భుతం. మైకులు సహకరిస్తే ఇంకా బాగుండేది.
చివరగా కొండవీటి సత్యవతి మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణకి గాను మూడు నెలలుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ఎంట్రీల స్వీకరణ, సెలక్షన్‌లకు గాను కొండేపూడి నిర్మల, మురళి తానూ చాలా శ్రమించామని చెప్పారు. ఈ కార్యమ్రం చేపట్టమని మూడు నెలల క్రిందట అడిగినపుడు మేము అంగీకరించాం. దీనికి భూమిక మిత్రుల్నించి పెద్ద ఎత్తున ప్రోత్సాహం కూడా లబించింది. ఈ కార్యక్రమం ఈ స్థాయిలో జరగడానికి ఎన్నో రంగాలనుండి, ఎన్నో సంస్థల నుండి మాకు మద్దతు లబించింది. ఇందులో న్యాయమూర్తులున్నారు, పోలీసు అధికారులున్నారు. రచయితలున్నారు. న్యాయవాదులున్నారు. అధికారులున్నారు. ఇంకా ఎంతోమంది సహాయ సహాకారాలున్నాయి. వారందరికీ ధన్యవాదాలు.
పది లక్షల మంది ఆడపిల్లల్ని, పుట్టకుండానే చంపేసిన దుర్మార్గ సంస్కృతిని వ్యతిరేకింద్దాం. ఒక సామూహిక గళాన్ని విన్పిద్దాం రండి అని పిలవగానే మీదరందరూ విచ్చేసి ఆడపిల్లల హక్కుల కోసం మీ నిబద్దతను ప్రకటించినందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను.
అన్నింటినీ మించి ఈ రోజున ఎంతో పవర్‌ఫుల్‌గా ప్రజాభిప్రాయాన్ని , ప్రజల ఆలోచనా ధోరణుల్ని అమితంగా ప్రభావితం చెయ్యగల మీడియా, ఆడపిల్లల హక్కుల గురించి, జండర్ సెన్సిటివిటీ గురించి తమ అక్షరాలద్వారా దృశ్యమాధ్యమంద్వారా బలంగా వ్యక్తీకరించగల సత్తా వున్న మీడియా ఇక్కడుంది. ఆ దిశగా కృషి చేసి, లాడ్లీ మీడియా అవార్డులు అందు కోవడానికి మన రాష్ట్రానికి చెందిన వాళ్ళే కాక, కేరళ, చెన్నై, కర్నాటక నుండి వచ్చిన జర్నలిస్ట్‌లు మన ముందు కూర్చుని వున్నారు. వారందరిని అభినంది స్తున్నాను. వారు తమ కృషిని కొనసాగించాలని ఆశిస్తు న్నాను. సెలక్షన్ ప్రక్రియలో జ్యూరీలుగా వ్యవహరించిన మిత్రులకు, అవార్డులు ప్రదానం చెయ్యడానికి అంగీకరించి విచ్చేసిన ముఖ్య అతిధులకు ధన్యవాదాలు.
భూమిక గురించి, భూమిక హెల్ప్‌లైన్ గురించి మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు తెలుగు సమాజం మీద, సాహిత్యం మీద బలమైన ముద్ర వేసిన భూమిక, స్త్రీల అంశాల మీద మరింత విస్తృతమైన కృషిి చేస్తూ ముందుకు సాగుతుందని, అలాగే బాధిత స్త్రీలకు మరిన్ని సేవలందిస్తూ వారికి తన స్నేహహస్తాన్ని అందించడానికి హెల్ప్‌లైన్ ముందుంటుందని హామీ ఇస్తూ.. మా కృషిిలో భాగమవ్వాలని కోరుతున్నాను అన్నారు
గత సంవత్సరం లాడ్లీ మీడియా జాతీయ అవార్డును తీసుకోవడంకన్నా, ఈ సభను నిర్వహించడం గొప్ప సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని సత్యవతి తెలిపారు.
ఆడపిల్లల పుట్టుకను పండుగలా జరుపుకుందాం. సెలబ్రేెట్ హర్ లైఫ్ అని పిలుపునిస్తూ… ధన్యవాదాలు చెప్పడంతో ఈ సభ ముగిసింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా..
ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా
నీవు దిగులు చెందకమ్మా..
అష్టమిలొ పుట్టాననీ అమ్మా జెష్టదాన్నంటున్నరా
ఈ పాడు లోకములొ అమ్మా హీనంగ చూస్తున్నరా
ఆడదని అంటున్నరా అమ్మా పాడు అని తిడుతున్నరా
అష్టమిలొ పుట్టిన క్రిష్ణుడ్నేమో దేవుడని అంటున్నరా
నన్నేమో పాడుదని తిడుతున్నరా.. //ఆడపిల్ల//
పలక బలపం బట్టి అమ్మా బడికీ పోతుంటే
ఆడపిల్లయినందుకు అమ్మా సదువెందుకంటున్నరా
సదువెందుకంటున్నరా అమ్మా సందెందుకంటున్నరా
సదువుల తల్లీ సరస్వతి ఆడదె కదమ్మా
నాకేమో సదువెందుకంటున్నరా //ఆడపిల్ల//
ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా
లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తాననీ
కడుపులోనె ఆడబిడ్డంటె అమ్మా కరగదీస్తున్నరా
ఆడబిడలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది
రేపేమో జగతికి మార్గమేదీ
ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా..
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా.. బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా..
–మధుప్రియ