అయిదుగురు అమ్మాయిల పెళ్ళిళ్ళ కథ

   సింగమనేని నారాయణ
”జీవితానికి కేంద్రం ఆడది – సాహిత్యానికి కూడా ఆడదే కేంద్రం కావాలి” అంటాడు ”అనుభవం” నవలలో. ఒక సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు. ఆ మాటకు కట్టుబడినట్లుగా  వుంటాయి ఆయన రచనలన్నీ! స్త్రీ పురుష సంబంధాలను గురించి, వాస్తవిక దృష్టితో ఆయన రాసినంత విస్తారంగా బహుశా మన తెలుగు రచయితలెవరూ రాయలేదని పిస్తుంది. స్త్రీల  గురించి ఆధునికంగా, వాస్తవికంగా ఆలోచించటాన్ని ఆయన రచనలు మనకు నేర్పుతాయి. కేవలం భావుకతతో ఆయన స్త్రీల గురించి ఎక్కడా రాయలేదు.  సామాజిక భౌతిక వాస్తవికత నుండే స్త్రీల జీవితాన్ని విశ్లేషించడాన్ని ఆయన రచనల్లో మనం గమనించవచ్చు! ఈ మాటను మరింత స్పష్టం చేసిన నవల,  ”పంచకళ్యాణి”
ఈ నవలను కొడవటిగంటి 1957లో రాశారు. ఈ నవలలోని కథాకాలం 1950వ దశకం. ఈ నవలలోని కథంతా అభివృద్ధి చెందిన మహానగరంలో (మద్రాసు) నడుస్తుంది. ఆడపిల్లలు ఉన్నతవిద్య చదువుకోవటం ఉద్యోగాలు చేయటం, ఒంటరిగా ప్రయాణాలు చేయటం, నాటకాలలో వేషాలు వేయటం, మగవాళ్ళతో కలిసి తిరగటం లాంటి సాంఘిక వాతావరణంలో ఈ నవల నడుస్తుంది.
”పంచకళ్యాణి” అయిదుగురు అమ్మాయిల జీవితాలను గురించిన నవల! ఆ అమ్మాయిలు లలిత, సుశీల, జానకి, లక్ష్మి, తాయారు! ఈ అయిదుగురూ మంచి మిత్రులు – ఆడిపాడే అందమైన వయస్సు. తరచూ కలుసుకొనే వాళ్ళు! కాలేజీ చదువులు చదువుతున్న వాళ్ళు.  ఇళ్ళలో నాలుగుగోడల మధ్యకే పరిమితం కాకుండా అందరూ కలిసి చిన్న చిన్న నాటకాల్లో ఆడ మగ వేషాలు వేస్తున్న ఔత్సాహికులు – ఈ అయిదుగురు అమ్మాయిల పెళ్ళిళ్ళకు సంబంధించిన కథే ఈ నవల మొత్తం. నవలంతా రచయిత విశ్లేషణా కథనంతో నడుస్తుంది.
ఈ అయిదుగురూ తమకు మంచి మొగుడు లభించాలనీ కష్టాలు కన్నీళ్ళూ లేకుండా జీవితం నడవాలనీ తమ పెళ్ళి తమకూ కుటుంబానికీ సమస్య కాకూడదనీ ఆలోచనలో వున్నవాళ్ళు. కాని జీవిత వాళ్ళ చెప్పుచేతల్లో వుండదు గదా!
ఈ అయిదుగురిలో విలక్షణమైన ఆడపిల్ల లలిత! తీవ్రమైన భావావేశం గలది. అమితమైన మొండిది. ఆడవాళ్ళ గురించి అవమానకరంగానూ, తక్కువగానూ మాట్లాడితే ఏమాత్రం సహించింది. తాయారు తండ్రి విశ్వనాథం గారు మాటల సందర్భంలో, ”ఆడవాళ్ళకు తెలివితేటలు చాలా తక్కువ. మామూలు తెలివితేటలు గల మగాడుంటాడే, వాడు చాలామంది తెలివైన ఆడవాళ్ళకు తీసిపోడు అని నా గట్టినమ్మకం” అని వ్యాఖ్యానిస్తే మండిపోతుంది లలిత! ”ఆడదాన్ని  కాళ్ళూ చేతులూ కట్టేసి చావచితకకొట్టి చీకటికొట్లో వేసి పరిగెత్త మంటే ఏం పరుగెత్తుతుంది అని కోపగించు కుంటుంది ఆమె! ”మొగుడయ్యేది బ్రహ్మదేవు డయ్యేది తనను ఒకరు మార్చటం గాని ఇంకొకరి మూలంగా తను మారిందనిపించు కోవడంగాని ఆమెకు ఎంతమాత్రమూ ఇష్టం వుండదు.  మగవాడు పెళ్ళయ్యేదాకా ఒక రకంగా ఉంటాడు. అయినాక ఇంకో రకంగా ఉంటాడు. చచ్చినా నమ్మటానికి వీల్లేదు. ఆడదాన్ని చేతులూ కాళ్ళు కట్టేయడానికి ప్రేమ అన్నది ఒక ఉచ్చు. అది ఒక వూచి లాంటిది. అందులో యిరుక్కు పోయాక బయటకు రావడం కష్టం. ప్రేమిస్తే మగవాళ్ళకు చెల్లుతుంది. ఆడవాళ్ళకు చెల్లదు. ఆడదానికి మర్యాద తప్ప ఇంకేమున్నది పోగొట్టుకోవ డానికి, పేరు లేదు. డబ్బులేదు. హక్కులేదు. తనను కాళ్ళకింద తొక్కే మగవాడు తప్ప వేరే దిక్కు లేదు. ఆడదాని అందానికి గణన వున్నంత కాలము, ఆడవాళ్ళు తమ అందచందాలను స్వలాభానికి ఉపయోగించు కోవడంలో తప్పులేదు, మొగుడు కూచోమంటే కూచుని, నించోమంటే నుంచునే ప్రతి ఆడదీ సుఖంగా వున్నట్టే కనబడుతుంది. ఇది వెనకటికన్నా ఎక్కువగా మగాళ్ళ జీవితం. మగవాడు నెగ్గుకు రాగలిగితే అది సామర్థ్యం. ఆడది నెగ్గుకు రాగలిగితే అది గయ్యాళితనం.
సందర్భం వచ్చినప్పుడల్లా మగవాళ్ళ పట్ల ఇలాంటి తీవ్రమైన అభిప్రాయాలు ప్రకటించే లలిత విచిత్రంగా ప్రేమలో పడుతుంది. లలితకు తల్లీ, ఒక అన్నా ఉన్నారు. తండ్రి చాలాకాలం క్రితమే చనిపోతే, తల్లి ఇంటి అద్దెతోనూ, బ్యాంక్‌ లోని కొద్దిపాటి డబ్బుతోనూ వుపాయంగా సంసారం నెట్టుకొస్తున్నది. వాళ్ళు తమ ఇంటి పైపోర్షన్‌లో వుండి కిందిపోర్షన్‌ అద్దెకిచ్చినారు. ఈ మధ్యనే కొత్తగా అద్దెకు చేరింది ఒక కుటుంబం. ఆ అద్దెకున్న వాళ్ళు భార్యాభర్తలు. భార్య రోగిష్టి మనిషి. భర్త బాధ్యతలు లేనివాడు. భార్య అక్క కొడుకు రామారావు వాళ్ళతోపాటే వుంటూ ఏదోబ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుంటాడు ఈ రామారావుతోనే ప్రేమలో పడుతుంది లలిత. దాన్ని పూర్తి ప్రేమ అనటానికి కూడా వీల్లేదు. ప్రేమలేనివాడే నాకు దాపరిస్తాడనే నమ్మకంతో ఇన్నాళ్ళూ  ఉన్నాను. రామా రావు రేపు నన్ను ప్రేమిస్తున్నాననీ, పెళ్ళాడ తాననీ అంటే ఏమనేది? నీవంటి వాడు నాకు వద్దే వద్దు పొమ్మనేదా? ఇలాంటి సందిగ్ధ ప్రేమలో కొట్టుమిట్టాడు తుంది లలిత! పరిచయం అయన రోజునే అతని మాటతీరు వల్ల అతని విూద కొంత సదభిప్రాయం ఏర్పడుతుంది ఆమెకు. స్త్రీలపట్ల ఎంతో సానుభూతిగా గౌరవంగా మాట్లాడతాడతను. ”తనను పూర్తిగా ఎరిగి ప్రేమించే మగాడు పెళ్ళాడాలని నా ఉద్దేశం! ఆడదైనా అంతే. అని పెళ్ళి గురించి తన అభిప్రాయం చెబుతాడతను. అతడి వాలకం చూస్తుంటే ప్రేమైక జీవిలా కన్పించాడామెకు. లలితకు కూడా రామారావు నచ్చుతాడు సరే ఇద్దరికీ పెళ్ళి జరిగి పోయింది.
 పెళ్ళి అయిన తర్వాత ప్రేమికు డిగా తెలుసుకోలేని అనేక సంగతులు భర్తగా తెలుసుకున్నాడు రామారావు. ద్వేషించే వైనాలూ, విమర్శించే వైనాలూ తప్ప లలిత మనస్తత్వానికి ప్రేమ అన్నది ఏ రూపం లోనూ గిట్టదు. అని అతనికి కొద్దికాలానికే అర్థమైపోయింది. మగవాళ్ళ విూద అంత కక్షా, కార్పణ్యమూ లలితకు వున్నట్లు అతడు కలలో కూడా అనుకోలేదు. మగవాళ్ళకు విరుద్ధంగా చదివిన ప్రతిముక్కా, విన్న ప్రతి ముక్కా జ్ఞాపకం పెట్టుకొని లలిత తనను బ్రతికినన్నాళ్ళూ సానపడుతుందనే భయం రామారావుకు గట్టిగా పట్టుకుంది. ఆమెకు మగజాతి అంటేనే ద్వేషం అని అతనికి రూఢి అయిపోయింది. తన్ను పురుషజాతికి ప్రతినిధిగా చేసి శాపనార్థాలు పెట్టే  లలిత అంటే భయం పట్టుకుంది అతడికి. ఆమెకు ప్రపంచాన్ని గురించి కంటే పరిజ్ఞానం జాస్తి. అదికూడా మనుషుల్లో చెడును గురించే. ఆ కారణం చేత ఆమెకు సుఖపడే విద్య దాదాపు ఏవిూ తెలీదు. ఆమెకు తెలిసిందల్లా రకరకాల మనుషులతో రకరకాల ఘర్షణ పడటమూ, ఇతరులనుంచి ఆత్మరక్షణ చేసుకోవటమూ ఓపినట్టు జీవయాత్ర వెళ్ళబుచ్చటమూ అందువల్ల ఆమె తన పెళ్ళి వల్ల జీవితంలో ఏ సుఖమూ పొందలేక పోయింది. అంటాడు లలిత గురించి కొడవటిగంటి. మగవాళ్ళపట్ల లలికున్న అభిప్రాయాలు దాదాపు కొడవటిగంటివే! అయినా కొడవటిగంటికిి లలిత పాత్రపట్ల సానుభూతి లేకపోవటం విచిత్రం. పురుష స్వభావం మీద కాకుండా పురుషుల మీదే ద్వేషం వుండటం వల్ల, లలిత లాంటి వాళ్ళు తమ పెళ్ళి వల్ల సుఖం పొందలేకపోతారని లలిత పాత్ర ద్వారా హెచ్చరిస్తాడు రచయిత. సంఘంలో ఆడదాని స్థాయి పెరగకముందే ప్రేమ వివాహాల గురించి కలలు కనటం అనర్థం” అని లలిత భర్త రామారావు మధనపడడం పట్ల రచయిత కూడా ఏకీభవించినట్లే కనిపిస్తుంది.
(2) ఇక సుశీల సంగతి. ఆమె తండ్రి స్టెనోగ్రాఫర్‌ పని చేస్తాడు. పిత్రార్జితమంతా పేకాటలోనూ, రేసులలోనూ తగలేసి ఇప్పుడు బీదరికం అనుభవి స్తున్నాడు. సీతాపతి మొదటి భార్య సుశీల తల్లి చనిపోయింది. రెండవ భార్య సుందరమ్మ. మామూలు ఆడది కోరే ప్రతి అల్పసుఖం విూదా విముఖత్వం తెచ్చుకొని గానిగెద్దు జీవితం వెళ్ళబుచ్చుతున్నది. ఈ గానుగెద్దు జీవితం సుశీలకు కొంచెం కూడా ఇష్టం లేదు. ”ఆడదాని జీవితమంతా ఇంట్లోనే వెళ్ళిపోవాలా? నాలుగుగోడల అవతల ఆడదానికి సుఖంలేదా? ఆమె ఎదురుచూస్తున్నది తన్ను సుఖపెట్టగల భర్త కోసం సంపాదనాపరుడైన భర్త కోసం సుశీలకు కట్నమిచ్చి మంచి భర్తను తెచ్చే తాహతు ఆ తండ్రికి లేదు. తనపిన్ని జీవితాన్ని రోజూ చూస్తూ అలాంటి దరిద్రపు బ్రతుకు మాత్రం తనకు వద్దు అనే స్థిరమైన అభిప్రాయంతో వుంది ఆమె. వాళ్ళ యింటికి రెండిళ్ళవతల ఒక రిటైర్డ్‌ ఇంజనీర్‌ గారిల్లు వుంది. ఆయన భార్యాపిల్లలు మరొకచోట ఉన్నారు. ఆయన ముప్పయేళ్ళ దుర్గాంబను వుంచుకుని జీవిస్తున్నాడు. ఆ దుర్గాంబ గడిపే విలాసవంతమైన జీవితాన్ని చూసి, చూసి, నేను చాతనయితే దుర్గాంబ లాగా బతుకుతాను గాని చచ్చినా మా పిన్ని లాగా బ్రతకను అనుకునేది సుశీల.
సుశీల ఇంటికి తరచూ రామకృష్ణా రావు అనే ఒక పొగాకు వ్యాపారస్థుడు గుంటూరు నుంచి వచ్చేవాడు. ఆయన వాళ్ళకు దూరపు బంధువు కూడా. ఆయనకు భార్యా ముగ్గురు పిల్లలు వున్నారు. పెద్ద వయసేమీ కాదు. అతన్ని చూడగా చూడగా సుశీలకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది దరిద్రపు మొగుణ్ణి కట్టుకునేకంటే ఈ రామకృష్ణారావుకు ఉంపుడుగత్తెగా వుంటమే మంచిదనుకుంటుంది. అతన్ని ముగ్గులోకి దించుతుంది. ఒక హోటల్‌లో ఆమె ఐచ్ఛికంగా అతనికి తన శరీరాన్ని అర్పించుకుంటుంది. అతను కూడా ఆమెను గాఢంగా ఇష్టపడతాడు. తరచూ హోటళ్ళలో కలుసుకుంటారు వాళ్ళు. ఆమె గర్భవతి అవుతుంది. తండ్రిని ఎదిరిస్తుంది. రామకృష్ణారావు వెంట అతని రెండో భార్యగా గుంటూరు వెళ్ళిపోతుంది. ఇల్లూ, కారూ, చీరలూ, సౌభాగ్యవంతమైన జీవితంలో తేలిపోతుంది. సుశీల డబ్బుగల మగాణ్ణి సంపాదించుకున్న అనాథ. మా అయిదుగురు మిత్రురాండ్లలో సుశీల బతుకే బావుంది అని లలిత కూడా ఆనందిస్తుంది ఇదీ సుశీల కథ.
(3) ఇక జానకి పెళ్ళి కథ. ఎన్నెన్నో మలుపులతో నడుస్తుంది. పెద్ద ప్రయత్నం లేకుండానే జానకి పెళ్ళి బాగా ఆస్తి పాస్తులున్న సుధాకరమూర్తితో సంప్రదాయ బద్ధంగా జరిగిపోతుంది. పెళ్ళి బాగా జరిగిందని అందరూ ఆనందిస్తారు. కాని జానకికి తాను ఈపెళ్ళిలో పాల్గొన్నట్టే లేదు. ఆ మొగుడు స్త్రీల మీద పురుషులకుండే వ్యామోహం అంత ఘనమైనది కాదనే ఉద్దేశం కలవాడు. సృష్టి కొనసాగాలి గనుక భార్యాభర్తల మధ్య ఈ సంపర్క సుఖం ఏర్పాటయింది అనే అభిప్రాయాలున్న అతడితో జానకికి ఆ సుఖం కూడా ఏమంత అనుభవం కాలేదు. సుధాకరమూర్తి ఇంటి బలగం జాస్తి. ఆ ఇంట్లో అందరూ జానకి ఇంటి వాళ్ళను ఎప్పుడూ ఏదోవిధంగా ఎగతాళి చేస్తుంటారు. ఇంకొకళ్ళను హేళన చేయటం, నొప్పించటం వీళ్ళకు ఆనందం లాగా వుంది అనుకుంటుంది జానకి. ఆ ఇంట్లో వీళ్ళు చీల్చుకు చెండాడే ఒక బలిపశువు ఉన్నాడు. అతని పేరు చలపతి. అతడు జానకి పిన్నత్త భర్త. ఆ చలపతికి వీళ్ళే ఉద్యోగం యిప్పించి తమ ఇంట్లోనే ఉంచుకోవడం వల్ల అతడిపై పెత్తనం సాగిస్తూ హింసిస్తుంటారు. ఆ ఇంట్లో జానకి పరిస్థితి దాదాపు అలాంటిదే. ఆమెకు చలపతి పట్ల సానుభూతి ఏర్పడుతుంది. ఈ ఇంటి నుంచీ బయటపడితే తప్ప తనకు సుఖం లేదంటాడు చలపతి జానకితో. జానకికి అతడిని తన మిత్రురాలు సుశీల భర్త దగ్గరకు ఉద్యోగం కోసం గుంటూరు పంపిస్తుంది. అక్కడ అతనికి ఉద్యోగం దొరకగానే తన భార్యను బలవంతంగా తన వెంట తీసుకుపోతాడు. జానకి ద్వారానే చలపతికి ఉద్యగం వచ్చిందని తెలిసి ఆ ఇల్లంతా జానకికి చలపతితో రంకు కడతారు. వాళ్ళ నీచత్వాన్ని, మాటల్ని భరించలేక ఆ ఇంటినుంచి బయటపడి, నిజంగానే చలపతితో సంబంధం ఏర్పరుచుకుంటుంది జానకి. ”అన్నిటికీ అణగిమణగి పడివున్న వాళ్ళకన్న తిరగబడినవాళ్ళు ఎక్కువ కష్టాలు పడుతున్నట్లు తోచదు. ఒకవేళ పడినా అవి ఇతరులు తెచ్చిపెట్టిన కష్టాలంతగా బాధించవు. అని సుశీల జానకికి ధైర్యం చెబుతుంది జానకి పుట్టింటికి చేరుకుని ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌చేంజ్‌ ద్వారా సెక్రటరియేట్‌లో ఉద్యోగం సంపాదించుకుని ధైర్యంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. కాపరం విచ్ఛినమైనాక తప్పంతా ఆడదానిదేననే వాళ్ళ మాటలకేం? జానకి నిజంగా సాధువు. ఏమాత్రం ప్రాణం సుఖపడినా మొగుణ్ణి విడిచిరాదు. వాడెంత నాసిరకమో అనుకుంటుంది లక్ష్మి జానకిని గురించి. జీవితంలో జానకికి మరింత ఆనందం కనిపించసాగింది. అంతకు పూర్వం తాను సాధారణ సుఖాలుగా భావించేవన్నీ ఇప్పుడు కష్టపడిసాధించుకున్న హక్కుల్లా కనపడినై. ఒక్కరు కూడా ఆమెను తేలికచేసి చూడలేదు. కొందరు పూర్వంకన్నా భయభక్తులతో చూశారు కూడా. ఇదీ జానకి పెళ్ళి కథ.
(4) లక్ష్మికి తండ్రి లేడు. తల్లీ, ఇద్దరన్నలూ ఒక తమ్ముడూ వున్నారు. పెద్దన్నకు మాత్రమే పెళ్ళి అయి, భార్య కాపరానికి వచ్చింది. ఆ అన్న భార్యను పురుగుకన్నా హీనంగా చూసే రకం. వాళ్ళ దాంపత్యం చూస్తున్న లక్ష్మికి పెళ్ళి అంటేనే భయం పట్టుకుంటుంది. ఆడదో కాకపోతే మగవాడో బానిసగా బతకాల్సిందేనా? ఇద్దరూ సుఖంగా బతికే అవకాశమే లేదా? మేడలూ మిద్దెలూ అక్కరలేదు. ఇద్దరే ఇద్దరు పిల్లలతో సంసారపక్షంగా కాపురం చేస్తూ కాలం వెళ్ళబుచ్చటం ఒక కలలాగా ఎందుకుండాలి? అని ఆలోచించేది ఆమె. జీవితమంటే ఆమెకు గల భయాలలో పెళ్ళి భయం చాలా పెద్దదై కూచుంది. లక్ష్మికి భర్తను కొనుక్కునే అవకాశం ఉన్నది. అయితే ఆమెకు మొగుణ్ణి కొనుక్కోవటం ఇష్టం లేదు. ఏదైనా ఉద్యోగం సంపాదించి, ఏదోవిధంగా పెళ్ళి అయితే చాలునన్న వైఖరి ఆమెకు క్రమంగా అలవడింది. మగవాడు రొమాన్స్‌ కోసం పెళ్ళికి బాహ్యంగా సంచరిస్తున్న ప్పుడు, ఆడది రొమాన్సు లేకుండా వుండటానికి పెళ్ళి చాటున దాక్కోవటంలో ఆశ్చర్యమేముంది? అనుకుంటుంది ఆమె… ఆమె అన్నలు ఆమె పెళ్ళి కోసం పత్రికలో ఒక ప్రకటన ఇస్తే ఒక సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. తీరా ఆ వచ్చిన పెళ్ళికొడుకు ఎవడూ కాదు. జానకి వదిలేసిన ఆమె భర్త సుదాకరరావే. అతన్ని చూడగానే గుర్తుపట్టేస్తుంది లక్ష్మి. జానకిని దక్కించుకోలేని ఫూల్‌ తనను పెళ్ళాడడానికి వచ్చాడా – వెరిక్రాదూ అనుకుని వాడిని తిరస్కరిస్తుంది ఆమె. వెంటనే ఈ సంగతిని జానకికి చెబుదామని ఆమె ఇంటికి వెళ్తుంది లక్ష్మి.అక్కడ హాల్లో జానకి అన్న కమలాకరం కూచుని వున్నాడు. అతడు కాస్తా ఆడంగిరేకుల వెధవలా అందరికీ ప్రసిద్ధుడు. కమలాకరం లక్ష్మిపట్ల ఆసక్తి కనబరుస్తూ ఉండేవాడు. అతడిని చూడగానే ఆమెకో కొత్త ఆలోచన వచ్చింది. ఆడంగిరేకు వెధవైతేనేం – ఆస్తిపాస్తులున్నవాడు లా చదివాడు. తనంటే ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈపాటి సంబంధం తనకింతవరకు రాలేదు. ఈ కమలాకరం పాసుమార్కుల మగాడు. పెళ్ళాని కాల్చుకు తినడు. చెప్పినట్టు వింటాడు అని ఆలోచించి అతడిని పెళ్ళి చేసుకోవటానికి నిర్ణయించుకుని జానకికి చెబుతుంది. అతన్ని కదిపి సినిమాకు తీసుకువెళ్తుంది. వాళ్ళ పెళ్ళికి జానకి అంగీకారం తెలుపుతుంది.
 (5) తాయారు తండ్రి విశ్వనాథం ఆయన వీరేశలింగం పట్ల గురుభావం గలవాడు. పెద్ద ఎత్తున సంస్కరణోద్యమంలో పాల్గొన్నవాడు ”పెళ్ళి సులువుగా కాదేమోననే విచారమూ, అనుమానము. తన కూతురికి కలగటం ఆయనకు ఇష్టం లేదు. పెళ్ళికాని విచారం కంటే పెళ్ళికాదేమోనన్న విచారం ఆడపిల్లల్ని ఎక్కువగా కాలుస్తుంది. అన్న అభిప్రాయం అతడిది. తన కూతురు పెళ్ళి విషయం పట్ల తనకే బెంగా లేనట్టే అతడు మాట్లాడుతుంటాడు. మొత్తం మీద విశ్వనాథం గారు గొప్ప సంబంధానికి తప్ప పిల్లనివ్వడని అనిదరూ అనుకునేలా లౌక్యంగా ప్రవర్తిస్తుంచాడు. ఇలాంటివాడి కూతురైన తాయారు, తండ్రి ఏ సంబంధం తెస్తే ఆ సంబంధం చేసకుకోటానికే సిద్ధపడివున్నది – అయితే తనకు తెలిసినవాడైతే మంచిదన్న అభిప్రాయం కూడా ఆమెకున్నది. ఆమె ఆత్మరక్షణ చేసుకోలేని మనస్తత్వం కలది. మామూలుకు భిన్నంగా ఏం చేయవలసి వచ్చిన తనవల్ల కాదేమోనని భయపడేది. ఆమె పిరికిది అనే అభి ప్రాయాన్ని తండ్రే చెబుతుంటాడు. అందువల్ల కాస్తా ధైర్యంగల వాణ్ణి, గట్టివాణ్ణి చూసి చెయ్యాలి అని చెబుతుంటాడు.
లలిత అన్న నారాయణను చూడగానే అతన్ని గురించి ఆరా తీశాడతను. కుర్రాడు యోగ్యుడులాగానే కనబడతాడు. కుదురైన మనిషి కూడా అనుకుంటాడు. తాయారు మెతకమనిషి. అటువంటి భార్యతో తాను సుఖపడగలడు అనుకుంటాడు నారాయణ కూడా. తాయారుకు కూడా లలితతో బంధుత్వం కలుస్తుంది కాబట్టి అంగీకరిస్తుంది. తాయారు పెళ్ళి సంసార పక్షంగా ఏ ఇబ్బందులూ లేకుండా జరిగి పోయింది. తాయారు ఉన్నట్టుండి నిష్కార ణంగా కుళ్ళినా, మొగుడితో చాలా సఖ్యంగా కాపురం చేస్తుంది అనే అభి ప్రాయం లలిత వాళ్ళ దాంపత్యం గురించి
ఇదీ పంచకళ్యాణి నవలలోని అయిదుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళ కథ. సుశీల తన పిన్ని జీవితంలోని రొష్టును చూసి అలాంటి జీవితం తనకొద్దని రామకృష్ణా రావుకు ఉంపుడుగత్తెలాగైనా ఉండటానికి సిద్ధపడింది. జానకి పెళ్ళి సంప్రదాయ బద్ధంగా జరిగినా, భర్త సుధాకరరావు పీడనను భరించలేక, చలపతితో బాహ్య సంబంధం పెట్టుకొని భర్తను విడిచిపెట్టి ఉద్యోగం సంపాదించుకుని వ్యక్తిత్వంతో జీవిస్తున్నది. లక్ష్మి తన అన్నావదినల దాంపత్యం చూసి పెళ్ళి అంటేనే భయం పట్టుకుని తన చెప్పుచేతుల్లో ఉంటాడని, తన్ను కాల్చుకుతినడని ఆడంగిరేకుల వాడైనా కమలాకరాన్ని పెళ్ళిచేసుకుంటుంది. తండ్రి స్థిరపరిచిన సంబంధం కాదనకుండా తాయారు నారాయణకు తన మెడను వంచింది. ఎటొచ్చీ లలితే పురుషద్వేషంతో మగజాతినే అసహ్యించుకుని సంస్కారవంతు డైన భర్త వుండి కూడా సుఖపడలేక పోయింది. ఇలా అందం పెళ్ళిళ్ళు కూడా అసమస్థితిలోనే ముగుస్తాయి. కొడవటిగంటి కుటుంబరావు ఒక వ్యాసంలో వివాహవ్యవస్థ గొప్ప మార్పులకు గురి అయితేగాని స్త్రీ పురుషుల మధ్య సమానత్వం సాధ్యంగాదు. ఇప్పుడు వారిమధ్య వుండే అసమానత కేవలం వ్యక్తిగతమైనది కాదు సామాజిక మైనది. అన్న మాటల్ని ఈ నవల నిరూపిస్తుంది.
కుటుంబరావు ఈ నవలను రాసి ఐదు దశాబ్దాలు దాటింది. అప్పటికంటే ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు మరింత సమస్యగా మారాయి. పెళ్ళి ఆడపిల్లలకు మరింత భయకారణమైనది. ఆడపిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి, వేలకు వేలు సంపాదించే ఉద్యోగాలు చేస్తూ కూడా, పెళ్ళి విషయం వచ్చేసరికి లక్షలకు లక్షలు కట్నం దోచిపెట్టాల్సిందే. కట్నం డబ్బులను, ఉద్యోగం డబ్బులనూ మొగుడికి ధారపోస్తూ కూడా మళ్ళీ ఊడిగం చేయాల్సిందే. పెళ్ళిళ్ళలో కన్పించే ఈ దోపిడీ దాంపత్యంలో కనిపించే అసమానత్వం ఇప్పుడు మరింత తీవ్రమైంది. సంఘంలో ఆడదాని స్థాయి పెరగలేదని ఈ నవలలో కుటుంబరావు వాపోతే పెళ్ళిళ్ళ దగ్గరకొచ్చేసరికి ఆడది మరింత బానిసయింది. అంతో ఇంతో ఆధునిక భావాలూ స్త్రీల పట్ల సంస్కారదృష్టి వున్న వాళ్ళు కూడా ఈ సంఘనీతికీ అసమానత్వానికీ బలైపోయి పెళ్ళి వల్ల ఆనందాన్ని అనుభవించ లేకపోతున్నారు. (ఈనవలలో లలిత భర్త రామారావులాగా) – అసమ సంబంధాల దాంపత్యానికి ఉదాహరణగా ఈ నవలలో శంకరం – సావిత్రి, సీతాపతి- సుందరమ్మ, చలపతి – శారద, భాస్కరం-పార్వతులు మనకు కన్పిస్తారు. వీళ్ళ బతుకుల్ని చూస్తే  జీవితంలో వున్న ఇంత రొష్టుకు కారణమైన సామాజిక అసమానతలపై సంఘనీతిపై కోపం కలుగుతుంది.
ఈ నవలను చదివింతర్వాత ”ఎం పెళ్ళిళ్ళో, ఎవరు సుఖపడుతున్నారో ఎవరికీ తెలీదు కదా” అని దిగులు వేస్తుంది.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో