ఉద్యమమే ఊపిరిగా బతికిన సాయిబాబా ఇక లేరు. ఈ సందర్భంగా ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వానికి ఆయన చేసిన అనువాదాలకు అఫ్సర్ రాసిన ముందు మాటలోని కొంత భాగాన్ని మీకు అందిస్తున్నాం.
ఎక్కడ మొదలెట్టాలీ అన్న ప్రశ్న నిలదీస్తోంది నన్ను కచ్చితంగా సాయిబాబా జైలులోంచి బయటికి ప్రపంచంలోకి అడుగు పెట్టిన రోజున చదవడం పూర్తిచేశాను ఆయన అనువాదంలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వ అనువాదాలు. చాలా యాదృచ్ఛికంగా జరిగింది ఇది. ఫైజ్‌కి నివాళిగా మరో ప్రసిద్ధ కవి ఆఘా షహీద్ అలీ రాసిన కవితతో సాయిబాబా అనువాద సంపుటి ముగిసింది. ఆ కవిత చదివి, ఆ అశాంతిని నిలవరించుకోవడం కష్టంగా అనిపించి, కాసేపలా బయటి గాలి పీల్చుకుందామని గదిలోంచి బయటపడ్డాను.
మార్చి 9, శనివారం పొద్దున – మాడిసన్ చలిలో గదిలోనే వుండిపోవాలి నిజానికి! బయట ఎండగా కనిపించినా, అది మోసపు మెరుపే అని తెలుసు. కానీ, ఫైజ్‌ని చదివిన ఉద్వేగం గదిలో వుండనివ్వలేదు. బయటికి అడుగు పెట్టానో లేదో సాయిబాబా విడుదల వార్త నా మొబైల్ ఫోన్లో.
నిద్రపోయే సమయాలో, చదువుకుంటూ రాసుకుంటూ వుండే వేళలో మినహాయిస్తే, వొక గదిలో ఎన్ని గంటలు స్థిమితంగా వుండగలం?! మరీ ఎక్కువసేపు వుంటే వూపిరాడడం కష్టమే అవుతుంది. అందుకే, బయటి గాలి కోసం శరీరమూ మనసూ మెదడూ వొక్కసారిగా ముప్పేట దాడి చేస్తాయి. అలాంటిది సాయిబాబా పదేళ్లుగా అనుభవిస్తున్న నరకాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?! అసలు ఆ నరకం వెనక కుట్రని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిత్యం విద్యార్ధుల మధ్యా, ఉద్యమ జీవుల మధ్యా విరామమెరుగక పనిచేసే ఆచరణవాదికి ఈ జైలు గది ఎలాంటి ప్రపంచం?!
సాయిబాబా అనువాదాలు చదువుతూ ఫైజ్ గురించి ఆలోచిస్తూనే వున్నా. నిజానికి వాళ్ళిద్దరి జైలు జీవితాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా. 1951- 55 మధ్య అప్పటి పాకిస్తానీ ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర కేసులో ఫైజ్ జైల్లో వుండాల్సి వచ్చింది. రావల్పిండి కుట్ర కేసుగా ఇది ప్రసిద్ధం. ఫైజ్ లాహోర్ జైలు కట్టుకున్నాయని తెలిసినప్పుడు వాళ్ళని బంధించిన ప్రభుత్వాల మీద జాలేస్తుంది.
ఇందాక ఫైజ్ వుత్తరాల్లోని reason/ courage/ maintenance అనే మూడు పదాలు అవి కేవలం పదాలు కాదనీ, వాటి మూలాలు అలాంటి వ్యక్తిత్వాల మూలనదులని తెలిసి, జీవితం కొత్త రెపరెపలతో జెండా ఎగరేసినట్టే అనిపిస్తుంది.
(సారంగ వెబ్ మ్యాగజైన్ నుండి …)