ఏం చెయ్యాలో చెప్పు
ఎలా ఉండాలో చెప్పు
ఏం వేసుకోవాలో చెప్పు
నా తెగింపు నీకు నొప్పింత వరకు చెప్పు ఏదైనా సరే, చెప్పు
త్యాగించాలా చెప్పు మౌనించాలా చెప్పు.
అసలు జీవించాలో లేదో కూడా చెప్పు
చెప్పు
నీ కళ్ళలో దాగిపోవాలా చెప్పు
నీ అభిప్రాయాలకు, ఆలోచనలకు, నీ డబ్బుకు, నీ మేధకు దాసోహం. నీకు నచ్చినంత తెలివిగానే, నీకు భయం పుట్టించ నంత తెగువతోనే ఉంటాను. ఒద్దికగా, ధైర్యంగా, అణకువగా నీకు వెన్నుదన్నుగా… నువ్ తాగొస్తే నిద్రపుచ్చే అనుకూలవతిగా, నీకు ఎదురు వచ్చే నవ్వుగా..
అంతా నీ నిర్ణయమే, నీకు నచ్చినంతనే
నీకు పూజలిష్టం లేదా… నా వంటగదిలో ఒక చిన్న గూటిలో సరిపెట్టుకుంటా. నీకు ఇష్టమా, ఒక గదిని పఠాలతో మొత్తం నింపేసుకుంటా. నీకు సంప్రదాయమైన భార్య కావాలా, ఇదిగో ఇక్కడే పట్టుచీర నల్లపూసలతో కాఫీ అందిస్తుంటా… (మా వారికి నచ్చదండీ అన్న మాట మా అమ్మ బాగానే అలవాటు చేసింది.)
లేదు, నీకు డాషింగ్ పార్టనర్ కావాలా, పిల్లలను నిద్రపుచ్చాక సెక్సీ డ్రెస్ వేసుకుని నీతో పబ్కి వస్తా. నీకు ఇంటెలిజెంట్ వైఫ్ కావాలా, ఇదిగో నీ నిర్ణయాలు నేను చేసి పెడతా, ఇబ్బందిగా ఉందా, కాస్త తగ్గుతా.
నా మైండ్ స్విచ్ ఆఫ్ చెయ్యాలా, చేస్తా. నీ దాన్ని కదా నీకు నచ్చినట్లు ఉంటా.
నా శరీరం చల్లబడినా, నీ వేడి కోరికను మన్నించి వెచ్చబెట్టుకుంటా.
నా శరీరం వేడెక్కితేనా? నీ ఇష్టం మరి! ఆ సమయాల్లో అవమానిస్తావో అక్కున చేర్చుకుంటావో రెండిటికి సిద్ధంగా ఉంటా.
… … …
నా చుట్టూ కట్టిన తాడు ఎంత పొడుగుంచుతావో నీ ఇష్టం. దానిని చుట్టచుట్టి నీ చుట్టూ మాత్రమే తిప్పుకుంటావో, కాస్త కాస్త వదిలి ప్రపంచాన్ని పరిచయం చేసుకొనిస్తావో!
కానీ తాడు మాత్రం వదలవు కదా!
ఆ తాడుని తెంచుకుపొతే నన్ను పట్టుకునేందుకు అందరు ఒకటవుతారు ఏంటో!
కొన్నిసార్లు తాడుని నాకు నేనే వేసుకున్నాను అనుకుంటాను కానీ, వేసుకోకపొతే వెనకపడే పిచ్చి కుక్కల భయం వెంటాడుతూనే ఉంటుం దెప్పుడు.
అప్పుడు తాడే మంచిదనిపిస్తుంది!
… … …
నా బుజ్జి తాడుగాడా!
నువ్ నీ తాడుతో లాగు. నేను గుంజుకుని గుంజుకుని నడుస్తా.
విసుగొచ్చి నువ్ తాడు వదిలేయ్. పరిగెత్తుతానా?
నాకు ఏం చెయ్యాలో బహుశా తెలియకపోవచ్చు. తాడు చుట్టూ మళ్ళీమళ్ళీ తిరగొచ్చు. అంతెందుకు తాడును మెడలో దూర్చుకుందామని నానా తిప్పలు పడొచ్చు, వేయమని నీ వైపు దీనంగా చూడొచ్చు.
ఏం చెయ్యను మరి. తాళ్లతో పెంచుకున్న పాశమాయే. మా అమ్మ, అమ్మమ్మ, ముత్తమ్మ – అందరు తాడు కోసమే బతికారు. తాళ్లకు నానా దరిద్రాలు పూశారు, తాడు గట్టిగా
ఉండాలని పూజలు చేశారు, తాళ్ళున్న వాళ్ల వైపే చూసారు, తాడు మాత్రమే కావాలనుకున్నారు. తాళ్లు తెంచుకున్న వాళ్ళను, వద్దనుకున్న వాళ్లను వెలివేశారు. అంచేత, తాడును వదలని నా అమాయకత్వాన్ని క్షమించు.
కానీ వదిలేయ్.
ఎంతసేపని? కాస్త వెంపర్లాడక…
ఒక్కసారి చుట్టూచూసి, గుండె నిండా గాలి పీల్చి, ప్రపంచం మీదకు ఉరకనీ!
… … …
నువ్ కూడా తాడు పట్టుకుని బిరుసెక్కిన వెళ్ళాను, కాస్త స్వాధీన పరచుకో.
చల్లగాలి ఉంది. ఆకాశం ఉంది.
చుట్టూ చెట్లు, పువ్వులు, సరస్సులు, నదులు, కొండలు, చినుకులు అన్ని ఉన్నయ్.
ఉరుకుదాం పద!