ముక్కుపచ్చలింకా ఆరనే లేదు..
లేత బుగ్గలపై పాల నురగలు తడి తడిగానే..
నిన్నో మొన్నో కళ్లు తెరిచిన పసికూన
అప్పుడే… వాడిమెడకో లెంకపీట
దాన్నిండా పలకా బలపం
పెన్నూ పెన్సిల్ పుస్తకాలు
బుజ్జి ల్యాగ గెంతులను
విదిలించుకునేందుకో..
కాళ్లమెలిగే వసపిట్టని
ఆవలి కొమ్మకి తరిమెయ్యాలనో..
పసిగుడ్డుని విదిలించుకొని జారుకున్నడు
వాళ్ల నాయిన
ఆ దిక్కుకేసే..
వాడు పులుకు పులుకున చూస్తూ
ఎక్కెక్కి ఎగతడుతండు
ఇప్పుడు
పిప్పరమెంటు చాక్లెట్టు..
ఆకట్టుకోలేదు సరికదా విసిరికొట్టిండు
రాలుతున్న
దుఃఖబిందువుల్లోంచే వచ్చిరాని మాటలు
వాటిని ఏరి కూర్చితే
అదో కొత్త భాషా నిఘంటువు..!
కాళ్ళకడ్డం పడుతున్నాడని
చేతులు దులుపుకుంటున్నారు,
వాడి ఇష్టాయిష్టాలను పట్టించుకునేదెవరనీ
ఇప్పటినుంచే..
ఆ బుడుతడికి బడంటే ఓ భూతం !
చదువంటే భారం.
ఇంకా కుదురుకోని ఆ పసి మెదడుకి
ఇది కారాగారం కాక మరేమీ!?
