రాయలసీమ ఫాక్షనిజం : బాధిత స్త్రీల కథలు – ప్రొఫెసర్‌. ఎమ్‌. ఎమ్‌. వినోదిని

రాయలసీమ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఫాక్షనిజం. పదుల సంఖ్యలో పోయే సుమోలు. పోతున్న సుమోల డోర్లలో నించి సగం శరీరాన్ని బయట పెట్టి కసిగా చేతులతో కత్తులు ఊపే మగవాళ్ళు. తెల్ల చొక్కాలు, తెల్ల అడ్డపంచెలు కట్టుకున్న పురుషులు. దారి చూసి, కాపుకాసి కొడవళ్ళు, కత్తులు విసిరే వాళ్ళు. బాంబులు విసిరే వాళ్ళు.

కత్తి పొట్లకు గురయ్యి, లేదా బాంబు దాడికి గురయ్యి, గొడ్డళ్ళ నరికివేతకు గురయ్యి రక్తపు మడుగులో ప్రాణాలు విడిచే వాళ్ళు. ‘మేప్‌’ వేసి పకడ్బందీ పథకాలతో ప్రత్యర్థిని, శత్రు వర్గాన్ని ఏమార్చి చంపే వాళ్ళు. కాళ్ళు చేతులూ పోగొట్టుకున్న వాళ్ళు. పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు. బెయిల్‌ మీద బయట కొచ్చి మళ్ళీ హత్యలు చేసే వాళ్ళు.. లేదా హత్యకు గురయ్యే వాళ్ళు. జీవిత శిక్ష పడి జైళ్ళలో మగ్గిపోయే వాళ్ళు. జైల్లోనే అనారోగ్యంతో మరణించే వాళ్ళు. జీవితాంతం జైళ్ళలో మగ్గిపోయి శిక్ష ముగించుకొని ముసలితనంలో జీవచ్చవాల్లా వూరికి తిరిగి వచ్చే వాళ్ళు…! బాంబులు తయారు చేసే వాళ్ళు.. చేయించే వాళ్ళు! ప్రమాదవశాత్తు పేలితే మరణించే వాళ్ళు.. లేదా శరీర అవయవాలు కోల్పోయి జీవితాంతం అంగవైకల్యంతో బతికే వాళ్ళు. కొలిమి దగ్గర అదేపనిగా కత్తులు, కటార్లు, గొడ్డళ్లు లాంటి మరణాయుధాలు తయారు చేయించే వాళ్ళు! పగే ఊపిరిగా బతికే వాళ్ళు, శత్రు నిర్మూలనే ధ్యేయంగా బతికే వాళ్ళు! ఈ దృశ్యాలే రాయలసీమ సాహిత్యానికి ఫాక్షన్‌ కథా వస్తువుని అందించాయి. తెలుగు సినిమాకి కాసుల వర్షం కురిపించాయి.
ఈ పగలు, కక్షలు కార్పణ్యాలకు రాజకీయ పార్టీల ముఠాతత్వం, పదవీకాంక్షలు, ఆస్తి గొడవలు, సరిహద్దు వివాదాలు, పొలంగట్ల కొలతలు, సాగు నీరు, తాగు నీరు, పక్కవారి ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం, వారసత్వంగా వచ్చే పగలు, అడపాదడపా ప్రేమ సంబంధాల వంటివి కారణాలు కావొచ్చు. ఇవి దాయాదుల మధ్య ఉండవచ్చు, అన్నదమ్ముల మధ్య ఉండవచ్చు, ఒకే కులం వారి మధ్య, ఒకే వూరి వారి మధ్య, ఒక్కో సారి ఒకే పార్టీ వాళ్ళ మధ్య కూడా ఉండొచ్చు.
ఈ ఫాక్షనిజాన్ని ఒకసారి పైనించి కిందకి తెరిపార చూస్తే కనిపించేదంతా మగవాళ్ళే! ఫాక్షనిజం ‘మగరూపం’. ఈ మగరూపంలో ఉండే ఫాక్షనిజంలో కొన్నిసార్లు స్త్రీలు కనిపించినా అది చాలా పరిమితమే! ఫాక్షనిజంతో ప్రత్యక్ష సంబంధం ఉండి, నాయకులుగా ముందుండి నడిపించిన స్త్రీల సంఖ్య చాలా తక్కువ. ఈ ‘మగరూపం’లో ఉన్న ఫాక్షనిజం వెనక ఉన్న కర్టెన్‌ ఒకసారి పక్కకి జరిపి చూస్తే అక్కడ అస్తవ్యస్తమైన జీవితాల్ని గడుపుతున్న ఆడవాళ్ళు కనిపిస్తారు. భర్తల్ని కోల్పోయిన భార్యలు, కొడుకుల్ని కోల్పోయిన తల్లులు, అన్నదమ్ముల్ని, ఆత్మీయులని కోల్పోయి దుఖం చుట్టుముట్టిన మహిళలు కనిపిస్తారు.
ఆస్తులూ అంతస్తులూ ఉన్నా, మనశ్శాంతి కరువై బతికే స్త్రీలు, కోల్పోయిన వాళ్ళను కోల్పోగా, మిగిలిన వారికి ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే భయంతో బిక్కు బిక్కు మంటూ బతికే వాళ్ళు కనిపిస్తారు. అవకాశం దొరికితే తమ కుటుంబ సభ్యులను చంపిన వాళ్ళను చంపాలనే పగే ఆశయంగా బతికేవాళ్ళు కనిపిస్తారు. భర్తను చంపిన వారిని తిరిగి తాము చంపే వరకు గాజు, పూస తీయకుండా సుమంగళిగా కాలం వెళ్లదీసే వాళ్ళూ కనిపిస్తారు. తమ ఇంటి మగవాళ్ళ చేతిలో హతమైనవాళ్ళు ఎప్పుడైనా తమవాళ్ళ మీద దాడి చేస్తారేమో అని అనునిత్యం భయంతో ఊపిరి పీల్చే వాళ్ళూ కనిపిస్తారు. ఇంటి మగదిక్కుని కోల్పోయి, పిల్లల్ని పెంచి పెద్ద చేయలేక, వారి సంరక్షణ చూడలేక కష్టాల్లో కూరుకుపోయిన మహిళలూ కనిపిస్తారు.
ఇక ఫాక్షన్‌ నాయకుడి చేతికింద పనిచేసే అనుచరుల కుటుంబ హత్యకు గురైతేనో, జైలు పాలైతేనో, ఈ అనుచరగణం కుటుంబాల స్త్రీల పరిస్థితి మరింత భిన్నంగా ఉంటుంది. అటువంటి కుటుంబాలు నిరుపేద కుటుంబాలు అయితే, కింది కులాల కుటుంబాలు అయితే ఇక పరిస్థితి వర్ణించలేము. కులం తక్కువవారిగా పిలవబడే అంటరాని స్త్రీలు, కూలి పనులు, వ్యవసాయ పనులు చేసి బతికే కుటుంబాల స్త్రీలు భర్తను కోల్పోతే మొత్తం కుటుంబ భారం మోయవలసి వస్తుంది. చదువుకునే పిల్లల చదువులు దెబ్బతింటాయి. ఆడపిల్లలు అయితే పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోతాయి. కుటుంబం మొత్తం ఆత్మవిశ్వాసం కోల్పోయి, ఆదరణ కోల్పోయి, నిస్సహాయ స్థితిలోకి దిగజారిపోతుంది. అటువంటి కుటుంబాలను కన్నీటిని దిగమింగుకొని ఒంటరిచేత్తో భుజాన ఎత్తుకొని మోసే స్త్రీలు కనిపిస్తారు. అలాంటి ఒక స్త్రీ – నల్లగట్ల వెంకటలక్ష్మమ్మ! అదురులేదు – బెదురులేదు: ఉన్నది ధైర్యం ఒక్కటే!
వెంకటలక్ష్మమ్మ భర్త నల్లగట్ల లక్ష్మీనారాయణ. కర్నూలు జిల్లా (ప్రస్తుతం నంద్యాల జిల్లా) గుళ్ళదుర్తి గ్రామం. నలుగురు పిల్లలు. ఫాక్షన్‌ గొడవల్లో భర్త లక్ష్మీనారాయణ పట్టపగలు కళ్లముందే హత్యకు గురైతే న్యాయపోరాటం చేసిన మహిళ.
వెంకటలక్ష్మమ్మ తల్లి గారి ఊరు కడప జిల్లాలోని గండికోట. కులం మాదిగ. ఇంటికి పెద్దబిడ్డ. ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్ళు. తల్లితండ్రి వ్యవసాయ కూలీలుగా పనిచేసుకొని బతికేవాళ్ళు. దగ్గరి బంధువు లక్ష్మీనారాయణతో పెళ్లి జరిగిన తర్వాత కర్నూలు జిల్లా గుళ్ళదుర్తికి కాపురానికి వచ్చేసింది. తింటానికి, ఉంటానికి లోటులేని కుటుంబం. పది ఎకరాల పొలం, రెండు ఎద్దులు, రెండు ఆవులు, రెండు బర్రెగొడ్లు, రెండు మేకలు. కొత్తగా కట్టిన ఒక మట్టి మిద్దె. ఇంటి వెనక దొడ్డి తలుపు తీస్తే కనిపించే పొలం. పక్కనే కుందూ నది ప్రవహించటం వలన రెండు కారులు పండే వరి చేను.
మామ పెద్ద తిరుపాలుకి ఉన్న ఇద్దరు తమ్ముళ్ళ – చిన్న తిరుపాలు మూగన్నలు. వెంకట లక్ష్మమ్మ పెళ్లి నాటికే చిన్న తిరుపాలు మాదిగ కులపెద్ద. ఆ ఊరిలో ఆధిపత్య రెడ్డి కులస్థులకు ధీటుగా పెద్దరికంతో మసలే వాడు. దాదాపు 200 గడపలు ఉన్న మాదిగ వాడలో తొలిసారి 1982లో స్లాబ్‌ వేసి పెద్ద ఇల్లు కట్టింది కూడా చిన్న తిరుపాలె! ప్రభుత్వ చౌక ధరల దుకాణం, ప్రభుత్వ సారా కాంట్రాక్టును కూడా తన రాజకీయ పలుకుబడితో దక్కించుకున్నాడు చిన్న తిరుపాల్‌. ఆ ఊరి రెడ్లకు ఏ రోజు తలవంచలేదు రెడ్లను పేరు పెట్టి పిలుస్తూ తన కుల ఆత్మగౌరవాన్ని నిలుపుకునేవాడు. మాదిగ వాడ మీద ఏ కులాధిపత్యపు నీడలూ పడనిచ్చేవాడు కాదు. ఈగ వాలనిచ్చేవాడు కాదు.
ఈ ఎదుగుదలనంతటిని ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తున్న రెడ్డి కులస్తులకు కంటగింపయ్యాడు చిన్న తిరుపాల్‌. తమ కాళ్ళ దగ్గర కుక్కల్లాగా బతకాల్సిన మాదిగ వాడంతా చిన్నతిరుపాల్‌ అండ చూసుకొని తలెత్తుకు తిరగటం సహించలేకపోయింది రెడ్డి కులం. ఇదంతా 1980ల్లో మొదలయిన కథ. రెడ్డి కులస్తులంతా అప్పుడే కొత్తగా వచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరటం, మాదిగ కులస్తులు అందరూ చిన్న తిరుపాల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగటం రెడ్లకు మరింత కంటగింపు అయింది. దీనికితోడు 1983లో నంద్యాల కొచ్చిన ఇందిరాగాంధీ, అప్పటి డిప్యూటీ సీఎం బి.వి.వెంకట సుబ్బారెడ్డి, సెంట్రల్‌ హోమ్‌ మినిస్టర్‌ పెండేకంటి వెంకట సుబ్బయ్యలతో పాటు, ఎన్సీ తిరుపాల్ని కూడా వేదిక మీదకు పిలిచి కూర్చోబెట్టుకోవడాన్ని స్థానిక నాయకులు సహించలేకపోయారు.
అంతటి ఇందిరాగాంధీతో వేదిక మీద తమ ఊరి మాదిగ కులస్తుడు ఉండటం వారికి తలకొట్టేసినట్టు అయింది. రోజు రోజుకి పెరిగిపోతున్న చిన్న తిరుపాల్‌ గౌరవ మర్యాదలు, ఆర్థిక స్థితి, మాదిగ కుల ఆత్మస్థైర్యం, గ్రామంలోని కొందరు ఆధిపత్య కులాల వారు ఓర్చు కోలేకపోయారు. ఆవూరి మాదిగలకే కాక చుట్టుపక్క గ్రామాల వారికి కూడా చిన్న తిరుపాల్‌ నాయకుడిగా ఎదగటం మొదలైంది. ఇది తమ నెత్తిమీద నిప్పులు పోసినట్లుగా భావించారు కొందరు ఆధిపత్యం కులాల వాళ్ళు. దీన్ని ఇలాగే వదిలేస్తే తమ ఆధిపత్యానికి ముప్పు కలుగుతుందని భావించి చిన్నతిరుపాల్‌ని హతమార్చాలని పథకం వేశారు. అనేకమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. చిన్న తిరుపాల్‌కి రక్షణగా ఎప్పుడూ అతని మనుషులు వెన్నంటి ఉండటం, లెక్కకు మించిన మారణాయుధాలు, బాంబులు కలిగి ఉండటం వలన అవతలి వర్గపు పథకాలు ఫలించలేదు. వీటికి తోడు ఎప్పుడూ తనమీద హత్యా ప్రయత్నం జరిగినా చిన్న తిరుపాల్‌ భయపడలేదు.. తనపై కుట్ర పన్నిన ఆ వర్గపు వాళ్ళ ఇళ్ళమీద అచ్చం వాళ్లకి లాగానే తిరిగి బాంబులు విసరడంతో తన ప్రతిస్పందనని శక్తివంతంగా, సరిసమానంగా, దీటుగా తెలియజేసేవాడు.
చివరికి 1987లో వాళ్ళ కుట్రలు ఫలించి గొడ్డళ్ళతో నరికి చిన్నతిరుపాల్‌ని హతమార్చారు. ఆ సంఘటన గుళ్ళదుర్తి గ్రామ రెడ్లకి, మాదిగలకి మధ్యన ఫ్యాక్షన్‌ వాతావరణానికి తెర తీసింది. అప్పటినుంచి ఆ గ్రామంలో రెడ్లు-మాదిగలు, నువ్వా-నేనా అన్నట్లు ఉండేవాళ్ళు. ఆధిపత్య రెడ్లకి సహజంగా మాదిగల పట్ల ఉండే చిన్న చూపు, చులకన భావన, అంటరానితనం, వివక్షలు, వైషమ్యంగా, కక్షగా మారిపోయాయి. ఒకే ఊరిలో రెండు శత్రు సమూహాలు జీవిస్తున్నట్లు ఉండేది. పండగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, చావులు, రాజకీయ మీటింగులు, ఎన్నికలు, ఒకటేంటి, ఏ ప్రత్యేక సందర్భంలోనైనా ఊరంతా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనేది.
చిన్న తిరుపాల్‌కి ఇద్దరూ ఆడపిల్లలే అవ్వడంతో తన అన్న కొడుకు లక్ష్మీనారాయణకి కొడుకు స్థానాన్ని ఇచ్చి పెంచుకున్నాడు. చిన్నాయన మరణంతో వెంకటలక్ష్మమ్మ భర్త లక్ష్మీనారాయణ మాదిగ కులపెద్దగా ఎదిగాడు. చిన్నతిరుపాల్‌ వారసత్వంతో రాజకీయ పలుకుబడి సంపాదించాడు. కుల సమూహాన్ని కుటుంబంగా చూసుకున్నాడు. తన కులంలో కుటుంబాల మధ్య ఒడిదుడుకులు వస్తే పంచాయితీలు జరిపి సర్ది చెప్పేవాడు. తన కుల సమూహంలో యువకుల్లో సహజంగా ఉండే ఆవేశపూరితమైన చర్యల్ని ఒక కంట కనిపెడుతూ వాటిని ఆలోచనలుగా మార్చడానికి ప్రయత్నం చేసేవాడు.
వెంకటలక్ష్మమ్మ లక్ష్మీనారాయణను పెళ్లి చేసుకునే నాటికే సంజామల గ్రామం సొసైటీ బ్యాంకులో చిన్నపాటి ఉద్యోగి. తనభర్త ఊర్లో పెద్దమనిషిగా ఎదగటం, క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం, కులపెద్దగా వ్యవహరించటం, వెంకటలక్ష్మమ్మ గౌరవాన్ని, బాధ్యతను పెంచాయి. ఇంత పెద్ద సామాజిక, రాజకీయ, కుల బాధ్యతలను నిర్వర్తించే తనభర్త లక్ష్మీనారాయణ వ్యవసాయం చేయడంలో కూడా పనిమంతుడుగా పేరు తెచ్చుకున్నాడు. కష్టజీవి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు. ఏ పనైనా ఇష్టంగా చేసేవాడు. ఇన్ని వ్యవహారాల మధ్య బ్యాంకు ఉద్యోగానికి న్యాయం చేయలేకపోవడంతో దానికి రాజీనామా చేశాడు.
లక్ష్మీనారాయణకి కుటుంబం అంటే అమితమైన ప్రేమ. పిల్లలంటే ప్రాణం. పెద్ద కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. మంచి సంబంధం వచ్చిందని చిన్న కూతురికి కూడా చిన్న వయసులోనే పెళ్లి చేశాడు. కొడుకు నాగేశ్వరరావుని నంద్యాలలో పెట్టి డిగ్రీ చదివిస్తున్నాడు. చిన్న కొడుకు లోకనాథ్‌ ఊర్లోనే ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న లక్ష్మీనారాయణ, అవతలి వర్గం వారు కోరినట్లుగా తమ కుల సమూహపు ఓట్లను వారికి, వారి పార్టీకి వేయించడానికి నిరాకరించాడు. ఎంత ప్రాధేయపడినా, పదవి ఆశ చూపినా నమ్మిన పార్టీని మోసం చేసి ఆధిపత్య కులాల వారికి, వారి పార్టీకి ఓటు వేయించడానికి లక్ష్మీనారాయణ ఒప్పుకోలేదు. మాదిగ కుల పెద్ద చిన్నతిరుపాల్‌ హత్య తర్వాత మాకిక ఎదురులేదు అనుకుంటున్న ఆధిపత్యరెడ్డి సమూహాలకు అదే కుటుంబం నుంచి లక్ష్మీనారాయణ ఎదిగిరావటం నచ్చలేదు. ఆధిపత్య కులాల వాళ్ళ ఆస్తులు పెరిగాయి, అంతస్తులు పెరిగాయి, రాజకీయ పలుకుబడి పెరిగింది, కాంట్రాక్టులు పెరిగాయి, పదవులు పెరిగాయి. వీటితో పాటు మాదిగల ఎదుగుదల మీద ఓర్వలేని తనం కూడా పెరిగింది. లక్ష్మీనారాయణ ధిక్కారణ వలన అతని మీద కక్ష పెరిగింది. పగ పెరిగింది. మాదిగ నాయకుడు తాము చెప్పినట్టు వినకపోవడం రెడ్డి కులస్తులు కొందరు అవమానంగా భావించారు. లక్ష్మీనారాయణ బతికి ఉంటే తాము రాజకీయాలు చేయలేమని భావించారు. సందర్భం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఒక సంఘటన కలిసి వచ్చింది. ఆ కంటిని పొడవడానికి ఆ వేలునే వాడొచ్చని పకడ్బందీ పథకాన్ని అల్లారు.
లక్ష్మీనారాయణ సమీప బంధువు దుగ్గన్న. ఉన్న వూరిలో బతుకు తెరువు కరువై లక్ష్మీనారాయణ అండతో, తన ఆరుగురు కొడుకులు ఒక కూతురుతో బతుకుతెరువు కోసం గుళ్ళదుర్తి గ్రామానికి వలసగా వచ్చి చేరాడు. లక్ష్మీనారాయణ పక్కనే ఉంటూ చిన్నచిన్న పనులు చేసి పెడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేవాడు. లక్ష్మీనారాయణ చిన్న చిన్నాయన మూగన్న మనవడు, దుర్గన్న కూతురు ఒకరినొకరు ప్రేమించుకుని లేచిపోయారు. ఇట్లా వాళ్ళిద్దరూ లేచిపోవడానికి వాళ్లకు అనుకూల పరిస్థితులు కల్పించి సహాయం చేసింది లక్ష్మీనారాయణ అని ఆధిపత్య కులాల వాళ్ళు ప్రచారం చేసి ఊరిని, దుర్గన్న కుటుంబాన్ని నమ్మించారు. దుర్గన్నను ఆయన ఆరుగురు కొడుకుల్ని రెచ్చగొట్టారు లక్ష్మీనారాయణ దీనికి పథకం వేశాడని, తమ కుటుంబ పరువు తీయడానికి ఇంతటి కుతంత్రానికి పాల్పడ్డాడని నమ్మాడు దుగ్గన్న. ఊర్లోని ఆదిపత్యకులం వాళ్లు లక్ష్మీనారాయణని హతమార్చడానికి ప్రణాళిక వేశారు. నీ కుటుంబానికి జరిగిన పరువు నష్టం పూడుకోవాలంటే లక్ష్మీనారాయణను హతమార్చడమే నీకు మార్గమని పురికొల్పారు. దానికి కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. 20 ఏళ్ల క్రితం లక్ష్మీనారాయణ చిన్నాయన చిన్న తిరుపాల్‌ని ఒక పథకం ప్రకారం దారుణంగా నరికి చంపిన ఆధిపత్య కులాల వాళ్ళే, ఇప్పుడు లక్ష్మీనారాయణ హత్యకు కూడా పథక రచన చేశారు. దుగ్గన్నని, అతని కొడుకుల్ని సమావేశపరిచి కాబోయే ఖర్చుల కోసం అని ఒక్కొక్క ఇంటికి, తక్కువలో తక్కువ పదివేల చొప్పున చందాలు వేసుకొన్నారు. ఈ చర్యతో పూర్తిగా దుగ్గన్న కుటుంబాన్ని లోబరుచుకొని, తమవశం చేసుకున్నారు. లక్ష్మీనారాయణను చంపడానికి దుగ్గన్న కుటుంబంలోని మగవాళ్ళను ఒక మారణాయుధంగా మలుచుకున్నారు.
2007 మార్చి 15న లక్ష్మీనారాయణ పక్క ఇంట్లో ఉండే బంధువుల ఇంట్లో జరుగుతున్న దినకర్మకి ఆ ఇళ్ల సందున పొద్దున్నే సందడి మొదలైంది. ఆడపిల్లలిద్దరూ భర్తలతో తల్లిగారి ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం భోజనాలకి మసాలాలు సిద్ధం చేస్తా ఉంది వెంకటలక్ష్మమ్మ. భర్త లక్ష్మీనారాయణ చిన్న కొడుకు లోకనాథ్‌కి తానే స్వయంగా స్నానం చేయించి, పౌడర్‌ రాసి, బట్టలు తొడిగి బడికి పంపించాడు. పొద్దున 8:30 కల్లా ఉగ్గాని తిని ఇంటి ముందు బయట కుర్చీ వేసుకొని కూర్చుని ఉన్నాడు. దుగ్గన్న ఆయన నలుగురు కొడుకులు ఆ వీధిలో ఒకసారి అటు ఇటు తిరిగి అదను చూసుకొని ఒక్కసారిగా లక్ష్మీనారాయణ మీద కత్తులు గొడ్డళ్ళతో దాడి చేయడం మొదలుపెట్టారు. పెద్దకూతురు అడ్డంపడితే ఆమెను ఈడ్చి అవతల విసిరి పడేశారు. ఇంతలో వెంకటలక్ష్మమ్మ పరిగెత్తుకొచ్చి అతని మీద వేటు పడకుండా, అతన్ని వాటేసుకొని చేతులతో చుట్టుకుపోయింది. ఆమెను విడిపించటానికి ఆమె కుడి చేతిని మణికట్టు దగ్గర నరికారు మణికట్టు దగ్గర నుండి ముంజెయ్యి వేలాడ పడిపోయింది వెంకటలక్ష్మమ్మకి. లక్ష్మీనారాయణని నరుకుతున్నప్పుడు ఒకరి చేతిలో కత్తి మధ్యకు విరిగిపోయింది. పథకం ప్రకారం పక్కింట్లో దాచిన కొన్ని మారణాయుధాలని ఆ ఇంట్లో ఉండే బంధువే అందించాడు.
లక్ష్మీనారాయణకి ఒళ్లంతా కత్తిపోట్లు, నరికివేతలు. కుడి చెంప నిలువునా రెండుగా చీలిపోయింది. మాట్లాడలేకపోయాడు.. ఒక గుక్క నీళ్లు కూడా తాగలేకపోయాడు… ఇంతలో అందరూ గుమిగూడారు హత్య చేసిన వాళ్ళు పారిపోయారు. లక్ష్మీనారాయణను కోయిలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌ ఎక్కిస్తుండగా ప్రాణం కోల్పోయాడు లక్ష్మీనారాయణ…
లక్ష్మీనారాయణ హత్యకు ప్రత్యక్ష సాక్షి అతని భార్య వెంకటలక్ష్మమ్మ కాబట్టి ఆమెను కూడా చంపేయాలనుకుంటున్నారని, అది కూడా ఈ రాత్రికి రాత్రే చేసేయాలని అనుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుసుకుంది వెంకటలక్ష్మమ్మ. భర్త శవం ఆసుపత్రి మార్చురిలో ఉంటే, సగం తెగి వేలాడుతున్న చేతికి సరైన చికిత్స కూడా లేకుండా, తాను ఆ రాత్రంతా వేరేచోట ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని దాక్కుంది. గొడ్డలి పోటుకు గురై, మణికట్టు దగ్గర వేలాడే ఆ చేతితో, భర్తను పట్టపగలు, ఇంటి ముందు కూర్చున్న వాడిని కత్తులతో గొడ్డళ్ళతో దాడి చేసి చంపేశారన్న అలివి గాని దుఃఖంతో, ప్రాణభయంతో ఆ రాత్రిని గడిపింది వెంకటలక్ష్మమ్మ!
తర్వాత రోజు ఐదు గంటల పాటు డాక్టర్లు శ్రమించి, ఆపరేషన్‌ చేసి, ఆ చెయ్యిని మొండి చేయి కాకుండా చెయ్యిగా నిలబెట్టారు.
పెళ్లయిన ఇద్దరు ఆడపిల్లల పెట్టి పోతలు, ఇంకా చేతికందని ఇద్దరు కొడుకులు చదువుల భారం, వ్యవసాయం, ఇల్లు, గొడ్డు, గోదా, భర్తని మర్డర్‌ చేసి చంపారనే మాట, విధవరాలితనపు భారం, వీటన్నిటిని ఒంటరిగా మోయాల్సి వచ్చింది వెంకటలక్ష్మమ్మ. ఇంత భారాన్ని మోస్తూనే కేసు నడపటానికి పూనుకుంది. చెప్పుడు మాటలు విని ఇంత దారుణానికి ఒడిగట్టామని, దానికి పశ్చాత్తాప పడుతున్నామని, తమ మీద కేసు కట్టొద్దని, క్షమాపణ కోరుతూ, అట్లా రాజీకి వచ్చిన పక్షంలో నష్ట పరిహారంగా 20 లక్షలు చెల్లిస్తామని వర్తమానం పంపించాడు దుగ్గన్న. దానికి వెంకటలక్షమ్మ తన నిలువెత్తు ధనం పోసినా రాజీకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ కేసులో రాజీ కుదర్చటానికి, పత్తిపాటి సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, మసాల వీరన్నలు వేరువేరుగా ఎంతో ప్రయత్నం చేశారు. కానీ తాను మాత్రం న్యాయం కోరుతున్నానని స్పష్టం చేసింది వెంకటలక్ష్మమ్మ.
తనతో పాటు మిగిలిన ఇద్దరు కొడుకుల్ని సంరక్షించుకోవాలని తన తమ్ముళ్ల సలహాతో, సహకారంతో గుండ్లదుర్తి గ్రామాన్ని వదిలేసింది వెంకటలక్ష్మమ్మ. కడప సమీపంలోని పెద్ద వ్యవసాయ భూమిలో పెద్ద చెట్ల మధ్య కనిపించి, కనిపించకుండా ఉండే చిన్న ఇంటిలో ఇద్దరు కొడుకులతో తలదాచుకుంది. ఆలనా పాలనా లేని ఆ భూమిలో వ్యవసాయం మొదలు పెట్టింది. వరి, ఎర్రగడ్డలు, కందులు ఇట్లా రకరకాల పంటలు పండిరచింది. కొబ్బరి చెట్లకు ట్రీట్మెంట్లు చేసి గెలలు గెలలుగా కాయలు కాపించింది. జామ చెట్లకు పాదులు తీసి ఎరువులేసి గుత్తులు గుత్తులుగా కాయలు కాపించింది ఈ దిగుబడి చూసి కన్నుకుట్టిన భూమి యజమాని మాట తప్పి, పంటలో పెద్ద మొత్తంలో వాటా అడిగింది. మోసం చేసింది. దానికి తోడు చీకటి పడితే అత్యంత భయంకరంగా మారిపోయేదా ప్రాంతమంతా. మనుషుల ఉనికి లేక, అడవి జంతువులతో, పక్షుల అరుపులతో, గబ్బిలాలతో మహా ఒంటరిగా అనిపించేది వెంకటలక్ష్మమ్మకి. చిన్న కొడుకుని హాస్టల్లో వేసింది. పనికిపోయిన పెద్దకొడుకు తిరిగి వచ్చేవరకు శూన్యంగా అనిపించేది. ఈ కారణాలతో ఆ చోటుని వదిలిపెట్టి కడపలో ఆ చివర ఇంకో అంచుకు చేరింది వెంకటలక్ష్మమ్మ. ఆ ప్రాంతంలో కూడా ఏదో ఒక సమస్య. మళ్ళీ అక్కడ నుంచి మరోచోటికి. ఎక్కడికి పోయినా హత్యకు గురైన వ్యక్తి భార్యగా, ఫాక్షన్‌ కుటుంబంగా ముద్రపడి ఉండటం వలన ఎవరూ వీరితో సరిగా కలిసే వాళ్ళు కాదు. ఆ సామాజిక దూరాన్ని, వివక్షను వేదనతో అనుభవించింది. చిన్న చిన్న పనులు చేస్తూ చిన్నాచితక బేరం చేస్తూ కూరగాయలో, పళ్ళో అమ్ముతూ కుటుంబ జీవనాన్ని నడిపించింది. ఆడపిల్లల ఆలనా పాలన చూసింది. కొడుకుల చదువుకుంటు పడకుండా చదివించింది. కొడుకుల సంరక్షణను ఒక కంట కనిపెడతా ఉంది.
ఇదంతా ఒక ఎత్తైతే ప్రధాన సాక్షిగా కేసు నడపడం మరొక ఎత్తు. కర్నూలు కోర్టు చుట్టూ తిరగడం, లాయర్లతో మాట్లాడటం, సాక్షులు జారిపోకుండా కనిపెట్టుకొని ఉండటం, పోలీసులతో పడటం, కులపోళ్ళ సూటిపోటి మాటలను కాయడం, తన వాళ్ళు అనుకున్న వాళ్ళ తిరస్కారాన్ని, బంధువుల అనాధరణని, మాట ఇచ్చిన వాళ్ళ మోసకారితనాన్ని, అవతలి వర్గం వాళ్ళు సాక్షుల్ని కోర్టుకు రానివ్వకుండా అడ్డుకోవటం, బెదిరించటం, ఇంకా ఇలాంటి వాటిని ఎన్నింటినో భరించడం ఇంకొక ఎత్తు.
వదిలేసి వచ్చిన గుళ్లదుర్తి ఊర్లో ఇల్లు, వాకిలిని పట్టించుకునే వాళ్లే లేరు. డబ్బు మంచి నీళ్లలా ఖర్చయింది. ఆర్థికపరమైన ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఎడ్లని, ఆవుల్ని, బరిగొడ్లని, మేకల్ని అమ్ముకోవాల్సి వచ్చింది, ఉన్న పొలంలో ముప్పావు భాగాన్ని ఈ కేసు నడపడానికే అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రతి ఏడాది పొంగే కుందూనది ఇళ్లలోకి వచ్చి మేటవేసిన బురదతో ఇల్లు పాడైపోయింది. అయినా వెనక్కి తిరిగి రావాలనుకోలేదు వెంకటలక్ష్మమ్మ. న్యాయ పోరాటం చేసింది.
భర్త హత్య జరిగిన ఐదేళ్లకి అంటే 2011లో కర్నూలు న్యాయస్థానం తన భర్తను హత్య చేసిన దుగ్గన్నకు అతని నలుగురు కొడుకులకు, మరొకరికి 14 ఏళ్ల జీవిత ఖైదు విధించింది అందరూ జైలు పాలయ్యారు. వారిలో ఒకరు అనారోగ్యంతో జైలులోనే మరణించారు. ఇంకొకరు బెయిల్‌ మీద బయటకు వచ్చి ఇంకేదో మరొక హత్యకు పాల్పడ్డారు. న్యాయస్థానంలో తీర్పు వచ్చిన మరో మూడు ఏళ్లకి అంటే 2014లో వాతావరణం కొంత సద్దుమణిగాక, తిరిగి తన ఇద్దరు కొడుకులతో వెంకటలక్ష్మమ్మ గ్రామంలోకి అడుగు పెట్టింది. ఇల్లు కడుక్కొని మిగిలిన కొద్దిపాటి భూమిలో వ్యవసాయం మొదలుపెట్టింది. కొడుకు నాగేశ్వరరావుకి పెళ్లి చేసింది.
వీటన్నిటిలోనూ తోడబుట్టిన తన ఇద్దరు తమ్ముళ్లు, కట్టుబడి శ్రీనివాసులు, డాక్టర్‌ కట్టుబడి వెంకటరమణలు తోడునీడై నిలిచారు. మరదళ్ళు తమ పూర్తి సహకారాన్ని అందించారు. తన తమ్ముళ్లు ఇద్దరు తనకు వెన్నంటి ఉండటం వలననే ఇంతటి దారుణ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొగలిగానంటుంది వెంకటలక్ష్మమ్మ. ఆర్థికంగా కూడా వాళ్ళు ఇచ్చిన భరోసాతోనే తాను ఈ కేసు గెలవగలిగానని చెబుతుంది. మరి ముఖ్యంగా తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నత చదువులు చదివి, బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉండటం, పైగా అంబేద్కర్‌ ఆశయ సాధన దిశగా కృషి చేసే వాళ్ళు కావడం వలన, తన వ్యాకులతని, ఆందోళనని, వేదనని, దుఃఖాన్ని, నిరాశను, ఆవేశాలను, అసంబద్ధ ఆలోచనలను క్రమబద్ధీకరించారని వెంకటలక్ష్మమ్మ నమ్మకం. అట్లాగే కోర్టుల పట్ల, న్యాయవ్యవస్థ పట్ల, చట్టాల అమలుపట్ల, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల, తన తమ్ముళ్ళే తనలో విశ్వాసాన్ని కలిగించారని, దాని వలనే తాను ఈరోజు ఎంతో కొంత శాంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నానని అంటుంది వెంకటలక్ష్మమ్మ.
నలభై అయిదేళ్లకే భర్తని కోల్పోయింది. పగకి పగే బదులు కాదని, న్యాయపోరాటం, కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుందనడానికి తన జీవితమే నిదర్శనం అని ఆమె చివరి మాట! ఇప్పుడు ఈ అరవై మూడేళ్ళ వయసులో వెంకటలక్షమ్మ చెప్తున్న మాట ఒక్కటే అదురు లేదు, బెదురు లేదు ధైర్యం తప్ప!
హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్మెంట్‌ – తెలుగు శాఖ, యోగి వేమన విశ్వ విద్యాలయం, కడప

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.