పోయిన సంవత్సరం ప్యారిస్ ఒలంపిక్స్‌లో ఇమానే ఖలీఫ్ అనే అల్జీరియాకి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి గురించి తలెత్తిన వివాదం గుర్తుందా? తన చేయి దెబ్బ చాలా గట్టిగా తగులుతుందని ప్రత్యర్థి ఆట నుంచి తప్పుకుంది, దాంతో ఇమానే జెండర్ గురించి ప్రశ్నలు తలెత్తాయి. తన మహిళ కాదు అని, చూడ్డానికి పురుషుడు లాగా ఉందని, ట్రాన్స్ జెండర్ అయ్యే అవకాశం ఉండొచ్చని చాలా వాదనలు వినబడ్డాయి.
ఆమెకి కొన్ని మెడికల్ టెస్టులు కూడా చేశారు, జెండర్ నిర్ధారణ చేయడానికి. ఇలాంటి జెండర్ అగ్నిపరీక్షలు అవ్వడం మొదటిసారి కాదు. సెరీనా విలియమ్స్ తన అప్పియరెన్స్ గురించి మొదట్లో బాగా ట్రోల్ అయ్యేది, చూడ్డానికి ఆడదానిలాగా లేదని. శాంతి సౌందరరాజన్ సిల్వర్ మెడల్ గెలిచినప్పటికీ జెండర్ టెస్ట్ ఫెయిల్ అయిందని తన మెడల్ వెనక్కి తీసేసుకున్నారు. పబ్లిక్‌గా ఎంతో అవమానం జరిగే సరికి తను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. పింకీ ప్రామాణిక్ విషయంలోనూ అదే జరిగింది, తన పార్టనర్ పింకీ ఒక పురుషుడని, తనని రేప్ చేసిందని ఆరోపించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా పింకీని అరెస్టు చేసి మగవాళ్ళ సెల్లో 26 రోజులు ఉంచారు. జెండర్ టెస్ట్‌ల ప్రకారం ఆమె hermaphrodite అని తేల్చారు, అంటే ఇంటర్‌సెక్స్.
పైన చెప్పిన వాళ్ళందరూ కూడా ఆడవాళ్లే. పుట్టినప్పుడు ఆడపిల్ల అనే సర్టిఫికెట్ ఇచ్చారు, వాళ్ళు పాల్గొనే స్పోర్ట్స్ పోటీల్లో ఫీమేల్గానే నమోదు అయ్యారు. మరి ఉన్నట్టుండి వాళ్ళ జెండర్ మీద ఎందుకు ప్రశ్నలు వచ్చాయి? (అదేంటో గాని మెడల్స్ గెలిచిన తర్వాత మాత్రమే వీళ్ళ అందరి మీద ఆరోపణలు వచ్చాయి, అది వేరే విషయం).
ఎందుకంటే జెండర్‌ని, బయోలాజికల్ సెక్స్‌ని, సెక్సువాలిటీని మనం కలిపేసాం, దేనికదే ప్రత్యేకమని ఇంకా తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి. ఈ అవగాహన రాహిత్యం ఎంతలా ఉందంటే ఇంటర్‌సెక్స్ అనేది మెడికల్ కండిషన్ అని తెలియక ఒక వ్యక్తి జెండర్‌ని మనకున్న మిడిమిడి జ్ఞానంతో మనమే నిర్ణయించేసేంత, ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో సహజీవనం చేస్తే అందులో ఒకరు ఆడ వేషంలో ఉన్న మగ వ్యక్తి అని చచ్చు తీర్పులు ఇచ్చేంత. బయోలాజికల్ సెక్స్ అంటే క్రోమోజోమ్స్, హార్మోన్స్, శరీర నిర్మాణంÑ కానీ డిఫరెన్సెస్ ఇన్ సెక్స్ డెవలప్మెంట్ వంటి పరిస్థితులు వైవిధ్యాలను తెస్తాయి, ఉదాహరణకు ఎక్స్, వై క్రోమోజోమ్స్ ఉన్నా స్త్రీ శరీర లక్షణాలు ఉండొచ్చు.
ఒకప్పుడు లియాండర్ పేస్‌ని కూడా ఆయన శరీర తీరుని బట్టి హేళన చేశారు. డేవిడ్ బెకాం లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీ కూడా గోళ్ళ రంగు వేసుకున్నందుకు ట్రోలింగ్కి గురయ్యాడు. వీళ్ళిద్దరూ కూడా మగతనం ఉట్టిపడేలా లేకపోవడం కొందరు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు వీళ్ళందరి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, వీళ్ళని LGBTQ స్పెక్ట్రమ్‌లో కలిపేయడం వల్ల. పితృస్వామ్య హెటెరోనార్మేటివ్, జెండర్ రోల్స్ నియమాలని వీళ్లు ఉల్లంఘించడమే అందుకు కారణం. హెటెరోనార్మేటివ్ అంటే ఆడ మగ అనే అచ్చులను తయారు చేసే ఒక యంత్రం. జెండర్‌ని బట్టి ఒక వ్యక్తి ఏం చేయాలి, ఎలా
ఉండాలి, ఎలా కనిపించాలి, ఎలా ప్రవర్తించాలి అని నిర్ణయించే ఒక యంత్రాంగం. దీనికి అనేక మూల కారణాలు పితృస్వామ్యం, మతం, ఆచారాలు, సంస్కృతి, మూఢత్వం- ఇలా ఎన్నో. హెటెరోనార్మేటివ్ ఫ్రేమ్ వర్క్‌కి బయట ఉన్న అందరినీ అన్నిటిని క్వీర్ ముద్ర వేస్తారు. అదో అసాధరణతగా పరిగణించి వాళ్లని హింసకి, హేళనకి, అవమానాలకి గురిచేస్తారు.
క్వీర్ అంటేLGBTQ+ మాత్రమే అని ఒక అపోహ. క్వీర్నెస్ అనేది కొందరికి సంబంధించిన విషయం మాత్రమే, మనకెందుకు అని అనుకునే వాళ్లే ఎక్కువ. కానీ క్వీర్నెస్ని అర్థం చేసుకోకపోవడం వల్ల LGBTQ సమూహాలకి మాత్రమే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఎలా హాని కలుగుతుందో పైన చెప్పిన ఉదాహరణలు చాలవూ అర్థం చేసుకోవడానికి?
క్వీర్నెస్ అంటే హెటెరోనార్మేటివ్ పరిధిలో లేనిది. Heteronormativity కూడా మనుషులందరికీ ఒకేలా ఉండదు. ఇందులో కేవలం ఆడ, మగ మాత్రమే ఉంటారు. వాళ్లు ఎలా ఉండాలి అని కొన్ని మౌల్డ్స్ ఉంటాయి. ఆ మౌల్డ్స్‌లో పట్టిన వాళ్ళు మాత్రమే నార్మల్. ‘‘Masculine గా, కొన్ని రకాల హార్మోన్స్ ఉండి, ఏడవకుండా, ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటే మగాడు. ఫెమినైన్గా, కొన్ని రకాల హార్మోన్స్ ఉండి, సున్నితంగా ఉంటే ఆడది’’ ఇది జెండర్‌ని బయోలాజికల్ సెక్స్‌తో కలిపి చేసిన కషాయం. ఈ కషాయాన్ని కొన్ని తరాలుగా తాగుతూ వచ్చారు, తాగిస్తూ వచ్చారు. ఆడ లక్షణాలు కలిగిన ఆడవాళ్లు, మగ లక్షణాలు కలిగిన మగవాళ్లు మాత్రమే హెటెరోనార్మేటివ్ సమాజంలో ఉండడానికి అర్హులు.
క్వీర్నెస్ని కేవలం జెండర్, సెక్సువాలిటీకి మాత్రమే పరిమితం చేసి చూడడం వల్ల పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీలు లేకుండా పోతుంది. హెటెరోనార్మేటివ్ సమాజ ప్రమాణాల ప్రకారం మగాడు ఆడదాన్ని ఇష్టపడాలి, ఆడది మగాడిని ఇష్టపడాలి, ఆడ మగ కలిసి పిల్లల్ని కనాలి, ఆడది ఇంటి పని వంట పని చేస్తే మగాడు బయట సంపాదించాలి లాంటి కొన్ని నియమాలు వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి. కేవలం వాళ్లు చేసే పనులు మాత్రమే కాదు, వాళ్లు ఎలా కనపడాలి ఎలా ప్రవర్తించాలి అనే దానికి కూడా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఒంపు సొంపులు, పెద్ద జడ, బిడియంగా ఉండాల్సింది అమ్మాయిలు. అలాగే కండలు తిరిగి, ఎప్పుడూ గంభీరంగా ఉండాల్సింది అబ్బాయిలు. ఈ ప్రమాణాలకి దూరంగా ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మరి వీళ్ళందర్నీ క్వీర్ క్యాటగిరీలో ఎందుకు చూడరు? పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు, పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలు వద్దనుకున్న వాళ్ళు, polyamorous వ్యక్తులు, జుట్టు పెంచుకుంటున్న అబ్బాయిలు, జుట్టు తీసేస్తున్న అమ్మాయిలు, male colour అయిన బ్లూని ఇష్టపడే అమ్మాయిలు, ఫిమేల్ కలర్ అయిన పింక్‌ని ఇష్టపడే అబ్బాయిలు, మేకప్ వేసుకునే అబ్బాయిలు… వీళ్లందరూ క్వీర్ కదా! ఇవన్నీ వ్యక్తిగత ఇష్టాలు అంటారా, మరి ఎవరితో ఉండాలి, ఎవరికైనా ఆకర్షణ కలగాలి, ఎవరితో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలి అనేవి వ్యక్తిగత ఇష్టాలు కాదా? క్వీర్నెస్ని కేవలం ఆకర్షణ, సెక్స్‌కి మాత్రమే ముడిపెట్టి ఎందుకు చూడటం? క్వీర్నెస్ అంటే జెండర్, సెక్సువాలిటీ గురించి మాత్రమే కాదు, ఇది సమాజం విధించిన ఆడ-మగ అచ్చులను సవాలు చేయడం. అలా సవాలు చేసే వాళ్ళందరూ కూడా క్వీర్ వ్యక్తులే. ఈ దృక్కోణంలో క్వీర్నెస్ని అర్థం చేసుకోనంతకాలం కేవలం LGBTQ స్పెక్ట్రమ్‌కి చెందినవాళ్లే కాక, సమాజ నియమాలు ఉల్లంఘించిన వాళ్లందరికీ కూడా నష్టమే. తీవ్ర అసమానతలు ఉన్న మన దేశంలో ఈ ఉల్లంఘన వల్ల శిక్షలు కూడా ఆయా వ్యక్తుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం బట్టి ఉంటుంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఒక వ్యక్తి సమాజం ఆమోదించని జీవనశైలిని ఎంచుకుంటే, వారు తీవ్రమైన సామాజిక తిరస్కారం, వివక్షను ఎదుర్కొనవచ్చు, అయితే నగరంలో సంపన్న నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఇలాంటి ఎంపికలు చేసినప్పుడు వారి అనుభవం భిన్నంగా ఉండొచ్చు, కానీ సమాజం నుంచి ఒత్తిడి తప్పదు.
క్వీర్నెస్ని అర్థం చేసుకోవడం అనేది సమాజంలోని కొన్ని అసమానతలను తొలగించి, సమానత్వం సాధించడానికి ఒక మార్గం. హెటెరోనార్మేటివ్ నిబంధనలను చెరిపేసి, జెండర్, సెక్సువాలిటీ లేదా జీవనశైలి వైవిధ్యాలను గౌరవించే సంస్కృతిని పెంపొందించడం ద్వారా ప్రతి వ్యక్తి తమ గుర్తింపును భయం లేకుండా వ్యక్తీకరించగలిగే సమాజాన్ని సృష్టించవచ్చు. తద్వారా ప్రతి వ్యక్తి తమ వైవిధ్యాన్ని స్వేచ్ఛగా ఆనందించగలుగుతారు. ఇది కేవలం LGBTQ సమూహాల కోసం మాత్రమే కాదు, సమాజం విధించిన నియమాలను
ఉల్లంఘించే ప్రతి ఒక్కరి కోసం.
