ఆంక్షల కంచెలు లేని
మనోహర వినీలాకాశంలో..
విహార గానం ఆలపిస్తున్న
శాంత కోయిల గానంలో
దొర్లిన అపశృతులివి.
ఇలా తలంలో
సహజ స్వేచ్ఛా పావురాల
రెక్కల చప్పుడులో
తప్పిన తాళమిది.
ఇది హింస రాగం.
ఆధిపత్య తాళం.
ఎక్కడికో ఎగిరి పోతున్న
ఆ తీతువు తన ఆప్త మిత్ర గుడ్లగూబతో చేసిన
విద్రోహ ముచ్చట ఇది!
ఇనుప గద్దతో నక్కలు చేస్తున్న
ఉమ్మడి సైనిక విన్యాసం ఇది!!
తోడేళ్ళు, ఎలుగుబంట్లు కలిసి పంచుకుంటున్న
విధ్వంస పని విభజన!
ఎవరీ ఘోరకలి దోషులు?
విచక్షణ కోల్పోయి
వేట్లు వేసే
పదునెక్కిన కత్తి పిడులేనా?
లేదా
పట్టుకున్న ఆ చేతులా?
ధీర సైనికా!
నీవూ ఒక ఆయుధం లాంటి
వాడివే కదా!?
నీ ట్రిగ్గర్,
నీ ఆయుధపు ట్రిగ్గర్..
రెండూ
వాడి ‘వాడి’ చేతిలో ఉన్నాయి!
నువ్వే ఒక పెను విధ్వంసమై
ఒక దేశ సార్వభౌమత్వాన్నే
శిథిలం చేయబోతున్నావు…!
అయినా… ఇది నీకేం తెలుస్తుందిలే!?
నీ పేర ఒక వీథి, ఒక రోడ్డు వెలుస్తుందా?
ఏమో కానీ..
ఒక రోజంతా, కాకపోతే వారం పాటు నిన్ను తప్పక అందరూ స్మరిస్తారు!
నీ పేర
ఎన్నో కన్నీటి బొట్లు రాలుస్తారు
మరెన్నో క్యాండిల్ లైట్లు వెలిగిస్తారు!
మరి బాధితులంతా
ఏ మాత్రం సంబంధం లేని, వసివాడని లేత మొగ్గలే కదా!
ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టే
పసి పాపాయిలు,
కంటినిండా ఎన్నో కలలతో
ఆశాసంద్రపు తలాపున నిద్రిస్తూ..
అదిరిపాటున ఒక్క ఉదుటన
దిగ్గున లేచే యువ కెరటాలు,
కుటుంబంలోని కొమ్మలకై కలత నిద్రలో కలవరిస్తున్న
వృద్ధ దంపతులు.. కూడా!
ఈ మానవ చరిత్రను అందరూ కలిసి ఏకగ్రీవంగా ధ్వంస పూరితం చేస్తున్నారు!
ఈ హింసోన్మాదపు అడ్రినలిన్ నరనరానా ఉవ్వెత్తున పెంచుకుంటున్నారు!
ఈ యుద్ధ కాముకులకు
ప్రకటించేందుకు రెడీగా ఉన్నాయ్..
ఎన్ని శాంతి బహుమతులో!
ఓ సరిహద్దులలోని వీర సైనికా…!
నీకు కనబడుతోందా?
బాయ్ నెట్ చివర
ఒక తెల్లని మొగ్గ చిగురు వేసింది! చూసావా?
క్షిపణి మొదలులో
ఒక అందమైన గులాబీ పూచింది! గమనించావా?
బాంబుల సంచీలోంచి
ఒక మెత్తని పూబాల బోసి నవ్వులు కురిపిస్తోంది! పరికించావా?
పద.. నీవూ మా శాంతి కాముకులతో కలిసిరా!
నీ ఆయుధాలకు
పూచిన పచ్చని పూదోటని
ప్రపంచమంతా విస్తరింపజేద్దాం!
ఆనందాల పుప్పొడిని
విశ్వమంతా వెదజల్లుదాం!!
