వీళ్ళు నిన్నో మొన్నో
బడిచెట్టుమీద వాలిన చిట్టి పిట్టలు
మిలమిలా మెరుస్తున్న కళ్ళతో
కొత్త కొత్తగా భయం భయంగా
చూస్తున్నారు
వీటితో నా మొదటి కలయిక..
ఇప్పుడే..
ఆక్వేరియంలో చెయ్యి పెట్టిన
అనుభూతి
చెంగున సర్దుకొని
నా కళ్ళల్లోకి చూపులు సారించి
సామూహిక గానంతో ఆహ్వానిస్తున్నారు
ఇప్పుడిప్పుడే రేకువిచ్చి
వెలుగు కిరణాలను చూస్తున్న
ఈ కలువ బాలలు ఎంత ముద్దొస్తున్నారో..
ఒక్క చిరునవ్వుతో
వాళ్ల బెరుకుని దూరంచేసి నా వైపు
తిప్పుకున్నా..
ఇక చిలుకపలుకుల పరిచయాలు
మొదలు
ఊరూ పేరూ అమ్మా నాన్నల గూర్చి
రెండు ముక్కలు విప్పాలి.!
అంతలోనే..
రెండో బెంచి హాస్టల్ చిన్నోడు..
ఎక్కెక్కి పడుతుండు..!
హత్తుకొని ఆరాతీస్తును కదా..
అమ్మ యాదికొచ్చిందట
నిన్నో మొన్నో..
వీడిని వదిలి తిరిగిరాని లోకానికి వెళ్లిందట
దుఃఖమేఘమై ప్రవహిస్తున్న బుడ్డోడు
ఈ చిగురుటాకును ఓదారుస్తూ
నా కళ్లు చెమ్మగిల్లాయి.!
తరచి చూస్తే..
మా పేద పిల్లల గాధలు గుండెలవిసేవే
ఈదడమైతే నేర్పుతాం కానీ,
ఎట్లా గట్టెక్కుతారో ఏమోనని దిగులు.
