ఒడిశాలోని గదబ ఆదివాసీ సముదాయానికి చెందిన మహిళలు ధరించే ముక్కు, చెవిపోగులు ఆ మహిళలకు తమ పరిసరాలతో ఉన్న లోతైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తాయి
సువాసన వెదజల్లుతూ, మీగడ తెలుపు, పసుపు రంగుల్లో ఉన్న కఠ్గొలాప్ (ఫ్రాంజిపానీ లేదా ప్లూమేరియా రుబ్రా – దేవగన్నేరు) పూలతో పొడవైన దండ అల్లుతున్నారు చంద్రమ.
ఆవిడ సింగారించుకున్న మూడు బంగారు ముక్కుపోగుల ప్రకాశం ముందు ఈ ఏప్రిల్ నెల మధ్యాహ్నవేళ తీక్షణంగా మండుతోన్న పసుపు రంగు సూర్యుడు, ఆమె చేతుల్లోని అందమైన దేవగన్నేరు పువ్వు మధ్యనున్న ముదురు పసుపు రంగు వెలవెలబోతున్నాయి. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా, పూత్పొందీ గ్రామ శివార్లలో ఉన్న ఒక బయలు ప్రదేశంలో, ఆమెతో పాటు గదబ ఆదివాసీ సముదాయానికి చెందిన మరో ఇరవైమంది మహిళలు పూలదండలు అల్లడంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళందరూ రెండు లేదా మూడు ముక్కుపోగులు పెట్టుకొనివున్నారు. ‘‘ఈ కుడివైపున పెట్టుకున్నదాన్ని బేస్రి(బేసరి) అంటాం. మధ్యలో ఉన్నది దోందీ(బులాకీ). ఎడమవైపు ఉన్నది నత్తో(నత్తు). నేను వీటిని ఎప్పటినుండో పెట్టుకుంటున్నాను. బహుశా, వీటితోనే పుట్టినట్టున్నాను,’’ నవ్వుతూ అన్నారు 70 ఏళ్ళ చంద్రమ గదబ. ఆమె మాట్లాడుతున్నప్పుడు, ముక్కు దూలం చివర వేలాడుతోన్న బులాకీ కొంచెం పైకి లేవడంతో, అందాకా ఆ బంగారు బులాకీకి ఉన్న మువ్వల కింద దాగివున్న ఆమె కింది పెదవి కనిపించింది.‘‘ఒకప్పుడు మా గదబ తెగలో అమ్మాయిలు పసిపిల్లలుగా ఉన్నప్పుడే ఈ మూడు రకాల ముక్కుపోగులను పెట్టుకునేలా చేసేవారు. కానీ ఇప్పుడు ఐదు, పది సంవత్సరాలు నిండాక మాత్రమే ముక్కు కుట్టించుకుంటున్నారు. కొన్నిసార్లు, అమాయిలు ముక్కు కుట్టుంచుకోవడానికి ఇష్టపడటమే లేదు,’’ ఆమె తెలిపారు. మాట్లాడే ప్రతి మాటతో పాటు, ఆవిడ తన చురుకైన వేళ్ళతో తాజాగా కోసిన కొన్ని పువ్వులను దండగా అల్లుతున్నారు. ఆ సాయంత్రం, వేటకి వెళ్ళిన మగవాళ్ళు ఇంటికి తిరిగి రాగానే, ఆడవాళ్ళు ఈ పూలదండలతో వాళ్ళకి స్వాగతం పలుకుతారు. ఇదే చైత్ పరబ్ (చైత్ర పర్వ అని కూడా పిలుస్తారు). ఒడిశా, రaార్ఖండ్లలోని అనేక ఆదివాసీ తెగలు జరుపుకునే 14 రోజుల వ్యవసాయ పండుగే చైత్ పరబ్. హిందూ క్యాలెండర్లో మొదటి నెల అయిన చైత్రమాస ప్రారంభాన్ని ఇది సూచిస్తుంది. ఈ పండుగను ఏప్రిల్ మధ్యలో జరుపుకుంటారు. సంప్రదాయకంగా ఇది పొలం పనుల నుండి విశ్రాంతి తీసుకునే సమయం కూడా. గాలి మొత్తం వేసవి పాటలతో, వేసవి కాలంలో విరివిగా దొరికే పండ్ల, పూల పరిమళాలతో నిండిపోయే సమయం. ఈ పండుగలో భాగంగా, గదబ సముదాయంలోని యువతులు, వృద్ధ మహిళలు పాటలు పాడతారు, నాట్యం చేస్తారు, తాగుతారు, గ్రామ దేవతలకు పచ్చి మామిడికాయలను సమర్పిస్తారు. అలాగే, వేట నుండి ఇంటికి తిరిగివచ్చే మగవాళ్ళను స్వాగతించడానికి దండలు అల్లుతారు.
ఒకప్పుడు ఈ ఆచారం, ఈ సముదాయాలలోని ప్రజల జీవితాలు పరస్పరం ఎంత అద్భుతంగా అనుసంధానించి ఉండేవో సూచించేది. అలాగే, వాళ్ళ ఆహార వ్యవస్థలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, అటవీ పర్యావరణ వ్యవస్థ గురించి వాళ్ళకి ఉన్న జ్ఞానానికి ప్రతీకగా నిలిచేది. ఏప్రిల్లో చేతికొచ్చే పంటలేవీ ఉండవు కాబట్టి, మగవాళ్ళు వేటకు వెళ్ళేవారు. అడవికి దగ్గరగా నివసించే సముదాయాలు అడవి బెర్రీలు, పండ్లు, అడవి జంతువులపై ఎక్కువగా ఆధారపడవలసి వచ్చేది. అయితే, అడవిని దోపిడీ చేయకుండా, ఎల్లప్పుడూ అడవిపై ఆధారపడుతూ ఉండటమనేదే దీని వెనుకనున్న అసలైన ఆలోచన. ఇదిలా ఉంటే, కొన్ని దశాబ్దాలుగా ముఖ్యంగా, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద అడవి జంతువులను చంపడంపై నిషేధం విధించినప్పటి నుండి – వేట అనే సంప్రదాయం లాంఛనప్రాయంగా కొనసాగుతూ వస్తోంది. వేటకు, ప్రత్యేకించి చేపల వేటకు వెళ్ళిన మగవాళ్ళు తాము వేటాడిన వాటితో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, చంద్రమతో పాటు మిగతా ఆడవాళ్ళు తాము అల్లుతోన్న దండలతో వాళ్ళకి స్వాగతం పలుకుతారు. ఒక పొడవైన పూలదండను గబగబా తన కొప్పు చుట్టూ ముడుచుకొని, తమ ఆభరణాల గురించి చెప్పటాన్ని చంద్రమ కొనసాగించారు. ‘‘గదబ, పరోజా, డోంగ్రా లాంటి అనేక ఇతర ఆదివాసీ తెగలకు చెందిన మహిళలు బేస్రి, దోండీ, నత్తోలను ధరిస్తారు. కొంతమంది మహిళలు నాలాగా ఎర్రటి రాయి కూర్చిన బంగారు దోండీని ధరిస్తే, మరికొందరు ముక్కుకు ఇరువైపులా బేస్రి, నత్తో మాత్రమే పెట్టుకుంటారు. ముక్కుకు ఇరువైపులా పెట్టుకునే రింగులను బులాక్ (బులాకి) అని కూడా పిలుస్తారు.’’ ఒడిశాలో మొత్తం నమోదై ఉన్న 64 షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలలో 30 తెగలకు చెందినవారు కోరాపుట్లోనే నివసిస్తున్నారు. వాటిలో గదబ ఒక ముఖ్యమైన ఆదివాసీ సముదాయం. రాష్ట్రంలోని సుమారు 60,000 మంది గదబలలో, దాదాపు 80 శాతం మంది కోరాపుట్లోనే నివసిస్తున్నారు. ఈ సముదాయం తన చుట్టూ ఉండే పరిసరాలపైనే ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంది. ‘‘ఈ అడవుల నుండి వాళ్ళు కట్టెలు, కలప, ఆహారం, కెందూ ఆకులు (తునికాకులు) సేకరించడంలో ఎక్కువ సమయం గడుపుతారు,’’ ఈ ప్రాంతంలో, తమ సముదాయాలకు చెందిన వనరులను రక్షించుకోవడంపై ఆదివాసులలో అవగాహన కల్పించే ఒక లాభాపేక్షలేని సంస్థను నడుపుతోన్న బిద్యుత్ మొహంతి వివరించారు. ‘‘అడవితో వారికి ఉండే సంబంధం వారి సంస్కృతి, జీవనశైలి, జీవనోపాధిలో ప్రతిబింబిస్తుంది.’’.
‘‘మేం వాటితో పాటే జీవిస్తాం. అందుకే వాటిని ధరిస్తాం,’’ అంటూ, 67 ఏళ్ళ కలమ గదబ పాము ఆకారంలో చుట్టివున్న తన బంగారు నాంగుల్ (చెవిపోగులు)ను నాకు చూపించారు. ఒక్కోటి ఒక సెంటీమీటరు వెడల్పున్న ఆ చెవిపోగులు ఆమె చెవులకు వేలాడుతున్నాయి. ‘‘మేం అడవికి చెందిన మనుషులం, అలాగే ఈ పాములు కూడా. అవి మా స్నేహితులు,’’ అన్నారామె. చంద్రమ నివసించే మహాదేవ్పుట్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక కుగ్రామంలో కలమ కూడా నివసిస్తున్నారు. ఇతర మహిళలతో కలిసి దండలు అల్లుతున్నప్పుడు, నేను ఆమెను మొదటిసారి కలిశాను. సామూహిక విందు భోజనం కోసం సమీపంలోని మడుగులో కొన్ని చేపలు పట్టడానికి ఆవిడ వచ్చారు. ‘‘ఇది బైరా,’’ పాము తల ఆకారంలో ఉన్న చేపను చేతులలో పట్టుకొని చూపించారామె. ‘‘దాదాపు ఒక దశాబ్దం నుండి కూరగాయలు, పుట్టగొడుగుల కొరత బాగా పెరిగింది. వాతావరణం చాలా వేడిగా ఉంటోంది. ప్రతి ఏడాది వచ్చే కార్చిచ్చులు మా అడవి ఆకుకూరలను స్వాహా చేస్తున్నాయి,’’ అన్నారు కలమ. ‘‘మా పరిసరాల్లో ఏం దొరికితే మేం వాటినే ఉపయోగిస్తాం. మా అమ్మాయిలు యుక్తవయసుకు వచ్చినప్పుడు పువ్వులు, ఎర్రమట్టి, అడవి పండ్లను ఉపయోగిస్తాం. అలాగే, మా పెళ్ళి వేడుకలలో ఆకులు, కలప, పువ్వులను ఉపయోగిస్తాం. కానీ ఇప్పుడు, నాంగుల్లాగే ప్రతిదీ కొరతగా మారింది,’’ అన్నారు కలమ. ‘‘మీరు చూస్తోన్న ఈ చెవిపోగులు మా సంస్కృతికి గుర్తు. మా అమ్మ, అమ్మమ్మ కూడా వీటిని ప్రతీ చెవికి రెండేసి పెట్టుకోవడం నేను చూశాను. పాము మా జమీన్ (భూమి)ను, అడవులను సూచిస్తుందని వాళ్ళు నాకు చెప్పారు. ఏ అమ్మాయి అయినా, మహిళ అయినా బంగారం లేదా ఇత్తడితో తయారుచేసిన వీటిని ధరించవచ్చు. ఒక జత బంగారు నాంగుల్ను చేయడానికి దాదాపు 1 తులం బంగారం (11.66 గ్రాములు) కావాలి,’’ అన్నారు కలమ. ‘‘కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు వీటిని ధరించడం లేదు. బహుశా అందుకేనేమో మా జల్-జంగిల్(నీరు-అడవి) ప్రమాదంలో పడ్డాయి!’’
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/te/article/jal-jungle-and-jewellery-te) జులై17, 2025 లో మొదట ప్రచురితమైనది.)
