పితృస్వామ్య పడగనీడన ప్రేమ కూడా కాటేస్తుంది – కొండవీటి సత్యవతి

ఈ పుస్తకానికి కొంగు చాటు ఆకాశం అని పేరు పెడితే… ఏమోలే రచయిత్రుల ఇష్టం. ఎందుకంటే ఈ నవలలోని నలుగురు నాయికలు ఏదో ఒక దశలో కొంగుల్ని సర్రున చింపేసి ఆకాశం వేపు ఎగరేసిన వాళ్ళే. అణిచివేతల్లోంచి, అవమానాల్లోంచి, వివక్షల్లోంచి గొంగళీ పురుగు సీతాకోకచిలుకలా మారి నీలాకాశంలోకి ఎగిరిన వాళ్ళే.

నవల పూర్తిచెయ్యగానే చివరి వాక్యం ‘‘ఈ ఇంట్లోంచి పో ఆనంద్‌’’ చదివాకా హిప్‌ హిప్‌ హుర్రే అని అరిచాను. ఎందుకంటే యుగాలుగా పురుషాహంకారం తలకెక్కి అర్ధరాత్రి, అపరాత్రి చూడకుండా భార్యాపిల్లల్ని ఇళ్ళల్లోంచి వెళ్ళగొట్టిన ఘన చరిత్రలే ఇంతకాలం చదివాం విన్నాం. డి వి చట్టం ఇంట్లో సగభాగం హక్కుగా ఇచ్చినా వేలాది మంది కట్టుబట్టలతో రోడ్ల పాలౌతున్న కధలు చదువుతూనే ఉన్నాం. అలాంటి చోట ‘‘నా ఇంట్లోంచి పోరా పో’’ అని ఇందిర అరవడం అదీ ప్రశాంతంగా, నాలాంటి ఫెమినిష్టులకు సంబరం కాక మరేంటి? నా ఫ్రెండ్‌ ఒకామె వాళ్ళ నానమ్మ గురించి ఒక కధ చెప్పింది. తాహసిల్దారుగా పనిచేసే భర్త ఒక రోజు వేరే స్త్రీని తీసుకొచ్చి అక్కడి గెస్ట్‌ హౌస్‌లో దిగాడని, ఆ తర్వాత ఆమెతో సహా ఇంటి కొస్తాడని తెలిసి ఇంటి సింహ ద్వారం మూయించేసి లోపల్నుండి తాళం వేయించేసిందట. ఆమెకు ఆరుగురు పిల్లలట. ఆమెతో కలిసి ఇంటికొచ్చి ఎంత బతిమాలినా తలుపు తియ్యలేదట. తలుపు కొట్టి కొట్టి వాళ్ళు వెళ్ళిపోయారట. నానమ్మ జీవితంలో మళ్ళీ అతని ముఖం చూడలేదట. ఈ నవలలో చివరి వాక్యం చదివినప్పుడు ఆత్మ గౌరవంతో మెరిసిన ఆ నానమ్మ గుర్తొచ్చింది. ఈ నవల మొత్తంలో నన్ను బాగా ఆకట్టుకున్న పాత్రలు కాధరిన్‌, మేఘన. ముఖ్యంగా మేఘన. మగవాడు నాతిచరామి అని పెళ్ళిలో ప్రమాణం చేసి అడుగడుగునా చరిస్తూనే ఉంటాడు. రాముడు పేరు చెప్పి భారతీయ పురుషులు ఏకపత్నీవ్రతులు అని చెప్పడమంత అబద్ధం మరోటి ఉండదు. వివాహాల బయట సంబంధాలు ఇప్పుడే కొత్తగా వచ్చినట్లు కొందరు మాట్లాడడం విచిత్రంగా అనిపిస్తుంది. పెళ్ళి అనే చట్రంలో ఎప్పుడైతే ఇరుక్కున్నారో ఆ చట్రంలోంచి బయటకొచ్చి బయట సంబంధాలు కొనసాగించడం ఎప్పుడూ ఉన్నదే. అయితే మగవాడి సంబంధాలు కృష్ణ లీలలని ఆడవాళ్ళ సంబంధాలు బరితెగించినవి ‘‘పవిత్ర’’ సంసారాలను కూల్చేవని గొప్ప ప్రచారలు చేసి ఉంచారు.
వాళ్ళకి ‘‘వ్యాంప్‌’’లని తెలుగు సినిమాల్లో పేర్లు పెట్టి అవమానించడం, కొట్టడం తన హక్కన్నట్టు హీరోలు ప్రవర్తించే సినిమాలు కోకొల్లలు. చాలా అసహ్యంగా ‘‘పెళ్ళైన వాడని తెలిసీ తగులుకున్నది’’ అంటూ ఆమెను అవమానించడం ఇప్పటికీ చూస్తున్నాం కదా. పెళ్ళైన మగాడు పెళ్ళి చేసుకోకుండానో, విడాకులిచ్చో సింగిల్‌గా ఉండే ఆడవాళ్ళ వల్నరబులిటీని అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని వేషాలేసినా, ఎంతమందితో సంబంధాలు పెట్టుకున్నా అతడు ‘‘వ్యాంప్‌’’ కాడు. శృంగార పురుషుడు.సిగ్గులేని సమాజం స్త్రీలను కులటలని, పతితలని, బరితెగింపు అని నిందిస్తుంది కానీ రాముడిని పూజిస్తామని టముకు వేసుకునే ఈ పితృస్వామ్య వ్యవస్థ మగవాడి తిరుగుబోతుతనాన్ని కృష్ణ లీలలని, శృంగార పురుషులని కీర్తిస్తుంది. మేఘన చాలా త్వరగా సాలెగూడులాంటి అలాంటి సంబంధలోంచి బయటపడి సిస్టర్‌ హుడ్‌ గురించి మాట్లాడిరది. మేఘన లాంటి స్త్రీలు ఎప్పుడూ ‘‘వ్యాంప్లుగానే’’ గానే ఉంటారు కానీ మారని సో కాల్డ్‌ ప్రోగ్రసివ్‌ పురుషపుంగవులు తప్పకుండా భుజాలు తడుముకుంటారు. అభ్యుదయం వాళ్ళ జేబు ఆస్థిగా ఫీల్‌ అయ్యే వీళ్ళు మరింత ప్రమాదకరమైన వాళ్ళు. నవల మొత్తం పితృస్వామ్య పడగ నీడలో, పితృస్వామ్యానికి పట్టుకొమ్మైన కుటుంబం, పెళ్ళి, ప్రేమలు, వీటి చుట్టూ గింగిరాలు తిరుగుతూ నలిగిపోయే మహిళల కధలే. విచిత్రంగా వీళ్ళంతా బాగా చదువుకుని ఆర్ధికంగా సంపాదిస్తున్న వాళ్ళే కానీ ఆర్ధిక స్వాతంత్య్రం మాత్రం శూన్యం. డబ్బు సంపాదన స్వేచ్ఛనిస్తుందా?
బుర్రనిండా పితృస్వామ్య భావాలు దట్టించి ఉంటే చదువు, సంపాదనా స్వేచ్ఛను ఇస్తాయా? మగవాడు.. మొగుడో, ప్రియుడో, పెళ్ళిలోనో, పెళ్ళి బయటో ప్రేమ కోసం ముఖం వాచిపోవడం, ఆ ప్రేమ తప్ప ఇంకేది వద్దనేంత పిచ్చిలోకి జారిపోవడం నా దృష్టిలో ఆత్మ గౌరవం లేని వెంపర్లాట. అక్కడ విస్తరించిన ఎడారులు తప్ప ఒయాసిస్సులుండవు. ఆ వేడికి మాడి మసైపోవడం తప్ప నువ్వెన్ని కడవల కన్నీళ్ళు పారించినా ఫలితం లేని వెతుకులాట. నవల మొదట్లో పాతకాలపు తెలుగు సినిమా నాయికలా ఊ అంటే కన్నీళ్ళు, ఆ అంటే కన్నీళ్ళు కార్చిన ఇందిరను వాళ్ళమ్మ గీత ‘‘కాలాతీత వ్యక్తులు’’ శ్రీదేవి గారి నవల్లోని ఇందిర పేరు పెట్టుకున్నాను అన్నప్పుడు నా ప్రాణం ఉస్సూరుమనిపించింది. మొదటి పేజీల్లో ఇందిర ‘‘కాలాతీత వ్యక్తులు’’ నవలానాయకి ఇందిర కాలిగోటితో కూడా పోల్చలేము. ఆమె చదివిన పుస్తకాల లిష్ట్‌ చూసాకా అమె ప్రవర్తన చాలా అసహజమనిపించింది. జీవితాలను వెలిగించే పుస్తకాలవి. అంధకార బంధురంగా, నిస్సహాయంగా ఉన్న ఇందిర జీవితంలోకి చిన్న వెలుతురును కూడా ఫోకస్‌ చెయ్యలేకపోయాంటే పితృస్వామ్య ఉక్కు కౌగిలిలో ఆమె ఎంత నలిగిపోయిందో, ఎలా విచక్షణను కోల్పోయిందో అర్ధం చేసుకోవాలంతే.
బాగా చదువుకున్న, బాగా సంపాదిస్తున్న ఆధునిక మహిళల జీవితాల్లోని కల్లోలాలను, స్త్రీ పురుష సంబంధాల్లోని బోలుతనాన్ని, వివాహేతర సంబంధాల్లోని సంక్లిష్టతను, వ్యక్తుల చుట్టూనే పెనవేసుకుని ఊపిరాడకుండా చేస్తున్న ప్రేమల గురించి మంచి విశ్లేషణలతో మితృలిద్దరూ ఉమా నూతక్కి, సుజాత వేల్పూరి రాసిన అర్ధవంతమైన, అవసరమైన నవల’’ రెక్క చాటు ఆకాశం. ఒక్క కాథరిన్‌ జీవితం తప్ప మిగిలిన పాత్రలన్నీ మిడిల్‌ క్లాస్‌ నుండే వచ్చాయి. కొన్ని పాత్రల్ని శ్రామిక మహిళల నుండి కూడా తీసుకుంటే బావుండేదేమో అనిపించింది. 331 పేజీల్లో కొన్ని వాళ్ళ అంశాల మీద కూడా రాసి ఉంటే మరింత సమగ్రంగా ఉండేదేమో. ఇది నా ఆలోచన మాత్రమే. అది రచయిత్రుల ఇష్టం.
పదేళ్ళ పైగానే నాకు ఉమతో స్నేహం ఉంది. అమ్మను కానీ నన్ను అమ్మ అని పిలుస్తుంది. మొదట్లో పుస్తక సమీక్షలు మాత్రమే రాసేది. వాటిని చాలా వరకు భూమికలో ప్రచురించాను. మంచి ఇంగ్లీష్‌ సాహిత్యం చదువుతుంది. పుస్తక సమీక్షలు దాటి కథలు రాయమని చెప్పేదాన్ని. తన శైలి తేటగా సూటిగా ఉంటుంది. కధలు రాసింది. కథల సంపుటి వచ్చింది, అవార్డులొచ్చాయి. కథలలోంచి నవలలోకి దూకింది. చాలా సంతోషం ఉమా. నీ సాహిత్య ప్రస్థానం, సాహిత్యంలో నీ ఎదుగుదల నాకు తప్పకుండా గొప్ప సంతోషాన్నిస్తుంది. ఇంకా రాయి. కొత్త కొత్త అంశాలతో మరో నవల మొదలు పెట్టు. సుజాత గారి గురించి కొంతే తెలుసు. ఆవిడ బ్లాగ్లో (పేరు గుర్తు రావడం లేదు) తన రచనలు చదివేదాన్ని. ఆ రచనల పేర్లు కూడా గుర్తు రావడం లేదు. అయితే తను అమెరికాలో ఉన్నప్పుడు నాకో మెయిల్‌ పంపారు.‘‘అమెరికా వాళ్ళ నోట భూమిక మాట’’ అంటూ ఏదో రేడియోలో కౌన్సిలింగ్‌ గురించి చెబుతూ భూమిక హెల్ప్లైన్‌ గురించి చెప్పారని మొత్తం వినకుండా వాళ్ళ అమ్మాయి ఛానల్‌ మార్చేసారని. ఇది మాత్రం బాగానే గుర్తుంది. తన కథలు కొన్ని చదివాను. ఉమ, సుజాతా మీ ఇద్దరికి బోలెడన్ని అభినందనలు.
ఈ పుస్తకాన్ని ప్రచురించిన పర్స్పెక్టివ్‌ ఆర్‌ కే గారికి ధన్యవాదాలు మంచి పుస్తకం తెచ్చినందుకు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.