వాళ్ళ ఇల్లు ఒక మ్యూజియం. ఆ కళాఖండాల నిలయానికి నీలమ్మ గారే ఆలంబన. అనితరసాధ్యమైన కళాఖండాలను గత నలభై యేళ్ళుగా వాళ్ళిద్దరూ కలిసి సేకరించారు. వాటి విలువ ఈనాడు కోట్లలో ఉంది. ప్రజల నుంచి సేకరించిన వాటిని నిస్వార్థంగా ప్రజలకే అందించాలనే దృఢ నిశ్చయంతో వారు వున్నారు. చరిత్ర అంటే రాజులదే అనే అపోహతో ఉన్న సమాజానికి సామాన్య మానవుల అసాధారణ చరిత్రను వెలికి తీసి చూపించారు.
పండితులంటే బ్రాహ్మణులే అనే నమ్మకాన్ని వమ్ము చేస్తూ జాంబపురాణం చెప్పే డక్కలి వారిని పరిచయం చేసారు. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలను సమాజానికి బహిర్గతం చేసారు. ఈ క్రమంలో సేకరించిన వాటిని ఎంతో శ్రమకోర్చి తన సొంత బిడ్డలుగా కాపాడుతున్న నీలగారి కృషిని అభినందించాలి. వాటిని సంరక్షించడంలో ఆమె తోడ్పాటు లేకుంటే అంతటి విలువైన మూల సంపద ఒక చోటుకు చేరేది కాదు. అది త్వరలోనే మ్యూజియం రూపంలో భావితరాలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షిస్తూ… ఆ వివరాలు ఆమె మాటల్లోనే చదువుకుందాం.
ప్ర. నమస్తే! నీలగారు.
జ. నమస్తే అండీ. రండి కూర్చోండి.
ప్ర. మీ పుట్టుక, బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నేను 1.1.1956లో పుట్టాను. మాది మంథని అగ్రహారం. అమ్మ పేరు సక్కుబాయి. నాకు ఒక చెల్లెలు వుంది. నా ఎనిమిదేళ్ళ వయసులో అమ్మ చనిపోయింది. అప్పుడు మా మేనత్త రంగుబాయి నన్ను సాదుకున్నారు. ఆమె టీచర్‌గా పనిచేసారు. ఇప్పుడు ఆమెకు 100యేళ్ళు. కరీంనగర్‌లో వుంటారు. ఆమెకు ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. నా చదువు అనివార్య కారణాల వల్ల ఏడో తరగతితోనే ఆగిపోయింది.
ప్ర. మీ వివాహం ఎప్పుడు? ఎలా జరిగింది?
జ. మా వివాహం 22.2.1973లో సంప్రదాయ పద్ధతిలో హన్మకొండలో జరిగింది. ఆయన (జయధీర్ తిరుమల రావుగారు) మాకు దూరపు బంధువు. పెళ్ళి మొదలైన వేడుకలలో, పండగలప్పుడు మాత్రమే కలుసుకోవడం జరిగేది.
ప్ర. మీ పిల్లల గురించి చెప్పండి.
జ. మాకు ఇద్దరు పిల్లలు. బాబు ఆదిత్య, పాప శివాని. ఇద్దరిదీ ప్రేమ వివాహమే. కోడలు బంధువుల అమ్మాయే. పెళ్ళై ఒక బాబు వున్న ఒంటరి మహిళను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. తర్వాత ఒక బాబు పుట్టాడు. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే మాది అభ్యుదయ భావాలున్న కుటుంబం. ఇప్పుడు ప్రైవేటుగా పనిచేస్తున్నాడు. అమ్మాయికి ఒక పాప. ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది. మా మనవరాలు పేరు జైత్ర. ఆమె చాలా యేళ్ళు మా దగ్గరే పెరిగింది. అందుకే మా తదనంతరం ఆమె ఆద్యకళకు కేర్ టేకర్‌గా ఉంటుందని అనుకుంటున్నాం.
ప్ర. సేకరణ ముందుగా దేనితో మొదలు పెట్టారు?
జ. మా సేకరణ ముందుగా పాత పుస్తకాలతో మొదలైంది. ఆదివారం వచ్చిందంటే తొందరగా పనులు ముగించుకొని, పిల్లలతో పాటు అబిడ్స్‌లో వుండేవాళ్ళం. అప్పట్లో ప్రతి ఆదివారం హైదరాబాదులోని ఆబిడ్స్ ఫుట్‌పాత్‌ల మీద పాత పుస్తకాలు అమ్మే వాళ్ళు. అంతేకాదు, ఎవరు పాత పుస్తకాలు ఇస్తామన్నా వాళ్ళ వద్దకు వెళ్ళి అపురూపంగా వాటిని ఇంటికి తెచ్చుకునే వాళ్ళం. అలా మా దగ్గర అరుదైన పుస్తకాలు పది వేలకు పైగా వున్నాయి. 1978 నుంచి కరపత్రాలను కూడా సేకరించడం మొదలుపెట్టాం.
ప్ర. మీకు జానపదుల సంస్కృతి పట్ల ఆసక్తి ఎలా కలిగింది?
జ. నా చిన్నప్పుడు పలురకాల జానపద కళాకారులు మా యింటి ముందరికి, వీధుల్లోకి వచ్చే వాళ్ళు. (గంగిరెద్దులను ఆడిరచే
వాళ్ళు, ఒగ్గు కథలు చెప్పే వాళ్ళు) వాళ్ళ భాష, వేషధారణ భిన్నంగా వుండేది. ఆసక్తిగా వాళ్ళను గమనించేదాన్ని. పెళ్ళైన తరువాత మా వారి పరిశోధనలో భాగంగా వాళ్ళ యిళ్ళలోకి వెళ్ళే అవకాశం దొరికింది. చిన్నప్పుడు వున్న ఆసక్తి ఈ రకంగా విస్తృతమైంది. అందులో భాగంగా జానపద పాటలతో పాటు సంగీత వాయిద్యాలు, ఆభరణాలు, వాళ్ళు ఉపయోగించే వివిధ వస్తువులను సేకరించడం మొదలు పెట్టాం.
ప్ర. ఈ క్రమంలో మీరు గమనించిన ఆదివాసీ ఆచారాలను కొన్ని చెప్పండి.
జ. గోండులు ఆరుబయట అన్నం తినరు. దీపం లేకుండా భోజనం చేయరు. ఒకసారి వాడిన దీపపు ప్రమిదను మళ్ళీ వాడరు. వాళ్ళు వాడే వంట నూనెను స్వయంగా వాళ్ళే తయారు చేసుకుంటారు. ఆ ప్రాసెస్‌లో మూడు గుంతలుంటాయి. చివరి గుంతలోకి వచ్చిన నూనె స్వచ్ఛంగా వుంటుంది. అలా తయారు చేసుకున్న నూనెను 15 రోజులు వాడుకుంటారు.
ప్ర. జానపద పాటలను, ప్రదర్శనలను ఎలా భద్రపరిచారు?
జ. వాటిని ఆడియో విడియో రూపంలో భద్రపరిచాను. నేనే దగ్గర వుండి ఆ రికార్డింగ్ పనిని చూసుకున్నాను. నేటి సాంకేతిక పరిణామ క్రమంలో అవి ఉనికిలో లేకుండా పోయాయి. ఈనాటి అవసరాలకు తగినట్లుగా మళ్ళీ వాటిని మార్చగలమో లేదో అనే బెంగ ఉంటుంది.
ప్ర. ఆ క్రమంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమైనా వున్నాయా?
జ. రహదారులు సరిగా వుండవు. బళ్ళు దొరికేవి కాదు. అవి దొరికితే మనుషులు దొరికే వాళ్ళు కాదు. ఒక్కొక్కసారి నడిచి కూడా వెళ్ళవలసి వచ్చేది. ఒక్కొక్కరి దగ్గరికి కొన్నిసార్లు 4,5 సార్లు కూడా వెళ్ళవలసి వచ్చేది. ఆ క్రమంలో కొందరు సహకరించేవారు. మరికొందరు వారి దగ్గరున్న వస్తువులను ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. వాళ్ళకు ఎంతో నచ్చచెప్పిన మీదట ఇచ్చేవారు. అందులో సంగీత వాయిద్యాలు, ఆభరణాలు, ఉడుం చర్మంతో చేసిన డప్పులు, రాట్నాలు, మగ్గాలు నిత్యజీవితంలో వాళ్ళు ఉపయోగించే వస్తువులు మొదలైనవి యెన్నో వున్నాయి.
ప్ర. ఒక మహిళగా ఆ నగలను చూసినప్పుడు మీరు ఎలా స్పందించారు?
జ. అవి అద్భుతమైన డిజైన్‌లలో వున్నాయి. మహిళలు వాటిని చూసినప్పుడు అలాంటివి కావాలి… అనుకోకుండా వుండలేరు. అవి అంత అందంగా చేయబడ్డాయి. కానీ అలాంటి వాటిని ఇప్పుడు చేసే వాళ్ళు లేరు. వాటిలో ఏవైనా వూడిపోతే ఇబ్బంది కదా.. అందుకని నాకు అవి వేసుకోవాలని అనిపించినా కూడా వేసుకోను. చూసి ఆనందపడతాను అంతే…
ప్ర. వాటిని భద్రపరచడం చాలా కష్టంతో కూడిన పని. ఎలా చేశారు?
జ. అవునండీ! భద్రపరచడం చాలా కష్టం. ముఖ్యంగా పాత పుస్తకాలకు తొందరగా చదపురుగులు వస్తాయి. కాగితం కూడా పెళుసుగా వుంటుంది. సేకరించిన వస్తువులు కూడా వారు వాడకుండా పక్కన పెట్టినవే మాకిస్తారు. వారానికి ఒకసారి వాటిని తీసి, జాగ్రత్తగా తుడిచి, అన్నింటిని విడి విడిగా కాసేపు ఇంట్లోనే ఆరబెట్టేదాన్ని. ఏ పుస్తకానికయినా చెదలు వస్తే దానిని శుభ్రపరచి, విడిగా ఆరబెట్టి, పేపర్ కానీ కాటన్ బట్టలో కానీ చుట్టి విడిగా ఉంచేదాన్ని. ఆ దుమ్ముతో కొన్నిసార్లు నా ఆరోగ్యం కూడా పాడైన సందర్భాలు వున్నాయి.
ప్ర. తాళపత్ర గ్రంథాల సేకరణ ఎప్పుడు? ఎలా మొదలైంది?
జ. జానపదుల ఇళ్ళల్లో గుడ్డల్లో చుట్టి వుండేవి. అప్పుడు కొన్నింటిని సేకరించాము. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. దానిని హైదరాబాదులోని ప్రాచ్య లిఖిత భాండాగారంలో ఏపి స్టేట్ మీమాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ డైరెక్టరుగా తిరుమల రావుగారు ఉండేవారు. అప్పుడు వాటిని ఎలా బాగు చేయాలో తెలుసుకున్నాను. ఆ సమయంలో తాళపత్ర గ్రంథ సేకరణ మొదలైంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో రెండు లక్షలకు పైగా తాళపత్ర గ్రంథాలున్నాయి. అప్పుడు ఆయన ఆధ్వర్యంలో కొన్ని పబ్లిష్ చేసారు. ఆ సమయానికి మా పిల్లలు పెద్ద వాళ్ళయ్యారు. కాబట్టి సేకరణకు మేమిద్దరమే పోయేవాళ్ళం.
ప్ర. సేకరిస్తున్న సమయంలో మీకు బాధ కలిగించిన సంఘటనలు ఏమైనా వున్నాయా?
జ. మేం వెళ్ళిన సందర్భంలో ఆయా వస్తువులు ఇవ్వడానికి బదులుగా మా కళ్ళ ముందే వాటిని నీళ్ళలో వదిలిపెట్టేవారు లేదా కాల్చే వారు. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేది. ఎంతగా అంటే… ఆత్మ బంధువులను కోల్పోయినట్లు అనిపించేది. అయితే కొన్ని సందర్భాలలో తాళపత్ర గ్రంథాలను మాకు ఆడపిల్లను అత్తగారింటికి పంపినట్లు చిన్నపాటి వేడుకతో ఇచ్చేవారు.
ప్ర. తాళపత్ర గ్రంథాలను భద్రపరిచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు?
జ. చంటి పిల్లలు గట్టిగా ముట్టుకుంటే కంది పోయినట్లు తాళపత్రాలు గట్టిగా ముట్టుకుంటే విరిగిపోతాయి. చాలా పెళుసుగా వుంటాయి. ఏ కొంచెం విరిగినా పదాలు పోతాయి. అది ఆ గ్రంథానికి చాలా నష్టం. కొన్నిసార్లు అర్థాలు మారిపోయే ప్రమాదం కూడా వుంటుంది. అందుకే వాటిని పాపాయికి మల్లే సుకుమారంగా హాండిల్ చేసేదాన్ని. మొదట్లో ఒక్కొక్క పత్రాన్ని జాగ్రత్తగా తీసి, అక్షరాలు కనిపించే (్‌తీaఅంజూaతీవఅ్) ప్లాస్టిక్ కాగితాన్ని చుట్టి, పత్రాలన్నింటినీ విడి విడిగా భద్రపరిచేదాన్ని. 2019లో జరిగిన వర్క్‌షాప్‌లో రసాయన ఆర్గానిక్ తైలం పూసి భద్రపరిచారు. ఆ పనినంతా నేనే దగ్గరుండి చూసుకున్నాను. అప్పుడు నేను కరోనా బారిన పడ్డాను.
ప్ర. ఇంత కష్టమైన పనిని మీరు చేస్తుంటే మీ పిల్లల స్పందన ఎలా వుండేది?
జ. మా యీ పనిలో మా పిల్లలు చిన్నప్పటి నుంచీ భాగమయ్యారు. వాటిని చూస్తూనే పెరిగారు. మా అమ్మాయి జానపదులతో కలిసి నాట్యం చేసేది. మా పిల్లలే కాదు, మా మనమరాలు కూడా మాతో వచ్చేది. అందువల్ల వాళ్ళు కూడా మా పనిలో భాగమయ్యారు.
ప్ర. ఈ క్రమంలో మీరు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
జ. మాకు ఎలాంటి ఆర్థిక సహాయం లేదు. మా పిల్లల ఫీజులు, ఇంటి కిరాయి, ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బులు మాత్రమే నెలసరి జీతంలో నుంచి తీసుకొని మిగతా శాలరీ డబ్బును ఈ పనులకే ఖర్చు చేశాం. ఈనాడు మాకంటూ పొదుపు మిగులు లేదు. అంటే బ్యాంకు బ్యాలెన్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేవు.
ప్ర. మీరు ‘మూల ధ్వని’ పేరిట ఎప్పుడు కార్యక్రమం నిర్వహించారు?
జ. 2019లో ఉస్మానియా యూనివర్శిటీ టాగూర్ ఆడిటోరియంలో చేసినట్లు గుర్తు. ఆదివాసీ జానపద కళాకారులను జానపద కళాకారులను పిలిపించి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆ రోజు జానపద కళాకారులు తమ సంస్కృతిని తెలిపే విభిన్న వాయిద్యాలతో ప్రోగ్రాం చేస్తుంటే… ఆ ప్రాంతమంతా మూల ధ్వనితో ప్రతిధ్వనించింది. ఆనాడు ప్రత్యేకమైన పండగలా అనిపించింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తరువాత దానిని సచిత్రమైన పుస్తక రూపంలో తీసుకవచ్చాం. ఆ తరువాత మిత్రుల ప్రోత్సాహంతో మరికొన్ని చోట్ల ఆ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేశాం.
ప్ర. ఆ తరువాత మీరు సేకరించిన వస్తువులతో ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా? వాటి గురించి చెప్పండి.
జ. మేం ప్రదర్శనలు ఏర్పాటు చేయడానికి సేకరించిన వస్తు సముదాయాన్ని
1. ఆది జీవితం 2. ఆది ధ్వని
3. ఆది అక్షరం 4. ఆది చిత్రం
5. ఆది లోహం .. అని ఐదు విభాగాలుగా ఏర్పాటు చేస్తున్నాం. వాటికి కూడా మంచి స్పందన వచ్చింది. ఢల్లీిలో కూడా ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఆ సందర్భాలలో కూడా నేనే ఏర్పాట్లు చూసుకున్నాను.
ప్ర. అంతటి అపారమైన ఆది సంపదను ఎక్కడ వుంచారు?
జ. స్థలాభావం చేత ఎక్కడెక్కడో ఉంచవలసిన పరిస్థితి ఏర్పడిరది. అదే చాలా బాధగా వుంటుంది. కన్నబిడ్డలను పరాయి యిళ్ళలో వుంచిన బాధ… ప్రస్తుతం మా యింట్లో, స్నేహితుల, బంధువుల యిళ్ళలో కొన్ని వున్నాయి. ఢల్లీిలోను రాష్ట్రపతి భవన్‌లో 1370 వున్నాయి. తెలుగు యూనివర్శిటీలో మరి కొన్ని వున్నాయి. తెలుగు యూనివర్శిటీ మరోచోటకు మారడం వల్ల నాంపల్లి భవనంలో మాకు కేటాయించిన గదులను ఖాళీ చేయమని ఒత్తిడి వస్తోంది. వాటిని ఎక్కడికి తరలించాలో తెలియని అయోమయ పరిస్థితి. మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతోంది.
ప్ర. ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?
జ. ఈ విషయమై తెలంగాణా ప్రభుత్వానికి అర్జీ పెట్టాం. తెలంగాణా ప్రభుత్వం స్థలం కేటాయిస్తే .. భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం (ఆర్థిక సహాయం) గ్రాంటు ఇవ్వడానికి సిద్ధంగా వుంది. ఈ విషయంలో నేను ఒకసారి అప్పటి గవర్నర్ తమిళసైని కూడా కలిసాను.
ప్ర. ఆమెతో ఏం మాట్లాడారు?
జ. చెప్పాను కదండీ! మా సేకరణ వస్తు సముదాయాన్ని ఐదు విభాగాలుగా చేసాము. వాటిని నేను సాదుకున్న బిడ్డలుగా భావిస్తాను. గవర్నరుకు అదే చెప్పాను. కన్న బిడ్డకు పెళ్ళి చేసి సురక్షిత ప్రదేశంలో వుంచాను. సాదుకున్న బిడ్డలకు కూడా ఒక సురక్షిత ప్రదేశం కావాలని అడిగాను. వయసు మీద పడుతున్న కారణంగా వాటి సంరక్షణ నాకు భారంగా మారుతోంది. దిక్కులేని పిల్లల మాదిరి తలా ఒక చోట వున్నాయి. మ్యూజియం ఏర్పాటు చేస్తే… వాటన్నింటినీ ఒకేచోట వుంచి, సంరక్షణకు శిక్షణనిచ్చి సిబ్బందిని ఏర్పాటు చేస్తే మా శ్రమ ఫలించి భావితరాలకు సురక్షితంగా అందుబాటులో వుంటాయని చెప్పాను.
ప్ర. గవర్నర్ గారి స్పందన ఎలా వుంది?
జ. నేను పిల్లలుగా భావించడాన్ని ప్రశంసిస్తూ ‘‘తప్పకుండా అలాగే చేద్దాం’’ అన్నారు. కేంద్రానికి రికమండ్ చేశారు. కానీ గ్రాంటు పొందడానికి చాలా తతంగం వుంది.
ప్ర. ఇంకా సేకరణ కొనసాగిస్తున్నారా?
జ. అవునండీ! ఆదిలాబాద్‌లో ఒకరింట్లో పాత లోహపు దీపపు షెమ్మ వుందని తెలిసి వెళ్ళాం. దానిని మాకు ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించారు. ఆ ఫోటోలు తీసుకొని వచ్చాం. మరికొన్ని సేకరించి అక్కడే ఉంచాం. వాటిని తీసుకు రావాలి.
ప్ర. తర్వాత ఏం జరిగింది?
జ. వారి దీపపు షెమ్మెలు అందంగా వుంటాయి.. అయితే కొత్తవి చేయించాలి. అలాంటి వాటిని ఎవరు, ఎక్కడ చేస్తారని విచారించగా వాటిని ఓజాల వృత్తి వాళ్ళు చేస్తారని తెలిసింది. ఓజాలు అనేది గోండుల్లో ఒక తెగ. వాళ్ళు ఆదిలాబాద్‌లో వున్నారని తెలిసింది. ఫోటోలు పంపి తయారు చేయించాము. ఆరడుగుల ఎత్తు వుంటుంది. మూడు భాగాలుగా వుంది. దానిని తీసుకవచ్చి 3,4 రోజులు శిల్పారామంలో ప్రదర్శనకు పెట్టాం. నేనే అక్కడికి వెళ్ళి, స్వయంగా అమర్చి వచ్చాను. ఇప్పుడు అది విరిగి పోయి ఒక మూలన పడివుంది. విరగగొట్టిన వారి మీద కోపంగానూ దానిని పొందడంలో వున్న శ్రమ గుర్తుకు వచ్చి బాధగానూ వుంది.
ప్ర. నేటి యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి?
జ. మన మూలాలను గుర్తెరిగి, సంస్కృతిని గౌరవిస్తూ దేశ భద్రతకు మంచి బాటలు వెయ్యాలి.
