క్వియర్‌ (లెస్బియన్‌, గే, బై సెక్సువల్‌, ట్రాన్స్‌ జెండర్‌) స్త్రీవాదం-ఎ. సునీత

మూడేళ్ళ క్రితం నేను రెండు దశాబ్దాల పాటు పని చేసిన స్త్రీవాద పరిశోధక సంస్థలో కొంత మందిమి క్వియర్‌ సమూహాలలో వ్యక్తులకి (సమలైంగికులు, ట్రాన్సజెండర్‌ వ్యక్తులు, ఇతర క్వియర్‌ వ్యక్తులు) వివిధ రకాల మద్దతు ఇవ్వగలిగే ఒక నిర్మాణానికి రూపునిచ్చే ప్రయత్నం చేసాం. ఒక ట్రాన్స్‌జెండర్‌ మహిళ, ఒక సమలైంగిక వ్యక్తి, నేను మా టీమ్‌ సభ్యులం.

అయితే ఆ సంస్థ కార్య నిర్వాహక వర్గం ఇటువంటి ప్రయత్నం తమ సంస్థ అస్తిత్వాన్ని సర్వ నాశనం చేస్తుందని తీవ్ర ఆందోళనకి గురయ్యారు. మేము పర లైంగిక (క్వియర్‌ కాని) స్త్రీల కోసం పని చేస్తామని, క్వియర్‌ వ్యక్తులు తమ కోసం వేరే సంస్థలు స్థాపించుకుంటే మేము తప్పకుండా అన్ని విధాలా మద్దతు ఇస్తామని బలంగా చెప్పారు. ఇలాంటి మద్దతునిచ్చే నిర్మాణాలు స్త్రీవాద పరిశోధక సంస్థలు చెయ్యాల్సిన పనులు కావని, తమ వంటి ఇంటర్‌ సెక్షనల్‌ స్త్రీవాద పరిశోధక సంస్థ అస్తిత్వానికి, చేసే పనికి ఇటువంటి ప్రయోగం వల్ల రాజ్యం నుండి ప్రమాదం వాటిల్లుతుందని అంటూ, ఈ ప్రయోగానికి పూనుకున్నందుకు స్త్రీవాదం, స్త్రీవాద పరిశోధన, రాజకీయాలు పట్ల మా నిబద్ధతని శంకించారు. పనిచేసే పరిస్థితులు దుర్భరంగా మారటంతో మేమందరం ఆ సంస్థని వదిలేయాల్సి వచ్చింది. నగరంలో అనేక ఎన్జీవోల నిర్వాహకులు కూడా ఆ కార్య నిర్వాహక వర్గ ఆందోళన సరైందేనని ఒప్పుకోవటం దీనికి కొస మెరుపు.
ఈ అనుభవం నాకు అనేక పాఠాలు నేర్పింది. వాటిల్లో ఒకటి స్త్రీవాదానికి క్వియర్‌ రాజకీయాలతో చారిత్రకంగా, సిద్ధాంత పరంగా వున్న సంబంధాన్ని గురించిన అవగాహన ఏర్పర్చుకుని అందరితో పంచుకోవాల్సిన అవసరం. లైంగిక సంబంధాల్లో సమ న్యాయం అంటే, ఇష్టం లేని పెళ్లి నుండి స్త్రీలకి విడివడే స్వేచ్ఛ, ఇష్టమైన మగవాళ్ళతో జీవించగలిగే స్వేచ్ఛ, హింస లేని వివాహ సంబంధాలు, స్వయం నిర్ణయ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు నుండి ఈ ముప్ఫయి ఏళ్లల్లో ఇంకా ముందు కెళ్ళి వివాహంతో సంబంధం లేకుండా స్త్రీలు, పురుషులు కలిసి ఉండగలిగే స్వేచ్ఛ, విడాకులు తీసుకునే, లేక పెళ్లిళ్లు వద్దనుకునే స్వతంత్ర మహిళలకు మద్దతు వరకూ మన ప్రయాణం సాగింది. ఇవి చాలా అవసరమైన స్త్రీవాద ఆలోచనలు. స్త్రీలు, పురుషులని సమాజం రూపుదిద్దే విధానం వల్ల వారి మధ్య సంబంధాల్లో ఏర్పడే అసమానతలు, అన్యాయాలు, కుత్సితాలు, మోసాలని అధిగమించటానికి అవసరమయినవి. అయితే, ఇవన్నీ కూడా స్త్రీ, పురుష స్వేచ్ఛని, లైంగిక సమ న్యాయాన్ని స్త్రీ పురుష సంబంధాల కేంద్రంగానే అర్ధం చేసుకుంటాయి.
ఈ విశ్లేషణా చట్రంలో స్త్రీ-పురుష సంబంధాల బయట వుండే లైంగికతలు, లైంగిక సంబంధాలు, (స్త్రీత్వం పురుషత్వంలో ఇమడని జెండర్ల గురించి వేరే వ్యాసంలో) మనుగడ గురించిన చర్చకి చోటు లేదు. ఇటువంటి స్త్రీ పురుష సంబంధాల కేంద్రిత విశ్లేషణ చట్రాన్ని క్వియర్‌ స్త్రీవాది ఏడ్రియన్‌ రిచ్‌ ‘బలవంతపు పర లైంగికత’ గా (కంపల్సరీ హెటిరో సెక్సువాలిటీ) సిద్ధాంతీకరించారు. అన్ని పితృస్వామ్య సంస్కృతులు చిన్నప్పటి నుండి స్త్రీలని, పురుషులని ఒకరితో మరొకరి సంబంధాల కోసం మాత్రమే అన్ని విధాలా సంసిద్ధులని చేస్తాయనిÑ అన్ని సామాజిక, రాజ్య, ప్రభుత్వ నియమాలు, నిబంధనలు స్త్రీ పురుష సంబంధాలని మాత్రమే గుర్తిస్తాయనిÑ అసలు స్త్రీత్వం, పురుషత్వం రెండూ కూడా ఈ సంబంధాల కేంద్రితంగానే నిర్వచించబడతాయనిÑ స్త్రీలు, పురుషులు ‘సహజంగా’ ఒకరి కొకరు ఆకర్షితులవుతారు అనటం కంటే, వ్యవస్తీకృతంగా వారు దగ్గరికి తీసుకు రాబడతారని, క్వియర్‌ స్త్రీవాదులు అనేక ఉదాహరణలతో చూపించారు. స్త్రీ పురుష సంబంధాలు ప్రాచీన గ్రీక్‌ కవయిత్రి శాఫో నుండి ఇరవయ్యవ శతాబ్దపు రచయిత్రి వర్జీనియా వూల్ఫ్‌ వరకూ పాశ్చాత్య నాగరికతలో అనేక మంది స్త్రీలకి తోటి స్త్రీలతో లోతయిన, గాఢమయిన సంబంధాలు వుండినాయని, అవి ఆయా స్త్రీలకి పురుషులతో వుండిన వివాహ సంబంధాల కంటే బలమయినవని ఆధారాలతో సహా నిరూపించారు. గ్రీకు కాలం నుండి ఆధునిక కాలం వరకూ పురుషులతో పురుషులకి వుండిన గాఢమయిన సంబంధాల గురించి అందరికీ సుపరిచితులయిన ఫ్రెంచి సిద్ధాంతవేత్త మిఛెల్‌ ఫ్యూకోతో సహా అనేక మంది అంతే బలంగా రాశారు.
మన దేశంలో రూత్‌ వనిత, సలీమ్‌ కిద్వాయ్‌లు సేమ్‌ సెక్స్‌ లవ్‌ ఇన్‌ ఇండియా అనే పుస్తకంలో మన పురాణాలనన్నీ పరిశీలించి ఎక్కడెక్కడ సమ లైంగిక సంబంధాలు కనిపిస్తాయో ఆధారాలతో సహా విశ్లేషిస్తారు. మహాభారతంలో శ్రీ కృష్ణుడు, అర్జునిడి మధ్య వుండే సంబందాన్ని ప్రేమగానే వర్ణించాలని అది చదివితే అర్ధమవుతుంది. మనుస్మృతి మగవాళ్ల మధ్య ఇటువంటి సంబంధాలపై చిన్న చిన్న శిక్షలు వేసింది. ఆడవాళ్ళకి మాత్రం వయసు, వివాహస్థితిని బట్టి శిక్షలు విధించింది. వాత్సాయనుడు కామ సూత్రలో కూడా దీని గురించిన చర్చ వుంది. మనమాసించే ఒప్పుదల లేకపోయినా భారతీయ సంస్కృతిలో సమలైంగికుల పట్ల కొంత సహనం ఉంటూ వచ్చింది.
వలస పాలనా కాలంలో బ్రిటిషు వాళ్ళు తమ జాత్యహంకారంతో పాటు లైంగికతకి సంబంధించిన సంకుచిత విక్టోరియన్‌ భావజాలాన్ని కూడా ఈ ఉపఖండంలో ప్రవేశ పెట్టారు. దాని ప్రకారం సమలైంగికత ‘అసహజం’, ‘విపరీతం’, పాపమే కాక, ఒక నేరం కూడా. 1864లో ప్రవేశ పెట్టిన భారతీయ నేర స్మ్రితి సెక్షన్‌ 377 ప్రకారం పిల్లలు పుట్టటానికి చేసుకునే సెక్స్‌ తప్ప అన్ని రకాల శృంగారాన్ని నేరం చేశారు. వలస పాలన పూర్తయ్యేటప్పటికి భారతీయ మధ్య తరగతి తమ చరిత్ర మర్చిపోయి బ్రిటిషు వారి లాగే సమ లైంగికతని అసహజంగా భావించటం నేర్చుకుంది. స్వతంత్ర భారత దేశ చట్టాల్లో సెక్షన్‌ 377 కొనసాగింది. మిత వాదులు, మతవాదులతో పాటు, వామ పక్ష వాదులలో కూడా ఈ భావజాల ప్రభావం బాగా ఉంటూ వచ్చింది. సమ లైంగికులు సెక్స్‌ పిచ్చి వాళ్ళని, పాశ్చాత్య దేశాల ప్రభావంతో ఇట్లా తయారయ్యారని, దీన్ని నేరంగానే పరిగణించాలని వీరందరి భావన. 1980లలో హెచ్‌ ఐ వి – ఎయిడ్స్‌ సంక్షోభం సమయంలో సమలైంగికులని ప్రమాదకరమైన జనాభాగా ముద్ర వేసి వారి కోసం ప్రత్యేక ప్రోగ్రాములు నడిపారు. చెడ్డదయినా కానీ మొదటిసారి ఇటువంటి ప్రభుత్వ గుర్తింపు తెచ్చుకున్న ఈ సమూహం ఈ పేరు మీద బయటికొచ్చి కొత్త సంస్థలు పెట్టుకుని సెక్షన్‌ 377కి వ్యతిరేకంగా పోరాడటం మొదలు పెట్టారు. నయా ఉదారవాదంలో సరళీకృతమైన లైంగికత పట్ల ధోరణుల మధ్యలో కోర్టులు 2009లో మొదలుపెట్టి 2018 కొచ్చే సరికి ఈ చట్టం లో సమలైంగికత ని నేరం చెయ్యటాన్ని కొట్టేసి, అందరికీ సమాన లైంగిక హక్కులున్నాయని చెప్పాయి.
ఇదంతా ఒక ఎత్తయితే, సమలైంగిక స్త్రీల, వ్యక్తుల సంఘర్షణ, పోరాటాలు మరో ఎత్తు. ఎమర్జెన్సీ తర్వాత ‘స్వతంత్ర’ స్త్రీవాద ఉద్యమం ముందుకొచ్చి స్త్రీల సంఘాలు స్థాపించిన వాళ్ళల్లో సమలైంగిక స్త్రీలు అనేక మంది వున్నారు. అసలే స్త్రీవాదాన్ని పాశ్చాత్య సంస్కృతి అని, బూర్జువా అని తిడుతున్న కాలమది. తమ లైంగిక ధోరణి గురించి మాట్లాడితే స్త్రీవాదాన్ని ఇంకా తోసిపుచ్చుతారనే భయంతో వాళ్ళు దాని గురించి మౌనంగా ఉండిపోయారు. తర్వాతి కాలంలో స్త్రీల ఉద్యమ చోట్లలో, స్త్రీల అధ్యయన సమావేశాల్లో తమ గురించి తాము లెస్బియన్‌ అనే పదం వాడకుండా, ‘సింగల్‌ విమెన్‌’ అని, ‘స్త్రీలని ప్రేమించే స్త్రీలు’ అని చెప్పుకున్నారు. తిరుపతిలో స్త్రీల ఉద్యమ సమావేశం జరిగినప్పుడు, అప్పటి రాడికల్‌ మహిళా సంఘానికి చెందిన నిర్వాహకులు వీళ్ళు ప్రత్యేకంగా కలుసుకోవటానికి పెట్టుకున్న పోస్టర్లని తీసేసారు.
అప్పటికే ఆయా సమలైంగిక స్త్రీలు అనేక సమస్యలతో సంఘర్షిస్తున్నారు. కుటుంబాలు బలవంతం చేసి పురుషులతో పెళ్లిళ్లు చెయ్యటం మామూలు. వద్దని తోటి స్త్రీలతో వుండటానికి ఏ విధమైన వనరులు చాలా మంది స్త్రీల దగ్గర లేవు. అసలు వారి కోరికకి సరయిన పేరు కూడా లేదు. మొదట్లో ఏర్పడిన ఢల్లీి గ్రూప్‌ లాంటి క్వియర్‌ స్త్రీల సంస్థలు దేశం నలుమూలల నుండి ఈ విషయం గురించి తమకి ఉత్తరాలు రాసే క్వియర్‌ స్త్రీలకి జవాబులు రాసేవి. అప్పట్లోనే తమ తోటి స్త్రీలతో కలిసుంటామని, పెళ్లి చేసుకున్న సంఘటనలు, అది కుటుంబాలు ఒప్పుకోకపోతే కలిసి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం వార్తా పత్రికల్లో రావటం మొదలు పెట్టాయి. ఢల్లీి సహేలి స్త్రీవాద సంస్థలో పని చేసే మాయ శర్మ 1990లలో వార్తా పత్రికలలో ఎక్కిన సంఘటనల్లోని స్త్రీలతో కలిసి మాట్లాడినప్పుడు వాళ్లలో అత్యధిక శాతం శ్రామిక వర్గ స్త్రీలు, వారి సంబంధాలు కూడా ఇతర కులాలు, మతాలకి చెందిన శ్రామిక వర్గ స్త్రీలతోటే ఉన్నాయని తన పుస్తకంలో రాశారు. 1998లో ఫైర్‌ సినిమా విడుదల అయినప్పుడు సమయంలో మతవాద పార్టీలు ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని దాని మీద దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా బాంబే, ఢల్లీిలలో క్వియర్‌ స్త్రీల సంఘాలు రోడ్ల మీదకొచ్చి మేము ‘లెస్బియన్‌ అండ్‌ ఇండియన్‌’ కూడా అనే స్లోగన్‌ తో నిరసనలు చేసినప్పుడు లెస్బియన్‌ అనే పదం వార్తా పత్రికల కెక్కింది.
లెస్బియన్‌ స్త్రీలు/వ్యక్తులకి, వేధింపులు ప్రధానంగా కుటుంబాల నుండే. కులం, మతం, ప్రాంతం తో సంబంధం లేకుండా తమకి నచ్చిన మగవాళ్ళని పెళ్లి చేసుకుంటామనే స్త్రీలని కుటుంబాలు ఎట్లా వేధిస్తాయో, అలాగే తమకి నచ్చిన స్త్రీలతో కలిసి ఉంటామంటే కూడా అంతే వేధిస్తాయి. పైగా అలా కలిసుండే స్త్రీలకి ఇదంతా ‘అసహజం’ అనుకునే సమాజ వేధింపులు కూడా ఎక్కువే. కులాంతర, మతాంతర పెళ్ళిళ్ళకి ప్రగతి శీల వాదుల నుండి లభించే మద్దతు కూడా ఈ జంటలకు లభించదు. ఇటువంటి సమస్యలని క్వియర్‌ స్త్రీలు నడిపే స్త్రీవాద సంఘాలు తమ వనరులతోటే పరిష్కరించుకుంటూ వచ్చాయి. పెళ్లి లో జరిగే వ్యవస్థీకృత హింస పట్ల వుండే విమర్శనా పూరిత దృక్కోణం వల్ల కాబోలు స్త్రీవాద సంఘాలు, కులాంతర/మతాంతర పెళ్లిళ్లు, సమ లైంగిక వ్యక్తుల సంబంధాలు/పెళ్లిళ్లు గురించిన సమస్యలని పెద్దగా పట్టించుకోలేదు.
ఇటువంటి నేపథ్యంలో క్వియర్‌ స్త్రీవాదులు 1990ల నుండి తమ గురించి తాము మాట్లాడుకోవటమే కాకుండా, వివాహ చట్టాలు, లైంగిక హింస, లైంగిక వేధింపుల చట్టాల గురించి జరిగిన అనేక చర్చల్లో తమ దృష్టికోణాలని తీసుకొచ్చారు. మతపరమైన వివాహ చట్టాల గురించి, వుమ్మడి పౌర స్మ్రితి గురించి జరిగిన చర్చల్లో ‘కుటుంబం’ అంటే కేవలం మగవాళ్ళు-ఆడవాళ్లు కలిసున్నవి మాత్రమే కాదని, స్వతంత్ర మహిళలు, సెక్స్‌ వర్కర్లు, క్వియర్‌ వ్యక్తులు ఉండేవి కూడా కుటుంబాలని గుర్తించాలని, అలాగే, కలిసుండాలని నిర్ణయించుకున్న ఏ జెండర్‌కి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకయినా సమాన హక్కులు, బాధ్యతలు వుండాలని, పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని పెంచుకోగలిగే అవకాశం వుండాలని వాదిస్తున్నారు. అలాగే, లైంగిక హింస చట్టాల్లో బాధితులు ఏ లింగానికి చెందిన వారయినా కావచ్చన్న విషయాన్ని గుర్తించాలని కూడా వాదిస్తూ వచ్చారు. కుటుంబం అంటే శాంతి పూరిత పవిత్ర స్థలం అనే పిత్రుస్వామ్య వాదనని పూర్తిగా ధిక్కరించి, క్వియర్‌ పిల్లలపై జరిగే హింస గురించి, తమ అనుభవాల ఆధారంగా మాట్లాడుతూ వచ్చి, 2023లో సుప్రీం కోర్టులో జరిగిన మ్యారేజ్‌ ఈక్వాలిటీ వాదనల్లో ప్రత్యేక రిపోర్టును సమర్పించారు. ఇవన్నీ స్త్రీవాద ఉద్యమం పట్టించుకోవాల్సిన సమస్యలే (వీటి గురించి ఇంకొక వ్యాసంలో చర్చిద్దాం).
అన్నిటి కన్నా ముఖ్యంగా క్వియర్‌ స్త్రీవాదులు తమ జీవితాలు, సంఘర్షణలు, వాదనలతో మనకు అర్ధం చేయించింది ఏంటంటే ప్రపంచాన్ని పురుష కేంద్రంగా వూహించుకోవాల్సిన అవసరం లేదని, అలాగే పురుషులతో పెళ్లి స్త్రీల జీవితాలకి కేంద్ర బిందువు అవ్వాల్సిన అవసరం కూడా లేదని. ఇటువంటి జీవితం జీవించటానికి అవకాశం ఉందనే జ్ఞానం, దాని కోసం కృషి చేస్తున్న వారికి మద్దతు ఇవ్వటం బదులు క్వియర్‌ దృష్టికోణాలు మనకేమీ అవసరం లేదనే దృక్పథంలో చూస్తే మన స్త్రీవాదం సంకుచితం అవుతుంది. నేను పని చేసిన పరిశోధనా సంస్థ చరిత్రలో క్వియర్‌ స్త్రీలు/వ్యక్తులు వున్నారు. పరిశోధనల్లో పాల్గొన్నారు. లైంగికత రాజకీయాల గురించి పెద్ద వర్కుషాపులు నిర్వహించారు. కొన్ని సందర్భాల్లో కార్య నిర్వాహక వర్గంలో కూడా ఉన్నారు. కానీ ఇదంతా ఆ సంస్థలో ఆధిపత్యంలో వున్న పరలైంగిక స్త్రీవాదుల ఆలోచనల్లో ‘ఇతరులని ఆదరించటం’ క్రింద నమోదయింది కానీ స్త్రీవాదంగానో, స్త్రీవాదాన్ని రూపుదిద్దుతున్న క్వియర్‌ దృక్పధంగానో, నేర్చుకోవాల్సిందిగానో నమోదు కాలేదు. పైన చెప్పినట్లు క్వియర్‌ స్త్రీవాదం స్త్రీవాద ఉద్యమంలో అంతర్లీన, విమర్శనాత్మక దృక్కోణంగా ఉంటూ వచ్చింది. పెట్టుకున్న పర లైంగిక కళ్లద్దాలు తీసి చూస్తే దళిత, ముస్లిం, ఆదివాసీ స్త్రీవాదాలతో పాటు క్వియర్‌ స్త్రీల జీవితాలు, సంఘర్షణలు, స్త్రీవాద దృక్పధాలు కూడా మనందరి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం జరుపుతున్న పోరాటాలకి చాలా నేర్పుతాయి!

Share
This entry was posted in ఇంకు పెన్ను. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.