ఇన్‌స్టా రీల్స్‌లో అమ్మాయిలంతా హ్యాండ్లూమ్ చీరలు కట్టుకుని కలిసి నడవడమో, ఒకరి మీద ఒకరు వాలడమో, రోడ్ దాటడమో, తలలో పూవులు అలంక రించుకోవడమో, సంభాషణలో నిమగ్నమయి, నవ్వుతూ, టీ తాగుతూ, కొన్నిసార్లు కలిసి మందు కొడుతూ, పుస్తకాలూ తిరగేస్తూ డాన్సులు చేస్తూ, రాత్రంతా పడుకొని కబుర్లు చెప్పుకొంటూ… ఇలా హాయిగా ఉన్న వీడియోలు చూస్తుంటాం.
చాలా బావుంటాయి ఈ వీడియోలన్నీ. అందమైన అమ్మాయిలు అంత చక్కగా తయా రయి మంచి లైట్లో, వెనక మంచి సంగీతం ప్లే అవుతూ ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో కనిపిస్తే అద్భుతంగా అనిపిస్తుంది కదా.
కాని సిస్టర్‌హుడ్ ఇక్కడిదేనా? ఇప్పటి దేనా?
ఇప్పుడు సిస్టర్‌హుడ్ అనే పదం మనకి కొత్తేమో కాని, ఈ సోదరీ భావం ఎప్పటి నుండో మనుగడలో ఉంది. బలహీనులైన సమూహాలు కూడగట్టుకుని మెసలకపోతే ఈ సమాజపు అసమానతలు వారి జీవితేచ్ఛ తగ్గిపోతుంది.
వెనక్కి తిరిగి చూస్తే మన చరిత్రలోని శిల్పాలు, చిత్రాలు మహిళలకు మధ్య ఉన్న ఆత్మీయతని, ఆరాధనని, ఇంటిమెసిని బాగా చూపిస్తాయి. మన పల్లెపదాలు, కీర్తనలు, గీతాలు, జావళీలు, ఇవన్నిటిలోను స్నేహితురాళ్ళతో కలబోసుకునే కబుర్లెన్నో ఉంటాయి. పొలాల్లో పనికి వెళ్లే స్త్రీలు, కట్టెలు మోసుకుని వచ్చే స్త్రీలు, పిల్లలను పెంచే స్త్రీలు, బిడ్డను కంటుండగా కూడుకుని ధైర్యం చెప్పే స్త్రీలు- ఇలా మహిళలకు మహిళలు తోడ్పాటుగా నిలచిన సమయాలు ఎన్నోఉన్నాయి.
ఆడవారికి ఆడవారే శత్రువులు, లేదా అత్తాకోడళ్ళకి పడదు అంటూ వేర్పాటు వాదాలు అన్ని పితృస్వామ్యం నుండి పుట్టినవే కానీ, కష్టం వచ్చినప్పుడు అడగక పోయినా తోడుగా మహిళల తరఫున నిలబడేది మహిళలే.
చిల్లరమల్లర వ్యవహారాలైన మహిళల లైంగికత, మాతృత్వపు క్రమశిక్షణ, లేదా ఇల్లు చక్కబెట్టుకోవడం మీద మహిళలకు ఇతర మహిళల ద్వారా పోటీలు, మాటలు, తీర్పులు వినిపించినా- బతుకమ్మ వంటి వేడుకల లోనూ, ముగ్గులు నేర్చుకోవడమో, బీడీలు చుట్టుకోడమో, నోములూ, వ్రతాలు చేసుకోవడం వంటి సమూహ సాంప్రదా యాలు కాక విషాదాలు కలబోసుకునే పుత్రశోకాలు, గర్భవతుల ఇబ్బందులు, బహిష్టు కష్టాలు, ప్రసవ వేదనలు, మగవాడి మనసు దోపీడీలు, ఇంటి దోపిడీల గురించీ కులాలకతీతంగా సాటి మహిళలు స్పందించి నంతగా మగవారు స్పందించలేరు. ప్రతి ఒక్కరు ఆ ఏరుని దాటి వచ్చిన వారవడం కూడా దానికి కారణమై ఉండొచ్చు.
మోడర్నిటీని మోసుకుపోతున్న ఈ రోజులలో, మహిళలు రకరకాల రంగాల్లో దూసుకుపోతున్న సమయాలలో, హింస వివిధ రూపాలలో తిరిగి తిరిగి మళ్ళీ మహిళ లను చుట్టుకుంటున్న వేళ, ఈ సిస్టర్ హుడ్‌ని మనం ఎలా చూడాలి? సరే, సిద్ధాంతీకరణ మనకు అలవాటైపోయింది. కొన్ని విషయా లు సున్నితత్వాలకు వదిలెయ్యలేము. ముఖ్యంగా ఇటువంటి విషయాలు.
ఎలా ఉంటే అలా స్వీకరించడం, వారి పట్ల సహానుభూతిని ప్రకటించడం, ఎటువంటి పరిస్థితులలోనైనా నేనున్నానే భద్రత ఇవ్వగలగడం, గోప్యత – అంటే వారు పంచుకున్న విషయాలను వేరే వారి వద్ద ప్రస్తావించకపోవడం (ఎవరికైనా హాని జరుగుతుంది అనుకుంటే తప్పకుండా సహాయం అందేలా జాగ్రత్త పడడం), ఒకరిపై మరొకరికి పూర్తి నమ్మకం ఉండడం ఇవన్నీ సోదరీభావన ఉండవలసిన మౌలిక లక్షణాలు. ఇవి కాక, అందరికి ఉండవల సింది ఒక ఏజెన్సీ. అంటే వారి జీవితం వారి నియంత్రణలో ఉండడం, వారి నిర్ణయాల ప్రకారం వారి జీవితం సాగడం. ఇలా బ్రతక డం కోసం వ్యక్తిత్వంలో బలం అవసరమే కానీ సమాజం ఇచ్చే సవాళ్లను ఎదుర్కోడానికి చాలాసార్లు ఒకరు మాత్రమే సరిపోరు. అటువంటప్పుడే ఒక ఏజెన్సీ అవసరం అయ్యేది. అది సిస్టర్ హుడ్ వలన, కొన్ని మహిళా సంస్థల వలన సాధ్యపడుతుంది.
ఇది మోడ్రన్ అమ్మాయిలకు, లేక ముసలితనంలో కబుర్లు చెప్పుకుంటున్న సవర్ణ మహిళలకు మాత్రమే కాదు. ఏ వయసులో ఉన్న మహిళకైనా దళిత, బహుజన, ట్రాన్స్, పల్లెకు, పట్టణానికి, నగరానికి చెందిన వారైనా, పేద, మధ్య తరగతి, ధనిక మహిళలందరికీ ఈ ఏజెన్సీ ఉండాలి. వుండేట్లుగా అందరం కృషి చేయాలి. చివరగా ఒకమాట చెబుతాను. నా స్నేహితురాలు, నేను ఒక సంక్షోభంలో పడినప్పుడు, మనకేంటబ్బా, ఇంతమంది స్నేహితులున్నారు, ఎన్నో మహిళా సంస్థలు న్నాయి భయపడనవసరం లేదు అని అనుకున్నాము. నిజం, మన చుట్టూ ఎంద రెందరో ఉద్యమకారులు, నాయకులు ఎన్నెన్నో రంగాలలో ఎందరెందరో ఉన్నారు. వీరున్నారన్న ధైర్యం, ఏ పరిస్థితుల్లో అయినా ఆదుకుంటారన్న ధైర్యం మహిళలను ముందుకు నడిపిస్తుంది.
ఇప్పుడు రెండే ప్రశ్నలు మీకందరికి. మీకు సిస్టర్‌హుడ్ ఉందా? ఏజెన్సీ ఉందా?
మీరెవరికన్నా ఏజెన్సీగా మారారా?
