సోషల్‌ మీడియాతో పయనం ఎటు??? – వై. నాగవేణి

పదిహేడేళ్ళ మానస పోలీస్‌స్టేషన్‌ బయట బండ మీద కూర్చొని ఉంది. మానస తల్లిదండ్రులు వెంకటేష్‌, రాజమ్మలిద్దరూ ఎస్‌ఐ గారి గదిలో బల్లమీద కూర్చొని ఉన్నారు. రాజమ్మ మొహం ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వెంకటేష్‌ మొహంలో నెత్తురు చుక్క కనబడడం లేదు. ఎస్‌ఐ గారికి ఎదురుగా సూపర్‌వైజర్‌ రాధ కూర్చొని ఉంది. ‘‘ఏంటి సార్‌, అర్జంటుగా రమ్మని చెప్పారు’’ అంది రాధ.

‘‘అవును మేడమ్‌, కొంచెం సెన్సిటివ్‌ కేసు. మీరు జాగ్రత్తగా కౌన్సిలింగ్‌ చేయాలి. వీళ్ళ అమ్మాయి వీళ్ళమీదే కేసు పెట్టడానికి స్టేషన్‌కు వచ్చింది’’ అని అన్నారు ఎస్‌.ఐ. ‘‘సో, ప్లీజ్‌, డీల్‌ విత్‌ మోర్‌ కేర్‌. మీరు మాట్లాడాక, కేసు రిజిస్టర్‌ చేయాలా వద్దా అనే విషయం ఆలోచిద్దాం’’ అంటూ ఎస్‌.ఐ. బయటకు వెళ్ళారు. వెంకటేష్‌, రాజమ్మలను కౌన్సిలింగ్‌ గదికి తీసుకెళ్ళింది రాధ. వారికి ముందుగా మంచినీళ్ళు ఇచ్చి, టీ తెప్పించమంటారా అని అడిగింది. వాళ్ళనుండి సమాధానం రాలేదు. దీంతో రాధే అటెండర్‌ను పిలిచి టీ తెప్పించి ఇచ్చింది. వాళ్ళు అయిష్టంగానే టీ త్రాగారు. రాధ వాతావరణం తేలిక చేయడానికి ప్రయత్నించింది. మీ అమ్మాయి అంటే మీకు బాగా ఇష్టం అనుకుంటా అంది. ‘అవునమ్మా అందుకే మా గుండెలమీద బాగా తన్నుతోంది’ అంది రాజమ్మ ఉక్రోషంగా. వెంకటేష్‌, రాజమ్మ భుజం మీద చెయ్యి వేసి ఊరుకో అని సైగ చేశాడు. రాధ మాట్లాడలేదు. వెంకటేష్‌ వైపు చూసి ఏమి జరిగిందో వివరంగా చెప్తారా? నేను ఏమైనా సాయం చేయగలనేమో అంది రాధ.
‘‘మానస మా రెండో బిడ్డ. మొదటి బిడ్డ రాజేష్‌ చెన్నైలోని ఐఐటి కాలేజిలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. వాడికి ఫ్రీ సీటు వచ్చింది. మానసను చిన్నప్పటి నుంచి రాజేష్‌తో పాటు కాన్వెంట్‌లో చదివించాము. కూలిపనితో వచ్చే డబ్బులు పిల్లల చదువులకు సరిపోకపోతే, రాత్రిళ్ళు కూడా పనికి పోయేవాళ్ళం. మానసను అపురూపంగా పెంచాము. ఏదడిగినా కాదనకుండా కొనిచ్చేవాళ్ళం. ఆ అలవాటే మా జీవితాల్లో పెను సమస్యగా మారింది. మానస పదో తరగతి వరకు బాగా చదివేది. ఇంటర్‌లో బైపిసి తీసుకొని, నీట్‌ పరీక్ష వ్రాయాలని ఆశగా ఉందని అడిగితే, మాకు ఫీజు కట్టడానికి కష్టమైనా తిరుపతిలో మంచి కాలేజీలో చేర్పించాము. ఇంటికి దూరంగా ఉంది కదా అని మొబైల్‌ ఫోన్‌ కొనిచ్చాం. అంతే అప్పటినుండి వాట్సప్‌లో చాటింగ్‌లు, స్టేటస్‌లు, లైక్‌లు, రీల్స్‌ చేసుకుంటూ చదువును నిర్లక్ష్యం చేసింది. సెకండ్‌ క్లాస్‌లో పాసయింది. పోనీలే అని రెండు నెలల క్రితం డిగ్రీ మొదటి సంవత్సరంలో చేర్పించాము. మా ఊరికి బస్సు సౌకర్యం లేదని మానసని హాస్టల్‌లో పెట్టాను. రోజూ క్లాస్‌లకు వెళ్ళకుండా వాళ్ళ క్లాస్‌ అబ్బాయి విజయ్‌తో బయట తిరుగుతోందని కాలేజీ వాళ్ళు కంప్లయింట్‌ చేశారు. ఆ అబ్బాయికి చదువు బొత్తిగా రాదు. ఇప్పటికే పదవ తరగతి నాలుగు సార్లు, ఇంటర్‌ మూడేళ్ళు చదివి కానీ డిగ్రీకి రాలేదు. వాళ్ళ అమ్మానాన్నలు గొర్రెలు మేపుకుంటూ చదివిస్తున్నారు. పోనీ చదువు లేకపోయినా, బ్రతకడానికి వేరే తెలివితేటలు ఉన్నాయా అంటే అవి కూడా లేవు. ఒక్కరోజు కూడా గొర్రెలను మేపలేడు, ఒళ్ళు వంచి పని చేయలేడు. మరి పెళ్ళి చేసుకొని ఏమి సాధిస్తాడు అని చాలా చెప్పి చూశాము మేడమ్‌. నాకు చదువు కంటే ఆ అబ్బాయి ముఖ్యం అంటోంది. వాళ్ళమ్మకు కోపం వచ్చి, రెండు చెంపదెబ్బలు వేసింది. అంతే హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి, మా అమ్మానాన్నలు కొడుతున్నారు అని చెప్పింది. ముందు చదువుకో, తర్వాత అప్పటికీ నీకు ఆ అబ్బాయే కావాలి అనుకుంటే తనకే ఇచ్చి పెళ్ళి చేస్తామని చెప్పినా కూడా వినడం లేదు. మమ్మల్ని పోలీస్‌ స్టేషన్‌ వరకు రప్పించింది. ఆ అబ్బాయికి కూడా ఫోన్‌ చేసి, నువ్వు ఇప్పటికిప్పుడు వచ్చి పెళ్ళి చేసుకోకపోతే నేనే పసుపు తాడు కట్టుకుంటానని బెదిరిస్తోందమ్మా’’ అన్నాడు వెంకటేష్‌. రాజమ్మ మధ్యమధ్యలో ఏదో చెప్పబోతోంటే వెంకటేష్‌ వారించాడు. రాధకు సమస్య కొంతవరకు అర్థమయ్యింది. కొంతసేపు మీరు బయట ఉండండి, మీ అమ్మాయి మానసతో కూడా మాట్లాడి మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పింది.
కొంతసేపటికి మానస లోపలికి వచ్చింది. రాధ మాట్లాడాలి అని చూస్తుంటే, మానస మాత్రం ఫోన్‌లో ఛాట్‌ చేస్తూనే ఉంది. ఏమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి అంది రాధ. ఎస్‌ మేడం, నాకు తెలుసు మీరు ఏమడుగుతారో, అయినా మీ పెద్దవాళ్ళకు మా ప్రేమ అర్థం కాదులెండి మేడం అంది మానస. ముందు నీకు ఆ అబ్బాయి ఎలా పరిచయమయ్యాడో చెప్పు అంది రాధ. మానస మొహంలో వెయ్యి ఓల్టుల కాంతి. ‘‘తన పేరు విజయ్‌. మేమిద్దరం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాము. తను నా క్లాస్‌మేట్‌. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన రీల్స్‌ చూసి లైక్‌ చేస్తాడు. రాత్రి ఎంత లేటయినా ఓపిగ్గా చాట్‌ చేస్తాడు. ఏది కొనాలన్నా కాదు అనకుండా షాపింగ్‌కి వస్తాడు. నన్ను నన్నుగా ఇష్టపడుతున్నాడు. మేం చాట్‌ చేసుకోకుండా అర్థ గంట కూడా ఉండలేము. తననుండి గుడ్‌నైట్‌ మెసేజ్‌ వస్తే గానీ నాకు నిద్ర పట్టదు’’ అంది మానస.
మానస చెప్పిందంతా వింది రాధ, ‘‘సరే మానసా, నీకు విజయ్‌ అంటే అంత ఇష్టమా? ఇంతకీ తను ఎలా చదువుతాడు? వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేస్తారు?’’ అని అడిగింది. అవేమీ తెలీనట్లుగా తలూపింది మానస. మరి తనకు ఖర్చులకి డబ్బులు ఎవరిస్తారు అంది రాధ. నేనే ఇస్తాను మేడమ్‌ అని గొప్పగా చెప్పింది మానస. మానస మానసిక పరిస్థితిని అంచనా వేసిన రాధ, ‘‘ఇదంతా ఓకే, ఇప్పుడు మీ అమ్మానాన్నల మీద నీకు ఎందుకు కోపం? కేసు ఎందుకు పెట్టాలని అనుకున్నావు?’’ అంది. నేను విజయ్‌తో మాట్లాడటం వాళ్ళకు ఇష్టం లేదు అంది మానస. నువ్వు విజయ్‌తో మాట్లాడటం ఇష్టం లేదా, నువ్వు చదువును నిర్లక్ష్యం చేయడం వాళ్ళకు ఇష్టం లేదా అని అడిగింది రాధ. నాకు ప్రేమ ముఖ్యం, ఆ తర్వాతే ఏదైనా అంది మానస. జీవితంలో స్థిరపడాలంటే చదువు కూడా అవసరం కదా! మీ అమ్మానాన్నలు నువ్వుముందు చదువుకో, లైఫ్‌లో సెటిలయ్యాక నీకు నచ్చిన అబ్బాయితో పెళ్ళి చేస్తాం అంటున్నారు కదా అంది రాధ. నేను ఎవరినీ నమ్మను మేడమ్‌, వాళ్ళు నాకు బలవంతంగా పెళ్ళి చేస్తారు అంది మానస. ఒకవేళ మీ అమ్మానాన్నలు నీకు మాట ఇస్తే ఒప్పుకుంటావా అంది రాధ. ఆలోచిస్తాను అంది మానస. నువ్వు ఆలోచిస్తాను అన్నందుకు సంతోషం, మీ అమ్మానాన్నలతో నీ ముందరే మాట్లాడతాను, మరి నువ్వు చదువును నిర్లక్ష్యం చేయవు కదా అంది రాధ. తప్పకుండా చదువుకుంటాను మేడమ్‌ అంది మానస. రాధ మానసకు, ఆమె తల్లిదండ్రులకు మధ్య రాజీ కుదిర్చి ఇంటికి పంపింది రాధ.
మానస తన లైఫ్‌ను చక్కదిద్దుకోవాలని కోరుకుంది రాధ. మానస లాంటి ఎందరో అమ్మాయిలు, విజయ్‌ లాంటి అబ్బాయిల జీవితాలు సోషల్‌ మీడియా ఉచ్చులో పడి ప్రక్కదోవ పడుతున్నాయి. సోషల్‌ మీడియా అడిక్షన్‌ నుండి బయట పడేదెలా?? సోషల్‌ మీడియా దుష్ప్రభావాన్ని వేర్లతో సహా ఎలా పెకిలించాలి అనే వేదన రాధ మనసును కదిలించింది. రాబోయే రోజుల్లో సోషల్‌ మీడియా ప్రభావంపై కుటుంబాలు, వ్యవస్థలు, సంస్థలు, ప్రభుత్వం విస్తృత స్థాయిలో పని చేయాల్సి వస్తుందేమో?!

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.